21, మే 2014, బుధవారం

రివైండ్ - 2010 - తొమ్మిదో భాగం


విన్నంతలో కన్నంతలో అమెరికా :
సాంకేతిక విన్యాసాల ఆవాసం - బిల్ గేట్స్ నివాసం


బిల్ గేట్స్ ఇంటికి వచ్చే అతిధులకు ఓ రకం చిప్ అమర్చిన బ్రేస్లేట్ ఇస్తారు. అంటే దేశవిదేశాల్లోని వారెవరయినా అ అతిధిదేవుళ్ళతో అవసరం పడి  వారిని కాంటాక్ట్ చేయాలనుకుంటే వేరే ఫోన్లు, సెల్ ఫోన్లు అవసరం లేదు. ఆ అతిధి యే గదిలో వుంటే ఆగదిలో అతడికి అతి దగ్గరలో వున్న ఫోనుకి ఆ  'కాల్’  కనెక్ట్ అవుతుంది. మరో విశేషం ఏమిటంటే - బయటనుంచి వచ్చిన అతిధి శరీరతత్వానికి తగినట్టుగా అక్కడి ఉష్ణోగ్రతలు మారిపోతుంటాయి. అంటే, వెచ్చదనం కావాలనుకునే వారికి అందుకు తగినట్టుగానూ, చల్లదనం కోరుకునేవారికి అందుకు అనుగుణంగానూ - ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ ఎప్పటికప్పుడు మార్పులు చేస్తుంటుంది.

 అక్కడి పెయింటింగులు కూడా వచ్చినవారి అభిరుచులకు అనుగుణంగా మారిపోతుంటాయి. పికాసా పెయింటింగులు కోరుకునేవారికి అవే కనిపిస్తాయి. అదే సమయంలో రవివర్మ చిత్రాలు ఇష్టపడేవారికి అవే కనువిందు చేస్తాయి. మాయాబజారు సినిమా చూస్తున్నట్టు వుంది కదూ ఇవన్నీ వింటుంటే. 
బిల్ గేట్స్ నివాసం వున్న ప్రాంతం సియాటిల్ లో అతి ఖరీదయిన క్లయిడ్ హిల్ ఏరియా . అంత సంపన్నుడి ఇరుగూ పొరుగూ ఎవరో తెలుసుకోవాలనే ఉత్సుకత వుండడం సహజం.  అతగాడెవరో కాదు,  ఒక సాధారణ పిజియో తెరపిస్ట్ అంటే నమ్మగలరా!  గేట్స్ నివాసం పక్కనే ఇల్లు కొనుక్కోవడం  అతగాడికి  ఎలా సాధ్యమయిందంటే-  బిల్ గేట్స్ మైక్రో సాఫ్ట్  సంస్త పెట్టిన కొత్తల్లో అందులో  కొన్ని షేర్లు కొన్నాడు.  కాలక్రమేణా  ఆ షేర్లు ఇంతింతై, వటుడింతై అన్నట్టుగా  పెరిగిపోయాయి. దానితో ఆ మామూలు డాక్టర్ కాస్తా - కోరిన కోరికలు తీర్చుకోగల పెద్ద  ఆసామీ అయిపోయాడు. యెంతో డబ్బు గుమ్మరించి  బిల్ గేట్స్ పొరుగునే ఇల్లు కొనుక్కుని కాలర్ ఎగరేసుకుని కాపురం ఉంటున్నాడు.
అంతేకాదు బిల్ గేట్స్   మైక్రోసాఫ్ట్ పెట్టిన తొలి రోజుల్లో ఆయన ఆహ్వానంపై  అందులో చేరిన సిమోనీ అనే హంగేరియన్ అమెరికన్,  జీవితంలో  ఎంతగా ఎదిగి పోయాడంటే , అతడు వందల కోట్లు పెట్టి టికెట్లు కొనుక్కుని రెండు సార్లు అంతరిక్షంలోకి యెగిరి  వెళ్లి రాగల సంపన్నుడయ్యాడు.
అదీ మైక్రో సాఫ్ట్ షేర్ల మహాత్మ్యం అంటే.

(2010)

20, మే 2014, మంగళవారం

రివైండ్ 2010 - ఎనిమిదో భాగం


కన్నంతలో విన్నంతలో అమెరికా  
నౌకావిహారంలో భాగంగా ఒక లేడీ గైడ్ - చుట్టుపక్కల విశేషాలను మా అందరికీ ఎంతో ఆసక్తి కరంగా వివరిస్తూ - అదిగో ఆ వొడ్డుపై చెట్ల గుంపు వెనక కనిపిస్తున్న సౌధాన్ని చూడండి. యావత్ ప్రపంచంలో అత్యంత సంపన్నుడయిన వ్యక్తి అక్కడ నివసిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ భవనం అది అని చెబుతూ అందులోని విశేషాలను వర్ణించడం మొదలు పెట్టింది.


బిల్ గేట్స్ నెలసరి ఆదాయం సరిగ్గా చెప్పాలంటే చేసే వ్యాపారంలో అన్ని ఖర్చులు పోను మిగిలే నికర లాభం అన్నమాట కొన్ని వందల కోట్లు వుంటుందని అంచనా. ఇంత డబ్బుగల ఆసామీ ఇల్లు ఎంత గొప్పగా వుంటుందో అని వూహించుకోవడం సహజమే మరి. ఆ లేడీ గైడ్ చేయి చాపి చూపినవైపు చూపు సారించి చూస్తే - దూరంగా తీరం, ఎత్తయిన వొడ్డు, దానిపై వత్తుగా మరింత ఎత్తయిన వృక్షాలు, వాటి కొమ్మల మధ్య లీలగా కానవచ్చే ఓ భవనం ఓస్ ఇంతేనా అనిపించింది.
 కానీ లేడీ గైడ్ చెప్పే విశేషాలు మాత్రం ఇన్నీ అన్నీ కాదు మరి
పాత కొత్తల మేలుకలయికగా ఆ ఇంటిని డిజైన్ చేసారని చెబుతారు.
సోఫాలు,కుర్చీలు,మంచాలు ఇలాటివన్నీ చాలా పాత కాలానికి చెందిన యాంటిక్ ఫర్నిచర్గా కనిపిస్తాయి. ఇతర ఉపకరణాలన్నీ భవిష్యత్ తరానికి తగ్గట్టుగా రూపొందించారు. అవి చూసినా విన్నా అదరహోఅనాల్సిందే.

యావత్ ప్రపంచానికే టెక్నాలజీ సమకూర్చి పెట్టినవాడికి తన ఇంటిని ఒక సాంకేతిక అద్భుతంగా తీర్చిదిద్దుకోవడం పెద్ద విశేషమేమీ  కాకపోవచ్చు. కానీ కనే వారికీ, వినే వారికీ ఆ నివాసం వింతల్లో వింతే.

రివైండ్ 2010 (ఏడో భాగం)


కన్నంతలో విన్నంతలో అమెరికా  
అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో ప్రవేశించడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అయినా గట్టిగా ప్రయత్నించి అనుమతి సంపాదించాను. ప్రెసిడెంట్ వెకేషన్ లో వున్నారు. అందువల్ల - శ్వేత సౌధంలో మీడియా వ్యవహారాలూ చూసే ఒక ఉద్యోగిని మాటల్లో పెట్టి ఓవల్ ఆఫీసు’ (వైట్ హౌస్ లో ప్రెసిడెంట్ కార్యాలయం) ను కూడా చూసాను.
 ఆయన కుర్చీ పక్కన రెండు బటన్లు కనిపించాయి. వొకటి నొక్కితే మూడో ప్రపంచ యుద్ధానికి తెరతీయడానికి, రెండోది నొక్కితే అణు యుద్ధం ప్రారంభించడానికి అధ్యక్షుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు వీలుగా వాటిని అమర్చారని నాలో నేనే ఏదో వూహించుకుని ఆ విషయమే నా వెంట వచ్చిన ఆ తెల్ల పిల్లతో అన్నాను. పెద్ద వయస్సులేని ఆ అమ్మడు చిరునవ్వు నవ్వి ఇలా అంది. మీ ఊహల్నిఅలా అంతంత దూరం పోనివ్వకండి. ఆ ఎర్ర బటన్ నొక్కితే ప్రెసిడెంట్ కి కాఫీ కావాలని అర్ధం. పచ్చ బటన్ నొక్కితే బర్గర్ కూడా తీసుకు రావాలని సంకేతం.



(లేక్  వాషింగ్టన్ లో నౌకావిహారం)

తెలియని విషయాలను గురించి మామూలుగా  మామూలు మనుషులు వూహించుకునే తీరుతెన్నులపై - ఓ నలభై ఏళ్ళక్రితం చదివిన ఈ జోక్ సియాటిల్ లోని -  లేక్ వాషింగ్టన్’ (సరస్సు) లో ఓ ఆదివారం నాడు పెద్ద మర బోటులో విహరిస్తున్నప్పుడు గుర్తుకు వచ్చింది. విశాలమయిన ఈ మంచినీటి సరస్సు కొన్ని మైళ్ల దూరం విస్తరించి వుంది. (2010)

పనిచెయ్యని 'బూచి' మంత్రం


స్వాతంత్య్రానంతరం భారత దేశరాజకీయలు ఒక కొత్త మలుపు తిరగబోతున్నాయి. గాంధీ నెహ్రూ కుటుంబానికి చెందని ఒక రాజకీయనాయకుడు, దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత జన్మించిన ఓ వృద్ధ యువకుడు మొదటిసారి ప్రధాని పదవిని చేపట్టబోతున్నాడు. అంతేకాదు భారత దేశం వంటి ఓ శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశానికి బలహీనవర్గాలకు చెందిన వ్యక్తి అధికార పగ్గాలను అందుకోబోతున్నాడు. రాజకీయాలను ఓ పక్కనబెట్టి చూస్తే నిజంగా ఇది ఒక శుభ పరిణామం అనే చెప్పాలి.


దేశ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ అనేది యెంత ప్రభావశీలి అయినప్పటికీ కొందరి దృష్టిలో అది ఇప్పటికీ ఎప్పటికీ మతోన్మాద పార్టీ. పార్టీ ఒక్కటే కాదు ఇప్పుడు దానికి నాయకత్వం వహిస్తున్న నరేంద్ర మోదీ సంగతి చెప్పనక్కరలేదు. ఆయన పేరు వింటేనే కొందరికి కంపరం. మోదీని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటిస్తేనే సహించలేక కొందరు నాయకులు ఎన్డీయే కూటమి నుంచే తప్పుకున్న సందర్భాలు వున్నాయి. కర్నాటకు చెందిన ఓ ప్రసిద్ధ రచయిత మోదీ ప్రధాని అయితే తాను భారత దేశం విడిచి పెట్టి వెళ్ళిపోతానని శపధం పూనాడంటే ఆయనంటే కొన్ని వర్గాలలో వైమనస్యం  ఏ స్థాయిలో వున్నదీ అర్ధం చేసుకోవచ్చు. పదేళ్ళ పాలన తరువాత ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో తాటి ప్రమాణంలో వుందని తెలిసిన తరువాత కూడా ఎన్నికల అనంతరం ఏర్పడే ప్రభుత్వానికి తామే నాయకత్వం వహిస్తామని కాంగ్రెస్ అధిష్టానానికి చెందిన కొందరు నాయకులు ధీమాతో కూడిన ప్రకటనలు చేయడానికి కారణం కూడా కొన్ని రాజకీయ పార్టీలు బీజేపీ ని ఒక అంటరాని పార్టీగా పరిగణించే తత్వానికి అలవాటుపడివుండడమే. బీజేపీని ఒక బూచిగా చూపించి తమ పబ్బం గడుపుకోవాలని కాంగ్రెస్ పెంచుకున్న ఆశలపై ప్రజలు నీళ్ళు చల్లారు. అది కూడా ఏదో మామూలుగా కాదు, చీత్కరించినట్టు పెద్దపెట్టున తిరస్కరించారు. నూటపాతికేళ్ల పైచిలుకు చరిత్ర కలిగిన, దేశాన్ని ఎక్కువ సంవత్సరాలు పాలించిన రికార్డు ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్ పార్టీని అతి తక్కువ స్థానాలకు పరిమితం చేసి 'మా దృష్టిలో ఇదీ మీ స్థానం' అని తేటతెల్లం చేశారు. ఇంతటి ఘన  విజయాన్ని మూటగట్టుకోగలిగిన స్థోమత వస్తుతః మోదీకి వున్నప్పటికీ, నిజం చెప్పాలంటే ఇందులో కాంగ్రెస్ నిర్వాకం కూడా చాలా వుంది. స్వయంకృతాపరాధాలకు ఆ పార్టీ చెల్లించిన మూల్యంగా చెప్పుకోవచ్చు.
పెద్ద బాధ్యత భుజానికి ఎత్తుకుని మోదీ ఇంత పెద్ద పదవిని స్వీకరించబోతున్నారు. ఆయన తమ బతుకుల్ని మారుస్తాడనే ఆశతో జనం ఆయనకు ఈ పగ్గాలు అప్పగించారు. ఎవరిమీదా ఆధారపడకుండా, నిష్క్రియాపరత్వానికి ఇతరులపై నిందమోపి తప్పుకునే వీలులేకుండా తిరుగులేని సంఖ్యాబలంతో అధికారాన్ని దఖలు పరిచారు. ఇక బంతి మోదీ కోర్టులో వుంది. ఇన్నాళ్ళు చెబుతూ వచ్చిన మాటలు నీటి మీది రాతలు కావు, రాతి మీది గీతల్లా చెక్కుచెదరవని నిరూపించుకోవాల్సిన నైతిక బాధ్యత ఆయన భుజస్కందాలపైనే వుంది.
దేశాన్ని ఒక కొత్త మలుపు తిప్పుతారో, తానే ఓ మలుపు తిరిగి తానులో ముక్కనని నిరూపించుకుంటారో కాలమే తేలుస్తుంది. (20-05-2010)

రివైండ్ - 2010 ఆరో భాగం


కన్నంతలో విన్నంతలో అమెరికా :
వాషింగ్టన్ స్టేట్ (అమెరికా రాజధాని వేరు- ఆ దేశపు మొదటి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ పేరు ఈ రాష్ట్రానికి పెట్టారు) లో లీవెన్ వర్త్ అనే ఒక టూరిస్ట్ పట్టణం వుంది. జర్మనీ లోని బవేరియన్ సంస్కృతీ మూలాలు ఇక్కడ స్పుటంగా కానవస్తాయి.వేనాచీ నదీ తీరంలోని ఈ లీవెన్ వర్త్ జనాభా రెండువేలు. కానీ దీన్ని సందర్శించే వారి సంఖ్య రోజూ వేలల్లో వుంటుంది. వారాంతపు సెలవు దినాల్లో ఇది కిటకిటలాడిపోతూ వుంటుంది. ప్రతి ఏటా అక్టోబర్ లో నిర్వహించే ఉత్సవాలకు అనేక దేశాలనుంచి టూరిస్టులు రావడం ఆనవాయితీ. ఇక్కడ నిర్మాణాలన్నీ ప్రాచీన బవేరియన్ సంస్కృతిని ప్రతిబింబిస్తుంటాయి. రుచికరమయిన వైన్ తయారీకి ప్రసిద్ధి.


ఒకప్పుడు కలప వ్యాపారంపై ఆధారపడిన ఈ చిన్ని పట్టణం తరువాత ఆర్ధికంగా పూర్తిగా చితికి పోయి- తదనంతర కాలంలో టూరిజాన్ని నమ్ముకుని ఇప్పుడు శోభాయమానంగా విలసిల్లుతోంది. టూరిస్టులను ఉల్లాసపరచడానికి స్తానికులు రోడ్ల పక్కనే పలు రకాల సంగీత నృత్య ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు.



స్తానికంగా తయారయ్యే పలు రకాల వైన్ లను, తినుబండారాలను ముఖ్యంగా సాస్లను మచ్చుకు రుచి చూపిస్తారు. వైన్ వంటివాటిని అనేక పర్యాయాలు రుచి చూస్తూ కాలక్షేపం చేసేవారిని - ఇక్కడ ఒక రకం సాస్’ (మిరపకాయల రసంతో తయారు చేస్తారు) దిమ్మదిరిగేలా చేయడం కళ్ళారా చూసాము. అదేమిటో , దాన్ని ఎలా తయారు చేసారో తెలియదు కానీ ఒక్కటంటే ఒక్కచుక్క నాలిక తాకగానే - శరీరం ఆపాదమస్తకం నిలువునా దహించిపోతున్న ఫీలింగ్ కలుగుతుంది. అది రుచి చూసి గింగిరాలు తిరిగిపోతున్నవారిని చూస్తుంటే మన వైపు గుంటూరు మిరప ఘాటుమించిన పదార్ధం వుందనిపించింది. ఒక సీసా కొనుక్కువచ్చాము కానీ రుచి చూసే సాహసం మాత్రం చేయలేదు. (2010)

రివైండ్ - 2010 ఐదో భాగం


కన్నంతలో విన్నంతలో అమెరికా :  
అమెరికాలో ఎలిమెంటరీ స్కూలు విద్యార్ధిని- ఢిల్లీ జనాభా యెంతఅని అడిగితే  'తొమ్మిదివేల'ని  జవాబు చెబుతాడు. ఇంకొంచెం చురుకయిన వాడయితే మరో అడుగు ముందు కేసి -  రెండువేల ఏడో సంవత్సరం జులై నాటి తాజాలెక్కల  ప్రకారం 'అక్షరాలా తొమ్మిది వేల నూట  తొంభయి రెండుఅని బల్లగుద్ది మరీ  చెబుతాడు.
మనకు ఆశ్చర్యం అనిపించినా అతడు చెప్పింది నిజమే. అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్ లో మార్సేడ్ కౌంటీకి పద్దెనిమిది మైళ్ల దూరంలో ఈ ఢిల్లీ వుంది. డెల్టా హై లైన్ కెనాల్ కి దగ్గరలో వుండడం వల్ల దీనికీ పేరు వచ్చిందని చెబుతారు. డెల్ హై కాస్తా ఢిల్లీగా మారినట్టుంది. ఇంగ్లీష్ స్పెల్లింగ్ ప్రకారం ఢిల్లీ కానీ - పలకడం మాత్రం డెల్-హై అనే.


(సియాటిల్ లో కొడుకు, కోడలు మనుమరాళ్ళతో)


ప్రపంచంలోని అనేకానేకదేశాల నుంచి వలస వచ్చిన వారే అమెరికా జనాభాలో అధికం. వారంతా క్రమేపీ స్థానిక జీవన స్రవంతిలో కలసిపోయి ఆధునిక అమెరికా నిర్మాణానికి పాటుపడ్డారు. కారణాలు తెలియవు కానీ ఈ దేశం లోని పలు పట్టణాలకు విదేశీ పేర్లు పెట్టారు. ఒక్క ఢిల్లీయే కాదు అమెరికాలో మద్రాస్ కూడా వుంది. ఆరెగన్ స్టేట్, జెఫర్సన్ కౌంటీలో ఈ మద్రాస్ అనే చిన్న పట్టణం వుంది. అలాగే ఫ్రాంక్లిన్ కౌంటీలో బాంబే వుంది. ఓ ఇరవయ్యేళ్ళ క్రితం వరకూ అమెరికాతో ఉప్పూ నిప్పూవంటి రాజకీయాలు నడిపిన సోవియట్ యూనియన్ రాజధాని మాస్కో పేరు కూడా అమెరికాలో ఒక పట్టణానికి పెట్టారు. వెర్మాంట్ రీజియన్ లో ఈ మాస్కో (పల్లె అనాలా!ఎందుకంటె దీని జనాభా చాలా తక్కువ) నెలవై వుంది. ఈ మాదిరిగానే లండన్, బర్మింగ్ హామ్, మాడ్రిడ్, పారిస్, లాహోర్ వంటి పేర్లు అమెరికాలోని  పట్టణాలకు వున్నాయి. (2010)

రివైండ్ - 2010 (నాలుగో భాగం)

కన్నంతలో విన్నంతలో అమెరికా ::: 
సియాటిల్ తిరిగి వచ్చేటప్పుడు మార్గం మార్చుకుని పసిఫిక్ తీరంలో వున్న మరో పెద్ద టూరిస్ట్ రిసార్ట్ కానన్ బీచ్ కి వెళ్లి ప్రపంచ ప్రసిద్ది పొందిన హేస్టాక్ రాక్ని చూసాము. సముద్రంలో వుండే ఈ కొండ- సముద్రాన్ని చీల్చుకు పైకి వచ్చిందా అన్నట్టుగా వుంటుంది. దాన్ని పక్షుల సంరక్షణా కేంద్రంగా అభివృద్ధి చేసారు.  మేము వెళ్ళిన రోజు సముద్రం ఎందుకో లోపలకు వెళ్ళిపోయి ఆ కొండ వరకూ వెళ్ళడానికి వీలుచిక్కింది.


 అక్కడి వారు చెప్పిన దాని ప్రకారం ఇది అరుదైన విషయమే. వేలమంది దాన్ని చూడడానికి రావడంతో ఆ బీచ్ అంతా ఎంతో కోలాహలంగా కానవచ్చింది.


మనవైపు ఏటి వొడ్డున ఇసకలో గుజ్జన గూళ్ళు కట్టినట్టు అక్కడ పిల్లలందరూ ఆ తీరంలో పెద్ద ప్రాకారాలు నిర్మించి ఆడుకోవడం గమనించాము. ఇందుకు అవసరమయిన పరికరాలన్నీ వారు వెంట తెచ్చుకున్నట్టున్నారు.


ఇవికాక అనేక రకాల ఆకారాలతో పెద్ద పెద్ద పతంగులు (గాలిపటాలు) ఎగురవేస్తూ కాలక్షేపం చేసేవాళ్ళు వందల సంఖ్యలో కనిపించారు.
చూసినవాటిని మనస్సులో భద్రపరచుకుంటూ సియాటిల్  రోడ్డు ఎక్కాము.

(2010)