13, జూన్ 2020, శనివారం

పోలీసులకు ‘నో ఎంట్రీ’ – భండారు శ్రీనివాసరావు


సాధారణంగా ఈ ‘నో ఎంట్రీ’ వ్యవహారం పోలీసుల చేతుల్లో వుంటుంది. వాళ్ళు బేరికేడ్లు కట్టి ప్రజల్ని వాటిని దాటి రావద్దని ‘నో ఎంట్రీ’ బోర్డులు పెడుతుంటారు. ఇప్పుడు అది తిరగబడింది. తమ ప్రాంతంలోకి పోలీసులకు ప్రవేశం లేదంటూ తమది పోలీస్ ఫ్రీ జోన్ అని పౌరులే ప్రకటించుకున్నారు.
ఈ చిత్రాతిచిత్రం అమెరికాలోని సియాటిల్ నగరంలో క్యాపిటల్ హిల్ అటానమస్ జోన్ లో చోటుచేసుకుంది.
ప్రతిరోజూ రాత్రి సియాటిల్ నుంచి మా పెద్ద కోడలు భావన క్షేమ సమాచారాలు కనుక్కోవడానికి ఫోన్ చేస్తూ వుంటుంది, ఎలా వున్నారు బాగున్నారా అంటూ. ‘మీ దగ్గర కరోనా పరిస్తితి ఏమిటనేది మామూలుగా నా ఆరా.
‘కరోనాని బ్లాక్ ఎపిసోడ్ ఏనాడో కప్పివేసింది. ఇప్పుడు అందరూ మాట్లాడుకునేది ఈ సంగతే’ అన్నది కోడలు.
అమెరికాని ఆ దేశపు ఆర్ధిక వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తున్న కరోనా మొదట తన కుడి కాలు పెట్టింది సియాటిల్ లోనే. సియాటిల్ నగరం ఉన్న వాషింగ్టన్ రాష్ట్రం డెమొక్రాట్ల ఏలుబడిలో వుంది. అంటే ఆ రాష్ట్రపు గవర్నర్ డెమోక్రాటిక్ పార్టీ. నగర మేయర్ డెమొక్రాట్. దాంతో కరోనాను మించిన రాజకీయాలు నడుస్తున్నాయి. రిపబ్లికన్ అయిన ప్రెసిడెంట్ ట్రంప్ కీ వీళ్ళకీ చుక్కెదురు. ఒక నల్ల జాతీయుడు పోలీసుల చేతుల్లో మరణించిన దరిమిలా అమెరికా అట్టుడికి పోతున్న సంగతి తెలిసిందే. ఆ సంఘటనకు సంఘీభావం తెలిపేవారి సంఖ్య ఆ దేశంలో రోజురోజుకూ పెరుగుతోంది. “A day of action in solidarity” అనే పేరుతొ నిన్న సియాటిల్ నగరంలో బంద్ పాటించారు. శాంతియుత ప్రదర్శనలు నిర్వహించారు. కరోనా ప్రభావం నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్న దుకాణాలు ఈ బంద్ తో పూర్తిగా మూతపడ్డాయట. అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు.
ఈ సంఘీభావ నిరసన కార్యక్రమంలో భాగంగానే కావచ్చు క్యాపిటల్ హిల్ అటానమస్ జోన్ లో పోలీసులకు ‘నో ఎంట్రీ’.
ఒక నల్ల జాతీయుడి హత్యకు దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల్లో శ్వేత జాతీయులు ఎక్కువగా పాల్గొంటూ వుండడం అమెరికా ప్రజాస్వామ్య స్పూర్తికి అద్దం పడుతున్న మాట నిజమే అయినప్పటికీ, రాజకీయాల రంగూ రుచీ వాసనా ప్రపంచ వ్యాప్తంగా ఒకటే అనిపిస్తుంది ఈ ‘నో ఎంట్రీ’ వ్యవహారాలు గమనిస్తుంటే.

కామెంట్‌లు లేవు: