15, జులై 2017, శనివారం

ద్రాస్త్విచ్ కగ్జిలా


నాకే విచిత్రం అనిపించింది నా జ్ఞాపక శక్తి చూసి. రాత్రి తిన్న కూర ఏమిటంటే బుర్ర తడుముకుండే పరిస్తితి నాది. అలాంటిది .....
పాతికేళ్ళు దాటిందేమో చూసి, నిన్న ప్రెస్ క్లబ్ లో అమర్ తో కనబడ్డాడు. ‘తెలుసు కదా మన...’ అని అమర్ అనేలోగా  నేనే ముందుగా “ద్రాస్త్విచ్ కగ్జిలా నరేందర్” అనేశాను. అతడూ వెంటనే “ఎలా వున్నారు శ్రీనివాసరావు గారూ” అంటూ పలకరించాడు.
నరేందర్ అంటే గూడవల్లి నరేంద్రనాథ్. ఢిల్లీ ఎం.డీ.టీ.వీ. ఛానల్లో సీనియర్ ఫోటోగ్రాఫర్. రిటైర్ అయిన తరువాత కూడా ఆ టీవీ లోనే పనిచేస్తున్నాడు. గూడవల్లి నాగేశ్వర రావుగారి అబ్బాయి. సోవియట్ యూనియన్ అయిదోతనం కోల్పోకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇస్కస్ (ఇండో సోవియట్ కల్చరల్ సంస్థ) కు గూడవల్లి నాగేశ్వర రావు గారు కర్తాకర్మా క్రియా అన్నీను. నేను మాస్కో రేడియోలో పనిచేస్తున్న రోజుల్లో ఈ సంస్థ తరపున అనేకమంది మాస్కో వచ్చిపోతుండేవాళ్ళు. అలా వచ్చిన వాళ్ళలో అక్కడ భోజన వ్యవహారాలు సరిగా ఇమడక ఏదో ఇంత సాంబారు, పెరుగన్నం తినడానికి మా ఇంటికి వస్తుండేవారు. నరేందర్ మాస్కోలోనే చదువుకుని ఇండియా తిరిగి వచ్చిన తరువాత ఢిల్లీలో ఉద్యోగం చేస్తుండేవాడు. అలనాటి పరిచయం మాది. మళ్ళీ ఇనాల్టికి ఇలా తటస్థ పడ్డాడు. నరేందర్ మంచి మిత్రుడు. కాబట్టే తిరుపతి వెళ్లి వచ్చి చప్పున గుర్తు పట్టడానికి వీల్లేకుండా ఉన్న నన్ను వెంటనే పోల్చుకోగలిగాడు.



సరే ఈ కగ్జిలా ఏమిటంటారా!    
మాస్కోలో వుండగా మాస్కో రేడియో వాళ్ళు నాకు రష్యన్ నేర్పడానికి ప్రత్యేకంగా ఒక టీచర్ ని పెట్టారు. ఆవిడ వారానికోసారి మా ఇంటికి వచ్చి మా ఆవిడ చేసిపెట్టే తెలుగు చిరుతిండ్లు తింటూ, మరో పక్క నాకు  రష్యన్ పాఠాలు చెప్పేది. ఏతావాతా జరిగిందేమిటంటే, ఆవిడ పుణ్యమా అని  నాకు నాలుగు తడిపొడి రష్యన్ మాటలు పట్టుపడ్డాయి, ఆవిడేమో ఎంచక్కా తెలుగు నేర్చుకుని చక్కాపోయింది.
ఆ పొడి మాటల్లో ఒకటి  ‘కగ్జిలా’. అంటే హౌ ఆర్ యు? (ఎలా వున్నారు?)        


14, జులై 2017, శుక్రవారం

బదరీ కేదార్ యాత్ర – ఏడో భాగం (1996) – కొమరగిరి అన్నపూర్ణ


ఇంకా నాలుగు కిలోమీటర్లు వెళ్లాలన్నారు. వర్షం ఆగడం లేదు. చలి దుర్భరంగా వుంది. మేమంతా దుప్పట్లు కప్పుకుని కూర్చున్నాం. భారతి బాధ చూడలేకపోయాం. ఒక  కిలోమీటరు ఉందనగా మళ్ళీ ఆపారు. అక్కడ కొండ నిటారుగా వుంది. డోలీవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడం కష్టంగా వుంది. తొందరగా గదికి చేర్చమని భాష రాకున్నా సైగలతో చెప్పాం. వాళ్లకు అర్ధం అయినట్టు వుంది. పైగా ఇలాంటి ప్రయాణాల్లో అనుభవం కూడా వుంది. మా కష్టం చూసి వాళ్ళు, తమ కష్టాన్ని లెక్కచేయకుండా త్వరత్వరగా కేదార్  లో ఒక గూటికి చేర్చారు. ఐతే ఈ హడావిడిలో గైడు చెప్పిన గదికి కాకుండా మరో దాంట్లో దింపాడు. అందులో మూడు మంచాలు వున్నాయి. భారతిని ఒక మంచంపై పడుకోబెట్టి పరుపు కప్పారు. మేం దారిలో బాగానే వున్నాం కానీ డోలీ దిగేసరికి చలి వెన్నులోనుంచి పుట్టుకొచ్చింది. మా సామాను ఏమైందో తెలియదు. మా వాళ్ళు ఏమైనారో తెలియదు.  పరుపు పైన కప్పుకుని పడుకున్నాము. భారతిని ఏడవకే అని చెబుదామంటే మాట పెగలడం లేదు. నోట్లో మాట బయటకి రావడం లేదు. భగవంతుడా నీదే భారం అనుకున్నాము. గజేంద్ర మోక్షంలో పద్యం జ్ఞాపకం వచ్చింది.
‘లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె ప్రాణంబులున్
ఠావులు తప్పెను  మూర్చ వచ్చె తనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్
నీవే తప్ప ఇతః పరంబెరుగ మన్నించదగున్ దీనునిన్
రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా”
ఇప్పుడు మాదీ అదే పరిస్తితి. ఆయన తప్ప వేరే దిక్కులేదు. మాయదారి మల్లిగాడు సినిమాలో చెప్పినట్టు ‘ఆయన మీదే భారం వేసి వచ్చాం. కాబట్టి చచ్చినట్టు వస్తాడురా దేవుడు’ అనే మొండి ధైర్యం వచ్చి అలాగే కూర్చున్నాము. నిజంగా తలచుకున్నట్టే వచ్చాడు భగవంతుడు స్వర్ణ, సురేష్ ల రూపంలో. మిగిలినవాళ్ళు కూడా వర్షంలో తడిసి గుర్రాల మీద మేమున్న చోటికి చేరుకున్నారు. వాళ్ళను చూడగానే ప్రాణాలు లేచివచ్చాయి. డోలీ వాళ్ళు మమ్మల్ని దింపాల్సిన చోట కాక వేరే చోట దింపారు. మేం ఏమయ్యామో అని వాళ్ళు ఓపక్క చలికి ఒణికిపోతూనే తెగ కంగారు పడుతున్నారు. మమ్మల్ని చూసి వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు. ఈ లోగా పొద్దుగుంకింది. చలి తీవ్రత మరింత పెరిగింది. చేతులు ఎలా కొంకర్లు పోయాయంటే పొయ్యిలో చేయి పెట్టినా స్పర్స తెలిసేట్టు లేదు. పరుపులు కప్పుకుని పడుకున్నాం కానీ పాడు చలి వాటిల్లోకి కూడా దూరి ఒణికిస్తోంది.

మా పరిస్తితి చూసి వాళ్ళు కంగారు పడ్డారు. వాళ్ళేమో పిల్లవాళ్ళు. పెద్దవాళ్ళ పరిస్తితి చూస్తే ఇలావుంది. అలాగే పడుకున్నాం. ఆశ్చర్యం అలాగే నిద్రపోయాం. శారీరక, భౌతిక ఇబ్బందులను మత్తులా మరిపించే శక్తి ఒక్క నిద్రాదేవతకు మాత్రమే ఉందేమో! (ఇంకా వుంది)         

12, జులై 2017, బుధవారం

పుట్టింట్లో రెండు గంటలు

రోజూ ఎన్ని టీవీ చర్చలకు వెళ్ళినా ఆలిండియా రేడియో రికార్డింగ్ కు వెళ్ళడంలో కిక్కే వేరప్పా. ఏవిటో ఫేస్ బుక్ భాష అలవడుతున్నట్టుంది కాబోలు. ఎంతయినా   నా వృత్తి జీవితంలో రేడియో నా పుట్టిల్లు. అటూ ఇటూగా ముప్పయ్యేళ్ళ అనుబంధం. 1975 నవంబరు 14 న అందులో  మొదటిసారి కుడికాలు మోపాను. పుట్టింటి ఆరాటం అంటే ఏమిటో ఈరోజు ఆకాశవాణికి వెళ్ళినప్పుడు అర్ధం అయింది.   రిటైర్ అయి అడుగు బయట పెట్టి పుష్కర కాలం దాటింది కానీ బయట వాచ్ మన్ల దగ్గర నుంచి అక్కడ పనిచేస్తున్న డ్యూటీ ఆఫీసర్లు, ఇంజినీర్లు, ప్రోగ్రాం అధికారులు, అన్ని విభాగాల సిబ్బంది గుర్తుపట్టి ఆప్యాయంగా పలకరించడం, యోగక్షేమాలు ఆరా తీయడం చాలా సంతోషాన్ని కలిగించింది. ఇక మా ప్రాంతీయ వార్తా విభాగం సిబ్బంది సంగతి చెప్పక్కరలేదు. ఎవర్నీ కాదనలేక ఎన్ని సార్లు, ఎన్ని టీలు తాగానో లెక్కేలేదు.  దీనికంతటికీ కారణం రేడియోలో తెలుగు ప్రసంగాలు చూసే అధికారి సీతారాంబాబు  మొన్నీమధ్య ఫోను చేసి ‘సాంఘిక మాధ్యమాల మంచీ చెడుల’పై ఒక ప్రసంగవ్యాసం రాయాలని కోరారు. ఈరోజు సాయంత్రం రికార్డింగ్ అన్నారు. మళ్ళీ ఒక్కసారి పాత పరిచయస్తులని పలకరించే అవకాశం దొరికిందని ఆనందంగా వెళ్లాను. ఒకప్పుడు నేను పనిచేసినప్పుడు అచ్చు ప్రభుత్వ కార్యాలయం మాదిరిగా ఉన్న అదే ఆఫీసు ఇప్పుడు కార్పొరేట్ హంగుల్ని సమకూర్చుకుంది. మా న్యూస్ రూమ్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.  అంతా డిజిటలైజ్ చేసారు. ప్రసారం అయిన ప్రతి బులెటిన్  ని  ఏ.ఐ.ఆర్. వెబ్ సైట్ లోకి అప్ లోడ్ చేస్తున్నారు. ఏవిటో,  అందరూ వినే రోజుల్లో ఈ భోగాలు లేవు.

అనుకున్నట్టే చాలామంది కలిశారు. ఇన్నేళ్ళ తరువాత గుర్తు పట్టి పలకరించిన వారి సౌహార్ధతకు ధన్యవాదాలు చెప్పడం తప్ప ఏం చేయగలను?    

11, జులై 2017, మంగళవారం

అన్నయ్య గొప్పతనం మరోమారు తెలిసింది – భండారు శ్రీనివాసరావు


మహాత్ములు, స్వాములు తమ అనుగ్రహ భాషణల్లో సాధారణంగా ఆ సర్వేశ్వరుడిని తప్ప  మనుష్యమాత్రుల్ని ప్రశంసించడం జరగదని నా విశ్వాసం. తమ ధార్మిక సేవా కార్యక్రమాలకు అండదండలకొసం కొండొకచో రాజుల్ని, పాలకుల్ని పొగడడం కొత్తేమీ కాదు. అలాంటిది చనిపోయిన ఒక వ్యక్తిని, అందునా కేవలం వివేకసంపద మినహా ఏవిధమైన లౌకిక బాహ్య సంపదలను కూడబెట్టుకోకుండా ఈ లోకం నుంచి సెలవు తీసుకున్న వ్యక్తిని ఒక బహిరంగ సమావేశంలో బాహాటంగా ఒక ఆధ్యాత్మిక గురువు అదేపనిగా ప్రశంసించిన సందర్భాన్ని నేనెరుగను. ఆ వ్యక్తి మా పెద్దన్నయ్య భండారు పర్వతాలరావు గారు కావడం మా కుటుంబం చేసుకున్న పూర్వజన్మ సుకృతం. ఇంకేమీ కాదు.
దీనికి ముందు ఒక విషయం గురించి చెప్పుకోవాలి. మా అన్నయ్య తాను  జీవించి ఉన్నకాలంలో ఎంతో శ్రమకోర్చి, అనేక ప్రాంతాలు తిరిగి, కొండలు కోనల్లో ఉన్న అనేక నారసింహ క్షేత్రాలను సందర్శించి, ఆ క్షేత్రాల ప్రాశస్త్యాన్ని స్వయంగా అధ్యయనం చేసి కంప్యూటర్ల సాయం లేకుండా కేవలం చేతి రాతతో ఏడు సంపుటాలను ‘ఓం నమో శ్రీ నారసింహాయ’ అనే పేరుతొ రచించారు. వాటిల్లో మొదటి మూడు ప్రచురణకు నోచుకున్నాయి. మిగిలిన ఏడింటిని శ్రీ కే.ఆర్. పరమహంస గారు,  మిత్రవాత్యల్యంతో డిజిటలైజ్ చేయించి   నెట్లో భద్రపరిచారు. 
ఆ నాలుగు సంపుటాలను మా అన్నయ్య కుమార్తె కొలిపాక కృష్ణ వేణి పుస్తక రూపంలోకి తీసుకు వచ్చింది. వాటిని ఎలాటి లాభాపేక్ష లేకుండా, ఆధ్యాత్మిక భావాలు కలిగిన వారికి, ఆసక్తి ఉన్న వారికి ఉచితంగా అందచేయాలని సంకల్పించింది. ఆమె సంకల్పానికి భర్త కొలిపాక రమేష్  కుమార్ సహకారం తోడవడంతో అనుకున్న కొద్దిరోజుల్లోనే నిర్విఘ్నంగా ప్రచురణ కార్యక్రమం పూర్తయింది. 

ఈలోగా అనుకోని ఒక విశేషం జరిగింది. మా అన్నగారి కుటుంబానికి పూజ్యులు అయిన శ్రీధర్ గురూజీ హైదరాబాదు వస్తున్నట్టు తెలిసి వారి శిష్యులను సంప్రదించారు. గురూజీ కూడా నరసింహోపాసకులు. ఆయన పాల్గొనే ఆ కార్యక్రమానికి నరసింహ భక్తులు అనేక మంది వస్తారు కాబట్టి గ్రంధావిష్కరణ అక్కడే చేయడం సముచితంగా ఉంటుందని ముంబైలో ఉంటున్న మా అన్నయ్య కుమారుడు రాఘవరావు అందుకు తగిన ఏర్పాట్లు చేసాడు. గురూజీ శిష్యులలో ఒకరయిన వడ్డాది వారి సహకారంతో గ్రందావిష్కరణకు గురూజీ అంగీకరించారు.
నిన్న (మంగళవారం) సాయంత్రం హైదరాబాదులోని ఆర్టీసీ కళా మండపంలో ఈ కార్యక్రమం జరిగింది. మేమెవరం ఊహించని విధంగా గురూజీ గ్రందావిష్కరణకి పెద్ద పీట వేసి ఆ సాయంత్రం యావత్ కార్యక్రమాన్ని దానితోనే ప్రారంభించారు. సభికులతో కిక్కిరిసిన ఆడిటోరియంలో గురూజీ చేసిన ఇంగ్లీష్ లో చేసిన ఉపన్యాసాన్ని మా రెండో అన్నయ్య భండారు రామచంద్ర రావు సంగ్రహంగా ఇలా పేర్కొన్నారు.
For  full  20 minutes, Sridhar  Guruji, spoke  about  Annayya  (BHANDARU PARVATALA RAO) in a largely  attended  meeting. He started his speech  like this.....
‘Normally we will  start  any  pravachanam  by  invoking  Lord  Ganesha. Today I will start with  mentioning  about  a great, good, knowledgeable  and highly  simple and dear friend Parvatalarao’  Like  this  he spoke  for 20 minutes, paying  glorious  tributes to Annayya. We were all deeply  touched.” - B.Ramachandra Rao
మా అన్నయ్య కుమారుడు సుభాష్ చంద్ర బోస్ అన్నట్టు “ మా అన్నయ్య పుట్టిన కుటుంబంలో పుట్టిన మేము కూడా అదృష్ట వంతులం అయ్యాము”
భర్తృహరి సుభాషితాల్లో ఒకదాన్ని ఏనుగు లక్ష్మణ కవి ఇలా అనువదిస్తారు:
“విద్య యొసగును వినయంబు వినయంబునను 
బడయు పాత్రత పాత్రత వలన ధనము 
ధనము వలనను ధర్మంబు దాని వలన 
నైహికాముష్మిక సుఖంబు లందు నరుడు”
బాగా చదివే విద్యార్ధిని  ఒక క్లాసు చదవకుండానే పై క్లాసులోకి ప్రమోట్ చేసేవిధంగా, మా అన్నయ్య కూడా ‘పాత్రత వలన ధనము, ధనము వలన ధర్మంబు’ అనే పద్య పాదాన్ని తాకకుండానే (నిర్ధనుడు గానే) ‘నైహికాముష్మిక’ సుఖ ప్రాప్తి పొందాడు. ఇది సత్యం.    

                  

10, జులై 2017, సోమవారం

బదరీ కేదార్ యాత్ర (1996) ఆరో భాగం – కొమరగిరి అన్నపూర్ణ


మర్నాడు తెల్లవారుఝామున్నే లేచి స్నానాలు కానిచ్చి బస్సులో రుద్రప్రయాగ చేరుకున్నాము. అక్కడ మందాకినీ, అలకనంద నదులు కలుస్తాయి. కానీ అక్కడ నీళ్ళు ఇఘాలు. అంత చల్లటి నీళ్ళలో స్నానాలు కష్టమని శ్రీనగర్ లోనే ఆ కార్యక్రమం ముగించుకుని వచ్చాము కనుక నదిలో నీళ్ళు నెత్తిన చల్లుకున్నాము. బస్సు ఆగిన చోటునుంచి నది దగ్గరికి చేరుకోవడం కూడా కష్టం. ఇరుకు దారి. కాలు జారింది అంటే ఏకంగా నదిలో పడడమే. ఎట్లాగో అందరం చేతులు పట్టుకుని కిందికి దిగాము. యాభయ్ మెట్లు ఎక్కితే గంగాభవాని, శివాలయాలు వున్నాయి. అటునుంచే వెళ్లి బస్సు పట్టుకున్నాము. సాయంత్రం మళ్ళీ శ్రీనగర్ వెళ్లి పడుకున్నాము. మరుసటి రోజు కేదార్ ప్రయాణం.
ఉదయం ఎనిమిది గంటలకు గౌరీ కుండ్ చేరాము. అక్కడి వరకే బస్సు ప్రయాణం. తరువాత కాలినడక లేదా గుర్రాలపైనా కానీ డోలీలలో కానీ వెళ్ళాలి. ఒక్కొక్కళ్ళకు పదకొండువందల చొప్పున అయిదు డోలీలు, నాలుగువందల చొప్పున ఆరు గుర్రాలు మాట్లాడారు. పదకొండుగంటలకు అయిదుగురు అక్కచెల్లెళ్ళం అయిదు డోలీలు ఎక్కాం. మిగిలిన వాళ్ళు గుర్రాలు ఎక్కారు. డోలీలు ఉయ్యాల మాదిరిగా వున్నాయి. ముందర ఇద్దరు మనుషులు, వెనక ఇద్దరు పట్టుకుని మోస్తారు.
బయలుదేరేటప్పుడు పెద్ద చలి ఉంటుందనుకోలేదు. అంచేత అందరం చిన్న స్వెట్టర్లు వేసుకుని శాలువలు కప్పుకున్నాం. వర్షం పడుతుందని బస్సువాడు చెప్పడంతో రెయిన్ కోట్లు అద్దెకు తెచ్చారు. ఒక కిలోమీటరు వెళ్ళామో లేదో పెద్ద వర్షం పట్టుకుంది. మేము తడవలేదు కానీ ఒకటే ఈదురుగాలి. దారిలో అక్కడక్కడా చిన్న పందిర్లు ప్లాస్టిక్ షీట్లతో వేసుకుని టీ, కాఫీ, రొట్టెలు, బిస్కెట్ల వంటివి అమ్ముతున్నారు. అంతంత దూరాల్లో తోడు లేకుండా ఎలా వుండగలుగుతున్నారో. ఒక వైపు చూస్తే కళ్ళు తిరిగే లోయ. అందులో హోరుమని చప్పుడు చేస్తూ మందాకినీ నదీ ప్రవాహం. మరో వైపు ఆకాశాన్ని అంటే హిమాలయాలు. ఇరుకు దారి. వందలకొద్దీ గుర్రాలు, డోలీలు. కాలినడకన సాగిపోయే వందలాది మంది యాత్రీకులు. పైగా వాన, బురద, పెద్ద పెద్ద బండరాళ్ళు. ఏమాత్రం కాలుజారినా పాతాళంలో పడిపోవడమే. ఇక గుర్రాలు ఎలా తర్పీదు ఇచ్చారో కానీ, మెల్లగా దారి అంచున కొననుండి పోతుంటాయి. గుర్రాలకు, వాటిని తీసుకువెళ్ళే వాళ్లకు అలవాటు కావచ్చు కానీ యాత్రీకులకుకొత్త కదా! గుండెలు పీచు పీచుమంటూ వుంటాయి. డోలీల్లో కూర్చున్నామనే కానీ మా కాళ్ళూ చేతులూ చలికి వంకర్లు పోతున్నాయి. భారతికి కీళ్ళ నొప్పులు. చలికి అసలు తట్టుకోలేక గజగజా వణికి పోతోంది. భాష తెలియకపోయినా డోలీల వాళ్ళు దాన్ని మోసుకుపోయి దగ్గరలో ఒక పొయ్యి దగ్గర కూర్చోబెట్టి కాళ్ళూ చేతులూ కాపడం మొదలు పెట్టారు. అది చూసి ప్రేమకు, నాకూ భయం వేసింది. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. కేదార్ ప్రయాణం ఇప్పుడే మొదలయింది. ఇంకా చాలా దూరం పోవాలి. చలి ఇప్పుడే ఇలా వుంది. ముందు ముందు ఇంకా ఎలా వుంటుందో. పైగా ఇక్కడ అంతా ఎవరికి వారే. అందర్నీ కలుపుకుపోవడం వుండదు. మిగిలిన వాళ్ళ పరిస్తితి మనకు తెలియదు, మనం ఎలా ఉన్నామో వాళ్లకు తెలియదు. ఇంతలో సురేష్ గుర్రం మీద వస్తూ కనిపించాడు. మేము కేకలు పెడితే చూసి దగ్గరకు వచ్చాడు. వాడిని చూడగానే రవంత ధైర్యం వచ్చింది.
డోలీల వాళ్ళు వాన బాగా వుంటే ఆగడం, తగ్గితే బయలుదేరడం చేస్తున్నారు. ఆగినప్పుడల్లా భారతి చలి తట్టుకోలేక పోతోంది. మా పరిస్తితి అంతంత మాత్రంగానే వుంది. ఇంతలో రంగారావు గారు గుర్రం మీద వస్తూ కనిపించారు. ఆయన వచ్చి భారతికి కాళ్ళూ చేతులూ కాపడం పెట్టించి వేడి వేడి కాఫీ తాగించారు. ఈలోగా శారదక్కయ్య, సావిత్రి వస్తున్న డోలీలు కూడా వచ్చి ఆగాయి. అందరం కాఫీలు తాగి బయలుదేరాము.
వేడి కాఫీ కడుపులో పడేసరికి కాస్త కోలుకున్నాం. డోలీ నుంచి చూస్తె పర్వతశ్రేణులు, వాటిపై రకరకాల చెట్లు, పూలతో ప్రకృతి రమణీయంగా కనబడింది. వాన వచ్చినప్పుడు కొండ వారన ఆగడం, తగ్గగానే బయలుదేరడం ఇలా డోలీ వాళ్ళు ప్రయాణం సాగిస్తున్నారు. కొండరాళ్ళు విరిగి మీదపడే ప్రమాదం పొంచి వుందని తెలిసికూడా అందరూ అలా ప్రయాణం చేస్తూ వుండడం చూస్తే అంతా దైవ లీల అనిపించింది. అవన్నీ చూస్తుంటే, ‘జగతిపై పడవచ్చు జలరాశి కెరటాలు, మామూలు మేరకు ముడవలేక, ఎంత శ్రమనొందుచుంటివో స్వామి’’ అన్న జంధ్యాల పాపయ్య శాస్త్రిగారి (కరుణశ్రీ) పద్యం గుర్తుకు వచ్చింది. చూస్తుంటే, పైనుంచి కొండరాళ్ళు దొర్లి పడకుండా ఏదో దివ్య శక్తి చేతులతో ఆపుతున్నట్లే వుంది. (ఇంకా వుంది)

9, జులై 2017, ఆదివారం

బదరీ కేదార్ యాత్ర (1996)– ఐదో భాగం - కొమరగిరి అన్నపూర్ణ


ఋషీకేశ్ నుంచి హిమాలయాలు ప్రారంభం. అక్కడి నుండే ఘాట్ రోడ్డుపై ప్రయాణం మొదలు. కొంత దూరం పోయిన తరువాత చల్లటి మంచి నీళ్ళు దొరుకుతాయని ఒక చోట బస్సు ఆపారు. అందరం వెళ్లి వాటర్ బాటిల్స్ లో తెచ్చుకున్నాము. ఎండ తీక్షణంగానే వున్నా గాలి చల్లగానే వీస్తోంది. కనుక హాయిగానే వుంది. ఒక వైపు అగాధమైన లోయ. మరో వైపు ఆకాశాన్ని అంటే పర్వతాలు. బస్సులో చాలామంది తెలుగు వాళ్ళు వున్నారు. ఒకామె ‘తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి’ అంటుంటే ఆమె భర్త కాబోలు, మా వైపు చూపించి ‘ మామ్మగార్లు చూడు ఇంత వయస్సులో కూడా ఎలా హుషారుగా తిరుగుతున్నారో’ అని భార్యని మందలిస్తున్నాడు.
గైడు మాకు హిమాలయాలను చూపిస్తూ హిమాలయాల్లో పెద్దవీ, చిన్నవీ కలిపి మొత్తం లక్షా పదిహేనువందల పర్వతాలు వున్నాయని చెబుతుంటే ఆశ్చర్యం వేసింది. కాళిదాసు హిమాలయాలను మానదండం (రూళ్ళ కర్ర) గా వర్ణించాడు.
కొంత దూరం వెళ్ళిన తరువాత మళ్ళీ బస్సు ఆపారు. ‘ఇక్కడే భాగీరధి (గంగ), అలకనంద నదుల సంగమం వుంది వెళ్లి చూడండి అన్నాడు గైడు. అందరూ దిగి వెళ్లి నెత్తిన నీళ్ళు చల్లుకు వచ్చారు.  నేను, సావిత్రి కొంతదూరం వెళ్లి నడవలేక వెనక్కి వచ్చి బస్సులో కూర్చున్నాము. రంగడు సీసాలో నీళ్ళు తెచ్చిస్తే చల్లుకున్నాము.దాన్ని దేవా ప్రయాగ అంటారుట.
బస్సులో నుంచే సూర్యాస్తమయ దృశ్యాన్ని చూసాము. ఎంతో మనోహరంగా వుంది. మనకు దగ్గరలోనే సూర్యుడు
 అస్తమిస్తున్న అనుభూతి కలిగింది. ఘాట్ రోడ్డు ప్రయాణం భయంకరంగానే అనిపిస్తుంది, వెళ్లినంతసేపు. ఎట్లాగో భగవంతుని దయ వల్ల క్షేమంగా శ్రీనగర్ చేరాము.
కాశ్మీరు రాజధాని శ్రీనగర్, ఈ శ్రీనగర్ ఒకటి కాదు. ఇది వేరు. ఇక్కడ అందర్నీ ఒక సత్రంలో బస చేయించారు.
మా పదకొండు మందికీ విడిగా రెండు గదులు ఇచ్చారు. గదికి అయిదువందలు అద్దె. అందరం మొహాలు కడుక్కున్నాం. స్వర్ణ మర్నాటికి అందరికీ కావాల్సిన బట్టలు అవీ తీసి మడతలు పెట్టి సర్దిఉంచింది.  రాత్రంతా బస్సులో సరిగా నిద్ర పట్టలేదు. మళ్ళీ తెల్లవారు ఝామున్నే ప్రయాణం. డోలీలు, గుర్రాలు ఎక్కడం ఎల్లా అనేదాని మీదే చర్చ. గుర్రానికి అయిదువందలు, డోలీకయితే పదిహేనువందలుట. శారదక్కయ్య, సావిత్రి  గుర్రం ఎక్కడానికి భయపడుతున్నారు. రంగారావు గారు నవ్వుతూ ‘ మీరు గుర్రాలు ఎక్కి ఏమైనా అయితే మీ కొడుకులకు నేనేం సంధానం చెబుతాను,డబ్బు పొతే పోయింది డోలీలే ఎక్కిస్తాను’ అని అన్నాడు.

ఫలహారం చేసి, మజ్జిగ తాగి ఆ రాత్రి పడుకున్నాము. హాయిగా నిద్ర పోయాము. ఈ విధంగా నాలుగో రోజు ప్రయాణం ముగిసింది. (ఇంకా వుంది)

అవినీతి వేలం పాటలు తగ్గించాలి


నిన్న సాయంత్రం (శనివారం) మహా టీవీ ‘ఎడిటర్స్ టైం’ ప్రోగ్రాం లో మాట్లాడాలని పిలిచారు. ఫోన్ ఇన్ కాబట్టి బయటకు పోవాల్సిన పని లేదు, వర్క్ ఫ్రం హోం లాగా. మహా టీవీ ఎడిటర్ ఐ. వెంకట్రావు గారు, నేను, ఎప్పుడో నాలుగున్నర దశాబ్దాల క్రితం బెజవాడ ఆంద్రజ్యోతిలో కలిసి పనిచేసాము. నాపట్ల ఇప్పటికీ అప్పటి వాత్సల్యం చెక్కు చెదరలేదు. ఫేస్ బుక్ లో నేను రాసే వాటిని ఆయన శ్రద్ధగా చదువుతారు. ముందు కాసేపు ఆ విషయాలనే ప్రస్తావిస్తారు. ఇవ్వాళ మా పెద్దన్నయ్య పర్వతాల రావు గురించి రాసింది చదివినట్టున్నారు. ఆయనతోనే మా సంభాషణ మొదలయింది. ప్రభుత్వ ఉద్యోగంలో చేరకుండా వుంటే పర్వతాల రావుగారు తెలుగు ప్రజలు గర్వించే రచయిత అయ్యేవారనేది వెంకట్రావు గారి అభిప్రాయం.
తరువాత సంభాషణ రాజశేఖర రెడ్డి గారి ఆరోగ్య శ్రీ, ఫీజు రీ ఇంబర్స్ వైపు మళ్ళింది. ముఖ్యమంత్రులతో సాన్నిహిత్యం గురించి అడిగినప్పుడు నేను ‘వివరణ’గా చెప్పాను. ఆకాశవాణి విలేకరిగా ప్రభుత్వాధినేతలతో మంచి సంబంధాలు ఉండేవని, అయితే వారిలో అంజయ్య, చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి ఈ ముగ్గురితో వ్యక్తిగత పరిచయం ఎక్కువని, కారణం వారు చేపట్టిన కొన్ని కార్యక్రమాలు నాకు బాగా నచ్చడం వల్ల కావచ్చునని చెప్పాను. వైఎస్ తరువాత ఏర్పడ్డ ప్రభుత్వాలు ఆరోగ్య శ్రీ మొదలయిన పధకాలను యథాతధంగా కొనసాగించి ఉన్నట్టయితే ఈ సరికి తెలుగు రాష్ట్రాలలో అట్టడుగు ప్రజలు బాగుపడి వుండేవారన్నాను. ఇంజినీర్ అనిపించుకోవడం వల్ల బడుగువర్గాలకు చెందిన వారికి ఉద్యోగం వచ్చినా రాకపోయినా సమాజంలో వారి స్థాయి పెరిగి, వారిలో ఆత్మన్యూనతా భావం తగ్గిపోతుందని, ఈ పధకం వల్ల ఇతరత్రా లభించే లబ్దికంటే ఇది చాలా ముఖ్యమని అన్నాను. దీనికి ఉదాహరణలు ఇచ్చాను. ఇవన్నీ గతంలో నేను నా బ్లాగులో రాసుకున్నవే. అమల్లో కొన్ని లోపాలు వున్నాయని, పెద్ద పెద్ద ప్రాజెక్టులలో జరిగే అవినీతితో పోల్చినా, ఈ పధకాల వల్ల బడుగు,బలహీన వర్గాలకు జరిగే ప్రయోజనాలతో పోల్చి చూసుకుంటే వీటిల్లోని లొసుగులు చాలా స్వల్పమని చెప్పాను. తరువాత వచ్చిన ప్రభుత్వాలు ఈ పధకాలను సరిగా పట్టించుకోకపోవడం వల్ల పేద ప్రజలు బాగా నష్ట పోయారని అన్నాను.
తరువాత సహజంగానే టాపిక్ వై.ఎస్.ఆర్.సీ.పీ. ప్లీనరీ మీదకు మళ్ళింది. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రచురించిన అవినీతి చక్రవర్తి పుస్తకం ప్రస్తావన వచ్చింది. గతంలో జగన్ లక్ష కోట్ల అవినీతి గురించి విస్తృత ప్రచారం జరిగిందని, లక్ష కోట్లు, లక్ష కోట్లు అంటూ పదేపదే చెబుతూ పోవడంతో అదే నిజమని జనం నమ్మే పరిస్తితి వచ్చిందని, అంతిమంగా వేసిన చార్జి షీట్లలో పేర్కొన్న అవినీతి ఆ స్థాయిలో కనబడలేదని, ఇటువంటి ప్రచారాల వల్ల ప్రత్యర్ధి పార్టీలకు రాజకీయ ప్రయోజనం లభించవచ్చేమో కానీ ప్రజలకు రాజకీయ పార్టీల పట్ల ఏహ్యభావం పెంచుకునే అవకాశం ఉంటుందని అన్నాను. ఇప్పుడు వై.ఎస్.ఆర్.సీ.పీ. అదే పల్లవి ఎత్తుకుని చంద్రబాబును అవినీతి చక్రవర్తి గా అభివర్ణిస్తూ, గత మూడేళ్ళ కాలంలో ఆయన అవినీతి మూడుకోట్ల డెబ్బయి లక్షల స్థాయిలో వుందని సాక్ష్యాధారాలతో ఒక పుస్తకం వేసారని చెబుతూ, ఇలా అవినీతి లక్షల కొట్లలో జరుగుతున్నట్టు పై పాటలు పాడుతూ పరస్పర ఆరోపణలు చేసుకుంటూ పొతే ప్రజలకు రాజకీయ నాయకులు అంటేనే విరక్తి కలిగే ప్రమాదం ఉంటుందని, అది ప్రజాస్వామ్యానికి మేలు చేయదని చెప్పాను.
ఆంద్ర ప్రదేశ్ లో రెండు ప్రధాన పార్టీలు ఎదుటివారిని విమర్శలతో ఎండగట్టె క్రమంలో ముందుకు వెడుతున్నాయని, ప్లీనరీలో జగన్ పక్షం వాళ్ళు ‘చంద్ర నామస్మరణ’ చేస్తే, ప్లీనరీ వెలుపల టీడీపీ మంత్రులు మూకుమ్మడి ‘జగన్నామ స్మరణ’ చేసారని చెప్పాను.
(విచిత్రం ఏమిటంటే ఈ రోజు (ఆదివారం) ఉదయం TV-5 News Scan లో కూడా విజయ్ నారాయణ్ ఈ అంశాల మీదనే నా అభిప్రాయం అడిగారు. దాదాపు ఇదే మోస్తరు జవాబులు చెప్పాను)