6, ఏప్రిల్ 2016, బుధవారం

గ్రామీణ వైద్యానికి గ్రహణం


(ఏప్రిల్ ఏడో తేదీ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం)
(PUBLISHED IN “SAKSHI” TELUGU DAILY ON 06-04-2016, WEDNESDAY)
" ఆసుపత్రుల్లో డబ్బు కట్టలేని రోగి చావాల్సిందేనా?"
ప్రశ్న ఈ నడుమ తరచుగా వినబడుతోంది. జవాబు ఇచ్చేవాళ్ళే కానరావడం లేదు.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో యావత్ ఆరోగ్య వైద్య సేవలు గురించి విశ్లేషించుకోవాల్సిన అగత్యాన్ని ఇది కలిగిస్తోంది.
ప్రభుత్వాలు  ఏటా కోట్లాది  రూపాయలు వైద్య ఆరోగ్య రంగంపై ఖర్చుచేస్తున్నాయి. ఇందులో సింహ భాగం నిర్వహణ వ్యయం కిందికే పోతోంది. గ్రామీణ ప్రాంతాలలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు కొంత మేరకు ప్రజల ఆరోగ్య సేవల అవసరాలను తీరుస్తున్నప్పటికీ- డాక్టర్ల కొరత అన్నది ఎప్పటికీ తీరని సమస్యగానే మిగిలిపోతున్నది. మన రాష్ట్రంలో ఎనభయి వేల గ్రామాలుంటేకేవలం పదిహేను వందల చోట్ల మాత్రమే వైద్యులు అందుబాటులో ఉన్నారు. వైద్య కళాశాలలో పట్టా పుచ్చుకున్న ఒక్కరు కూడా పల్లెలకు వెళ్లి వైద్యం చేయడానికి సిద్దంగా లేరంటే అతిశయోక్తి కాదు. ఇక మందుల విషయం చెప్పనక్కరలేదు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు దూరంగా వున్న పల్లెల్లో నివసించే వారికి అరకొర సదుపాయం కూడా అందుబాటులో లేదు. నాటు వైద్యుల దయా దాక్షిణ్యాలపైనా, వారిచ్చే నాటు మందుల పైనా ఆధారపడాల్సిన దీన స్తితి వారిది. బయట ప్రపంచంతో సంబంధాలు లేకుండా అంత సులువుగా చేరుకోలేని కొండకోనల్లోని కోయగూడెంలు, లంబాడి తండాల్లో వుండే పేద వారికి రోగం రొస్టూ వస్తే ఇక ఇంతే సంగతులు. అలాటివారు సాధారణంగా షుగరురక్త పోటుఉబ్బసంకీళ్ళ వ్యాధులతో బాధపడుతుంటారు. అసలు ఇలాటి జబ్బులు తమకు వున్నట్టు కూడా వీరికి తెలియదు. ఎందుకంటె ఎలాటి వైద్య పరీక్షలు ఎప్పుడూ చేయించుకుని ఎరుగరు కనుక. రోగం ముదిరి పక్షవాతానికో దారి తీసేదాకా 'బీపీవున్నట్టు కూడా తెలియదు.
ఆరోగ్య మంత్రిత్వ శాఖను వైద్య, ఆరోగ్య శాఖ అంటుంటారు. అంటే ఆరోగ్యానికీ, వైద్యానికి సంబంధం ఉన్నప్పటికీ ఆరోగ్యం కాపాడుకోగలిగితే, వైద్య  అవసరం రాదన్న అర్ధం ఇందులో నిగూఢ౦గా వుంది. అందుకే మన పూర్వీకులు ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చేవారు. వ్యాధులకు చికిత్స బదులు, రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకునే వారు. తాగే నీరు, తినే ఆహారం, నివసించే వాతావరణం ఇవన్నీ మనుషుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంటాయి. ప్రాధమిక అంశాలకు ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇస్తే రోగాల సంఖ్యా, రోగుల సంఖ్యా తగ్గిపోయి వైద్య రంగంపై ప్రభుత్వం పెట్టే ఖర్చు గణనీయంగా తగ్గగలదని రంగంలో విశేష కృషి చేసిన నిపుణులు అంటున్నారు. సదుద్దేశ్యంతోనే కొద్దికాలం క్రితం హెచ్ ఎం ఆర్ అనే స్వచ్చంద సంస్థ కొంత కృషి చేసింది.
సుదూర గ్రామీణ ప్రాంతాలలో నివసించేవారికి కనీస వైద్య సదుపాయాలూ ఈనాటి వరకు లేవనీ, నాటు వైద్యం మీదనే వాళ్ళు బతుకులు వెళ్ళదీస్తున్నారని, బీపీ, షుగర్ వంటి వ్యాధులు ముదిరి ప్రాణం మీదకు వచ్చేవరకు అలాటి వ్యాధుల బారిన పడ్డ విషయం కూడా తెలియని నిర్భాగ్య స్తితిలో వారు రోజులు గడుపుతున్నారని ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డికి  ఈ పధకం రూపకర్తలు  వివరించారు. అలాటి ప్రజానీకానికి  నెలకొక్కమారు వైద్య పరీక్షలు జరిపిరోగ నిర్ధారణ జరిపి  తగిన మందులిస్తే,  పక్షవాతం వంటి జబ్బుల బారిన పడకుండా కాపాడవచ్చని  చెప్పారు. ప్రస్తుతం వున్న వైద్య ఆరోగ్య శాఖ వార్షిక  బడ్జట్ తో పోలిస్తే ఇందుకయ్యే ఖర్చు అతి స్వల్పమని వివరించారు. అయితే ప్రభుత్వానికి ఒక అనుమానం వచ్చింది. గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళే సంచార వైద్య వాహనంలో డాక్టర్ వుంటాడా? అని.  డాక్టర్ల కొరత, గ్రామీణ ప్రాంతాలలో పనిచేయడానికి వారిలో పేరుకుపోతున్న వైముఖ్యం కారణంగానే పధకాన్ని రూపొందించాల్సి వచ్చిందని స్వచ్చంద సంస్థ ప్రతినిధుల సమాధానం. స్వతహాగా  వైద్యుడు  అయిన ముఖ్యమంత్రికి  విషయం అవగాహన అయింది. దాంతో,  (ఉమ్మడి )రాష్ట్రంలో హెచ్ ఎం ఆర్ సంస్థ కార్యకలాపాలు ప్రభుత్వ ప్రవేట్ భాగస్వామ్యం ప్రాతిపదికన మొదలయ్యాయి.

అందుబాటులో వున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు మూడు కిలోమీటర్ల ఆవల వుండే ప్రతి పల్లెకు- నెల నెలా క్రమం తప్పకుండా వెళ్లి - వూరివారికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించే వాహనానికి రూపకల్పన చేశారు. 108 అంబులెన్సు పధకం,  ప్రమాదం అంచున ఉన్నవారి ప్రాణాలను కాపాడేందుకు ఉద్దేశించినది. హెచ్ ఎం ఆర్ రూపొందించిన  104 సంచార వైద్య వాహనం - పేద పల్లె ప్రజల ప్రాణాలు ప్రమాదం అంచుకు చేరకుండా చూస్తుంది. ఇంతా చేసి పధకం కింద లబ్ది పొందేవారి సంఖ్యను లెక్కలోకి తీసుకుంటే- ఒక్కొక్కరిపై పెట్టె ఖర్చు ఏడాదికి కేవలం ఎనభయి రూపాయలు మాత్రమే. అంటే - వైద్య ఆరోగ్య రంగం బడ్జెట్ లో పది శాతం కన్నా తక్కువన్నమాట.
 104 వాహనం ప్రతి నెలా ఒక నిర్దేశిత దినం నాడు క్రమం తప్పకుండా ఒక గ్రామాన్ని సందర్శిస్తుంది. ఇందులో ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ముగ్గురు ఎన్ ఎం లు(నర్సులు)ఒక ఫార్మసిస్టుఒక లాబ్ టెక్నీషియన్ఒక డ్రయివర్తో సహా మొత్తం ఏడుగురు సిబ్బంది వుంటారు. బయో మెట్రిక్ పద్దతి ద్వారా రోగుల వివరాలను కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తారు. గర్భిణీ స్త్రీలనుబాలింతలను పరీక్షించి మందులు ఇస్తారు. గర్భిణి కడుపులో పిండం పెరుగుదలను నెలనెలా గమనిస్తూ తగిన జాగ్రత్తలు సూచిస్తారు.అవసరమని భావిస్తే,108 అంబులెన్సుకి ఫోన్ చేసి రప్పించి ఆసుపత్రిలో చేర్పిస్తారు. రక్త పోటుషుగర్ ఉన్నవారికి నెలవారీగా చేయాల్సిన రక్త పరీక్షలు , ఇతర పరీక్షలు నిర్వహించి అవసరమైన మార్పులతో మందులు ఉచితంగా అక్కడికక్కడే పంపిణీ చేస్తారు.

'దర్వాజాలో దవాఖానావంటి పధకం తదనంతర కాలంలో సంభవించిన రాజకీయ పరిణామాల నేపధ్యంలో అందే ప్రభుత్వసాయం అరకొరగా మారడంతో అర్ధాంతరంగా అటకెక్కింది. ఉమ్మడి రాష్ట్రంలో సంభవించిన రాజకీయ పరిణామాల క్రీనీడలు  సంస్థ కార్యకలాపాలపై ముసురుకుని తొలి దశ లోనే  సంస్థ కృషి ఆవిధంగా ముగిసింది.
నిజం చెప్పాలంటే, ఆదర్శంగా నిలవాల్సిన అద్భుత పధకం, వైఎస్ ఆకస్మిక మరణానంతరం  కొందరి నిర్వాకాలకు నీరుకారిపోయింది. మరి కొందరి స్వార్ధాలకు బలయిపోయింది. ఇంకొందరి  ఆహాలను చల్లార్చడానికి మాడి మసయిపోయింది. రాజకీయ చదరంగంలో చిక్కుకుపోయి   ఎత్తులు పైఎత్తుల్లో చితికి   చిత్తయిపోయింది.
ఇంత జరిగినా ఏమీ జరగనట్టే వుండడానికి కారణం వుంది. పధకం వల్ల లబ్ది పొందుతున్న వారు నిరుపేదలు. వారికి నోరూవాయీ లేదు.
కష్టం వచ్చినా చెప్పుకోలేరు. కష్టం తొలగినా చెప్పుకోలేరు. ఎందుకంటె చెప్పుకోవడానికి వారికెవరూ లేరు.
వారి గురించి రాసేవారు లేరు. కారణం  వారిలో చాలా మంది నిరక్షరాస్యులు. చదవడం రాని వారి గురించిన వార్తలు ఎవరికీ పట్టవు. 
వారి గురించి బుల్లి తెరలపై చూపించేవారు లేరు. ఎందుకంటె అలాటి ఆధునిక సౌకర్యాలకు దూరంగా ఎక్కడో బతుకులీడుస్తున్న బడుగులు వాళ్ళు.
అలాటి వాళ్లకు బాగా ఉపయోగపడే ఒక మంచి ఆరోగ్య పధకం పురిట్లోనే సంధి కొట్టిన రీతిగా అదృశ్యం అయింది.
ఇది ఉమ్మడి రాష్ట్రం చివరాఖరు దశలో జరిగిన కధ. ఇప్పుడు రెండు కొత్త రాష్ట్రాలు, రెండు ప్రభుత్వాలు.  తమదయిన రీతిలో మంచి పనులు చేసి రాష్ట్రానికి ఎంతో కొంత మంచి చేయాలనే దిశానిర్దేశంతో సాగిపోతున్నట్టు  అటూ ఇటూ ఇద్దరు ముఖ్యమంత్రులు పదేపదే చెప్పుకుంటున్నారు. చేయాలన్న తపన వారికి వున్నప్పుడు,  చేసి చూపిస్తాం అనే సంస్థలకు కొదవలేదు. తపనకు, సాంకేతిక సహకారం తోడయితే సత్ఫలితాల విషయంలో సందేహించే పని వుండదు. టెక్నాలజీని సరిగా ఉపయోగించుకుంటే మానవ ప్రయత్నాలకు మరింత పరిపుష్టి చేకూరుతుంది.  గ్రామీణ ప్రాంతాల ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడే ఇటువంటి పధకాలపై  రెండు తెలుగు ప్రభుత్వాలు దృష్టి పెడితే బాగుంటుంది.
తుదిపలుకు:
పాలకులు వస్తుంటారుపోతుంటారు. కానీ వారు చేసిన మంచి పనులు మాత్రం కలకాలం నిలబడి వుంటాయి. చిరకాలం వారిని గుర్తు చేస్తుంటాయి. ‘కారే రాజులు రాజ్యముల్అంటూ   ‘బలి చక్రవర్తి కాలంలో చెప్పిందీ అదే. కలియుగంలో సయితం వర్తించే వాస్తవం కూడా ఇదే. (04-04-2016)


రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595


5, ఏప్రిల్ 2016, మంగళవారం

బంగారు తెలంగాణాకు ఐటీ తాపడం

సూటిగా.....సుతిమెత్తగా....... 




   హైదరాబాదు నగరంలో మధ్యాన్నం నలభయ్ మూడు డిగ్రీల ఎండ ఎడాపెడా పేల్చివేస్తున్న వేళ, ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో తెలంగాణా  నూతన ఐటీ విధాన ఆవిష్కరణ నవనవోన్మేషంగా జరిగింది.  ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్  వ్యవస్థాపకులు  నారాయణ మూర్తితో సహా ఐటీ రంగంలో మేటి అనిపించుకుంటున్న అనేక సంస్థల అధిపతులు ఈ కార్యక్రమానికి హాజరై  నూతన తెలంగాణా రాష్ట్రంలో ఈ రంగం అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని క్లుప్తంగా చేసిన తమ ప్రసంగాలలో హామీలు ఇచ్చారు.  ఐటీ రంగ అభివృద్ధికి అనేక విలువైన సూచనలు కూడా చేశారు. వారికంటే కూడా సంక్షిప్తంగా ప్రసంగించిన తెలంగాణా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు,  ‘ఇబ్బందులు లేని, ఇబ్బందులు పెట్టని, ఎలాటి బాదరబందీ లేని  ఐటీ విధానాన్ని’ రూపొందించినట్టు చెప్పారు. ‘పారిశ్రామికవేత్తలకి కాలయాపన జరగకుండా సింగిల్  విండో ద్వారా అన్ని అనుమతులు సకాలంలో  మంజూరు చేస్తామని చెబుతూ, తనదయిన శైలిలో, ఈ విండో ‘ఊచలు లేని కిటికీ’ అంటూ చమత్కరించారు. నిరుడు ప్రవేశపెట్టిన ‘పదిహేను రోజుల్లోనే అనుమతులు’ అనే తమ నూతన పారిశ్రామిక  విధానం అద్భుతమైన ఫలితాలను ఇస్తోందని చెబుతూ, ఇప్పటివరకు 1691 పరిశ్రమలకు అనుమతులు ఇవ్వగా వాటిల్లో  883 పరిశ్రమలు ఉత్పత్తిని ప్రారంభించాయని ముఖ్యమంత్రి వెల్లడించారు.    
తెలంగాణా ఐటీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, ఆయన సారధ్యంలో పనిచేసిన ఐటీ మంత్రిత్వ శాఖ  బృందం, ఈ  కార్యక్రమ నిర్వహణలో  కొత్త పుంతలు తొక్కింది. తెలంగాణా ప్రాంతంలో తయారయిన  ఎల్ ఈ డీ బల్బులు  విరజిమ్మిన వెలుగులతో  అలరారిన రాష్ట్ర పఠoతో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని పూర్తిచేయడం, అలాగే ఐటీ పారిశ్రామిక విధానానికి సంబంధించిన బ్రోచర్ ను స్థానికంగా రూపొందించిన రోబో ద్వారా వేదికమీద వున్న గవర్నర్ కూ, ముఖ్యమంత్రికి అందచేయడం, ఇవన్నీ కొత్త రాష్ట్రాన్ని ఐటీ మెరుగులతో ప్రకాశింప చేయాలనే ప్రభుత్వ ధ్యేయానికి అద్దం పడుతున్నాయి.
ప్రధాన విధాన ప్రకటనకు అనుబంధంగా ఐటీ పరిశ్రమ అభివృద్ధి లక్ష్యంగా పది అంశాల ఎజెండాని కూడా ప్రభుత్వం ఈ సందర్భంగా విడుదల చేసింది. ప్రపంచ ఐటీ పఠంలో ప్రస్తుతం హైదరాబాదుకు వున్న స్థానాన్ని మొత్తం తెలంగాణకు విస్తరించాలన్న ధ్యేయం కొనియాడదగ్గది. యావత్  కేంద్రీకరణ హైదరాబాదు కేంద్రంగా గతంలో జరగడం వల్ల రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు అభివృద్ధి పధంలో పోటీపడలేకపోయిన వాస్తవం మరవతగ్గది కాదు. తెలంగాణా ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన  చేస్తుండడం  ముదావహం. తద్వారా గ్రామీణ ప్రాంతాలలోని యువజనులకు సరికొత్త అవకాశాలు లభిస్తాయి, ఉపాధిపరంగానే కాదు, ప్రతిభను ప్రదర్శించుకోవడానికి కూడా.  
ఈ కొత్త విధానంలో అనేక లక్ష్యాలను నిర్దేశించుకున్నారు.  రానున్న అయిదేళ్ళ కాలంలో ఏటా ఇరవై అయిదు వేల మంది చొప్పున మొత్తం లక్ష మంది ఐటీ నిపుణులను సిద్ధం చేయడం, తెలంగాణా కాలేజీల నుంచి ఐటీ కంపెనీలు కొత్తగా  ఉద్యోగాల్లోకి తీసుకునేవాళ్ళలో ఇరవై మందికి వేతనాల విషయంలో ఆర్ధిక సాయం అందించడం, ఐటీ హబ్ లను ద్యితీయ శ్రేణి నగరాలకు విస్తరించడం ఇలాటివి వాటిల్లో వున్నాయి.
ఈ కార్యక్రమంలోనే 28 కంపెనీలతో కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఇవి కార్యరూపం దాలిస్తే రెండువేల ఏడువందల కోట్లు పెట్టుబడుల రూపంలో రావడమే కాకుండా కొత్తగా పాతిక వేల మందికి ఉద్యొగాలు లభించే అవకాశం వుంది. ఇదొక శుభపరిణామం.
విధాన రూపకల్పనలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు, మరెంతో  కసరత్తు చేసినట్టు ఆ పత్రాలను ఓసారి  తిరగేస్తే తేలిగ్గా  అర్ధం అవుతుంది. కార్యక్రమానికి హాజరయిన  గవర్నర్ నరసింహన్, ఇతర ఐటీ రంగ ప్రముఖులు  సభావేదిక నుంచి చేసిన మెప్పుకోళ్ళు కూడా ఇందుకు రుజువు.
అసందర్భం  అనిపించవచ్చు కానీ ఈ సందర్భంగా ఓ మాట చెప్పుకోవాలి.
ఐటీ అనగానే గుర్తు వచ్చే పేరు చంద్రబాబునాయుడు. ఆయనకా పేరు స్థిరపడి పోయింది. ఆ  ఖ్యాతిని తన ఖాతాలో వేసుకోవడానికి కేసీఆర్ ఇలా ఐటీకి పెద్దపీట వేస్తున్నారని సోషల్ మీడియాలో కొన్ని చౌకబారు వ్యాఖ్యానాలు వస్తున్నాయి.  వీటికి ఆధారం లేదు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా  విడిపోగానే హైదరాబాదు చుట్టుపక్కల వెలసిన ఐటీకంపెనీలన్నీ పెట్టీ బేడా సర్దుకుని బిచాణా ఎత్తివేస్తాయని ఆరోజుల్లో చెలరేగిన ఊహాగానాలన్నీ ఉట్టివే అని తేలిపోయింది.  ఒక్కటంటే ఒక్క  పరిశ్రమ కూడా తెలంగాణా సరిహద్దులు దాటి బయటకు వెళ్ళలేదు. కాకపొతే,  కొత్తవాటిని ఆకర్షించడానికి తెలంగాణా చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా ఈ విధాన ప్రకటనను అర్ధం చేసుకుంటే  బాగుంటుందేమో. మొన్నటికి మొన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన పవర్ పాయింటు  ప్రెజెంటేషన్, మళ్ళీ రోజులు తిరక్కుండానే అట్టహాసంగా చేసిన ఈ ఐటీ విధాన ప్రకటన ఈ వదంతులకు కారణం అయివుంటాయి.
అయితే ఒక విషయం. యువకుడు, సమర్దుడు అయిన  కే.తారక రామారావు ఈ శాఖకు మంత్రిగా వున్నారు. సంభాళించుకుని రాగల అధికారులు, సిబ్బంది ఆయనకు తోడుగా  వున్నారు. విధాన రూపకల్పనలో వారు  పడిన శ్రమ  అభినదనీయం. కానీ, వాళ్ళు నిర్వర్తించాల్సిన బాధ్యత మరొకటి వుంది.
ఐటీ  అనగానే  ఇదేదో సంపన్నుల వ్యవహారం అనే అపోహ వుంది. ల్యాప్ టాపులు తగిలించుకుని, టిప్ టాపుగా తిరిగే వాళ్ళు, వాళ్ళు సంపాదించే లక్షల వేతనాలు,  ఆ డబ్బును ఖర్చు చేయడానికి  పబ్బులూ, క్లబ్బులూ, విలాసవంతమైన మాళ్ళూ, మల్టీ ప్లెక్స్  సినిమా హాళ్ళూ – ఇలా ఐటీ మొత్తం కలవారి జాగీర్దారీ  అనే అపప్రధ కూడా వుంది. నిజానికి ఐటీ వల్ల మేలు జరిగేది సామాన్యులకే. ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగే పని లేకుండా ఐటీ సాయంతో ప్రభుత్వాలు  చేయగలిగితే అంతకంటే కావాల్సింది ఏమీ వుండదు. సామాన్యులు, రైతులు, రైతు కూలీలు ఎదుర్కుంటున్న రోజువారీ సమస్యలకు ఐటీ ద్వారా పరిష్కార మార్గాలు కనుగొనగలిగితే ఈ విధానం  సంపూర్ణంగా సార్ధకం అవుతుంది. చిన్న చిన్నగా కనపడే చిన్న చిన్న స్టార్ట్ అప్  కంపెనీలే  ఈ పరిష్కారాలను సమర్ధవంతంగా చూపగలుగుతాయి. ఆ కోణంలో మంత్రి బృందం దృష్టి పెట్టాలి. ఇందుకోసం పెద్ద శ్రమ అక్కరలేదు. సమస్యను చెబుతూ పరిష్కారం చూపమని కోరుతూ సలహాలు సూచనలు స్వీకరించి, వాటిని  పరిశీలించేందుకు నెలకో రెండు రోజులు క్వాలిటీ టైం కేటాయించగలిగితే ఆ చిన్ని కంపెనీలకి ప్రయోజనం, ప్రభుత్వానికి పరమార్ధం రెండూ సిద్ధిస్తాయి.    
పెద్ద పెద్ద కంపెనీలు పెద్ద పెద్ద కార్యాలయాలు తెరవడం వల్ల పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు వచ్చేమాట నిజమే. వారికి కూడా పెద్ద పెద్ద జీతాలు వచ్చే మాటా నిజమే. కానీ ఆ పెద్ద  కంపెనీలకు  హైదరాబాదు వంటి పెద్ద నగరమే కావాలి. చిన్న ఊళ్ళు వాటి కంటికి ఆనవు. ఎంతో పెద్ద అర్హతలు వుంటే కానీ ఆ కంపెనీల్లో కొలువులు దొరకవు. అభిరుచి వుండి, మంచి ఆలోచనలు వుండి, సిబ్బందికి పెద్ద జీతాలు ఇచ్చుకోలేని చిన్న చిన్న స్టార్ట్ అప్  కంపెనీలు  పెద్ద వాటితో  పోటీకి తట్టు కోలేక బోర్డులు తిప్పేస్తున్నాయి. వీటిని స్థాపించేవారికి సరికొత్త ఆలోచనలు వుంటాయి. ఐటీని ఎలా వాడుకుంటే సామాన్యుల జీవితం సజావుగా సాగుతుందో వారు ఆలోచిస్తుంటారు. వారివద్ద  ఐడియాలు వుంటాయి కానీ తగిన పెట్టుబడీ వుండదు, అవసరమైన మార్కెటింగు అవకాశాలు వుండవు. ప్రపంచ ప్రసిద్ధ  ఐటీ దిగ్గజం ‘గూగుల్’ పుట్టుక కూడా ఒక కారు షెడ్డులో  అన్న సంగతి గమనార్హం.
ఇటువంటి చిన్న కంపెనీల వారి ఉత్పత్తులకు   వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అవకాశాలు కల్పించి  ప్రోత్సహించగలిగితే  బ్రహ్మాండమయిన ఫలితాలు వస్తాయి. ప్రతి చిన్న పట్టణంలో ఎన్నోకొన్ని  చిన్న చిన్న స్టార్ట్ అప్ ఐటీ కంపెనీలు వస్తే,  స్థానికంగా చిరు నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. పాతిక ఇరవై మంది సిబ్బందితో నడిచే కంపెనీల వల్ల చిన్న చిన్న ఊళ్ళ స్వరూపం కూడా అద్యతన కాలంలో గుర్తుపట్టలేనంతగా మారిపోతుంది. హైదరాబాదులో ప్రభుత్వ రాయితీలతో నెలకొల్పే పెద్ద పెద్ద కంపెనీలను, ఈ చిన్న వాటిని దత్తతకు తీసుకునేలా ఒప్పించగలిగితే వాటి మనుగడకు తిరుగుండదు.  జీవన వ్యయం హైదరాబాదుతో పోల్చుకుంటే తక్కువ కాబట్టి పెద్ద జీతాలు ఇవ్వాల్సిన అవసరం వుండదు. అయితే అదే సమయంలో ఇటువంటి చిరుద్యోగులు పెరగడం వల్ల చిన్న ఊళ్ళల్లో సైతం డబ్బు చెలామణీ పెరుగుతుంది. వారి అవసరాలకు తగ్గట్టుగా వ్యాపారాలు విస్తరిస్తాయి. ఆర్ధికంగా ఆ ప్రాంతాలు బలపడతాయి. అభివృద్ధి కేంద్రీకృతం కాకుండా అవకాశాలు అన్ని ప్రాంతాల వారికీ దక్కుతాయి. పురోభివృద్ధి సమతుల్యంగా సాగుతుంది.  తెలంగాణాలో అన్ని ప్రాంతాలు అభివృద్ధికి నోచుకుంటాయి. వాటి ఆర్ధిక పరిపుష్టి పెరుగుతుంది.  తెలంగాణలో ఒక్క హైదరాబాదే కాదు అటువంటివి అనేకం వున్నాయి అని గర్వంగా చెప్పుకునే రోజు వస్తుంది. బంగారు తెలంగాణాకు ఐటీ తాపడం అంటే ఇదే!
అయితే, ఇలా చేయగలిగిన సత్తా ఒక్క ఏలికల చేతుల్లోనే వుంది. (05-04-2016)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com  మొబైల్: 98491 30595                                           

2, ఏప్రిల్ 2016, శనివారం

ఏం చెప్పారన్నది కాదు ప్రశ్న, ఎలా చెప్పారన్నది పాయింటు


సూటిగా.......సుతిమెత్తగా........
(PUBLISHED IN "SURYA" TELUGU DAILY ON 03-04-2016, SUNDAY)

విలియం షేక్స్పియర్ రాసిన జూలియస్ సీజర్ నాటకంలో మార్క్ ఆంటోని సుప్రసిద్ధ ప్రసంగం గుర్తుందా?
“స్నేహితులారా! రోమన్ జాతీయులారా! నా దేశ ప్రజలారా! దయచేసి కాసేపు మీ చెవులు నాకు ఒప్పచెప్పి నే చెప్పేది శ్రద్ధగా వినండి” అంటూ ఆంటోనీ మొదలు పెట్టిన ఉపన్యాసం అప్పటికీ, ఇప్పటికీ ప్రపంచ ప్రసిద్ధ ప్రసంగాల్లో ఒకటిగా మిగిలిపోయింది.



మొన్న గురువారం నాడు తెలంగాణా అసెంబ్లీలో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు సాగునీటి ప్రాజెక్టులపై పవర్ పాయింటు ప్రెజెంటేషన్ ఇచ్చిన  సందర్భంగా చేసిన ప్రసంగాన్ని టీవీల్లో చూస్తున్నప్పుడు అలనాటి ఆంటోనీ ప్రసంగం స్పురణకు వచ్చింది. ఇళ్ళల్లో కూర్చుని టీవీల్లో   వీక్షించిన ప్రేక్షకులు బహుశా ఇండో  పాక్ వన్ డే మ్యాచ్ చూసినంత ఆసక్తిగా ఆసాంతం ఆస్వాదిస్తూపోయారని అనడం కొంత  అతిశయోక్తిగా అనిపించినా అందులో వాస్తవం లేకపోలేదు.
ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజు అసెంబ్లీలో కేసీఆర్ ఉపన్యాసం మూడుగంటల పాటు విడవకుండా కురిసిన వర్షంలా సాగిపోయింది. పెద్దగా ఉరుములు, మెరుపులు లేకపోవడం కొసమెరుపు.
ఆయనకి ప్రసంగాలు చేయడం కొట్టిన పిండి. ఎదురుగా నిలబడి ఆయన వాదనను పూర్వపక్షం చేయగల సమకాలీన రాజకీయ నాయకులు ఎవ్వరూ వర్తమాన కాలంలో  లేకపోవడం ఆయనకు బాగా కలిసి వచ్చింది. ఈసారి ఆయన తన అంబులపొదిలో అస్త్ర శస్త్రాలను రెండింటినీ  సమకూర్చుకుని మరీ వచ్చారు. శస్త్రాలు అంటే మామూలు బాణాలు. వాటికి మంత్రోచ్చారణ ద్వారా అమితమైన శక్తిని సమకూరిస్తే అస్త్రాలుగా మారతాయి. అందుకే కేసీఆర్ తన వాగ్బాణాలకు పవర్ పాయింటు ప్రెజెంటేషన్ అనే అదనపు బలాన్ని తోడుతెచ్చుకుని వాటికి మరింత పదును పెట్టి మరీ సంధించారు. అసలే మాటల మాంత్రికుడనే పేరు. దానికి తోడు ఆధునిక సాంకేతిక  పరిజ్ఞానం. ఇక అడ్డేముంది, మరింత చెలరేగిపోయారు.
మరో విషయం చెప్పుకోవాలి. కేవలం మాటల గారడీ చేస్తూ పోకుండా, మాట్లాడుతున్న అంశంలో తనకు ఎంతటి విషయ పరిజ్ఞానం వుందో కూడా ఆయన చాటిచెప్పారు. ఆయన ఇంజినీరు కాదు, అయినా కాకలు తిరిగిన ఇంజినీర్లు కూడా విస్తుపోయేలా అనేక సాంకేతిక విషయాలను తేటతేట తెలుగులో విడమరచి చెప్పారు. ఆయన సాంకేతిక నిపుణుడు కాదు, కానీ ఆ నైపుణ్యాన్ని పుక్కిటబట్టిన ప్రవీణులు సైతం నివ్వెర పడేలా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ స్వయంగా నిర్వహించారు. ఇందుకోసం ఎన్ని గంటలు కష్టపడింది కూడా ఆయనే వివరించారు. శ్రమకు తగ్గ ఫలితం లభించింది. ఇంటా బయటా ప్రశంసల వర్షం కురిసింది. ఇంకా కురుస్తూనే వుంది. దీనికి దాఖలా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ, అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాన్ని టీవీలో చూస్తూ సుప్రసిద్ధ జర్నలిష్టు పొత్తూరి వెంకటేశ్వర రావు సీఎంఓ (ముఖ్యమంత్రి కార్యాలయం)కి  పంపిన అభినందనలతో కూడిన ఎస్.ఎం.ఎస్. (సంక్షిప్త  సందేశం), కేసీఆర్ వెనువెంటనే దాన్ని తన ప్రసంగంలో ప్రస్తావించిన వైనం. అలాగే మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు కేసీఆర్  ని పొగుడుతూ రాసిన లేఖ.
ముఖ్యమంత్రి హోదాని దృష్టిలో ఉంచుకుని చూస్తే సరే ఇలాటివన్నీ సహజం అనుకోవచ్చు.
ఏదిఏమైనా, కేసీఆర్ తనకు తానుగా కల్పించుకున్న ఈ అపూర్వ, సువర్ణావకాశాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకున్నారనే చెప్పాలి.
తెలంగాణాకు సంబంధించిన సేద్యపు నీటి వ్యవస్థ ప్రస్తుత పరిస్తితులను కళ్ళకు కట్టినట్టు, సామాన్యుడికి కూడా బోధపడే విధంగా అసెంబ్లీలో ఆవిష్కరించారు. గతాన్ని ప్రస్తావించి, వర్తమానాన్ని విశ్లేషించి, భవిష్యత్ దర్శనం చేసిన తీరు శ్లాఘనీయం. కేసీఆర్ అంటే ఒక సాధారణ ప్రాంతీయ పార్టీకి చెందిన రాజకీయ  నాయకుడి గానే పరిగణిస్తున్న అనేకమంది రాష్ట్రేతర ప్రజలు, ఆయనలో తమకు ఏమాత్రం తెలియని రాజనీతిజ్ఞుడిని చూసివుంటారు. అలా,  అందరినీ ఆకట్టుకునేలా సాగింది ఆనాటి ఆయన ప్రసంగం.
తెలంగాణలో సేద్యపు నీటి ప్రాజెక్టుల రీ డిజైన్ ఆషామాషీగా తలపెట్టింది కాదు, కోటి ఎకరాలకు నీరు అందించడం దాని లక్ష్యం అని ముఖ్యమంత్రి చెప్పారు. ఎవరు అడ్డొచ్చినా  ఆగేది లేదు, చేపట్టిన పనిని ఆపేది లేదు అంటూ వ్యతిరేక వాదం వినిపిస్తున్న వారికి హెచ్చరిక చేసారు.
మరో అయిదేళ్ళలో తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు అన్నీ పూర్తిచేస్తామని పునరుద్ఘాటించారు. తెలంగాణాకు ఎగువన, మహారాష్ట్ర, కర్నాటకల్లో నాలుగు వందల యాభయ్ కి పైగా బ్యారేజీలు కట్టిన విషయాన్ని కేసీఆర్ దృశ్యమానంగా వివరిస్తూ, భవిష్యత్తులో పైనుంచి కిందికి నీరు వచ్చే అవకాశం మృగ్యమనీ, అంచేతే ప్రాజెక్టుల రీ డిజైనింగ్ అవసరమైందనీ కార్యకారణ సహితంగా చెప్పిన తీరు  సభలో వున్నవారినే కాకుండా, ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నవారిని కూడా ఆకట్టుకుంది. రాష్ట్రాల నడుమ అనవసరమైన వివాదాలు రాకుండా నివారించడానికే ఈ ప్రయత్నం అంతా అని ముఖ్యమంత్రి చెప్పారు. అయితే ఇంతటి సుహృద్భావం, ఇంతటి ఉదారవాదం  భవిష్యత్తులో న్యాయపరమయిన చిక్కుల రూపంలో  రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగిస్తుందేమో కూడా ఆలోచించుకోవడం అవసరం. దిగువన వున్న కొత్త రాష్ట్రం  ఆంధ్రప్రదేశ్ తో కూడా అదేవిధమైన సయోధ్య కోరుకుంటున్నామని చెప్పడం ఆహ్వానించతగ్గ విషయం.      
సరే! ఇదంతా నాణేనికి ఒక వైపు. ప్రసంగం చేయడం, అందరినీ మెప్పించడం ఒక ఎత్తు. ముందే తిరగేసి సుతిమెత్తగా చెప్పింది అందుకే,   ‘ఏం చెప్పారన్నది కాదు ప్రశ్న, ఎలా చెప్పారన్నది పాయింటు’ అని.
ప్రాజెక్టుల రీ డిజైనింగ్ ఆలోచనలో దాగున్న సందేహాలను కేసీఆర్ తన ప్రెజెంటేషన్ ద్వారా నివృత్తి చేసారు. కానీ అంతటి భారీ  వ్యయాన్ని భరించగలిగిన పరిస్తితి రాష్ట్రానికి ఉందా? మొదలయిన ప్రశ్నలకు సరయిన జవాబు దొరకలేదు.
ఎలా చెప్పారు. భేషుగ్గా చెప్పారు అని అందరూ అంటున్నారు.  ఏం చెప్పారు ? అదే తెలియడం లేదని కూడా కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.  
అందుకే ఆయన ధారావాహిక ప్రసంగంలో తడిసి ముద్దయి, మతులు పోయి మత్తులో తేలిపోయిన జనాల మెదళ్ళు నెమ్మదిగా తేరుకుంటున్నాయి. ఆయన ఏం చెప్పారు, మనం ఏం విన్నాం అనే ఆలోచనలో పడుతున్నాయి.
చక్కటి అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకుని, ముఖ్యమంత్రి పవర్ పాయింటు ప్రెజెంటేషన్ కార్యక్రమాన్ని బహిష్కరించిన కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ  మెల్లగా తేరుకుని విమర్శనాస్త్రాలు ఎక్కుబెట్టడం మొదలు పెట్టాయి. ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పేరుతొ టీ.ఆర్.ఎస్. ప్రభుత్వం తలపెట్టిన లక్షలాది రూపాయల ప్రజాధనం వృధా చేసే కార్యక్రమంలో తామూ పాలుపంచుకున్నట్టు అవుతుందేమో అన్న సందేహంతోనే సభకు వెళ్లలేదని కాంగ్రెస్ పక్ష ఉపనాయకుడు మల్లు భట్టి  వివరణ ఇచ్చారు.  సభావేదిక మీద ధీటుగా జవాబు చెప్పడానికీ, లేదా ముఖ్యమంత్రి వాదనను తిప్పికొట్టడానికీ తమకు సమానమైన అవకాశం కల్పించలేదన్న వారి వాదన కూడా కొట్టిపారవేయతగింది కాదు. కానీ, అది సాకుగా చూపి సభకు గైరుహాజరు కావడం సమర్ధనీయం కాదేమో.  
ఉపశ్రుతి: కేసీఆర్ ప్రసంగాన్ని శ్రద్ధగా విన్న నా మిత్రుడు ఒకరు ఫోనుచేసారు. బహుశా కేసీఆర్  బద్ధ శత్రువులు కూడా ఆయన మాదిరిగా ప్రతి విషయంలో కేసీఆర్ నిర్ణయాలను వ్యతిరేకించలేరు అనేది నా నిశ్చితాభిప్రాయం. ఎందుకో ఏమో కారణం తెలవదు,  ఆయన నరనరానా కేసీఆర్ వ్యతిరేకత నిండిపోయింది.  అందుకే,  ఫోనులో ఆయన మాట్లాడిన తీరు నాకు విస్మయాన్ని కలిగించింది.
కేసీఆర్ పట్ల  తాను  ఇన్నేళ్ళుగా పెంచుకుంటూ వస్తున్న దురభిప్రాయాలన్నీ ఈరోజుతో దూదిపింజల్లా కొట్టుకుపోయాయని ఆయన చెబుతుంటే వింటూ నివ్వెరపోవడం నా వంతయింది.
శత్రువుల్ని సైతం తనవాళ్ళుగా చేసుకోవడం మెచ్చదగిన విషయమే. కానీ, ప్రసంగాలు, ప్రచారాలతోటే పొద్దు పుచ్చుతున్నారు అంటూ ఈరోజు ప్రతిపక్షాల నోట వినబడుతున్న మాటలు, ముందు ముందు  ప్రజలనోటంట కూడా వినబడే పరిస్తితి రాకుండా చూసుకోవడం విజ్ఞులయిన పాలకుల ప్రధమ కర్తవ్యం. (02-04-2016)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595        
       
   




1, ఏప్రిల్ 2016, శుక్రవారం

పాత జ్ఞాపకం



2004 నుంచి 2009 వరకు ఐదేళ్ళపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు కే.ఆర్. సురేష్  రెడ్డి స్పీకర్ గా పనిచేశారు. ఆ రోజుల్లో ఆయన పూనికపై అసెంబ్లీ వ్యవహారాలు చూసే జర్నలిష్టులకు వృత్తిపరమైన విషయాల్లో తోడ్పడేందుకు అసెంబ్లీ ప్రెస్  గ్యాలరీ కమిటీ ఏర్పాటు చేశారు. దాసు కేశవరావు (హిందూ) చైర్మన్ గా, దేవులపల్లి అమర్ (అప్పట్లో ఆంధ్రప్రభ) కన్వీనర్ గా వున్న ఆ  కమిటీలో  రేడియో తరపున నేనూ ఒక సభ్యుడిని. ఆ రోజుల్లో  స్పీకర్ తో కలిసి ఈ కమిటీ సభ్యులం దిగిన ఒక ఫోటోను మిత్రుడు వ్యాకరణం రామ సుబ్రహ్మణ్యం షేర్ చేశాడు.


అతడికి కృతజ్ఞతలు.