5, జనవరి 2014, ఆదివారం

వినదగునెవ్వరు చెప్పిన – అది ఇంగ్లీషోడయినా సరే!


TIME HEALS ALL PAINS – BUT GIVE SOME TIME TO TIME

DREAM MORE WHILE YOU AWAKE

WHAT OTHERS THINK OF YOU, IS NONE OF YOUR BUSINESS

NO ONE IS IN CHARGE OF YOUR HAPPINESS EXCEPT YOU


LIFE IS TOO SHORT TO WASTE TIME HATING ANY ONE 

కరివేపాకు కధ



అనగనగా ఓ అమ్మ. ఆ అమ్మకు ఒక్కగానొక్క కొడుకు. పిల్లలు మంచిగా చదువుకుని వృద్ధిలోకి రావాలనుకునే కన్నతల్లులందరి మాదిరిగానే ఈవిడా తన కన్నకొడుకు విషయంలో తెగ ఆరాటపడింది. చదువు చెప్పే మేష్టార్ని వెదికిపట్టుకుని కొడుకును అప్పగించింది. పొద్దున్నే చద్దన్నం తిని చదువుకోవడానికి వెళ్ళే పిల్లాడిని చూస్తూ ఆ మాతృహృదయం మురిసిపోయేది. నాలుగు మంచి ముక్కలు వొంట బట్టించుకుని ప్రయోజకుడు అవుతాడని కలలు కంటున్న తల్లికి అసలు విషయం అర్ధం కాలేదు. ఆ పిల్లాడేమో చదువుకు ఎగనామం, పంతులుగారికి పంగనామం పెట్టేసి పగలంతా గాలికి తిరిగేవాడు. పొద్దుగూకేవేళ ఇంటికి తిరిగొస్తూ పొరుగు పెరట్లోని కరివేపాకు రెబ్బలు నాలుగు దొంగతనంగా కోసుకుని బుద్ధిమంతుడిలాగా అమ్మ చేతిలో పెట్టేవాడు. దాంతో ఆ కన్నతల్లి మరింత మురిసిపోయేది. నా బాబే! నా తండ్రే!అంటూ గారంగా ఓ బెల్లం ముక్క నజరానాగా అతడి చేతిలో పెట్టేది. తల్లి మురిపెం ముచ్చట చూస్తూ పెరిగిన పిల్లాడికి తాను చేస్తున్న తప్పేమిటో అర్ధం చేసుకునే వీలు లేకుండా పోయింది. అతగాడు పెద్దయి- పెద్ద దొంగగా మారి పోలీసుల చేతిలో చిక్కిన తరవాత కానీ తల్లికి కూడా తాను చేసిన తప్పు గ్రహింపుకు రాలేదు.ఇదేమిట్రా! మన ఇంటావంటా లేని ఈ దొంగతనాలేమిట్రా! దొంగతనం చేయడం తప్పురా తండ్రీ అంటూ ఆ అమ్మ తల్లడిల్లిపోతుంటే – ‘ ఈ ముక్క కరివేపాకు తెచ్చిననాడే చెప్పివుండాల్సిందమ్మాఅనేసి ఆ దొంగ పిల్లాడు చక్కా జైలుకు పోతాడు.



ఈ నీతికధ అందరికీ తెలిసిందే. గత కొద్ది రోజులుగా జరుగుతున్న సంఘటనలు, మీడియాలో వస్తున్న కధనాలు గమనిస్తున్నప్పుడు ఈ కధని మరోమారు నెమరు వేసుకోవాల్సిన ఆవశ్యకత వుందనిపిస్తోంది.

వార్తకు, వ్యాఖ్యకు నడుమ వున్న సన్నటి విభజనరేఖను చెరిపేసి, తాము అచ్చేసిందే సరయిన వార్త అంటూ కొన్ని పత్రికలు నిస్సిగ్గుగా సాగిస్తున్న పరోక్ష యుద్ధాలు పతాక స్తాయికి చేరుకుంటున్నప్పుడు


ఇంటి నాలుగ్గోడల నడుమ గుంభనగా వుండాల్సిన భార్యాభర్తల గొడవలు గడప దాటి ఛానళ్ళ రూపంలో ఇంటింటికీ ప్రవేశించి ప్రశాంతతను భగ్నం చేస్తున్నప్పుడు -

ఏడాదిక్రితం దాకా భజన చేసిన నోటితోనే విమర్శల జడివాన కురిపిస్తున్న రాజకీయ చద్మవేష ధారులను చూస్తున్నప్పుడు -

అమ్మను ఒసే’ - నాన్నను ఒరేఅనే దుష్ట సంస్కృతిని పెంచి పోషిస్తూ తెలుగునాట వీరవిహారం చేస్తున్న సినిమాలను విధిలేక భరిస్తున్నప్పుడు

ఇవన్నీ కంటూ, వింటూ

వొళ్ళుమండుతున్నా నిలదీయలేని నిస్సహాయులను గమనిస్తుంటే

నీతికధమనసు మూలల్లో కదలాడుతుంది. కరివేపాకునాడే చెప్పవయితివేమమ్మా!అనే అన్న దొంగ మాటే వినబడుతుంది.

సమాజంలో నేడున్న సమస్త సమస్యలకు, నాయకుల మానసిక వైకల్యాలకు, మీడియా చిత్త చాంచల్యాలకు, ఆదిలోనే కళ్ళెం వేయగలిగిన శక్తివుండీ ఆ పని చేయలేకపోయిన జనాలకు
అదేమిటి అని ప్రశ్నించలేకపోయిన ప్రజలకు

ఇప్పుడు అడిగే హక్కు ఎక్కడిదంటే - చేయగలిగిందేమిటి?
(Courtesy Image Owner)


కధలు రాయడం యెలా?


‘నేను పుట్టడానికి కొన్ని నెలల ముందు నుండే  నన్ను మట్టుబెట్టడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఆ దుర్మార్గానికి  పూనుకుంది కూడా  నా కన్నతల్లే కావడం విధి విచిత్రం’
‘కధలెలా రాయాలి’ అని కొత్త రచయితలకు మార్గ నిర్దేశం చేస్తూ కీర్తిశేషులు ఆరుద్ర రాసిన వ్యాసం ఈ విధంగా మొదలవుతుంది. కధ ఎత్తుగడ ఎలావుండాలి, తొలి వాక్యంతోనే  పాఠకులను యెలా ఆకట్టుకోవాలి అనే అంశానికి ఉదాహరణగా ఆయన ఈ రెండు వాక్యాలను ఉటంకించారు.
పుట్టడానికి ముందే చంపే ప్రయత్నం అంటే ‘అబార్షన్’ అనుకోవాలి. తల్లే దానికి పూనుకున్నదంటే ఆమెకు పెళ్లి కాకుండానే గర్భం వచ్చిందని భావం. ఆ క్రమంలో ప్రాణాలు కోల్పోవాల్సిన పాపే ఈ మాటలు చెబుతోందంటే అబార్షన్ విఫలమయిందని అర్ధం. రెండు చిన్న వాక్యాలలో ఇంత కధను ఇమడ్చగలిగితే ఇక ఆ కధ పట్ల పాఠకుల ఆసక్తి అపరిమితంగా పెరిగిపోయే అవకాశం కూడా  అంతే  వుంటుంది. ఏమంటారు?



ఓటర్ల మేనిఫెస్టో – భండారు శ్రీనివాసరావు



ఎన్నికలకు ముందు ప్రతి రాజకీయ పార్టీ ఒక మేనిఫెస్టో ను విడుదల చేస్తుంది. ప్రజలు తమ పవిత్రమయిన వోటు వేసి తమను మాత్రమే ఎందుకు గెలిపించాలో, తమను గెలిపిస్తే  ఆ పవిత్రమయిన వోటు వేసినందుకు (గెలిస్తేనే సుమా) బదులుగా వోటర్ల రుణం తీర్చుకునేందుకు తమ పార్టీ ఏమేమి చేయబోతున్నదో అనే అనేకానేక  ఉచిత వరాలతో కూడిన ఎన్నో  వివరాలు ఈ మేనిఫెస్టోలో వుంటాయి. దీన్ని తయారు చేయడం కోసం ప్రతి పార్టీ ఎంతో పెద్ద కసరత్తు చేస్తుంది. ఇందునిమిత్తం  పార్టీ ఏర్పాటు చేసిన మేనిఫెస్టో కమిటీ పలు మార్లు సమావేశాలు జరిపి ఎన్నికల ప్రణాళికలో చేర్చాల్సిన అంశాలను గురించి లోతుగా అధ్యయనం చేసి వాటిని సవివరంగా చర్చిస్తుంది. అర చేతిలో వైకుంఠం చూపించే తరహాలో రూపొందించే ఈ మేనిఫెస్టో తయారీకి పెద్ద పెద్ద పార్టీల నుంచి చిన్నా చితకా పార్టీల వరకు ఎంతో శ్రద్ధ తీసుకుంటాయి. ఇక మేనిఫెస్టో విడుదల అనేది మరో పెద్ద తంతు. వోటర్ల మనసులకు గాలం వేసి పట్టే విధంగా ఆ యా పార్టీలకు చెందిన మేధావులు అంతా కలసి మేధో మధనం చేసి అందించిన సలహాలనన్నింటినీ అంతకంటే అందంగా అక్షరాలలోకి మార్చి కూర్చే ఈ మేనిఫెస్టో విడుదలకు మెగా సినిమా రిలీజ్ మాదిరిగా ఎంతో హడావిడి చేస్తారు. దీనికి ప్రచారం కల్పించడానికి పార్టీలు పడే యాతన ఇంతా అంతా కాదు. కాలక్రమేణా ఇది ఎన్నికలకు  ముందు ఓ తప్పనిసరి తతంగంగా  తయారయింది. కాకపొతేఎన్నికల తరువాత మాత్రం  మళ్ళీ దీని ఊసెత్తితే ఒట్టు.


మీరిలా వోటు వేసి గెలించండి. మేమలా చెప్పినవన్నీ చేసి చూపిస్తాంఅనే రాజకీయ పార్టీల మేనిఫెస్టోల మాదిరిగానే, ‘ మీరిలా చేస్తామని మాట ఇవ్వండి. అప్పుడు మా వోటు అచ్చంగా మీకేఅంటూ ఓటర్లే తమ మేనిఫెస్టోలతో ముందుకు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. జయ ప్రకాష్ నారాయణ గారు తమ లోక్ సత్తాను రాజకీయ పార్టీగా రూపు మార్చకుండా వుండి వుంటే బహుశా ఈ ప్రయోగం ఆయనే చేసివుండేవారేమో.  ఇలా ఈ దిశగా సాగిన ఆలోచనలనుంచి పుట్టుకొచ్చినదే ఇదిగో ఈ ఓటర్ల మేనిఫెస్టో’.
      
1.  ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చే ఎలాటి హామీ అయినా సరే, అధికారంలోకి రాగానే తాము దాన్ని యెలా అమలు చేయబోతున్నామో అన్న  విషయాన్ని స్పష్టంగా, ఏవిధమయిన అసంగ్దిగ్ధతలకు తావివ్వకుండా, శష భిషలకు పోకుండా  ఎన్నికల ప్రణాళికలో పేర్కొని తీరాలి. ఆకాశంలో చందమామను తెచ్చి చేతిలో పెడతామంటే సరిపోదు, అది యెలా సాధ్యమో కూడా  వోటర్లకు తెలియచెప్పాలి. యేరు దాటినదాకా పడవ మల్లయ్య, దాటిన  తరువాత బోడి మల్లయ్య సామెత మాదిరిగా కాకుండా గెలిచివచ్చిన తరువాత ఒక నిర్దిష్ట కాలంలో వాగ్దానాలు అమలుచేయలేని పక్షంలో అధికారం నుంచి తక్షణం తప్పుకుంటామని ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేయాలి. అంతేకాదు, ఉచిత వాగ్దానాల అమలుకు అయ్యే మొదటి ఏడాది వ్యయాన్ని తమ పార్టీ నిధులనుంచే ఖర్చు చేయాలి. ప్రభుత్వ సొమ్ముతో ప్రజల వోట్లకు గాలం వేసే ప్రస్తుత విధానాలకు స్వస్తి చెప్పాలి.  (మీడియాకు మనవి: ఉచితానుచితాలు ఎరగకుండా ఆయా రాజకీయ పార్టీలు జనంపై వొదులుతున్న ఉచితహామీలను యెలా అమలు చేస్తారని మీడియా ప్రశ్నించి సమాధానాలు వారి నుంచి రాబట్టి ప్రజలకు తెలియచెప్పాలి.)
2. భారీ ఎత్తున ఎన్నికల ప్రచార సభలను ఏర్పాటు చేసి ప్రజలను తరలించే పాత పద్ధతులకు స్వస్తి చెప్పాలి. సాధారణ జనం ఇబ్బందుల పాలు కాకుండా చిన్న సమావేశాల ద్వారా ఎన్నికల ప్రచారం సాగించాలి.
3. ఊరేగింపులుగా వెళ్లి అభ్యర్ధులు నామినేషన్లు వేయకూడదు. (ఆన్ లైన్ విధానంలో నామినేషన్ల దాఖలుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించాలి.)
4. ఎంతటి హేతుబద్ధమయిన కారణం వున్నా సరే, ఏ  రాజకీయ పార్టీ కూడా ప్రజాస్వామ్య హక్కు పేరుతొ నడిరోడ్లపై  ధర్నాలు, బైఠాయింపులు, రాస్తా  రోఖోలు నిర్వహించరాదు.(అలాగే ప్రజలను ఇబ్బందుల పాలు చేసే ఇలాటి ఆందోళనా కార్యక్రమాలను ఎటువంటి పరిస్తితిలోను ప్రసారం చేయబోమని టీవీ ఛానళ్ళ యాజమాన్యాలు వారికి  స్పష్టం చేయాలి. అంతేకాదు, ఈ రకమయిన ఆందోళనల కారణంగా ఇబ్బందులకు గురయ్యే ప్రజల మనోభావాలను సాధ్యమయినంత ఎక్కువగా ప్రసారం చేయాలి. ఆందోళనకారులను చెదరగొట్టడం, వారిని బలవంతంగా పోలీసు వ్యానుల్లోకి ఎక్కించడం వంటి దృశ్యాలు ప్రస్తుతం  చూపిస్తున్నారు. అలాకాకుండా రాస్తారోఖోల కారణంగా పడరాని పాట్లు పడుతున్న పౌరుల స్పందనలను ప్రత్యక్ష  ప్రసారం చేయాలి)
5. ఎన్నికల క్రతువు ముగిసే వరకు రెచ్చగొట్టే విధంగా వుండే రాజకీయ ప్రకటనలు, అవాకులు చవాకులులతో కూడిన స్క్రోలింగులను మీడియా సంస్తలు నిలిపివేయాలి.
6. త్వంశు౦ఠ   అంటే  త్వంశు౦ఠఅంటూ సాగే రాజకీయ నాయకుల చర్చా గోష్టులను పదే పదే ప్రసారం చేసే టీవీ ఛానళ్ళ నుంచి ఉచిత వినోదపు పన్నురాబట్టాలి.
7. సంకీర్ణాలకు సంబంధించిన ఒప్పందాలన్నీ పోలింగుకు ముందే కుదుర్చుకోవాలి. ఎన్నికలు ముగిసి పార్టీల బలాబలాలు నిర్ధారణ అయిన  తరువాత ప్రభుత్వం ఏర్పాటుకోసం అవకాశవాద కూటముల ఏర్పాటును నిషేధించాలి.

గమనిక: ఇవి కేవలం తొలి ఆలోచనలే. ఎన్నికల ఘడియ దగ్గర పడే  లోగా వీటికి మరింత స్పష్టమయిన పటిష్టమయిన రూపం ఇవ్వడంలో అంతా తలా ఓ చేయి వేయాలని  మనవి.
NOTE: Courtesy Image Owner

4, జనవరి 2014, శనివారం

ఉచితానుచితాలు ఎరుగని ఉచితాలు


రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికల్లో చేసిన వాగ్దానాలను అన్నింటినీ తుచ తప్పకుండా అమలు చేసిన పక్షంలో జనం స్వర్గానికి వెళ్లాలనే కోరికను సైతం  చంపుకుంటారు.’ – విల్ రోగర్స్



