5, నవంబర్ 2017, ఆదివారం

దగ్గర పడుతున్న పెద్ద నోట్ల రద్దు ప్రధమ వార్షికోత్సవం – భండారు శ్రీనివాసరావు

నిరుడు నవంబరు ఎనిమిదో తేదీన ప్రధానమంత్రి మోడీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని అత్యంత నాటకీయంగా ప్రకటించారు. నిర్ణయం జరిగి ఏడాది కాలం గడిచి పోతున్న తరుణంలో కూడా ఈ నిర్ణయం మంచి చెడులను గురించి దేశ వ్యాప్త చర్చలు జరుగుతూ వుండడం విశేషం.
పెద్ద నోట్ల రద్దు దరిమిలా, ‘సూటిగా...సుతిమెత్తగా....’ అనే శీర్షికతో  నేను మొదటి రెండు నెలల్లోనే సుమారు పది వ్యాసాలు రాసి ప్రచురించాను. వాటిని ఒకపరి సింహావలోకనం చేసుకోవడమే ఈ రచన పరమార్ధం.
మోడీ ప్రయోగించిన  బ్రహ్మ శిరోనామకాస్త్రం (13-11-2016)
1978
 వ సంవత్సరం. జనవరి నెల. 14 వ తేదీ ఉదయం.
ముంబై (అప్పుడు బొంబాయి) లో వున్న రిజర్వ్ బ్యాంకు  చీఫ్ అక్కౌంట్స్ కార్యాలయంలో సీనియర్ అధికారి ఆర్. జానకి రామన్ ఇంట్లో ఫోను మోగింది. వెంటనే ఢిల్లీ రావలసిందని ఒక ప్రభుత్వ అధికారి ఆదేశం.
జానకి  రామన్ బొంబాయి నుంచి బయలుదేరి  ఢిల్లీ వెళ్ళీ వెళ్ళగానే అక్కడి ఉన్నతాధికారులు ఒక ఆర్డినెన్స్  ముసాయిదాను ఒకే ఒక్క రోజులో తయారు చేయాలని ఆయన్ని కోరారు. పెద్ద విలువకలిగిన  కరెన్సీ నోట్లని చెలామణి నుంచి తప్పించాలని ప్రభుత్వం సంకల్పించిందని, అందుకు తగిన ఆర్డినెన్స్ సిద్ధం చేయాలని, ఇదంతా చాలా గోప్యంగా జరగాలని  రామన్ ను ఆదేశించారు.
ఇప్పట్లా ఆరోజుల్లో సెల్ ఫోన్ వంటి కమ్యూనికేషన్ సదుపాయాలు లేవు. అయినా ఆర్బీఐ  కేంద్ర కార్యాలయం నుంచి ఎటువంటి సమాచారం బయటకి పొక్కకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.
అనుకున్న పద్దతిలోనే ఆర్డినెన్స్ ముసాయిదా తయారయింది. జనవరి 16 తెల్లవారుఝాముకల్లా రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి సంతకం కోసం పంపారు. అదే రోజు ఉదయం తొమ్మిది గంటలకు ఆకాశవాణి ద్వారా పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశ ప్రజలకు తెలిసిపోయింది.  ముందు జాగ్రత్తగా జనవరి పదిహేడునాడు దేశ వ్యాప్తంగా అన్ని బ్యాంకులు, ప్రభుత్వ ట్రెజరీలు మూసివేశారు.
అప్పటి ఆర్బీఐ గవర్నర్ ఐ.జీ. పటేల్ కు ఈ పెద్ద నోట్ల రద్దు వ్యవహారం నచ్చలేదు. సంకీర్ణ జనతా ప్రభుత్వంలోని కొందరు నాయకులు పెద్ద నోట్ల రద్దుకు పట్టుబట్టడం వల్ల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాల్సివచ్చిందన్నది ఆయన అభిప్రాయం. అంతకు పూర్వం దేశాన్ని పాలించిన నాయకుల అవినీతి పనులను లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుందని పటేల్ చెప్పారు.
