23, డిసెంబర్ 2012, ఆదివారం

ఈ చీకటి గొందులలో.............


ఈ చీకటి గొందులలో.............




“పరరాజుల పాలనలో పతనమయిన సంస్కృతి నాది
ఉద్దరించాలి – పున
రుద్దరించాలి మళ్ళీ
నా జాతి పౌరుషము
అలల తలదన్ని చెలగాలి!
నా  జాతి! నా సంస్కృతి!! నా దేశం!!!”

“ఎవరు నాయనా నీవు?
ఈ చీకటి గొందులలో
ఎందులకీ తందనాలు?”

“అ హ్హ హ్హ ! బాగున్నది
తెలిస్తే ఒకవేళ నీకు
శుక వ్యాస వాల్మీకులు
కాళిదాసు భోజుడు
రాణాప్రతాపు  రాయలు
తెలుసుకో భారతీయుణ్ణి నేను!
తందనాలు ! అలాగే వుంటుంది నీకు
వందనాలు నను కదిలించకు...”

“పిచ్చివాడ బాధపడకు
హృదయమున్న కుర్రాడివి
వ్యధపడి వ్యర్దుడివి కాకు
నిన్నటి సూర్యోదయం
నేడు నీకు వెలుగివ్వదు
ప్రస్తుతమున పని గడవగ
ప్రయత్నించు ఒక జ్యోతి కొరకు”

“వద్దు నన్ను అడ్డవద్దు
ఆత్మను మధించి నేడే
ఆరని జ్యోతిని వెలిగిస్తా
నాకూ, నా జాతికి, దేశానికి
నవ్యోషస్సు సాధిస్తా”

“చీకటిలో పరుగులెత్తి
చెడిపోవుట నీకు వద్దు
దారిగనక పరుగులిడిన
చేరవు గమ్యానికెపుడు
గొలుసులతో కట్టి
ఏనుగులతో లాగింపదలప
పతనమయిన భారతీయ
సంస్కృతియన సముద్రమున
మునిగిన ఓడ కాదు నాయనా
కరిగిన ఉప్పు!
ఉద్రేకం పనికిరాదు
ఉత్సాహం ఉంటే చూపు”

“యెందుకు నను మళ్ళీ
వెనుకకు మళ్ళించెదరు?
పవిత్రమయిన నా సంస్కృతి
పునరుద్దరింపవలదా
నా తల్లికి దివ్యాభరణం
నా జాతికి గర్వకారణం
నా దేశపు సంజీవి ఇది
నా సంస్కృతి – నశింపనీయను
మన్నించి నను మళ్ళింపకుడీ!”

“కళలూ కావ్యాలూ దేశానికి
ఘనమయిన ఆభరణాలే!
ఎండే  డొక్కలతో చుట్టూ
ఏడుస్తుంటే పిల్లలు
చెప్పు నాయనా! మాత
సువర్ణాభరణాలు ధరియిస్తుందా!
చీకటి గొందులనెప్పుడు
అప్సరసలు నర్తించరు
ఆకలి డొక్కలలో  కళ
ఆనందం పొంగించదు
రా నాయనా రా ఈ గొందుల
గోడలపై తడుముకుంటు
ప్రయత్నించి సంపాదిద్దాం ఓ దివ్వెను
సఖ్యతతో బతుకుతున్న
సోదరులే బంగారం తల్లికి
కష్టజీవిని కని కన్నులు
కార్చే కన్నీరే సంస్కృతి
లే! వూగిసలాడకు ఇంకా
రా! నాయనా! రా!
-భండారు పర్వతాలరావు : తెలుగు స్వతంత్ర : జనవరి 6, 1956.                                         

కామెంట్‌లు లేవు: