14, ఆగస్టు 2010, శనివారం

స్వయంకృతాపరాధాలు - భండారు శ్రీనివాసరావు

 స్వయంకృతాపరాధాలు  - భండారు శ్రీనివాసరావు

యోగి వేమన

‘పురుషులందు పుణ్య పురుషులు వేరయా’ అన్నాడు వేమన. అలాగే - ‘విభక్తుల్లో సంబోధనా ప్రథమా విభక్తి’ తరహాయే వేరన్న భావన ఈనాడు సమాజంలో కాలవస్తున్నట్లుగా తోస్తోంది. తల్లిని ‘ఒసే’ అనడం - తండ్రిని ‘ఒరే’ అనడం ఈ మధ్య సినిమాల్లో షరా మామూలుగా మారిపోయి అదే సంస్కృతి క్రమంగా, వడి వడిగా సాధారణ జీవితాల్లోకి జొరబడుతుంది.



  

బాపుగారికి క్షమాపణలతో

వెనుకటి రోజుల్లో పిల్లలు ఒకర్నొకరు సరదాగా ‘గురూ-గురూ’ అని పిల్చుకుంటూ ఉంటే విని పెద్దలు గుర్రుమనే వారు. మాట తీరుకు ఆ రోజుల్లో అంత ప్రాధాన్యం ఉండేది. ఇళ్ళల్లో మాట్లాడుకునే దానికి - బయట సంభాషించే పద్ధతికి ఎంతో వ్యత్యాసం ఉండేది.ఇంట్లో అమ్మా అని పిలిచినా బయట నలుగురిలో మాత్రం అమ్మగారూ అంటూ గౌరవంగా చెప్పుకునే వారు. ఉత్తరాలు రాసేటప్పుడు - గంగా భాగీరథీ సమానురాలైన అత్తగారికి అనో, పూజ్యులైన తాతయ్యగారికి అనో వినమ్రత కనబరిచే వారికి వినయాన్ని సంస్కారంగా, విధేయతని సభ్యతగా పరిగణించేవారు. ఒదిగి ఒదిగి ఉండడాన్ని ఆత్మన్యూనతగా కాకుండా అణుకువగా అనుకునేవారు. సభ్యతా, సంస్కారాలక్కు అదే కొలమానంగా భావించేవారు.


ఇక, పత్రికల్లో వాడే భాష, సినిమాల్లో వినిపించే సంభాషణలు, చట్టసభల్లో జరిగే చర్చలు, చాలా వరకు పరిధులకు, ప్రమాణాలకు లోబడే ఉండేవి. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆకాశవాణి, దూరదర్శన్ ల సంగతి చెప్పనక్కర్లేదు. వాటి కార్యక్రమాలు, వార్తలు గిరి గీసుకుని, మడికట్టుకుని తయారుచేసినట్టుగా ఉండేవని గిట్టనివారు అనుకునేవారు కూడా. నిజాలను నిదానంగా చెబుతాయన్న నింద తప్ప - సమాజానికి కాలుష్య కారకాలుగా మారాయన్న అపప్రధని అవి ఏనాడు మోయలేదు.

కోరికలే జిరాఫీలయితే

కానీ, కాలం ఒక్క తీరుగా ఉండదు కదా!జనం అభిరుచులు కూడా కాలాన్ని బట్టి, తరాలను బట్టి మారిపోతుంటాఅయి. కనుకే సంబోధనా ప్రథమా విభక్తి ప్రత్యయాలకు ఈనాడు ఇంతటి ఆదరణ. అందుకే మార్పులోని మంచి చెడ్డలతో నిమిత్తం లేకుండా దాన్ని స్వీకరించడం, అమోదించడం అంతా సజావుగా సాగిపోతున్నది. ఈ మార్పుని మరింత ‘వేగవంతం’ చేయడంలో ఈనాటి ‘ఎ టూ జెడ్’ చానెళ్ళు శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నాయి.
ఓరి భడవా?
తరాలు మారుతున్నప్పుడు - వర్తమాన తరం వెనుకటి తరాన్ని చిన్నబుచ్చడం, హేళన చేయడం తరతరాలుగా వస్తోంది. పెద్దల సుద్దులను చాదస్తంగా కొట్టివేయడం మార్పుకున్న ప్రధమ లక్షణం. ఇలా మారిపోతున్న జనాల్లోనుంచే నాయకులు పుడతారు. మేథావులు పుడతారు. జర్నలిస్టులు పుడతారు. సంపాదకులు పుడతారు. కవులు - రచయితలు పుడతారు. పాఠకులు పుడతారు. శ్రోతలు పుడతారు. వీక్షకులు పుడతారు. వీళ్ళ సభ్యతా సంస్కారాల కొలబద్దలు కూడా మార్పులకి తగ్గట్టుగానే మారిపోతుంటాయి.

 మార్పుని అంగీకరించని మునుపటి తరం మౌనవీక్షణలో మునిగి సణుగుతుంటే - ఏది ఒప్పో, ఏది తప్పో చెప్పేవాళ్ళు లేక, చెప్పినా ఒప్పుకునే తత్త్వం లేక నవతరం ముందుకు సాగుతోంది. తరాల అంతరాల్లోనుంచి మొలకెత్తిన వైరుధ్యాలు, వైకల్యాల ప్రతిరూపాలే ఈనాడు సమాజంలోని అన్ని వర్గాలను ఆశ్రయించుకుని బహుముఖ రూపాల్లో బయటపడుతున్నాయి. అమ్మను 'ఒసే' అనడం, నాన్నను 'ఒరే' అనడం వంటి కొత్త ధోరణులను ఆవిష్కరిస్తున్నాయి. ముందే చెప్పినట్టు ఇది క్రమంగా సినిమాల నుంచి ఛానళ్ళకు, పత్రికలకు, పుస్తకాలకు, చట్టసభలకు విస్తరించి - సభ్యతా సంస్కారాలకు కొత్త భాష్యం చెబుతున్నాయి. ఈ క్రమంలో నుంచే ఆవిర్భవించిన ప్రజా ప్రతినిధులు, మేధావులు, జర్నలిస్టులు, కవులు, రచయితలు, కళాకారులు - చెప్పే మాటల్లో, ప్రవచించే పలుకుల్లో, రాసే రాతల్లో - సభ్యతా సంస్కారాల ప్రమాణాలే మారిపోతున్నాయి. ఇందుకు సజీవ సాక్ష్యాలు - ఈనాటి సినిమాలే! ఈనాటి ఛానళ్ళే! ఈనాటి పత్రికలే! ఈనాటి పుస్తకాలే! ఈనాటి చట్ట సభలే!
రోజూ చచ్చేవాళ్ళకు ఏడ్చేవాళ్ళుండరు.రోజులు ఇలాగే గడిస్తే వర్తమాన వైరుధ్యాలకు బాధపడే వాళ్ళు మిగలరు
పాలితులను బట్టే పాలకులు- పాఠకులను బట్టే పత్రికలు - ప్రేక్షకులను బట్టే సినిమాలు - వీక్షకులను బట్టే ఛానెళ్ళు.


ఎవరు చేసిన ఖర్మ వారనుభవించక తప్పదు!

NOTE: All images in this blog are copy righted to respective owners

మాట్లాడడం అంటే మాటలు కాదు - భండారు శ్రీనివాసరావు

మాట్లాడడం అంటే మాటలు కాదు - భండారు శ్రీనివాసరావు

'మౌనమే నీ భాష ఓ మూగవదనా!'

నిజానికి అరవై నాలుగు కళల్లో ఇది ఒకటి.ఇది నిజమో కాదో తెలియకపోయినా ఇలాంటి స్టేట్మెంట్లని అలవోకగా, ఘంటాపధంగా ఇవ్వగల కళలో ఆరితేరినవరే గట్టి వక్తలుగా పేరు తెచ్చుకోగలుగుతారు. పెళ్ళిళ్ళల్లో -పబ్బాల్లో నలుగుర్ని చేరదీసి- అంతకు ముందు అందరూ చదివేసిన పేపర్లలోని వార్తలూ, విశేషాలూ అన్నీ తనకే ముందు తెలిసినట్టుగా రంగులద్ది చెప్పడం ఇంకో కళ. దీన్నే సంభాషణా చాతుర్యం అని కూడా అందురు. ఐతే, ఈ కళ ద్వారా ఆకట్టుకోగల శ్రోతల సంఖ్య పరిమితం. రాగల పేరూ, ప్రఖ్యాతలు కూడా ఆ పాళ్ళలోనే వుంటాయి. వేదికలెక్కి ఉపన్యాసాలు దంచగల స్ఠాయికి ఎదగగలిగితే అభిమానుల సంగతి అటుంచి ఎదో కొంత గిట్టుబాటుగా కూడా వుంటుంది. సభా నిర్వాహకులు సయితం తమ తమ విభవాన్నిబట్టి చదివించుకుంటూ వుంటారు. సాధారణంగా అవార్డులూ-సత్కారాలకు సంబంధించిన కార్యక్రమాల్లో ఈ రకం వక్తలకు కొంత గిరాకీ వుంటుంది. పొగడడం మినహా మరో అంశానికి ప్రాధాన్యం వుండదు కాబట్టి మాట్లాడడం కూడా అంత శ్రమ అనిపించదు. అవార్దులు తీసుకునేవారూ, ప్రేక్షకులూ ప్రతిసారి మారిపోతుంటారు కావున ప్రసంగాల్లో పునరుక్తి దోషాలు ఎన్ని దొర్లినా ఎలాంటి ఇబ్బంది ఇసుమంత కూడా వుండదు. అతిశయోక్తులు దట్టించి ఎలా పొగడాలో తెలుసుకోవడానికి ప్రత్యేక శిక్షణా తరగతుల అవసరమే లేదు. ప్రోగ్రాం కంపీర్ అనో, వ్యాఖ్యాత అనో ఎదో ఒక పేరుతో మైకు ముందు నిలబడే శాల్తీ- సభకు వచ్చిన అతిధుల్నీ, అభ్యాగతుల్నీ(శ్రోతల్నీ) అదే పనిగా ఎలా పొగుడుతున్నారో కొద్దిగా గమనిస్తే చాలు సరిపోతుంది.
 
'మైకేరియాసురుడు'

ఈ మధ్య ఒక సభకు వెళ్ళాను. బయట బాగా ఎండగా వుండడం వల్ల, సభా మందిరం ఏసీ హాలు కావడం వల్లా లోపల జనం నిండుగానే వున్నారు. భజంత్రీల్లో ఎవరో రాకపోవడంతో నన్ను మాట్లాడమన్నారు. ససేమిరా అన్నాను. ఒక్కసారి స్టేజి ఎక్కి మాట్లాడడం మొదలు పెడితే ఆ మత్తులో పడిపోతానేమోనని భయం. పైగా మొగమాటాలకు పోయి అనేక సభలకి హాజరైన అనుభవం వుంది. వేదికమీద వున్న, సారీ- వేదికను అలంకరించిన- ఇంకో సారి సారీ- (రంగురంగుల పూలతో, కాగితాలతో వేదికను అలంకరించినవారని అర్థం కాదు) పదిమందో, పదహారు మందో- ఒక్కొక్కరుగా లేచి తమ ప్రసంగం ప్రారంభించినప్పుడల్లా - వేదిక మీద వున్న మిగిలినవారిని పేరు పేరునా స్మరించడం-పనిలో పనిగా పొగుడుకోవడం గమనిస్తే చిర్రెత్తుకొస్తుంది. ఈ పరస్పర కుచమర్ధనాలకే సగం సమయం గడిచిపోతుంది. దండలు, పుష్పగుచ్చాలు, శాలువలు అందించేవారి పేర్లూ, అందుకుంటున్నవారి పేర్లూ - ఎలా సహస్రనామార్చన కొనసాగుతుంది.
ఈ కార్యక్రమంలో వీలైనంతమందికి వీలు కల్పించడంవల్ల సభ హాజరుకి మినిమం గ్యారంటీ వుంటుంది. ఈలోగా ప్రధమ తాంబూలం, లేదా ప్రధాన సత్కారం అందుకోవడానికి అన్నిరకాలుగా అన్నీ సమర్పించుకున్న శాల్తీ వేదిక మీదనే విలవిలలాడిపోతుంటాడు. కవర్ చేయడానికి వచ్చిన స్థానిక విలేకరులు తన సన్మాన కార్యక్రమాన్ని కవర్ చేయకుండానే మరో "గిఫ్టుబాటు" కార్యక్రమానికి వెళ్ళిపోతారేమోనని విలేకరుల గ్యాలరీ వైపు పిచ్చి చూపులు చూస్తూ దొంగ దండాలు పెడుతుంటాడు. ఎద్దు పుండు కాకికి రుచి అన్న సామెత మాదిరిగా నిర్వాహకులకు మాత్రం ఇదేమీ పట్టదు. అతిధులు, విశిష్ట అతిధులు, పరమ విశిష్ట అతిధులతో పాటు అతిధి ఆఫ్ ది డే - అతిధి ఆఫ్ ది ఇయర్తోటే వారికి గడిచిపోతుంటుంది. తెచ్చిన శాలువాలు, కప్పాల్సిన భుజాలు లెక్క పెట్టుకుంటూ వాళ్ళు కాలక్షేపం చేస్తుంటారు. వక్తలు కూడా ఎవరికి వారు తమ ప్రసంగం పూర్తి కాగానే ఒకరి వెంట మరొకరు - కారణం చెప్పో చెప్పకుండానో వేదిక మీద నుంచి నిష్క్రమిస్తుంటారు. రైలుకో, బస్సుకో పోదామని బయలుదేరి మధ్యలో దొరికిన టైములో కాలక్షేపం కొసం శ్రోతల అవతారాలెత్తినవాళ్ళు కూడా ఆవులించుకుంటూ లేచి నిలబడి చేతి వాచీలవైపు, నిర్గమన ద్వారాల వైపు చూస్తుంటారు. ఇవన్నీ చూస్తూ నిర్వాహకులు - ఆనాటి "వ్యయ ప్రదాత"ను పిలిచి, తమకు జరిగిన ఈ అపూర్వ సన్మానానికి ముక్తసరిగా మూడు ముక్కల్లో ఉచిత రీతిన ధన్యవాదాలు తెలపాల్సిందిగా మనవి చేసుకుంటారు.
ఇదొక్కటే మొత్తం కాంట్రాక్టులో ఉచితంగా దొరికిన అవకాశంగా పరిగణించిన సదరు శాల్తీ - అలవాటులేని ప్రసంగాన్ని అధాటుగా ప్రారంభించి మధ్యలో దారితప్పి -అవాకులు, చవాకులతో శ్రోతల సహనాన్ని పరీక్షించే సమయంలో- సభా నిర్వహణ విధి విధానాలను "స్కాచి" వడబోసిన నిర్వాహకులు సత్కార కార్యక్రమాన్ని హడావిడిగా ముగించి సభకి మంగళం పాడతారు. కరిగిన సొమ్ముకూ, జరిగిన సన్మానానికీ బేరీజు వేసుకుంటూ బేజారైన గుండెతో సత్కార గ్రహీత ఇంటిదారి పడతాడు. నిర్వాహకులు విందు చేసుకుంటూ మరో "బఖరా" వేటలో పడతారు.
వినేవారికి మాట్లాడేవారు లోకువ
NOTE: All images in this blog are copy righted to the respective owners

కన్నుపొయ్యే కాటుకెందుకు? - భండారు శ్రీనివాసరావు

కన్నుపొయ్యే కాటుకెందుకు? - భండారు శ్రీనివాసరావు


ఆరోజు మంత్రి వర్గం సమావేశమౌతోంది. మధ్యాహ్నం పన్నెండు తర్వాత ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడతారని కబురొచ్చింది. అందరం బిలబిలమంటూ సచివాలయంలోని ముఖ్యమంత్రి ఛాంబర్‌కు చేరుకున్నాం. విలేకరులు, అధికారులతో సమావేశాలు నిర్వహించేందుకు ఆ ఛాంబర్‌ ప్రక్కనే ఒక చిన్న హాలు ఉండేది.



ఆ నాటి ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి అంజయ్య 

ఓ అరగంట తర్వాత అప్పటి ముఖ్యమంత్రి శ్రీ అంజయ్య ఆ హాల్లోకి వచ్చారు. విలేకరులందరినీ పేరుపేరునా పలకరిస్తూ మామూలు కబుర్లలో పడిపోయారు. మధ్యమధ్యలో ఏం మొయిన్‌ ! (మొయినుద్దీన్‌ - ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి) అందరికీ అన్నీ (కాఫీ టిఫిన్లు) అందాయా? అని వాకబు చేస్తున్నారు. అప్పటికి దాదాపు ఒంటిగంట కావస్తుండడంతో చివర్లోకూర్చున్న నాలో అసహనం పెరిగిపోతోంది. మరో పదిమిషాల్లో మధ్యాహ్నం ప్రాంతీయ వార్తలు మొదలవుతాయి. ఈ బులెటిన్‌ తప్పిపోతే మళ్లీ సాయంత్రందాకా దిక్కులేదు. కానీ అంజయ్యగారి కబుర్లు ఒక పట్టాన తేలేలా కనిపించడంలేదు. చివరికి ఏదయితే అదే అయిందని లేచి ఆయన దగ్గరకు వెళ్లాను. వార్తల టైమ్‌ అవుతోందని చెప్పేసి- ఏం చెప్పదల్చుకున్నారో ఒక్క ముక్కలో చెప్పండని కోరాను. దానికాయన పెద్దగా నవ్వేస్తూ `చెప్పడానికేముంది - మంత్రులందరూ (రాజీనామాలు) ఇచ్చేశారు' అని సైగలతో చెప్పేశారు. నేను రయ్‌ మంటూ బయటకు పరుగెత్తి - ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి రేడియోకి ఫోన్‌ చేసి మంత్రుల రాజీనామా వార్తని అందించాను.
ఇదంతా ఎందుకు చెప్పాల్సివస్తోందంటే - విలేకరులు వార్తలను అందించే తొందర్లో ఎలా తప్పుల్ని తొక్కుతారో అన్నది తెలియ చెప్పడానికే.




అంజయ్యగారి మంత్రి వర్గాన్ని `జంబోక్యాబినెట్‌' అని ఎద్దేవా చేసేవారు. అరవైమంది మంత్రులేమిటి - విడ్డూరం కాకపోతే అనేవారు. కార్టూన్ల సంగతి సరేసరి. అయినా, ప్రతిదీ తేలిగ్గా తీసుకునే తత్వం ఆయనది. యాదగిరి (హెలికాప్టర్‌)తో తనను ముడిపెట్టి ఒక దినపత్రికలో ప్రచురించే వ్యంగ్య చిత్రాలను కూడా  నవ్వుతూ  ఆస్వాదించే మనస్తత్వం ఆయనది.


`వెనకటి రోజుల్లో జిల్లాకు ఒకే ఒక్క అయ్యేఎస్‌ ఆఫీసర్‌ (జిల్లాకలెక్టర్‌) ఉండేవాడు. ఇప్పుడో - ఇద్దరు ముగ్గురు అలాంటి అధికార్లు జిల్లాల్లో పనిచేస్తున్నారు. అలాంటప్పుడు జిల్లాకు ఇద్దరు మంత్రులు వుంటే తప్పేంటి `శ్రీనివాసూ' అనేవారు ఆంతరంగిక సంభాషణల్లో.

ఇక వార్తల్ని అందించడంలో తొందరపాటు విషయానికి వస్తే ఆ రోజు నేను హడావిడిలో అరవైమంది మంత్రులు రాజీనామా చేశారని చెప్పాను. రేడియోలో కూడా అలాగే ప్రసారమైంది. నిజానికి ముఖ్యమంత్రితో కలిపి మంత్రివర్గంలో సభ్యులసంఖ్య అరవై. 59 మంది మంత్రులే ఆరోజు రాజీనామా చేశారు. సాయంత్రం వార్తల్లో ఈ తప్పు సవరించుకున్నామనుకోండి. ఇలాంటి పొరపాట్లే మరికొన్ని తరహా వార్తల విషయంలో జరిగితేనే వస్తుంది చిక్కంతా.

శ్రీమతి ఇందిరా గాంధి

శ్రీమతి ఇందిరాగాంధీని హత్యచేసినప్పుడు చాల సేపటివరకూ రేడియో ఆ వార్తని వెల్లడించలేదు. ఆవిడ మరణవార్తని జాతికి తెలియచెయ్యడంలో తాత్సారం జరిగిందని దరిమిలా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రధానిపై కాల్పులు జరిగాయన్న వార్త బయటకు పొక్కింది కానీ అసలేం జరిగిందన్న దానిపై అందరికీ తీరని సందేహాలే. చివరికి రాజీవ్‌ గాంధీ కూడా శ్రీమతి ఇందిరా గాంధీ మరణం గురించి బీ బీ సీ వార్తలు విని ధృవపరుచుకున్నారు.

శ్రీమతి గాంధి పార్ధివ శరీరం 

 ఆమెపై కాల్పులు జరిపిన అంగరక్షకుల్లో ఒక సిక్కు మతస్తుడు ఉన్నాడన్న సంగతిని రేడియో వార్తల్లో ముందు వెల్లడించలేదు. అందువల్ల - అప్పటివరకూ అందరి మనసుల్లో ఆందోళన - అలజడి తప్పిస్తే అంతా ప్రశాంతమే. కానీ కాల్పులు జరిపిన అంగరక్షకుల్లో ఒకడిపేరు `బియాంత్‌ సింగ్‌' అన్న విషయం వెల్లడి కాగానే ఒక్కసారిగా అంతా తారుమారయింది. పరిస్థితులు వర్ణించలేనంత భీభత్సంగా పరిణమించాయి. ఎక్కడో ఢిల్లీలో జరిగిన ఘాతుకానికి దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల్లో ప్రయాణించే సిక్కు ట్రక్కు డ్రైవర్లు ఊచకోతకు గురయ్యారు. అవేశకావేశాల ముందు వివేకం, విచక్షణ తలవంచాయి.

శ్రీమతి గాంధి హత్యానంతరం జరిగిన అల్లర్లలో ఒక దృశ్యం

ఎవరో చెప్పినట్టు ట్యూబునుంచి పేస్టు బయటకు తీయగలమే కానీ మళ్లీ అందులో పెట్టలేం. అలాగే పేల్చిన తూటా కూడా.


నిజమే. వార్తను వెనువెంటనే అందించాలన్న కర్తవ్యదీక్షని మెచ్చుకుని తీరాల్సిందే. కానీ సామాజిక బాధ్యత సంగతేమిటి? పగలసెగలు రగిలించి, వ్యధలు మిగిలించి, విపరీత పరిణామాలకు దారితీసే అవకాశం ఉన్న సమాచారాన్ని తొక్కి పెడితే వచ్చే నష్టం ఏమిటి?
భయంకరమైన పోటీ వాతావరణంలో పయనిస్తున్న ఈనాటి మీడియా మనుగడకు ఎంతో కొంత మేరకు సంచలనాత్మక కథనాలు అవసరమే. కాకపోతే టీ ఆర్‌ పీ రేటింగ్‌లతో పాటు విశాల జనహితాన్ని పట్టించుకోవడం కూడా ఆవశ్యకమే! కాదంటారా!

భండారు శ్రీనివాసరావు


NOTE: All images are copy righted to their respective owners.

13, ఆగస్టు 2010, శుక్రవారం

సుత్తి ముక్తావళి - భండారు శ్రీనివాసరావు

సుత్తి ముక్తావళి




(కన్న వింతలూ- విన్న వింతలూ)



'నిన్ను గురించి నువ్వు ఎప్పుడూ చెప్పుకోకు. మంచి చెప్పుకుంటే ఎవ్వరూ నమ్మరు. చెడు చెప్పుకుంటే - ఇంకా ఎంతవుందో అనుకుంటారు'

'మన బతుకు ఎలాంటిదో మన చావు చెబుతుంది. అయితే, మన బతుకు ఎలాంటిదో లోకానికి చెప్పడం కోసం కనీసం ఇద్దరు బతికుండాలి. అందులో ఒకడు మన స్నేహితుడయివుండాలి. ఇంకొకడు తప్పనిసరిగా మన శత్రువై వుండాలి. మన గురించి శత్రువు చెబుతున్నదానికీ- స్నేహితుడు చెబుతున్నదానికీ యెంత వ్యత్యాసం వుంటే - అంత నిత్యనూతనంగా చచ్చిన తర్వాత కూడా మనం బతికేవుంటాం.'





'ఒక మాట నిజం.
బతుక్కన్నా చావుకే  ఆయుష్షు ఎక్కువ.
గట్టిగా ఒక్క తుమ్ము కూడా తుమ్మకుండా ప్రాణాలను కాచుకుంటూ, దాచుకుంటూ ఎన్నేళ్ళయినా బతుకు. నూరేళ్ళు- నూట యిరయై ఏళ్ళు- మహా అయితే నూట పాతికేళ్ళు.
కానీ, ఆ బతుక్కన్నా కూడా పొడవయినది చావు. ఎన్నేళ్ళు బతికి చచ్చినా- బతికినన్నాళ్ళకంటే ఎక్కువ ఏళ్ళు చచ్చినతర్వాత కూడా జనం జ్ఞాపకాల్లో బతికే వుంటాం.'



"ఏ పని అయినా కష్టపడుతూ కాదు - ఇష్టపడుతూ చేయాలి"


'నేను చేయగలనని అనుకోవడం ఆత్మవిశ్వాసం-నేనే చేయగలనని అనుకోవడం అహంకారం.'


'నర మాంసం తినే క్రూర జంతువు కూడా తన మాంసం తినదు'




" పెళ్ళయిన కొత్తల్లో పెళ్ళాం మాట మొగుడు వింటాడట.తరవాత్తరవాత మొగుడిమాట భార్య వింటుందట.ఆ తర్వాత యిరువురి మాటలు ఇరుగూ పొరుగూ వింటారట.'


'భయం అనే పదానికి తప్ప దేనికీ భయపడాల్సిన పని లేదు.'




'మీరు అద్భుతాలను నమ్ముతారా?'
'ఎందుకలా అడుగుతున్నారు?'
'మీ జీవితంలో నిన్న ఒక గొప్ప అద్భుతం జరిగింది తెలుసా?'
'నా జీవితంలోనా?'
'అవును. మీ చిన్నాన్న చనిపోయాడని చెప్పి నిన్న మీరు సెలవు పెట్టి వెళ్ళాక - మిమ్మల్ని చూడ్డానికి ఆయనే ఆఫీసుకి వచ్చారు.'


'దేవుడిని నమ్మి బాగుపడ్డామన్నవాళ్ళు తారసపడలేదు కానీ - దేవుడిని నమ్మేదిలేదంటూ లాభపడ్డవాళ్ళు బోలెడుమంది కనబడుతుంటారు.'

'ఉన్నతస్థానానికి చేరుకోవడం ఎంతో కష్టం. చేరుకున్న తరవాత ఆ స్థానాన్ని పదికాలాపాటు పదిలపరచుకోవడం మరింత కష్టం.'



" ఎవరికయినా వారి అవసరానికి యెంత సాయం చేసినా వెంటనే మరచిపో - ఇతరులు చేసిన సాయం యెంత చిన్నదయినా జీవితాంతం గుర్తుంచుకో "




" మనిషి ఏడుస్తూ పుట్టింది - నవ్వుతూ చనిపోవడానికి "
-భండారు శ్రీనివాసరావు

NOTE: All images in this blog are copy righted to their  respective owners

ఇంకానా! ఇకపై సాగదు! - భండారు శ్రీనివాసరావు

ఇంకానా! ఇకపై సాగదు!    - భండారు శ్రీనివాసరావు



రాను రాను - సామాన్యుడనే వాడికి - ఓటు వెయ్యడం మినహా ఏ ‘హక్కూ’ లేకుండా పోతోంది. కానీ, అతడ్ని అడ్డం పెట్టుకుని బతికేవారికి మాత్రం అన్ని హక్కులూ - హక్కుభుక్తమై పోతున్నాయి.




నిజానికి, పార్టీలూ,పర్టీల నాయకులూ, అమాత్యులూ, అధికారులు,ఉద్యోగులు, పోలీసులూ, అందరూ ప్రజల్లో భాగమే. ప్రజల నుంచి వచ్చిన వాళ్ళే. ఎదిగో - ఎన్నికయ్యో, హక్కులు సాధించుకుని అధికారం చెలాయిస్తున్నారు. సామాన్యులు ఎలాంటి హక్కులూ లేకుండా కునారిల్లుతున్నారు. అదే తానులోంచి వచ్చిన వాళ్ళు మాత్రం వృత్తుల పేరిటా, ఉద్యోగాల పేరిటా,సంఘాలు పెట్టుకుని, హక్కుల పోరాటాల పేరుతో లేని అధికారాలు అనుభవిస్తున్నారు. పై పదవులకు నిచ్చెనలు వేసుకుంటున్నారు.

సంఘాల కుంపట్లు పెట్టుకోని వర్గాలు ఈనాడు కాగడాలు వేసి గాలించినా కనిపించవు. ఎన్జీవోలకు సంఘాలున్నాయి. ఐ.ఏ.ఎస్., ఐ.పి.ఎస్. అధికారులకు అసోసియేషన్లు ఉన్నాయి. రిక్షాలు లాగేవారికే కాదు, విమానాలు నడిపేవారికీ యూనియన్లు ఉన్నాయి. అమ్మేవారికి, కొనేవారికి సమాఖ్యలున్నాయి. రాసేవారికి, ఆ రాసిన వాటికి అచ్చేసేవారికీ సంస్థలు ఉన్నాయి. ఆడవారికీ, భార్యాబాధితులకు సయితం సమాజాలున్నాయి. వృత్తుల వారీగా, కులాలవారీగా, మతాలవారీగా ఎవరి సంఘాలు వారికి ఉన్నాయి. వీటన్న్టిటికీ, సొంతంగా ఏర్పరచుకున్న హక్కులు ఉన్నాయి. లేకపోయినా, వాటికోసం పోరాడగల యంత్రాంగ వ్యవస్తలున్నాయి.భావాలను విప్పిచెప్పగల గళాలు ఉన్నాయి. వాటిని ప్రజలకు చేరవేసే మాధ్యమాలు ఉన్నాయి. హక్కుల సాధనకోసం సమ్మెలు, బంద్ లు, ఆందోళనలు, నిరసనలు, రాస్తారోఖోలు, రైల్ రోఖోలు, ఘెరావ్ లు, ముట్టడులూ, ఊరేగింపులూ, బైఠాయింపులూ, అటకాయింపులూ, మానవహారాలు, దిష్టిబొమ్మల దహనాలు, ఇలా ఎన్నో రకాలుగా, ఎన్నెన్నో రూపాల్లో.. సామాన్యుడి సాదారణ జీవితాన్ని అతలాకుతలం చేస్తూ మరింత దుర్బరంగా మారుస్తూ - పై పెచ్చు తాము పడుతున్న ఈ పడరాని పాట్లన్నీ ఆ సామాన్యుడి కోసమే అని చెప్పి నమ్మించగల టక్కుటమార విద్యలన్నీ వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఇవన్నీ లేనివాడు, అసలేమీ లేనివాడు మాత్రం రాజ్యాంగం తనకు కల్పించిన అన్ని రక్షణలకూ తూట్లు పొడుస్తున్న ఈ అస్తవ్యస్త మధ్య చిక్కుకుపోయి నానా అవస్థలు పడుతూ దిక్కుతోచక విలవిలలాడుతున్నాడు.

రాస్తా రోఖో కారణంగా ఆగిపోయిన అంబులెన్స్

కారణాలు ఏమైనా, హేతుబధ్దత ఎంత ఉన్నా, బంద్ ల వల్లా, రాస్తారోఖోల వల్ల నష్టపోతున్నదీ, కష్టపడుతున్నదీ సామాన్యులే అన్నది నగ్న సత్యం. నిరసనలూ, ఆందోళనల పేరుతో రాజకీయపార్టీలు, వాటి అనుబంధ సంస్థలు, కార్మిక సంఘాలు, ఇతర సంస్థలూ, ఇష్టారాజ్యంగా నడిరోడ్లపై చేస్తున్న ధర్నాలు, బైఠాయింపులు నిత్యకృత్యంగా మారి జనజీవితాన్ని నరకప్రాయంగా మారుస్తున్నాయన్నది అంతే నిజం.


ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే నెపంతో రోడ్డెక్కుతున్న రాజకీయ పార్టీలు, కార్మికసంఘాలు తమ వైఖరులనూ, విధానాలను పునస్సమీక్షించుకోవాలి. ఏ సామాన్య జనం కోసమైతే ఉద్యమాలు, ఆందోళనలూ, నిర్వహిస్తున్నామని ఆయా పార్టీలూ, సంఘాలు అనుకుంటున్నాయో, ఆ సామాన్య జనాన్నే తమ విధానాలు మరింత చికాకు పరుస్తున్నాయన్న వాస్తవాన్ని అర్దం చేసుకోవాలి. పోరాటాల పేరుతోనో, ఇతరేతర రాజకీయ కారణాలతోనో బడుగుజీవి నడుం విరుస్తున్న ఈ అపబ్రంశపువిధానాలు ఏ నాగరిక దేశంలోనూ కానరావు. సాటి పౌరులకు ఇబ్బంది కలగని రీతిలో నిరసనలు ప్రకటించే పద్ధతులను సభ్యసమాజం పాటించి తీరాలన్న ప్రాధమిక స్పృహ మనదేశంలో కలికానికి కూడా కానరాదు.
ఒకసారి, సూర్యాపేట మీదుగా బస్సులో ఖమ్మం వెడుతుంటే నడుమ దారిలో వందలాది వాహనాలు నిలిచిపోయాయి. కారణం వాకబు చేయడానికి వెడితే కొంతదూరంలో ఏదో పార్టీకి చెందిన కార్యకర్త్గలు - పట్టుమని పదిమంది కూడా లేరు. - జండాలు పట్టుకుని, నినాదాలు చేస్తూ నడిరోడ్డు పై ధర్నా చేస్తున్నారు. ‘ఇలా ఎంతసేపు మీ తమాషా చూడాలనిగద్దిస్తే ఒక్క అరగంట ఓపిక పట్టండి సార్! ఫలానా టీవీ వాళ్ళు దోవలో ఉన్నామని ఇప్పుడే సెల్ ఫోన్లో చెప్పారు. అని వాళ్ళనాయకుడు జవాబిచ్చాడు. ఇలాంటి ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోఖోలు ససేమిరా చూపించేది లేదని చానళ్ళన్నీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోగల్గితే మెరుగయిన సమాజం కోసం నిజంగా కృషి చేసినట్టవుతుంది. ప్రచారం కోసం కాకుండా ప్రజాక్షేమాన్ని కోరుకునే సంస్థలు కూడా తమ కార్యకర్తల్ని తక్షణం రంగంలోకి దింపి ‘ఇలా ప్రజలని ఇబ్బందుల పాలు చేసే వారికి దయచేసి ఓట్లు వెయ్యవద్దు అనే ప్లకార్డులను పట్టుకుని మౌనంగా ఆ పక్కన నిలబడితే, నవ్యత్వం కోసం పటుపడే ఛానెళ్ళన్నీ ఆ దృశ్యాలను ఒక్కమారైనా ప్రసారం చేయగలిగితే , ఇంకోసారి ఏపార్టీ, ఏయూనియన్ కూడా ఇలాంటి ఆందోళనలక్ సాహసించదు. కానీ సంచలనం ఒక్కటే సమస్తం అనుకునే ఈ పోటాపోటీ ప్రచార వ్యాపార యుగంలో ఇది నెరవేరని కలే.

