7, మే 2017, ఆదివారం

సినిమాహాలు కాదది, దేవాలయం

‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు స్ట్రోక్ తగిలింది నాకు, సన్ స్ట్రోక్ లాగా.’ అన్నారు డైరెక్టర్ కే. విశ్వనాథ్, నేను సభ్యుడిగా ఉన్న వయోధిక పాత్రికేయ సంఘం వారు ఆయనకీ రోజు (07-05-2017) ఫిలిం ఛాంబర్ లో చేసిన సన్మాన సభలో మాట్లాడుతూ. నిజానికి ఈ కార్యక్రమంలో అత్యంత క్లుప్తంగా ప్రసంగించింది కూడా విశ్వనాద్ మాత్రమే. వరస సన్మాన పరంపరలతో, టీవీ ఇంటర్యూలతో తీరికలేని ఇటీవలి రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఆయన చెప్పిన మాటలివి. నిజంగానే ఆయనలో ఆ అలసట కానవచ్చింది.
శంకరాభరణం గురించి కూడా చెప్పారు.
“ఎవరో ఒకతను తాను ఆ సినిమా డజను సార్లు చూశానని అన్నాడు. అన్ని సార్లు చూడడానికి అందులో ఏముందని అడిగాను. ఏమోసారూ, ఆ సినిమాహాల్లో కూర్చుంటే దేవుడి గుడిలో వున్నట్టు అనిపిస్తుంది’ అన్నాడా కుర్రాడు. జన్మ ధన్యం అవడం  అంటే ఇదే కాబోలు”

చాలామంది చాలా మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ శ్రీ రోశయ్య, సినిమాహాలుకు వెళ్లి సినిమా చూడక దశాబ్దాలు గడిచాయని, విశ్వనాద్ సినిమా మాత్రం తప్పకుండా చూసేవాడినని చెప్పారు. 


(శ్రీ విశ్వనాద్ తో)
  

      

5, మే 2017, శుక్రవారం

జాతి తీర్పును సమర్ధించిన సుప్రీం

(PUBLISHED IN EDIT PAGE OF ANDHRA PRABHA DAILY ON 06-05-2017)

ఒక యువతిపై జరిగిన సామూహిక అత్యాచారం, హత్య కేసులో న్యాయస్థానంలో  విచారణ మొదలు కాకుండానే, ముద్దాయిలకి ఉరిశిక్ష వేయాలంటూ జాతి యావత్తు  ముక్తకంఠంతో తీర్మానించడం స్వతంత్ర భారతంలో నిజంగా ఒక అరుదయిన విషయమే. ఆ ఘోరకలికి పాల్పడినవారికి మరణదండన ఒక్కటే సరయిన శిక్ష అని ప్రజానీకమే తీర్పు ఇవ్వడం, ‘అత్యంత అరుదయిన కేసు’ అనే పేరుని కట్టబెట్టింది. ముద్దాయిల కిరాతక చర్య పట్ల ప్రజలు ఎంతగా చలించి పోయారనడానికి ఇదొక దృష్టాంతం. ఈ సంఘటన జరిగి అయిదేళ్ళయింది. 2012 డిసెంబరు 16  తేదీ రాత్రి భారత  రాజధాని ఢిల్లీలో జరిగిన పాశవిక కాండ మానవత్వానికే మాయని మచ్చగా మిగిలింది. ఈ కేసుపై  వివిధ కోర్టుల్లో సుదీర్ఘ విచారణ సాగిన  అనంతరం ఢిల్లీ హైకోర్టు ముద్దాయిలకు విధించిన ఉరిశిక్షను సుప్రీం కోర్టు నిన్న  ఖరారు చేయడంతో, గతంలో  జాతి ఇచ్చిన తీర్పును సుప్రీం సమర్ధించినట్టయింది.  
మనుషులు నరరూప రాక్షసులుగా ఎలా మారతారో, ఆ మారిన స్ధితిలో వాళ్ళు ఎంతటి ఘోరాలకు పాల్పడుతారో సకల దేశవాసులకు తెలిసివచ్చింది కూడా ఈ కేసు వివరాలు వెలువడిన తరువాతే.
ఈ సంఘటనలో మానాన్నీ, ప్రాణాన్నీ పోగొట్టుకున్న  యువతికి ఏమి న్యాయం జరిగిందో తెలియదు కానీ దేశంలోని ఆడపడుచులందరికీ ఊరట కలిగించే ఒక శాసనంమాత్రం  ఊపిరి పోసుకుంది.  నాకు తెలిసి దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత, ప్రజల ఒత్తిడి ఫలితంగా ఒక చట్టం రూపొందిన సందర్భం కూడా దే.  చట్టమే ‘నిర్భయ’.
ఆరుగురు కామాంధుల చేతికి చిక్కిన ఒక యువతి ఎటువంటి దుర్భర, దుస్సహ, శారీరక, మానసిక వేదనలకు గురైందన్న విషయం లోకానికి తెలిసివచ్చిన పదమూడు రోజుల తరువాత ఆ అనామికను మెరుగయిన చికిత్స కోసం సింగపూరు తరలించారు. అక్కడే  చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ఈ సంఘటన  పట్ల సభ్య సమాజం స్పందించిన తీరు జాతీయ, అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. ఐక్యరాజ్యసమితిని సైతం కదిలించింది. ఫలితంగా నాటి కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జే. ఎస్. వర్మ నేతృత్వంలో త్రిసభ్య విచారణ సంఘాన్ని ఏర్పాటు చేసింది. తన పరిశీలనకు వచ్చిన ఎనభయ్ వేలకు పైగా సలహాలు, సూచనలను పరిశీలించి నెలరోజులలోపునే  సంఘం తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.   మహిళల పట్ల లైంగిక పరమైన నేరాలు పెరిగిపోవడానికి మూల కారణం ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు వ్యవస్థల వైఫల్యంగా సంఘ సభ్యులు అభిప్రాయపడ్డారు.  