నాకు ఎరుక తెలిసే వయసు వచ్చినప్పటి నుంచి ఆమె నాకు తెలుసు. పైగా మా మేనత్త కూతురు. నాకంటే పదేళ్ళు పెద్ద. అయినా ఇంతవరకు ఆమె అసలు పేరు తెలియదు అంటే నమ్మశక్యం కాని విషయమే. మా చిన్నప్పటి నుంచీ ఆమెను చిట్టెత్తయ్య అనే పిలిచేవాళ్ళం వరస కాకపోయినా. ఈరోజు ఉదయం నల్గొండలో కొలిపాక రత్నావతి (82) మరణించారు అనే విషయం తెలిసినప్పుడు మా చుట్టాల్లో ఎవరో పోయారు అనుకున్నా కానీ ఆ చనిపోయింది మా మేనత్త కూతురు చిట్టెత్తయ్య అనే సంగతి చప్పున స్పురణకు రాలేదు.
గత అరవై ఏళ్ళుగా చూస్తూ వస్తున్నాను. నవ్వు మొహం లేకుండా ఏనాడూ ఆమె నాకు కనపడలేదు. నోరారా నవ్వడం, మనసారా ఆప్యాయంగా ఏరా బాగున్నావా అనడం ఆమె ట్రేడ్ మార్క్.
నిరుడు మా ఆవిడ చనిపోయినప్పుడు ఫోన్ చేసి పరామర్శించింది. గొంతులో ఎక్కడలేని దుఖం తన్నుకు వస్తున్నట్టు, బలవంతంగా ఆపుకుంటున్నట్టు అర్ధం అవుతున్నది. తర్వాత విషయం తెలిసి నిర్ఘాంతపోయాను. అప్పటికే ఆమె భర్త చనిపోయి మూడు రోజులు అవుతోంది. మా ఇంట్లో పరిస్తితి చూసి నాకు ఆ కబురు తెలపలేదు. ఒక పక్క భర్తను పోగొట్టుకుని మరో పక్క భార్య పోయిన నన్ను ఓదార్చిన ఆమె ఔన్నత్యానికి జోహార్లు.
వాళ్ళిద్దరిదీ ఆదర్శ దాంపత్యం. కొన్ని దశాబ్దాలపాటు సాగిన సంసారంలో నిరుడు మొట్ట మొదటి శరాఘాతం తగిలింది కొమర్రాజు మురళీధరరావు గారి ఆకస్మిక మరణం రూపంలో.
ఏడాది తిరగకుండానే మళ్ళీ ఈ కబురు. అదీ లాక్ డౌన్ కాలంలో.
ఆమెకు ఆత్మశాంతి కలగాలని ప్రార్ధిస్తూ, ఆ కుటుంబ సభ్యులు అందరికీ నా సానుభూతి.
(30-06-2020)
4 కామెంట్‌లు:
May the soule rest in peaceful.
సద్గతి ప్రాప్తిరస్తు 🙏.
రచయిత్రి కొలిపాక రమామణి గారు కూడా మీ బంధువులా?
@విన్నకోట నరసింహారావు: కొలిపాక వారు దగ్గరి బంధువులే. రమామణి గారి సంగతి తెలియదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి