7, డిసెంబర్ 2016, బుధవారం

ఇదీ సుపరిపాలన....రచయిత పరిచయం


సరిగ్గా పాతికేళ్ళ తరువాత పునరావృతం.
1989 లో జరిగిందిది. మళ్ళీ 2014లో.
కాకపోతే అప్పుడు కాకలు తీరిన రాజకీయ యోధుడు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ఆ వ్యక్తిని తనకుతానుగా ఎంపిక చేసుకున్నారు. ఇన్నేళ్ళకు మళ్ళీ, తెలంగాణా స్వప్నాన్ని సాకారంచేసుకుని ఆ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన కేసీఆర్ కూడా అదే వ్యక్తిని, అదే పదవికి ఎంపిక చేసుకోవడం కాకతాళీయం కావొచ్చేమో కాని అంత సులభం కాదు. అయితే, ఇలా జరగడానికి మాత్రం మార్కులు వేయాల్సి వస్తే అవన్నీ పూర్తిగా ఆ వ్యక్తికే వెయ్యాలి. అతడే జ్వాలా నరసింహారావు.
కేవలం ప్రతిభ కారణంగానే పదవిని పొందడం అనేది జ్వాలాగా చిరపరిచితుడైన వనం జ్వాలా నరసింహారావుకు వెన్నతో పెట్టిన విద్య. ఆ ప్రతిభను పసికట్టే ఆనాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి తన వద్ద పీఆర్వోగా జ్వాలాను స్వయంగా ఎంపిక చేసి నియమించుకుంటే, ఇప్పుడు తిరిగి తెలంగాణా ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖరరావు గారు అదే ఉద్యోగానికి మరింత పదోన్నతి కల్పించి తన పేషీ నుంచి పౌర సంబంధాలను ఆజమాయిషీ చేసే ప్రధాన అధికారిగా గురుతర భారాన్ని ఆ జ్వాలాకే అప్పగించారు.
ఒకనాడు చేసిన ఉద్యోగమే కాని అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు మారాయి. మీడియా విస్తరణ, మాధ్యమాల నిర్వహణ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. రాష్ట్రం రెండుగా విడిపోయింది. కొత్త సవాళ్ళ మధ్య కొత్త ప్రభుత్వం కొత్త తెలంగాణలో కొలువు తీరింది. ఈ నేపధ్యంలో పౌర సంబంధాలను, పేరుకు పౌర సంబంధాలు కానీ నిజానికి పత్రికా సంబంధాలు అనడమే సముచితం, సజావుగా నిర్వహించడం ఎవరికయినా కత్తి మీద సామే. అయితే పూర్వం సముపార్జించుకున్న అనుభవమే ఆయనకు శ్రీరామ రక్షగా అక్కరకు వస్తుంది. వస్తోంది కూడా.
సార్ధక నామధేయుడు
`పిల్లల్ని కంటాం కానీ, వాళ్ల రాతల్ని కనలేము కదా' అని బోలెడు, బారెడు నిట్టూర్పులు విడుస్తుంటారు కొందరు నిరాశావాదులు.
కానీ `జ్వాలా' తలితండ్రులు ఈ బాపతు కాదు. అందుకే అతడి స్వభావాన్ని ముందే గుర్తించి, భవిష్యత్తుని ముందే ఊహించి, తమ ఇష్టదైవంతో ముడిపెట్టి `జ్వాలా' అనే పదాన్ని బారసాల నాడే అయన పేరుకి జోడించారు. ఇన్నాళ్ళుగా ఆయన సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులకు `జ్వాలా' అనే సంక్షిప్త నామం కూడా ఎంతో కొంత దోహదం చేసి వుంటుందనే నా నమ్మకం! అలాగే ఆయన ‘మాటల్లోని వాడి, చేతల్లోని వేడి' జ్వాలా అనే ఈ పేరు పుణ్యవేునని మా బోంట్ల మరో నమ్మకం!
డెబ్భయ్యవ దశకం నుంచి ఈ నాటి వరకూ, `జ్వాలా' జీవితం `గ్రాఫు' గమనిస్తే పరమపద సోపాన పఠం గుర్తుకు వస్తుంది.
ఎంత ఎత్తుకి ఎదిగాడో. అంత కిందకు జారాడు. ఎన్ని నిచ్చెనలు ఎక్కాడో, అన్ని పాముల నోట్లో పడ్డాడు. అయినా, విసుగు చెందని విక్రమార్కుడిలా, పడిలేచిన కెరటంలా, మళ్లీ అంతకు మించిన, అతనికి మించిన ఎత్తులకి ఎగబ్రాకాడు. ఇంకా ఎక్కాల్సిన `శిఖరాల' కోసం అన్వేషిస్తున్నాడు. 
 ఈ విజయాల్లో, జ్వాలా నరసింహారావు పడిన కఠోర శ్రమా, వేసిన పథకాలూ, చేసిన ఆలోచనలూ, అంతకు మించి, ఆయన రక్తంలో జీర్ణించుకుపోయిన ‘అయాం ఆల్వేస్‌ రైట్‌' అనే తత్వం పునాదులుగా నిలిచాయి. ఆయన వ్యక్తిత్వాన్ని నిండుగా మలిచాయి. విశ్రాంతి ఎరుగని, విరామం కోరని, ఫలితం ఆశించని, పనిచేసుకుంటూ పోయే మనస్తత్వమే జ్వాలాని పరిపూర్ణ పురుషుడిగా తీర్చిదిద్దింది.
ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం మీ చేతుల్లో వున్న ఈ పుస్తకమే. నేను చెప్పిన దాంట్లో ఏవన్నా అనుమానాలు వుంటే ఇది చదవగానే తొలగిపోతాయి. అందుకు నాది గ్యారంటీ.
పొతే…..
ముఖ్యమంత్రి కార్యాలయం అంటేనే బిజీ. అందులో పనిచేసే ప్రధాన పౌరసంబంధ అధికారి మరీ బిజీ. ఇరవై నాలుగ్గంటల టీవీ ప్రసారాలు వచ్చాక ఆ ఉద్యోగం కాలంతో పరిగెత్తే బిజీ బిజీ ఉద్యోగంగా మారిపోయింది. ఓ పక్క ఆ కొలువు చేస్తూనే, మరో పక్క ఇంతటి బృహత్తర రచనా వ్యాసంగం నెరపాలంటే ఆ మనిషి సవ్యసాచి అయివుండాలి. అతి కొద్దికాలంలో ఇన్నిన్ని వ్యాసాలు అనేక పత్రికల్లో ప్రచురణకు నోచుకున్నాయంటే అవి రాయడానికి ఎంత శ్రమ పడివుండాలి. ఊహకు అందని విషయం.
‘పనిచేసేది సీఎమ్ ఆఫీసులో కదా, ఏది రాసినా పత్రికల్లో వస్తుంది’ అని తేలిగ్గా అనేవాళ్ళు ఎలాగూ వుంటారు. ఎవరేది రాసినా, మొహమాటానికి పోయి పత్రికలు ప్రచురిస్తారనేది కేవలం అపోహ మాత్రమే. ప్రామాణికత లేని రచనలు ప్రచురణకు నోచుకోవడం ఆషామాషీ కాదు. విభిన్న పత్రికల్లో ఈ వ్యాసాలు అచ్చయిన తీరు గమనిస్తే రచయిత ‘చేయితిరిగినతనం’ ఎంతటిదో బోధ పడుతుంది.
అలాగే, ఏదో కాలక్షేపం రాతలు అయితే అనుకోవచ్చు. అలా కాదే. ఒక హోదాలో వుండి రాసే ప్రతి అంశానికి సాధికారిత వుండి తీరాలి. బాధ్యత కలిగిన ముఖ్యమంత్రికి, బాధ్యత కలిగిన ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం. ఎలాంటి తభావతు వచ్చినా మెడకు చుట్టుకునే వ్యవహారం. అలాంటిదాన్ని ఎవరికీ మాట రాకుండా, ఎవరితో మాట పడకుండా ఈ అక్షర చండీ యాగాన్ని నిర్వహించడం సామాన్యమైన విషయం కాదు. ఈ యజ్ఞాలకు ముగింపులు వుండవు. పూర్ణాహుతులు వుండవు. ఇవి సతతం కొనసాగేవే. నిరంతర శ్రమజీవి అయిన జ్వాలా నుంచి ఇటువంటివి మరికొన్ని కోరుకునేవాళ్ళకు ఆయన ఆశాభంగం కలిగించడనేది నా నమ్మకం. 
 ‘తెలంగాణా ఆవిర్భావం తరువాత దాన్ని బంగారు తెలంగాణాగా ఎలా ఆవిష్కరింపచేసుకోవాలి’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం కంటున్న కలలకు ఇది అక్షర రూపం. ఆయన వివిధ సందర్భాలలో వెలిబుచ్చిన అభిప్రాయాలను, రచిస్తున్న ప్రణాళికలను, రూపొందిస్తున్న పధకాలను ఒక్క చోట చేర్చి, గుదిగుచ్చిన సాధికారిక సంకలనం. తెలంగాణా గురించి పరిశోధన చేసేవారికి ఉపయుక్తంగా వుండేంత గొప్ప సమాచారం, గణాంకాలు ఇందులో పొందుపరచడం మరో వైశిష్ట్యం. 
 ముఖ్యమంత్రికి ప్రధాన పౌర సంబంధ అధికారి కాబట్టి కేవలం ప్రశంసాపూర్వక పద విన్యాసాలే వుంటాయని అనుకోవడం సహజం. సహజంగా తెలంగాణా అభిమాని కాబట్టి కేసీఆర్ స్వప్నాల సాకారత విషయంలో ఆయనకూ ఆశలు వున్నాయి. అడియాసలు లేవు. అంచేతే కేసీఆర్ ఆలోచనలను వివరించేటప్పుడు అతిశయోక్తులు దొర్లకుండా మంచి పరిణతి, విజ్ఞత ప్రదర్శించారు.
పొతే, ఈ పుస్తకానికి, ‘ఇదీ సుపరిపాలన” అంటూ జ్వాలా పెట్టిన పేరు గురించి ఓ చిన్న ముచ్చట చెప్పుకోవాలి.
“సుపరిపాలన అంటే ఇలావుండాలి, అదే కేసీఆర్ పాలన” అనే అర్ధం, ఇందులో వుంది. అంతేకాని, “ఇదే సుపరిపాలన” అనలేదు. అంటే భజన అయ్యేది. కానీ అలా చేయకపోవడమే జ్వాలా కలంలోని చమత్కారం. 
ఇక, ఒక తుది పలుకు కూడా అడగకుండానే జత చేయాల్సి వస్తోంది.
అదేమిటంటే, రచయిత గురించి ఈ కొద్ది మాటలు రాయడానికి నేను పడ్డ కష్టం.
ఇందులో అంత శ్రమ ఏమిటి అనిపించవచ్చు.
పరిచయం అవసరం లేని జ్వాలా నరసింహారావును పరిచేయడం అంటే మాటలా మరి!
- భండారు శ్రీనివాసరావు
98491 30595

Courtesy Shri Vanam Jwala Narasimha Rao 

5, డిసెంబర్ 2016, సోమవారం

అమ్మయ్య ఫస్టు గడిచింది

మా వలలి (వలలుడు అంటే వంటవాడు, వలలి అంటే వంటమ్మాయి అనేది కొత్త నిర్వచనం) కూడా ఆన్ లైన్ లో నెల జీతం తీసుకోవడానికి ఒప్పుకుని బ్యాంకు ఖాతా నెంబరు ఇచ్చింది. పాల వాడు, పేపరు వాడు నసిగారు. వచ్చే నెల రెండూ కలిపి ఇవ్వండి పోనీ అంటూ ఓ ఆఫరు ఇచ్చారు. పనిమనిషి, వాచ్ మన్ జీతాలు మాత్రం మేమే సర్దేసాము. సరుకులు, కరెంటు బిల్లు  ఎట్లాగూ ఆన్ లైనే. కూరగాయలు ఒక్కటే ఇక మిగిలిన సమస్య. మొత్తానికి ‘అమ్మో ఫస్టు తారీఖు’ గండం గడిచినట్టే. మళ్ళీ నెలతర్వాత కదా!

నందో రాజా భవిష్యతి!    

ఈ దేశంలోనే సాధ్యం



సామాన్య జనాలు పచారీ సామాన్లు, కూరగాయలు కొనుక్కోవడానికీ పనికి రాని రద్దయిన నోట్లు, ప్రభుత్వాలకు పన్ను బకాయిలు చెల్లించడానికి, దేవుడి హుండీల్లో వేసి మొక్కులు తీర్చుకోవడానికి ఎలా పనికి వస్తాయో అర్ధం కాని విషయం. 

4, డిసెంబర్ 2016, ఆదివారం

ఇదీ రాజకీయం!

పొద్దున్న టీవీ చర్చలో ఒక నాయకుడి ఉవాచ: “పార్టీ అధినాయకుడు ఎంతటి గొప్ప నాయకుడు అయినా సరే, పార్టీని మించి ఎదగాలని ఆలోచిస్తే పార్టీ వాళ్ళే అంగీకరించరు, అడ్డుకుంటారు కూడా!"

నాన్నకు జేజే


మా నాన్నగారి ఆబ్దీకమే మా కుటుంబంలో నలుగురూ కలిసే సందర్భంగా గత అరవై ఏళ్ళుగా వుంటూ వస్తోంది. మా పెద్దన్నయ్య కీర్తిశేషులు పర్వతాలరావు గారు తన జీవిత కాలంలో దీన్ని అత్యంత నిష్టగా జరుపుతూ వచ్చారు. ఏడుగురు అక్కయ్యలు, నలుగురు అన్నదమ్ములం పిల్లాపాపలతో ఏటా కలిసే ఈ సందర్భాన్ని ఎలాటి లోటు లేకుండా నిర్వహించడానికి ఎంతో శ్రమపడుతూ వచ్చిన మా మూడో అన్నయ్య వెంకటేశ్వర రావు గారు అకాలంగా  కాలం చేయడం వల్ల, మా మూడో అన్నగారు రామచంద్రరావు గారు మా తాతయ్యకు దత్తు పోవడం వల్ల, తదనంతకాలంలో  ఈ పవిత్రమనిన బాధ్యత నాపై పడింది. మొత్తం కర్తా, కర్మా మా మూడో అన్నగారే అయినా, క్రియ రూపంలో మాత్రమే ఈ క్రతువుకు కర్తను నేను.
చనిపోవడానికి ముందు మా బావగారు కోడక్ కెమేరాతో తీసిన మా నాన్నగారి అస్పష్ట రూపం ఫోటో రూపంలో మా వూళ్ళో మా ఇంటి వసారాలో వుంది. అది  తప్ప ఆయన ఎలా వుంటారోకూడా నాకు తెలియని చిన్నతనంలోనే మా నాన్నగారు భండారు రాఘవరావు గారు మరణించారు.

ఈరోజు వారి ఆబ్దీకం. ఆత్మశాంతి కోరుకుంటూ శిరసాభివందనం.  

3, డిసెంబర్ 2016, శనివారం

తెలిసిన వ్యక్తిలో తెలియని అంశాలు

My article on Savitri Sai book on KV Ramana (IAS) published in AKSHARA of Andhra Bhoomi, Telugu Daily today.Courtesy Shri Mvr Sastry

తెలంగాణా ప్రభుత్వ సలహాదారు, స్వచ్చంద పదవీ విరమణ చేసిన ఐ.ఏ.ఎస్. అధికారి శ్రీ కే,వీ.రమణ  జీవన యానంపై  శ్రీమతి సావిత్రీ సాయి రాసిన పరిశోధక గ్రంధం గురించిన నా సమీక్షను   ఆంధ్ర భూమి దినపత్రిక 'అక్షర' లో ఈరోజు ప్రచురించారు. పత్రిక సంపాదకులు శ్రీ ఏం.వీ.ఆర్. శాస్త్రికి కృతజ్ఞతలు.


2, డిసెంబర్ 2016, శుక్రవారం

నేషన్ వాంట్స్ టు నో



మొండివాడు రాజుకన్నా బలవంతుడంటారు.  రాజే మొండివాడయితే ఇక చెప్పేది ఏముంటుంది?
మోడీకి మొండివాడనే పేరుంది. నిజానికి ఆ మొండితనమే ఆయన్ని ఇంతవాడ్ని చేసిందంటారు. ఆ మొండి తనమే ఆయనకి ఇంతమంది అభిమానుల్ని సంపాదించి పెట్టింది. అయితే మొండితనం ఎల్లవేళలా అక్కరకు రాదు.
నిజానికి పెద్ద నోట్ల రద్దు నిర్ణయం చాలా సాహసోపేతమైనది. నవంబరు ఎనిమిదో తేదీన ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు మోడీ అభిమానులేకాదు అత్యధికులయిన దేశ ప్రజలు మోడీ చొరవను మనసారా స్వాగతించారు. మోడీ ఒక్కడే మొనగాడని, ఆయన మాత్రమే ఇటువంటి సాహసం చేయగలడని వేనోళ్ళ పొగిడారు. ఈ పొగడ్తలు ఒక దశలో మోతాదు మించి ఎమర్జెన్సీ రోజుల్లో ఇందిరాగాంధీని ఆకాశానికి ఎత్తిన రోజుల్ని గుర్తుకు తెచ్చాయి. ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టయిన అభిప్రాయ వ్యక్తీకరణ స్వేచ్చను హరించడం వల్ల ఆ రోజుల్లో ప్రజలు యెంత ఉడ్డుగుడుచుకున్నదీ తొంభయ్యవ దశకం తరువాత జన్మించిన నేటి తరం మోడీ అభిమానులకి తెలిసే అవకాశం లేకపోవచ్చు.
ఎమర్జెన్సీ ప్రకటించిన తొలిరోజుల్లో ప్రత్యర్ధ రాజకీయ నాయకులను మినహాయిస్తే సామాన్య ప్రజలు చాలా ఊరట పొందారు. రైళ్ళు ఠ౦చనుగా వేళప్రకారం నడిచాయి. రోజులతరబడి ఆఫీసుల మొహం చూడని  ప్రభుత్వ సిబ్బంది ఖచ్చితంగా వేళకు కార్యాలయాల్లో కనబడేవారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా  లంచాలు అడగడానికి,  తీసుకోవడానికి భయపడ్డారు. బెజవాడ వంటి పట్టణాల్లో ప్రజలు బహిరంగ మూత్ర విసర్జనకు స్వస్తి చెప్పారంటే తొలినాళ్లలో ఎమర్జెన్సీ అనేది  ప్రజల్ని ఎంతగా ప్రభావితం చేసిందో అర్ధం చేసుకోవచ్చు.
అయితే ఈ బుడగ పగలడానికి ఎన్నో రోజులు పట్టలేదు. ఆ తరువాత ఎమర్జెన్సీ ముసుగులో జరిగిన అనేక అత్యాచారాలు బయట పడ్డాయి. జాతి చెల్లించుకున్న మూల్యం ఏమిటన్నది తదనంతర కాలంలో వెలుగులోకి వచ్చింది. జనం కళ్ళు తెరిపిళ్ళు పడ్డాయి. ఆ తరువాత జరిగింది చరిత్ర. ప్రజాగ్రహానికి గురయిన ఇందిర ప్రభుత్వం గద్దె దిగాల్సివచ్చింది.
పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో అద్భుతాలు జరిగిపోగలవని ఎవ్వరూ అనుకోలేదు. కాకపొతే సాహసోపేత నిర్ణయం అని చాలామంది భావించారు. వారిలో  నేను  కూడా ఒకడ్ని.
అయితే రోజులు గడుస్తున్న కొద్దీ సామాన్య జనం ఆలోచనల్లో మార్పు రావడం మొదలయింది. అనుకున్నది ఒకటయితే, జరుగుతున్నది మరొకటన్న అభిప్రాయం బలపడసాగింది. పెద్ద నోట్లు కూడబెట్టి, పెద్ద పెద్ద మేడలు కట్టిన బడా బాబులు ఎవ్వరూ ప్రభుత్వ నిర్ణయంతో కలవరపడకపోవడం వారిని ఆశ్చర్య పరిచింది. ఏమీ జరగనట్టు  నల్ల కుబేరులు కాలుమీద కాలువేసుకుని నిబ్బరంగా వుంటుంటే, తాము మాత్రం రాత్రీ పగలూ తేడాలేకుండా బ్యాంకుల ముందూ, ఏటీఎంల పడిగాపులు పడడం ఏమిటన్న సందేహం పొటమరించింది. తమ డబ్బు తాము తీసుకోవడానికి ఇంతగా హైరానా పడాలా అనే ప్రశ్నలు వారిని వేధించడం మొదలు పెట్టాయి. మూడు వారాలు గడిచిపోతున్నా  కష్టాలు, కడగండ్లు పెరుగుతూ పోవడం తప్ప ఉపశమనం కనుచూపు మేరలో కనబడక పోవడంతో వారిలో సహనం తగ్గిపోవడం ఆరంభమైంది.  ‘కాస్త ఓపిక పట్టండి, మంచి రోజులు ముందున్నా’యని ప్రభుత్వం ఇస్తున్న భరోసా సామాన్యులను సంతృప్తి పరచడం లేదు. నిజానికి ప్రజలకు వున్న ఓరిమి చాలా గొప్పది. సర్దుకుపోయే తత్వం ఇంకా గొప్పది. అంచేతే యాభయ్ రోజులు ఎదురు చూడడానికే సిద్ధపడ్డారు. ఆ తరువాత కూడా ఓపికపడతారు. ఎందుకంటే జనాలు ఆశాజీవులు. బతుకులు బాగుపడకపోతాయా అనే ఆశతోనే బతుకు బండి లాగడానికి అలవాటు పడ్డారు.  అది రాజకీయులకు కూడా తెలుసు. అంచేతే ఆశకంటి కురుపు భయం లేకుండా ప్రజలకు ఆశలు కల్పిస్తూనే వుంటారు.  వాళ్ళు కావాలని మరచిపోయే వాస్తవం ఒకటుంది. ఓపికకు కూడా హద్దు ఉంటుందని, ఆ హద్దు మీరితే  ఆ జనమే ఓటుతో బుద్ది చెబుతారని. గతం చెబుతున్న నిలువెత్తు నిజం ఇది.
నిజంగా దేశంలో నల్లధనం లేకుండా చేస్తే మొత్తం జాతి మోడీకి రుణపడి వుంటుంది. ఈ విషయం నిశ్చయంగా చెప్పవచ్చు. ఒకవేళ వైఫల్యం చెందితే. ఆ పరిణామాలను ఊహల్లో భరించడం కూడా కష్టం. ఎమర్జెన్సీ గాయాలు మానడానికి ఎన్నేళ్ళు పట్టిందో తెలిసిన వారికి ఈ భయం మరింత ఎక్కువగా వుంటుంది. అప్పట్లో ఎట్లాగో అట్లా ప్రజలు ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించుకోగలిగారు కనుక సరిపోయింది.
ఈనాటి సమస్య  ఆర్ధిక వ్యవస్థకు సంబంధించినది. అత్యంత వేగంగా ఎదుగుతున్న దశలో ఎటువంటి అవాంతరం ఎదురయినా అభివృద్ధి కుంటుపడడమే కాదు, స్తంభించిపోయే ప్రమాదం కూడా వుంటుంది. ఆర్ధిక నిపుణులు చేస్తున్న హెచ్చరికలు ఇవే. మంచి కోసం చేసే  సాహసోపేత నిర్ణయాలు ఊహాతీత పరిణామాలకు దారి తీయకూడదు. ఆచితూచి చేయాల్సిన పనులను హడావిడిగా చేయడం వల్ల ఒక్కోసారి అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. అదే ఇప్పుడు జరుగుతోంది.
పెద్ద నోట్ల రద్దు దరిమిలా ఇబ్బందులు ఎలా వున్నా జాతి మాత్రం పొదుపు మంత్రం పఠిస్తోంది. విచ్చలవిడిగా చేసే ఖర్చుకు కళ్ళెం పడింది. అనవసర కొనుగోళ్ళు నిలచిపోయాయి. అవసరం అయితేనే జేబులోంచి డబ్బు బయటకు తీసే పాత రోజులు వచ్చేశాయి. నిర్బంధ వ్యయ నియంత్రణ అమలవుతోంది.
అదే సమయంలో వచ్చిన జీతాల రోజు, ఫస్టు తారీఖు, వేతన జీవులకు చుక్కలు చూపించింది. తమ కష్టార్జితంలో కొంత తీసుకోవడానికి క్యూల్లో గంటలు గంటలు నిలబడాల్సి రావడం నిజంగా ఎన్నడూ ఎరుగని అనుభవమే. జీతం కోసం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నిలువుకాళ్ళ జీతం, ఏవిటో చిత్రం. నెలసరి జీతాల వాళ్ళ పరిస్తితే ఇలా వుంటే దినసరి ఆదాయాలవారి  సంగతి చెప్పనక్కర లేదు. చేతిలో పైసలు ఆడక చిరు వ్యాపారాల వాళ్ళు దిగాలు పడుతుంటే మరోపక్క భారీ ఎత్తున కొత్త కరెన్సీ నోట్లు బయట పడుతున్న సంఘటనలు, పెద్ద ఎత్తున జరుగుతున్నకరెన్సీ నోట్ల అక్రమ మార్పిళ్ళూ ప్రజలను విభ్రమానికి గురిచేస్తున్నాయి. ప్రయోగ విజయం పట్ల సందేహాలను పెంచుతున్నాయి.
నగదు రహిత భారతం ఆవిష్కరణ గురించి నేతాశ్రీలు చేస్తున్న ప్రసంగాలు సామాన్యులను  నివ్వెర పరుస్తున్నాయి. పోస్ట్ కార్డు మొహమే చూసి ఎరుగని వాళ్లకు ఏటీఏం కార్డు ప్రయోజనాలు గురించి చెప్పడం వింతల్లోవింత. అన్నప్రాసన నాడే ఆవకాయ కారం తినిపించినట్టుగా వుందని హేళన స్వరాలు వినిపిస్తున్నాయి. ఈ ఉచిత ఉద్బోధలు చేస్తున్న నాయకమణ్యులు ఒక్కసారంటే ఒక్కసారి  ఆన్ లైన్లో ఒక్క రూపాయి ట్రాన్సాక్షన్ చేసి చూపించగలరా అనే మౌన ప్రశ్నకు జవాబు ఏదీ?
ఇప్పుడు పులిమీద పుట్రలా బంగారం మీద అంక్షలు. మనిషికి ఇంత బంగారమే ఉండాలనే నిబంధనలు మళ్ళీ ఏ ప్రకంపనలు సృష్టిస్తాయో తెలియదు. వెనుకటి రోజుల్లో భూసంస్కరణల వల్ల ఒనగూడిన ప్రయోజనాలు ఏ పాటివో తెలిసిన వారికి జరగబోయేది ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. పైగా ఇది సెంటిమెంటుతో, ప్రత్యేకించి మహిళలతో ముడిపడిన వ్యవహారం. ఏ వైపు తిరుగుతుందో, యెంత దూరం సాగుతుందో చెప్పడం కష్టం.
ఇవన్నీ చూస్తున్నప్పుడు గురి పెట్టిన బాణం సరయిన  దిశలోనే వెడుతోందా, మధ్యలో దారితప్పుతోందా అనే కొత్త ప్రశ్న తలెత్తుతోంది.  నేషన్ వాంట్స్ టునో. జాతి తెలుసుకోవాలని అనుకుంటోంది.
అందుకే చెప్పేది.   
         
నల్లధనంపై మొదలు పెట్టిన పోరాటంలో నరేంద్ర మోడీ గెలవాలి. గెలిచి తీరాలి. ఇది మోడీ అభిమానులు కోరుకుంటున్నదే కాదు ఆయన్ని నరనరాన ద్వేషించే వాళ్ళు  సైతం ఇదే  కోరుకుంటున్నారు. ఎందుకంటే మోడీ ఈ ప్రయత్నంలో  విఫలం అయితే ఆ ప్రభావం ఆయనకూ, ఆయన పార్టీకి మాత్రమే  కాదు యావత్  దేశానికీ చుట్టుకుంటుంది. ప్రపంచ దేశాల్లో ఈనాడు ఎన్నదగిన ఆర్ధిక శక్తిగా ఎదుగుతూ వస్తున్న భారత దేశం కొన్ని దశాబ్దాలు వెనక్కు పోతుంది. మళ్ళీ కోలుకోవాలన్నా, కనీసం ఈనాడు వున్న స్తితికి చేరుకోవాలన్నా ఏండ్లూపూ౦డ్లూ పట్టే ప్రమాదం వుంది. కారణం మోడీ స్వారీ చేస్తున్నది భయంకరమైన, జాతిని పీల్చి పిప్పి చేస్తున్న నల్లధనం అనే రక్కసి పులి మీద. మోడీ జయిస్తే పరవాలేదు. కానీ పులిదే పై చేయి అయితే, ‘పరవాలేదు’ అని చెప్పుకోవడానికి కూడా ఏమీ మిగలదు. పొంచివున్న పెద్ద ముప్పు ఇదే. నోబుల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ కానీ,  విధి వశాత్తు రాజకీయాల్లోకి వచ్చిన సుప్రసిద్ధ ఆర్ధిక వేత్త మన్మోహన్ సింగ్ అయినా, రాజకీయాలకు అతీతంగా ఆలోచించేవాళ్ళయినా చేసే హెచ్చరికలు ఇవే!
గుడ్డిగా కళ్ళు మూసుకుని ముందుకు సాగితే కాలు రహదారిలోకి సాగొచ్చు, ముళ్ళ దారిలోకి దారి తీయొచ్చు. రెంటికీ అవకాశం వుంది కాబట్టే జాగ్రత్తల అవసరం ఎక్కువ వుంది. ఇది మోడీకీ, ఆయనను గుడ్డిగా అభిమానించేవారికీ, మోడీ వ్యతిరేకులకూ, వారిని కళ్ళు మూసుకుని సమర్ధించేవారికి మాత్రమే సంబంధించిన సమస్య అనుకోవడం మంచిది కాదు.  నూట పాతిక కోట్లమంది భారతీయుల భవిత దీనితో ముడిపడి వుంది.
అభిమాన దురభిమానాలు పక్కనబెట్టి, రాజకీయాలకు అతీతంగా  మోడీ విజయం సాధించాలని మనసారా కోరుకుందాం. మనకోసం కాదు, మోడీ కోసం కాదు, మన దేశ భవిష్యత్తు కోసం. భవిష్యత్ తరాల భద్రతకోసం. (03-12-2016)

This article was published in SURYA telugu daily, dated 4th DEc.16, SUNDAY.




రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com, మొబైల్: 98491 30595