కమిటీ నివేదికలో సుమారు తొంభయ్  శాతం సిఫారసులను గుదిగుచ్చి రూపొందించిన ఆర్దినెన్సుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడం, తదుపరి అది శాసనంగా చట్టసభల ఆమోదం పొందడం చకచకా జరిగిపోయాయి. అయితే ఆర్డినెన్స్ బిల్లు రూపం ధరించి, 2013 మార్చి 19 తేదీన   లోకసభ ఆమోదం పొందేనాటికే అందులో పొందుపరచిన అనేక అంశాలు పలు మార్పులకు గురయ్యాయి. నిర్భయ చట్టంతో ఇటువంటి హేయమైన సంఘటనలు పునరావృతం కావని ఆశించడం  వృధా అని ఈ అయిదేళ్ళ కాలంలో చోటుచేసుకుంటున్న అదే విధమైన పలు సంఘటనలు నిరూపించాయి. ఒక్క ఢిల్లీ కేసులో మినహా మరే సందర్భంలో కూడా కఠిన శిక్షలు పడిన  దాఖలా లేదు. ఢిల్లీ కేసు కూడా విచారణలు త్వరగా పూర్తయి, దోషులకు వెంటనే శిక్షలు పడతాయనే ఆశలపై నీళ్ళు చల్లింది. అలా అని ఈ నిర్భయ చట్టం వల్ల ఎలాటి ఉపయోగం లేదని కాదు. లైంగిక అత్యాచారాలకు పాల్పడే దుర్మార్గులు చట్టాలను లెక్కపెట్టే స్థితిలో వుండకపోవచ్చు కానీ, అత్యాచార బాధితులకు మాత్రం ఈ చట్టం కొంత ఊరట కలిగిస్తోంది. తమ మీద లైంగిక దాడులకు పాల్పడిన వారికి శిక్ష పడుతుందన్న భరోసా ఆ  అబలలకు  ఒకింత ఉపశమనాన్ని ఇస్తోంది. అన్నింటికీ మించి ప్రజల ఆకాంక్షల మేరకు ఒక శాసనం రూపొందడం అనేది ప్రజాస్వామ్యం సాధించిన  ఒక విజయం. అంతే కాకుండా, లైంగిక అత్యాచార బాధితులు సమాజం  దృష్టిలో మరిన్ని అవహేళనలకు గురికాకుండా అటువంటి వారిని అసలు పేర్లతో కాకుండా నిర్భయగా పిలవాలనే ఒక సంప్రదాయం అమల్లోకి వచ్చింది.
ఢిల్లీ నిర్భయకేసులో ఆరుగురు ముద్దాయిల్లో నలుగురికి (ఒక ముద్దాయి విచారణ జరుగుతూ వున్న  సమయంలోనే  జైల్లో  ఉరివేసుకుని చనిపోయాడు) ప్రత్యేక  న్యాయస్థానం మరణశిక్ష  విధించింది.  ఆరో  ముద్దాయి మైనర్’ (అల్ప వయస్కుడు) అన్న కారణంతో అతడ్ని మూడేళ్ళు జువనైల్ హోంలో ఉంచారు. ఈ శిక్షాకాలం పూర్తయి అతడు విడుదల అయ్యాడు కూడా. మైనర్ అనే ఒకే ఒక కారణంతో నేరశిక్షాస్మృతి ప్రకారం అతడికి మిగిలిన నేరస్తులతో పాటు శిక్ష వేయకుండా మూడేళ్ళ శిక్షతో సరిపుచ్చాల్సి వచ్చింది. అయితే ఇటువంటి నేర మనస్త్వత్వం కలిగిన వారిని, చట్టంలో వున్న లొసుగులను అడ్డం పెట్టుకుని విడుదల చేస్తే మరింత ప్రమాదకర పరిణామాలు  సంభవించే అవకాశం వుందని కొందరు సందేహాలు  వ్యక్తం చేశారు కూడా. విచారణా కాలంలో జైల్లో ఒక విదేశీ వార్తా సంస్థకు ముద్దాయిల్లో ఒకరు ఇచ్చిన ఇంటర్వ్యూ  ని బట్టి ఆ సందేహాలు నిజమయ్యే ప్రమాదం ఉందనిపిస్తోంది. ఆ యువతి బలాత్కారానికి సహకరించి వుంటే ఇంతటి విషమ పరిస్తితి ఆమెకు ఎదురయ్యేది కాదనిఅతడు చెప్పిన తీరు కరడు గట్టిన నేర ప్రవృత్తికి నిలువెత్తు సాక్ష్యం.
మూడేళ్ళ అనంతరం అల్పవయస్కుడి’   విడుదలను అడ్డుకుంటూ సుబ్రమణ్య స్వామి కోర్టుకు ఎక్కారు, కానీ న్యాయస్థానం ఆ అభ్యర్ధనను తిరస్కరించింది.
పిన్న వయస్కుడు అనే కారణంతో శిక్ష తప్పించుకుని దర్జాగా సమాజంలోకి తిరిగి అడుగుపెట్టిన అతగాడు చేసిన నేరం చిన్నదేమీ కాదు. ఆనాటి   సామూహిక మానభంగ పర్వంలో అతడూ ఒక భాగస్వామి. పైపెచ్చు,  నిస్సహాయ స్తితిలో వున్న ఆ  అభాగ్యురాలిని ఒక ఇనుప రాడుతో అతి క్రూరంగా, అత్యంత రాక్షసంగా హింసించిన పాపం అతడి ఖాతాలో వుంది. అయినా,  ‘అల్పవయస్కుడుఅనే కారణంతో చేసిన నేరానికి శిక్ష పడకుండా బయటపడగలిగాడు.
కోర్టు నిర్ణయం నిర్భయ  తలితండ్రులను నిరాశ పరచింది. నేరం జయించిందని, తామే పరాజితులమనిఆమె తల్లి ఆశాదేవి ఆవేదన వెలిబుచ్చారు. ఆమె బాధ సమంజసం  అనిపిస్తోంది. ( హతురాలి పేరు జ్యోతిసింగ్ అని ఆమె తల్లి ఆశాదేవే స్వయంగా వెల్లడించేవరకు ఎవరికీ ఆమె అసలు పేరు తెలవదు, మీడియాలో కూడా నిర్భయ అనే పేరే ప్రాచుర్యం పొందింది) మూడేళ్ళ జువెనైల్ హోం శిక్ష పూర్తిచేసుకున్న  ఆ బాల హంతకుడికి కొత్త జీవితం ప్రసాదించే పేరుతొ,  టైలరింగ్ షాపు పెట్టుకోవడానికి ఆర్ధిక సాయం అందించారు. ఆ షాపుకు  అవసరం అయ్యే  స్థలాన్ని కూడా అధికారులే సమకూర్చారు. అతడి పాత పేరును మార్చి కొత్త పేరు తగిలించారు. అతడు పాత జీవితం మరిచిపోయి కొత్త జీవితంలో స్థిర పడడానికి ఈ ఏర్పాటు. ఇదంతా వినడానికి బాగానే వుంది. పేర్లు మార్చినట్టు నేరస్తులను పూర్తిగా సంస్కరించగలిగితే అంతకంటే కోరుకునేది ఏమీ వుండదు. మనిషి వేష భాషలను మార్చినంత సులభంగా అతడి మనస్త్వత్వాన్ని మార్చడం అంత తేలికా అన్నదే ప్రశ్న. జైలు  ఇంటర్వ్యూలో ఒక ముద్దాయి చెప్పిన అభిప్రాయమే దీనికి సరయిన సమాధానం. ధర్మం ప్రకారం ఆ అల్ప వయస్కుడుకూడా మిగిలిన వారితో పాటు శిక్షార్హుడే. కానీ చట్టం చెప్పే న్యాయం వేరుగా వుంటుంది.    
కోర్టుల్లో న్యాయం  చట్టాన్ని బట్టి వుంటుంది. చట్టం మారితే దానికి తగ్గట్టుగా న్యాయం, దానికి తగ్గట్టుగా శిక్షలు  మారిపోతూ వుంటాయి. ధర్మం అనేది మారుతున్న కాలంతో ప్రమేయం లేకుండా స్థిరంగా మార్పు లేకుండా వుంటుంది.
అల్ప వయస్కులు నేర పూరిత మనస్త్వత్వం కలిగివుండరన్న అభిప్రాయం ఒకప్పుడు సరికావచ్చు. కానీ వారి మనస్సులను కలుషితం చేసే అనేక అవకాశాలు  చిన్న వయస్సునుంచే ప్రస్తుతం  అందుబాటులో ఉంటున్నాయి. గుప్పెట మూసివుంచాల్సిన అనేక సెక్స్ పరమైన సంగతులు, వారి గుప్పెట్లో ఉంటున్న సెల్ ఫోన్ల పుణ్యమా అని చిన్నతనం నుంచే వారికి కరతలామలకం. ఈ వెసులుబాట్లతో వారు పెడమార్గం పడుతున్నారన్న వాస్తవాలను మరిచిపోరాదు. అల్పవయస్కులు అయినంత మాత్రాన వారు ఇటువంటి హీనమైన లైంగిక కార్యకలాపాలకు పనికిరారు అని నిర్ధారణకు రావడానికి వీల్లేదు  అనడానికి  ఈ కేసులో శిక్ష తప్పించుకుంటున్న ఈ బాల నేరస్తుడే సాక్షి. 
తక్కువ వయస్సు కారణంగా శిక్షలు తప్పించుకునే పరిస్తితి ముందు ముందు కూడా కొనసాగితే అందువల్ల మరికొన్ని విషమ పరిణామాలు కూడా చోటుచేసుకునే ప్రమాదం పొంచి వుంటుంది. పిల్లల్ని చేరదీసి,  చిన్నతనం నుంచే ఉగ్రవాద శిక్షణ ఇచ్చే విదేశీ  సంస్థలు,  తప్పుడు సర్టిఫికేట్లతో వయస్సు తక్కువగా చూపించి, వారిచేత ఉగ్రవాద చర్యలు జరిపించే అవకాశాన్ని కూడా కొట్టివేయలేము. అటువంటి వారు ఒకవేళ పట్టు పడినా, ఈ చట్టాన్ని ఆసరాగా తీసుకుని, అనతి కాలంలోనే బయటపడి తమ కార్యకలాపాలను తిరిగి కొనసాగించే వీలుంటుంది.

వీటన్నిటినీ  దృష్టిలో  ఉంచుకుని ఆలోచిస్తే,   ప్రస్తుతం వున్న చట్టాలను తగువిధంగా సవరించుకోవాల్సిన అవసరాన్ని ఈ అల్పవయస్కుడివిడుదల వ్యవహారం  గుర్తు చేస్తోంది. (EOM)


4, మే 2017, గురువారం

ప్రభుత్వాలూ! ఆలోచించండి!


రైతుది ఒక విచిత్ర పరిస్తితి.
పండిన ఏడు ధర వుండదు. ఎండిన ఏడు ధర మాటే వుండదు. పంట పండినా, ఎండినా పండించే రైతు డొక్క నిండదు.
ఒకడు ఒక సినిమా తీస్తాడు, ఆడుతుంది. డబ్బులు కురుస్తాయి. అది చూసి మరొకడు అదే తరహా ఫిలిం తీస్తాడు. డబ్బాలు తిరిగొస్తాయి. కాస్త పలుకుబడి వుంటే వినోదపు పన్ను రద్దు రూపంలో సర్కార్లు ఆదుకుంటాయి. ప్రభుత్వాలకు రావాల్సిన మొత్తం వాళ్ళ ఖాతాల్లో జమవుతుంది.
అదే నిరుడు మంచి ధర వుందని అదే పంట వేసిన రైతుకు ధరలు లేక కన్నీరే మిగులుతుంది. కన్న పేగుతీపిని కూడా లక్ష్యపెట్టకుండా ఆరుగాలం కష్టించి పండించిన పంటనే కడుపుమండి తగలబెట్టుకుంటాడు. ఒడ్డున కూర్చుని తమాషా చూసే వాళ్ళు అలా చేయడం తగదంటారు. రైతును ఆదుకోవడంలో తమను మించినవాళ్లు లేరంటూ జబ్బలు విరుచుకుంటూ ప్రకటనలు చేస్తారు. వీలుంటే ప్రజలు కట్టిన పన్నుల నుంచి కొంత మొత్తం విదిలించి చేతులు దులుపుకుంటారు.       
ఇంతేనా! చేయాల్సింది ఇంకేమీ లేదా! ప్రతి ఏడు ఇదే తంతయితే కొన్నాళ్ళకు పాలకుల పట్ల ప్రజలకు  విశ్వాసం పోదా!
రెండు తెలుగు రాష్ట్రాల వ్యవసాయ  మార్కెట్లలో మిర్చికి ధరలేదు. మరి పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలో అంత ధర ఎందుకు వుంది. ఆ రాష్ట్రం మన దేశంలో ఉందా! పరాయి గడ్డపై ఉందా!
మిర్చికి ధర లేదు సరే! మరి వినియోగదారుడు షాపుల్లో కొనుక్కునే కారం ధర ఎందుకలా మండిపోతోంది! దీనికి జవాబు వుండదు.
పండించిన రైతుకు, దాన్ని వినియోగించే పౌరుడికీ దక్కని ‘ప్రయోజనం’ ఎవరికి దక్కుతోంది. జవాబు చెప్పడం కష్టమేమీ కాదు, దళారీలకు, వ్యాపారులకు. మరి అంతంత లాభాలు గడించేవారి నుంచి, ఇప్పటికే వసూలు చేస్తున్న పన్నులకు అదనంగా  ఎంతో కొంత మొత్తం ‘సెస్సు’ రూపంలో వసూలు చేసి, దానితో ఒక శ్రేయోనిధిని ఏర్పాటు చేసి, సరయిన ధర దొరకని రోజుల్లో రైతులను ఆదుకునే ప్రయత్నం చేయవచ్చు కదా!      

ప్రభుత్వాలూ! ఆలోచించండి!

తల్లులు మారరు


అరవై ఏళ్ళ క్రితం.
ఇంటి పెరట్లో చింతచెట్టు కింద నిలబడి చూపు సాగినంత మేర నిలబడి చూస్తుండేది మా అమ్మ. సెలవులకు వచ్చి తిరిగి వెళ్ళే నా వైపే ఆమె చూపు. వెనక్కి తిరిగి చూస్తానేమో అని ఆమె ఆరాటం. నేను వెళ్ళే కాలిబాట మలుపు తిరిగేవరకు ఆమె చూపు నా మీదే. మరోసారి నేను వచ్చేవరకు నా రూపు తన కళ్ళల్లో దాచుకోవాలనే  కోరిక కాబోలు.

మళ్ళీ ఇన్నేళ్ళకు అదే దృశ్యం మరో రూపంలో పునరావృతం. విదేశంలో ఉన్న మా పెద్దవాడు హైదరాబాదు వచ్చి కొన్ని రోజులు మాతో గడిపి తిరిగి వెడుతుంటే మా ఆవిడ కళ్ళల్లో అదే నీటి పొర. కిందకి వెళ్లి కారు ఎక్కించేవరకు కళ్ళార్పకుండా అవే చూపులు, రెప్ప వాలిస్తే కంటికి కనబడుతున్నది కనబడదేమో అన్న భయం కాబోలు.




3, మే 2017, బుధవారం

రోములో వున్నప్పుడు .....


రోమన్ లా వుండాలని సామెత. మన వాళ్లకు ఈ సామెత పిచ్చపిచ్చగా నచ్చేసినట్టు వుంది. అంచేత వాళ్ళు ఏదేశం వెడితే ఆ దేశపు అలవాట్లు తుచ తప్పకుండా పాటిస్తుంటారు.
రెండు రోజుల క్రితం అమెరికా నుంచి వచ్చిన మా పెద్దవాడితో కలిసి ఓ పెద్ద మాల్  కి వెళ్ళాము. పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులే  ఆ మాల్స్ కి మహారాజ పోషకులుగా అనిపించారు. బిల్లు చెల్లించే కౌంటర్ దగ్గర బాగా రద్దీగా వుంది. క్యూ పద్దతి పెద్దగా పట్టించుకున్న దాఖలా లేదు.
అది చూసి మావాడు చెప్పాడు.

“అమెరికాలో బయలుదేరినప్పుడు తోటి ప్రయాణీకులు, మినహాయింపు లేకుండా ప్రతి ఒక్కరూ క్యూ పద్దతి పాటించారు. ఒకరినొకరు తోసుకోకుండా, తాకకుండా చాలా మర్యాదగా వ్యవహరించారు. దుబాయ్  లో దిగిన తర్వాత కాస్త మార్పు కనిపించింది. క్యూ వున్నా ‘కాస్త తప్పుకోండి’ అనే రుబాబు బాబులు ఎక్కువయ్యారు. ఇక హైదరాబాదులో దిగగానే లగేజ్ కలక్షన్ దగ్గర అసలు రంగు బయట పడింది. ఎవరికి వారు హడావిడిగా పక్కవారిని తోసుకుంటూ సూటుకేసులు లాగేసుకుంటున్న ధోరణి చూస్తే, అమెరికాలో విమానం ఎక్కిన వాళ్ళు వీళ్ళేనా అనిపించింది” 

2, మే 2017, మంగళవారం

పీ ఎల్ 480 – ఓ పాత జ్ఞాపకం

అరవైయేళ్ళ క్రితం వార్తాపత్రికలు చదివే అలవాటు ఉన్న వారికి పీ ఎల్ 480 అనే పదంతో పరిచయం వుండేవుంటుంది. Public Law 480 అనే ఈ పధకం అమెరికన్ ప్రభుత్వానికి సంబంధించింది. 1954లో అప్పటి ప్రెసిడెంట్ ఐసెన్ హోవర్ హయాములో ఈ చట్టం అమల్లోకి వచ్చింది. వ్యవసాయ, వాణిజ్య అభివృద్ధి కోసం ఉద్దేశించిన ఈ పధకానికి 1961లో ప్రెసిడెంట్ జే.ఎఫ్. కెనెడీ, శాంతికోసం ఆహారం (Food for Peace) అనే కొత్త పేరు పెట్టారు.

ఆ రోజుల్లో అమెరికా నుంచి ఈ పధకం కింద దిగుమతి చేసుకున్న గోధుమలు, పాలపొడిని ఉచితంగా స్కూలు పిల్లలకు, గ్రామీణ పేదలకు పంపిణీ చేసేవారు. వీటిని కొందరు దళారీలు నల్ల బజారుకు తరలించి లక్షలు అక్రమంగా సంపాదించారు. కొందరు ఆ డబ్బుతో రాజకీయ రంగప్రవేశం చేసి అంచలంచెలుగా పైకి ఎదిగారు.
అమెరికా సదుద్దేశ్యంతో మొదలు పెట్టిన ఈ పధకం వల్ల నిజమైన లబ్ధిదారులకు ఏం ప్రయోజనం జరిగిందో లెక్కలు లేవు కాని, లాభం పొందాలని ప్రయత్నించినవారికి మాత్రం ఏమాత్రం నష్టం జరగలేదు.

ఆ రోజుల్లో మరో విషయం వింతగా చెప్పుకునేవారు. అమెరికాలో ధాన్యం దిగుబడి ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయిన సందర్భాలలో ధరలు పడిపోయి రైతులు నష్టపోకుండా,  గోధుమలను ఓడల్లో నింపి నడిసముద్రంలో పారబోసేవారని, ఇంకా మిగులు వుంటే ఇలా ఇటువంటి పధకాలతో పేద దేశాలకు సరఫరా చేసేవారని వార్తలు ప్రచారంలో ఉండేవి.      

30, ఏప్రిల్ 2017, ఆదివారం

ఇదేమిటబ్బా!


“ఎక్కడెక్కడి విషయాలు, ఎప్పటెప్పటివో సంగతులు రాస్తుంటారు, ఏం జ్ఞాపకశక్తండీ మీది” అంటుంటారు స్నేహితులు చాలామంది.
కానీ అందరికీ తెలియని విషయం ఏమిటంటే నాకు ఏదీ బొత్తిగా గుర్తుండదని.
“నేను రెండు మూడు ప్రశ్నలు అడుగుతాను, ఒకటి రెండింటికి సరయిన  జవాబులు చెబితే బాహుబలి సినిమాకు తీసుకు వెళ్ళమని నేను అడగను” అంటుంది మా ఆవిడ.
“కొస్చెన్ నెంబర్ వన్. రాత్రి మీరు భోజనంలో బాగుందని మెచ్చుకుంటూ తిన్న కూరేది? నెంబరు టూ ప్రశ్న. నిన్న మీరు బయటకు వెళ్ళేటప్పుడు వేసుకువెళ్ళిన చొక్కా కలరేమిటి? చెప్పగలరా! చెప్పలేరు. మీ మొహం చూస్తేనే తెలుస్తోంది, చెప్పలేరని. అయ్యొ సంబడం. జ్ఞాపక శక్తి అట, ఈయన్ని మించిన వాళ్ళు లేరట! మళ్ళీ అనకండి, విన్న జనం మొహాన్నే నవ్విపోతారు”

“అది సరే! ఇందాక అనగా వాకింగుకు పోతూ వేడి వేడి కాఫీ కలిపి పక్కన పెట్టి వెళ్లాను. వెడుతూ చెప్పాను కూడా, ఎప్పుడూ ఆ కంప్యూటరులో తల పెట్టి టిక్కూ టిక్కూ నొక్కడం కాదు, అప్పుడప్పుడూ బయట ప్రపంచంలో ఏం జరుగుతోంది గమనిస్తూ వుండాలని. కాఫీ వేడిగా వుంది, తాగమని చెప్పానా! చూడండి, చప్పగా చల్లారి పోయింది. ఇంతోసిదానికి అబ్బో వాళ్ళు మెచ్చుకున్నారు, వీళ్ళు మెచ్చుకున్నారంటూ ముసి ముసి నవ్వులు. మళ్ళీ కలుపుకు వస్తాను, ఈ సారయినా వేడిగా తాగండి”