ఇందిరాగాంధీ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఇందిరాగాంధీ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, జులై 2017, గురువారం

అధికారం చుట్టూ ఈగలు



ఓ నలభయ్ ఏళ్ళ క్రితం కేబినెట్ మంత్రిగా చేసిన పీ. నరసారెడ్డి   చాలా ఏళ్ళ క్రితం ఏదో ఫంక్షన్ లో కలిసారు.  రేడియో విలేకరిగా నాకు ఆయనతో సన్నిహిత పరిచయం వుండేది. చాలా కాలం తరువాత మళ్ళీ ఇదే కలవడం. వృద్ధాప్యపు ఛాయలు మినహా మానసికంగా ఆయన గట్టిగానే కనిపించారు. గతం బాగానే  గుర్తున్నట్టు వుంది. అలనాటి విషయాలు కాసేపు ముచ్చటించారు. ‘ఎలా వున్నారు’ అనే నా ప్రశ్నకు ఆయన ఇలా జవాబిచ్చారు.
“హై కోర్టులో బార్ రూమ్ అనేది వుంటుంది. యువ లాయర్లతో పాటు వయసు ఉడిగిన మాజీ అడ్వొకేట్లు కూడా అక్కడ కనిపిస్తారు. నిజానికి వారికి వాదించే కేసులు ఏమీ వుండవు. ఇంట్లో ఉబుసుపోక అక్కడికి చేరి కాసేపు కాలక్షేపం చేసి ఇళ్ళకు వెడతారు. నేనూ అంతే. అప్పుడప్పుడూ పార్టీ ఆఫీసుకు వెడతాను. నేను ఎవరన్నది మా  పార్టీలోనే చాలామందికి తెలియదు. తెలిసిన వాళ్ళు కూడా తెలియనట్టు తప్పుకుంటారు. ఒక్కోసారి బాధ వేస్తుందని చెప్పారు. కానీ  గొప్పనాయకులని తలచుకుంటే, వారితో పోల్చుకుంటే తన పరిస్తితి చాలా మెరుగని చెప్పారు.
కంటి చూపుతో దేశ రాజకీయాలని, ఒంటి చేత్తో జాతీయ పార్టీని శాసించిన ఇందిరాగాంధీ దివి తుపాను బాధితులను పరామర్శించడానికి రాష్ట్రానికి  వస్తే,  కొంత కాలం క్రితం వరకు ఆమె కనుసన్నల్లోనే పనిచేసి ఎమర్జెన్సీ పుణ్యమా అని సమర్దుడయిన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న జలగం వెంగళరావు, మాజీ ప్రధాని అని కూడా చూడకుండా ఆమెకు గెస్ట్ హౌస్  సౌకర్యం కల్పించడానికి నిరాకరించిన సందర్భాన్ని ఆ మాజీ మంత్రి ప్రస్తావించారు. ఆవిడతో పోల్చుకున్నప్పుడు తన పరిస్తితి చాలా మెరుగని చెప్పారు. ఇందిరాగాంధీకి జరిగిన అవమానానికి నిరసనగా ఆనాడు వెంగళరావు మంత్రివర్గం నుంచి కార్మిక మంత్రి టి.అంజయ్య రాజీనామా చేసిన సంగతిని ఆయన గుర్తు చేసుకున్నారు. 
ఆయన్ని కలిసివచ్చిన తరువాత ఇందిరకు సంబంధించి ఇలాంటిదే మరో ఉదంతం నాకు జ్ఞాపకం వచ్చింది.
ఓసారి ఇందిరాగాంధి మాజీ ప్రధాన మంత్రిగా ఖమ్మం  జిల్లాలో ఎన్నికల ప్రచారానికి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో మారిన సమీకరణాల  కారణంగా ఆవిడను ఘనంగా కాకపోతే పోనీండి,  ఓ మోస్తరుగా రిసీవ్ చేసుకునే నాయకులు కూడా లేకపోయారు. ఓ గెస్ట్ హౌస్ లో బస చేసినప్పుడు అప్పట్లో ఓ చోటా కాంగ్రెస్ నాయకుడు ఈశ్వరలింగం ఆమె బ్రేక్ ఫాస్ట్  కోసం  దగ్గర్లో ఓ హోటల్ నుంచి  ఇడ్లీ వడ తెప్పించి పెట్టారు. వాటితో పాటు ఇచ్చిన ఓ సత్తు చెంచాతో తినలేక, దాన్ని పక్కన పడేసి, చేత్తో తినడం అలవాటు లేకపోయినా ఇబ్బంది పడుతూనే   ఇందిరాగాంధి తిన్నారని దానికి ప్రత్యక్ష సాక్షి  అయిన కౌటూరు దుర్గాప్రసాద్ చెప్పారు. ఆవిడ టిఫిన్ చేస్తున్నప్పుడు పక్కన కూర్చున్న వారిలో పాలేరు సమితి మాజీ అధ్యక్షులు రావులపాటి సత్యనారాయణ రావు గారు (మాజీ ఐజీ రావులపాటి సీతారామారావుగారి తండ్రి) వున్నారు.  
ఆరోజుల్లో శ్రీమతి గాంధి రాజకీయంగా వొంటరి. కాంగ్రెస్ పార్టీని చీల్చి కాంగెస్ (ఐ) పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేశారు. అప్పటివరకు ఆమెకు వీర విధేయుడిగా వున్న ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ఆమెతో విభేదించి పాత కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు. ఇక ఆవిడను ఖమ్మం పర్యటనలో కనుక్కునే నాధుడు యెవ్వడు?
ఆవిడ వెంట వచ్చిన మర్రి చెన్నారెడ్డి, జీ వెంకటస్వామి  మొదలయినవాళ్ళు శ్రీమతి గాంధీని హిల్ బంగ్లా లో దింపి, అక్కడ  వసతి సరిపోకనో యేమో, మన్నెగూడెం వెంకటరెడ్డి ఇంటికి వెళ్లారు. అంచేత ఆవిడకు  బ్రేక్ ఫాస్ట్  ఏర్పాటుచేసే  బాధ్యత చిన్న నాయకుల మీద పడింది.
మొత్తం మీద  ఇందిరాగాంధీ ఖమ్మం ఎన్నికల సభ బాగా జరిగింది. కాంగ్రెస్ లో సిండికేటుగా పిలవబడే అగ్రనాయకులందరూ కలసి తనని వొంటరిదాన్ని చేసి బయటకు పంపారని శ్రీమతి గాంధి చేసే వాదనను జనం నమ్మారు. అందరూ ఒక్కటై ఈమెను వేదిస్తున్నారన్న నమ్మకం ప్రబలసాగింది. గెస్ట్ హౌస్ పక్కనే ఉన్న పెవిలియన్ మైదానం  చాలా ముందుగానే జనంతో కిక్కిరిసిపోయింది. రాత్రి ఏడు గంటలకు రావాల్సిన శ్రీమతి గాంధి మరునాడు ఉదయం ఖమ్మం వచ్చారు. అయినా సభకు వచ్చిన  ఎవ్వరూ అక్కడనుండి కదలలేదు. ఆవిడ ఖమ్మం సభలో ప్రసంగిస్తూ వున్నప్పుడే కాంగ్రెస్ (ఐ) పార్టీకి హస్తం గుర్తు’  కేటాయించినట్టు కబురు వచ్చింది.

కొసమెరుపు ఏమిటంటే ఆరోజు పెవిలియన్ మైదానంలో అమ్ముడు పోయిన మిర్చి బజ్జీలు అప్పటికీ ఇప్పటికీ ఒక రికార్డుగా చెప్పుకుంటారు.

14, సెప్టెంబర్ 2010, మంగళవారం

రేడియో రోజులు - 6 - భండారు శ్రీనివాసరావు

రేడియో రోజులు - 6   - భండారు శ్రీనివాసరావు

“ఏమయినా చెప్పు! రెడ్డి సాబ్ టేస్టే టేస్టు! ఈ కుర్చీ చూడు ఎంత గొప్పగావుందో!” - అన్నారు ముఖ్యమంత్రి ఆ కుర్చీలో అటూ ఇటూ కదులుతూ.

అంజయ్య గారిది పిల్లవాడి మనస్తత్వం. ఇందిరాగాంధీ దయవల్ల తాను ముఖ్యమంత్రిని అయ్యానన్న భావం ఆయనలో వుండేది. దాన్ని దాచుకోవడానికికానీ, లేనిపోని భేషజం ప్రదర్శించడానికి కానీ ఎప్పుడూ ప్రయత్నించేవారు కాదు. ప్రతి సందర్భంలో ‘అమ్మ అమ్మ’ అంటూ ఆమెని హమేషా తలచుకుంటూనే వుండేవారు.

చెన్నారెడ్డి గారి వంటి చండశాసనుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన తరవాత ఆ స్తానంలో మేదకుడయిన అంజయ్య గారిని ఊహించుకోవడం రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులకు ఒక పట్టాన మింగుడుపడేది కాదు. ఆయన గురించి తేలిగ్గా మాట్లాడుకునేవారు. ఈ విషయం ఇందిరాగాంధీకి తెలియకుండా వుంటుందా. వెంటనే ఒకరోజు ఆమె పనికట్టుకుని హైదరాబాదు వచ్చారు. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం ఏర్పాటు చేసారు. మామూలుగా ఈ మీటింగులు శాసనసభ ఆవరణలో జరుగుతుంటాయి. కానీ ఈ సారి ఆ సంప్రదాయానికి విరుద్ధంగా అంజయ్యగారు ముఖ్యమంత్రిగా నివాసం వుంటున్న ‘జయప్రజాభవన్’ (గ్రీన్ లాండ్స్ గెస్ట్ హౌస్) లో నిర్వహించారు. ఇందిరాగాంధీ ఆ సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి ఇంట్లో సమావేశం జరిపి అందులో మాట్లాడడం ద్వారా ఆమె కాంగ్రెస్ వాదులందరికీ ఒక స్పష్టమయిన సందేశం పంపారు. అంతే! అంజయ్య గారిని గురించి అంతవరకూ తేలికగా మాట్లాడిన వారందరూ నోళ్ళు కుట్టేసుకున్నారు.

ఎందుకో ఏమో కారణం తెలియదు కాని, నా పట్ల ఆయన అపారమయిన వాత్సల్యం చూపేవారు. ఒక్కోసారి ఈ ప్రవర్తన ఇరకాటంగా వుండేది. ముఖ్యమంత్రిని కలవడానికి ఎవరెవరో వస్తుంటారు. ఏదయినా చెప్పుకోవాలనుకుంటారు. అక్కడ నాలాటి బయటవారువుంటే ఇబ్బంది. పైగా విలేకరిని. కానీ ఆయన నన్ను తన చాంబర్ నుంచి అంత తేలిగ్గా కదలనిచ్చేవారు కాదు. “వెడుదుగానిలే! కాసేపు కూర్చో!” అనేవారు నేను లేవగానే. ఇబ్బంది పడుతూనే కూర్చుండిపోయేవాడిని పనేమీ లేకపోయినా.

అంజయ్య గారు గతంలో వెంగళరావుగారి మంత్రివర్గంలో – కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. కార్మికుల సంక్షేమం గురించి అహరహం ఆలోచిస్తుండేవారు.

