18, జూన్ 2020, గురువారం

హైదరాబాదులో కాళేశ్వరం గోదావరి జల?

 


 కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పారుతున్న గోదావరి జలాలతో భూగర్భ జలాల మట్టం బాగా పెరిగిందని తెలంగాణా మంత్రి శ్రీ కే.టీ.ఆర్. అన్నట్టు ఆ మధ్య పత్రికల్లో చదివాను. అది నిజమే అనిపిస్తోంది.

హైదరాబాదు ఎల్లారెడ్డి గూడాలో మేముంటున్న మధుబన్ అపార్ట్ మెంట్ బోరు బావి ఎండిపోయి ఏళ్ళు గడుస్తున్నాయి. వున్నవి పన్నెండు కుటుంబాలు మాత్రమే కావడంతో దాని రిపేరు ఖర్చులు భరించలేక అలాగే వదిలేసి మునిసిపల్ వాటర్ తోనూ, రెండ్రోజులకోసారి కొనే మునిసిపల్ వాటర్  టాంక్ లతోను నెట్టుకుంటూ వస్తున్నాము.

ఈసారి వర్షాలు ముందుగానే వచ్చినా కన్నూ మిన్నూ ఏకమయ్యే భారీ వర్షాలు ఏవీ పడలేదు. అయితే ఆశ్చర్యకరంగా అపార్ట్ మెంట్ కమిటీ వాళ్ళు ఒక చల్లని కబురు చెవిన వేసారు. ఎవరి ప్రమేయం లేకుండా బోరు బాగుపడిందనీ, ఇకనుంచీ ఇరవై నాలుగు గంటలు నీళ్ళ సప్లయి ఉంటుందని, వాటర్ ట్యాంకుల అవసరం కూడా ఉండదనీ తెలియచేశారు.

కేటీఆర్ చెప్పినట్టు భూగర్భ జలాల మట్టం కానీ పెరగలేదు కదా! (17-06-2020)


17, జూన్ 2020, బుధవారం

కొన్ని సరికొత్త పాత సంగతులు

  

అదేమిటో చాలా మందికి, నాతో సహా, ఈ మధ్య జరిగిన విషయాలు గుర్తుండడం లేదు. కొందరు చెబుతుంటే కానీ జ్ఞాపకం రావడం లేదు.

ఇప్పుడు అలా విన్న సంగతులు చెప్పుకోవడానికే ఈ ప్రయత్నం. ఇవన్నీ ఏ క్రీస్తు పూర్వం నాటి విషయాలో  కాదు. మహా అయితే ఏడాది, రెండేళ్ళ లోపు సంగతులే.

2019 ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. ప్రధాన ప్రత్యర్దులమని చెప్పుకునే పార్టీలు ఎన్ని వున్నా నిజానికి పోటీ రెండింటి మధ్యనే. అంటే టీడీపీ, వైసీపీ నడుమనే అసలయిన పోటీ అనేది చిన్నపిల్లాడిని అడిగినా చెప్పేవాళ్ళు.

ఈ రెండు పార్టీలు ఓటర్ల అభిమానం చూరగొనడానికి రకరకాల పధకాలు ప్రకటిస్తూనే మరో పక్క చాణక్య నీతిని కూడా ప్రదర్శించాయి. ఆ క్రమంలోనే మొదలయ్యాయి పార్టీ మార్పిళ్ల కార్యక్రమం. కాకపోతే ఈ విషయంలో జగన్ మోహన రెడ్డికి ప్రశాంత్ కిషోర్ రూపంలో చక్కని సలహాలు, సూచనలు దక్కాయి. అపర చాణక్యుడిగా తెలుగు రాజకీయాల్లో పేరు పొందిన చంద్రబాబు కొంచెం వెనక పడ్డట్టే లెక్క. (2014లో ఆయన ఈ విషయంలో ముందంజలో వున్నారు).  2019 నాటి ఎన్నికల సమయానికి  ఆయన ఊహించని రీతిలో టీడీపీ నుంచి వైసీపీకి ఎన్నికల ముందే వలసలు సాగాయి. వీటిల్లో చెప్పుకోతగ్గవి  కొన్ని వున్నాయి.

ఆదాల ప్రభాకరరెడ్డి గారు. వీరికి టీడీపీ టిక్కెట్టు కన్ఫర్మ్ అయింది. బీ ఫారం కూడా ఇచ్చినట్టు వున్నారు. ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించారు. సరిగ్గా పదిహేను రోజులముందు ఆయన టీడీపీ అధిష్టానానికి ఫోనులో కూడా దొరకకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఆ వెళ్ళడం వెళ్ళడం నేరుగా వైసీపీ గూటికే కావడం, ఆయనకు ఆ పార్టీ సీటు ఇవ్వడం అన్నీ మెరుపు వేగంతో జరిగిపోయాయి. టీడీపీ అధిష్టానం అప్పటికప్పుడు ప్రభాకరరెడ్డి స్థానంలో మరొక అభ్యర్ధిని వెతుక్కోవాల్సి వచ్చింది. బీద మస్తాన్ రావుగారిని  ఎంపిక చేసారు. ఆయన గట్టి అభ్యర్దే. కానీ ఫలితం దక్కలేదు. ఆ సీటును టీడీపీ కోల్పోయింది. సీటునేకాదు, చివరి క్షణంలో ఎంపిక చేసి నిలబెట్టిన అభ్యర్ధిని కూడా. ఎన్నికలు కాగానే బీద మస్తాన్ రావుగారు  టీడీపీకి గుడ్ బై చెప్పి తనను ఓడించిన వైసీపీలోకి  చేరిపోయారు.

ఇక మాగుంట శ్రీనివాసరెడ్డి గారు. ఈయన కూడా టీడీపీని చివరి రోజుల్లో ఒదిలిపెట్టారు. కాకపోతే కాస్త మర్యాదగా. భార్య, పిల్లలతో సహా వెళ్లి అధినాయకుడిని కలిసి టీడీపీ తరపున పోటీ చేయలేను అని ఒక నమస్కారం పెట్టి వచ్చారు. తరువాత కొద్ది రోజులకే లోటస్ పాండులో జగన్ మోహన రెడ్డిని కలిసి ఆ పార్టీ సభ్యత్వాన్ని, పార్టీ టిక్కెట్టును కూడా సంపాదించుకున్నారు. వైసీపీ తరపున నిలబడి  గెలిచారు.

పొతే, రఘురామ కృష్ణంరాజుగారు. వై ఎస్ రాజశేఖరరెడ్డికి ఆప్తవర్గంలోని మనిషి. వై ఎస్ ఆర్ కు అత్యంత ఆత్మీయుడైన కేవీపీ కి స్వయానా  వియ్యంకులు. ఆ బాంధవ్యం పిల్లల ప్రేమ వివాహం  వల్ల ఏర్పడింది కాదు. ఉభయపక్షాల పెద్దలు కలిసి కుదుర్చుకున్న సంబంధం. పైగా పెద్ద కాంట్రాక్టరు. అటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావడం పెద్ద విషయమూ కాదు, పెద్ద కష్టమూ కాదు. వీటికి తోడు ఎమ్మెల్యే కావాలని రాజుగారికి ప్రబలమైన ఆకాంక్ష వుందని కూడా చెప్పుకునేవారు. ఇన్ని హంగులు ఉన్నప్పటికీ ఎన్నికల బరిలో నిలబడే అవకాశం 2019 దాకా రాకపోవడం విచిత్రం.