కానీ, ఏదో ఒకరోజు ‘సామాన్యుడి రోజు’ కూడా వస్తుంది. నిరసనలని వ్యక్తం చేయడానికి ఎంచుకున్న విధానాల ద్వారా వేలాది మంది ప్రజలను అకారణంగా ఇబ్బంది పెట్టే హక్కు వీరికెవరిచ్చారన్న ప్రాధమిక ప్రశ్న ముందుకు వస్తుంది.


అర్భకుడు, అమాయకుడు అనుకున్న ఈ సామాన్యుడే తిరగబడి ‘ఇంకానా’ ఇకపై సాగదు!’ అంటూ హూంకరిస్తూ - తన జీవితంతో ఆటాడుకుంటున్న ‘వర్గాల’ మెడలు వంచే రోజు తప్పక వస్తుంది. తస్మాత్ జాగ్రత్త!

భండారు శ్రీనివాసరావు

NOTE: All images in this blog are copy righted to their respective owners

చిక్కు సమస్యలు - చిరు పరిష్కారాలు - భండారు శ్రీనివాసరావు

చిక్కు సమస్యలు - చిరు పరిష్కారాలు   - భండారు శ్రీనివాసరావు
యాభయ్ ఏళ్ళక్రితానికి - ఇప్పటికీ కొట్టొచ్చినట్టు కనబడే మార్పు ఏమిటి? అని అడిగితే - ఆ రోజుల్లో సినిమా హాళ్ళలో చుట్ట - బీడీ సిగరెట్లు తాగేవారు - ఇప్పుడది లేదని - ఆరు పదులు వయసు దాటిన వారెవరైనా జవాబు చెబుతారు.


అప్పటికీ - ఇప్పటికీ పొగత్రాగేవారి సంఖ్య తగ్గిందా అంటే అదీ లేదు. సినిమా హాల్లో సిగరెట్ తాగితే జరిమానా వేస్తామని బెదిరించారా అంటే అదీ లేదు. అన్ని సినిమా హాళ్ళ వద్ద ప్రత్యేక సిబ్బందిని నియమించి కట్టుదిట్టం చేశారా అని ప్రశ్నించుకుంటే లేదనే సమాధానం వస్తుంది. పొగరాయుళ్ళను పట్టుకుని కౌన్సిలింగ్లూ గట్రా నిర్వహించారా అంటే అదీ లేదు. ప్రేక్షకులతో సమావేశాలు ఏర్పాటు చేసి పొగత్రాగవద్దని క్లాసులు తీసుకున్నారా అంటే ఆ దాఖలాలూ లేవు. మరి పొగత్రాగందే పట్టుమని పది నిమిషాలు ఓపలేని ధూమపాన ప్రియులు సిగరెట్ల జోలికి పోకుండా సినిమాలు ఎలా చూస్తున్నారు?

ఈ ప్రశ్నకి సమాధానం ఒక్కటే. ప్రజల్లో ఓ సుగుణం ఉంది. అది చూసి నేర్చుకోవడం. డేరా టూరింగ్ టాకీసులూ,రేకుల సినిమా హాళ్ళ కాలం ముగిసి ఎయిర్ కండిషన్ థియేటర్ల కాలం మొదలు కాగానే సినిమా హాళ్ళలో పొగత్రాగడం మంచిది కాదని పక్క వాళ్ళని గమనిస్తూ ఎవరికి వారే తెలుసుకున్నారు. ఈ సూత్రాన్నే ట్రాఫిక్ అధికారులు గమనించి అమలు చేస్తే సమస్యలకు సగం పరిష్కారం లభిస్తుంది. లేని పక్షంలో - ఒక దినపత్రిక పేర్కొన్నట్టు -" సమస్యమీదే - పరిష్కారం మీదే మేం నిమిత్త మాత్రులం - ఇదీ ట్రాఫిక్ పోలీసుల వరుస" అనే విమర్శల తాకిడిని తట్టుకోక తప్పదు.

హైదరాబాదులో ట్రాఫిక్

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ని చక్కదిద్దడం అన్నది ఆషామాషీ వ్యవహారం కాదు. కాకపోతే , అందుకోసం తీసుకుంటున్న చర్యలేమిటన్నదే జవాబు లేని- రాని ప్రశ్న.

ట్రాఫిక్ అంశాలపై ఏర్పాటు చేసిన సదస్సులు - సమావేశాల్లో పౌరులు ఏదయినా చెప్పబోతే `సమస్యలు చెప్పమంటే, సలహాలు చెబుతున్నారని' కొందరు అధికారులు విరుచుకు పడిన తీరు గమనిస్తే వారి అసహన వైఖరి తేటతెల్లమవుతుంది. అవగాహన కల్పించే తీరు సరిగా లేదేమో అనిపిస్తుంది. కొన్ని కొన్ని చిన్న చిన్న చర్యలతో సమస్యకు పరిష్కారం లభిస్తుందేమో ప్రయత్నించి చూడడంలో తప్పేమీ లేదని వారు గ్రహించాలి. అన్నింటికంటే ముందు చేయాల్సింది - ట్రాఫిక్ అధికారులు తమ ప్రాధాన్యతలను నిర్ధారించుకోవడం.

రోడ్డు దోపిడీ

 హెల్మెట్లు, సీటు బెల్టులవంటి నిబంధనల అమలుకు తీసుకుంటున్న శ్రద్ధని - కొంతకాలం పాటయినా - ట్రాఫిక్ని చక్కదిద్దడానికి మరల్చాలి. ఎక్కడ - ఏ సమయంలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుందో అధ్యయనం చేసి అందుకు తగ్గట్టుగా అదనపు సిబ్బందిని - ఆయా కూడళ్ళలో - అవుట్ సోర్సింగ్ పద్ధతిపై నియమించాలి. ఈ సిబ్బంది కయ్యే ఖర్చుని ఆయా కూడళ్ళ చుట్టు పక్కల ఉండే దుకాణాలు, నివాస సముదాయాలనుంచి పారదర్శక పద్ధతిలో వసూలు చేయాలి.





రోడ్లు దాటడానికి రాజధాని నగరంలో అనేక చోట్ల ఫుట్ వోవర్ బ్రిడ్జీలు నిర్మించారు. ప్రకటనలకు మినహా - వాటిని జనం ఉపయోగిస్తున్న దాఖలాలు లేవు. స్త్రీ, బాల, వృద్ధులు ఆ వంతెనలు ఎక్కలేరు. ఎక్కగలిగిన వారు, ఎక్కనే ఎక్కరు. అందువల్ల వాటిని మరింత ఉపయోగంలోకి తీసుకురావడానికి వాటికి లిఫ్టులు అమర్చాలి. అందుకయ్యే వ్యయాన్ని కొద్ది కొద్దిగా వినియోగదారుల నుంచి రుసుము రూపంలో రాబట్టుకోవాలి. ఇలాటి ఏర్పాట్లకి వీలులేనిచోట్ల ప్రత్యామ్నాయాలు పరిశీలించాలి. అనేక రద్దీ కూడళ్ల వద్ద రోడ్డుదాటలేక అవస్తలు పడేవారు అనేకమంది కనిపిస్తుంటారు. భవసాగరం కంటే రోడ్డు దాటడమే కష్టంగా భావిస్తుంటారు.ఇలాటి సంగతి పట్టించుకునే నాధుడు కనబడడు.
 బాగా అభివృద్ధిచెందిన ప్రపంచ నగరాలలో అయితే, రోడ్డుదాటడానికి పుష్ బటన్ వ్యవస్తలు వుంటాయి.


