7, జనవరి 2017, శనివారం

తెలుగదేలయన్న దేశంబు తెలుగు ......

  
(PUBLISHED IN "SURYA" TELUGU DAILY ON 08-1- 2017, SUNDAY)
వున్నట్టుండి తెలుగు భాష, తెలుగు పత్రికలలోనే కాకుండా ఇంగ్లీష్ ప్రచార, ప్రసార మాధ్యమాల్లో కూడా ఒక పెద్ద చర్చనీయాంశం అయికూర్చుంది. ముదనష్టం పట్టడం  అంటే ఇదే కాబోలు. ఇదేమంత తప్పు పదం ఏమీ  కాదు, కొద్దిరోజుల క్రితం తెలుగుదేశం పార్టీ పాలనలో వున్న  తెలుగు రాష్ట్రంలో  తెలుగు భాష  విషయంలో జరిగిన  పొరబాటును గమనంలో వుంచుకుంటే. పొరబాట౦టేనే దిద్దుకునేది కాబట్టి పత్రికల్లో, సాంఘిక మాధ్యమాల్లో వెల్లువెత్తిన ఆందోళనను, నిరసనలను అర్ధం చేసుకుని సత్వరమే దిద్దుబాటు చర్యలు తీసుకుంది. అంతవరకూ మంచిదే అనుకోవాలి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఒక పేరు వుంది, ప్రతిపక్షం చెప్పినా చెవిన పెట్టని మనిషి మీడియాలో వస్తే వెంటనే పట్టించుకుంటారని. మునిసిపల్ పాఠశాలల్లో తెలుగు భాషను మాధ్యమంగా తొలగించి ఆ స్థానంలో ఆంగ్ల భాషను ప్రవేశపెట్టాలనే   నిర్ణయంపై  మీడియాలో వ్యతిరేకత కనబడడంతో కాస్త వెనక్కి తగ్గినట్టు వార్తలు వెనువెంటనే వచ్చాయి, స్పష్టమైన  అధికారిక ప్రకటన ఏదీ వెలువడక పోయినప్పటికీ.  
తెలుగు భాషను బోధనామాధ్యమంగా తొలగించాలని  నిర్ణయం తీసుకోవడమే ఆలస్యం ఒక   జీవో కూడా జారీ అయింది.
ఆంధ్రప్రదేశ్ లోని అన్ని మునిసిపల్ స్కూళ్ళలో తెలుగు బోధనా మాధ్యమాన్ని తొలగిస్తూ, ఆ స్థానంలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెడుతున్నట్టు ఆ ఉత్తర్వు సారాంశం. విద్యార్ధుల సంఖ్యతో కానీ, ఉపాధ్యాయుల సంఖ్యతో కానీ నిమిత్తం లేకుండా ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు బోధనా మాధ్యమాన్ని తెలుగు నుంచి ఇంగ్లీష్ భాషకు మారుస్తూ ప్రభుత్వం నిర్ణయించిందని, అయితే 2016- 17 విద్యా సంవత్సరానికి పదవ తరగతికి మాత్రం  ఇది వర్తించదని జీవోలో పేర్కొన్నారు.
ఈ ఆదేశాలు వెనువెంటనే అమల్లోకి వస్తాయని జీవో స్పష్టం చేసింది.   
“విషయాలను అన్నింటినీ సమగ్రంగా పరిశీలన జరిపిన తరువాతనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని” ప్రతి జీవోలో ముందుగా పేర్కొంటూ వుంటారు. మరి అవే ఉత్తర్వులను, సంతకాల తడి ఆరకముందే సవరించి కొత్తవి జారీ చేస్తుంటారు. అంతమాత్రం దానికి, ‘జాగ్రత్తగా పరిశీలించిన మీదట’ అనే పడికట్టు పదం ఎందుకు వాడతారో అర్ధం కాని విషయం.
పొతే, బోధనా మాధ్యమంగా తెలుగు తొలగింపు అనే  అంశం మీడియాలో, ప్రధానంగా సాంఘిక మాధ్యమాల్లో పెద్ద దుమారాన్నే రేపింది. పెద్ద నోట్ల రద్దు మాదిరిగానే  ఈ అంశంపై కూడా అనుకూల, ప్రతికూల వ్యాఖ్యలతో ఆ మాధ్యమాలు మారుమోగుతున్నాయి.
ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా వస్తున్న విమర్శలు అన్నీ ఇన్నీ కాదు. పార్టీ పేరులోనే తెలుగు దేశం అని వున్నప్పుడు తెలుగుకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడం విడ్డూరంగా వుందంటూ  సోషల్ మీడియా రచయితలు చెలరేగిపోతున్నారు. మొన్నటికి మొన్న తమిళనాడులో తెలుగు మీడియం రద్దు చేసినప్పుడు అక్కడి ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పడుతూ, మహజర్లు పెట్టుకున్న తెలుగుదేశం సర్కారు,  సొంత రాష్ట్రంలో తెలుగు మీడియంను ఏ మొహం పెట్టుకుని రద్దు చేస్తుందని ప్రశ్నిస్తున్నారు.  ఇది రెండు కళ్ళ సిద్దాంతం కాక మరేమిటని నిప్పులు చెరుగుతున్నారు. పోటీ ప్రపంచంలో తెలుగు పనికి రాదనే వాదనను వారు కొట్టి వేస్తున్నారు. యావత్ భారత దేశంలో సంపూర్ణ అక్షరాస్యత కలిగిన కేరళ రాష్ట్రంలో మాతృభాష మాత్రమే బోధనా భాషగా ఉంటోంది. అభివృద్ధి పధంలో పురోగమిస్తున్న రాష్ట్రాలలో అది అగ్రస్థానంలో వుంది అని ఉదాహరణలు చూపిస్తున్నారు.    
‘విజ్ఞాన సముపార్జనకోసం విద్య  అనేది బూజుపట్టిన పాత చింతకాయపచ్చడి. ఈ సిద్దాంతానికి ఎప్పుడో  కాలం చెల్లింది. ఇంగ్లీష్ పరిజ్ఞానం లేకుండా కేవలం తెలుగును అడ్డం పెట్టుకుని ఈ పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావడం అసాధ్యం.’ అంటూ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించే వారు బల్ల గుద్ది చెబుతున్నారు.  ఏది చదివినా, యెంత చదివినా నాలుగు రాళ్ళు సంపాదించిపెట్టే  ఉద్యోగం కోసమే అనే వాదన, భావన వీరివి. తెలుగు తెలుగు అని పట్టుకుని వేళ్ళాడితే పిల్లల భవిష్యత్తు ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు. తెలుగు భాష  గురించి ఇంతగా  మధనపడేవాళ్ళెవరయినా వాళ్ళ  పిల్లల్ని తెలుగు మీడియంలో చదివిస్తున్నారా, లేక  కాన్వెంటు స్కూళ్ళకు పంపుతున్నారా చెప్పాలని ఎద్దేవా చేస్తున్నారు.
ఏతావాతా విషయం యావత్తు రచ్చ రచ్చ అయిన తరువాత, ప్రభుత్వ పెద్దలు ఒక మెట్టు దిగి, ఈ  నిర్ణయాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టి, వచ్చే ఏడు చూద్దాము అనే నిర్ణయానికి వచ్చినట్టు వివరణలు వెలువడ్డాయి.
ఇదంతా చూసినప్పుడు కలం కూలీ, ప్రముఖ పాత్రికేయులు,కీర్తిశేషులు  జి. కృష్ణ ఒకప్పుడు చెప్పిన తెలుగు ముచ్చట్లు గుర్తుకు వస్తున్నాయి.
పూర్వపు మద్రాసు రాష్ట్రం నుంచి వేరుపడి ఏర్పడ్డ  ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా వున్న రోజులు. రమేశన్ అనే తెలుగు తెలిసిన తమిళ అధికారి గుంటూరు కలెక్టర్ గా వుండేవారు. తెలుగు వాడు కాకపోవడం వల్ల కావచ్చు, ఆయనకు తెలుగంటే వల్లమాలిన అభిమానం. అంచేత, జిల్లా కలెక్టర్  కి పంపుకునే ఆర్జీలను తెలుగులో పంపుకోవచ్చని ప్రకటించాడు. ఇంగ్లీష్ వచ్చిన వాళ్లకు ఈ నిర్ణయం తలవంపులుగా అనిపించి పోయి ప్రకాశం గారికి పిర్యాదు చేశారు. ఆంధ్రకేసరికి కోపం వచ్చింది. రమేశన్ ని సంజాయిషీ అడిగారు. ఆయన ఈనాటి అధికారుల కోవలోని వాడు కాదు కాబట్టి ధైర్యంగా జవాబు చెప్పాడు, ‘ఆంద్ర రాష్ట్రం వచ్చింది కదా. అది ఏర్పడిన సిద్దాంతం ప్రకారం ఇట్లా ప్రకటించాను’ అంటూ. మరి ఆంద్ర కేసరి కూడా ఈనాటి నాయకుల బాపతు కాదుకదా! అధికారి చెప్పింది విని, సరే అని ఒప్పుకుని, తన చెవులు కొరికిన వాళ్ళను తరువాత  చెడామడా ఉతికేసాడు.
ఆంగ్లంలో పెద్ద చదువులు చదవకుండానే  పెద్ద పెద్ద ఇంగ్లీష్ పత్రికల్లో పనిచేసిన  కృష్ణ గారికి, రమేశన్ మాదిరిగానే  తెలుగు అంటే మంచి అభిమానం. కాన్వెంటు స్కూళ్ళకు ఆయన పెట్టిన ముద్దు పేరు మమ్మీ డాడీ బడులు.
ఆయన చెప్పినదే మరో తెలుగు కధ.
1990 లో కాబోలు, హైదరాబాదులోని అంతర్జాతీయ తెలుగు సంస్థ కార్యాలయానికి దక్షిణాఫ్రికా నుంచి పీ.ఎం. నాయుడు అనే పెద్దమనిషి వచ్చాడు. ఆయన అంతదూరం నుంచి వచ్చి మన ప్రభుత్వాన్ని అడిగింది ఏమిటో తెలుసా, ‘ఒకరిద్దరు తెలుగు పండితుల్ని ఇవ్వండి, ఆఫ్రికాలో  మా పిల్లలకు తెలుగు నేర్పుకుంటాము’ అని.  
స్వతంత్రం వచ్చిన తరువాత ఏర్పడ్డ భాషాప్రయుక్త రాష్ట్రాలలో మొట్టమొదటిది ఆంధ్రప్రదేశ్. కృష్ణ గారు  అనేవారు, అలాంటి ఆంధ్రప్రదేశ్ లో ఇంటాబయటా తెలుగు ‘హుష్ కాకి’.
అయితే, తెలుగు భాష పరిస్తితి మునపటంత దయనీయంగా లేదు.
ఇంటర్ నెట్ ఆగమనంతో తెలుగు భాష మరో మృతభాషగా మారిపోతుందనే భయాలు వట్టివని తొందర్లోనే  తేలిపోయింది. భాష బతకాలంటే కేవలం మాట్లాడితే సరిపోదు, రాయడం, చదవడం వచ్చి తీరాలి అంటారు. ఈరోజు  సోషల్ మీడియాలో అలాటి చక్కదనాల తెలుగు సౌరభం వెల్లివిరుస్తోంది. తెలిసిన వారి నుంచి తెలియని వారు నేర్చుకునే వేదికగా కూడా ఈ మీడియా ఉపయోగపడుతోంది. తెలుగు భాష ఈ మాత్రం ప్రాణంతో నిలబడి ఉన్నదంటే నిజానికి బ్లాగర్, ఫేస్ బుక్, వాట్స్ ఆప్ వంటి అధునాతన మీడియాలే కారణం అనడం అతిశయోక్తి కాదు.  ఇప్పుడు అనేకమంది ప్రతి రోజూ తెలుగులో రాస్తున్నారు. తెలుగులో రాసింది చదువుతున్నారు. తెలుగులో అభిప్రాయాలు పరస్పరం తెలుపుకుంటున్నారు. ఇదొక శుభ పరిణామం.
అయితే ఇదొక్కటే సరిపోదు.
భాషలను, సంస్కృతులను పరిరక్షించాల్సిన బాధ్యత ఒకనాడు ప్రభువులది, ఈనాడు మాత్రం ప్రజాప్రభుత్వాలది.
ఉపశృతి: 1980 లో కాబోలు మిమిక్రీ వేణుమాధవ్ కొంతమంది కళాకారులతో కలిసి మారిషస్, దక్షిణాఫ్రికా దేశాల్లో పర్యటించారు. అప్పుడు వారికి డర్బన్ నగరంలో ‘వరంగల్లు వీధి’ కనిపించింది. వివరం అడిగితే అక్కడివాళ్లు చెప్పారట. ఆ నగరంలో తెలుగు వాళ్ళు వుండే వీధికి మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండని నగరపాలక సంస్థ సూచించింది. అంతే! అందరూ కలిసి మరో మాట లేకుండా వరంగల్ పేరు పెట్టుకున్నారట.
తెలుగుతనం, తెలుగు అభిమానం చూడాలంటే ముందుముందు విదేశాలకు వెళ్ళాలేమో!  

రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com,  మొబైల్: 98491 30595       

2 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

ఇప్పుడైనా అదే అంటున్నాం కదా భండారు శ్రీనివాసరావు గారూ ? ... తెలుగు ..+. అది ..+. ఏల = తెలుగదేల ? వివాదమెక్కడుంది? 😀😀
"అయ్యవారేం చేస్తున్నారు అంటే తప్పులు రాసి దిద్దుకుంటున్నారు" అనే మాట మీకూ తెలుసు కదా. ప్రభుత్వాలకి అది అలవాటు అయిపోయినట్లుంది. ఇంక ఆశ్చర్యమేముంది?
నిజానికి, తెలుగు భాషను నిర్బంధంగా బోధిస్తూనే తతిమ్మా సబ్జెక్టులు మొదటినుంచీ ఇంగ్లీషు మీడియంలో అలవాటు చేయకపోతే తెలుగు విద్యార్ధులే బయట ప్రపంచంలో తట్టుకుని నిలబడడానికి కష్టపడతారని నష్టపోతారనీ నా వ్యక్తిగత అభిప్రాయం కూడా. కానీ ఆ పద్ధతి ప్రవేశ పెట్టడంలో ప్రభుత్వం సరిగా వ్వహరించడం లేదనిపిస్తుందు. తొందరపాటు నిర్ణయాలు, హడావుడిగానూ గందరగోళంగానూ చెయ్యబూనడం .... తరువాత "అయ్యవారేం చేస్తున్నారు ......" అనేది నిజం చెయ్యడం జరుగుతోంది.

తెలుగోడు_చైతన్య చెప్పారు...

మీరన్నట్లు ఆస్ట్రేలియాలో తెలుగుభాషకు ఆదరణ లభిస్తోంది... నిజమే ఎక్కడ భావవినిమయం ఉంటాదో అక్కడ ఆ భాష విరాజిల్లుతుంది... ధన్యోస్మి.