19, జూన్ 2016, ఆదివారం

టుడే ఫాదర్స్ డే - నాన్న చెప్పిన మాట


ఇన్నేళ్ళ తరువాత కూడా నా చిన్ననాటి సంఘటన నాకు బాగా గుర్తుంది.
రోజుల్లో ఇంటెడు చాకిరీతో అమ్మ ఎంతో కష్టపడుతుండేది. అయినా,  ఎన్ని పని తొందరలు వున్నా నాకిష్టమయిన చిరుతిళ్ళు మాత్రం టంచనుగా  చేసిపెడుతుండేది. చిన్నతనం వల్ల  కావచ్చు, అమ్మ చేసిన గారాబం వల్ల కావచ్చు  అమ్మ ఎంత బాగా చేసినా  ఏదో ఒక వంక పెట్టి సతాయించేవాడిని.
రాత్రి అమ్మ నాన్నకు భోజనం పెడుతుంటే చూశాను. అన్నం మాడిపోయివుంది. దానికి తోడు  చల్లారిన చారు. కానీ నాన్న మారుమాట్లాడకుండా, మారు అడిగి మరీ  భోజనం చేయడం చూసి ఆశ్చర్యపోయాను.
మర్నాడు అమ్మ నాన్నతో అంటోంది. రాత్రి అన్నం మాడిపోయింది. మళ్ళీ చేసిపెట్టే టైం లేకపోయింది. మీరు అలానే తిని  నైట్ డ్యూటీకి వెళ్లారు. నాకెంతో బాధ వేసింది.
అప్పుడు నాన్న చెప్పిన  జవాబు నన్ను మరింత ఆశ్చర్యానికి గురి చేసింది.
భలేదానివే. అన్నం మాడిపోయిందని నీవనుకుంటున్నావు. నాకు మాత్రం మాడిపోయిన అన్నం చెక్కలంటే ఎంతో ఇష్టం. చిన్నప్పుడు మా అమ్మ అలా మాడిపోయిన అన్నం చెక్కలపై వెన్న రాసి పెడితే ఆవురావురుమంటూ తినేవాడిని తెలుసా!    
నాన్న మాటలు నమ్మబుద్ధి కాలేదు. రాత్రి  అమ్మ వంటింట్లో పనిలో వున్నప్పుడు చూసి అడిగాను.
ఒరేయ్  నాన్నా
నాన్న నన్ను ముద్దుగా నాన్నా అని పిలుస్తాడు.
అమ్మ వుదయం నుంచి రాత్రిదాకా ఎంత కష్టపడుతున్నదో రోజూ చూస్తున్నాం కదా. అప్పటికే  బాగా  అలసిపోయి వుంది. అంత రాత్రప్పుడు మళ్ళీ  ఏం వొండి పెడుతుంది చెప్పు. అయినా ఒక్క రోజు  మాడిన అన్నం తింటే ఏమవుతుంది ? కడుపు మాడదు కదా!
ఒక మాట చెబుతున్నాను గుర్తుపెట్టుకో. 
జీవితంలో అన్నీ మన కిష్టమయినట్టు జరగవు.  మనం ఇష్టపడ్డ మనుషులే  మనకు తారసపడరు. అన్నీ సవ్యంగా సక్రమంగా జరగాలని అనుకోవడంలో తప్పు లేదు. కానీ సవ్యంగా జరగని వాటికి మనం ఇతరులను తప్పు పట్టటం పెద్ద తప్పు. తప్పు నువ్వెప్పుడు చేయకు. ఇంకో విషయం.  నాకు వొంట చేయడం రాదుకదా కనీసం గ్యాస్ పొయ్యి వెలిగించడం కూడా రాదు. ఇక అమ్మ చేసే  వంటకు వంక పెట్టే హక్కునాకెలా వుంటుంది చెప్పు.
ఇన్నేళ్ళ జీవితంలో నేను కొన్ని పాఠాలు నేర్చుకున్నాను. ఇతరుల పొరబాట్లను మంచి మనసుతో స్వీకరించగలగాలి. అప్పుడే నలుగురితో మన సంబంధాలు బాగుంటాయి. సంబంధాలే పది  కాలాలపాటు చెక్కుచెదరకుండా వుండి జీవితాలకు శోభనిస్తాయి.
మళ్ళీ  చెబుతున్నా విను. ఇతరులలోని మంచితనాన్ని  గ్రహించే శక్తిని భగవంతుడు నీకివ్వాలని కోరుకుంటున్నాను. అలాగే పక్కవారి తప్పులను ఎత్తిచూపే దుర్గుణం నీనుంచి దూరం కావాలన్నది కూడా నా కోరిక.
నీ జీవితంలో ఎదురయ్యే చెడు సంఘటనలను, నీ మనసులో మెదిలే చెడు ఆలోచనలను భగవంతుడి పాదాలవద్ద వొదిలెయ్యి. నువ్వు గ్రహించిన మంచిని నీలోనే వుంచుకో. చెడ్డ విషయాల సంగతి   దేవుడే  చూసుకుంటాడు. నీ మంచి మాత్రం నిన్ను మంచి దోవలో నడిపిస్తుంది. అప్పుడు మాడిపోయిన అన్నం కూడా నీకు పరమాన్నంలా అనిపిస్తుంది.
ఇదో కధ అనుకుంటే ఇందులోని నీతి:
జీవితంలో  మీరు  కలిసే వారెవరో, మీకు తారసపడేవారెవరో కాలమే నిర్ణయిస్తుంది.
మీరు  కోరుకునే వ్యక్తులను మీ  మనసే నిర్ణయిస్తుంది.
కానీ జీవితంలో మీ వెంట నడిచే వ్యక్తులెవరన్నది మీ  ప్రవర్తనే నిర్ణయిస్తుంది.
ఇతరుల తప్పిదాలను తేలిగ్గా తీసుకుని, ఇతరులతో విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకుని ముందుకు నడిస్తే  ఇతరులతో మీ  సంబంధాలు శాశ్వితం అవుతాయి. జీవితం పూల పానుపు అవుతుంది. లేకపోతే ముళ్ళ కంపగా మారుతుంది. (17--06-2012)


ఇండియా దటీజ్ భారత్ !


ఉయ్యాలలో పిల్లవాడిని పెట్టుకుని ఊరంతా వెతికినట్టు అనే సామెతకు అతికినట్టు సరిపోయే ఉదంతం ఇది.
చైనాలోని సేద్యపు నీటి ప్రాజెక్టులను గురించి అధ్యయనం చేయడానికి, చాలాయేళ్ళ క్రితం భారత ప్రభుత్వం ఒక ఉన్నతాధికార బృందాన్ని ఆ దేశానికి పంపింది. పెద్ద పెద్ద డ్యాం లలో ఆనకట్టల వద్ద పేరుకుపోతున్న ఇసుక, మట్టి మేటల్ని తొలగించే విషయంలో, ఆ బృందంలో ఒక సభ్యుడికి కొన్ని సాంకేతికపరమైన సందేహాలు వున్నాయి. పనిలో పనిగా అక్కడి నిపుణులను ఈ విషయంలో సంప్రదించాడు.  అడిగిన వ్యక్తిని వారు ఎగాదిగా చూసి, ‘మీరు వచ్చింది ఇండియా నుంచే కదా’ అన్నారు. ఔనన్నాడు మనవాడు. మరీ పై సామెత చెప్పకపోయినా ఆ అర్ధం వచ్చేలా వాళ్ళు సమాధానం చెప్పారు.
“అయ్యా! మీ దేశంలోనే ఇందుకు సంబంధించిన నిపుణుడు ఒకరు వున్నారు. బెంగుళూరులో వుంటారు. ఆయన పేరు డాక్టర్ కే.జీ. రంగరాజు. సేద్యపు నీటి ప్రాజెక్టులలో మాకేవయినా సందేహాలు వస్తే వాటిని నివృత్తి చేసుకోవడానికి వారినే సంప్రదిస్తాం”



(ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గతంలో కేంద్ర సేద్యపు నీటి మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా పనిచేసిన జంధ్యాల హరినారాయణ ఒకరోజు   మిత్రుడు డాక్టర్ గోపాల్ ఇంట్లో ఏర్పాటు చేసిన విందులో చెప్పిన వృత్తాంతం ఇది. డాక్టర్ ఊట్ల బాలాజీ, జ్వాలా నరసింహా రావు కూడా హాజరయ్యారు. ఆ సందర్భంగా బాలాజీ తీసిన ఫోటో ఇది) 