రోడ్డుపక్కన వున్న పుష్ బటన్ నొక్కగానే -



రోడ్డు క్రాస్ చేయడానికి వీలుగా దీపం వెలుగుతుంది.



దానితో ఎక్కడి వాహనాలు అక్కడే టక్కున ఆగిపోతాయి.

అంతేకాకుండా
 విద్యుత్ తో కూడా పని లేకుండా - జండాలను ఉపయోగించే ఒక విధానం అమల్లోవుంది. అదేమిటంటే- రోడ్డుకు ఇరువైపులా బాస్కేట్లలో కొన్ని జండాలను ఉంచుతారు. రోడ్డుదాటాలనుకునేవారు ఆ జండాను తీసుకుని ఊపుకుంటూ వెళ్లిపోవచ్చు.

ఎంచక్కా రోడ్డు దాటగానే


అవతలవైపు వున్న బాస్కేట్లో వుంచి తమదారిన వెళ్లిపోవచ్చు.


ఇలాగే, మరికొన్ని ఖర్చులేని పద్దతులు అమలుచేయవచ్చు.

ప్రైవేటు విద్యా సంస్థల వద్ద నిర్మించిన వంతెనల పూర్తి వ్యయాన్ని ఆ సంస్థల నుంచే వసూలు చేయాలి. విద్యార్ధుల నుంచి భారీ మొత్తంలో ఫీజులు పిండుతున్న ఆ సంస్ధలకి ఇదేమంత పెద్దభారం కాబోదు.

థియేటర్లు, పాఠశాలలు, ఆఫీసుల వేళల్లో తగుమార్పులు చేయడం ద్వారా, ఒకే సమయంలో, ప్రజలు, వాహనాలు భారీ సంఖ్యలో రోడ్ల మీదకు రాకుండా నియంత్రించడం వీలుపడుతుంది.

కనిపించిన చోటల్లా `నోపార్కింగ్' బోర్డులు పెట్టకుండా పార్కింగ్ కి అనువయిన స్ధలాలని ముందుగా గుర్తించాలి.


అంతకంటే ముందు
పోలీసు వాహనాలు `నోపార్కింగ్' ప్రదేశాల్లో నిలపకుండా చూడాలి

ప్రయివేటు బస్సులని ఎలాగూ అదుపు చేయలేరు కనుక - రాత్రి సమయాలల్లో కొన్ని కొన్ని విద్యాసంస్తలకున్న ఖాళీ జాగాలలో ప్రయాణీకులను ఎక్కించుకునేందుకు అనుమతి ఇవ్వాలి.


 ఇందుకోసం వసూలు చేసే రుసుముని ఆయా విద్యా సంస్తలకే ఇవ్వాలి. ఇలాచేయడంవల్ల అనేక ప్రాంతాలలో రాత్రివేళల్లో ట్రాఫిక్ జామ్స్ తగ్గిపోతాయి.

స్కూళ్ళకీ, ఆఫీసులకీ వెళ్ళే బిజీ సమయాల్లో చెకింగ్లు జరిపే పద్ధతికి స్వస్తి చెప్పాలి. సిగ్నల్ జంపింగ్ చేసే వాహనదారులను పట్టుకుని భారీ జరిమానాలు విధించాలి. రద్దీ సమయాలని దృష్టిలో పెట్టుకుని ` వీ ఐ పీ ' ల పర్యటనల వేళల్లో మార్పు చేయాలి.

ఇవన్నీ చేసినా, సమస్య నూటికి నూరుపాళ్లు పరిష్కారం కాకపోవచ్చు. కానీ పరిస్థితి కొంతలో కొంత మెరుగు పడడానికీ , పోలీసుల పట్ల ప్రజలకున్న అవగాహన, అభిప్రాయాల్లో సానుకూల మార్పు రావడానికే ఈ చర్యలు ఖచ్చితంగా దోహదం చేస్తాయి.


భండారు శ్రీనివాసరావు

NOTE: All images in this blog are copy righted to their respective owners

12, ఆగస్టు 2010, గురువారం

ఎటు పోయాయ్‌ ఆ రోజులు ? - భండారు శ్రీనివాసరావు

ఎటు పోయాయ్‌ ఆ రోజులు ? - భండారు శ్రీనివాసరావు


కిరోసిన్ లాంతరు  

మా తాత గారి కాలం నాటికి మా వూళ్లో కరెంటు లేదు. ఆముదపు దీపాలు మినహా - కరెంట్‌ బల్బ్ ని కూడా చూడకుండానే ఆయన కాలం చేశారు.
పాతకాలం రేడియో

మా నాన్న గారి కాలం వచ్చేసరికి కరెంట్‌ రాలేదు కానీ - రేడియోలు, గ్రామఫోన్లూ ఉండేవి. కాకపోతే ఆ రేడియోలు - మోటారుకార్లలో వాడే పెద్దసైజు బ్యాటరీల సాయంతో పనిచేసేవి.

బొగ్గు, నీటి ఆవిరితో నడిచే రైలు ఇంజిను

మా వూరి మొత్తం జనాభాలో- ఆరోజుల్లో - యాభయి మైళ్ల దూరంలో వున్న బెజవాడకి వెళ్లి, సినిమా చూసొచ్చిన పెద్దమనిషి ఆయన ఒక్కరే. ఆ మాటకి వస్తే ఆయన తప్ప- రైలుని చూసిన వాళ్ళు కానీ, బస్సు ఎక్కిన వాళ్ళు కానీ, మా వూళ్లో ఎవరూ లేరని కూడా చెప్పుకునే వారు.
ఇక మా అమ్మ-


కట్టెల పొయ్యి

కట్టెల పొయ్యి ముందు కూర్చుని - పొగచూరిన వంటింట్లో పదిమందికి వండి వార్చేది. ఆమె సామ్రాజ్యంలో రకరకాల పొయ్యిలు ఉండేవి. పాలు కాగబెట్టడానికి దాలిగుంట - కాఫీ కాచుకోవడానికి బొగ్గులకుంపటి, వంట చేయడానికి మూడు రాళ్ల పొయ్యి, ఇలా దేనికి దానికి విడివిడిగా ఉండేవి.

నుయ్యి లేక నీళ్ళ బావి

 ఇక పెరట్లో బావి ప్రక్కన స్నానాలకోసం కాగులో నీళ్ళు మరగపెట్టడానికి మరో పెద్ద పొయ్యి సరేసరి. దాలిగుంట విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వంటింటి వసారాలోనే ఓ మూలగా ఉండేది. నిప్పంటించిన పిడకలను ఆ దాలిగుంటలో దొంతరగావేసి పాలకుండని వాటిపై ఉంచి - పైన ఒక రాతిపలకని కప్పేవారు. సన్నటి సెగపై ఆ పాలు తీరిగ్గా కాగేవి. ఎరగ్రా కాగిన ఆ పాలపై - అరచేతి మందాన మీగడ కట్టేది. మర్నాడు - ఆ కుండలోని పెరుగుని నిలబడి వయ్యారంగా కవ్వంతో చిలికేవారు.



 మజ్జిగ నీటిపై తెట్టెలా కట్టిన తెల్లటి వెన్నని చేతుల్లోకి తీసుకుని, అరచేతిలో ఎగురవేస్తూ ముద్దగా చేసేవారు. పక్కన నిలబడి ఆశగా చూసే చిన్న పిల్లలకి చిన్న చిన్న వెన్న ముద్దలు పెట్టే వాళ్ళు . ఆహా ఏమి రుచి! అని లొట్టలు వేస్తూ తినేసి- ఆటల్లోకి జారుకునే వారు. మగవాళ్ల సంగతేమో కానీ, ఆడవాళ్లకి ఆ రోజుల్లో చేతినిండా పనే. భోజనాలు కాగానే - అంట్లగిన్నెలు సర్దేసి - వంటిల్లు ఆవు పేడతో అలికేవారు. బాదం ఆకులతో విస్తళ్ళు కుట్టే వారు. రోకళ్లతో వడ్లు దంచేవారు. ఇంటికి దక్షిణాన ఉన్న రోటిపై కూర్చుని పప్పు రుబ్బేవారు. ఈపనులు చేయడానికి విడిగా పనిమనుషులు ఉన్నా వారితో కలిసి ఈ పనులన్నీ చేసేవారు. వాటితో పాటు శ్రమతెలియకుండా పాటలు పాడుకుండేవారు. విలువ కట్టని వారి శ్రమా, విలువ కోరని వారి నిబద్ధతా చిన్న నాటి జ్ఞాపకాల దొంతర్లలో పదిలంగా ఉండిపోయాయి.

ఇక మారోజులు వచ్చే సరికి - రోజులు పూర్తిగా మారిపోయాయి. కట్టెల పొయ్యిలు పోయి - గ్యాస్‌ స్టవ్‌లు వచ్చాయి. నీళ్ల కాగుల్ని బాయిలర్లు భర్తీ చేశాయి. కరెంట్‌ దీపాలు వచ్చి లాంతర్లని వెనక్కి నెట్టేశాయి.

పుల్ల కలం

 కరక్కాయ సిరాలు- పుల్ల కలాలు తరువాతి రోజుల్లో రూపాలు మార్చుకుని ఫౌంటెన్‌ పెన్నులుగా, బాల్‌పాయింట్‌ పెన్నులుగా అవతరించాయి. రూపాయికి పదహారణాలు అనే లెక్కకాస్తా మా చిన్నతనంలోనే నూరు నయాపైసలుగా మారిపోయింది.

బేడ నాణెం అంటే రూపాయిలో ఎనిమిదోవంతు    

 బేడలూ, అర్ధణాలూ, కాసులూ, చిల్లికాసులూ జేబుల్లోంచి జారిపోయి నిగనిగలాడే రాగి నయా పైసలు, నికెల్‌ నాణేలు చెలామణిలోకి వచ్చాయి. రామాయణ కాలంనుంచీ ఎరిగిన ఆమడలు, కోసులు, మైళ్ళు కాలగర్భంలో కలిసిపోయి, కిలోమీటర్‌ రాళ్ళు రోడ్లపై వెలిసాయి. ఏడాదికోమారు జరిగే తిరుణాళ్లు నిత్యకృత్యంగా మారి - అశ్లీల నృత్యాల వేదికలుగా మారిపోతున్నాయి. కోలాటాలు, పందిరి నాటకాలు, హరికథలు, బురక్రథలు, పిట్టలదొర కథలు చరిత్రపుటల్లో చేరి కనుమరుగవుతున్నాయి.
ఆరోజుల్లో సెలవులు ఇస్తే చాలు - పిల్లలంతా పల్లెటూళ్లకి పరిగెత్తే వాళ్ళు. ఇన్ని రకాల ఆటలుంటాయా అనేట్టు అనేక రకాల ఆటలతో, పాటలతో కాలం గిర్రున తిరిగిపోయేది. అష్టాచెమ్మాలు, తొక్కుడు బిళ్లలు, వామన గుంటలు, వెన్నెలముద్దలు, వైకుంఠపాళీలు, పచ్చీసాటలు, చింతపిక్కలు, బావుల్లో ఈతలు, వాగు ఒడ్డున కబడ్డీ పోటీలు- ఒకటేమిటి - ఒక జీవితానికి సరిపడా ఆనందాన్ని గుండెల్లో నింపేసుకుని- ఇంకా ఇంకా ఇలాగే రోజుల్ని సరదాగా గడపాలన్న కోరికని మనసులోనే చంపేసుకుని - పాడు సెలవులు అప్పుడే అయిపోయాయా అని నిట్టూరుస్తూ బడిబాట పట్టేవాళ్ళు.

ఇక మా పిల్లల కాలం వచ్చేసరికి - మాయాబజారు సినిమాలో మాదిరిగా - కళ్లముందు ప్రపంచం ఒక్క మారుగా మారిపోయింది. గతం తలచుకోవడానికే మిగిలింది. చిన్నతనంలో చూసినవేవీ - ఈనాడు కలికానికి కూడా కానరావడం లేదు. జీవితం, ఇంత చిన్నదా అనిపించేలా, విన్న పదాలు, చూసిన దృశ్యాలు - ఆడిన ఆటలు, పాడిన పాటలు - కనురెప్పలకిందే కరిగి పోతున్నాయి. జ్ఞాపకాల పొరల్లోకి జారిపోతున్నాయి.

జొన్న చేను

ఆ గురుతుల దారుల్లో వెనక్కి వెడుతుంటే - జొన్న చేల నడుమ కాలిబాటలో పరుచుకున్న దోసతీగెలూ
లేత జొన్న కంకుల్ని వొడుపుగా కొట్టి తీసి వేయించిన ఊచ బియ్యం-
రోజూ తినే వరి అన్నానికి - ఎప్పుడో ఒకప్పుడు సెలవిచ్చేసి - పని వాళ్ళు వండిన జొన్నన్నంతో కూడిన మృష్టాన్న భోజనం-
కళ్లాల„సమయంలో - కొత్త వడ్లు కొలిచి - కొనుక్కుతినే కట్టె మిఠాయి-
సాయంత్రం చీకటి పడేవేళకు - మైకులో ఊరంతా వినవచ్చే పంచాయితీ రేడియోలో సినిమా పాటలు-వెన్నెల్లో ఆరుబయట నులకమంచాలపై పడుకుని ఊ కొడుతూ వినే అమ్మమ్మ కథలూ-
ఏవీ ! అవేవీ! ఎక్కడా కనబడవేం! ఇవన్నీ ఒక నాడు వున్నాయని అన్నా -



 కంప్యూటర్లతో ఒంటరిగా ఆడుకునే ఈనాటి పిల్లలు నమ్ముతారా?? కళ్లతో చూసిందే నమ్ముతాం అని వాళ్లంటే మీరేం చేస్తారు?



NOTE: All images in this blog are copy righted to their respective owners






























































..........................................