భారతీయ ఆర్ధిక విధానాలు అనే అంశంపై పటేల్ రాసిన పుస్తకంలో ఇంకా ఇలా పేర్కొన్నారు.
పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్లను రద్దు చేయాలనే నిర్ణయం గురించి ఆర్ధిక మంత్రి హెచ్.ఎం.పటేల్ నాతొ ప్రస్తావించారు. అటువంటి సంచలన నిర్ణయాలతో అద్భుత ఫలితాలు రాబట్టడం చాలా అరుదుగా జరుగుతుందని నేను మంత్రితో స్పష్టంగా చెప్పాను.
సాధారణంగా అవినీతి, అక్రమ  పద్ధతుల్లో భారీఎత్తున  డబ్బు పోగేసుకునేవాళ్ళలో అత్యధికులు ఆ సంపదను  కరెన్సీ రూపంలో  ఎక్కువ కాలం దాచిపెట్టుకోరుఅన్నది నాటి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ పటేల్ అభిప్రాయం.
నల్ల డబ్బును సూట్ కేసుల్లో, దిండ్ల కవర్లలో కుక్కి దాస్తారని అనుకోవడం అజ్ఞానమే అవుతుందిఅని కూడా పటేల్ మహాశయులు అభిప్రాయపడ్డారు.
ఇది జరిగి  38 ఏళ్ళు అవుతోంది.
నాడు  1978లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ శకం ముగిసిన తరువాత ప్రజల తీర్పుతో కేంద్రంలో  అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి కాంగ్రెసేతర జనత ప్రభుత్వం వెయ్యి, అయిదు వేలు, పదివేల రూపాయల నోట్లను రద్దు చేయాలని సంకల్పించి, ఆ నిర్ణయాన్ని వెంటనే అమలు చేసింది. అప్పుడు జనత ప్రభుత్వానికి నేతృత్వం వహించింది గుజరాత్  కు చెందిన మొరార్జీ దేశాయ్. మళ్ళీ ఇన్నాళ్ళ తరువాత అయిదువందలు, వెయ్యి రూపాయల కరెన్సీ నోట్లని రద్దు చేయాలని నిర్ణయించింది కూడా అదే రాష్ట్రానికి చెందిన నేటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇది కాకతాళీయం కావచ్చు. అలాగే ఈ రెండు నిర్ణయాలు కాంగ్రెసేతర ప్రభుత్వాలు కేంద్రంలో కొలువు తీరి వున్నప్పుడు తీసుకోవడం కొట్టవచ్చినట్టు కానవచ్చే మరో పోలిక.
కాకపొతే అప్పటికన్నా ఈసారి మోడీ ప్రభుత్వం  గోప్యతను మరింత పకడ్బందీగా పాటించినట్టు కనబడుతుంది.
గత మంగళవారం సాయంత్రం  ఢిల్లీలో కేంద్ర మంత్రిమండలి సమావేశం జరిగింది. అంతకు ముందు ప్రధాని త్రివిధ సైనిక దళాల అధిపతులతో సమావేశం అయ్యారు. సరిహద్దుల్లో ఇప్పటికే యుద్ధ వాతావరణం ఏర్పడి వుండడం చేత ప్రధాని అనుకు సంబంధించి ఏదో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. క్యాబినెట్  ఎజెండాలో ఈ నిర్ణయానికి సంబంధించి కానీ, సరిహద్దులలో తీవ్రత గురించిన   అంశం కానీ  ఏదీ లేదు. సమావేశం ముగిసే సమయంలో ప్రధానమంత్రి మోడీ పెద్ద నోట్ల చెలామణి రద్దు నిర్ణయాన్ని క్లుప్తంగా తెలియచేసి మంత్రులనందరినీ సమావేశ మందిరంలోనే కూర్చోబెట్టి ప్రభుత్వ  సంకల్పాన్ని రాష్ట్రపతికి తెలియచేడానికి వెళ్ళారు. ఆ తరువాత నేరుగా దేశ ప్రజల నుద్దేశించి రేడియో, దూరదర్సన్ లలో ప్రసంగించారు. ఆ సంస్థల అధికారులకికూడా ముందస్తు సమాచారం ఇవ్వలేదు. మంత్రులు కూడా సమావేశ మందిరం నుంచే ప్రధాని ప్రసంగం విన్నారు.  ఆ తరువాతనే వారు బయటకు వెళ్ళారు.
పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని మోడీ ఆరుమాసాల క్రితమే తీసుకున్నారని, అప్పటినుంచి దాన్ని అమలు చేయడానికి దశలవారీ ప్రణాళిక రూపొందించుకున్నారని భోగట్టా. అందులో భాగమే మొన్నీ మధ్య అమలు చేసిన స్వచ్చంద ఆదాయ వెల్లడి పధకం. గోప్యత చాలా కీలకం అని భావించిన నరేంద్ర మోడీ, చాలా కాలంనుంచే మంత్రివర్గ సమావేశాలకు మంత్రులుఎవరూ తమవెంట సెల్ ఫోన్లు తెచ్చుకోకుండా కట్టడి చేసారు.
నోట్ల రద్దు నిర్ణయం గురించి మొత్తం దేశంలో తెలిసిన వాళ్ళు పది మంది మాత్రమే అని,  రిజర్వ్ బ్యాక్ గవర్నర్ పదవి నుంచి తప్పుకున్న రఘురాం రాజన్ అందులో ఒకరని  తెలుసుకుని ఆశ్చర్యపోవడం మీడియా వంతయింది. మొత్తం వ్యవహారాన్ని అత్యంత రహస్యంగా ఉంచినా ఇలాంటిది ఏదో జరగబోతోందన్న సంకేతాలు మాత్రం గత కొద్ది కాలంగా వెలువడుతూనే వున్నాయి. కొత్త రెండువేల రూపాయల నోటు నమూనా తయారుచేయడం, ఆమోదించడం, ఆ నోట్లను పెద్ద మొత్తంలో ముద్రించడం జరిగిపోయాయి. అయితే ఆ విషయం తెలిసిన వాళ్ళు ఇది షరా మామూలుగా జరిగే నోట్ల ముద్రణగా భావించారు కానీ దీని వెనుక ఇంత భారీ నిర్ణయం వుందని అంచనా వేయలేకపోయారు.     
ప్రధాని ప్రసంగం ముగించిన వెంటనే దాన్ని విన్న ఆసేతుహిమాచలం ప్రజలందరికీ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్న నల్ల ధనం పిశాచి భరతం పట్టడానికి మోడీ ఎంతో సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్న ఒకే అభిప్రాయం కలిగింది. మొనగాడంటే మోడీ అనే రీతిలో సాంఘిక మాధ్యమాల్లో మోడీని ప్రశంసలతో ముంచెత్తారు. కొద్ది రోజులు కటకటపడితే పడదాము, కష్టాలు శాస్వితంగా తీరిపోతున్నప్పుడు తాత్కాలిక ఇబ్బందులను పట్టించుకోవద్దుఅనే భావన సర్వత్రా కనబడింది.
రాత్రంతా సాగిన ఆ భావనలు మర్నాడు కూడా కొనసాగి, నిర్ణయ ప్రభావం కొద్దికొద్దిగా అనుభవంలోకి రావడం మొదలుకాగానే  అవి మనస్సులో నుంచి వైదొలగడం మొదలయింది.  సంపన్నులపై  ముఖ్యంగా నల్ల కుబేరులపై ప్రధాని మోడీ ప్రయోగించిన ఈ సర్జికల్ స్ట్రైక్  గురి తప్పి సామాన్యులను తాకిందేమో అనే సంశయం సన్నగా మొదలయింది. మీడియా వార్తలు దానికి ఆజ్యం పోసి మరింత పెంచాయి. మోడీ ఈ అస్త్రాన్ని యూపీ ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకుని వాడారనే ఆరోపణలు అనుమానాలను రగిలించాయి. బీజేపీ సహజంగా సంపన్న వర్గాల కొమ్ము కాస్తుందనే అపప్రధను ప్రత్యర్ధులు మరోసారి తెరపైకి తీసుకువచ్చారు. ఏటీఎం లలో డబ్బు లేకపోవడం, బ్యాంకులకు సెలవు ప్రకటించడం, నోట్ల మార్పిడికి వ్యవధానం అతి తక్కువగా వుండడం వెరసి ఇవన్నీ మోడీ నిర్ణయాన్ని తప్పుపట్టే దిశగా సాగాయి. అయితే ప్రభుత్వం ముందే చెప్పినట్టు గంటలు గడుస్తున్న కొద్దీ పరిస్తితుల్లో ముందు కానవచ్చిన తీవ్రత  కొద్దికొద్దిగా తగ్గడం మొదలయింది. అనుకున్నంత కాకపోయినా కొద్ది కొద్ది మొత్తాలలో చెలామణీలో వున్న కరెన్సీ చేతుల్లో పడడంతో జనం ఊపిరి పీల్చుకోవడం మొదలెట్టారు. అయినా శంకలు పూర్తిగా తొలగిపోలేదు. జవాబు దొరకని ప్రశ్నలు కొన్ని జనం మెదళ్ళలో మెసులుతూనే వున్నాయి. ఒక చేత్తో వెయ్యి నోటు రద్దు చేసిన ప్రభుత్వం ఆ ఉత్తర్వుపై చేసిన  సంతకం తడి ఆరకముందే మరో చేత్తో రెండువేల రూపాయల నోటును చెలామణీ లోకి ఎందుకు తెచ్చినట్టు? అయిదు వందల పాత నోటును తీసేసి, కొత్త అయిదు వందల కరెన్సీ నోటు తేబోతున్నట్టు ప్రకటించడం ఎందుకు? జనాలను ఇంత లాయలాసకు గురిచేసి, దేశంలో నల్లధనం  మళ్ళీ రాశులుగా  పోగుపడడానికి ఉపకరించే రెండు వేల నోటు తేవడం ఎందుకు?
ఇవన్నీ జవాబు తెలియని ప్రశ్నలే కానీ నిజానికి సమాధానం లేనివి కావు. సమాధానం చెప్పేవాళ్ళు లేకపోతే అది సందేహంగా మారుతుంది. క్రమంగా అనుమానం రూపం సంతరించుకుంటుంది. ఆ క్రమాన్ని అడ్డుకోకపోతే ఆగ్రహంగా పరిణమిస్తుంది.
ప్రస్తుతానికి అయితే జనాల మనస్సులో ప్రశ్నలు మాత్రమే వున్నాయి.
బంతి ప్రభుత్వం కోర్టులోనే వుంది. 
ఉపశృతి:
మహా భారత యుద్ధ పరిసమాప్తి కాలంలో అశ్వద్ధామ ప్రయోగించిన బ్రహ్మశిరోనామకాస్త్రం, అభిమన్యుడి అర్ధాంగి ఉత్తర గర్భంలో పెరుగుతున్న పాండవ వంశాంకురాన్ని తుదముట్టించబోయేటప్పుడు కృష్ణుడు సుదర్శన చక్రం అడ్డువేసి తల్లీకొడుకులను కాపాడతాడు. అసలీ అస్త్ర మహత్యమే అద్భుతం. ప్రయోగించిన వీరుడు మంత్రశక్తితో ఆవాహన చేసి నిర్దేశించిన లక్ష్యానికి మినహా మరెవరికీ హాని కలిగించక పోవడం ఈ బ్రహ్మ శిరోనామకాస్త్రం ప్రత్యేకత. ఒకరకంగా చెప్పాలంటే, మోడీ పుణ్యమా అని ఈనాడు బహుళ  ప్రాచుర్యంలో వున్నసర్జికల్ స్ట్రైక్’  లాంటిదని  చెప్పుకోవచ్చు.
(11-11-2016)


NOTE: మరో వ్యాసం మరో సారి 

భాగవత సప్తాహం – భండారు శ్రీనివాసరావు


మరణం తధ్యమని తెలిసిన పరీక్షిత్తు ఏం చేశాడు ? శుక మహర్షి ఆధ్వర్యంలో భాగవత సప్తాహంలో  శేషజీవితాన్ని గడిపాడు.
దాదాపు ఇదే మాదిరి వృత్తాంతం విశాఖ నుంచి వినవచ్చింది. కాకపొతే ఇది జరిగి నలభయ్ అయిదేళ్ళు గడిచాయి.
భాగవతుల పరమేశ్వర రావు గారి అసలు ఇంటి పేరు ఇదో కాదో తెలవదు. కానీ ఇదే పేరు అలా నిలబడి పోయింది. దానికి కారణం ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆ కుటుంబం ఇచ్చే చేయూత.
ఉత్తరాంధ్రలో వారిది  బాగా కలిగిన కుటుంబం. తల్లి సీతమ్మ గారు వయో వృద్ధులు. మరణ సమయం ఆసన్న మైందని ఆవిడగారికెందుకో తోచింది. కొడుకును పిలిచింది. ఆస్తిపాస్తుల అప్పగింత కోసం కాదు, చెవులు వినబడుతూ ఉండగానే ధార్మిక ప్రవచనాలు వినాలని ఉందన్న తన మనోభీష్టాన్ని కుమారుడికి ఎరుక పరిచింది.
ఆయన కూడా తల్లికి తగ్గ కుమారుడు. పైగా సంపన్న కుటుంబం. కన్న తల్లి కోరిక తీర్చాలని నిర్ణయించుకున్నాడు. పరీక్షిత్తుకు శుక మహర్షి మాదిరిగా తల్లికి ఆధ్యాత్మిక ప్రవచానాలు వినిపించగల సమర్ధుడు ఎవ్వరన్న మీమాంస మొదలయింది. ఆ ప్రశ్నకు శ్రీ భాష్యం  అప్పలాచార్య స్వామి రూపంలో సమాధానం లభించింది. శ్రీరామ నవమి నాడు జన్మించిన అప్పలాచార్య సంస్కృతాంధ్ర భాషల్లో నిష్ణాతులు. ఉగాది పర్వదినం నాడు మొదలు పెట్టి శ్రీరామనవమి  వరకు  విశాఖ  గురజాడ కళాక్షేత్రంలో తొమ్మిది రోజులపాటు రామాయణ ప్రవచనాలు చేసేవారు. ఆ విధంగా ఆ ప్రాంతంలో ఆయన ప్రసిద్ధులు. శ్రీ భాష్యం వారిని పరమేశ్వర రావు గారు  తమ స్వగ్రామానికి ఆహ్వానించారు. పరీక్షిత్తుకు ఏడురోజుల్లో మరణం తధ్యం అని తెలిసిపోయింది  కాబట్టి భాగవత సప్తాహంతో ఆ కార్యక్రమం పూర్తయింది. అప్పలాచార్య స్వామి   త్రి సప్తాహం అంటే మూడు ఏళ్ళు  ఇరవై ఒక్క రోజులు భాగవత పారాయణం చేశారు.

తన ఆఖరి కోరిక తీరిన తరువాత  కొంత కాలానికి ఆవిడ కాలం చేశారు. పరమేశ్వర రావు గారికి ఆ సత్కార్యాల ఫలితంగా భాగవతం ఇంటి పేరుగా మారి భాగవతుల పరమేశ్వర రావుగా మారారు. 
త్రి సప్తాహం నిర్వహించిన శ్రీ భాష్యం  వారిప్పుడు లేరు. కీర్తిని మిగిలించుకుని  నిజమైన కీర్తిశేషులయ్యారు.  

4, నవంబర్ 2017, శనివారం

మంత్రి కేటీఆర్ ధారణశక్తి – భండారు శ్రీనివాసరావు


తెలంగాణా మునిసిపల్ వ్యవహారాలు, ఐ.టీ. శాఖల మంత్రి శ్రీ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) బీబీసి తెలుగు ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. దాదాపు ముప్పయి నిమిషాల పాటు సాగింది. బీబీసి తరహాలోనే విలేకరుల బృందం ప్రశ్నలు సంధించింది. వాటికి కేటీఆర్ తనదయిన శైలిలో తడబాటు లేకుండా సమాధానాలు ఇచ్చారు. ఇందులో వింతేమీ లేదు. కాకపోతే చివర్లో ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ ఎప్పుడో ఏడాది క్రితం నేను ఫేస్ బుక్ లో రాసిన ఒక కధనాన్ని నా పేరుతొ సహా (ముమ్మారు) ప్రస్తావించడం నన్ను కొంత ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఇంటర్వ్యూ ను చూసిన టైమ్స్ ఆఫ్ ఇండియా సీనియర్ కరస్పాండెంట్, మిత్రుడు సుశీల్ రావు ఆ సంగతి నాకు తెలియచేశారు. ఢిల్లీలో బీబీసీ తెలుగు విభాగంలో పనిచేస్తున్న మరో మిత్రుడు శ్రీధర్ బాబు సంబంధిత లింక్ నాకు పంపారు. వారిద్దరికీ నా కృతజ్ఞతలు. కేటీఆర్ ధారణశక్తికి నమోవాకాలు.

2, నవంబర్ 2017, గురువారం

నవ్వండి! నవ్వించండి!! – భండారు శ్రీనివాసరావు

నిదానంగా చదవండి....... ఖచ్చితంగా నవ్వితీరుతారు మీ గురించి 5 మాటలు మీరు You You You You You You You You You You You You You You You You You You You.... 1. మీరు పరమ పరమ బద్ధకస్తులు ... ఎందుకంటే అన్ని You లను మీరు చదవలేదు.. 2. You ల మధ్యలో ఒక Yoo కూడా ఉంది. దాన్ని మీరు గమనించలేదు. 3 .జస్ట్ ఇప్పుడే మీరు Yoo కోసం వెతికారు. 4. మీ మొఖం ఎర్ర బడు తోంది.. అక్కడ Yoo లేదని... మీ గురించి 13 నిజాలు చెబుతాను.......... 1.మీరిప్పుడు మొబైల్ పట్టుకుని ఉన్నారు.... 2 మీరిప్పుడు whats up చూస్తున్నారు 3. whats up లో నా మెసేజ్ చదువుతున్నారు 4. ఈ నాలుగో వాక్యం ఇంతకు మునుపెప్పుడూ చదవలేదు 5. మీరు ఒక మనిషి 7. P ని మీరు మీపెదవులను కలపకుండా పలకలేరు 8. ఇప్పుడే దానిని మీరు ప్రయత్నించారు 9. మీలో మీరు చిన్నగా నవ్వుకుంటున్నారు 10.ఇప్పుడు మీ నవ్వు మరికాస్త ఎక్కువయ్యింది 11.మీరు 6 వ పాయింట్ చదవలేదు 12.ఇక్కడ 6 వ పాయింట్ లేదన్న విషయం మీకు ఇప్పుడే తెలిసింది. 13.మీరు ఇప్పుడు నవ్వుతున్నారు.. ఈ మెసేజ్ ని మీ ఫ్రెండ్స్ కి ఫార్వార్డ్ చేసి వాళ్ళని కూడా నవ్వించాలి.... అనుకుంటున్నారు... (నా లాగా) (అవునా? కాదా?)

(యధారీతి ఒక ఇంగ్లీష్ గల్పికకు స్వేచ్చానువాదం)

23, అక్టోబర్ 2017, సోమవారం

వార్తలపై పెత్తనం ఎవ్వరిది, సంపాదకుడిదా? యజమానిదా? – భండారు శ్రీనివాసరావు



పత్రిక యజమానికి తన పత్రిక గురించి ఆరా తీసే అధికారం ఉంటుందా?
ఇప్పటి రోజుల్లో అయితే ఇదొక ప్రశ్నే కాదు. ఆరా తీయడమేమిటి, వార్తలను  అదుపు చేసే అధికారం కూడా వుంటుంది.
అయితే ఇది ఇప్పటి విషయం కాదు. కొంచెం అటూ ఇటూగా  మూడు దశాబ్దాలు గడిచాయి.
అప్పటి ఆంద్రప్రభ దినపత్రికకు పొత్తూరి వెంకటేశ్వరరావు గారు ఎడిటర్.
విజయవాడలో రంగా హత్య దరిమిలా జరిగిన విధ్వంస కాండపై,  రామోజీరావు గారు చైర్మన్ గా ఉన్న ఎడిటర్స్ గిల్డ్  ఒక నిజనిర్ధారణ కమిటీ వేసింది. కుల్ దీప్ నాయర్,  చెన్నై ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఎడిటర్ జగన్నాధన్ తో  పాటు  ఆంధ్రప్రభ ఎడిటర్ హోదాలో పొత్తూరి వెంకటేశ్వర రావు గారు కూడా అందులో ఒక సభ్యులు.  పొత్తూరివారు విడిగా బెజవాడ వెళ్లి పరిస్తితులను పరిశీలించి   ఒక నివేదిక  పంపారు. అది ఎలా చేరిందో ఇండియన్ ఎక్స్ ప్రెస్   అధినేత రామనాద్ గోయంకాకు చేరింది. అది ఆయనకు రుచించినట్టు లేదు. వెంటనే వెంకటేశ్వర రావు గారికి ఒక లేఖ పంపారు. ‘మీ  నివేదిక నాకు దిగ్భ్రాంతితో కూడిన నిరుత్సాహాన్ని కలిగించింది’ (I am appalled with your report) అన్నది దాని సారాంశం. గోయంకా యజమాని. పొత్తూరి వారు ఆయన దగ్గర ఒక ఉద్యోగి. అయినా అలా ఉత్తరం రాయడం ఆయనకు నచ్చలేదు. వెంటనే నిరసనగా రాజీనామా లేఖ గోయంకాకు పంపించారు.
గోయంకా నుంచి పిలుపు వచ్చింది, మద్రాసు వస్తున్నాను అక్కడికి రమ్మని. పొత్తూరిగారు వెళ్ళారు.
 “నా ఎడిటర్ అభిప్రాయంతో విబేధించే స్వేచ్చ నాకు లేదా?” అని సూటిగా అడిగారు, రాజీనామా విషయం ప్రస్తావించకుండా గోయంకా. (Don’t I have the freedom to differ with my editor?)
ఇంకా ఇలా అన్నారు.
“మన పత్రికలో పాఠకుల ఉత్తరాలు ప్రచురిస్తాము కదా. పత్రిక విధానాలతో విబేధించే ఉత్తరాలు కూడా వేస్తుంటాం. యజమానిగా ఒక విషయం మీ దృష్టికి తెచ్చాను. అది మీకు నచ్చలేదు. సరే! ఒక సాధారణ పాఠకుడికి వుండే ఈ వెసులుబాటు కూడా ఒక యజమానిగా నాకు లేదా చెప్పండి”
ఇలాంటి యజమానికి ఏ సంపాదకుడు అయినా ఏం జవాబు చెబుతారు.
అందుకే గుంభనగా వుండిపోయారు. రాజీనామా విషయం పట్టుబట్టలేదు.
గోయంకానే స్వయంగా రాజీనామా లేఖ పొత్తూరి వారి చేతిలో పెట్టి సాదరంగా సాగనంపుతూ అన్నారు.
“మీరు ఎడిటర్ గా ఉన్నంత కాలం మీరు మీ అభిప్రాయాలనే రాస్తూ వుండండి”

