26, నవంబర్ 2017, ఆదివారం

పిల్లి శాపాలకు ఉట్లు తెగుతున్నాయి – భండారు శ్రీనివాసరావు


మూడేళ్ళ క్రితం తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఆ యాత్రానుభవాలను గురించి నాడు ‘సూర్య’ దినపత్రికలో రాసిన వ్యాసం నుంచి చిన్న పేరా:
“ తిరుమల గర్భ గుడి నుంచి బయటకు వచ్చిన తరువాత భక్తుల అసలు కష్టాలు మొదలవుతాయి. అధికారులువీ ఐ పీ లను తీసుకువచ్చి మళ్ళీ తీసుకుపోయే వాహనాలు గుడి దరిదాపుల దాకా వస్తాయి. కానీ సామాన్య భక్తులు  మాత్రం పాదరక్షలతో  ఎండలో, వానలో మాడ వీధులలో తిరుగాడరాదు. ఇందులో తప్పు పట్టేది ఏమీ లేదు. గుడిలోకి ప్రవేసించే భక్తులు పాదరక్షలు విడిచే ప్రదేశం ఒకటి, బయటకు వచ్చే చోటు మరొకటి. గుడి బయట పరచిన బండలనండిఇంకోటి అనండి వాటిమీద నడుస్తుంటే అరికాలిమంట నెత్తికెక్కుతుంది. పాలకమండలి సభ్యులుఅధికారులు ఒక్కటంటే ఒక్కసారి చెప్పులు లేకుండా గుడి చుట్టూ తిరిగివస్తే బాగుంటుంది అని కూడా  అనిపిస్తుంది.
అయినా పిల్లి శాపాలకు ఉట్లు రాలవు కదా!

కానీ రాలుతున్నట్టున్నాయి.  నిన్న పత్రికలో ఒక  వార్త వచ్చింది. కొత్తగా వచ్చిన ఈ ఓ యాత్రీకులకు ఎండావాన నుంచి కాస్త ఉపశమనం కలిగించడానికి అక్కడ యేవో కదిలే చలవ పందిళ్ళు శాశ్వత ప్రాతిపదికపై వేయిస్తున్నారని. సంతోషం మూడేళ్ళ తర్వాత అయినా నా గోడు ఏలిన వారి చెవిన పడినందుకు.    
No automatic alt text available.

24, నవంబర్ 2017, శుక్రవారం

థాంక్యూ డాక్టర్! – భండారు శ్రీనివాసరావు


సోషల్ మీడియాలో ఏదైనా రాస్తే ఎవరు చదువుతారు అనే అనుమానం చాలామందితో పాటు నాకూ వుంది. కేన్సర్ హాస్పిటల్  లో వైద్య నిపు ణుడు డాక్టర్ సెంథిల్ రాజప్ప నాకు ఈ రోజు పంపిన ఈ సందేశం ఆ సందేహాన్ని పటాపంచలు చేసింది. ఇప్పటివరకు వారెవ్వరో నాకు ఛాయా మాత్రంగా కూడా తెలియదు.
పొత్తూరి వారి అనుభవాన్ని నేను నా మాటల్లో రాసాను. అంతే!  నందిరాజు వంటి మిత్రులు స్పందించారు. అది అంతటితో ముగిసింది అనుకున్నాను. కానీ అది చేరవలసిన వారికి చేరింది. వారికి తెలుగు చదవడం రాదు, అయితే భావం అర్ధం అయినట్టుంది. అందుకే ఇలా స్పందించారు.
Dear Srinivas, Thank you so much for the kind gesture. I shall  ask someone to read it for me. Blessed to be able to take care of a noble soul like Venkateswara Rao garu.”
థాంక్యూ డాక్టర్!


22, నవంబర్ 2017, బుధవారం

గీత దాటుతున్న సోషల్ మీడియా - భండారు శ్రీనివాసరావు


నిజం నోరు దాటే లోపలే పుకారు ఊరు దాటుతుందంటారు. సోషల్ మీడియా ప్రవేశం తరువాత ఈ వదంతుల వేగం మరింత పెరిగింది.
కొందరు రాజకీయ నాయకుల గురించి, లేదా సినీ, సామాజిక రంగాల్లో ప్రముఖుల గురించి ఫోటో షాపో, మరో ప్రక్రియ ఏదో తెలియదు కానీ, అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఫోటోలు ఈ మీడియాలో విచ్చల విడిగా హల్ చల్ చేస్తున్నాయి. వారి గురించిన కాకమ్మ కబుర్లు వంతులవారీగా గిరికీలు కొడుతున్నాయి. వాటిల్లో నిజమెంతో వాటిని షేర్ చేసే వారికి తెలవదు. వాస్తవాన్ని నిర్దారించుకోకుండానే వాటిని షేర్ చేస్తూ పోతుండడంతో ఆ నీలివార్తలు ప్రచండ వేగంతో ప్రపంచాన్ని చుట్టబెడుతున్నాయి. విన్న వింత చదివినప్పుడు వాస్తవంగా అనిపిస్తుందన్న మాట ప్రకారం అవన్నీ నిజమేనేమో అన్న భ్రాంతికి కూడా కొందరు అమాయకులు గురవుతున్నారు.
మీడియా, అది ప్రింటు కావచ్చు విజువల్ కావచ్చు, ఏదైనా విషయాన్ని రచనల ద్వారా లేదా చిత్రాల ద్వారా ఇతరులతో పంచుకోవడానికి కొన్ని పద్దతులు వున్నాయి. ఈ విధానాలకు చట్ట స్వరూపం లేకపోవచ్చు, కానీ లక్ష్మణ రేఖ వంటి స్వయం నియంత్రణలు వున్నాయి.
సోషల్ మీడియాకు ఈ పరిమితులు, స్వయం నియంత్రణలు లేవు. వున్నట్టు నిబంధనలు చెబుతున్నా వాటిని పాటిస్తున్న దాఖలా లేదు. నూటికో, కోటికో ఎప్పుడో ఎవ్వరో పోలీసులకు పిర్యాదు చేస్తే కంటి తుడుపు చందంగా చర్యలు తీసుకున్న వార్తలు సకృత్తుగా కానవస్తాయి. సోషల్ మీడియా రంగ ప్రవేశం తరువాత చోటుచేసుకుంటున్న రకరకాల వికృత పోకడల్లో నీలివార్తల వ్యాప్తి ప్రధానమైనది. ఈ మీడియాలో వేగం ముఖ్యమైన వెసులుబాటు కావడంతో ప్రచారకర్తల కన్ను కూడా ఈ మీడియాపై పడుతోంది. రాజకీయ నాయకులు సయితం ప్రజలకు చేరువగా వుండడానికి ఈ ‘మీడియం’ పైనే దృష్టి పెడుతున్నారు. వెనుకటి రోజుల్లో పత్రికా ప్రకటనల మీద ఆధారపడే పరిస్తితి క్రమంగా తగ్గి పోతోంది. కేవలం ట్వీట్లతో అటు మీడియా దృష్టిని, ఇటు ప్రజల దృష్టిని ఆకర్షించేందుకే ప్రస్తుతం ప్రాధాన్యత ఇస్తున్నారు. విలేకరుల సమావేశంలో అయితే ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన తలనొప్పి వుంటుంది. ఈ ట్వీటింగులో ఆ గొడవ లేదు. ట్వీట్ చేసి కూర్చుంటే చాలు, కాగల కార్యం మీడియానే చూసుకుంటుంది అనేది వారి ధీమా.
ఇక అన్ని రాజకీయ పార్టీలు ఈ సోషల్ మీడియా ప్రభావాన్ని గుర్తించి తమ ప్రచారాలకు ముఖ్య సాధనంగా మార్చుకుంటున్నాయి. తమ పార్టీ గురించి, తమ నేతల గురించీ సానుకూల సమాచారాన్ని మార్పిడి చేసుకుంటూ వుంటే అభ్యంతర పెట్టాల్సింది ఏమీ వుండదు. కానీ దానికి తోడు, అధికారికంగానో, అనధికారికంగానో కొన్ని గ్రూపుల ద్వారా ప్రత్యర్ధులపై దుష్ప్రచారానికి ఈ మీడియాను వాడుకునే ధోరణితో అవి ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో వ్యక్తిగత నిందారోపణలు, వ్యక్తిత్వ హననాలు ఆకాశమే హద్దుగా సాగుతున్నాయి. మార్ఫింగ్ చేసిన చిత్రాలతో ప్రత్యర్ధులపై బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నాయి. అనేక సందర్భాలలో శృతిమించి రాగాన పడుతున్న మాట కూడా వాస్తవం.
నిజానికి వెనుకటి తరానికి తెలియని ఈ సోషల్ మీడియా, నేటి తరానికి, రానున్న తరానికి ఓ వరప్రసాదం. భావవ్యక్తీకరణకు సులభతరమైన మార్గం. వెనుకటి రోజుల్లో జనాలు తమ అభిప్రాయాలు తెలుపుకోవడానికి ఎటువంటి అవకాశమూ వుండేది కాదు, పత్రికల్లో ప్రచురించే పాఠకుల లేఖలు తప్ప. ఇప్పుడలా కాదు ఇలా మెదడులో ఆలోచన రావడం ఆలస్యం, చేతికి పనిచెప్పడం, చేతిలో వున్న మొబైల్ ద్వారా దాన్ని క్షణాల్లో ప్రపంచానికి తెలపడం. అది రాజకీయం కావచ్చు, సాహిత్య అంశం కావచ్చు, గృహసంబంధమైన విషయం కావచ్చు, కంటికి కనబడ్డ విషయం కావచ్చు, కెమేరాకు చిక్కిన దృశ్యం కావచ్చు, చెవిన పడ్డ సంగతి కావచ్చు అదీ ఇదీ అని లేదు, ఉచ్చమూ నీచమూ అన్నతేడా లేదు, ఎవరేమనుకుంటారో అనే సంకోచం లేదు అలా వున్నపళంగా ఆ ఆలోచనలను, ఆ భావాలను, ఆ స్పందనలను, ఆ విమర్శలను, ఆ మెచ్చుకోళ్ళను, ఆ వేళాకోళాలను అక్కడికక్కడే, అప్పటికప్పుడే వెళ్ళగక్కి మనసులో భారాన్ని తగ్గించుకోగల గొప్ప సాధనం ఇది. సరిగా వాడుకుంటే సత్ఫలితాలను ఇచ్చే ఓ మహత్తర సాంకేతిక ప్రక్రియ ఇప్పుడు అందరికీ ఓ కాలక్షేప సాధనంగా మారిపోయింది. సమాచార మార్పిడికి, ముక్కూమొహం తెలియని వ్యక్తుల నడుమ కూడా సాంఘిక సంబంధాలను ఏర్పరచడానికి ఎంతగానో వీలుకల్పిస్తున్న ఈ సోషల్ మీడియా క్రమంగా నీలివార్తల ఉత్పత్తి, పంపిణీ కేంద్రంగా మారిపోతోంది. నిజంగా ఇదొక పెను విషాదం.
ముందే చెప్పినట్టు, వెనుకటి తరానికి చెందిన వాళ్ళు మొదటిసారి ఈ కొత్త ప్రపంచంలో తొలి అడుగు పెట్టినప్పుడు వాయువేగ మనోవేగాలతో సాగుతున్న సమాచార మార్పిడిని చూసి మాన్ప్రడి పోతున్న మాట వాస్తవం. జరుగుతున్న సాంఘిక, రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తూ యువతరం చురుగ్గా, భేషుగ్గా స్పందిస్తున్న తీరుని గమనిస్తూ మౌన ప్రశంసలు గుప్పించివుంటారనుకోవడంలో కూడా సందేహం లేదు. చిన్న చిన్న వాక్యాలతో, తేలికయిన పదాలతో నేటితరం వెల్లడిస్తున్న అభిప్రాయాలను చూసి ‘నేర్చుకోవాలనే తపన ఉండాలే కానీ, వాటిని చిన్నవయసు వారి నుండి కూడా నేర్చుకోవడానికి పెద్ద వయస్సు పెద్ద అడ్డంకి ఏమీ కాదనుకుని సమాధానపడుతున్నది కూడా వాస్తవ దూరం కాదు. పాత సంగతులు గురించి, వెనుకటి రోజుల్లోని సంప్రదాయాలు, ఆహార విహారాలు గురించీ నవతరం రాస్తున్న విధానాలు గమనిస్తూ, విస్తుపోతూ, మురిసిపోతున్న మాట కూడా అంతే నిజం.
అయితే, దురదృష్టం, ఈ సోషల్ మీడియాలో కొందరి నిర్వాకం వీరి ఆశలపై నీళ్ళు చల్లుతోంది. కొందరు వాడే పద ప్రయోగాలు వెగటు పుట్టిస్తున్నాయి. వీధి రౌడీల భాషను మరిపిస్తున్నాయి. రాజకీయ, సినీ రంగాల్లోని అభిమాన,దురభిమానాల క్రీ నీడలు మరింత ముదిరిపోయి ఈ మీడియాలో ఊడలు దించాయి. వెనుకటి రోజుల్లో సినీ అభిమానులు తమ అభిమాన నటుడి ప్రత్యర్హుల సినిమా పోస్టర్లపై పేడ కొడుతుండేవారు. అదే ఇప్పుడు తీరు మార్చుకుని సోషల్ మీడియా గోడలపై బురద చల్లే రూపం సంతరించుకుంది. వ్యాఖ్యలు, ప్రతి వ్యాఖ్యల స్థాయిని మించి, విమర్శలు, ప్రతి విమర్శల హద్దును అధిగమించి, ఆరోపణలు, ప్రత్యారోపణల చెలియలికట్ట దాటి ఈ సోషల్ మీడియా మూల స్వరూపాన్నే ఈ విష సంస్కృతి మార్చివేస్తోంది.
ఈ మాట ఎవరి మనసుకయినా నొప్పి కలుగుతుందేమో, ఈ వ్యాఖ్య ఎవరినయినా మానసికంగా గాయపరుస్తుందేమో అన్న విచక్షణ చాలామందిలో కానరావడం లేదు. ‘ నా ఇష్టం, నేను ఇలానే రాస్తాను,మీకిష్టమైనది మీరు రాసుకోండి’ అనే తెంపరితనం కట్లు తెచ్చు కుంటోంది.
ఈ సందర్భంలో తిక్కన భారతంలో రాసిన ‘ఒరులేయవి ఒనరించిన...అనే పద్యం గుర్తుకువస్తోంది. ‘ఇతరులు ఏది చేస్తే మీకు ఇష్టం వుండదో, అదే పని మీరు ఇతరుల విషయంలో చేయకండి’ అని బోధించే ఈ పద్యం అరణ్య పర్వంలో వస్తుంది. ఈ నాటి సోషల్ మీడియాకు నూటికి నూరుపాళ్ళు వర్తించే నీతి ఇది. నిప్పుతో వంట చేసుకోవచ్చు, ఒళ్ళు కాల్చుకోవచ్చు. అలాంటి నిప్పులాంటిది ఈ సోషల్ మీడియా. అంతా వాడుకోవడంలోనే వుంది.