వై.ఎస్. మరణించేవరకు కాంగ్రెస్ ను అంటిపెట్టుకుని వుండి, తర్వాత జగన్ వైసీపీతో కలిసివున్నారు. ఆయన జైలుకు పోయిన తర్వాత వైసీపీని వదిలి బీజేపీతో సాన్నిహిత్యం పెంచుకున్నారు. ఆ పార్టీకి  కూడా ఎంపీ టిక్కెట్టు ఆయనకు ఇవ్వాలనే ఆలోచన ఉండడంతో నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గంలో విస్తృతంగా తిరుగుతూ కృష్ణంరాజు గారు ఆ నియోజకవర్గంపై పట్టు పెంచుకునే ప్రయత్నం చేసారు. అయితే చివరి క్షణంలో  బీజేపీ అగ్రనాయకత్వం ఆ సీటును గోకరాజు గంగరాజు గారికి కేటాయించడంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇండిపెండెంటుగా నామినేషన్ కూడా వేసి ఉపసంహరించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ విజయం  దరిమిలా ఆయన ఆ పార్టీకి దగ్గరయ్యారు. చంద్రబాబునాయుడు ఆయన్ని తమ పార్టీ అభ్యర్ధిగా నిలబెట్టాలని బలంగా కోరుకున్నారు. ఆమేరకు రాజుగారికి మాట ఇవ్వడం ఆయన తన నియోజకవర్గంలో పనులు చేసుకోవడం మొదలయింది కూడా. నిరుడు జరిగిన సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ రాజుగారికి టిక్కెట్టు ఖాయం చేసింది. ఏం జరిగిందో తెలియదు కానీ, చివర్లో ఆయన టీడీపీని వదిలిపెట్టి వైసీపీలో చేరిపోయి ఆ పార్టీ టిక్కట్టు మీద లోకసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. (ఇందులో ప్రశాంత్ కిషోర్ పాత్ర వుందని ఇప్పుడు స్వయంగా ఆయనే చెబుతున్నారు). ఏదైతేనేం మొత్తం మీద చట్టసభ సభ్యుడు కావాలనే రాజుగారి కోరిక నెరవేరింది.

పొతే, గత వారం పది రోజులుగా బుల్లితెరలపై సాగుతున్న మరో అంకం గురించి చెప్పాల్సిన పనిలేదనుకుంటా.

(17-06-2020)           


రాజాకీయాల్లో కావాల్సింది విధేయతా అవకాశం వెతుక్కోవడమా


“రాజకీయాల్లో విధేయత చూపాలా, అవకాశం చూసుకోవాలా?” అంటే తలపండిన ఓ రాజకీయ నాయకుడు చెప్పిన మాట ఇది:
“ఈ రెండూ అవసరమే. కానీ ఎన్నాళ్ళు విధేయత చూపాలి, ఎప్పుడు అవకాశం వెతుక్కోవాలి అనే సంగతి క్షుణ్ణంగా తెలిసిన వాడే రాజకీయాల్లో రాణిస్తాడు. లేకుంటే ఇదిగో ఇలా నాలాగా అడిగిన వాళ్లకి, అడగని వాళ్లకి సలహాలు ఇచ్చే పాత్రకు పరిమితమవుతాడు”  
పార్టీలతో, వాటి గుర్తులతో నిమిత్తం లేకుండా ఎన్నికల్లో స్వతంత్రులుగా పోటీ చేసి నెగ్గిన వావిలాల గోపాల కృష్ణయ్య వంటివారు అరుదు. కానీ అటువంటి నిస్వార్ధ నాయకులుకూడా తరువాత కాలంలో ఇండిపెండెంటుగా పోటీ చేసి విజయం సాధించలేకపోయారు.
ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ, ఇతర రాజకీయ పార్టీలకు చెందిన అతిరధ మహారధులు ఓటమిపాలయ్యారు. 
ఒక్కోసారి పార్టీ గుర్తు చాలా మేలుచేస్తుంది అభ్యర్దులకి. 1978 ఎన్నికలలో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తు ఎన్నికలకు ముందు కేటాయించారు. అభ్యర్ధి ఎవరు అనేదానితో నిమిత్తం లేకుండా ఓటర్లు చేతి గుర్తుకు ఓటు వేశారు. టీడీపీ సైకిల్ గుర్తు, టీఆర్ఎస్ కారు గుర్తు అలాంటివే. తమ గెలుపు మీద అపారమైన  నమ్మకం ఉన్న వారు కూడా ఎదో ఒక పార్టీ పంచన చేరడం అందుకే.
తమిళనాట నెడు౦జెలియన్ (తెలుగు పత్రికల్లో పనిచేసేవారికి ఈయన పేరు రాయడం చాలా ఇబ్బందిగా వుండేది. ఇప్పుడు నేను రాసింది కూడా కరక్టు కాదు అని తెలుసు కానీ ఏం చెయ్యలేం) అనే ద్రావిడ నాయకుడు వుండేవారు. ఈయన వరసగా పదమూడు సంవత్సరాలు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా పని చేశారు. ప్రధానమైన శాఖలు వీరి అధీనంలోనే  ఉండేవి. పార్టీలో ఈయన మాట సుగ్రీవాజ్ఞ. అన్నాదొరై కాలంనుంచి మంత్రిగా పనిచేసిన సీనియర్. ముఖ్యమంత్రి కరుణానిధితో ఏర్పడ్డ విబేధాల కారణంగా ఆయన డీఎంకే పార్టీ నుంచి బయటకు వచ్చి ఇండిపెండెంటుగా పోటీ చేసారు. ఫలితం చెప్పక్కరలేదు. డిపాజిట్ కూడా దక్కలేదు.
రాజకీయాల్లో గెలుపోటములు కూడా చిత్రంగా వుంటాయి.
తమిళనాడు అసెంబ్లీకి ఒకసారి జరిగిన ఎన్నికల్లో జయలలిత అసాధారణ విజయం సాధించారు. ప్రత్యర్ధి పార్టీ డీఎంకే నుంచి ఒకే ఒక్కడు కరుణానిధి ఒక్కరే అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అంతకంటే దారుణమైన పరాజయం మరోటి ఉండదని అంతా అనుకున్నారు. అదే కరుణానిధి మరో ఎన్నికల్లో మళ్ళీ గెలిచి తిరిగి ముఖ్యమంత్రి కాగలిగారు.
(17-06-2020)        

