29, డిసెంబర్ 2020, మంగళవారం

రజనీకాంత్ – భండారు శ్రీనివాసరావు

 

ఉదాత్తమైన మనిషి. ఇటువంటి మనిషి రాజకీయాల్లో నెగ్గుకు రావడం ఎల్లా అని అనుకున్నవాళ్ళు చాలామంది వున్నారు. అలాంటి వారికి రజనీకాంత్ తీసుకున్న నిర్ణయం ఓ ఊరట.

రజనీ పార్టీ పెట్టాలనే నిర్ణయం ఎప్పుడో  జరిగిపోయింది. ఈనెల  ముప్పయి ముప్పయి ఒకటో తేదీ ముహూర్తం కూడా ఖరారు అయింది. ఇంతలో యాంటీ క్లైమాక్స్ మాదిరిగా మూడు పేజీల ప్రకటన. అదనంగా ఓ ట్వీట్. క్లుప్తంగా చెప్పాలంటే  రాజకీయ రంగ ప్రవేశం విషయంలో రజనీకాంత్ యూ టర్న్.

సరైన సమయంలో కాకపోవచ్చు కానీ సరైన నిర్ణయం. సందేహం లేదు.

నిన్న  కాక మొన్న హైదరాబాదులో సినిమా షూటింగులో  ఆకస్మిక అనారోగ్యానికి గురై ఆఘమేఘాల మీద  అపోలో ఆసుపత్రిలో చేరి, అక్కడ నుంచి డిశ్చార్జ్ అయ్యే సమయంలో పూర్తి విశ్రాంతి అవసరమని  వైద్యులు ఇచ్చిన  సలహా కావచ్చు, ‘నువ్వు చేయాల్సింది వేరే వుందని’ ఆయన ఎంతగానో విశ్వసించే ఈశ్వరుడి నుంచి అందుకున్న ఆదేశం కావచ్చు, కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన ఒత్తిడి కావచ్చు, షూటింగ్ సమయంలో కొందరు కోవిడ్ బారిన పడడం గమనించి రాజకీయాల్లో చురుకుగా వుంటే ఇంకా మరికొందరు అమాయకులు ఈ వ్యాధికి బలిపశువులు అవుతారేమో అనే భయం కావచ్చు, మొత్తానికి ఏదైతేనేం రజనీకాంత్ తన రాజకీయ అరంగేట్రం నుంచి  తనకు తానుగానే తప్పుకున్నారు.

తమిళనాడులో రజనీకాంత్ అనే వ్యక్తి కేవలం ఓ సినీ నటుడు మాత్రమే కాదు. డబ్బు, సంపాదనవంటి వాటికి అతీతంగా ఆలోచించే మంచి మనసున్న మనిషి అనే అభిప్రాయం ప్రబలంగా వుంది. అందుకే ఆయన మాట అంటే అంత గురి.

1996 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన ఒక చిన్న  ప్రకటన చేశారు. అది తమిళనాట రాజకీయాల మీద తీవ్ర ప్రభావం చూపింది.

“ఈసారి జయలలిత నాయకత్వంలోని ఏ.ఐ.డి.ఎం.కె. గెలిచి అధికారంలోకి వస్తే ఇక తమిళనాడు రాష్ట్రాన్ని దేవుడు కూడా కాపాడలేడు”

రజనీకాంత్ ఈ డైలాగ్ ని అక్కడి ఓటర్లు ఎంత సీరియస్ గా తీసుకున్నారంటే ఆ ఎన్నికల్లో జయలలితకు ఘోర పరాజయం ఎదురయింది. మొత్తం 234 సీట్లలో  ఆమె పార్టీకి కేవలం నాలుగంటే నాలుగే స్థానాలు లభించాయి. రజని అప్పటికి రాజకీయాల్లో లేరు. అయినా ఆయన మాట జనంలో కరెంటులా పాకిపోయింది. అదీ ఆయనకు వున్న అపరిమితమైన ఆకర్షణ శక్తి.   అయితే సినీ కళాకారులకు అదే ఆదరణ ఎల్లవేళలా ఉంటుందనే గేరంటీ లేదు. అలాగే వాళ్ళు తమ రాజకీయ అభిప్రాయాలపై అలాగే నిలబడుతారని కూడా అనుకోలేం.

ఇందుకు ఉదాహరణ కూడా మళ్ళీ ఆయనే కావడం ఓ విచిత్రం.  మళ్ళీ ఆ తర్వాత జరిగన అసెంబ్లీ ఎన్నికల్లో  జయలలిత గెలిచి తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు ఇదే రజనీకాంత్ అన్నమాట ఏమిటో తెలుసా. “జయలలిత సాధించిన ఈ అపూర్వ విజయం తమిళనాడును కాపాడింది”

రాజకీయ రంగ ప్రవేశం చేయరాదని నిర్ణయించుకున్న రజనీకాంత్ ఉదంతం నుంచి నేర్చుకోవాల్సిన నీతి పాఠం ఒకటుంది.