వేళాకోళానికి వ్యంగ్యానికీ తేడా వుంది. వ్యంగానికీ సునిశిత హాస్యానికీ బేధం వుంది. అవి తెలుసుకోకుండా వాడితే జోకు మేకవుతుంది.

21, నవంబర్ 2017, మంగళవారం

సంకల్పబలం - భండారు శ్రీనివాసరావు

సంకల్పానికి చిత్తశుద్ధి తోడయితే దానికి ఒనగూడే బలం గురించి, రేడియోలో విన్న బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి అనుగ్రహ భాషణం నుంచి (యధాతధంగా కాకపోయినా, మూలభావం దెబ్బతినకుండా) “నిప్పు రాజేయడానికి అగ్గిపెట్టె కోసం వెతుకులాడేవాడికి అది దొరకొచ్చు, దొరక్కపోవచ్చు. కానీ, నిమ్ముకున్న రెండు కర్ర ముక్కల్ని, రెక్కలు విరిగేలా రాపాడిస్తూ సంకల్పబలంతో నిప్పు పుట్టించాలని ప్రయత్నించేవాడికి విజయం తప్పక సిద్ధిస్తుంది. “సంకల్పబలంతో ముందుకు సాగేవాడిని విమర్శించేవాళ్ళు, అవహేళన చేసేవాళ్ళు ఈ లోకంలో ఎలాగూ వుంటారు. అది లోక సహజం. హంస కాళ్ళపై నేలపై నడిచినంత మాత్రాన అది హంస కాకుండా పోదు. కాకి ఆకాశంలో ఎగురుతూ వెడుతున్నంత మాత్రాన అది హంస కానేరదు. కాకి కాకుండా పోదు.” "కృతజ్ఞత అనేదానికి అర్ధం చెప్పాలంటే ముందు కొబ్బరి మొక్క గురించి తెలుసుకోవాలి. చారెడు నీళ్ళు పోసి ఆ మొక్కని పెంచితే, అది పెరిగి పెద్దది అయి, చిన్నప్పుడు తన దాహం తీర్చిన వాళ్ళు, తీర్చని వాళ్ళు అనే తేడా లేకుండా చల్లని, పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన కొబ్బరి నీళ్ళను జీవితాంతం అందిస్తుంది"

20, నవంబర్ 2017, సోమవారం

కాగితాన్వేషణ – భండారు శ్రీనివాసరావు


రిటైర్ అయి పుష్కరం దాటింది. ఆ కాలంనాటి రాతలు, కోతలు ఇప్పుడు లేవు. అంతా హైటెక్. అన్నీ కంప్యూటర్ల మీదే. అయినా ప్రతిదానికీ ఆఫీసులు, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు మాత్రం తప్పడం లేదు. అదృష్టం! ఎవరూ దక్షిణలు అడగడం లేదు.




మొన్న పెన్షన్ స్లిప్ మెయిల్ లో పంపారు. వివరాలు అన్నీ సరిగానే వున్నాయి. కానీ పెన్షన్ నామినీ కాలంలో మా ఆవిడ పేరు లేదు. పెళ్లి నాడు కూడా ఇద్దరం కలిసి ఫోటో దిగలేదు కానీ, రిటైర్ అయ్యేముందు పెన్షన్ పుణ్యమా అని ఇద్దరం పొలోమని స్టూడియోకి వెళ్లి మరీ ఫోటో తీయించుకుని ఆఫీసులో ఇచ్చాము. తీరా ఇప్పుడు చూస్తే నామినీ పేరు గల్లంతు. ఇలాటి విషయాల్లో కాలయాపన పనికిరాదు అనే మా మాజీ స్టేషన్ డైరెక్టర్ శాస్త్రి గారి మాట విని కోటీలోని స్టేట్ బ్యాంకు ప్రధాన కార్యాలయానికి వెళ్లాను. 1975లో రేడియోలో చేరినప్పటి నుంచి నా అక్కౌంటు అక్కడే, అప్పట్లో అన్నీ మానవ సంబంధాలు. స్లిప్పు రాయడం, టోకెన్ తీసుకోవడం, మన నెంబరు పిలిచినదాకా ఆ ముచ్చటా ఈ ముచ్చటా చెబుతూ కాలక్షేపం చేయడం, లేదా బ్రాంచి మేనేజర్ దగ్గర భేటీ వేయడం అలా కాస్త కాలక్షేపం కాస్త స్వకార్యం. ఇప్పడు అలా లేదు. ఒక పెద్ద అధునాతన ఎయిర్ పోర్ట్ మాదిరిగా వుంది. అన్నీ కంప్యూటర్లు, వాటి వెనక కనీకనపడక సిబ్బంది తలకాయలు. పనిచేస్తున్నారో, సెల్ ఫోన్లు చేస్తున్నారో తెలవదు. అంతా హడావిడి. బయట కస్టమర్లది కూడా అదే తంతు. ఒకరికొకరు తెలవదు, ఎవరికి వారికి తమ పని ముందు చక్కబెట్టుకుని చక్కా పోవాలనే ఆత్రుత. ‘చివరికి ఇక్కడ కాదు, పెన్షనర్ల విభాగం మరో పక్కన అదే ఆవరణలో వుంది, అక్కడికి వెళ్లండని చల్లగా కబురు. ఆ బిల్డింగు పెద్ద పెద్ద పొడవాటి మెట్ల వరుసతో చాలా అందంగా, అధునాతనంగా వుంది. మొదటి అంతస్తులో వుంది ఈ విభాగం. మా ఆవిడను తీసుకుని వెళ్ళిన రోజు జనం లేరు, ఖాళీగా వుంది. బయట రిసెప్షన్ లో ఎవరూ లేరు. గాజు తలుపు నెట్టుకుని లోపలకు వెళ్లి అక్కడ ఒకర్ని వాకబు చేసాను. అతడు ఆశ్చర్యంగా నా వంక చూసి, ‘ఇక్కడి దాకా ఎలా వచ్చారు. లోపలకు ఎవరూ రాకూడదు, బయట రిసెప్షన్ వరకే మీకు అనుమతి’ అంటూ నాకు ఓ క్లాసు పీకాడు. బయటకు వచ్చి చూస్తే రిసెప్షన్ సీటు ఖాళీగా వుంది. కాసేపటికి ఒకావిడ వచ్చి అక్కడ నిల్చుంది. ఆవిడ ఉద్యోగా, నాలాగా వచ్చిన మనిషా అని తేరిపార చూస్తుంటే ఆవిడ కళ్ళు విప్పార్చి ‘ఏం కావాలి’ అని అడిగింది. వెళ్లి చెప్పాను. పేరు, అక్కౌంట్ నెంబరు వివరాలు అడిగి తెలుసుకుంది. నేను, ‘మా ఆవిడ మా ఆవిడే’ అనడానికి నాదగ్గర ఉన్న అన్ని ఆధారాలు అంటే ఆధార్ కార్డు, పెన్షనర్ కార్డు, ఏళ్ళతరబడి అదే బ్యాంకులో ఉన్న బ్యాంకు జాయింటు అక్కౌంట్ వివరాలు, పాసుపోర్టు ఇలా అన్నీ ఆవిడ ముందు పెట్టాను. ‘పెన్షన్ పేమెంటు ఆర్డరు ఏదీ’ అని అడిగింది. రిటైర్ అయిన తరువాత నాలుగిళ్ళు మారాను. ఈ సంధి కాలంలో ఏటీఎంలు, ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లు వగైరాలు వచ్చిపడి కొన్ని పాత కాగితాలకు కాలం చెల్లిపోయిందని నిర్లక్ష్యం చేసిన జాబితాలో ఈ కాగితం కూడా చేరి పోయివుంటుంది. కానీ ఆ కాగితం లేనిదే పని జరగదు అనే తెలివి తెచ్చుకుని ఇంటికి చేరి ఇంటిల్లిపాదీ ఆ కాగితాన్వేషణ కార్యక్రమంలో తలమునకలు అయ్యాము. ఇల్లంతా చిందర వందర కావడం తప్పిస్తే కాగితం జాడ లేదు. అతి ముఖ్యమైన వాటిని అతి జాగ్రత్తగా దాచే నైపుణ్యం కలిగిన మా ఆవిడే వాటి పత్తా కనుక్కుంది. పాండవులు ఆయుధాలను జమ్మి చెట్టు కొమ్మల్లో దాచినట్టు, పెన్షన్ పత్రాలను ఒక సీనా రేకుల పెట్టెలో పెట్టి ఆ పెట్టెను భద్రంగా అటక ఎక్కించింది.దాన్ని దింపి చూస్తే ఎప్ప్పుడో పుష్కరం నాడు దిగిన మా దంపతుల ఫోటో ఉన్న పెన్షన్ పేమెంటు ఆర్డరు బుక్కు కనిపించింది. తెల్లారగానే దాన్ని పట్టుకుని, దారి మధ్యలో జిరాక్స్ కాపీలు తీయించి, ఈరోజు అక్కడికి పడుతూ లేస్తూ వెళ్లాను.



పోయి చూస్తె, ఆ రిసెప్షన్ హాలు మొత్తం పెన్షనర్లతో కిటకిట లాడుతోంది. నా మొహం చూసి నాలాగే పనిమీద వచ్చిన ఒకాయన, ‘సోమవారం మాస్టారు, సోమవారం రష్ ఇలాగే వుంటుంది’ అన్నాడు. కాసేపటి తరవాత ఆయనే కలిగించుకుని ‘అలా నిలుచుండి పొతే అలాగే వుంటారు. ముందు ఆ రిసెప్షన్ బల్ల మీద ఉన్న రిజిస్టర్ లో మీ వివరాలు రాయండి’ అన్నాడు. “ఇక్కడ నిఘా కెమెరాలు వున్నాయి, కాస్త నవ్వు మొహం పెట్టండి’ అనే బోర్డులు వున్నాయి కానీ, ఈ ముఖ్యమైన సంగతి తెలిపే సమాచార సూచిక అక్కడ ఏమీ కనబడలేదు.
రిజిస్టర్ లో వివరాలు రాసి ఓ పక్కన నిలుచున్నాను. ఈసారి సీట్లో మరో అమ్మాయి కూర్చుని వుంది. ప్రతి ఒక్కరి కేసు తన కేసే అన్నంత శ్రద్ధగా వచ్చిన వారికి విసుక్కోకుండా పని చేసి పెడుతోంది. లైన్లో ఉన్న వాళ్లకు ఈ ఆలస్యం కాస్త ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఆ పని తీరు నాకు బాగా నచ్చింది. ఇంతలో ఒక వృద్ధుడు వచ్చాడు. అప్పుడే నా వంతు వచ్చింది. ఆ అమ్మాయి నాతో అన్నది, ‘చూడండి. నిజానికి వరసలో మీరే వున్నారు. ఈయన రిజిస్టర్ లో రాయలేదు. కానీ పెద్దాయన కదా! మీరు ఒప్పుకుంటే ముందీ పెద్దమనిషి విషయం కనుక్కుంటాను’
ఈ రకంగా వృత్తి ధర్మం నెరవేరుస్తున్న ఒక ఉద్యోగిని చూడడం చాలా అరుదు. ఆ పెద్ద మనిషి పని పూర్తి చేసిన తరువాత నన్ను పిలిచింది. వివరాలు అన్నీ మరో మారు పరిశీలించింది. నేను రిటైర్ అయినప్పుడు నామినీ విషయంలో పుట్టిన తేదీ పట్టింపు లేదు. కానీ అదిప్పుడు తప్పనిసరి. నేను ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో ఒక వైద్యుడు రోగికి చెప్పినంత వివరంగా చెప్పింది. ఆ అమ్మాయి పనిచేసే విధానం చూసిన తరువాత నాకు నా పని కాలేదన్న విచారం కలగలేదు. ధన్యవాదాలు చెప్పి వచ్చేసాను.
నిజానికి ప్రస్తుతం దేశానికి కావాల్సింది ఇలాంటి ఉద్యోగులే.

13, నవంబర్ 2017, సోమవారం

“ఆకాశవాణి, హైదరాబాదు కేంద్రం, ప్రాంతీయ వార్తలు చదువుతున్నది చుండూరు వెంకట రంగారావు...”


ఈరోజు కార్తీక సోమవారం (13-11-2017) మధ్యాన్నం ఒంటిగంటా పది నిమిషాలకు రేడియోలో ఈ గొంతు వినపడింది. ఈ సాయంత్రం వార్తలు కూడా రంగారావు గారే చదవాలి. కానీ చదవడానికి ఆయన లేరు. సాయంత్రం బులెటిన్ కు సిద్ధం అవుతూ రేడియో స్టేషన్ లోనే కుప్పకూలిపోయారు. న్యూస్ రూమ్ లో పనిచేసే ఇతర సిబ్బంది వెంటనే ఆయన్ని దగ్గరలోని హైదర్ గూడా అపోలో ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. కానీ ఫలితం దక్కలేదు. ఏ వార్తలు అయితే ఆయన చదవాలో ఆ బులెటిన్ లోనే రంగారావు గారి మరణ వార్తను ప్రసారం చేయాల్సి వచ్చిందని న్యూస్ సిబ్బంది బాధ పడ్డారు.
వారి ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలి



11, నవంబర్ 2017, శనివారం

‘మీలో పార్టీ మారని వారు ఎవరో చెప్పండి’ – భండారు శ్రీనివాసరావు


ఎవరయినా ఒక పెద్ద పార్టీకి చెందిన ఒక పెద్ద నాయకుడు మరో పార్టీలోకి జారిపోతే ఆ సందర్భాన్ని 'పార్టీ మార్పిళ్ళకు పరాకాష్ట’  అని గిట్టని పార్టీల వాళ్లు వ్యాఖ్యానిస్తుంటారు. ఇదేదో కొత్త విషయం అయితే ఆశ్చర్య పడాలి. ఈ చేరికలకు, చీలికలకు ఇది మొదలూ కాదు, చివరా కాదు. అందుకే విమర్శించేవారు మరో సందర్భంలో సమర్ధించడానికి సిద్ధంగా ఉండడానికి సిద్ధపడి వుండాలి. సమర్ధించేవారు ఇంకో సందర్భంలో విమర్శించడానికి సంసిద్ధంగా వుండడం కూడా అంతే  అవసరం.  ఎందుకంటే ఈ పార్టీ మార్పిళ్ళు అనేవి అన్ని పార్టీలకి తప్పనిసరి అవసరం కాబట్టి.  ఎవరూ దీనికి అతీతులు కాదు కాబట్టి. మరో 'మార్పిడి' జరిగేవరకు పాత దానిపై దుమారం సాగిపోతుంది, ఆ  తరువాత అది పాత పడిపోతుంది. కొత్తది తెర మీదికి వస్తుంది. చర్చ మళ్ళీ మొదలవుతుంది. ఇదో విష చక్ర భ్రమణం.       
'నిలకడగా  నిల్వవున్న నీరు నాచు పట్టి నీచు వాసన వేస్తుంది. పారే నీరు పారదర్శకంగా స్వచ్చంగా కనబడుతుంది'   
పార్టీ మార్పిడులను సమర్ధిస్తూ ఓ రాజకీయ నేత చేసిన వ్యాఖ్య ఇది. మరి సమర్ధనకు ఈ వ్యాఖ్యను పరాకాష్టగా తీసుకోవాలేమో.  
పార్టీలు ఏర్పడినప్పుడే మార్పిళ్ళ సంస్కృతికి కూడా బీజాలు పడ్డాయంటారు. పార్టీలు వుంటేనే కదా మార్పిళ్ళు జరిగేది. అందుకే రాజకీయుల అవసరాలకు తగ్గట్టు పార్టీలు కూడా పుట్టుకొస్తుంటాయి.
1947లో దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత 1952లో తొలిసారి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అప్పుడు దేశంలో అందరి నోళ్ళలో నానుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమే. కమ్యూనిష్టు పార్టీలు వుండేవి కాని వాటి పాత్ర పరిమితంగా వుండేది. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తుల పుణ్యమా అని అనేక పార్టీలు పుట్టుకొచ్చాయి. కొన్ని కాలపరీక్షకు తట్టుకున్నాయి. కొన్ని కాలగర్భంలో కలిసిపోయాయి. మరికొన్ని ఎంతో కొంత ఓట్ల శాతాన్ని దక్కించుకుంటూ తమ ఉనికిని కాపాడుకుంటున్నాయి.
2014 జూన్  రెండో తేదీన తెలంగాణా రాష్ట్రం ఆవిర్భావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  విడిపోయింది. విడిపోవడానికి కొద్దికాలం  ముందు నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో అటు ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ, ఇటు తెలంగాణాలో టీ.ఆర్.ఎస్. పార్టీ అధికారంలోకి వచ్చాయి. రాష్ట్రాల చీలిక దరిమిలా రెండు తెలుగు రాష్ట్రాల్లో కొట్టవచ్చినట్టుగా కనిపించిన మార్పు ఒక్కటే ఒక్కటి,  పార్టీ మార్పిళ్ళు. రెండు రాష్ట్రాలమధ్య సహజంగా పరిష్కారం కావాల్సిన అనేక సమస్యలు అలాగే వుండిపోతే, కొత్తగా తెరమీదకు వచ్చిన ఈ పార్టీ మార్పిళ్ళ వ్యవహారం అన్ని సమస్యలను కారుమబ్బులా కమ్మేసి, అనేక అనైతిక, అవాంఛనీయ, అప్రజాస్వామిక పరిణామాలకు దారి తీయడమే కాకుండా వివాదాలు ముదిరి పాకానపడి చివరికి కేసులు, కోర్టుల వరకు వెళ్ళింది.
