6, డిసెంబర్ 2012, గురువారం

టూ ఎయిట్ ట్వంటీ ఎయిట్


టూ ఎయిట్ ట్వంటీ ఎయిట్  
‘అఖిల పక్షం ఎప్పుడ’ని కేంద్ర హోం మంత్రి షిండేను మీడియావారు అడిగితే ‘టూ ఎయిట్’ అని క్లుప్తంగా చెప్పి కారులో వెళ్ళిపోయినట్టు ఈ రోజు (డిసెంబరు ఆరు) పత్రికల్లో వచ్చింది. ఆయనంత నాన్ సీరియస్ గా చెప్పేసి వెళ్ళిపోతే తెలంగాణా కాంగ్రెస్ ఎంపీలు మాత్రం సీరియస్ గా మీడియా ముందుకు వచ్చి  రాష్ట్ర విభజనకు సోనియా పచ్చ జెండా వూపిందన్నట్టుగా  సంతోషపడుతున్నారు. పైగా మేడం ను కలిసి పనిలోపనిగా కృతజ్ఞతలు కూడా తెలియచేసుకున్నారు.
నిజానికి తెలంగాణా విషయంలో తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి వారు చేయని ప్రయత్నం లేదు. పార్ల మెంటు లోపలా బయటా కూడా వారు తమ వాణి,బాణీ వినిపించడానికి విశ్వప్రయత్నం చేశారు. ఆఖరికి హైదరాబాదు నడిబొడ్డున సీ ఎం క్యాంపు ఆఫీసు ముందు అరెస్టు అయ్యారు కూడా. తెలంగాణా ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలకు రాష్ట్ర స్థాయిలో లభిస్తున్న గౌరవం కూడా   తమకు అక్కడా ఇక్కడా ఎక్కడా  దక్కడం లేదన్న ఆక్రోశాన్నివెళ్ళగక్కారు. తెలంగాణా కోసం ఫ్రంటు పెడతామని, అవసరమయితే పార్టీని వొదిలిపెట్టి వెళ్ళడానికి కూడా సిద్ధమేనన్న  వారి ధిక్కార స్వరాలను సయితం పార్టీ అధిష్టానం పట్టించుకున్న దాఖలాలు లేవు. చివరాఖరుకి ఎఫ్.డీ.ఐ. వ్యవహారం వారికి అందివచ్చింది. ఈ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఢిల్లీ పెద్దలు  ఒక మెట్టు దిగివచ్చి అఖిలపక్షం భేటీకి అంగీకరించడంతో తెలంగాణా కాంగ్రెస్ ఎంపీలకు వూరట దొరికినట్టయింది.
సరే, షిండే గారు కూడా వెంటనే కాకపోయినా, మరునాడు మీడియా ఎదుటకు వచ్చి  అఖిలపక్షం ఏర్పాటు చేస్తున్నట్టు ధ్రువీకరించారు. ఈ నెల ఇరవయ్యెనిమిదవ తేదీన ఢిల్లీ లోని కేంద్ర హోం మంత్రిత్వశాఖ కార్యాలయంలో ఉదయం పది గంటలకు సమావేశం జరుగుతుందని ప్రకటించారు. ఒక్కొక్క పార్టీనుంచి ఎంతమందిని పిలిచేది ఇంకా నిర్ణయించలేదని కూడా చెప్పారు. అర్ధవంతమయిన చర్చ జరిగి నిర్దారణతో కూడిన  ఫలితం ఆశించడానికి వీలు కల్పించే ఇలాటి కీలక అంశంపై నిర్ణయం తీసుకుంటే తప్ప  అఖిలపక్షం ఏర్పాటు నిరర్ధకమే అవుతుంది. గతంలో జరిగిన అఖిలపక్ష సమావేశాల్లో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే.     
కాపురం చేసే కళ కాలిమెట్టెల్లో తెలుస్తుందన్నట్టు ఇరవయ్యెనిమిదిన ఏం జరగబోతోందన్నది ఆయా పార్టీల నాయకుల నుంచి వెలువడుతున్న  ప్రతిస్పందనలను బట్టే అర్ధం అవుతోంది. అఖిలపక్షం వల్ల తెలంగాణా వస్తుందో రాదో  తెలియదు కాని తెలంగాణా అంశాన్ని  తమ స్వలాభంకోసం వాడుకోవడానికి ఆయా పార్టీలు ఎంతగా వెంపర్లాడుతున్నాయన్నది వారి మాటలను బట్టే తెలుస్తోంది.
సమావేశాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీయే ముందు తెలంగాణా గురించి తన అభిప్రాయం చెప్పాలని, ఆ తరవాతే తమ వొంతని  బీజేపీ నేతలు సన్నాయి నొక్కులు ప్రారంభించారు. అందరి అభిప్రాయాలు విన్న తరువాత   తెలంగాణా విషయంలో ఆయా పార్టీల బండారం బయట పడుతుందని కాంగ్రెస్ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. ఇంతకీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది ఎదుటి పక్షాలను ఇరకాటాన పెట్టడానికా, సమస్యను పరిష్కరించడానికా అన్న విషయంలో వాళ్లు స్పష్టత ఇవ్వడం లేదు. ప్రజాస్వామ్యం పాలు కాస్త ఎక్కువ వున్న పార్టీ కాబట్టి కాంగ్రెస్ కు చెందిన సీమాంధ్ర నాయకులు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రతినిధులను సమావేశానికి ఆహ్వానించాలంటూ తమ  పాత పల్లవినే  కొత్తగా ఎత్తుకున్నారు. తెలంగాణాకు వ్యతిరేకం కాదంటూ ఆ ప్రాంతంలో పాదయాత్రలు చేస్తున్న తెలుగుదేశం, వై ఎస్ ఆర్ సీ పీ నాయకులు ఈ అంశంపై తమ పార్టీలకు స్పష్టమయిన వైఖరి వుందని ఓ పక్క అంటూనే  అఖిలపక్షంలో దాన్ని పునరుద్ఘాటిస్తామని మాట దాటేస్తున్నారు. అఖిలపక్షం ఏర్పాటుచేయాలని తమ నాయకుడు చంద్రబాబు కేంద్ర హోం మంత్రికి ఉత్తరం రాయడం వల్లనే కేంద్రం కదిలి ఈ ప్రతిపాదన చేయాల్సివచ్చిందని టీడీపీ నాయకులంటున్నారు.  ఇక టీ,ఆర్,యస్. నాయకులు సరేసరి. అఖిలపక్షం ఏర్పాటు ఖ్యాతి కాంగ్రెస్ తెలంగాణా ఎంపీల ఖాతాలోకి పోకుండా చూడడానికి ఈ మొత్తం వ్యవహారాన్ని ఒక డ్రామాగా కొట్టిపడేస్తున్నారు. కాకపోతే, ఎవరి రంగులు ఎలాటివో ప్రజలే అర్ధం చేసుకోవడానికి ఈ సమావేశం వీలు కల్పిస్తుందని  వారంటున్నారు.
దీన్నిబట్టి తెలిసేదేమిటంటే ఈ అఖిలపక్షం వల్ల అసలు సమస్య పరిష్కారం అవుతుందన్న ఆశ వీరెవరికీ లేదని. పైగా ఈ సమావేశం జరిగే నాటికి వారం రోజులు ముందే పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసిపోతాయి. అందువల్ల ఇందులో ఏ నిర్ణయం తీసుకున్నా పార్లమెంటులో బిల్లు పెట్టడానికి మళ్ళీ వ్యవధానం పడుతుంది. ఈ లోగా తెలుగుదేశం అధినాయకుడి పాద యాత్ర తెలంగాణా గడ్డ దాటి కోస్తాలో ప్రవేశిస్తుంది. బహుశా, వై.ఎస్.ఆర్.. సీ.పీ. అధినేత సోదరి షర్మిల పాదయాత్ర కూడా తెలంగాణా ప్రాంతంలో అప్పటికి  ఓ కొలిక్కి వస్తుంది. అధిష్టానం సాచివేత ధోరణితో విసిగిపోయి పక్క చూపులు చూస్తున్న తెలంగాణా  కాంగ్రెస్ నాయకులకు మరికొంత వెసులుబాటు లభిస్తుంది.
ఆల్ హ్యాపీస్.
కాని, వూరట, వెసులుబాటు లేనిది ప్రజలకు, మీడియాకే.
మీటింగు జరిగేదాకా మీడియాకు చేతినిండా పని. వారు కొట్టే వూదరతో జనాలకు ఉచిత కాలక్షేపం. (06-12-2012)

3, డిసెంబర్ 2012, సోమవారం

ఈ పాడు ప్రపంచంలో పదిమంది


ఈ పాడు ప్రపంచంలో పదిమంది  


మొదటి వాడు కడు పేదవాడు – పనిచేసి పొట్టపోసుకోవడం తప్ప ఏమీ తెలియనివాడు.
ఇక రెండోవాడున్నాడే ఇంట్లో వొంట్లో బాగా వున్నవాడు. పేదవాడి పొట్టకొట్టి తన పొట్ట నింపు కునేవాడు.
పోతే, మూడోవాడు. పోలీసు. పై ఇద్దర్నీ కాపాడుతున్నట్టు భ్రమ కలిగిస్తూ ఆ క్రమంలో  తనను తాను కాపాడుకునేవాడు.
నాలుగోవాడు పన్నులు కట్టేవాడు.  పై ముగ్గుర్నీ పోషించేందుకు క్రమం తప్పకుండా సుంకాలు చెల్లిస్తూవుంటాడు.
అయిదోవాడు పరమ బద్ధకస్తుడు. ఏమీ చెయ్యడు. తనకోసమే కాదు పక్కవాళ్ల కోసంకూడా. అందుకని వీడి పోషణ భారం మిగతా వాళ్లు చూస్తుంటారు. కాదు, పరాన్నభుక్కు మాదిరిగా ఇతగాడే ఇతరులపై ఆధారపడి జీవిస్తుంటాడు.
ఆరోవాడికి తాగడం తప్ప మరో పనిలేదు. పక్కవాళ్ల కోసం తాగుతున్నానంటాడు. అందులో కొంత నిజం లేక పోలేదు. మద్యం సీసాల పై వసూలుచేసే పన్నుల తోనే ప్రభుత్వాలు సంక్షేమ పధకాలు అమలుచేస్తుంటాయి కదా!
ఇక ఏడోవాడు బ్యాంకరు. అందరికీ  అప్పులు ఇస్తూ,వడ్డీలపై వడ్డీలు వసూలుచేస్తూ చట్టప్రకారం అందర్నీ నిలువు దోపిడీ చేస్తుంటాడు.
ఎనిమిదోవాడు లాయరు. తన వాదనా పటిమతో పై ఏడుగురినీ బోల్తాకొట్టిస్తూ తన పబ్బం గడుపుకుంటూ వుంటాడు.
తొమ్మిదో వాడు డాక్టరు. ఇతడిది త్రిమూర్తులలో  శివుడి పాత్ర. అందర్నీ చంపి తాను బతుకుతుంటాడు.
పోతే ఆఖరువాడు, పదోవాడు ఎవడంటే – ఇంకెవడు? రాజకీయ నాయకుడు.
అందరికన్నా నాలుగాకులు ఎక్కువ చదివినవాడు. పై తొమ్మిదిమందిని  ఏడు నిలువుల లోతున పాతేసి, వారి పేరుతో కలకాలం కాకిలా హాయిగా జీవిస్తుంటాడు.

29, నవంబర్ 2012, గురువారం

రష్యా చూడలేకపోయా!






సిటీబ్యూరో, న్యూస్‌లైన్: ‘అప్పట్లో సోమియట్ రష్యాది ఒక క్రమబద్ధ జీవితమని విన్నా. అదో ఐరన్ కంట్రీ అని తెలుసు. ప్రపంచంలో రష్యా, అమెరికాలు రెండు కూటములని వినేవారం. అలాంటి రష్యాకు ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండగా వెళ్లే అవకాశం వచ్చింది. ఆమె రెండు రోజులు ఆగమనడంతో ఆగిపోయా. రష్యానే చూడలేకపోయా’ అంటూ చెప్పుకొచ్చారు తమిళనాడు గవర్నర్ రోశయ్య. బుధవారం రవీంద్రభారతిలో భండారు శ్రీనివాసరావు రచించిన ‘మార్పు చూసిన కళ్లు’ (అలనాటి మా మాస్కో అనుభవాలు) పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా రోశయ్య మాట్లాడుతూ... ‘అప్పట్లో రష్యాలో ఏం జరిగినా సెన్సార్ అయి తెలిసేవి. అక్కడ చాలా పెద్ద మార్పులే జరిగాయి. అప్పట్లో జర్నలిస్టులు ఎక్కడో ఉండేవారు. వారికి తెలుగు, ఇంగ్లీషులో... జరిగిన విషయాలు రాసుకొని తీసుకెళ్లి ఇచ్చేవారం. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. స్టింగరింగ్ వ్యవస్థ వచ్చిన తర్వాత సందుసందుకు విలేకరులు వచ్చేశారు. వార్తల సేకరణలో పోటీ పెరిగి కొంత సమాచారం వేగంగా ఇచ్చేసి, తిరిగి సవరించుకునే పరిస్థితులున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత వృత్తి రీత్యా అక్కడికి వెళ్లిన శ్రీనివాసరావు గొప్ప దేశంలో చోటు చేసుకున్న మార్పులను గుర్తు చేస్తూ పుస్తకం రాయడం మంచి పణామం’ అన్నారు. ప్రముఖ పాత్రికేయిడు జి.ఎస్.వరదాచారి మాట్లాడుతూ... ‘రష్యాలో చోటు చేసుకున్న మార్పులు వింటూ ఉంటే సమయం తెలియదు. ఇంతకు ముందే శ్రీనివాసరావు పుస్తకం తెచ్చి ఉంటే బాగుండేది’ అన్నారు. 

ప్రసార భారతి మాజీ సీఈఓ కె.ఎస్.శర్మ మాట్లాడుతూ శ్రీనివాసరావు పుస్తకం చదవుతుంటే ఆయన అనుభవాలు అందరికీ అనుభవంలోకి వస్తే ఎంత బాగుండు అని పిస్తుందన్నారు. మహా టీవీ సీఈఓ ఐ.వెంకట్రావు మాట్లాడుతూ... అలనాటి సోవియట్ యూనియన్ అనుభవాలంటే ఇదేదో రాజకీయ సంబంధమైన పుస్తకం అనుకున్నాను అన్నారు. కానీ భండారు శ్రీనివాసరావు వాటి జోలికి పోకుండా ఒక సాధారణ వ్యక్తిగా మహత్తరమైన అక్కడి అనుభవాలను వివరించారన్నారు. ది హిందు హైదరాబాద్ రెసిడెంట్ ఎడిటర్ ఎస్.నగేష్‌కుమార్ మాట్లాడుతూ పుస్తకంలోని ఇంగువ కథ వింటూ ఉంటే నవ్వొస్తుందన్నారు. 

