“రాజకీయాల్లో విధేయత చూపాలా, అవకాశం
చూసుకోవాలా?” అంటే తలపండిన ఓ రాజకీయ నాయకుడు చెప్పిన మాట ఇది:
“ఈ రెండూ అవసరమే. కానీ ఎన్నాళ్ళు
విధేయత చూపాలి, ఎప్పుడు అవకాశం వెతుక్కోవాలి అనే సంగతి క్షుణ్ణంగా తెలిసిన వాడే
రాజకీయాల్లో రాణిస్తాడు. లేకుంటే ఇదిగో ఇలా నాలాగా అడిగిన వాళ్లకి, అడగని వాళ్లకి
సలహాలు ఇచ్చే పాత్రకు పరిమితమవుతాడు”
పార్టీలతో, వాటి గుర్తులతో నిమిత్తం
లేకుండా ఎన్నికల్లో స్వతంత్రులుగా పోటీ చేసి నెగ్గిన వావిలాల గోపాల కృష్ణయ్య
వంటివారు అరుదు. కానీ అటువంటి నిస్వార్ధ నాయకులుకూడా తరువాత కాలంలో ఇండిపెండెంటుగా
పోటీ చేసి విజయం సాధించలేకపోయారు.
ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి
పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ, ఇతర రాజకీయ పార్టీలకు చెందిన అతిరధ మహారధులు
ఓటమిపాలయ్యారు.
ఒక్కోసారి పార్టీ గుర్తు చాలా
మేలుచేస్తుంది అభ్యర్దులకి. 1978 ఎన్నికలలో ఇందిరాగాంధీ నేతృత్వంలోని
కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తు ఎన్నికలకు ముందు కేటాయించారు. అభ్యర్ధి ఎవరు
అనేదానితో నిమిత్తం లేకుండా ఓటర్లు చేతి గుర్తుకు ఓటు వేశారు. టీడీపీ సైకిల్
గుర్తు, టీఆర్ఎస్ కారు గుర్తు అలాంటివే. తమ గెలుపు మీద అపారమైన నమ్మకం ఉన్న వారు కూడా ఎదో ఒక పార్టీ పంచన చేరడం
అందుకే.
తమిళనాట నెడు౦జెలియన్ (తెలుగు పత్రికల్లో
పనిచేసేవారికి ఈయన పేరు రాయడం చాలా ఇబ్బందిగా వుండేది. ఇప్పుడు నేను రాసింది కూడా
కరక్టు కాదు అని తెలుసు కానీ ఏం చెయ్యలేం) అనే ద్రావిడ నాయకుడు వుండేవారు. ఈయన
వరసగా పదమూడు సంవత్సరాలు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా పని చేశారు. ప్రధానమైన శాఖలు
వీరి అధీనంలోనే ఉండేవి. పార్టీలో ఈయన మాట
సుగ్రీవాజ్ఞ. అన్నాదొరై కాలంనుంచి మంత్రిగా పనిచేసిన సీనియర్. ముఖ్యమంత్రి
కరుణానిధితో ఏర్పడ్డ విబేధాల కారణంగా ఆయన డీఎంకే పార్టీ నుంచి బయటకు వచ్చి
ఇండిపెండెంటుగా పోటీ చేసారు. ఫలితం చెప్పక్కరలేదు. డిపాజిట్ కూడా దక్కలేదు.
రాజకీయాల్లో గెలుపోటములు కూడా చిత్రంగా
వుంటాయి.
తమిళనాడు అసెంబ్లీకి ఒకసారి జరిగిన
ఎన్నికల్లో జయలలిత అసాధారణ విజయం సాధించారు. ప్రత్యర్ధి పార్టీ డీఎంకే నుంచి ఒకే
ఒక్కడు కరుణానిధి ఒక్కరే అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అంతకంటే దారుణమైన పరాజయం మరోటి
ఉండదని అంతా అనుకున్నారు. అదే కరుణానిధి మరో ఎన్నికల్లో మళ్ళీ గెలిచి తిరిగి ముఖ్యమంత్రి
కాగలిగారు.
(17-06-2020)