1, జనవరి 2017, ఆదివారం

సంగీత కళానిధి అవసరాల కన్యాకుమారి

    
2016 జులైలో కృష్ణా పుష్కరాలకు ఏర్పాట్లు జరుగుతున్న వేళ.
విజయవాడలోని ఒక రికార్డింగ్ స్టూడియోలో ఒక  వయొలిన్ విద్వాంసురాలు, పుష్కరాలకోసం  ‘కృష్ణాతరంగాలు’ అనే కార్యక్రమాన్ని రూపొందించే పనిలో తలమునకలుగా వున్నారు.
ఇంతలో సెల్ మోగింది. చెన్నై నుంచి మద్రాసు మ్యూజిక్ అకాడమి చైర్మన్ ఎన్.మురళి లైన్లోకి వచ్చి చెప్పారు. “2016 సంవత్సరానికి ‘సంగీత కళానిధి’ పురస్కారానికి మిమ్మల్ని ఎంపిక చేశాము, మా అభినందనలు అందుకోండి’ అంటూ.
ఆ సంగీత కళాకారిణికి ఆశ్చర్యంతో,  ఆనందంతో కాసేపు మాట పెగల్లేదు. కర్నాటక సంగీత ప్రపంచంలో ఆ అవార్డుకు వున్న విశిష్టత అలాంటిది మరి. పద్మవిభూషణ్ కన్నా సంగీత కళానిధి మిన్న అని భావించే కళాకారులు ఎందరో వున్నారు.
డిసెంబరు నెల చెన్నై నగరం  సంగీత ప్రియులకు శీతాకాలపు విడిది. మద్రాసు మ్యూజిక్ అకాడమీతో సహా అనేక సంగీత సభలు ఆ మాసంలో వీనులవిందైన కార్యక్రమాలు నిర్వహిస్తాయి. దేశం నలుమూల నుంచి కర్ణాటక సంగీత ప్రియులకు, సంగీత దిగ్గజాలకి అదొక మ్యూజిక్ సీజన్. చెన్నై హోటళ్ళన్నీ వారితో నిండిపోతాయి. టిక్కెట్లు కొని సంగీత కచ్చేరీలకు వెళ్ళేవాళ్ళు అక్కడే కనిపిస్తారు. మద్రాసు మ్యూజిక్ అకాడమీ నిర్వహించే కార్యక్రమాలకు మరింత ప్రత్యేకత. ఈ ఏడాది అకాడమీ కార్యక్రమాలకు సంగీత కళానిధిగా ఎంపిక అయిన అవసరాల కన్యాకుమారికి  ‘ముఖ్య అతిధి’ గౌరవం లభించింది. గతంలో ఈ పురస్కారం పొందిన ఘనాపాటీల సరసన మొదటి వరసలో స్థానం దొరికింది. పదిహేడు రోజులపాటు జరిగిన అకాడమీ సంగీత ఉత్సవాలు పాత సంవత్సరంలో మొదలయి నూతన సంవత్సరం మొదటి తేదీన ముగిశాయి. చివరి రోజున సంగీత దిగ్గజాల నడుమ అవసరాల కన్యాకుమారిని సంగీత కళానిధి పురస్కారంతో సత్కరించారు.


పద్మశ్రీ వంటి అనేక పురస్కారాలు గతంలోనే ఆమెను వరించాయి. అయినా, సంగీత కళానిధి బిరుదు రావడంతో సంగీత ప్రపంచంలో తనకు అత్యున్నతమైన  గుర్తింపు వచ్చినట్టుగా, స్థానం లభించినట్టుగా  భావిస్తున్నానని కన్యాకుమారి చెప్పారు. ఇటువంటి సందర్భాలలో విలేకరుల నుంచి ఆమెకు ఎదురయ్యే ప్రశ్న ఒకటి వుంటుంది. “మీరు పెళ్లి ఎందుకు చేసుకోలేదు?”. ఆమె చెప్పే జవాబు కూడా అలాగే వుంటుంది. “ ఎందుకు చేసుకోలేదు. చేసుకున్నాను. వాయులీనాన్ని (వయోలిన్) నేను ఎన్నడో పెళ్ళాడాను”. ఇలా అంటూనే మరో మాట అంటుంటారు. “మా తలితండ్రులు ఎంతో ముందుగానే ఊహించి నా పేరు కన్యాకుమారి అని పెట్టి వుంటారు”
ఆమెకు వయొలిన్ అంటే పంచ ప్రాణాలు. ఇందుకు దృష్టాంతంగా ఒక సంఘటన చెబుతారు. ఓసారి తన గురువు గారయిన ఎం ఎల్ వసంతకుమారితో కలిసి సంగీత కచ్చేరీ చేయడానికి  శ్రీ లంక వెళ్ళారు. వాళ్ళు బస చేసిన హోటల్ పై  ఎల్ టీటీఈ  ఉగ్రవాదులు దాడిచేసే ప్రమాదం వుందని, నిమిషాల్లో ఖాళీ చేయమని పోలీసులు హెచ్చరించారు. ‘గదిలో నా వయొలిన్ వుంది తెచ్చుకుంటాను” అని కన్యాకుమారి వెళ్లబోతుంటే ‘ఏమాత్రం ఆలస్యం చేసినా ప్రాణాలకు ముప్పు’ అనే పోలీసుల హెచ్చరికలను ఖాతరు పెట్టకుండా వెళ్లి దాన్ని తెచ్చుకున్నారు.  ఆ సంగీత పరికరంతో ఆమెకు వున్న అనుబంధం అలాంటిది.
విజయనగరానికి చెందిన ఆ సంగీత సరస్వతికి సంగీత కళానిధి పురస్కారం లభించడం తెలుగు నేలకు గర్వకారణం. (01-01- 2017)

       


1 కామెంట్‌:

శ్యామలీయం చెప్పారు...

.... విజయనగరానికి చెందిన ఆ సంగీత సరస్వతికి సంగీత కళానిధి పురస్కారం లభించడం తెలుగు నేలకు గర్వకారణం. ....

తెలుగువారం ఇటువంటి అనుచితగర్వాలకు పోకుండా ఉండటమే సముచితంగా ఉంటుంది. ఒక సంగీతసరస్వతికి మన నేలమీద ఆదరణ కల్పించం కాని వారు వేరే చోట స్థిరపడి ఆదరణపొంది బిరుదులూ పురస్కారాలూ పొందినపుడు మాత్రం వారిలో మనం తెలుగుమూలాలను వెదకి ఆఒక్కసారికీ గుర్తుచేసుకొని మరీ స్మరించుకొని సంబరపడే ముందు మనకు ఆ అర్హత ఏమాత్రం ఉన్నదీ అన్న ఆత్మపరిశీలన ఎన్నడైనా చేసుకుంటామా? లేదు. ఇక్కడ తెలుగువారిగా మన గర్వించవలసిన దానికన్నా మనమధ్యన ఉన్న జాతిరత్నాలను మనం గుర్తించలేకపోతున్నామే, గౌరవించుకోలేకపోతున్నామే, మన కళలనూ కళాకారులను మనం అగౌరవించుతున్నామే అని సిగ్గుపడవలసినదే చాలా ఎక్కువగా ఉన్నది అన్న స్పృహ మనకు ఎప్పటికి కలుగుతుంది? ఇలా సమయం దొరికినప్పుడల్లా ఉత్తిత్తి గర్వాలతో తృప్తిపడే ఆత్మవంచనలకు ఎప్పటికి మనం తెరదించుతాము?