సుమతీ శతకాలు, సూక్తి ముక్తావళులూ ఎన్నికల్లో వోట్లు రాల్చవుఇది నేటి రాజకీయులు వొంటికి పట్టించుకున్న నగ్న సత్యం. ఈ విషయంలో ఏ పార్టీకి మినహాయింపులేదు. అందుకే వోటర్లని ప్రలోభపెట్టడానికి వారు తొక్కని అడ్డ దారులు వుండవు. వోటర్లని ఆకర్షించడానికి వేయని పిల్లి మొగ్గలు వుండవు. ఈ విషయంలో వెనుకడుగు వేసే పార్టీ అంటూ కలికానికి కూడా దొరకదు. అందుకే నరం లేని నాలుక, మండు  వేసవిలోనైనా సరే వారి చేత చల్లని హామీల వర్షం కురిపిస్తుంది. కలర్ టీవీలు, లాప్ టాపులు, నెలసరి భత్యాలు, నగదు బదిలీలు, భూసంతర్పణలు, పట్టు చీరెలు, పసుపు కుంకాలు, ఉచిత వైద్యాలు, ఆల్  ఫ్రీ చదువులు, బంగారు తల్లులు, కరెంటు మీది, బిల్లు మాది తరహా హామీలు ఒకటా రెండా సెర్చ్ చేసి రీసెర్చ్ చేసి కనుక్కున్న సంక్షేమ పధకాలతో దట్టించి వోటర్లకు అరచేతిలో స్వర్గం చూపిస్తున్న  మేనిఫెస్టోలకు ఇక కాలం చెల్లిందని అనుకోవాలేమో. ప్రభుత్వ ఖర్చుతో, ప్రజలనుంచి ముక్కు పిండి వసూలు చేసి నింపిన ఖజానా డబ్బులతో ఇలా ఈ చేత్తో ఇచ్చి అలా ఆ చేత్తో వోట్లు రాబట్టి అధికార పీఠం కైవసం చేసుకోవాలని చూసే రాజకీయ పార్టీల క్విడ్ ప్రోఖోఎత్తులకు సుప్రీం కోర్టు నిరుడు జులై లోనే లక్ష్మణ రేఖలు గీసింది.
వాగ్దానకర్ణుల మాదిరిగా ప్రకటిస్తున్న తాయిలాలను ఎలా ఇస్తారన్నదానికి లెక్కలు లేవు. ఎన్నాళ్ళు ఇస్తారన్నదానికి జవాబులు లేవు. ఇందులో ఒకరు తక్కువ తిన్నదీ లేదు, ఎదుటి వాడిని తిననిచ్చిందీ లేదు. ఎన్నికల కోయిల ఇంకా కూయకముందే వివిధ రాజకీయ పార్టీలు చేస్తున్న వాగ్దానాలు, ఇస్తున్న హామీలు చూస్తుంటే అసలు మేనిఫెస్టోలో ఇంకెన్ని ఉంటాయో అన్న భేతాళ ప్రశ్నకు సుప్రీం కోర్టు చెప్పిన సమాధానం అది.
అర్ధం పర్ధం లేకుండా చేసే హామీలు ఇక కుదరవు కాక కుదరవు అని తేల్చి చెప్పింది.


తోక వాక్యం : అయినా రాజకీయ పార్టీలు సుప్రీం నిరుడు తేల్చి చెప్పిన ‘లెక్క’ను లెక్క చేసేది లేదు  అన్న తరహాలోనే ముందుకు సాగుతున్నాయి.
NOTE: Courtesy Cartoonist

వెరీ ఇంపార్టెంట్ స్ట్రీట్ ఇన్ కలకత్తా


(ఈరోజు పత్రికల్లో ఢిల్లీ కొత్త సీఎం వుండబోయే అయిదేసి పడక గదుల రెండు జంట భవనాల ఫోటోలు చూసిన తరువాత  2012 మార్చి నెలలో రాసిన ఈ వ్యాసం గుర్తుకు వచ్చింది. ఇప్పటికీ కోల్ కతా 'దీదీ' నేను చూసిన ఇంట్లోనే వుంటున్నారో లేదో తెలవదు) 

కోల్ కటా అని ఇప్పుడు పేరు మార్చుకున్న కలకత్తా నగరంలో వున్న అనేక వేల వీధుల్లో ఇది ఒకటి. దాని పేరు హరీష్ చంద్ర స్ట్రీట్.
గత వారం కాశీ యాత్రకు వెడుతూ మార్గ మధ్యంలో కలకత్తాలో ఆగినప్పుడు పనికట్టుకుని చూసివచ్చిన వీధి ఇదొక్కటే.













ఓపెన్ డ్రైనేజీ. మురుగుకాలువ. వీధిలోనే స్నానాలు.  ఇంటి ఆకారం కూడా లేని టార్పాలిన్ తడికెల నడుమ కాపురాలు. వీధి కుక్కల స్వైర విహారాలు. చూడగానే వికారం కలిగించే చిరుతిళ్ళ అంగళ్ళు.

కలకత్తాలోనే కాదు దేశంలో ఏ బస్తీలో చూసినా ఇలాటి వీధులు అనేకానేకం కానవస్తాయి. అటువంటప్పుడు వెరీ ఇంపార్టెంట్ స్ట్రీట్ అని సన్నాయి నొక్కులెందుకు అనే ప్రశ్న సహజంగానే ఉద్భవిస్తుంది.
అదే. అది చెప్పడానికే ఈ ఉపోద్ఘాతం.

పై ఫోటోలను కొంత క్షుణ్ణంగా పరిశీలిస్తే అందులో ఒకదానిలో బెంగుళూరు పెంకులు  కప్పిన ఒక సాదా సీదా ఇల్లు కనిపిస్తుంది.

ఆ ఇంట్లో వుండే వ్యక్తి మాత్రం అంత సాదా సీదా సాధారణ మనిషి కాదు. కొన్ని దశాబ్దాలపాటు అవిచ్చిన్నంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని పాలించిన మార్క్సిష్టులకు, లెఫ్ట్ పార్టీలకు అధికార పీఠాన్ని  దూరం చేసిన అత్యంత సాదా సీదా రాజకీయ నాయకురాలు, తృణమూల్ అధినేత్రి  ‘దీదీ’ – మమతా బెనర్జీ - ముఖ్యమంత్రి హోదాలో నివసిస్తున్నది ఆ ఇంట్లోనే అంటే ఓ పట్టాన నమ్మడం కష్టం. కానీ కళ్ళతో చూసిన దాన్ని నమ్మక తప్పదు కదా.
సాధారణంగా ఎవరయినా రాజకీయ నాయకులు నివాసం వుండే ప్రాంతాల్లో పౌర సౌకర్యాలు బాగా వుంటాయనీ, మామూలు పౌరులను వేధించే నీటి కొరత, కరెంటు కోతలు వుండవనీ, వీధులు పరిశుభ్రంగా వుంటాయనీ జనంలో ఓ నమ్మకం. నమ్మకమే కాదు మనవైపు చోటా మోటా రాజకీయ నాయకులు, అధికారులు నివసించే ప్రాంతాల్లో ఇలాటి ఇబ్బందులు లేకపోవడం నిజం కూడా.

ఈ నేపధ్యంలో మమతా దీదీ నివసిస్తున్న ఇల్లూ, ఆ ఇల్లు వున్న వీధినీ చూస్తుంటే ఇలాటి రాజకీయ నాయకులు కూడా వుంటారా అనిపించడం అంతే సహజం.  కానీ ఒక ముఖ్యమంత్రి వుండే వీధే అలా వుంటే ఇక మిగిలిన వాటి సంగతేమిటి? దీనికి జవాబు కూడా అంతగా  అర్ధం కాని ‘హింగ్లీ’  (హిందీ-బెంగాలీ) భాషలో ఆ వీధిలో వుండే వ్యక్తి నుంచే లభించింది. కోల్ కటా లోని అన్ని వీధులు బాగుపడ్డ తరువాతే తన వీధిని బాగు చేసే పనికి పూనుకోవాలని దీదీ హుకుం జారీ చేసారట. ఇందులోని నిజానిజాలు ఆ వీధికి ఎదురుగా వుండే మరో వీధిలో కొలువున్న మరో ‘దేవత’ కలకత్తా కాళీనే చెప్పాలి. 

దీదీ సాదా సీదా వ్యవహార శైలి తెలిసిన వాళ్లకు ఆ వీధి వ్యవహారం  అంత ఆశ్చర్యం కలిగించకపోవచ్చు. కాకపొతే,
పోలీసు పటాలాలు, స్టెన్ గన్లు ధరించి పహరా కాసే  అంగరక్షకులు, అడుగడుగు బారికేడ్లు ఇవన్నీ ఏమీ లేకుండా ఒక ముఖ్యమంత్రి అంత సాధారణ జీవితం గడుపుతున్న తీరుతెన్నులు గమనిస్తే రాజకీయ ప్రముఖుల ‘రక్షణ’ కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించడం అంత అవసరమా అన్న సందేహం తలెత్తక మానదు. (19-03-2012) 
(Revised on 04-01-2014)
Photos taken by me.               

1, జనవరి 2014, బుధవారం

HAPPY NEW YEAR - 2014

వొత్తిలా వెలగండి - కత్తిలా మెరవండి - కొత్త ఏడాదిలో ఎత్తుగా ఎదగండి 


(నిర్మలాదేవి - భండారు శ్రీనివాసరావు)