27, ఫిబ్రవరి 2014, గురువారం

పాతికేళ్ళక్రితం మాస్కో - 2

ఇంగువ తెచ్చిన తంటా
  
అక్టోబర్ - 31, 1987 - అంటే శ్రీమతి ఇందిరా గాంధీ వర్ధంతి రోజున - ఢిల్లీ నుంచి సోవియట్ ఎయిర్ లైనర్ ' ఏరోఫ్లోట్' లో కుటుంబంతో కలసి మాస్కో బయలుదేరాను. కొన్ని మాసాలుగా ఎదురుచూసిన క్షణం దగ్గర పడుతుంటే విమానం విండో నుంచి కిందకు చూసే ప్రయత్నం చేసాము. కళ్ళు చికిలించుకుని చూసినా దట్టంగా అలుముకున్న పొగమంచులో ఏమీ కనబడలేదు. మరికొద్దిసేపటిలోనే మా విమానం మాస్కో పొలిమేరల్లోని ' షెర్మేతోవా' అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. విద్యుత్ దీపాల కాంతిలో ధగ ధగలాడుతూ, పలుదేశాల ప్రయాణీకులతో ఎయిర్ పోర్ట్ కళకళలాడుతోంది. మాస్కోలో వెజిటేరియన్లకు ఏమీ దొరకవు, ఉప్పూ ,పాలూ తప్ప అన్న హెచ్చరికలతో బయలుదేరిన మేము- లగేజి కలెక్ట్ చేసుకునేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాము. హైదరాబాద్ నుంచి సూటుకేసులనిండా పట్టుకొచ్చిన వంట సంభారాలతో కస్టమ్స్ అధికారులనుంచి ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు కానీ మా ఆవిడ తెచ్చిన ఇంగువ డబ్బా కొంత తంటా తెచ్చిపెట్టింది. ఇంగువని ఇంగ్లీష్ లో ఏమంటారో ఆ క్షణాన గుర్తురాలేదు. అది తినే వస్తువనీ, వంటల్లో వాడుకుంటామనీ ఎన్నోవిధాలుగా చెప్పిచూసాను. ఇంగ్లీష్ భాష ఇసుమంతకూడా అర్ధం కాని ఆ అధికారుల ముందు నా ప్రయత్నం వృధా ప్రయాస అయింది. పైపెచ్చు ఘాటయిన ఇంగువ వాసన వారి అనుమానాలను మరింత పెంచింది. చివరకు ఇంగువ ముక్క నోటిలో వేసుకుని నమిలి చూపించి ప్రమాదకరమూ, మాదక పదార్ధమూ కాదని రుజువు చేసుకున్న తరవాతనే అక్కడనుంచి బయట పడగలిగాము.

ఇల్లా? హోటలా?

బయటపడ్దామని అన్నానే కానీ బయటపడడం అంత సులభమయిన విషయం కాదని మాకు వెనువెంటనే తెలిసివచ్చింది. 
మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి మాస్కో రేడియో తరపున 'సెర్గీ' అనే ఉద్యోగి ఎయిర్ పోర్ట్ కి వచ్చాడు. అతడి చేతిలో మా పేర్లు ఇంగ్లీష్ లో రాసివున్న ప్లకార్డు చూసి ఒకరినొకరం గుర్తు పట్టాము. హైదరాబాద్ చిక్కడపల్లిలో కొన్న స్వెట్టర్లతో ప్రస్తుతానికి పని లాగిద్దామని దిగబడిన మమ్మల్ని చూసేసరికి అంత చలిలోనూ అతడికి చెమటలు పట్టినట్టున్నాయి. రష్యన్లో అతడు చెబుతున్నదేదో మాకు అర్ధం కావడం లేదన్న విషయాన్ని అతడే అర్ధం చేసుకుని మమ్మల్ని తీసుకువెళ్ళడానికి తెచ్చిన వాహనాన్ని ఎయిర్ పోర్ట్ లాంజ్ ఎగ్జిట్ గేటు వరకు తీసుకునివచ్చాడు. కారులో లగేజి ఎక్కించిన తరవాత - కారు డోరు తెరిచే వుంచి - ఒకే అంగలో వెళ్లి కారెక్కమని సైగలతో చూపించాడు. మేమంతా ఒక్క ఉదుటున వెళ్లి కారెక్కాము. అప్పుడు అర్ధమయింది మాకు - మా గురించి అతడు పడిన ఆదుర్దా. ఎగ్జిట్ గేటు నుంచి కారెక్కడానికి మాకు పది సెకన్లు కూడా పట్టివుండదు. కానీ ఆ కాసేపటిలోనే చేతి వేళ్ళన్నీ చలితో కొంకర్లు తిరిగిపోయాయి. మాస్కో చలి పులి విసిరే పంజా దెబ్బ మాకు మొదటిరోజునే అనుభవంలోకి వచ్చింది. అదృష్టవశాత్తూ కారులో హీటరు ఉండడంవల్ల బిగుసుకుపోయిన అవయవాలన్నీ మళ్ళీ స్వాధీనంలోకి వచ్చాయి. 
మంచు కురిసే వేళలో 
మా లెక్క ప్రకారం అది పగటి వేళ అయివుండాలి. కానీ, వీధి దీపాలన్నీ దివిటీలమాదిరిగా వెలుగుతున్నాయి . వాహనాలను హెడ్ లైట్లు  వేసుకుని నడుపుతున్నారు . అదేపనిగా మంచు కురుస్తూ ఉండడంవల్ల - పగలో రాత్రో తెలియని అయోమయావస్థలో ఉండగానే మా కారు పలు అంతస్తుల భవనం ఒకదానిముందు ఆగింది. 


(మా పిల్లలు సందీప్, సంతోష్)

ఎయిర్ పోర్ట్ అనుభవం ఇంకా  గుర్తు ఉండడంతో ఈసారి అందరం ఎక్కువ ఇబ్బంది పడకుండానే లోపలకు ప్రవేసించాము. మమ్మల్నీ, మా సామానునీ తొమ్మిదో అంతస్తులో వున్న ఒక అపార్ట్ మెంట్ కు చేర్చి - సెలవు తీసుకున్నాడు సెర్గీ మహాశయుడు.  లోపలకు వెళ్లి చూస్తె కళ్ళు తిరిగేలావుంది. రెండు పడక గదులు, ఒక డ్రాయింగు రూము, వంటగది, సామాను గది, మంచాలు, పరుపులు,దిండ్లు, దుప్పట్లు, కలర్ టీవీ (అప్పట్లో మనదేశంలో అదో లగ్జరీ), నాలుగు బర్నర్ల స్టవ్, గ్యాస్, బాత్ టబ్, షవర్ ఒకటేమిటి సమస్తం అమర్చి పెట్టి వున్నాయి. ఒక క్షణం ఇది ఇల్లా లేక హోటలా అన్న అనుమానం కలిగింది.ఆ పూటకి వంట జోలికి పోకుండా ఇండియా నుంచి తెచ్చుకున్న తినుబండారాలతోనే సరిపెట్టుకున్నాము. 
 సోఫాల్లో సర్దుకు కూర్చుని టీవీ ఆన్ చేస్తే సోవియట్ కమ్యూనిస్ట్ అధినాయకుడు మిహాయిల్ గోర్బచేవ్ అనర్ఘలంగా ప్రసంగిస్తూ కానవచ్చారు. భాష అర్ధం కాకపోయినా వింటూనే నిద్రలోకి జారిపోయాము. 
 'రష్యన్ మహిళ నోట తెలుగు మాట' వినడానికి కొంత వ్యవధానం)


26, ఫిబ్రవరి 2014, బుధవారం

VALID UPTO 2099

సీ.జీ.హెచ్.ఎస్.
కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న యాభై లక్షలమంది ఉద్యోగులకు, ముప్పై లక్షలమంది రిటైర్డ్ సిబ్బందికీ సురపరిచితమైన పదం. సిబ్బంది అనారోగ్యాలకు గురైనప్పుడు ఆదుకునేందుకు ఉద్దేశించిన సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్,(C.G.H.S.)  
1975 నుంచి 2005 వరకు నేను ఆకాశవాణి, దూరదర్శన్ లలోనే ఉద్యోగం చేసాను. మధ్యలో ఓ అయిదేళ్ళు మాస్కో రేడియోలో పనిచేయడం కోసం మాస్కోలో వున్నాను. ఆ సమయంలో ఓ సారి సెలవుమీద మాస్కోనుంచి హైదరాబాదు వచ్చినప్పుడు అనుకోకుండా మా ఆవిడను ఆస్పత్రిలో చేర్చాల్సివచ్చింది. అప్పుడే కొత్తగా మొదలయిన జూబిలీ హిల్స్ అపోలో ఆసుపత్రిలో డాక్టర్ వెంకట్రామరెడ్డి గారు ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. ఆ రోజుల్లో మొత్తం అంతా కలిపి ముప్పై వేలు అయివుంటాయి. నేను మాస్కోలో పనిచేస్తున్నందువల్ల సీజీహెచ్ఎస్ కిందికి రానని తేల్చారు. మాస్కోలో ఆపరేషన్ చేసివుంటే మొత్తం అణాపైసలతో (రూబుళ్ళు,కోపెక్కులతో) సహా మాస్కో రేడియో భరించేది. కావున మాకు సంబంధం లేదని వాళ్లు తేల్చారు. సరే విదేశాల్లో ఉద్యోగం కనుక ఆసుపత్రి ఖర్చు సొంతంగా పెట్టుకున్నా పెద్ద భారం కాలేదు. ఆ తరువాత ఆమెకే  మళ్ళీ 2009 లో మరో ఆపరేషన్. ఈసారి స్టార్ ఆసుపత్రిలో డాక్టర్ గోపీచంద్,  గుండెలో వాల్వ్ మార్చి కొత్తది వేసారు. అప్పటికి నేను కేంద్ర ప్రభుత్వంలో మాజీని. 2005 లో దూరదర్శన్ లో పదవీ విరమణ చేసినప్పుడు సీజీహెచ్ఎస్ కార్డు రెన్యూ చేయించుకోమని వాళ్ళూ  చెప్పలేదు, నేనూ చేయించుకోలేదు. ఆ విధంగా మూడు దశాబ్దాల పైచిలుకు సర్వీసులో సీజీహేచ్ఎస్ సేవలను వాడుకోగల అవకాశం నాకు దొరకలేదు. ఈ మధ్య డీడీ లో నా సీనియర్ సహోద్యోగి కృష్ణారావు గారు సీజీహేచ్ఎస్ కార్డు అవసరాన్ని గురించి వెంటబడి చెబితే బేగంపేట  పాత ఎయిర్ పోర్ట్ పక్కన వున్న సీజీహేచ్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లాను. ప్రభుత్వ కార్యాలయాల్లో పని పడ్డప్పుడు కానీ అవి యెలా పనిచేస్తాయన్న విషయం బోధ పడదు. కొంచెం కష్టంగా, కొంచెం ఇష్టంగా పని పూర్తిచేశారు. పది రోజుల్లో వచ్చి కార్డు పట్టుకుపొమ్మన్నారు. వాళ్లు చెప్పిన తేదీకి, ఇచ్చిన సమయానికి వెడితే, ఫోటో కార్డులు తయారు చేయడానికి వొప్పుకున్న ఓ చెన్నై కంపెనీ మధ్యలోనే కాడి కిందపారేసిన కారణంగా 'కార్డు బదులు ఫోటోలు అతికించిన కాగితం ఇస్తాం తీసుకెళ్ళి లామినేట్ చేసుకొని వాడుకోండ'ని సలహా ఇచ్చారు. ఆరోజు రావాల్సిన సిబ్బంది రాలేదో, లేక అక్కడ అదే రివాజో తెలియదు కాని, ఫైలు చేతికిచ్చి పలానా రూములో పలానా అధికారి సంతకం పెట్టించుకురమ్మన్నారు. ఆయన దగ్గరకు వెడితే 'మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు వుందే' అంటూనే సంతకం పెట్టి మళ్ళీ ఫైలు నా చేతికి ఇచ్చారు. మొత్తానికి ఆ కార్యాలయంలో ఫైళ్ళ కదలికలో నేను కూడా పాలు పంచుకుని ఇచ్చిన  కాగితం పట్టుకుని, నేను సయితం సర్కారు ఆఫీసుల్లో పనులు చేసుకుని రాగలనన్న  గర్వంతో బయట పడ్డాను.


(Valid upto 2099)

కొసమెరుపు: ఇందులో ఏముంది అందరిలా మీదీ ఓ అనుభవం అంటారేమో. కానీ వుంది. బయటకు వచ్చిన తరువాత ఆ కాగితాన్ని తేరిపార చూస్తే 'VALID UPTO : 01-01-2099' అంటే ఇప్పటికే 68 ఏళ్ళు నిండిన నేను  మరో 85  ఏళ్ళు ఈ కార్డు వాడుకోవచ్చు అని. ఆరోగ్య  సేవల పధకం కదా! దీర్ఘాయుష్మాన్ భవ! అని దీవిస్తూ ఇచ్చివుంటారని సరిపెట్టుకున్నాను. 

పాతికేళ్ళ క్రితం మాస్కో -1

(ఇంతవరకు ఈ రచన చదవనివారి కోసం)
జర్నలిష్టులందరూ తమ వృత్తి అనుభవాలను గ్రంధస్తం  చేస్తుండాలని మిత్రుడు దేవులపల్లి అమర్ చెబుతుంటారు. గ్రంధ ప్రచురణ అనేది సామాన్య జర్నలిష్టులకు అలవి కాని భారం అయినప్పటికీఅనుభవంలోకి వచ్చిన విషయాలను కనీసం కాగితం మీద పెట్టడం వరకూ జరగాలన్నది నా అభిప్రాయం కూడా. అయినా సరే- ఇంచుమించు రెండున్నర  దశాబ్దాల క్రితం - మాస్కోలో గడిపివచ్చిన సుమారు అయిదేళ్ళ అనుభవాలను అక్షర బద్దం చేసే ప్రక్రియ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది.

ఏకధృవ ప్రపంచ వ్యవస్థను ప్రశ్నిస్తూ- లెనిన్  నూతన సామ్యవాద సిద్దాంతాలను ప్రవచిస్తూ- ఏడు దశాబ్దాలకు పైగా సాగిన మొట్టమొదటి 'సోవియట్  యూనియన్కమ్యూనిస్ట్ ప్రభుత్వ చరమాంకాన్ని కళ్ళారా చూడగలిగిన అరుదయిన అవకాశాన్ని ఆలంబనగా చేసుకుని -  'మార్పు చూసిన కళ్ళుఅనే పేరుతో ఆనాటి అనుభవాలను గుదిగుచ్చి గ్రంధస్తం చేయాలనే ప్రబలమయిన  కాంక్షను  ఎన్నో ఏళ్ళుగా అదిమిపట్టుకోవాల్సి వచ్చింది.  దీనికి కారణాలు అనేకం. 
ఆ నాడు నేను చూసింది మరో ప్రపంచం. 
అప్పటికీ యిప్పటికీ యెంతో తేడా.


మాస్కో అనుభవాలు గురించి నేను రాసిన 'మార్పు చూసిన కళ్ళు' పుస్తకాన్ని తమిళనాడు గవర్నర్ శ్రీ కె.రోశయ్య ఆవిష్కరించిన సందర్భంలో వార్తా కధనం)

 రోజుల్లో 'అలా వుండేదియిలా వుండేది' అని రాస్తే నమ్మడానికి వీల్లేకుండా ఈనాటి రష్యన్ల జీవన విధానాలు గుర్తు పట్టలేనంతగా మారిపోయాయి. రతనాలను రాశులుగా పోసి- వీధి అంగళ్ళలో విక్రయించిన  'స్వర్ణ యుగాలు'  చరిత్ర పుటల్లో ఆనవాలుగా మిగిలిపోయినట్టే - ఆ నాటి నా అనుభవాలు కూడా. 
నేను  కమ్యూనిష్టుని కాను.  వృత్తి రీత్యా వివిధ రాజకీయ పార్టీలవారితో అంటకాగి తిరిగివుండ వచ్చు కానీ   రకమయిన రాజకీయ వాసనలను నేను వొంటబట్టించుకోలేదు.  ఒక సామాన్యుడిగా అప్పటి కమ్యూనిస్ట్ రష్యాలో కాలు మోపాను . అక్కడ నేను గడిపిన 'జీవనం'  నా జీవితంలోనే ఒక సువర్ణ అధ్యాయం.  నేనూ, నా భార్యా పిల్లలూ - అత్యంత సుఖప్రదమయినగౌరవ ప్రదమయినతృప్తికరమయిన  రోజులు గడిపింది ఆ రోజుల్లోనే.  వాటిని గురించి ఏ కొంచెం చెప్పినా  గోరంతను 'కొండంతచేసి చెబుతున్నానేమో అని అనిపించకత ప్పదు.   అందుకే  'మార్పు చూసిన కళ్ళు' అనే పేరుతొ నా అనుభవాలను అక్షరబద్ధం చేయడానికి ఇంతగా తటపటాయించాల్సివచ్చింది. 
అంతేకాదు.  కాలం గడుస్తున్నకొద్దీ - గుర్తుంచుకోవాల్సిన విషయాలు కూడా గుర్తుకురానంతగా మరపున పడడం సహజమయిన విషయం.  తేదీలుపేర్లూ స్పురణకు తెచ్చుకోవడం క్లిష్టంగా మారుతుంది.  విషయానికి న్యాయం చేయలేకపోతున్నామేమో అన్న సంశయం  మరింత వెనక్కి లాగుతుంది. ఏతా వాతా జరిగింది ఏళ్ళతరబడి కాలయాపన.
 ( రష్యన్ లో  'దస్వి దానియా' అంటే 'మళ్ళీ కలుద్దాం' అని అర్ధం.)  

21, ఫిబ్రవరి 2014, శుక్రవారం

జైలిల్లు


ఈమధ్య ఓ రెన్నెళ్ల నుంచి ఇంటిపట్టునే వుండాల్సిన పరిస్తితి.
అనుభవానికి వస్తే కాని అర్ధం కాదంటారు. నిజమే.

వంటింటి కుందేళ్ళుగా వుండే ఆడవాళ్ళు 'ఇంటి బందిఖానాని' ఏళ్లకు ఏళ్ళు యెలా భరిస్తూ వస్తున్నారో కదా!     

పాత గవర్నర్ - కొత్త నివేదిక

ABN ఆంధ్రజ్యోతిలో వస్తున్న స్క్రోలింగ్ :
"రాష్ట్రంలో రాజకీయ  అనిశ్చితి, అస్తిరత.
"రాజకీయ పార్టీలు ప్రాంతాలవారీగా విడిపోయాయి.
"ఏ ఒక్క పార్టీ మెజారిటీ నిరుపించుకునే  పరిస్తితి లేదు.
"సీఎం పదవికి  అందరికీ ఆమోదయోగ్యమైన  వ్యక్తి కనిపించడం లేదు"
- రాష్ట్రపతికి పంపిన నివేదికలో గవర్నర్
వ్యాఖ్య:  ఆయన గవర్నర్ అయినప్పటినుంచీ, అంతకు కొంత ముందర నుంచి  కూడా రాష్ట్రంలో దాదాపు ఇదే పరిస్తితి. కొత్తదేమీ కాదు. కాకపొతే నివేదికే కొత్తది.

(21-02-2014, 11 AM)

20, ఫిబ్రవరి 2014, గురువారం

ఒక ప్రక్రియ ముగిసింది ఇక ప్రజలే ప్రభువులు కావాలి


మన  రాష్ట్రానికి సంబంధించిన  ఒక ప్రధానమైన ఘట్టం చరిత్రలో చోటుచేసుకుంది. చాలా ఏళ్ళుగా నలుగుతూ, సలుపుతూ వచ్చిన ఒక సమస్యకు 'ముగింపు' దొరికింది. పడింది 'శుభం' కార్డా, మరో సమస్యకు అంకురార్పణా అన్న చర్చ అనవసరం.  దాన్ని కాలమే తేలుస్తుంది.


ఎందుకంటే 1956 లో మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా 'ఆంధ్రప్రదేశ్' ఏర్పాటయినప్పుడు ఇలాగే సంతసించినవాళ్ళు వున్నారు. సందేహించినవాళ్లు వున్నారు. ఆనాడు సంశయం వ్యక్తం చేసిన వాళ్ల భయాలే నిజం అయ్యాయని ఈనాడు విభజనను గట్టిగా కోరుతున్నవారు ఎంతో గట్టిగా వాదించిన సందర్భాలు వున్నాయి. అంచేత సందేహిస్తున్నవారి భయాలను తేలిగ్గా కొట్టివేయడం  కూడా తగదు. ఎవరు అవునన్నా   ఎవరు కాదన్నా తెలంగాణా ఆవిష్కృతం కాబోతోంది. ఈ సమయంలో గెలుపు వోటముల ప్రసక్తిని పక్కనబెట్టాలి. యుద్దంలో, ఆటల్లో మాత్రమే ఈ మాటలు వినబడతాయి. ఇంతకాలం జరిగింది యుద్ధమూ కాదు, ఆటా కాదు. ఉభయప్రాంతాల జనంలో వున్న ఆకాంక్షకు చక్కని  అభివ్యక్తీకరణ మాత్రమే. కొందరు రాజకీయులు దీనికి అగ్గి రాజేసారు. వారిని గురించి పట్టించుకోవాల్సిన అగత్యం ఎంతమాత్రం లేదు. ఇకనుంచయినా సరే, రెండు ప్రాంతాల ప్రజలు  రాజకీయుల చేతుల్లో పావులు కాకుండా తమ  ప్రాంతాల సత్వర  అభివృద్ధిలో  స్వయంగా భాగస్వాములు కావాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు అన్న నగ్న సత్యాన్ని రాజకీయ నాయకులకు ఎరుకపరచాలి.
(ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్తీకరణ బిల్లును  ఈరోజు, 20-02-2014,   మధ్యాహ్నం  3-10 కి హోం మంత్రి శ్రీ షిండే  రాజ్యసభలో  ప్రవేశపెట్టారు.  దాదాపు  అయిదు గంటలకు పైగా చర్చ జరిగింది. తరువాత విపక్షాలు డివిజన్ కోరినా సభాపతి వొప్పుకోలేదు. మూజువాణీ వోటుతో  రాత్రి  8- 08 నిమిషాలకు బిల్లును ఆమోదించింది)  



డౌటేహం


"ఆంధ్రా బ్యాంకులో పనిచేసే స్నేహితుడు ఒకరు అడిగారు. విభజన  అనంతరం తెలంగాణాలో తమ బ్యాంకు సంగతేమిటని? కర్నాటక, మహారాష్ట్ర బ్యాంకులు మాదిరిగానే   అనే జవాబు ఆయనకు నచ్చినట్టులేదు."