13, జూన్ 2020, శనివారం

పోలీసులకు ‘నో ఎంట్రీ’ – భండారు శ్రీనివాసరావు


సాధారణంగా ఈ ‘నో ఎంట్రీ’ వ్యవహారం పోలీసుల చేతుల్లో వుంటుంది. వాళ్ళు బేరికేడ్లు కట్టి ప్రజల్ని వాటిని దాటి రావద్దని ‘నో ఎంట్రీ’ బోర్డులు పెడుతుంటారు. ఇప్పుడు అది తిరగబడింది. తమ ప్రాంతంలోకి పోలీసులకు ప్రవేశం లేదంటూ తమది పోలీస్ ఫ్రీ జోన్ అని పౌరులే ప్రకటించుకున్నారు.
ఈ చిత్రాతిచిత్రం అమెరికాలోని సియాటిల్ నగరంలో క్యాపిటల్ హిల్ అటానమస్ జోన్ లో చోటుచేసుకుంది.
ప్రతిరోజూ రాత్రి సియాటిల్ నుంచి మా పెద్ద కోడలు భావన క్షేమ సమాచారాలు కనుక్కోవడానికి ఫోన్ చేస్తూ వుంటుంది, ఎలా వున్నారు బాగున్నారా అంటూ. ‘మీ దగ్గర కరోనా పరిస్తితి ఏమిటనేది మామూలుగా నా ఆరా.
‘కరోనాని బ్లాక్ ఎపిసోడ్ ఏనాడో కప్పివేసింది. ఇప్పుడు అందరూ మాట్లాడుకునేది ఈ సంగతే’ అన్నది కోడలు.
అమెరికాని ఆ దేశపు ఆర్ధిక వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తున్న కరోనా మొదట తన కుడి కాలు పెట్టింది సియాటిల్ లోనే. సియాటిల్ నగరం ఉన్న వాషింగ్టన్ రాష్ట్రం డెమొక్రాట్ల ఏలుబడిలో వుంది. అంటే ఆ రాష్ట్రపు గవర్నర్ డెమోక్రాటిక్ పార్టీ. నగర మేయర్ డెమొక్రాట్. దాంతో కరోనాను మించిన రాజకీయాలు నడుస్తున్నాయి. రిపబ్లికన్ అయిన ప్రెసిడెంట్ ట్రంప్ కీ వీళ్ళకీ చుక్కెదురు. ఒక నల్ల జాతీయుడు పోలీసుల చేతుల్లో మరణించిన దరిమిలా అమెరికా అట్టుడికి పోతున్న సంగతి తెలిసిందే. ఆ సంఘటనకు సంఘీభావం తెలిపేవారి సంఖ్య ఆ దేశంలో రోజురోజుకూ పెరుగుతోంది. “A day of action in solidarity” అనే పేరుతొ నిన్న సియాటిల్ నగరంలో బంద్ పాటించారు. శాంతియుత ప్రదర్శనలు నిర్వహించారు. కరోనా ప్రభావం నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్న దుకాణాలు ఈ బంద్ తో పూర్తిగా మూతపడ్డాయట. అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు.
ఈ సంఘీభావ నిరసన కార్యక్రమంలో భాగంగానే కావచ్చు క్యాపిటల్ హిల్ అటానమస్ జోన్ లో పోలీసులకు ‘నో ఎంట్రీ’.
ఒక నల్ల జాతీయుడి హత్యకు దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల్లో శ్వేత జాతీయులు ఎక్కువగా పాల్గొంటూ వుండడం అమెరికా ప్రజాస్వామ్య స్పూర్తికి అద్దం పడుతున్న మాట నిజమే అయినప్పటికీ, రాజకీయాల రంగూ రుచీ వాసనా ప్రపంచ వ్యాప్తంగా ఒకటే అనిపిస్తుంది ఈ ‘నో ఎంట్రీ’ వ్యవహారాలు గమనిస్తుంటే.

11, జూన్ 2020, గురువారం

కరోనా లేకపోతే కోటి వదిలేది (సరదా గల్పిక)

“ఈరోజు మా మనురాలి పెళ్లి. ఇంట్లో కూర్చుని చూస్తున్నాము”

ఆయనెప్పుడూ అంతే! చాలా సరదా మనిషి. దేన్నీ సమస్యగా తీసుకుని బాధపడరు, బాధ పెట్టరు. అది ఆయన నైజం. పైగా ప్రతిదాన్నీ చాలా తేలిగ్గా తీసుకుంటారు. అందుకే వయసు మీద పడ్డా కూడా ఆరోగ్యంగా, చలాకీగా ఉండగలుగుతున్నారు.

“కరోనాకు ముందు ఇదిగో ఇదే మనవరాలి ఎంగేజ్ మెంట్ ధూమ్ ధాంగా గోవాలో చేశారు. నేనూ మా ఆవిడా ఇంకా అనేకమంది బంధుమిత్రులం గోవా వెళ్లాం. చాలా సరదాగా గడిపాము. మా అల్లుడి చేయి పెద్దది. చాలా గ్రాండుగా చేసాడు. పెళ్లి ఇంకా ఘనంగా చేయాలని ప్లాన్ చేశారు.

“ఈలోగా ఇదిగో ఈ కరోనా పిలవని పేరంటంలా దిగబడింది. పెళ్ళికి యాభయ్ మంది కన్నా ఎక్కువమందిని పిలవకూడదు. అంచేత మగపెళ్ళివారికి ప్రిఫరెన్స్ ఇచ్చి మేము సర్దుకున్నాము. స్టార్ హోటల్లో పెళ్లి. అందరికీ లింకులు పంపారు. అవి పెట్టుకుని ఇంటి నుంచే వివాహ వేడుకలు చూస్తున్నాం.”

“ఇంకో మాట. ఈ కరోనా లేకపోతే ఈ పెళ్ళికి ఒక కోటి వదిలేది మా అల్లుడుకి” అన్నాడాయన నవ్వుతూ.

(June, 2020)  


10, జూన్ 2020, బుధవారం

భయం – భండారు శ్రీనివాసరావు


రోశయ్య గారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు కృష్ణానదికి బ్రహ్మాండమైన వరదలు వచ్చాయి. కాస్త తగ్గుముఖం పట్టిన తర్వాత సహాయక చర్యలను ముమ్మరం చేశారు. కర్నూలు పట్టణంలోకి వరద నీరు ప్రవేశించి పెద్ద పెద్ద భవంతులు కూడా మునిగిపోయాయి. కొన్ని అపార్ట్ మెంట్లలో రెండో అంతస్తులోకి కూడా నీళ్ళు వచ్చాయి. ఇళ్లన్నీ వరద బురదతో పేరుకుపోయాయి. ఇక లోతట్టు ప్రాంతాల పరిస్తితులు చెప్పక్కర లేదు. హైదరాబాదు  నుంచి  చూడడానికి వెళ్లాము. ఒక అధికారి చెప్పాడు, ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి మా తల ప్రాణం తోకకు వచ్చింది. ఇళ్లు వదిలిపెట్టి సహాయక శిబిరాలకు రావడానికి వాళ్ళు ఓ పట్టాన ఒప్పుకోవడంలేదు
దీనికి సమాధానం ప్రజలదగ్గర నుంచే వచ్చింది. ఒకతను చెప్పాడు.
వున్నట్టుండి ఇల్లు వదిలిపెట్టి రమ్మంటారు. ఎలా వెడతామ్. టీవీలు ఫ్రిజ్ లు చాలా ఖరీదైన వస్తువులు. మా పెద్దవాళ్ళ టైమ్ లో అయితే గోచీపాత తప్పితే యేమీ వుండేవికావు. ప్రతిసారీ వరదలు వచ్చినప్పుడల్లా వచ్చి ఖాళీ చేయమంటారు. మళ్ళీ వరదలు వస్తే మళ్ళీ ఇదే తంతు. మా బతుకులు గంగమ్మ నీడలోనే గడిచిపోతాయి. నీళ్ళను చూస్తూ పెరిగాము. నీళ్లంటే మాకు భయం లేదు. చూస్తున్నారు కదా. ఇక్కడ ఎన్ని కొంపలు వున్నాయో. ఇలా ప్రతిసారీ బోలెడు ఖర్చు పెట్టి ఖాళీ చేయించే బదులు వరద భయం లేని మెట్ట ప్రాంతాలలో మాకు ఇళ్లు కట్టించి ఇస్తే ప్రతియేడూ ఇలా తరలించే ఖర్చు ప్రభుత్వానికి కలిసి వస్తుంది కదా!
బదులు చెప్పడానికి వీలులేని సమాధానం.
రోజూ చచ్చేవాడికి ఏడ్చేవాడు వుండదు అని సామెత. భయం కూడా అంతే! భయం అలవాటు అయినకొద్దీ భయం పట్ల భయం పోతుంది.
కరోనా సంగతి చూస్తున్నాం కదా!

9, జూన్ 2020, మంగళవారం

సుశ్రవణం – భండారు శ్రీనివాసరావు

సి.ఎస్.ఎన్.శర్మ గారు. ఫోనులో మాట్లాడే తీరును బట్టి నాకంటే వయసులో పెద్దవారయివుంటారని అనిపిస్తుంది. విశాఖ పోర్టు ట్రస్ట్ లో పనిచేసి రిటైర్ అయ్యారు. అనంతరం సత్యసాయి మీద వున్న భక్తి ప్రపత్తులతో పుట్టపర్తిలో భార్యతో కలిసి కొన్నాళ్లు నివాసం వున్నారు. పిల్లవాడు బాగా చదువుకుని పెద్ద డాక్టర్ అయ్యాడు. ఆయన ఉద్యోగరీత్యా శర్మగారి మకాం కూడా హైదరాబాదుకు మారింది. పుట్టపర్తిలో వుండగా సూర్య దినపత్రికలో నేను రాసే వ్యాసాలు చదివి ఒకరోజు ఫోన్ చేశారు. పుట్టపర్తి అనగానే నేను మా అన్నయ్య పర్వతాలరావు గారి గురించి చెప్పాను.

