26, అక్టోబర్ 2013, శనివారం

అంజయ్యగారితో నా అనుభవాలు - 2



ఎనభయ్యవ దశకంలో కౌలాలంపూర్ లో ప్రపంచ తెలుగు  మహాసభలు జరిగాయి. ముఖ్యమంత్రిని ఆ సభల ప్రారంభోత్సవానికి నిర్వాహకులు ఆహ్వానించారు. కారణాలు ఏమైతేనేం కాంగ్రెస్ అధిస్థానం అంజయ్య గారిపై కినుకతో వున్నరోజులు.  ఆయన్ని ఆ సభల ప్రారంభోత్సవానికి నిర్వాహకులు ఆహ్వానించారు.  ప్రారంభోత్సవ కార్యక్రమం ముగిసిన తరవాత అంజయ్య గారు హోటల్ రూముకి తిరిగొచ్చేసారు. వెంట షరా మామూలుగా నేను. కాస్త నలతగా కనిపించారు. అంత పెద్ద గదిలో ఆయనా నేను ఇద్దరమే. సాయంత్రం అవుతోంది. ఆయన దీర్ఘంగా ఆలోచిస్తూ కిటికీలోనుంచి బయటకు చూస్తున్నారు. విశాలమయిన రోడ్డు. వచ్చే కార్లు. పోయే కార్లు. పక్కనే ఏదో ఫ్యాక్టరీ లాగావుంది.

ఆయన వున్నట్టుండి చూసావా!అన్నారు. నాకేమీ అర్ధం కాలేదు.

పొద్దున్న బయలుదేరేటప్పుడు చూసాను. అందులో (ఆ ఫ్యాక్టరీ లో) పనిచేసేవాళ్లందరూ గంట కొట్టినట్టు టైము తప్పకుండా వచ్చారు. అయిదు నిమిషాల్లో లోపలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్లీ అంతే. షిఫ్ట్ పూర్తికాగానే ఠంచనుగా ఇళ్లకు పోతున్నారు. పనిచేసేవాళ్లకు వాళ్లకు కావాల్సింది ఇవ్వాలి. కావాల్సిన విధంగా పని చేయించుకోవాలి. ఇలా మన దగ్గర కూడా చేస్తే కావాల్సింది ఏముంటుంది!అన్నారాయన యధాలాపంగా.

అంటే ఇప్పటిదాకా ఆయన ఆలోచిస్తోంది ఇదన్నమాట.


(అంజయ్యగారు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న దృశ్యం. ఆయన వెనుక గడ్డం మీద చేయి ఆనించుకుని నేను) 



కౌలాలంపూర్ తెలుగు మహాసభల ఏర్పాట్లలో రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించలేదనీ, ఇందిరాగాంధీ ఈ విషయంలో ముఖ్యమంత్రి పట్ల చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారనీ’ – హైదరాబాదులో ఒక పత్రిక రాసిన విషయం ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా తెలుసుకున్న అంజయ్య గారికి రాజకీయ జ్వరంపట్టుకున్నట్టు అప్పటికే గుసగుసలు మొదలయ్యాయి. అందుకే ఆయన సభా ప్రాంగణంలోనే వుండిపోకుండా వొంట్లో బాగోలేదనే నెపంతో హోటల్ రూముకి తిరిగొచ్చేసారని వదంతులు హైదరాబాదు దాకా పాకాయి. ఈయనగారేమో ఇక్కడ తాపీగా కూర్చుని కార్మికులు గురించి ఆలోచిస్తున్నారు. అలావుండేది అంజయ్య గారి వ్యవహారం. (13-09-2010)

25, అక్టోబర్ 2013, శుక్రవారం

అంజయ్య గారితో నా అనుభవాలు

రాజీవ్ గాంధీ - అంజయ్య గురించి రాసిన తరువాత అనేకమంది అంజయ్య గారి గురించి రాయమని కోరారు. లోగడ రేడియో అనుభవాల్లో అనేక సందర్భాల్లో అంజయ్య గారి గురించి ప్రస్తావన వుంది. వాటిని కాస్త కుదించి, అంజయ్య గారికి మాత్రమే పరిమితం చేసి మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను. పునరుక్తి దోషం అని ఎవరికయినా అనిపిస్తే మన్నించండి. 


(ఏదో సినిమాలో రాళ్ళపల్లి చెప్పినట్టు టేప్ రికార్డర్ పట్టుకుని ఈ పక్కన నేను, ఆ పక్కన అంజయ్య గారు. మా మధ్యలో నాగార్జున గ్రామీణ బ్యాంక్ చైర్మన్  శ్రీ వై.వి.ఎస్. మూర్తి)

ఎనభయ్యవ దశకం మొదట్లో ముఖ్యమంత్రి అయిన శ్రీ టంగుటూరి అంజయ్య అధికారిక వాహనం అయిన అంబాసిడర్ కార్లో డ్రైవర్ పక్కన ముందు సీట్లో ఆసీనులయ్యేవారు.  అమ్మ   (శ్రీమతి ఇందిరాగాంధి)  కూడా ఫ్రంటు సీటే సుమా!’ అని అమాయకంగా అనేవారు.  ఆవిడ కూడా ప్రధాని హోదాలో అంబాసిడర్ కార్లో ముందు సీట్లోనే కూర్చునేది. అంజయ్య గారు  ముందు సీటు ఎంపిక చేసుకోవడానికి నాకు మరో కోణం కనిపించేది.  ప్రజల మనిషి అయిన అంజయ్య గారికి జనం తాకిడి ఎక్కువ.  లైఫ్ బాయ్ ఎక్కడవుంటే  ఆరోగ్యం అక్కడ వుంటుంది’  అనే వాణిజ్య ప్రకటన తరహాలో అంజయ్య గారు ఎక్కడ వుంటే అక్కడ జనమే జనం.  బాత్రూంబెడ్ రూముల్లో  కూడా ఆయనకు ఈ తాకిడి తప్పేది కాదని చెప్పుకునేవారు. సెక్యూరిటీని కూడా తోసుకువచ్చి కారెక్కాలని చూసే అనుయాయుల వల్ల కలిగే తొడతొక్కిడిని తప్పించుకోవడానికి ఆయన హాయిగా ముందు సీటుకు మారిపోయారని అప్పట్లో ముఖ్యమంత్రికి భద్రతాధికారిగా పనిచేసిన బాలాజీ చెబుతుండేవారు.

ఒకప్పుడు కారులో వెనుక సీటులో కూర్చునేవారే ఆ  కారుకు  యజమాని అని జనం భావించేవారు. ఇప్పుడా అభిప్రాయం  పూర్తిగా మారిపోయింది. మంత్రులుముఖ్యమంత్రులు, శాసన సభ్యులు ఒకరేమిటి అంతా ఫ్రంటు సీటుకు అతుక్కుపోతున్నారు. టీవీ కెమెరా  యాంగిళ్లకి కూడా ఈ సీటే అనువుగా వుండడం ఒక కారణం అయితే దారివెంట ప్రజలకు అభివాదం చెయ్యడానికీరెండు వేళ్ళు విజయసూచిక మాదిరిగా ప్రదర్శించడానికీ ఫ్రంటు సీటే బెటరన్న నమ్మకం కుదరడం  మరో కారణం.

రాజీవ్ గాంధీ – రాహుల్ గాంధీ – కొన్ని దోమలు


మధ్య ప్రదేశ్ లో ఓ ఎన్నికల సభలో మాట్లాడుతూ రాహుల్ గాంధీ ‘తనని పాతికవేల దోమలు కుట్టాయని చెప్పినట్టు పత్రికల్లో వచ్చింది. ఇది చదివినప్పుడు హైదరాబాదులో ఆయన తండ్రి రాజీవ్ గాంధీ దోమలతో తిప్పలు పడ్డ సందర్భం జ్ఞాపకం వచ్చింది.
ఆంధ్ర ప్రదేశ్ కు అంజయ్య గారు ముఖ్యమంత్రిగా వున్న రోజుల్లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధి తనయుడు పైలట్ గా పనిచేస్తున్నారు. ఓ రోజు ముఖ్యమంత్రిగారు సచివాలయంలో నలుగురితో మాటా మంతీ సాగిస్తున్న సమయంలో ఆయనకు ఓ ఫోన్ వచ్చింది. ఆయన తత్తరపడుతూ లేచి వున్నపాటున బరకత్ పురాలో వున్న తన ఇంటికి బయలుదేరారు. అప్పటికి అంజయ్య గారు అధికార నివాసం గ్రీన్ లాండ్స్ (ముద్దుగా ఆయన పెట్టుకున్న పేరు ‘జయ ప్రజా భవన్) కి మకాం మార్చలేదు. బరకత్ పురాలో హౌసింగ్ బోర్డ్ వారి టూ ఆర్ టీ ఇంట్లోనే వుంటున్నారు. ఇప్పటి రోజులతో పోలిస్తే అది ఒక విడ్డూరమే. ఆ చిన్న ఇంటిపైనే గది మీద గది నిర్మించుకుంటూ వెళ్లడం వల్ల చాలా ఇరుకుగా వుంటుంది. మెట్లు కూడా సౌకర్యంగా వుండవు.
సరే! అంజయ్య గారు హడావిడి పడుతూ ఇంటికి వెళ్ళి ఆయాసపడుతూ మెట్లెక్కినప్పుడు కనబడ్డ దృశ్యం ఈనాటి ఛానళ్ళకు దొరికివుంటే పండగే పండగ. రాజీవ్ గాంధీ అక్కడి చిన్న గదిలో అంతకంటే చిన్న కుర్చీలో కూర్చుని తనను పీక్కుతింటున్న దోమల్ని తోలుకునే పనిలో నిండా మునిగి తేలుతున్నాడు. అసలే పండంటి మనిషి. లేత శరీరం. ఆయన మొహం మీద దోమ కాట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అసలు జరిగిన విషయం ఏమిటంటే – రాజీవ్ గాంధీ పైలట్ గా హైదరాబాదు వచ్చిన విమానం, తిరిగి వెళ్ళడానికి బాగా వ్యవధానం వున్నట్టుంది. యెందుకు అనిపించిందో తెలియదు కాని, ఆయన బేగం పేట ఎయిర్ పోర్ట్ లో ఎవర్నో అడిగి ఓ కారు తీసుకుని నేరుగా బరకత్ పురాలోని అంజయ్య గారి నివాసానికి వెళ్ళిపోయారు. ఈ కబురు అంది, ముఖ్యమంత్రిగారు ఆఘమేఘాలమీద ఇంటికి వచ్చేసరికి ఇదీ సీను.
'అమ్మ ఇచ్చిన ఉద్యోగం' ఇది అని చెప్పుకోవడానికి ముఖ్యమంత్రిగా  అంజయ్య గారు ఏనాడు నామోషీ పడలేదు. పైగా కూసింత గర్వంగా చెప్పుకునేవారు. రాజీవ్ గాంధీ ఆయన ఇంటిని చూసి వాళ్ల అమ్మ సెలెక్షన్ మంచిదే అనుకుని కూడా వుంటారు. కాకపొతే పేరడీ ఏమిటంటే అంజయ్య గారి ముఖ్యమంత్రి పదవి వూడడానికి కూడా తదనంతర కాలంలో రాజీవ్ గాంధీయే కారణం అయ్యారు.
పోతే! పైకి చెప్పకపోయినా ఇది చదివే వారికి ఓ  సందేహం తొలుస్తుండవచ్చు. ఇదంతా మీకెలా తెలుసనీ. మీలో కొందరికి తెలియని విషయం ఏమిటంటే, ఆ రోజుల్లో నేను  రేడియో రిపోర్టర్ గా వుండేవాడిని. కారణం చెప్పలేను కాని ఆయనకు నేనంటే అవ్యాజానురాగం. నేను కాసేపు దగ్గర్లో కనబడకపోతే చాలు  అంజయ్య గారికి క్షణం తోచేది కాదు. ‘శ్రీనివాస్ ఏడీ’ అని సొంత సిబ్బందిని ఆరా తీయడం ఆయనకు అలవాటు. అంచేత ఆరోజు నేను కూడా అంజయ్య గారి వెంటే వున్నాను. అదన్న మాట. (25-10-2013)
 

22, అక్టోబర్ 2013, మంగళవారం

రెండే రెండు ప్రశ్నలు. కానీ జవాబు చెప్పేముందు రెండు నిమిషాలు ఆలోచించండి


మొదటి ప్రశ్న :
ఆవిడ కడుపుతోవుంది. అప్పటికే ఆమెకు ఎనిమిదిమంది సంతానం. వారిలో ఇద్దరు చెవిటి పిల్లలు. ఇద్దరు పుట్టు గుడ్డివారు. ఒక పిల్లవాడికి మానసికంగా ఎదుగుగుదల లేదు. మొగుడివల్ల అధిక సంతానం ఒక్కటే కాదు దిక్కుమాలిన లైంగిక వ్యాధులు కూడా సంక్రమించాయి. ఈ పరిస్థితుల్లో ఆవిడకు మీరు యేమని సలహా ఇస్తారు? ఇక కన్నది చాలు, గర్భస్రావం చేయించుకోమని చెబుతారా?
ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఒక్కసారి రెండో ప్రశ్న కూడా ఏమిటో కూడా గమనించండి.
అదే ఇది :
ఒక ప్రపంచ స్తాయి నాయకుడిని ఎన్నిక చేసుకోవాల్సిన సందర్భం వచ్చింది. ముగ్గురు అభ్యర్ధులు పోటీలో వున్నారు. మీ ఒక్క వోటుతోనే వారి భవితవ్యం తేలుతుంది. అంటే మీ వోటే నిర్ణయాత్మకం అన్నమాట.
ఆ ముగ్గురి గుణగణాలు ఇలా వున్నాయి.
మొదటివాడు పక్కా  తాగుబోతు. రోజుకు కనీసం పది పెగ్గులు పట్టించనిదే నిద్రపోడు. పైగా తిరుగుబోతు కూడా. ఇవి చాలవన్నట్టు  ఇద్దరు ఉంపుడుగత్తెలు. ఒకదానివెంట మరో చుట్ట  వెలిగించడమే కాని ఆర్పడం తెలియదు.
ఇక రెండో అభ్యర్ధి సంగతి ఇంకా ఘోరం. అప్పటికే రెండు సార్లు ఉద్యోగం నుంచి ఉద్వాసన చెప్పారు. అర్ధరాత్రిదాకా మేలుకుంటాడు. మధ్యాహ్నం బారెడు పొద్దెక్కిన దాకా మంచం దిగే అలవాటు లేదు. కాలేజీ రోజుల్లోనే నల్లమందుకు బానిస. ఇక సాయంత్రం  అయ్యిందంటే చాలు దేవదాసు అవతారం ఎత్తినట్టే లెక్క.
పోతే మూడో అభ్యర్ధి వున్నాడే బహు బుద్దిమంతుడు.
వీర సైనికుడు. అనేక యుద్ధాల్లో పాల్గొని అనేకానేక పతకాలు సంపాదించుకున్నాడు. పచ్చి శాకాహారి. మాంసం ముట్టడు. పొగ తాగడు. కాకపొతే మద్యం అప్పుడప్పుడు  పుచ్చుకుంటాడు. కానీ చాలా  మితంగా.  అదీ  తక్కువ మైకం కలిగించే బీరు వంటి  వాటినే. కట్టుకున్న భార్యను మోసం చేయాలని కలలో కూడా అనుకోని అపర శ్రీరామచంద్రుడు. పరస్త్రీలను పొరబాటున కూడా కన్నెత్తి చూడడు.
ఇదీ ఈ ముగ్గురి సంక్షిప్త జీవిత చరిత్ర.
ఇప్పుడు వాళ్ళలో ఒక్కడ్ని ప్రపంచ స్తాయి నాయకుడిగా ఎన్నుకోవాల్సిన  చారిత్రాత్మక బాధ్యత మీ భుజస్కంధాలపై పడింది. ముందే చెప్పినట్టు మీ ఒక్క వోటే కీలకం. మీరు వోటు వేసినవాడే ఎన్నికవుతాడు. ఈ విషయం గమనంలో పెట్టుకుని రెండో ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఈ ముగ్గురిలో ఎవరిని ఎంపిక చేసుకుంటారు.
జవాబు దొరికితే మంచిదే. లేకపోతే కింద చూడండి.
మొదటి ప్రశ్నకు మీ జవాబు ‘అవును’ అయితే, అంటే ఆ గర్భవతికి గర్భస్రావం చేయించడం మంచిదని మీరు అనుకుని వుంటే –
అలాటి నిర్ణయం వల్ల ఒక మంచి సంగీతకారుడు ఈ ప్రపంచానికి  దక్కకుండా పోయేవాడు. బీతోవెన్ అనే ప్రపంచ ప్రసిద్ది చెందిన సంగీతకారుడు అప్పుడు ఆమెకు తొమ్మిదో సంతానంగా  జన్మించాడు.
అలాగే రెండో ప్రశ్నకు జవాబు చెబుతూ తాగుబోతు, తిరుగుబోతు అని మొదటి ఇద్దర్నీ మీరు తిరస్కరించివుంటే ఫ్రాంక్లిన్ డి రూజ్ వెల్ట్, విన్ స్టన్ చర్చిల్ వంటి రాజకీయ దురంధరులను మీరు పక్కనబెట్టినట్టు అయ్యేది. ఇక రాముడు మంచి బాలుడు వంటి లక్షణాలు కలిగిన మూడో అభ్యర్ధి అందరికీ తెలిసినవాడే. ఆడాల్ఫ్ హిట్లర్
కాబట్టి నీతి ఏమిటంటే పైకి కనబడే లక్షణాలు చూసి మనుషుల మంచి చెడ్డలు గురించి వెంటనే ఒక నిర్ణయానికి రాకూడదు అని.

