6, డిసెంబర్ 2012, గురువారం

టూ ఎయిట్ ట్వంటీ ఎయిట్


టూ ఎయిట్ ట్వంటీ ఎయిట్  
‘అఖిల పక్షం ఎప్పుడ’ని కేంద్ర హోం మంత్రి షిండేను మీడియావారు అడిగితే ‘టూ ఎయిట్’ అని క్లుప్తంగా చెప్పి కారులో వెళ్ళిపోయినట్టు ఈ రోజు (డిసెంబరు ఆరు) పత్రికల్లో వచ్చింది. ఆయనంత నాన్ సీరియస్ గా చెప్పేసి వెళ్ళిపోతే తెలంగాణా కాంగ్రెస్ ఎంపీలు మాత్రం సీరియస్ గా మీడియా ముందుకు వచ్చి  రాష్ట్ర విభజనకు సోనియా పచ్చ జెండా వూపిందన్నట్టుగా  సంతోషపడుతున్నారు. పైగా మేడం ను కలిసి పనిలోపనిగా కృతజ్ఞతలు కూడా తెలియచేసుకున్నారు.
నిజానికి తెలంగాణా విషయంలో తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి వారు చేయని ప్రయత్నం లేదు. పార్ల మెంటు లోపలా బయటా కూడా వారు తమ వాణి,బాణీ వినిపించడానికి విశ్వప్రయత్నం చేశారు. ఆఖరికి హైదరాబాదు నడిబొడ్డున సీ ఎం క్యాంపు ఆఫీసు ముందు అరెస్టు అయ్యారు కూడా. తెలంగాణా ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలకు రాష్ట్ర స్థాయిలో లభిస్తున్న గౌరవం కూడా   తమకు అక్కడా ఇక్కడా ఎక్కడా  దక్కడం లేదన్న ఆక్రోశాన్నివెళ్ళగక్కారు. తెలంగాణా కోసం ఫ్రంటు పెడతామని, అవసరమయితే పార్టీని వొదిలిపెట్టి వెళ్ళడానికి కూడా సిద్ధమేనన్న  వారి ధిక్కార స్వరాలను సయితం పార్టీ అధిష్టానం పట్టించుకున్న దాఖలాలు లేవు. చివరాఖరుకి ఎఫ్.డీ.ఐ. వ్యవహారం వారికి అందివచ్చింది. ఈ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఢిల్లీ పెద్దలు  ఒక మెట్టు దిగివచ్చి అఖిలపక్షం భేటీకి అంగీకరించడంతో తెలంగాణా కాంగ్రెస్ ఎంపీలకు వూరట దొరికినట్టయింది.
సరే, షిండే గారు కూడా వెంటనే కాకపోయినా, మరునాడు మీడియా ఎదుటకు వచ్చి  అఖిలపక్షం ఏర్పాటు చేస్తున్నట్టు ధ్రువీకరించారు. ఈ నెల ఇరవయ్యెనిమిదవ తేదీన ఢిల్లీ లోని కేంద్ర హోం మంత్రిత్వశాఖ కార్యాలయంలో ఉదయం పది గంటలకు సమావేశం జరుగుతుందని ప్రకటించారు. ఒక్కొక్క పార్టీనుంచి ఎంతమందిని పిలిచేది ఇంకా నిర్ణయించలేదని కూడా చెప్పారు. అర్ధవంతమయిన చర్చ జరిగి నిర్దారణతో కూడిన  ఫలితం ఆశించడానికి వీలు కల్పించే ఇలాటి కీలక అంశంపై నిర్ణయం తీసుకుంటే తప్ప  అఖిలపక్షం ఏర్పాటు నిరర్ధకమే అవుతుంది. గతంలో జరిగిన అఖిలపక్ష సమావేశాల్లో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే.     
కాపురం చేసే కళ కాలిమెట్టెల్లో తెలుస్తుందన్నట్టు ఇరవయ్యెనిమిదిన ఏం జరగబోతోందన్నది ఆయా పార్టీల నాయకుల నుంచి వెలువడుతున్న  ప్రతిస్పందనలను బట్టే అర్ధం అవుతోంది. అఖిలపక్షం వల్ల తెలంగాణా వస్తుందో రాదో  తెలియదు కాని తెలంగాణా అంశాన్ని  తమ స్వలాభంకోసం వాడుకోవడానికి ఆయా పార్టీలు ఎంతగా వెంపర్లాడుతున్నాయన్నది వారి మాటలను బట్టే తెలుస్తోంది.
సమావేశాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీయే ముందు తెలంగాణా గురించి తన అభిప్రాయం చెప్పాలని, ఆ తరవాతే తమ వొంతని  బీజేపీ నేతలు సన్నాయి నొక్కులు ప్రారంభించారు. అందరి అభిప్రాయాలు విన్న తరువాత   తెలంగాణా విషయంలో ఆయా పార్టీల బండారం బయట పడుతుందని కాంగ్రెస్ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. ఇంతకీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది ఎదుటి పక్షాలను ఇరకాటాన పెట్టడానికా, సమస్యను పరిష్కరించడానికా అన్న విషయంలో వాళ్లు స్పష్టత ఇవ్వడం లేదు. ప్రజాస్వామ్యం పాలు కాస్త ఎక్కువ వున్న పార్టీ కాబట్టి కాంగ్రెస్ కు చెందిన సీమాంధ్ర నాయకులు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రతినిధులను సమావేశానికి ఆహ్వానించాలంటూ తమ  పాత పల్లవినే  కొత్తగా ఎత్తుకున్నారు. తెలంగాణాకు వ్యతిరేకం కాదంటూ ఆ ప్రాంతంలో పాదయాత్రలు చేస్తున్న తెలుగుదేశం, వై ఎస్ ఆర్ సీ పీ నాయకులు ఈ అంశంపై తమ పార్టీలకు స్పష్టమయిన వైఖరి వుందని ఓ పక్క అంటూనే  అఖిలపక్షంలో దాన్ని పునరుద్ఘాటిస్తామని మాట దాటేస్తున్నారు. అఖిలపక్షం ఏర్పాటుచేయాలని తమ నాయకుడు చంద్రబాబు కేంద్ర హోం మంత్రికి ఉత్తరం రాయడం వల్లనే కేంద్రం కదిలి ఈ ప్రతిపాదన చేయాల్సివచ్చిందని టీడీపీ నాయకులంటున్నారు.  ఇక టీ,ఆర్,యస్. నాయకులు సరేసరి. అఖిలపక్షం ఏర్పాటు ఖ్యాతి కాంగ్రెస్ తెలంగాణా ఎంపీల ఖాతాలోకి పోకుండా చూడడానికి ఈ మొత్తం వ్యవహారాన్ని ఒక డ్రామాగా కొట్టిపడేస్తున్నారు. కాకపోతే, ఎవరి రంగులు ఎలాటివో ప్రజలే అర్ధం చేసుకోవడానికి ఈ సమావేశం వీలు కల్పిస్తుందని  వారంటున్నారు.
దీన్నిబట్టి తెలిసేదేమిటంటే ఈ అఖిలపక్షం వల్ల అసలు సమస్య పరిష్కారం అవుతుందన్న ఆశ వీరెవరికీ లేదని. పైగా ఈ సమావేశం జరిగే నాటికి వారం రోజులు ముందే పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసిపోతాయి. అందువల్ల ఇందులో ఏ నిర్ణయం తీసుకున్నా పార్లమెంటులో బిల్లు పెట్టడానికి మళ్ళీ వ్యవధానం పడుతుంది. ఈ లోగా తెలుగుదేశం అధినాయకుడి పాద యాత్ర తెలంగాణా గడ్డ దాటి కోస్తాలో ప్రవేశిస్తుంది. బహుశా, వై.ఎస్.ఆర్.. సీ.పీ. అధినేత సోదరి షర్మిల పాదయాత్ర కూడా తెలంగాణా ప్రాంతంలో అప్పటికి  ఓ కొలిక్కి వస్తుంది. అధిష్టానం సాచివేత ధోరణితో విసిగిపోయి పక్క చూపులు చూస్తున్న తెలంగాణా  కాంగ్రెస్ నాయకులకు మరికొంత వెసులుబాటు లభిస్తుంది.
ఆల్ హ్యాపీస్.
కాని, వూరట, వెసులుబాటు లేనిది ప్రజలకు, మీడియాకే.
మీటింగు జరిగేదాకా మీడియాకు చేతినిండా పని. వారు కొట్టే వూదరతో జనాలకు ఉచిత కాలక్షేపం. (06-12-2012)

కామెంట్‌లు లేవు: