15, జనవరి 2017, ఆదివారం

ఫేస్ బుక్కు కలిపింది ఇద్దరినీ...


ఆవిడ పేరు దుర్గ. బాండ్ జేమ్స్ బాండ్ మాదిరిగా దుర్గ, కనకదుర్గ.
ఆవిడ పేరు సీత.
ఓ యాభయ్ ఏళ్ళ క్రితం బెజవాడ గవర్నర్ పేట లో పాటిబండ అప్పారావు వారింట్లో అద్దెకు వుండేవాళ్ళు. మాంటిసొరీ స్కూల్లో ఆడుతూ పాడుతూ చడువుకుంటూ వుండేవాళ్ళు. ఆ ఇద్దరి స్నేహం  అంతా ఇంతా కాదు, చదువయినా, ఆటలయినా ఇద్దరూ కలిసే.
చదువు అయిపొయింది అని అనుకునే లోగా ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు అవడం షరా మామూలు. అల్లాగే  పెరిగి పెద్దయిన తరువాత జరిగిన పెళ్ళిళ్ళు చిన్నప్పటి స్నేహితులను విడదీశాయి. అప్పటి నుంచీ ఎక్కడా కలిసింది లేదు, ఎదురుపడ్డదీ లేదు. అలా యాభయ్ ఏళ్ళు గడిచిపోయాయి.
ఫేస్ బుక్ లో నా రాతలు, పెట్టే మా ఆవిడ  ఫోటోలు చూసి సీతగారికి మనసు మూలల్లో అనుమానం, తన చిన్ననాటి స్నేహితురాలు కాదు కదా! అని. అనుకోవడం తడవు వారి భర్త  గౌరవరం సుబ్బారావు గారి సహకారంతో ఫేస్ బుక్ లో నా నెంబరు పట్టుకుని ఈ సాయంత్రం ఫోను చేశారు. అంతే! చిన్నప్పటి స్నేహితురాండ్రు ఫోనుకు అతుక్కుపోయారు.
చిన్నతనంలో పాటిబండ వారి మేడపై తొక్కుడు బిళ్ళల ఆటలు,  అప్పారావు గారి భార్య తన పిల్లల్ని, అద్దెకు ఉండేవారి పిల్లల్ని చుట్టూ కూర్చోబెట్టుకుని గోరుముద్దలు తినిపించిన వైనాలు అన్నీ వారి ముచ్చట్ల నడుమ గిర్రున తిరిగాయి.
సుబ్బారావు గారితో నేనూ మాట్లాడాను. ఆయన ఎన్ ఎఫ్ సీ ఎల్ లో పని చేసి రిటైర్ అయ్యారు. భార్యాభర్తలు ఇద్దరూ సత్యసాయి భక్తులు. తరచుగా పుట్టపర్తి వెళ్లి సాయి ఆశ్రమంలో సేవలు చేస్తుంటారు.

ఏది ఏమైనా అరవై ఏళ్ళు దాటిన తరువాత మా ఆవిడకు ఒసేయ్, ఏమే అనే ఫ్రెండు దొరికింది. శుభం!    

14, జనవరి 2017, శనివారం

అమరుడు జంధ్యాల


ఈరోజు ఉదయం నుంచి వందల ఫోన్లు. సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పడం కోసం కాదు, ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన  జంధ్యాలపై నా  వ్యాసం గురించి.
ఇంతటి అభిమాన ధనం కూడబెట్టుకున్న జంధ్యాల అమరుడు. కాబట్టే ఇంతటి స్పందన.  
పోతన పద్యం గుర్తుకు వచ్చింది, ‘కమలాక్షునర్చించు కరములు కరములు, శ్రీనాధు వర్ణించు జిహ్వ జిహ్వ...’
జంధ్యాల గురించి రాయడం వల్లనే నా రచనకి ఇంతటి గుర్తింపు.
ఆంధ్రజ్యోతి సంపాదకవర్గానికి కృతజ్ఞతలు.

-భండారు శ్రీనివాసరావు      

9, జనవరి 2017, సోమవారం

జంధ్యాలకో నూలుపోగు


(PUBLISHED IN 'ANDHRA JYOTHY' TELUGU DAILY ON 14-01-2017, SATURDAY)
(జనవరి 14 జంధ్యాల జయంతి) 
జంధ్యాల వీర వేంకట దుర్గా శివ సుబ్రమణ్య శాస్త్రి. ఇంగ్లీష్ అక్షరాల్లో పొడి పొడిగా రాస్తే జే.వీ.డీ.ఎస్. శాస్త్రి. ఇంకా పొడి చేసి  క్లుప్తంగా  చేస్తే జంధ్యాల. 
మొదటి పొడుగాటి  పేరు బారసాలనాడు బియ్యంలో రాసి పెట్టింది. రెండోది, కాస్త పొట్టిపేరు, స్కూలు, కాలేజీ రికార్డుల్లో రాసుకున్నది. ముచ్చటగా మూడోది ‘జంధ్యాల’ అనే ‘కలం పేరు’ చిరస్థాయిగా  వెండి తెరపై స్థిరపడిపోయిన పేరు. తెలుగు హాస్యానికే వన్నె తెచ్చిన పేరు. అందుకే,  తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గూడుకట్టుకుని అలా  వుండిపోయింది.
ఈ భూమ్మీద పడ్డ ప్రతి బిడ్డా ఏడుస్తూనే కళ్ళు తెరుస్తుంది. 1951లో నరసాపురంలో  జంధ్యాల పుట్టినప్పుడు బొడ్డు కోసిన మంత్రసాని జాగ్రత్తగా గమనించి వుంటే, ఏడుస్తున్న ఆ పిల్లాడి పెదవుల నడుమ సన్నటి నవ్వుతెర కనిపించి వుండేదేమో.
జంధ్యాల  నాన్నగారు జంధ్యాల నారాయణమూర్తి బెజవాడలో పేరుమోసిన వ్యాపారి. అనేక జిల్లాలకు బుష్ రేడియో డీలరు. ఆ రోజుల్లో రేడియోలకి మంచి గిరాకి. అంచేత నారాయణ మూర్తిగారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వెలిగిపోయింది.
పుటకల నాటికే జంధ్యాల బంగారు పిచిక. బీసెంటు రోడ్డులో ఏడంతస్తుల భవనం.
(ఏడంటే ఏడు అనికాదు, పెద్ద భవనం అని కవి హృదయం. నిజంగానే చాలా  పెద్ద ఇల్లు. ఎదురుగా వున్న మోడరన్ కేఫ్ కంటే ఎత్తుగా వుండాలని నారాయణమూర్తిగారు ముచ్చట పడి కట్టించుకున్నారని ఆరోజులనాటి ముచ్చట) అది కట్టుకున్నాక వాళ్ళ నివాసం, క్షీరసాగర్  కంటి ఆసుపత్రి దగ్గర నుంచి బీసెంటు రోడ్డుకి మారింది.
మాచవరం ఎస్సారార్ కాలేజీలో మేము, అంటే జంధ్యాల, నేను ఒకే బెంచిలో కూర్చుని బీకాం చదువుతున్నట్టు నటిస్తున్నరోజుల్లో  కాలేజీ   ప్రిన్సిపాల్ తో సహా అయ్యవార్లందరూ సైకిళ్ళమీద కాలేజీకి వస్తుండేవారు.  మన జేవీడీఎస్ శాస్త్రి  మాత్రం, అంబాసిడర్ కారులో వెనక సీట్లో కూర్చుని  దర్జాగా వచ్చేవాడు. డ్రైవరు డోరు తెరిచి నిలబడితే కారు దిగి కాలేజీలో కాలు పెట్టే జంధ్యాలకు  ‘కారున్న కుర్రకారు’ అని పేరు పెట్టింది కూడా నేనే.
చదువులోనే కాకుండా  శాస్త్రి, ఇతర విషయాల్లో కూడా  ముందుండేవాడు. కాలేజీ కల్చరల్ అసోసియేషన్ కు ఆయనే మకుటంలేని కార్యదర్శి. కవితలు, గేయాలు గిలికే అలవాటున్న నాకు కూడా  ఆ మకుటంమీద కన్నుపడింది. వెనకాముందూ చూసుకోకుండా ఏకంగా  ఆయనపైనే  పోటీ చేశాను. అయితే ఆయన మకుటం గట్టిది, నేను కొట్టిన దెబ్బ ఓటిది అని ఇట్టే తేలిపోయింది. ఓడిపోతే పోయాను కానీ, ఆయనతో నా స్నేహం  గట్టిపడింది. ఆయన మిత్ర బృందంలో నాకూ స్థానం దొరికింది. ఇక ఆ మూడేళ్ళూ కలిసే తిరిగాము చదువయినా, సంధ్యయినా.


(జంధ్యాల కాలేజి రోజుల్లో ఫోటో)

జంధ్యాల రాసిన ‘సంధ్యారాగంలో శంఖారావం’  నాటకం రిహార్సల్స్  హనుమంతరాయ గ్రంధాలయంలో వేస్తుంటే  వెంట నేనూ  వుండేవాడిని,  ఏ వేషమూ వేయకపోయినా. ఏదో కవితలు గిలకడం వచ్చనే పేరు నాకూ వుండేది. దాంతో మా స్నేహం మరింత చిక్కబడింది. డిగ్రీ తరువాత మా దారులు వేరయ్యాయి. నేను ఆంధ్రజ్యోతిలో చేరాను. ఆయన కధ సినిమా మలుపులు తిరుగుతూ  చెన్నై చేరింది.
కట్ చేస్తే...
మద్రాసులో చందమామ రామారావు గారింట్లో ఒక ముందు గదిలో జంధ్యాల  అఫీసు తెరిచాడు. నేనొకసారి వెళ్లాను. గది బయట ‘జంధ్యాల, స్క్రిప్ట్ రైటర్’  అనే నేమ్ ప్లేటు. గదిలో ఒక మేజా బల్ల. దాని వెనుక  కుర్చీలో కూర్చుని రాసుకుంటున్న  జంధ్యాల అనే  జేవీడీఎస్ శాస్త్రి. వెనుకటి రోజుల్లోల్లా లేడు. మామూలుగానే మంచి ఛాయ కలిగిన మనిషి. కాకపోతే   జుట్టు కాస్త పలచబడింది.  మోహంలో నవ్వు, ఆ నవ్వులో అందం ఏమాత్రం చెక్కుచెదరలేదు. హాయిగా పలకరించాడు. హాయిగా కబుర్లు చెప్పుకున్నాము. హాయిగా నవ్వించాడు. హాయిగా నవ్వుకున్నాను. ఆ హాయి మనసంతా నింపుకుని బెజవాడ తిరిగొచ్చాను.
మళ్ళీ కట్ చేస్తే...
నేను బెజవాడ ఆంధ్రజ్యోతిని ఒదిలి, హైదరాబాదు రేడియోలో చేరాను. జంధ్యాల మద్రాసులో సినిమాల్లో బిజీ అయిపోయాడు. పదేళ్ళలో రెండువందల సినిమాలకు మాటలు రాశాడంటే ఎంతపని రాక్షసుడిగా మారివుండాలి!
ఒకసారి హైదరాబాదు వచ్చాడు. రేడియో స్టేషన్ కు వచ్చాడు. తన దర్శకత్వంలో మొదటి సినిమా ‘ముద్దమందారం’ తీస్తున్నట్టు చెప్పాడు. ఒక గ్రామ ఫోను రికార్డు ఇచ్చి తన సినిమా పాటలు రేడియోలో వచ్చేలా చేయడం కుదురుతుందేమో చూడమన్నాడు. ఎలాగూ వచ్చాడు కదా అని రేడియోలో ఇంటర్వ్యూ రికార్డు చేసాము. స్టేజి నాటకానికీ, రేడియో నాటకానికీ వుండే తేడా ఆయన అందులో విడమరచి చెప్పిన తీరు నన్ను విస్మయపరిచింది. నాకు తెలిసిన జంధ్యాల, ఇప్పుడు చూస్తున్న జంధ్యాల ఒకరేనా అనిపించింది. ఒకటి రెండు హోటళ్ళలో ఆయనకు పర్మనెంటు గదులు ఉండేవి. ఇంకోసారి కట్ చేస్తే...
ఓసారి ఢిల్లీలో కలిశాడు. హైదరాబాదుకు చెందిన ఓ లాయర్ తో కలిసి, నేనూ జ్వాలా  ఫైవ్ స్టార్ హోటల్లోని పుస్తకాల షాపులో తిరుగుతుంటే, తెలుగులో మాట్లాడుతున్న మమ్మల్ని గుర్తుపట్టి అదే హోటల్ ల్లోని తన గదికి తీసుకుపోయాడు.
గదికి వెళ్ళగానే, మాతో వచ్చిన లాయరు గారు ఎలాటి మొహమాటం లేకుండా, కొత్త చోటనికానీ, కొత్త మనిషని కానీ  సందేహించకుండా ఒకసారి మీ బాత్రూం వాడుకోవచ్చా అని అడుగుతూనే జవాబుకోసం ఎదురుచూడకుండా అందులో దూరిపోయి స్నానం చేసి బయటకు వచ్చారు. రావడం రావడమే ఆ గదిలో పరచిన తివాచీ పై తల కిందకు పెట్టి కాళ్ళు పైకి లేపి లిప్త మాత్రంలో శీర్షాసనంలో దర్శనమిచ్చారు. మా అందరికీ కళ్ళు తిరిగిపోయాయి. చిన్న తల, పెద్ద బొజ్జ, అంత భారీ కాయంతో ఆయన వేసిన ఈ ఆసనం చూసి జంధ్యాల కూడా నివ్వెర పోయారు.
తరువాత వారిరువురి నడుమ సాగిన కవి పండిత చర్చ విని తీరాలి. అప్పటికే  ‘శంకరాభరణం సినిమాకి సంభాషణలు సమకూర్చిన జంధ్యాల, విశ్వనాద్ గారిదే మరో సినిమా సప్తపదికి మాటలు రాస్తున్నాడు. అనేకానేక అంశాలను స్పృశిస్తూ జరిగిన సంభాషణ నిజానికి ఇద్దరు పండిత శ్రేష్ఠుల మధ్య జరిగే వాదోపవాదాన్ని తలపించింది. ఏమాత్రం స్వరం పెంచకుండా, ఎదుటివారి వాదాన్ని పూర్వపక్షం చేస్తూ ఒకర్ని మించి మరొకరు అక్షర లక్షలు చేసే తర్కవిన్యాసాలు ప్రదర్శించారు. సప్తపది సినిమా క్లైమాక్స్ లో ధర్మాధర్మ విచక్షణకు సంబంధించిన ఈ అంశాలలో  కొన్నింటిని   జంధ్యాల పొందుపరచినట్టున్నారు కూడా.
ఈ చర్చ సాగిన తీరు గమనిస్తే, నాకు కాలేజీలో తెలిసిన శాస్త్రి, ఇప్పుడు చూస్తున్న  ఈ జంధ్యాల, ఈ ఇద్దరూ  ఒకరేనా అన్న సందేహం కలిగింది. అంతటి పరిణతి ఆయనలో కనబడింది.
మరోసారి కట్ చేస్తే....
నా మకాం మాస్కోకి మారింది. జంధ్యాల  మద్రాసుకి అతుక్కుపోయాడు. క్షణం తీరిక లేని జీవితచట్రంలో ఒదుగుతూ, ఎదుగుతూ   ఏళ్ళతరబడి ఉండిపోయాడు. కధా చర్చలు జరపడం కోసం, రాసుకోవడం కోసం ఒకటి రెండు పెద్ద పెద్ద హోటళ్ళలో ఆయనకు పర్మనెంటు గదులు ఉండేవి. మాస్కో నుంచి   విశ్వప్రయత్నం చేస్తే  మద్రాసులో ఏదో ఒక అయిదు నక్షత్రాల హోటల్లో దొరికేవాడు. అంత దూరం నుంచి ఫోను చేస్తున్నందువల్లనో ఏమో, కాసింత తీరిక చేసుకుని లైన్లోకి వచ్చి మాట్లాడేవాడు. అప్పటికే ఆయన బిజీ డైరెక్టర్ల కోవలోకి చేరిపోయాడు.  మాస్కో థియేటర్లో శంకరాభరణం చూశానని చెబితే ఎంతో సంబరపడ్డాడు.  మాస్కో రమ్మని, అక్కడి మంచు వాతావరణంలో ఒక తెలుగు సినిమా తీయమని అనేక మార్లు చెప్పాను. రెండేళ్ళదాకా కొత్త సినిమాలు గురించి ఆలోచించే తీరుబాటు లేదని చెప్పేవాడు.
సోవియట్ యూనియన్ పతనానంతరం నేను హైదరాబాదు తిరిగి వచ్చిరేడియోలో చేరాను. జంధ్యాల మకాం కూడా చెన్నై నుంచి భాగ్యనగరానికే  మారింది. సినిమాల హడావిడి కొంత తగ్గినట్టు వుంది. ఎప్పుడయినా వెళ్లి కలిసినా తీరిగ్గానే కనిపించేవాడు.
తరువాత చాలా సార్లు కలుసుకున్నాము. భక్త రామదాసు ప్రాజెక్టు కోసం తరచూ ఖమ్మం వెడుతుండేవాడు. ఆయన కారులోనే అప్పుడప్పుడు ఖమ్మం వెళ్లి వస్తుండేవాణ్ని. దోవలో ఎన్నో జోకులు చెప్పేవాడు. చెప్పే సంగతులు మారేవి కానీ చెప్పే తీరులో మాత్రం తేడాలేదు.   
ఇరవైనాలుగు గంటలు బిజీ బిజీగా అనేక సంవత్సరాలు గడిపిన మనిషి ఖాళీగా వుండడం ఎంత బాధాకరంగా  వుంటుందో ఎప్పుడూ నవ్వుతుండే ఆయన మోహంలో అప్పుడప్పుడూ లీలగా కానవచ్చేది.
నిండు నూరేళ్ళ జీవితం అనుకుంటే జంధ్యాల బతికింది యాభయ్ యేళ్ళే. కానయితేనేమి నూరేళ్ళకు సరిపడా  నవ్వులు నలుగురికీ పంచి పెట్టిపోయాడు.
ఆరోజు నాకు బాగా జ్ఞాపకం వుంది. నేను రేడియోలో వుంటే, రాంపా ఫోను చేసి జంధ్యాల పోయాడని చెప్పాడు. నేను వెంటనే వార్త రాసి ఇచ్చేసి రాజభవన్ రోడ్డులోని వాళ్ల ఇంటికి వెళ్లాను. అప్పుడే కబురు  తెలిసి ఒక్కొక్కరుగా వస్తున్నారు. ఓ కుర్చీలో జంధ్యాల నాన్నగారు నారాయణమూర్తి గారు కూర్చుని వున్నారు. కానీ ఆయనకు ఏదీ తెలియని పరిస్తితి. జ్ఞాపక శక్తి పూర్తిగా పోయింది. ఏమి జరిగిందన్నది, ఒక్కగానొక్క కొడుకు పోయాడన్నది  అర్ధం చేసుకునే స్తితి కాదు. ఏమిటో ఈ జీవితం అనిపించింది.
జంధ్యాల చనిపోయిన రెండేళ్లకు వేటూరి సుందరరామమూర్తి ఇలా గుర్తుచేసుకున్నారు.
హాస్యం,సంగీతం కలిసి ఒకే జన్మ ఎత్తిన హాసంనిన్నటి దరహాసం జంధ్యాల ఇతిహాసంలో చేరిపోయి రెండేళ్ళు గడిచాయి.ఎన్నేళ్ళు  గడిచినా ఆయన మధుర స్మృతికి మరణం లేదు. ఎంత కాదనుకున్నా కన్నీళ్ళు  కళ్ళతోనే మింగటం కన్నా శరణ్యం లేదు”.
తెలుగుజాతి ‘చిరునవ్వు’, జంధ్యాల అన్నారు వేటూరి.
ఆ వేటూరిగారు కూడా ఇప్పుడు లేరు.  జంధ్యాలను వెతుక్కుంటూ వెళ్ళిపోయారు.
కాని, ఆయన అన్నట్టు జంధ్యాల మార్కు  నవ్వుకు మాత్రం   మరణం లేదు.
తోక టపా :
" నేను వంటింట్లోకి వేరే పనిమీదవెళ్ళినాకూడా, వంట చేస్తున్న మా అమ్మగారు. పెట్టేస్తా నాన్నా ఒక్క అయిదు నిముషాలు  అనేవారు నొచ్చుకుంటూ- నేను అన్నం కోసం వచ్చాననుకుని. 
ఎంతయినా అమ్మ అంటే అన్నం. అన్నం అంటే అమ్మ ! అంతే !”
అమ్మ ప్రేమ గురించి ఇంత గొప్పగా చెప్పడం ఆ జంధ్యాలకే సాధ్యం!


(09-01-2017)

7, జనవరి 2017, శనివారం

తెలుగదేలయన్న దేశంబు తెలుగు ......

  
(PUBLISHED IN "SURYA" TELUGU DAILY ON 08-1- 2017, SUNDAY)
వున్నట్టుండి తెలుగు భాష, తెలుగు పత్రికలలోనే కాకుండా ఇంగ్లీష్ ప్రచార, ప్రసార మాధ్యమాల్లో కూడా ఒక పెద్ద చర్చనీయాంశం అయికూర్చుంది. ముదనష్టం పట్టడం  అంటే ఇదే కాబోలు. ఇదేమంత తప్పు పదం ఏమీ  కాదు, కొద్దిరోజుల క్రితం తెలుగుదేశం పార్టీ పాలనలో వున్న  తెలుగు రాష్ట్రంలో  తెలుగు భాష  విషయంలో జరిగిన  పొరబాటును గమనంలో వుంచుకుంటే. పొరబాట౦టేనే దిద్దుకునేది కాబట్టి పత్రికల్లో, సాంఘిక మాధ్యమాల్లో వెల్లువెత్తిన ఆందోళనను, నిరసనలను అర్ధం చేసుకుని సత్వరమే దిద్దుబాటు చర్యలు తీసుకుంది. అంతవరకూ మంచిదే అనుకోవాలి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఒక పేరు వుంది, ప్రతిపక్షం చెప్పినా చెవిన పెట్టని మనిషి మీడియాలో వస్తే వెంటనే పట్టించుకుంటారని. మునిసిపల్ పాఠశాలల్లో తెలుగు భాషను మాధ్యమంగా తొలగించి ఆ స్థానంలో ఆంగ్ల భాషను ప్రవేశపెట్టాలనే   నిర్ణయంపై  మీడియాలో వ్యతిరేకత కనబడడంతో కాస్త వెనక్కి తగ్గినట్టు వార్తలు వెనువెంటనే వచ్చాయి, స్పష్టమైన  అధికారిక ప్రకటన ఏదీ వెలువడక పోయినప్పటికీ.  
తెలుగు భాషను బోధనామాధ్యమంగా తొలగించాలని  నిర్ణయం తీసుకోవడమే ఆలస్యం ఒక   జీవో కూడా జారీ అయింది.
ఆంధ్రప్రదేశ్ లోని అన్ని మునిసిపల్ స్కూళ్ళలో తెలుగు బోధనా మాధ్యమాన్ని తొలగిస్తూ, ఆ స్థానంలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెడుతున్నట్టు ఆ ఉత్తర్వు సారాంశం. విద్యార్ధుల సంఖ్యతో కానీ, ఉపాధ్యాయుల సంఖ్యతో కానీ నిమిత్తం లేకుండా ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు బోధనా మాధ్యమాన్ని తెలుగు నుంచి ఇంగ్లీష్ భాషకు మారుస్తూ ప్రభుత్వం నిర్ణయించిందని, అయితే 2016- 17 విద్యా సంవత్సరానికి పదవ తరగతికి మాత్రం  ఇది వర్తించదని జీవోలో పేర్కొన్నారు.
ఈ ఆదేశాలు వెనువెంటనే అమల్లోకి వస్తాయని జీవో స్పష్టం చేసింది.   
“విషయాలను అన్నింటినీ సమగ్రంగా పరిశీలన జరిపిన తరువాతనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని” ప్రతి జీవోలో ముందుగా పేర్కొంటూ వుంటారు. మరి అవే ఉత్తర్వులను, సంతకాల తడి ఆరకముందే సవరించి కొత్తవి జారీ చేస్తుంటారు. అంతమాత్రం దానికి, ‘జాగ్రత్తగా పరిశీలించిన మీదట’ అనే పడికట్టు పదం ఎందుకు వాడతారో అర్ధం కాని విషయం.
పొతే, బోధనా మాధ్యమంగా తెలుగు తొలగింపు అనే  అంశం మీడియాలో, ప్రధానంగా సాంఘిక మాధ్యమాల్లో పెద్ద దుమారాన్నే రేపింది. పెద్ద నోట్ల రద్దు మాదిరిగానే  ఈ అంశంపై కూడా అనుకూల, ప్రతికూల వ్యాఖ్యలతో ఆ మాధ్యమాలు మారుమోగుతున్నాయి.
ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా వస్తున్న విమర్శలు అన్నీ ఇన్నీ కాదు. పార్టీ పేరులోనే తెలుగు దేశం అని వున్నప్పుడు తెలుగుకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడం విడ్డూరంగా వుందంటూ  సోషల్ మీడియా రచయితలు చెలరేగిపోతున్నారు. మొన్నటికి మొన్న తమిళనాడులో తెలుగు మీడియం రద్దు చేసినప్పుడు అక్కడి ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పడుతూ, మహజర్లు పెట్టుకున్న తెలుగుదేశం సర్కారు,  సొంత రాష్ట్రంలో తెలుగు మీడియంను ఏ మొహం పెట్టుకుని రద్దు చేస్తుందని ప్రశ్నిస్తున్నారు.  ఇది రెండు కళ్ళ సిద్దాంతం కాక మరేమిటని నిప్పులు చెరుగుతున్నారు. పోటీ ప్రపంచంలో తెలుగు పనికి రాదనే వాదనను వారు కొట్టి వేస్తున్నారు. యావత్ భారత దేశంలో సంపూర్ణ అక్షరాస్యత కలిగిన కేరళ రాష్ట్రంలో మాతృభాష మాత్రమే బోధనా భాషగా ఉంటోంది. అభివృద్ధి పధంలో పురోగమిస్తున్న రాష్ట్రాలలో అది అగ్రస్థానంలో వుంది అని ఉదాహరణలు చూపిస్తున్నారు.    
‘విజ్ఞాన సముపార్జనకోసం విద్య  అనేది బూజుపట్టిన పాత చింతకాయపచ్చడి. ఈ సిద్దాంతానికి ఎప్పుడో  కాలం చెల్లింది. ఇంగ్లీష్ పరిజ్ఞానం లేకుండా కేవలం తెలుగును అడ్డం పెట్టుకుని ఈ పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావడం అసాధ్యం.’ అంటూ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించే వారు బల్ల గుద్ది చెబుతున్నారు.  ఏది చదివినా, యెంత చదివినా నాలుగు రాళ్ళు సంపాదించిపెట్టే  ఉద్యోగం కోసమే అనే వాదన, భావన వీరివి. తెలుగు తెలుగు అని పట్టుకుని వేళ్ళాడితే పిల్లల భవిష్యత్తు ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు. తెలుగు భాష  గురించి ఇంతగా  మధనపడేవాళ్ళెవరయినా వాళ్ళ  పిల్లల్ని తెలుగు మీడియంలో చదివిస్తున్నారా, లేక  కాన్వెంటు స్కూళ్ళకు పంపుతున్నారా చెప్పాలని ఎద్దేవా చేస్తున్నారు.
ఏతావాతా విషయం యావత్తు రచ్చ రచ్చ అయిన తరువాత, ప్రభుత్వ పెద్దలు ఒక మెట్టు దిగి, ఈ  నిర్ణయాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టి, వచ్చే ఏడు చూద్దాము అనే నిర్ణయానికి వచ్చినట్టు వివరణలు వెలువడ్డాయి.
ఇదంతా చూసినప్పుడు కలం కూలీ, ప్రముఖ పాత్రికేయులు,కీర్తిశేషులు  జి. కృష్ణ ఒకప్పుడు చెప్పిన తెలుగు ముచ్చట్లు గుర్తుకు వస్తున్నాయి.
పూర్వపు మద్రాసు రాష్ట్రం నుంచి వేరుపడి ఏర్పడ్డ  ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా వున్న రోజులు. రమేశన్ అనే తెలుగు తెలిసిన తమిళ అధికారి గుంటూరు కలెక్టర్ గా వుండేవారు. తెలుగు వాడు కాకపోవడం వల్ల కావచ్చు, ఆయనకు తెలుగంటే వల్లమాలిన అభిమానం. అంచేత, జిల్లా కలెక్టర్  కి పంపుకునే ఆర్జీలను తెలుగులో పంపుకోవచ్చని ప్రకటించాడు. ఇంగ్లీష్ వచ్చిన వాళ్లకు ఈ నిర్ణయం తలవంపులుగా అనిపించి పోయి ప్రకాశం గారికి పిర్యాదు చేశారు. ఆంధ్రకేసరికి కోపం వచ్చింది. రమేశన్ ని సంజాయిషీ అడిగారు. ఆయన ఈనాటి అధికారుల కోవలోని వాడు కాదు కాబట్టి ధైర్యంగా జవాబు చెప్పాడు, ‘ఆంద్ర రాష్ట్రం వచ్చింది కదా. అది ఏర్పడిన సిద్దాంతం ప్రకారం ఇట్లా ప్రకటించాను’ అంటూ. మరి ఆంద్ర కేసరి కూడా ఈనాటి నాయకుల బాపతు కాదుకదా! అధికారి చెప్పింది విని, సరే అని ఒప్పుకుని, తన చెవులు కొరికిన వాళ్ళను తరువాత  చెడామడా ఉతికేసాడు.
ఆంగ్లంలో పెద్ద చదువులు చదవకుండానే  పెద్ద పెద్ద ఇంగ్లీష్ పత్రికల్లో పనిచేసిన  కృష్ణ గారికి, రమేశన్ మాదిరిగానే  తెలుగు అంటే మంచి అభిమానం. కాన్వెంటు స్కూళ్ళకు ఆయన పెట్టిన ముద్దు పేరు మమ్మీ డాడీ బడులు.
ఆయన చెప్పినదే మరో తెలుగు కధ.
1990 లో కాబోలు, హైదరాబాదులోని అంతర్జాతీయ తెలుగు సంస్థ కార్యాలయానికి దక్షిణాఫ్రికా నుంచి పీ.ఎం. నాయుడు అనే పెద్దమనిషి వచ్చాడు. ఆయన అంతదూరం నుంచి వచ్చి మన ప్రభుత్వాన్ని అడిగింది ఏమిటో తెలుసా, ‘ఒకరిద్దరు తెలుగు పండితుల్ని ఇవ్వండి, ఆఫ్రికాలో  మా పిల్లలకు తెలుగు నేర్పుకుంటాము’ అని.  
స్వతంత్రం వచ్చిన తరువాత ఏర్పడ్డ భాషాప్రయుక్త రాష్ట్రాలలో మొట్టమొదటిది ఆంధ్రప్రదేశ్. కృష్ణ గారు  అనేవారు, అలాంటి ఆంధ్రప్రదేశ్ లో ఇంటాబయటా తెలుగు ‘హుష్ కాకి’.
అయితే, తెలుగు భాష పరిస్తితి మునపటంత దయనీయంగా లేదు.
ఇంటర్ నెట్ ఆగమనంతో తెలుగు భాష మరో మృతభాషగా మారిపోతుందనే భయాలు వట్టివని తొందర్లోనే  తేలిపోయింది. భాష బతకాలంటే కేవలం మాట్లాడితే సరిపోదు, రాయడం, చదవడం వచ్చి తీరాలి అంటారు. ఈరోజు  సోషల్ మీడియాలో అలాటి చక్కదనాల తెలుగు సౌరభం వెల్లివిరుస్తోంది. తెలిసిన వారి నుంచి తెలియని వారు నేర్చుకునే వేదికగా కూడా ఈ మీడియా ఉపయోగపడుతోంది. తెలుగు భాష ఈ మాత్రం ప్రాణంతో నిలబడి ఉన్నదంటే నిజానికి బ్లాగర్, ఫేస్ బుక్, వాట్స్ ఆప్ వంటి అధునాతన మీడియాలే కారణం అనడం అతిశయోక్తి కాదు.  ఇప్పుడు అనేకమంది ప్రతి రోజూ తెలుగులో రాస్తున్నారు. తెలుగులో రాసింది చదువుతున్నారు. తెలుగులో అభిప్రాయాలు పరస్పరం తెలుపుకుంటున్నారు. ఇదొక శుభ పరిణామం.
అయితే ఇదొక్కటే సరిపోదు.
భాషలను, సంస్కృతులను పరిరక్షించాల్సిన బాధ్యత ఒకనాడు ప్రభువులది, ఈనాడు మాత్రం ప్రజాప్రభుత్వాలది.
ఉపశృతి: 1980 లో కాబోలు మిమిక్రీ వేణుమాధవ్ కొంతమంది కళాకారులతో కలిసి మారిషస్, దక్షిణాఫ్రికా దేశాల్లో పర్యటించారు. అప్పుడు వారికి డర్బన్ నగరంలో ‘వరంగల్లు వీధి’ కనిపించింది. వివరం అడిగితే అక్కడివాళ్లు చెప్పారట. ఆ నగరంలో తెలుగు వాళ్ళు వుండే వీధికి మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండని నగరపాలక సంస్థ సూచించింది. అంతే! అందరూ కలిసి మరో మాట లేకుండా వరంగల్ పేరు పెట్టుకున్నారట.
తెలుగుతనం, తెలుగు అభిమానం చూడాలంటే ముందుముందు విదేశాలకు వెళ్ళాలేమో!  

రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com,  మొబైల్: 98491 30595       

5, జనవరి 2017, గురువారం

ఇంతకంటే ఏం కావాలి?

ఎప్పటి రేడియో మాస్కో? ఎప్పటి తెలుగు వార్తలు?
పాతికేళ్ళు దాటింది నేను మాస్కో రేడియోలో తెలుగు వార్తలు అయిదేళ్లపాటు చదివి హైదరాబాదుకు తిరిగొచ్చి.
ఇవ్వాళ ఉదయం రాజమండ్రి నుంచి చంద్రశేఖర్ గారనే పరిచయం లేని పెద్దమనిషి ఫోను చేశారు. పత్రికల్లో నేను రాసే వ్యాసాలు చదివి గూగుల్ సెర్చి ద్వారా నా ఆనుపానులు పట్టుకున్నారుట. ఆరోజుల్లో మాస్కో రేడియో తెలుగు వార్తలు క్రమం తప్పకుండా వినే అలవాటు తనకు ఉండేదని, ఒకసారి నా సంతకంతో మాస్కోనుంచి పంపిన చిరుకానుక తన దగ్గర ఇప్పటికీ భద్రంగా ఉందనీ చెప్పారు. శ్రోతలకు అలా కానుకలు పంపే సంప్రదాయం రేడియో మాస్కోలో వుండేది.
మాస్కో రేడియోతోటే ఒదిలిపెట్టలేదు. అంతకుముందు 1971లో బెజవాడ ఆంద్ర జ్యోతిలో పనిచేసేటప్పుడు నేను రాసిన ‘వాక్టూనులు’, ‘బుక్ రివ్యూలు’ గురించి సవిస్తరంగా ప్రస్తావించడం చూసి ఆయన ధారణ శక్తికి ఆశ్చర్యపోవడం నావంతయింది. అల్లాగే హైదరాబాదు ఆలిండియా రేడియోలో నా కార్యక్రమం ‘జీవన స్రవంతి’ గురించి కూడా చంద్రశేఖర్ గారు ప్రస్తావించారు. 1975 లో ఆ కార్యక్రమం నేను మొదలు పెట్టినప్పటి నుంచి జీవనస్రవంతి ప్రసారం చేసే వేళలు ఎలా మారుతూ వచ్చాయో అన్న వివరాలు కూడా ఆయన చెప్పేసరికి నాకేం మాట్లాడాలో తోచలేదు.
చంద్రశేఖర్ గారూ. మీకు నా సెల్యూట్.




కింది ఫోటో : 1975 లో నా 'జీవన స్రవంతి'

3, జనవరి 2017, మంగళవారం

ఎవరీ హరిశ్చంద్ర ప్రసాద్ ?


మూన్నెళ్ళుగా ఆర్ కే ప్రసాద్ మనసును తొలుస్తున్న అనుమానం.
అతను చాలా  సంవత్సరాలు అమెరికాలో ఉద్యోగం చేసి  ఇండియా రాగానే  హైదరాబాదులోని ఒక సంస్థలో ఫైనాన్స్ విభాగంలో ఉన్నతాధికారిగా చేరాడు. తన కింద పనిచేసే కొన్ని డజన్ల మంది ఉద్యోగులతో ముఖతః పరిచయం లేక పోయినా రికార్డులను బట్టి వారేమిటో, ఏ పని చేస్తుంటారో తనకు తెలిసిపోతూనే వుంటుంది, ఒక్క ఈ హరిశ్చంద్ర ప్రసాద్ విషయం తప్ప. ఆయన ఆ ఊళ్లోనే బ్రాంచి ఆఫీసులో పనిచేస్తారు.
ఆయన తన దృష్టిని ఆకర్షించడానికి  కారణం కూడా వుంది. అది ఆయన నడవడిక. తనిఖీ నిమిత్తం తాను నెలలో అనేక పర్యాయాలు  ఆ బ్రాంచికి వెళ్ళాల్సిన అవసరం పడేది. ఎప్పుడు వెళ్ళినా ఆయన తన సీట్లోనే కనబడేవాడు. ఆఫీసు టైం కల్లా ఠంచనుగా గంట కొట్టినట్టు వచ్చి తన సీట్లో కూర్చుంటాడని చెప్పేవాళ్ళు.  వచ్చీ రాగానే అందర్నీ చిరునవ్వుతో పలకరిస్తాడు. అంతే! ఆ తరువాత మౌనముని.  కంప్యూటర్ ఓపెన్ చేసి తన పనిలో పడిపోతాడు. ఎవరితో మాటా ముచ్చటా వుండదు. లంచ్ బాక్స్ ఇంటి నుంచే తెచ్చుకుని తన సీటు దగ్గరే భోజనం ముగిస్తాడు. ఆయన ఎవరికీ రిపోర్ట్ చేయడు. పలానా పని చేసారా ఎవరూ ఆయన్ని అడగ్గా చూడలేదు. సాయంత్రం ఆఫీసు పని వేళలు ముగియగానే కారు నడుపుకుంటూ వెళ్ళిపోతాడు. ఇదీ ఆయన గురించి విన్న విషయాలు. వారికి తెలియని విషయం ఒకటి ఫైనాన్స్ అధికారిగా తనకు తెలుసు. ఆయన జీతం లక్షల్లో. ఏపనీ లేకుండా ఎందుకంత జీతం ఇస్తున్నట్టు!
‘ఇంతకీ ఎవరీయన?’
అదే ప్రశ్న సహచరులను అడిగి చూశాడు.
“మాకూ తెలియదు. మన బాస్ కావాలని ఆయన్ని తెచ్చి పెట్టుకున్నాడు. అలా అని బాస్ తో చనువుగా వుండగా మేమెప్పుడూ చూడలేదు. తన పనేమిటో  తన లోకమేమిటో. గతంలో ఒకరిద్దరు బాస్ తో ఈ ప్రస్తావన చేయ బోయారు. ‘మీకు అది అంత అవసరమా” అని కట్ చేసారు. ఆ తరువాత ఎవ్వరూ ధైర్యం చేయలేదు”
ఈ సమాధానం ప్రసాద్ లో ఉత్సుకతను మరింత పెంచింది.
ఎవరీ హరిశ్చంద్ర ప్రసాద్!
ఫైనాన్స్ విభాగం అధిపతిగా ఆయన ఎవరో తెలుసుకునే అధికారం తనకుంది. ఎవరో తెలియకుండా అంతంత జీతాలు చెల్లించే పత్రాల మీద సంతకం చేయాల్సిన అవసరం తనకు లేదు.
అదే విషయం బాస్ తో అనేశాడు. ఆయన కనుబొమ్మలు ముడిపడ్డాయి.
‘పోనీ ఒక పని చేయండి. ఎవరో తెలియకుండా జీతం ఇవ్వలేని పక్షంలో నా కంపెన్సేషన్ నుంచి ఆయనకు ఆ డబ్బు ఇవ్వండి. మళ్ళీ ఎప్పుడూ ఈ విషయం నా వద్ద ఎత్తకండి’
బాస్ స్పందన ప్రసాద్ ఆశ్చర్యాన్ని రెట్టింపు చేసింది.
మరో రెండేళ్ళు గడిచాయి. ఒక రోజు ఆఫీసు పని మీద ఆ బ్రాంచికి  వెళ్ళే సరికి అంతా హడావిడిగా వుంది. ఓమూలన కూర్చుని పనిచేసే ఆ ముసలాయన కనిపించలేదు. భోరున వర్షం కురవనీ, ఊళ్ళో కర్ఫ్యూ పెట్టనీ టైముకు ఆఫీసుకు వచ్చే పెద్దాయన ఈ రోజు రాలేదు. బాస్ కూడా అప్పుడు అక్కడే వుండడం చూసి ఆశ్చర్యం వేసింది. అందరూ బయటకు వెళ్ళడానికి సిద్ధంగా వున్నారు. ప్రసాద్ కూడా తన కారులో వాళ్ళని అనుసరించాడు.
ఊరికి దూరంగా విసిరేసినట్టున్నప్రాంతంలో విశాలమైన ఆవరణలో పూదోట వంటి ఓ పెంకుటిల్లు.  ఇంటి ముందు పాడె మీద  ఆ పెద్దాయన శవం.
ఎక్కువ హడావిడి లేకుండానే కర్మ కాండలు ముగిశాయి. అంతా ఆఫీసుకు తిరిగి వచ్చారు.
ఆ సాయంత్రం ఒక సంతాప సభ ఏర్పాటు చేశారు.
రెండు నిమిషాలు మౌనం పాటించిన తరువాత బాస్ మైక్ తీసుకున్నాడు.
‘ఎవరీ హరిశ్చంద్ర ప్రసాద్? మన ఆఫీసులో ప్రతి ఒక్కరికీ దీనికి జవాబు తెలుసుకోవాలని వుందని నాకు తెలుసు. ఆయన ఎవ్వరోకాదు, మన ఈ కంపెనీకి అసలు యజమాని. కంపెనీ మంచి వృద్ధిలో వున్న సమయంలో విదేశాల్లో విహార యాత్రకు వెళ్ళిన ఆయన కుటుంబ సభ్యులు అందరూ ఒకే సారి  మరణించారు. వారసులు ఎవ్వరూ లేరు. ఆ సమయంలో ఆయన నాకు ఒక బాధ్యత ఒప్పచెప్పారు. అప్పుడాయన చెప్పిన మాటలు నాకు బాగా జ్ఞాపకం వున్నాయి.
‘ఎంతో విలువలతో ఈకంపెనీని నడుపుకుంటూ వచ్చాను. నాకూ వయసయిపోయింది. మా కుటుంబ సభ్యుల మరణం చూసాక మృత్యువు అనివార్యమని తెలిసిపోయింది. నేనూ ఒక రోజు పోక తప్పదు. కానీ ఈ కంపెనీ బతికి  తీరాలి. ఇన్నేళ్ళుగా ప్రతి రోజూ క్రమం తప్పకుండా ఆఫీసుకు వెళ్లి పనిచేస్తూ వస్తున్నాను. ఈ పరిస్తితుల్లో నేను మనసు పెట్టి పనిచేయలేను. అలా  అని  ఖాళీగా కూడా  వుండలేను. అంచేత మన కంపెనీ లోనే పనిచేస్తాను. సంస్థ చైర్మన్ గా కాదు, ఒక ఉద్యోగిగా. కానీ ఈ విషయం ఎవరికీ తెలియనివ్వకూడదు. హెడ్ ఆఫీసులో అది కుదరని పని. కాబట్టి ఏదైనా బ్రాంచిలో చూడు’
‘అలా నాకు చెప్పిన ఆయన ఇప్పుడు లేరు. కానీ అయన మనకు ఒప్పచెప్పిన ఆశయాల ప్రకారం  పనిచేసి కంపెనీని నిలబెడదాం. ఇన్నేళ్ళుగా ఆయన కూర్చున్న కుర్చీని అలాగే ఉంచేద్దాం. ఆయన అక్కడే కూర్చుని వున్నారు అనుకుంటే అదొక ప్రేరణగా వుంటుంది. అందుకే  ఈ ఏర్పాటు’’

ఎవరీ హరిశ్చంద్ర ప్రసాద్ అని మధన పడుతున్న ప్రసాద్ కి అసలు  విషయం బోధపడింది.    (03-01-2017)            

2, జనవరి 2017, సోమవారం

ఎలా? ఇలా!


“ఏటీఎంలలో డబ్బులు వస్తున్నాయని కొందరు, రావడం లేదని మరికొందరు వాదించుకొనుచున్నారు. మీరు ఎవరితో ఏకీవభించెదరు ఎడిటర్జీ?”
“ఇద్దరితో..”
“అదెలా?”
“అంటే ఇలా. చెబుతాను ఇనుకో!.....సోషల్ మీడియా రెండుగా విడిపోయింది. తాము ఒకటి నమ్ముతూ దాన్నే ఇతరులు కూడా నమ్మి తీరాలనే మనస్తత్వం ఇందులో ప్రబలంగా వుండడమే దీనికి కారణం”
“మరి ఏది దారి?”
“కంటితో చూసి రుజువు చేసుకోవడమే... నిన్న కాక మొన్న మా కజిన్ వాళ్ళు అరకు టూరు వెళ్లివచ్చారు. వాళ్లకు ఎక్కడా ఇబ్బంది కాలేదు. అన్ని ఏటీఎంలు పనిచేస్తూనే వున్నాయి. డబ్బులు దొరుకుతూనే వున్నాయి.  అంతే కాదు, చిన్న షాపుల్లో చిన్న వస్తువు కొనుక్కుని రెండువేల నోటు ఇచ్చినా మరో మాట అడగకుండా చిల్లర లెక్కపెట్టి ఇస్తున్నారట. పైగా కొత్త అయిదు వందల నోట్లు పుష్కలంగా దొరుకుతున్నాయట. ఇన్ని ‘ట’ లు వున్నాయని నమ్మను అనబోకు. మా కజిన్ చెప్పింది మరి. అదెప్పుడూ అబద్ధం చెప్పదు. మరి హైదరాబాదులో ఈ గొడవ ఏమిటి? అక్కడ లేని ఇబ్బందులు ఇక్కడ ఎందుకు?”
 “అది అరకు. ఇది హైదరాబాదు. పెద్ద నగరం. పెద్ద జనాభా. పెద్ద నోట్ల అవసరం ఇక్కడ ఎక్కువ. అందుకే ఇక్కడ కొరత”
“మళ్ళీ ఇదేమి ఫిట్టింగు”
“ఫిట్టింగు కాదు నాయనా పచ్చి నిజం. అందుకే ముందే చెప్పాను, రెండు వాదనలు నిజమే అని. విషయం విడమరచి చెబుతాను విను. ఇప్పుడు ఇక్కడ టైం ఎంత? పగలు పన్నెండు గంటలు. అమెరికాలో వున్న మీ అబ్బాయికి ఫోను చేసి కనుక్కో. రాత్రి పన్నెండు అంటాడు. అదీ నిజమే. ఇదీ నిజమే. అదన్న మాట”