ఐజేయూ ప్రధాన కార్యదర్శి డి.అమర్ మాట్లాడుతూ... ‘శ్రీనివాసరావు స్ఫూర్తితో రోశయ్య ఆర్థిక మంత్రి ఉండగా ఆయన ఆపార రాజకీయ అనుభవాల గురించి పుస్తకం తెస్తే బాగుంటుందనుకొంటున్నా. ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత మీడియాలో సీరియస్‌నెస్ పోయింది. జర్నలిజంలో రాణించాలనుకునే వారికి సీనియర్ జర్నలిస్టుల అనుభవాలు ఎంతో ఉపయోగపడతాయి’ అని చెప్పారు. రచయిత శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘రేడియో మాస్కోలో తెలుగు న్యూస్ రీడర్ ఉద్యోగం కోసం రష్యా వెళ్లే అవకాశం వచ్చింది. అప్పట్లో హైదరాబాద్ నుంచి ర ష్యా వెళ్లిన న్యూస్ రీడర్‌ని నేనొక్కడినే. అమెరికాకు ఎదురొడ్డి నిలిచిన సోవియట్ల శకం -కనురెప్పల కిందే నలిగిపోయింది. రష్యాలో పెద్దపెద్ద మార్పులే జరిగాయి’ అన్నారు. కార్యక్రమంలో వయోధిక పాత్రికేయ సంఘం కార్యదర్శి కె.లక్ష్మణరావు, ఏపీ ప్రెస్ అకాడమీ కార్యదర్శి జి.సన్యాసిరావు, ఆకాశవాణి మాజీ న్యూస్‌రీడర్ డి.వెంకట్రామయ్య పాల్గొన్నారు.

18, నవంబర్ 2012, ఆదివారం

బస్సులో వచ్చిన బంధువులు


బస్సులో వచ్చిన బంధువులు
‘బస్సు వేసుకుని మరీ ఆరోజు మా ఇంటికి భోజనానికి వచ్చిన వారందరూ నిజానికి మా బంధువులు కాదు. కానీ, ఒక్క పూట మా ఇంట్లో గడిపిన ‘పుణ్యానికి’ మాకు ఆత్మబంధువులుగా మారారు.
‘ఇస్కస్ బృందం తరపున మన రాష్ట్రం నుంచి వచ్చిన వారిని అంతకు మునుపే రెండు మూడు సోవియట్ నగరాలు చూపించి మాస్కోలోని ఓ పెద్ద హోటల్ లో బస ఏర్పాటు చేశారు.  బందరుకు చెందిన నరసింహమూర్తిగారనే పెద్దమనిషి ఆ బృందంలో వున్నారు. శాకాహారి అయిన మూర్తి గారు, రష్యాలో తిండీ తిప్పలు గురించి ముందుగానే వాకబు చేసుకుని, నాకు ఓ కార్డు ముక్క రాసి తాను వస్తున్న విషయం ముందుగానే తెలియచేసారు. వారిని కలవడానికి హోటల్ కు వెళ్ళిన నేను, వారితో వున్న రష్యన్ దుబాసీతో సహా  మొత్తం బృందాన్ని వెంటబెట్టుకుని వాళ్ల బస్సులోనే మా ఇంటికి తీసుకువెళ్లాను. బిలబిలమంటూ దిగిన అతిధులను చూసిముందు  మా ఆవిడ బిత్తర పోయినా  వెంటనే తమాయించుకుని అందరికీ వంట ఏర్పాట్లు చేసింది. అంతా పచ్చళ్ళు, కారాలు, సాంబారు, పెరుగుతో భోజనాలు చేసి అన్నదాతా సుఖీభవా! అని ఆశీర్వదించి వెళ్లారు. అలా ఆ రోజు మా ఇంట్లో భోంచేసి వెళ్ళిన వాళ్ళలో చాలామంది ఇన్నేళ్ళ తరువాత ఇప్పటికీ కూడా ప్రతియేటా గ్రీటింగ్ కార్డులు పంపిస్తూనే వున్నారు. వాళ్ల సహృదయతకు ఖరీదు  కట్టే షరాబు యెవ్వడు?’             
ఇలాటి వివరాలు మరిన్ని  తెలుసుకోవాలంటే ‘మార్పుచూసిన కళ్ళు’ పుస్తకం చదవండి. అలనాటి కమ్యూనిస్ట్ రష్యా చరమాంకం విశేషాలను అక్షరబద్ధం చేస్తూ సాగిన రచన. ముద్రణ పూర్తయి విడుదలకు సిద్ధంగా వుంది. ప్రతులకు, వివరాలకు: శ్రీ కె. లక్ష్మణరావు, కార్యదర్శి, వయోధిక పాత్రికేయ సంఘం, హైదరాబాదు. ఫోను: 9394712208, Email: lakshmanarao_konda@yahoo.co.in>,

విడాకులా! వద్దు బాబోయ్!! అనే భర్తలు


విడాకులా! వద్దు  బాబోయ్!! అనే భర్తలు
అక్కడ అన్ని విషయాల్లో పెద్దపీట స్త్రీ బాలవృద్ధులదే!. ఆనాటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఆడవారికి కొన్ని ప్రత్యేక హక్కులు కల్పించింది. చలిదేశం కాబట్టి ప్రతి వారికి చిన్నదో పెద్దదో ఓ గూడు అవసరం. కొంపాగోడూ లేని వాళ్లు మనదగ్గరలాగా ఫుట్ పాతులపైనా, ప్లాటుఫారాలపైనా రోజులు వెళ్ళమార్చడానికి వీలుండదు. ఇళ్ళ కేటాయింపు ఆడవారి పేరుపై చేసే పద్దతి ప్రవేశపెట్టడంతో కాలక్రమేణా  ఇంటి వ్యవహారాల్లో పడతుల పట్టు పెరుగుతూ వచ్చింది. ఆర్ధిక స్వావలంబన స్వేచ్చాజీవితానికి ఆలంబనగా మారింది. నిండా ఇరవై ఏళ్ళు నిండకుండానే మొదటి ముగ్గురు  మొగుళ్లకు విడాకులు ఇచ్చి నాలుగో పెళ్ళికి సిద్ధం కాగల సత్తా రష్యన్ యువతుల సొంతం అయింది. సోవియట్ రష్యాలో ఏటేటా పెరిగిపోతున్న విడాకుల విషయంలో ఓ జోకు ప్రచారంలోకి వచ్చింది. భార్యాభర్తల్లో విడాకులు ఎవరు ఇచ్చినా, ఎముకలు కొరికే ఆ చలిదేశంలో, కొత్త ఇల్లు కేటాయించేవరకు పాత  పెళ్ళాంతోనూ, పాత  పెళ్ళాం కొత్త మొగుడితోను  కలసి పాత పెళ్ళాం పాత ఫ్లాటులో కొన్నాళ్ళపాటు కాలం గడపాల్సిన పరిస్తితి మగవాళ్లది. ఈ దుస్తితి పగవాళ్లకు కూడా రాకూడదని సరదాగా చెప్పుకునేవారు.
‘మాస్కో రేడియోలో నతాషా అనే సహోద్యోగి ఇరవై లోపే ఇద్దరికీ విడాకులు ఇచ్చి మూడో మొగుడితో సంసారం  చేస్తోంది. మా ఆవిడ శిలావిగ్రహం మాస్కో పురవీధుల్లో వేయించాలని సరదాగా అంటుండేది. ఎందుకంటే, పెళ్ళయిన పదహారేళ్ళ తరువాత కూడా ఇంకా అదే మొగుడితో  కాపురం చేస్తున్నందుకట.”  
ఇలాటి  విశేషాలు తెలుసుకోవాలంటే   మార్పుచూసిన కళ్ళుపుస్తకం చదవండి. అలనాటి కమ్యూనిస్ట్ రష్యా చరమాంకం విశేషాలను అక్షరబద్ధం చేస్తూ సాగిన రచన. ముద్రణ పూర్తయి విడుదలకు సిద్ధంగా వుంది. ప్రతులకు, వివరాలకు: శ్రీ కె. లక్ష్మణరావు, కార్యదర్శి, వయోధిక పాత్రికేయ సంఘం, హైదరాబాదు. ఫోను: 9394712208, Email: lakshmanarao_konda@yahoo.co.in>,

17, నవంబర్ 2012, శనివారం

ఎవరీ వడ్డెర చండీదాస్ ?


ఎవరీ వడ్డెర చండీదాస్ ?
మూడున్నర దశాబ్దాల కిందటి ముచ్చట.
శ్రీ పురాణం సుబ్రహ్మణ్యశర్మగారు ఆంధ్ర జ్యోతి వారపత్రిక సంపాదకులుగా వున్నప్పుడు అంతగా పేరు తెలియని రచయిత ఒకరు తన నవలను ప్రచురణార్ధం పంపారు. ఏండ్లూ పూండ్లు గడిచిపోతున్నా ఆ రచన గురించి అతీగతీ తెలియకపోవడంతో ‘తన నవలను తనకు భద్రంగా  వొప్పచెప్పాలనీ, లేనిపక్షంలో న్యాయపరమయిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అతగాడు లీగల్ నోటీసు ఇచ్చాడు. దాంతో పురాణంగారు, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు  సెలవులో వెళ్లడం వల్ల అప్పుడు వారపత్రికలో తాత్కాలికంగా సబ్ ఎడిటర్ గా   పనిచేస్తున్న నేనూ కలసి, అలమరాలన్ని గాలించి, పాతకట్టలన్నీ దులిపి ఎట్టకేలకు ఆ నవలను పట్టుకున్నాము.
ఆ విషయం రచయితకు తెలియచేద్దాం అనుకుంటూనే పురాణం గారు యధాలాపంగా ఆ నవలలోని కొన్ని పేజీలు తిరగేసారు. ఆయన కళ్ళల్లో ఇసుమంత ఆశ్చర్యంతో కూడిన కాంతి కనిపించింది. వెంటనే ఆర్టిస్టుని పిలిపించి అప్పటికప్పుడే ప్రోమో రాయించడం, ఆ నవలను ధారావాహికంగా ప్రచురించేందుకు ముహూర్తం (తేదీ) నిర్ణయించడం, ఆ విషయాన్ని పత్రికాముఖంగా ప్రచురించడం చకచకా జరిగిపోయాయి. దానితో తెలుగు సాహితీ లోకానికి మరో కొత్త రచయిత పరిచయమయ్యాడు. తెలుగు నవలా సాహిత్యాన్ని మరో మలుపు తిప్పిన ఒక గొప్ప రచయిత పాఠకులకు దొరికాడు. ఆయన ఎవ్వరో కాదు, కీర్తిశేషులు వడ్డెర చండీదాస్.(అసలు పేరు చెరుకూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు) ఆ నవల – తెలుగు నవలల్లో ఇప్పటికీ స్వయం జ్వలిత జ్వాలగా భాసిల్లుతున్న  ‘హిమజ్వాల’.        
వెలుగు చూడని ఈ సంగతులు తెలుసుకోవాలంటే -  ‘మార్పుచూసిన కళ్ళు’ పుస్తకం చదవండి. అలనాటి కమ్యూనిస్ట్ రష్యా చరమాంకం విశేషాలను అక్షరబద్ధం చేస్తూ సాగిన రచన. ముద్రణ పూర్తయి విడుదలకు సిద్ధంగా వుంది. ప్రతులకు, వివరాలకు: శ్రీ కె. లక్ష్మణరావు, కార్యదర్శి, వయోధిక పాత్రికేయ సంఘం, హైదరాబాదు. ఫోను: 9394712208, Email: lakshmanarao_konda@yahoo.co.in>,