(ఒక ఇంగ్లీష్ గల్పిక ఆధారంగా)

21, అక్టోబర్ 2013, సోమవారం

జస్ట్ ఫర్ ఫన్


(నెట్లో ఇంగ్లీషులో చదివిన జోకు)
ఈమధ్య ఓ సర్వేలో మూడు ప్రశ్నలు అడిగితే ఒకతను రాసిన సమాధానాలు గమ్మత్తుగా అనిపించాయి.
మొదటి ప్రశ్న : వచ్చే ఎన్నికల తరువాత ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని భావిస్తున్నారు?
జవాబు : చంద్రబాబు నాయుడు
రెండో ప్రశ్న: 2014 ఎన్నికల్లో మన రాష్ట్రంలో ఏపార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు?
జవాబు : లోక్ సత్తా పార్టీ
మూడో ప్రశ్న: మన రాష్ట్రం పరిస్తితి ఇంత దారుణంగా తయారు కావడానికి కారణం ఏవనుకుంటున్నారు?
జవాబు: పై విధంగా జనాలు ఆలోచిస్తూవుండడం వల్ల.

        

స్పోర్టివ్ గా తీసుకుందాం


విజయాన్ని అస్వాదించినట్టుగా వోటమిని జీర్ణించుకోలేం.  పైకి  వొప్పుకున్నా వొప్పుకోలేకపోయినా ఇది  మనుషుల్లోని బలహీనత.
మొన్నో క్రికెట్ మ్యాచ్ లో మన ఆటగాడు ఒకడు ఒక్క వోవర్లో ముప్పయి పరుగులు ఇస్తే అతడిని దుమ్మెత్తి పోశారు. ఆట కీలకదశలో వున్నప్పుడు, పైగా విజయం అతి చేరువలో వున్నప్పుడు ఆ సంతోషాన్ని దూరం చేసిన ఈరకం బాధ్యతారాహిత్యాన్ని ఎవ్వరు సమర్ధించరు. కానీ అదే పాత్రలు తారుమారై మన బ్యాట్స్ మన్ కు ప్రత్యర్ధి బౌలర్ ఇలానే పరుగుల దక్షిణ సమర్పించుకుంటే ఆ ఆటను మనం యెలా ఎంజాయ్ చేసివుండేవాళ్ళమో ఒక్కసారి వూహించుకుంటే మన ఆలోచనల్లో, అంచనాల్లో వున్న లొసుగు అర్ధం అవుతుంది.
నిజానికి నాకు క్రికెట్ గురించి తెలిసింది తక్కువ. ఇక ఆటగాళ్లను గురించి వ్యాఖ్యానించే అర్హత నాకుందని అనుకోను. టీవీల్లో క్రికెట్ వస్తున్నప్పుడు ఆ ఆటను చూసి ఆనందించడం ఒక్కటే తెలుసు. అదొక ఆటనీ, ఎవరు యెంత బాగా ఆడినా ఒక్క జట్టే గెలుస్తుందనీ, మొన్న ఆడిన ఆటే ఫైనల్ కాదనీ, ఇంకా తుది గెలుపుకు అవకాశాలు మిగిలేవున్నాయనీ తెలుసు. ఒక్క రోజు ఆట తీరును బట్టి ఆ ఆటగాడి ప్రతిభను అంచనా వేయడం తగదన్నది నా అభిప్రాయం. కాకపోతే ‘మ్యాచ్ ఫిక్సింగులు’ ‘డబ్బు ప్రభావాలు’ వంటి మాటలు వినబడుతున్న నేపధ్యంలో ఎవరయినా ఆటగాడు ఇటువంటి పొరబాట్లు అనాలోచితంగా చేసినా అనుమానించే పరిస్తితుల మధ్య జీవిస్తున్నాం కాబట్టి ఆటగాళ్ళు ఇలాటి విషయాల్లో మరింత జాగ్రత్తగా మసలుకోవాల్సిన అవసరం వుందని కూడా వొప్పుకుంటునాను.
‘క్రీడాస్పూర్తి’ అనే మాటను అందరం తరచూ వాడుతుంటాం. దాన్ని ఆచరణలో కూడా చూపించినప్పుడే ఆమాటకు అర్ధం వుంటుంది.

జస్ట్ టేకిట్ స్పోర్టివ్ ప్లీజ్.              

18, అక్టోబర్ 2013, శుక్రవారం

రావూరి భరద్వాజ గారు ఇక లేరు



జ్ఞానపీఠం అవార్డ్ గ్రహీత రావూరి భరద్వాజ గారు హైదరాబాదులో స్వల్ప అస్వస్థత అనంతరం కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు.  సమయాభావంవల్ల  - ఆయనకు జ్ఞానపీఠం  అవార్డ్ వచ్చిన సందర్భంలో రాసిన ఈ చిన్ని రచనను ఆయనకు నివాళిగా అర్పిస్తున్నాను     

రావూరి భరద్వాజ గారు  ఇంత పొడవు గడ్డం  పెంచనప్పుడే కాదు అసలు గడ్డం ఏదీ లేనప్పుడు కూడా నాకు తెలుసు. రేడియోలో పనిచేస్తున్నప్పుడు విలక్షణ వ్యక్తిత్వం కలిగిన ఈ మహా రచయితతో సన్నిహిత పరిచయం వుండేది. నా చిన్నతనంలోనే ఆయన రాసిన 'పాకుడురాళ్ళు' నవల సీరియల్ గా వస్తున్న రోజుల్లోనే నన్నెంతో ఆకర్షించింది. తరువాతి కాలంలో భరద్వాజ గారితో ఆకాశవాణిలో కలసిపనిచేసే మరో అదృష్టం లభించింది. జ్ఞానపీఠం అవార్డ్ ఆయన స్థాయికి చిన్నదని చెప్పను కాని ఆలస్యంగా వచ్చిందని మాత్రం చెప్పగలను. మా గురువుగారికి మనఃపూర్వక అభినందనలు - భండారు శ్రీనివాసరావు  


(కీర్తిశేషులు రావూరి భరద్వాజ)

జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎంపికయిన రావూరు భరద్వాజ (పూర్వాశ్రమంలో రావూరు శరభాచారి) గురించి 
మరో చిన్న జ్ఞాపకం: 
మొగ్గతొడిగిన ఎర్రగులాబి - తెలుగు అనువాదం : రావూరు భరద్వాజ 
జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎంపికయిన రావూరు భరద్వాజ (పూర్వాశ్రమంలో రావూరు శరభాచారి) గురించి 
మరో చిన్న జ్ఞాపకం: 
మొగ్గతొడిగిన ఎర్రగులాబి - తెలుగు అనువాదం : రావూరు భరద్వాజ 

ఈ పుస్తకం వెనుక చిన్న కధ చెప్పుకోవడం నాకు తెలుసు. రాజకీయ నాయకుల్లో నెహ్రూ ఒక్కరినే అమితంగా అభిమానించే సుప్రసిద్ధ జర్నలిస్టు కేయే అబ్బాస్, నెహ్రూ అనంతరం ఆయన బిడ్డ ఇందిర ప్రధాని కాగానే 'Return of the RED ROSE' అనే పేరుతొ ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకాన్ని 'మొగ్గ తొడిగిన ఎర్రగులాబి' పేరుతొ శ్రీ రావూరి భరద్వాజ తెలుగులోకి అనువదించారు. శ్రీమతి గాంధి హైదరాబాదు వచ్చినప్పుడు, అప్పుడు రేడియోలో పనిచేస్తున్న భరద్వాజ గారే స్వయంగా తాను అనువదించిన ఈ పుస్తకాన్ని శ్రీమతి ఇందిరాగాంధీకి బహుకరించారు. ఆవిడ అంతకుముందు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగా వున్నప్పుడు రేడియోలో (అప్పటికి దూరదర్శన్ లేదు) పనిచేస్తున్న స్టాఫ్ ఆర్టిస్టుల ఉద్యోగాలను ప్రభుత్వ ఉద్యోగాలతో సమానం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రేడియోలో స్టాఫ్ ఆర్టిస్టుగా పనిచేస్తున్న భరద్వాజ గారు ఆమె చేసిన ఈ మేలుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ పుస్తకాన్ని ఆమెకు అందచేసారు.
మొగ్గతొడిగిన ఎర్రగులాబి - కె.ఎ.అబ్బాస్‌
వెల: 100 రూపాయలు
తెలుగు అనువాదం : రావూరి భరద్వాజ
ప్రచురణ: ఎమెస్కో బుక్స్
(
భారతదేశంలోనూ, ప్రపంచంలోనూ క్రమానుగతంగా వచ్చిన విప్లవాత్మకమైన అభివృద్ధి, ఆయా సందర్భాలలో శ్రీమతి ఇందిరాగాంధీని ప్రభావితం చేసిన సంఘటనలు, ఆమెను తీర్చిదిద్ది వ్యక్తిత్వాన్ని రూపొందింపజేసిన సంఘటనలూ తీసుకొని ఆమెను ఇందులో పరిచయం చేయడం జరిగింది- ప్రకాశకులు)