17, అక్టోబర్ 2017, మంగళవారం

తీరు మారుతున్న పార్టీ మార్పిళ్లు


పార్టీ మార్పిడుల విషయంలో వార్తల స్క్రోలింగులు వారాల తరబడి సాగుతాయి ఇలా:
పార్టీ మారాలనే ఆలోచనలో పలానా
పార్టీ మారే విషయంలో ఒక నిర్ణయానికి వచ్చిన పలానా
పార్టీ మారుతున్నట్టు వచ్చిన వార్తలను ఖండించిన పలానా
తుది శ్వాస వరకు పార్టీలోనే కొనసాగుతానని  స్పష్టం చేసిన పలానా
పార్టీ అధినాయకత్వ తీరుపై అసహనం వ్యక్తం చేసిన పలానా
నియోజకవర్గ అభివృద్ధి కోసం అవసరమైతే తీవ్ర నిర్ణయాలు తప్పవంటున్న పలానా
అధికార పార్టీ అగ్రనేతతో సమావేశమైన పలానా
దీనికి రాజకీయ ప్రాధాన్యత లేదంటున్న పలానా
ఏ నిర్ణయమైనా కార్యకర్తలతో చర్చించి నిర్ణయిస్తానన్న పలానా
రేపోమాపో పార్టీ మారనున్న పలానా
పార్టీ మారి కొత్త కండువా కప్పుకున్న పలానా

( కొన్ని రోజుల పాటు వార్తల్లో ఉండడానికి ఇదొక కొత్త టెక్నిక్ అని గిట్టని వారి ఆరోపణ) 