చాలామంది తమతమ రంగాల్లో విశేష కృషి చేసి జనబాహుళ్యంలో అత్యంత ఆదరణ చూరగొన్న తర్వాత రాజకీయాల్లోకి రావడం ఈ మధ్య పరిపాటిగా మారింది.

“మీరు రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏమిటి” అని ఎవరైనా అడిగారు అనుకోండి. వాళ్ళ నుంచి తడుముకోకుండా వచ్చే జవాబు ఒక్కటే.

“ప్రజాసేవ చేయాలని పార్టీ పెట్టాను లేదా ప్రజాసేవ చేయడం రాజకీయాల్లోనే సాధ్యం”

నిజంగా ప్రజాసేవ చేయాలి అనే చిత్తశుద్ధి వుంటే రాజకీయాలు ఒక్కటే  గత్యంతరమా!

స్వామి వివేకానంద, మదర్ థెరిస్సా ఏ రాజకీయాలు నడిపారు?

జీవితంలో సాధించాల్సింది, సంపాదించాల్సిందీ అంతా పూర్తి చేసుకుని అప్పటివరకు సంపాదించిన పేరు ప్రఖ్యాతులని పెట్టుబడిగా పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు,  ‘ఏదో పొడిచేస్తారు, ఉద్దరిస్తారు’  అనుకుంటే అలా అనుకున్నవాళ్ళదే పొరబాటు.

ఏమైనా ఒక మంచి మనిషి రాజకీయ కుడుద్ధంలో పడకుండా రజనీ నమ్ముకున్న ఆ ఈశ్వరుడే కాపాడాడు అనుకోవాలి. (29-12-2020)             

    

3 కామెంట్‌లు:

శ్యామలీయం చెప్పారు...

ఈ మధ్యకాలంలో ఈ U-Turn అనేమాట చాలా ప్రచారంలో ఉన్నది.రజనీకాంత్ గారు తీసుకున్న నిర్ణయాన్ని నేను U-Turn అనుకోవటం‌ లేదు. ఎందుకంటే ఆయన పరిస్థితుల ప్రభావంతో తీసుకొనవలసి వచ్చిన నిర్ణయమే‌కాని దేనినుండో తప్పించుకుందుకు స్వబుధ్ధితో తీసుకున్న కన్నింగ్ నిర్ణయం కాదు కదా.

అజ్ఞాత చెప్పారు...

సారు మీరనుకున్నంత ఉదాత్తమైన మనిషని నాకైతే అనిపించరు. ఆ మధ్య వైజాగ్ లో తుఫాను వచ్చి అతలాకుతలైమైనప్పుడు గమ్మునున్న ఆ పెద్దమనిషి ఆ తర్వాతెప్పుడో, చాలా కాలం గడిచిన తర్వాత, తన సినిమా రిలీజ్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు, అతి కష్టంమీద ఓ ఐదు లక్షలు విరాళంగా ప్రకటించి, మళ్ళీ ఆ తర్వాతెప్పుడో డబ్బు రిలీజ్ చెయ్యడం జరిగింది. అదే వ్యక్తి మద్రాసులో తుఫాను వచ్చినప్పుడు కోట్లు కుమ్మరించాడు. అక్కడిస్తే మనకివ్వాలనే రూలేం లేదనుకోండి. కానీ తమిళియన్స్ చూసినంత ప్రేమగానూ, ఘనం గానూ మనం కూడా ఆయన్ని దైవంలా ఆరాధిస్తాం కదా, అదీ బాధ. మన తెలుగోల్లకి అవతలి మనిషెలాంటి వాడైనా పర్వాలేదు, ఓ ఘనుడైతే చాలు, నెత్తినెట్టుకుని మొయ్యడానికి. అలాంటోడి గురించి మనం గానీ నిజాలు గానీ మాట్లాడమంటే మనని పట్టుకుని వీరాభిమానులు చెత్త కొట్టుడు కొడతారు.
పొతే u-turns విషయానికొస్తే, ఒకట్రెండు సార్లయితే కాదనుకోవచ్చు, అన్నిసార్లు చేస్తే మరవి క్రిందే వస్తాయి.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

మరేం ఫర్వాలేదు, ఈయన రాజకీయాలలోకి వచ్చి పెద్దగా ఊడపొడిచేదేమీ ఉంటుందనుకోను. వెర్రి ఆవేశంతో ఊగిపోయే అభిమానుల చేత చప్పట్లు కొట్టించుకునే సినిమా మార్కు "ఒంటి చేతి (single-handed) పరిష్కారాలు మేడీజీ" నిజజీవితంలో పని చెయ్యవు. ఈ విషయంలో పైన "అజ్ఞాత" గారి అభిప్రాయం సబబే అనిపిస్తుంది.