“ఆయన నాకు బాగా తెలుసు. బాబా గారి ప్రేయర్ కు వెళ్లినప్పుడు మేమిద్దరం చివరి వరసలో పక్కపక్కనే కూర్చునేవాళ్లం. వారికి అక్కడ పెద్దపెద్ద వాళ్ళందరూ బాగా తెలుసు. పోయి ముందు వరసలో కూర్చున్నా అభ్యంతర పెట్టేవాళ్లు యెవరూ వుండరు. అదే అడిగితే వారి సమాధానం ఏమిటో తెలుసాండి. చిరునవ్వు. అంతే. అలాంటి మనిషిని నేను నా జన్మలో చూడలేదు. తరవాత తరవాత వేరేవారి ద్వారా వారి గురించి సమాచారం తెలిసి ఇంకా ఆశ్చర్యపోయాను. ఆయనలా పెద్దపెద్ద ఉద్యోగాలు చేసినవాళ్లు స్వామి సేవలో వుండడం కొత్తేమీ కాదు. కానీ వారెవ్వరూ పర్వతాలరావుగారిలా నిరాడంబరంగా వుండలేరు. అది మాత్రం వాస్తవం”

శర్మగారికి బాగా చదివే అలవాటు వుంది. యెక్కడెక్కడి పుస్తకాలు సేకరించి శ్రద్ధగా చదువుతారు. చదివిన సంగతులు ఎవరితోనైనా  పంచుకోవాలని అనుకుంటారు. శర్మగారికి చాలా విషయాలు తేదీలు, పేర్లతో సహా గుర్తు. కానీ అవన్నీ చెబుతూనే వున్నట్టుండి, “మరచిపోయానండీ మళ్ళీ గుర్తు చేసుకుని ఫోన్ చేస్తాను” అని పెట్టేస్తారు.

అలా ఈరోజు ఓ విషయం చెప్పారు.

విశాఖ పోర్టు ట్రస్ట్ లో పనిచేస్తున్నప్పుడు శర్మగారికి చర్ల గణపతి శాస్త్రి గారు అనే పండితుడితో పరిచయం కలిగింది. శాస్త్రిగారికి వాల్తేర్ లో చిన్న ప్రింటింగ్ ప్రెస్ వుంది. ఆయన వయసు యెనభై ఆరు సంవత్సరాలు. ఒక లూనా బండిపై    వైజాగులో తిరుగుతూ వుండేవారు. ఆధ్యాత్మిక గ్రంధాలు అనేకం రాశారు. వారు రాసిన గణపతి రామాయణ సుధ అనే గ్రంధం గురించి హిందూలో రివ్యూ వచ్చింది. అదొక చెత్త అనే అర్ధం వచ్చేట్టు వుంది ఆ రెవ్యూ. శాస్త్రిగారు అది చదివి బాధ పడతారు అనుకున్నా. కానీ ఆయన చాలా తేలిగ్గా తీసుకున్నారు. తర్వాత అదే గ్రంధానికి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.

“వారొకసారి విశాఖపట్నం రేడియోలో మాట్లాడారు. నేను కేసెట్ పై రికార్డు చేసుకున్నాను కూడా. ఇప్పుడు కేసెట్లు లేవుకదా! రికార్డర్లు లేవు.  ఎలా అని  గుంజాటన పడుతుంటే మా వాడు పదిహేను వందలు పెట్టి వాటిల్లో కొన్నిటిని సీడీలు గా మార్పించాడు”

శర్మగారు చెబుతూనే వున్నారు . ఇంతలో “ఏమిటో అండీ! మీకు చెప్పాలని చాలా విషయాలు గుర్తు పెట్టుకుంటాను. అదేమిటో సమయానికి మరిచిపోతుంటాను”

అంత పెద్దమనిషి పెద్ద మనసుతో ఏదో చెబుతుంటే వినడమే కదా నేను చేసేది. వాళ్ళు చెప్పేది అలా వింటుంటే ఆ వయసులో వారికి అదో తృప్తి. (నిజానికి వారి వయసెంతో నాకు తెలియదు)