14, అక్టోబర్ 2017, శనివారం

కేవలం తెలుసుకోవాలన్న జిజ్ఞాస మాత్రమే! – భండారు శ్రీనివాసరావు


మా బావగార్లలో ఇద్దరు శ్రీ అయితరాజు రామారావు (వల్లభి), శ్రీ కొలిపాక రామచంద్ర రావు (రెబ్బారం) స్వాతంత్ర ఉద్యమ కాలంలో ఖమ్మం జిల్లాలో బ్రిటిష్ వ్యతిరేక ఆందోళనలు నడిపి పద్నాలుగు మాసాలకు పైగా కఠిన  జైలు శిక్ష అనుభవించారు. మహాత్ముని బోధనలకు ప్రభావితులై తమ గ్రామాల్లో అంటరానితనాన్ని నిర్మూలించే విషయంలో గ్రామీణులను చైతన్య పరిచే కార్యక్రమాలు నిర్వహించేవారు. వున్నవాళ్ళు, లేనివాళ్ళు అనే తేడా లేకుండా వూరివాళ్ళతో రోజంతా తిరిగొచ్చి మళ్ళీ ఇంట్లో అనుష్టానాలు చేసేవాళ్ళు. అన్ని కులాలవాళ్ళు వాళ్ళ ఇళ్ళల్లో స్వేచ్చగా మసిలేవాళ్ళు. భోజనాలు చేసేవాళ్ళు. అందరూ వాళ్ళది కాంగ్రెస్ మడి’ అనే వాళ్ళు. పెద్ద బావగారు అయితరాజు రామారావు గారు  వాళ్ళ వూరు వల్లభిలో ఏకంగా ఒక హరిజనుడిని రామాలయ పూజారిగా నియమించారు. ఆ రోజుల్లో అదొక సంచలన వార్త.  మా నాన్నగారు మా వూరు కంభంపాడు  కరణం. ఆయన దగ్గర పనిచేసే వెట్టి వాళ్ళు ఇంట్లోకి రాకుండా ఇంటి ముందు వాళ్ళకోసం ఒక చావిడి లాంటిది వుండేది. ఆయన మరణించిన తర్వాత కరణీకం బాధ్యతలు స్వీకరించిన మా మూడో అన్నయ్య భండారు వెంకటేశ్వరరావు చేసిన మొట్టమొదటి పని ఆ చావిడిని నేలమట్టం చేసి వెట్టివారిని ఇంట్లో తిరిగేలా చేయడం. వూళ్ళో నిరసన వెల్లువెత్తినా మా అన్నయ్య లెక్కచేయలేదు. ఆయన చనిపోయిన రోజు ఊళ్ళోని దళితులందరూ    ఆడామగా తేడా లేకుండా దహన సంస్కారాల్లో పాల్గొన్నారు.  
“అంటరానివాడు, అని మీరు అనుకుంటున్నవాడు, అంటుకున్నాడో, ఇక ఆరని మంటే” అని మా పెద్దన్నయ్య కీర్తిశేషులు భండారు పర్వతాల రావు గారు ఏకంగా  ఒక కవితలో రాశారు.
ఈ నేపధ్యం వుంది కాబట్టి వివిధ రాజకీయ పార్టీల్లో నాయకులను ఒక ప్రశ్న అడుగుతూ వచ్చాను, మహాత్మా గాంధి వారిని ఉద్దేశించి పెట్టిన పేరు ‘హరిజన్’ అనే పేరు ఎందుకు మార్చారని. అసలా పదం వాడకూడదు, వారిని SC లుగా మాత్రమే వార్తల్లో పేర్కొనాలని రేడియోలో పనిచేసేటప్పుడు తెలుసుకుని ఆశ్చర్య పోయాను. నిజంగా ‘హరిజన్’ అనేది నిషేధిత పదమా! అందులో ఏదైనా మతానికి సంబంధించిన అన్వయం నాటి పాలకులకి స్పురించి అలా చేశారా అనే అనుమానం ఇప్పటికీ తీరలేదు. వారి నుంచి సంతృప్తికరమైన సమాధానం ఇంతవరకు లభించలేదు.
నా పోస్టులను ఫాలో అయ్యేవారు ఒక విషయాన్ని గమనించే వుంటారనే నమ్మకంతో ఇది రాస్తున్నాను. సాధ్యమైనంతవరకు, ఎంతో అవసరమైన సందర్భాలలో తప్ప నేను కులాలు, మతాల ప్రసక్తి తీసుకురాను. ఫేస్ బుక్ అనేది అయినా ‘మనుషుల నడుమ మతాల గళ్ళు, కులాల  ముళ్ళు లేని ప్రపంచంగా’ వుంటే బాగుటుందని, ఇందులో విహరించే కాస్త సమయంలో అయినా వాటికి అతీతంగా వుంటే ఇంకా ఎంతో హాయిగా ఉంటుందని భావించే అనేకమందిలో నేనొకడిని.

ఇది చరిత్ర రికార్డుకు అవసరమయ్యే అంశం కాబట్టి, కేవలం తెలుసుకోవాలనే జిజ్ఞాసతో నా సందేహం తీర్చాలని కోరుకుంటున్నాను.