4, జూన్ 2020, గురువారం

రాజకీయ నాయకుల వేషధారణ – భండారు శ్రీనివాసరావు


ఇది రాజకీయ నాయకుల గురించే కానీ, పొలిటికల్ పోస్టు మాత్రం కాదు.
నందమూరి తారక రామారావు అనగానే ఓ రూపం కళ్ల ముందు కదలాడుతుంది. రాజకీయ నాయకుడిగా ఆయన వేషధారణ మరింత ప్రత్యేకంగా ఉంటుంది. కాషాయ వస్త్రాలు, పెద్ద పెద్ద కళ్లద్దాలూ, ఎడమచేయి గాల్లోకి లేపి, చిద్విలాసం చిందిస్తూ.. సోదర సోదరీమణులారాఅంటూ వేదికలపై తన వాక్‌చాతుర్యంతో హోరెత్తించిన తెలుగుదేశం పార్టీ అధినాయకుడి రూపాన్ని అంత తేలిగ్గా మర్చిపోలేం. ఇక సినిమాల్లో అయితే రాముడు, కృష్ణుడు అనగానే గుర్తుకొచ్చేది, ఎన్టీఆర్ మాత్రమే.
అయితే సినీ నటుడు కావడం వల్ల కావచ్చు రాజకీయ రంగప్రవేశం చేసిన తర్వాత కూడా ఆయన అనేక సార్లు తన వేష ధారణ మార్చారు. మొదట్లో తెలుగుదేశం పార్టీ పెట్టి చైతన్య రధంపై రాష్ట్రం నలుమూలలా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నప్పుడు ఖాకీ ప్యాంటు, ఖాకీ చొక్కాతో కనిపించారు. ఆ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రాగానే తెల్లటి ధోవతి, లాల్చీని తన ఆహార్యంగా చేసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్ళు వివేకానందుడి గెటప్ తో, కొన్నాళ్ళు కాషాయ వస్త్రాలతో విభిన్నంగా కనిపించారు. లక్ష్మీ పార్వతిని ద్వితీయ వివాహం చేసుకున్న తర్వాత కాషాయాన్ని వదిలేసి మళ్ళీ మల్లెపూవులాంటి ధవళ వస్త్రధారణ స్వీకరించారు. చనిపోయేవరకు అదే ఆహార్యం. మార్పులేదు.
చాలా మంది రాజకీయ నాయకులు జీవితాంతం ప్రజలకు ఒకే వస్త్ర ధారణతో గుర్తుండిపోయారు. ఉదాహరణకు మహాత్మాగాంధీ, (కొల్లాయి గుడ్డ, చేతిలో కర్ర) జవహర్ లాల్ నెహ్రూ, (ఎర్ర గులాబీ, తల మీద టోపీ లేకపోతే నెహ్రూను నెహ్రూగా గుర్తుపట్టడం కష్టం), సుభాష్ చంద్రబోస్ (మిలిటరీ దుస్తులు లేని సుభాష్ చంద్ర బోసును ఊహించడం అసాధ్యం). అలాగే, రాజగోపాలా చారి, కరుణానిధి ఈ ఇద్దరూ హమేషా పగలూ రాత్రీ తేడా లేకుండా నల్లకళ్ళ జోళ్ళతో కనిపించేవారు. నల్లద్దాల కంటి జోడు ధరించే అలవాటు ఎం.జీ. రామచంద్రన్ కు కూడా వుండేది. కాకపోతే, నెత్తిమీద ఫర్ టోపీ అదనం. జయలలిత కూడా భద్రతా పరమైన కారణాలో, ఆరోగ్యపరమైన కారణాలో తెలియదుకానీ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఒకేరకం ఆహార్యంతో కానవచ్చేవారు.  
రాష్ట్రపతి అయిన తర్వాత నీలం సంజీవరెడ్డి ఆహార్యం మారిపోయింది కానీ అప్పటివరకు ఏళ్ళతరబడి ఒకే రకం వస్త్రధారణ. పంచె, లాల్చీ, తలమీద గాంధి టోపీ. ఇక కాసు బ్రహ్మానందరెడ్డి. ఆయనా డిటో. తలమీద టోపీని చేత్తో కొంచెం సదురుకున్నట్టు కనిపించింది అంటే అయన ఏదో కొత్త రాజకీయ వ్యూహం పన్నుతున్నారని చెప్పుకునేవారు.
ఇక పీవీ నరసింహారావు ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ఒకటే ఆహార్యం, తెల్లటి  పంచె లాల్చీ. విదేశీ పర్యటనలు, కొన్ని అధికారిక కార్యక్రమాలలో మాత్రం సూటు ధరించేవారు, రాష్ట్రపతి సంజీవరెడ్డి మాదిరిగా.
నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అయ్యేంతవరకు, ఆఖరికి గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్న రోజుల్లో కూడా వస్త్రధారణ పట్ల అంత శ్రద్ధ చూపిన దాఖలాలు లేవు. ప్రధాని అయిన తర్వాత మాత్రం ఒకే రకం దుస్తులు ధరించడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు వేషధారణ అనేక దశాబ్దాలుగా ఒకేరకంగా ఉంటూ వస్తోంది. తెల్లటి చొక్కా, తెల్లటి లుంగీ. ఏ పదవిలో వున్నా, ఏ హోదాలో వున్నా  ఇదే ఆహార్యం.
ఆంధ్ర రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు దుస్తులు ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండేవి. వారగా భుజం మీద కప్పుకున్న శాలువా ఆయన ప్రత్యేకత. అదిలేని టంగుటూరిని గుర్తుపట్టడం కష్టం.
ముఖ్యమంత్రిగా మర్రి చెన్నారెడ్డి ఆహార్యం విభిన్నమైన రీతిలో వుండేది. చేతిలో పొన్ను కర్ర ఓ స్పెషాలిటీ.
పొతే చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన ఆహార్యం ఎప్పుడూ ఒకే రీతిలో ఉండేట్టు చూసుకున్నారు. ఒకరకమైన ఖాదీ వస్త్రంతో తయారుచేసిన ప్యాంటు చొక్కాను ధరించడం మొదలుపెట్టారు. కాళ్ళకు బూట్లు ధరించడం కూడా చాలాకాలం తర్వాతనే అలవాటు చేసుకున్నారు. అదీ, ముఖ్యమంత్రిగా మొదటి విదేశీ ప్రయాణం పెట్టుకున్నప్పుడు అనుకుంటాను.
వై.ఎస్ రాజశేఖర రెడ్డి సయితం ఒకే రకం వస్త్రధారణ పట్ల మక్కువ చూపేవారు. పదహారణాల తెలుగుతనం ఉట్టిపడేలా తెల్లటి పంచె, లాల్చీ ధరించి తనకంటూ ఒక శైలిని రూపొందించుకున్నారు.
తెలంగాణా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు విషయానికి వస్తే  అనేక దశాబ్దాలుగా ఆయన వస్త్రధారణలో ఎలాంటి మార్పు లేదు. తెల్ల చొక్కా, తెల్ల ప్యాంటు. ఢిల్లీ వంటి చలి ప్రదేశాలకు పోయినప్పుడు ఏమో కానీ, కాళ్లకు చెప్పులు. ఈ మధ్య మెడచుట్టూ మడిచిన ఉత్తరీయంతో కనిపిస్తున్నారు టీవీల్లో. ఆయన ఆహార్యంలో కానవస్తున్న మార్పు ఏదైనా ఉన్నదంటే ఇదొక్కటే.   
యువతరం రాజకీయ నాయకుల్లో ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన రెడ్డి రాజకీయాల్లో ప్రవేశించిన తొలిరోజుల్లో రంగు రంగుల  చొక్కాలు వేసుకున్నా, ఆ తర్వాత మోచేతుల వరకు ముడిచిన తెల్లచొక్కా, తెల్ల ప్యాంటుకు మాత్రమే పరిమితం అయ్యారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాల్లో  అనేక రకాల దుస్తులు ధరించినప్పటికీ, సొంతంగా పార్టీ పెట్టుకున్నప్పటి నుంచి, లాల్చీ పైజమా, గుబురుగా పెంచిన గడ్డం మీసాలతో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకున్నారు.     
          


2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

Each political leader has his her own signature style of dressing.

Modiji jackets and scarfs are very attractive and become very popular.

George Fernandes was wearing crumpled khadi clothes without ironing.

సూర్య చెప్పారు...

సాధారణంగా "అవతలవారు ఏం వేసుకున్నారు, చెవికి ఏం పెట్టుకున్నారు, కాళ్ళు చేతులకి ఎలాంటి ఆభరణాలు వేసుకున్నారు" లాంటి విషయాలను ఆడవారే ఎక్కువగా పట్టించుకుంటారని అనుకునేవారు. ఈ విషయంలో మగవారిని కూడా స్త్రీలతో సమం చెయ్యాలని మీరు చేతికో హ్యాష్ ట్యాగ్ కట్టేసుకున్నట్లున్నారు!!☺️