1, డిసెంబర్ 2020, మంగళవారం

హాయిగా, ఇంకెంతో....

 ఓటు వేయడానికి ఇంట్లో బయలుదేరివెళ్లి మళ్ళీ ఐదో నిమిషంలో ఇంట్లో వున్నాను.

ఇంత తేలిగ్గా, ఇంత హాయిగా, ఇంత త్వరగా ఓటు వేసిన సందర్భం ఇదే.

GHMC ఓటరు స్లిప్ ప్రకారం చూస్తే పోలింగు బూతు మా ఇంటికి దగ్గరలోనే వుంది. గూగుల్ మ్యాప్ ప్రకారం నడిచి వెడితే రెండు నిమిషాలు. ఈరోజు రోడ్డు కూడా ఖాళీగా వుంది. అంచేత ఇంకా త్వరగానే చేరుకున్నాను. 


వరుస నెంబరు 888  రూము నెంబరు  4. అంతా నాకోసమే ఎదురుచూస్తున్నట్టుగా వాతావరణం. ఓటరు ఐ.డి. చూసి ఎడమ చేతి చూపుడు వేలు మీద పొడుగ్గా నామం దిద్ది సంతకం పెట్టించుకుని బ్యాలెట్ పత్రం చేతికి ఇచ్చారు. చాలా కాలం తర్వాత బ్యాలెట్ ఓటు కొత్తగా అనిపించింది.

ఓటు వేసి వస్తుంటే అక్కడ కుర్చీలో కూర్చున్న పోలీసు లేచి వచ్చి  నాతొ ఎందుకు చెప్పాడో తెలవదు. ‘అంతా బాగానే వుంది. మాకు ఉదయం బ్రేక్ ఫాస్ట్ పెట్టారు. ఇప్పుడే లంచ్ కూడా ఇచ్చారు. మాకయితే, పెద్ద పనిలేదు, ఇప్పటిదాకా అన్నాడు. కాస్త ఎక్కువ ఫీజులు వసూలు చేసే ఒక ప్రైవేటు  స్కూల్లో ఈ పోలింగు కేంద్రాన్ని ఇచ్చారు. ప్రతి గదిలో ఏసీలు, మంచి వసతిగా, చక్కగా వుంది. వెయిట్ చేయడానికి బయట  పెద్ద అందమైన షామియానా వేశారు. వెయిట్ చేసేవాళ్ళే లేరు.

తిరిగి వస్తుంటే దోవలో రోడ్డు పక్కన కుర్చీ బెంచీలు వేసుకుని ఓటరు స్లిప్పులు ఇచ్చే ఆయా  పార్టీల వాళ్ళు  ‘మన దగ్గరకు రాకుండానే ఓటేసి వెడుతున్నాడు’ అన్నట్టు ఓ చూపు చూసారు.

మొత్తం మీద నేను సైతం.......     

2 కామెంట్‌లు:

సూర్య చెప్పారు...

అసలు ఓటరు స్లిప్పులు ఇవ్వాలయింది ఎన్నికల కమీషన్. ఆపని పార్టీలు చేయటమేమిటో. ఈ వ్యవస్థ ఎప్పుడు మారుతుందో ఏమిటో.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@సూర్య: నేను ఓటరు స్లిప్ ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ నుంచే తీసుకున్నాను.