ఈ చిక్కుముళ్ళు ఎప్పుడూ విడివడతాయో ఎవ్వరూ చెప్పలేని పరిస్తితి. 'మీరంటే మీరే కారణం' అంటూ వివాదాలకు కేంద్ర బిందువులయిన రెండు ప్రధాన పార్టీలు వీధులకెక్కి వీరంగాలు చేస్తూ వుండడం, అటూ ఇటూ పార్టీల నాయకులు. కార్యకర్తలు, అభిమానులు వేర్వేరు పారావారాలుగా విడిపోయి వాదోపవాదాలకు దిగడంతో సామరస్య పరిష్కారం ఆశలు సన్నగిల్లుతున్నాయి.   దీనికి ముగింపు ఎప్పుడన్నది కాలమే చెప్పాలి.
పోతే, ఇన్ని సమస్యలకు మూలకారణంగా పేర్కొంటున్న పార్టీ మార్పిళ్ళు ముందే చెప్పినట్టు పార్టీలు పుట్టినప్పుడే పురుడు పోసుకున్నాయి. అసలు కొత్త పార్టీలు పుట్టుకు రావడానికి ప్రధాన కారణం పార్టీల్లో పుట్టుకొచ్చే  రాజకీయ అసంతృప్తులే అనే వాదం వుంది.     
సాధారణంగా  ప్రతిపక్షంలో వున్నవాళ్ళు పాలకపక్షం వైపు చూడడం సహజం. కానీ,పాలక పక్షం నుంచి ప్రతిపక్షం వైపు దూకే సాంప్రదాయానికి ఎప్పుడో రామాయణ కాలంలోనే విభీషణుడు విత్తు నాటాడు. తటస్థులను తమవైపు తిప్పుకోవడం మహాభారతంలో కానవస్తుంది.      
స్వతంత్రం వచ్చిన కొత్తల్లో వచ్చిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీది ఏకపక్షంగా సాగిన వ్యవహారం ఏమీ కాదు. స్వతంత్రం తెచ్చిన ఖ్యాతి, తొలి ఎన్నికల్లో అ పార్టీకి బాగా ఉపయోగపడిన మాట వాస్తవమే అయినప్పటికీ ఇప్పటితో పోలిస్తే అప్పుడున్న పార్టీల సంఖ్య  కూడా తక్కువేమీ కాదు. జనత పార్టీ, స్వతంత్ర పార్టీ, జనసంఘం పేర్లు  ఈనాడు కొందరికి తెలిసి  వుండవచ్చునేమో కాని1952 లో జరిగిన ఎన్నికల్లో సోషలిష్టు పార్టీ, ప్రజా సోషలిష్టు పార్టీ,  నేషనలిష్టు డెమొక్రాటిక్ పార్టీ, కృషికార్ లోక్ పార్టీ, కే.ఎల్.పీ, ఎన్.సీ.ఎఫ్,  జస్టిస్ పార్టీ,  ప్రజాపార్టీ, కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీ, పీపుల్స్ డెమొక్రాటిక్ ఫ్రంట్ ఇలా అనేక పార్టీలు వుండేవి. కమ్యూనిస్ట్ పార్టీ (అప్పటికి ఒక్కటే) సరేసరి. వీటిల్లో కొన్ని పార్టీల పేర్లు చూడగానే, 'తల్లి పార్టీ ఏమిటి? అందునుంచి  వేరుపడి ఏర్పడ్డ కొత్త పార్టీ ఏమిటి?' అన్న విషయం సులభంగానే బోధపడుతుంది.       
గోడ దూకితే గారెల గంపలో పడొచ్చు లేదా ముళ్ళకంపపై పడొచ్చు. ఏదైనా జరగొచ్చు.
పార్టీ మార్పిడి కూడా లాటరీ వంటిదే. కొందరికి లాభం. కొందరికి ఖేదం.
పార్టీ మారిన వెంటనే చేరిన పార్టీలో తారాజువ్వలా పైకి దూసుకు పోయిన సందర్భాలు వున్నాయి. పార్టీ మారి పుష్కరాలు గడిచినా వేసిన గొంగడి చందంగా చతికిలపడి పోయిన ఉదాహరణలు వున్నాయి. పేర్లు చెప్పుకుంటూ పొతే జాబితా కొండవీటి చేంతాడు అంత అవుతుంది.
పార్టీ మార్పిళ్లలో అర్ధం కానిది ఒకటే.   
రాజకీయుల్లో ఎవరిని కదిలించినా గెలుపు తధ్యం అంటారు. ప్రజలు తమకు పట్టం కట్టడానికే మనసా, వాచా, కర్మణా సిద్ధమైపోయారని చెబుతారు. ఇంతాచేసి, తమమీద తమకే నమ్మకం లేనట్టు చొక్కాలు మార్చినట్టు  పార్టీలు మారుతుంటారు.
ఏవిటో అంతా వరదలో కొట్టుకుపోతున్నట్టుగా వుంది. నిలబడి ఆలోచించే తీరిక వోపిక ఎవరికీ వున్నట్టు లేవు.
ముక్తాయింపు :       
ప్రధాన రాజకీయ పార్టీల కార్యాలయాల్లో తరచుగా వినబడుతున్న మాట:

"ఈరోజు ప్లస్సెంత ? మైనస్ యెంత?"