18, జూన్ 2016, శనివారం

అమరావతి ట్రైన్

“ఎవరూ, సుబ్బారావు గారా! మీ ఫైల్ ఇప్పుడే  సికిందరాబాదులో రైలు ఎక్కగానే చూశాను. నల్గొండలో  ఏఎస్ చూసి డీఎస్ కుపంపుతారు. గుంటూరులో సెక్రెటరీ చూస్తారు. బెజవాడ స్టేషనుకు వచ్చి ఆర్డరు కలెక్టు చేసుకోండి”


17, జూన్ 2016, శుక్రవారం

బస్సులో వచ్చిన మనిషి హెలికాప్టర్ ఎలా సంపాదించాడు?


నిన్న మరణించిన మిత్రుడు విష్ణుమూర్తి గురించిన మరి కొన్ని జ్ఞాపకాలు:
నాయుడమ్మ అవార్డు  తీసుకునేవాడు అల్లాటప్పా మనిషి కాకూడదు అనేది విష్ణుమూర్తి మొదటి షరతు. దానికి కట్టుబడే ఇరవై నాలుగుమందికి ఏడాదికి ఒక్కరి చొప్పున ఇన్నేళ్ళుగా తెనాలిలో ఇస్తూ వస్తూనే వున్నారు.
ఇక ముఖ్య అతిధి సంగతి, ఆయన ముఖ్యమంత్రి అయినా, గవర్నర్ అయినా తెనాలి రావాల్సిందే. ఈ షరతు కారణంగా కొందరు రావడానికి ఒప్పుకుని కూడా రాలేని పరిస్తితి. వారిని తప్పుపట్టడానికి కూడా వీల్లేదు.
ఒకసారి సామ్  పెట్రోడా కి ఇవ్వాలనుకున్నారు. కానీ ఆయన్ని ఒప్పించడం ఎలా! సోమసుందర్ ఇత్యాది బృందం తలలు పట్టుకున్నారు. చివరికి ఓ మార్గం దొరికింది. ప్రముఖ  చిత్రకారుడు ఎస్వీ రామారావు గారు చికాగోలో వుంటారు. ఆయనకీ, పెట్రోడా గారికీ స్నేహం. ఆయన్ని పట్టుకుని పెట్రోడా మహాశయుల్ని ఒప్పించారు. అక్కడికి ఒక సమస్య తీరింది. అవార్డు కార్యక్రమం రోజున ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాదు వస్తారు. ఆయన్ని రోడ్డు మార్గంలో కాకుండా అదేరోజు తెనాలి తీసుకుపోవాలంటే హెలికాప్టర్ కావాలి. మరెలా! మళ్ళీ మిత్ర బృందం ద్వారకలో భేటీ అయి మరోసారి తలలు పట్టుకుంది. అంతే! ఓ ఐడియా తలుక్కున మెరిసింది. హెలికాప్టర్ సదుపాయం వున్న ముఖ్యమంత్రిని ముఖ్య అతిధిగా పిలిస్తే!
ఇక్కడ తెనాలి, తెనాలి వరస కుదిరింది. పొలోమని వెళ్లి రోశయ్యగారికి చెప్పుకోవడం, ఆయన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డిని ముఖ్య అతిధిగా ఒప్పించడం చకచకా జరిగిపోయాయి. అప్పుడు మరో అవాంతరం. అది బయట వాళ్ళనుంచి కాదు, ఏకంగా విష్ణుమూర్తి గారి నుంచి. చెప్పాకదా! ఆయనో సీతయ్య. హెలికాప్టర్ వెలుతురు వున్నప్పుడే తెనాలి నుంచి టేకాఫ్ అవ్వాలి. ప్రోగ్రాం ని కాస్త ముందుకు జరపమంటే విష్ణు మూర్తి గారికి అభ్యంతరం. మొత్తం మీద కాస్త పట్టు సడలించేలా  చేయడానికి ద్వారకలో (హోటల్లో మిత్రులతో) కాస్త ఎక్కువ సమయం గడపాల్సి వచ్చింది.
ఇక శుభం కార్డు వేయొచ్చు అనేంతలో వై ఎస్ ఆర్ ఆ కార్యక్రమానికి హాజరు కాలేని అర్జంటు పనేదో పడింది. అయితే ఆ సమస్యను ఆయనే తెలివిగా పరిష్కరించారు. రోశయ్యగారయితే ప్రసంగాలు చేయడంలో దిట్ట నా బదులు ఆయన వస్తారని చెప్పి మొత్తం మీద టెన్షన్  తగ్గించారు. ముఖ్య అతిధిగా రోశయ్యగారు, అవార్డు గ్రహీతగా సామ్  పెట్రోడా గారు హెలికాప్టర్ లో హైదరాబాదునుంచి తెనాలి వెళ్లి వచ్చారు.
ఇన్నిన్ని పనులు చక్కబెట్టాలంటే ఆ వ్యక్తీ వెనుక యెంత వుండాలి?

విష్ణుమూర్తి గారి వెనుక ఏమీ లేదు, కేవలం పట్టుదల తప్ప.        

తెనాలి ప్రేమికుడు


డాక్టర్ సామ్ పిట్రోడా, డాక్టర్ మాధవన్ నాయర్, డాక్టర్  కోట హరినారాయణ, డాక్టర్ కే. కస్తూరి రంగన్, డాక్టర్ ఎస్. స్వామినాధన్, ప్రొఫెసర్ ఎం.జీ.కే. మీనన్, డాక్టర్ యూ.వీ. వర్లు, వీళ్ళందరూ విభిన్న రంగాల్లో ప్రసిద్ధి చెందిన ప్రముఖ శాస్త్రవేత్తలు. మరి వీళ్ళందరికీ కామన్ పాయింటు ఒకటుంది. అదేమిటంటే డాక్టర్ నాయుడమ్మ అవార్డు గ్రహీతలు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో విశిష్టమైన పురస్కారంగా ఈ అవార్డును పరిగణించడం కద్దు. అంతే  కాదు, ఏటా ఇచ్చే ఈ అవార్డును స్వీకరించడం కోసం దేశంలోని సుదూర ప్రాంతాలనుంచి గ్రహీతలు తెనాలి వెళ్లి తీరాల్సిందే. అవార్డు ట్రష్టీల్లో ఒకరయిన పీ. విష్ణు మూర్తి గారిది ఈ గొప్పతనం. ఆయన పట్టుదలే క్షణం తీరికలేని అంతమంది ప్రముఖులను తెనాలి వెళ్ళేలా చేసింది. చాలా సందర్భాలలో నేనే ప్రత్యక్ష సాక్షిని.
విష్ణుమూర్తి గారిని  నాకు పరిచయం చేసింది హిందూ మాధవరావు గారు. ఆయనకో ఇంటి పేరుంది కానీ బహుశా ఆయనా  మరచిపోయి వుంటారు. హిందూ పత్రికలో సుదీర్ఘ కాలం విలేకరిగా పనిచేయడం వల్ల ఆ పేరే స్థిర పడిపోయింది.
ఏటా ఇచ్చే ఈ అవార్డుకు ‘గ్రహీతల’ ను ఎంపిక వ్యవహారం నిమిత్తం విష్ణుమూర్తి గారు తెనాలి నుంచి బస్సులో హైదరాబాదు వచ్చి సచివాలయం దగ్గరలోని ద్వారకా హోటల్లో దిగేవాళ్ళు. ఆ రోజుల్లో సెల్  ఫోన్లు లేవు కాబట్టి, రూమ్ తీసుకోగానే ఆయన మొదట చేసేపని మాధవరావు గారికీ, బిజినెస్ లైన్ సోమశేఖర్ కూ, నాకూ ఫోన్లు చేసి ఊళ్ళోకి వచ్చాను, సాయంత్రం కలుస్తున్నాము అనే వారు  ఓ ఆర్డరు లాగా. హోటల్  పక్కనే ఇల్లు కాబట్టి, చెప్పిన టైముకు ఠంచనుగా మాధవరావు గారు,  కాస్త దగ్గరలోనే  రేడియో స్టేషన్ వుంది  కాబట్టి కాస్త ఆలస్యంగా నేనూ, వర్కింగ్ జర్నలిష్టు కాబట్టి మరి కొద్ది లేటుగా ములుగు సోమశేఖర్ అలా ఆయన హోటల్ రూముకు చేరుకునేవాళ్ళం. వాళ్ళ వాళ్ళ వీలును బట్టి ఆకిరి రామకృష్ణా రావు గారు, ఆర్వీవీ కృష్ణారావు గారు ఈ చర్చల్లో పాల్గొనేవాళ్లు. శాస్త్ర సాంకేతిక రంగాలు కాబట్టి ఆ గొడవేదో వాళ్ళు ముగ్గురూ చూసుకుండేవాళ్ళు. మనం కాస్త పొలిటికల్ కాబట్టి  ముఖ్యమంత్రులు వగయిరా పేర్లు చెప్పేవాడిని. వారిని ముఖ్య అతిధులుగా పిలిచే పక్షంలో అటువంటి వాళ్లకు హైదరాబాదు అయితే సులువుగా ఉంటుందనేవాడిని. విష్ణుమూర్తి గారు ససేమిరా అనేవాళ్ళు. తెనాలి రావాల్సిందే అనేవారు మొండిగా.
ఇదిగో ఈ మొండితనం వల్లనే పైన పేర్కొన్న అంతటి ప్రసిద్ధులందరూ (నిజానికి ఈ జాబితా చాలా పెద్దది)  తెనాలి వెళ్లి నాయుడమ్మ పురస్కారం స్వీకరించి వచ్చారు.
ఆ విష్ణుమూర్తి ఇక లేరు. కొద్ది కాలం  అస్వస్తులుగా వుండి రాత్రి కన్నుమూశారు. 
       


16, జూన్ 2016, గురువారం

మంచి ప్రభుత్వం అనిపించుకోవాలంటే......


‘ఎవరి పాలనలో అయితే  పాలకుల ప్రమేయం లేకుండా పాలితులు తమ దినవారీ జీవితాలను నిశ్చింతగా గడపగలుగుతారో ఆ ప్రభుత్వం ఉత్తమ ప్రభుత్వం’ అని రాజనీతి శాస్త్రం చెబుతుంది.
ఇప్పటి ప్రభుత్వాలు పాలితులకు అలాంటి పాలన ఇవ్వగలుతున్నాయని చెప్పగలిగిన స్తితి వుందా  అంటే సందేహమే.
సబ్సిడీ బియ్యం కావాలంటే రేషన్ కార్డు కావాలి. రేషన్ కార్డు కావాలంటే ఎవరో ఒక ప్రభుత్వాధికారి సంతకం కావాలి. అతగాడికి ఇదొక్కటే పనికాదుకదా!  అంచేత, దానికోసం చెప్పులు అరిగేలా తిరగాలి. ఎవరయినా పుణ్యాత్ముడు దొరికి సంతకం పెట్టినా, మరో  అధికారి ఆదాయం సర్టిఫికేట్ ఏదీ అంటాడు. అది ఇచ్చే ఆయన  అడ్రసు ప్రూఫ్  పట్రా అంటాడు.  అది ఇచ్చేవాడు ఆ అడ్రసులో వుంటున్నది నువ్వే అని  దాఖలా చూపమంటాడు. ఇవన్నీ లేకపోయినా తెలివి మాత్రం వున్నవాడు అన్నీ ఇట్టే పుట్టించి కావాల్సిన  సర్టిఫికేట్లు కావాల్సిన విధంగా ఒక్క రోజులో  తెచ్చుకుంటాడు. తెచ్చుకోలేని వాడు తన అసమర్ధతని ఒక పక్కా, ప్రభుత్వాన్ని మరోపక్కా ఆడిపోసుకుంటూ వుంటాడు. ఇలానే అనేకం. అది ఆసుపత్రిలో వైద్యం కావచ్చు,  బళ్ళో ప్రవేశం కావచ్చు, గుళ్ళో దర్శనం కావచ్చు దేనికైనా ప్రభుత్వం మీద ఆధార పడాల్సిందే. అధికారుల చుట్టూ ప్రదక్షిణాలు చేయాల్సిందే.   చిన్న చిన్న విషయాల్లో కూడా ఇంత చెడ్డ పేరు తెచ్చుకోవడం  అవసరమా?  
‘దుర్భలస్య బలం రాజ’ అంటాడు కౌటిల్యుడు తాను సూత్రీకరించిన ‘మత్య్స న్యాయం’లో.
చిన్న చేపలను పెద్ద చేపలు తినడం అందరూ ఎరిగిందే. సమాజంలోని బలహీనులను బలవంతులు దోచుకోకుండా రాజులు కాపాడాలి అన్నది కౌటిల్యుడు బోధించిన సూక్తి. కానీ, నేటి సమాజంలో పాలకులు ఆ విధంగా బలహీనుల కాపు కాస్తున్నారా అంటే ఔనని చప్పున చెప్పడం కష్టం. కాకపొతే  దారిద్ర్య రేఖకు దిగువన వున్న దరిద్ర నారాయణుల సంక్షేమం కోసం కొన్ని, కొన్ని  పధకాలు ప్రవేశ పెడుతుంటారు. ప్రచార ఆర్భాటం తప్పిస్తే అవి అర్హులకు అందుతున్నాయని, దుర్వినియోగం కావడం లేదని గుండె మీద చేయి వేసుకుని చెప్పలేని పరిస్తితి. కాకపొతే,   ఈ సంక్షేమ పధకాల పుణ్యమా అని కొందరు దళారులు కోటికి పడగలెత్తుతున్నారనేది కాదనలేని వాస్తవం. పూటకో పధకం తెచ్చాం అని ప్రకటించుకోగానే పాలన బాగున్నట్టు కాదు. అమలు కాని పధకాల వల్ల లాభపడేది కేవలం ప్రకటన కర్తలు మాత్రమే. రోజుకో కొత్త చొక్కా తొడుక్కున్నంత మాత్రాన పండగ కాదు కదా!  
సమాజంలో ప్రజలందరూ తినాకుడవా సమృద్ధిగా  వున్నట్టు పైకి కనబడాలంటే కొందరు అవి లేనివాళ్ళు కూడా వుండాలి అని వాదించే వాళ్ళు కూడా లేకపోలేదు. రైలు బోగీల్లో రెండో తరగతి వున్నప్పుడే మొదటి తరగతికి ఆ హోదా, ఆ  భోగం అన్నది వాళ్ళ థియరీ.   
రాజులు ఎలా పాలించాలి అనే విషయంలో  శుక్రుడు, విదురుడు, చాణక్యుడు మొదలయిన వారు ప్రవచించినవి రాజనీతి శాస్త్రాలుగా ప్రసిద్ధి పొందాయి. భర్తృహరి ‘నృప నీతి అనేక రీతి’ అంటూ సూత్రీకరించాడు. ప్రజల పట్ల రాజులు ఎలా వ్యవహరించాలి అన్నదే ఈ శాస్త్రాలు అన్నింటిలో కీలకాంశం.
శ్రీకృష్ణ దేవరాయలు ఓ చెంప రాజ్య పాలన చేస్తూనే, మరో వంక సాహితీ సేద్యం చేసేవారట. అలా  ఆయన  సాహిత్య క్షేత్రంలో పుట్టుకొచ్చినదే ‘ఆముక్తమాల్యద’ కావ్యం. అందులో యమునాచార్యుల చేత రాయలవారే తన మనసులోని మాట చెప్పిస్తారు.’ రాజ్యాంతే నరకం ధృవం’ అని. రాజు తన పాలనలో తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేస్తాడు. కారణాలు అనేకం వుండొచ్చు కానీ తప్పనిసరై కొన్ని హింసలకు పాల్పడతాడు. మరిక నరక ప్రాప్తి తప్పదు కదా!
ఈ పాపపరిహార్ధం రాజులు యాగాలు, యజ్ఞాలూ చేసేవాళ్ళు. మరి వాళ్లకు పుణ్యలోకాలు సిద్ధించాయో, నరకలోకమే ప్రాప్తించిందో వెంటబోయి, వెనక్కి వచ్చి  చెప్పినవాళ్ళు ఎవరూ లేరు. కానీ వారి పరిపాలన వల్ల జనాలు సుఖపడ్డారా లేక కష్టపడ్డారా అన్నది ఒక్కటే  మంచిచెడ్డల ఎంపికకు సరయిన గీటురాయి.
ఒకసారి నాకు బాగా  తెలిసిన పెద్ద మనిషికి ఒక పెద్ద పదవి దక్కింది. అంతా వెళ్లి శుభాకాంక్షలు చెబుతున్నారు. నేనూ వెళ్లి చెప్పాను. యేమని?
“మంచి అవకాశం లభించింది మీకు. అవసరంలో వున్నవారికి అడగకుండానే సాయం చేయండి’
ఆయనకు మరోలా అర్ధం అయినట్టు వుంది. అధికారంలో వున్నన్నాళ్ళు అవసరం పడ్డ వాళ్లకు బాగానే సాయపడ్డాడని ప్రతీతి.
సాక్షరా విపరీతాశ్చేత్ అని హితోపదేశం చెబుతోంది.  అంటే అక్షరాస్యులు విపరీత మనస్కులు అయితే  రాక్షసులు అవుతారని అర్ధం. ఇప్పుడు సాక్షరులు అంటే మేధావులు, చదువుకున్న వాళ్ళు.  సాంఘిక మాధ్యమాల్లో వీరి విశృంఖల వీర విహారాలు చూస్తుంటే, ‘సాక్షరా తిరగేస్తే రాక్షసా అవుతుంద’ని కీర్తిశేషులు ఆర్వీయార్  చెప్పిన మాట గుర్తుకు వస్తుంది.
రాజకీయాలు రాయడం పత్రికల ప్రధాన వ్యాపకం. ఈ నింద మోస్తూ కూడా అప్పుడప్పుడూ ప్రజాసమస్యలను వెలుగులోకి తెస్తుంటాయి. అవి రాసే ప్రతివార్తను రాజకీయ కోణంలో చూడకుండా దిద్దుబాటు చర్యలు తీసుకుంటే ప్రజలు సుఖపడతారు. వెనుకటి రోజుల్లో ప్రజల కష్టాలను  స్వయంగా గమనించడానికి రాజులు మారువేషాల్లో తిరిగేవారు. లేదా వారి వేగులు ఈ పని చక్కబెట్టేవారు. ఇప్పుడూ ప్రభుత్వంలో ఈ పనులు చూడడానికి ఒక ప్రత్యేక నిఘా విభాగమే వుంది. ప్రతిపక్షాల మీద కన్నేసి వుంచడంలోనే వారి  పుణ్యకాలం గడిచిపోతోంది. ఇక ప్రజల ఇబ్బందులు ఎక్కడ పట్టించుకుంటారు. కావున,  ఏలినవారికి నచ్చినా నచ్చకున్నా, ఈ పనికి కొంతలో కొంత పత్రికల మీద ఆధారపడడమే మేలు.
జనాలకు ప్రభుత్వాలతో ప్రమేయం లేకుండా చేయండి. ఆ  ప్రభుత్వాలను జనమే నెత్తిన పెట్టుకుంటారు.
ఉపశృతి:
గ్రామ రెవెన్యూ  అధికారి దగ్గరికి వెళ్ళాడు తిరుపతయ్య చిన్న పని మీద.
'ఇదిగో ఇప్పుడే వస్తా! ఎమ్మార్వో గారు వెంటనే రమ్మనమని ఫోను. గంటలో తిరిగొస్తా, ఇక్కడే కూర్చో' అంటూ వీఆర్వో  మోటారు సైకిల్ ఎక్కి తుర్రుమన్నాడు.  
వీఆర్వో ఆఘమేఘాల మీద వెళ్లేసరికి ఎమ్మార్వో  అతడికోసమే ఎదురుచూస్తున్నట్టు మొహం పెట్టి, ‘వచ్చావా! మొన్న చెప్పాను చూడు...' అంటూ ఉండగానే ఆయన చేతిలో సెల్లు ఘల్లున మోగింది. కంగారుగా వింటూనే  అంతకంటే కంగారుగా 'ఇదిగో ఇప్పుడే  జేసీ గారు వున్నఫలాన రమ్మంటున్నారు, మాట్లాడి ఇప్పుడే వస్తా కూచో' అంటూ అంతకంటే  కంగారుగా వెళ్ళిపోయాడు ఎమ్మార్వో జీపెక్కి.  జేసీ గారి ఆఫీసుకు చేరి కనుక్కుంటే ఆయన పియ్యే చావు కబురు చల్లగా చెప్పాడు. 'మిమ్మల్ని రమ్మనమని ఫోను చేసారా, అలా రమ్మనమని కలెక్టరు దొరగారి ఫోను. పని చూసుకుని వస్తారు కూర్చోండి’ అన్నాడు తాపీగా.
అక్కడ జేసీ గారికి కలెక్టర్ ఆఫీసులో ఇదే సీను. 'మంత్రి గారు కబురు పెడితే వెళ్ళారు, వస్తారు కూర్చోండి’ అంటూ క్యాంప్ క్లర్కు మర్యాద.
కలెక్టర్ గారి  కారు మంత్రి గారి బంగ్లాలో ప్రవేశిస్తూ ఉండగానే గేటు దగ్గరే ఎదురొచ్చింది మంత్రి గారి వాహనం. 'ఇదేమిటి  రమ్మనమనిచెప్పి  ఆయన ఎటు వెడుతున్నట్టు' అని  అనుకుంటూ ఉండగానే సెల్లు మోగింది. అవతల మంత్రి గారు. 'చూడండి కలెక్టర్ గారు, అర్జెంటు పనిమీద రమ్మన్నాను. కానీ ఈలోగా సీఎం గారి నుంచి కబురు, వెంటనే రమ్మనమని. వెళ్లి వస్తా  కాసేపు వెయిట్ చేయండి, ఏమనుకోవద్దు'
మంత్రిగారు సీఎమ్ ఇంటికి వెళ్లేసరికి ఆయన ఢిల్లీ ఫోనులో వున్నారు. అది తెమిలేసరికి రాత్రి ఎనిమిదయింది. మంత్రిగారిని చూస్తూనే ఆయన అన్నారు 'అయ్యో ఇంతసేపు వెయిట్ చేస్తున్నారా. ఏదో చిన్న విషయం మాట్లాడదామనుకున్నాను. మళ్ళీ చూద్దాం లెండి' అన్నారు 'మళ్ళీ రండి' అన్న భావం కళ్ళల్లో ప్రదర్శిస్తూ.
అక్కడ వూళ్ళో వీఆర్వో గారింట్లో తిరుపతయ్య, ఎమ్మార్వో ఆఫీసులో వీఆర్వో, జేసీ కార్యాలయంలో ఎమ్మార్వో, కలెక్టర్  క్యాంప్ ఆఫీసులో జేసీ, మంత్రి బంగాళాలో కలెక్టర్, ముఖ్యమంత్రి నివాసంలో మంత్రిగారు - అందరూ ఉదయం నుంచి సాయంత్రం దాకా గడ్డాలు, మీసాలు పెంచుకుంటూ ఎదురుచూపులు.  
సరదాకు రాసిందే అయినా కొంత నిజం లేకపోలేదు. ఔనా!
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595


నవ్వు నాలుగందాల చేటు


ఈ చాటువుకి సరయిన అర్ధం అర్ధం కావాలంటే ఓసారి అసోం వెళ్లి రావాలి.

అక్కడ పారిమొండా అనే ఆదివాసీ తెగవారు శత్రువులను మట్టుబెట్టడం కోసం ‘నవ్వు’ ఆయుధాన్ని  ప్రయోగిస్తారుట. స్కెడి అనే ఓ వనమూలిక రసాన్ని మద్యంలో కలిపి ఇస్తారట. అది సేవించిన వాళ్ళకు ముందు మత్తు  తలకెక్కుతుంది. తరువాత, క్రమంగా  ఆ మూలిక పనిచేసి, అదేపనిగా ఆపకుండా  నవ్వడం మొదలెడతారు. ఎంతగా నవ్వుతారంటే నవ్వి నవ్వి అలసిసొలసి డొక్కలు అంటుకు పోయేలా నవ్వి, ఆ నవ్వుతోనే కుంగి, కృశించి ప్రాణాలు ఒదులుతారట.