పురుళ్ళ ఆసుపత్రిలో ‘లేబర్ రూము’ పై అంజయ్య గారి జోకు సుప్రసిద్ధం. లేబర్ మినిస్టర్ గా ఈ ఎస్ ఐ ఆసుపత్రికి వెళ్లారట. అక్కడ మెటర్నిటీ వార్డులో పురుళ్ళ గదికి ‘లేబర్ రూం’ అని బోర్డు వుండడం చూసి ఆయన సంతోషపడి తన ఆనందాన్ని దాచుకోలేక ‘చూసారా ఈ ఆసుపత్రిలో లేబరోళ్లకోసం ప్రత్యెక ఏర్పాట్లు వున్నాయి” అనేశారట.

ఆయన అమాయకత్వాన్నిబట్టి ఇలాటి జోకులు పుట్టివుంటాయి కానీ, అంజయ్య గారు విషయాలను యెంత నిశితంగా పరిశీలించేవారో నాకు తెలుసు.

ఒకసారి కౌలాలంపూర్ లో తెలుగు మహాసభలు జరిగాయి. ప్రారంభోత్సవ కార్యక్రమం ముగిసిన తరవాత అంజయ్య గారు హోటల్ రూముకి తిరిగొచ్చేసారు. వెంట షరా మామూలుగా నేను. కాస్త నలతగా కనిపించారు. అంత పెద్ద గదిలో ఆయనా నేను ఇద్దరమే. సాయంత్రం అవుతోంది. ఆయన దీర్ఘంగా ఆలోచిస్తూ కిటికీలోనుంచి బయటకు చూస్తున్నారు. విశాలమయిన రోడ్డు. వచ్చే కార్లు. పోయే కార్లు. పక్కనే ఏదో ఫ్యాక్టరీ లాగావుంది.

ఆయన వున్నట్టుండి “చూసావా!” అన్నారు. నాకేమీ అర్ధం కాలేదు.

“పొద్దున్న బయలుదేరేటప్పుడు చూసాను. అందులో (ఆ ఫ్యాక్టరీ లో) పనిచేసేవాళ్లందరూ గంట కొట్టినట్టు టైము తప్పకుండా వచ్చారు. అయిదు నిమిషాల్లో లోపలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్లీ అంతే. షిఫ్ట్ పూర్తికాగానే ఠంచనుగా ఇళ్లకు పోతున్నారు. పనిచేసేవాళ్లకు వాళ్లకు కావాల్సింది ఇవ్వాలి. కావాల్సిన విధంగా పని చేయించుకోవాలి. ఇలా మన దగ్గర కూడా చేస్తే కావాల్సింది ఏముంటుంది!” అన్నారాయన యధాలాపంగా.

అంటే ఇప్పటిదాకా ఆయన ఆలోచిస్తోంది ఇదన్నమాట.

‘కౌలాలంపూర్ తెలుగు మహాసభల ఏర్పాట్లలో రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించలేదనీ, ఇందిరాగాంధీ ఈ విషయంలో ముఖ్యమంత్రి పట్ల చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారనీ’ – హైదరాబాదులో ఒక పత్రిక రాసిన విషయం ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా తెలుసుకున్న అంజయ్య గారికి “రాజకీయ జ్వరం” పట్టుకున్నట్టు అప్పటికే గుసగుసలు మొదలయ్యాయి. అందుకే ఆయన సభా ప్రాంగణంలోనే వుండిపోకుండా వొంట్లో బాగోలేదనే నెపంతో హోటల్ రూముకి తిరిగొచ్చేసారని వదంతులు హైదరాబాదు దాకా పాకాయి. ఈయనగారేమో ఇక్కడ తాపీగా కూర్చుని కార్మికులు గురించి ఆలోచిస్తున్నారు. అలావుండేది అంజయ్య గారి వ్యవహారం. (13-09-2010)
   

14, ఆగస్టు 2010, శనివారం

కన్నుపొయ్యే కాటుకెందుకు? - భండారు శ్రీనివాసరావు

కన్నుపొయ్యే కాటుకెందుకు? - భండారు శ్రీనివాసరావు


ఆరోజు మంత్రి వర్గం సమావేశమౌతోంది. మధ్యాహ్నం పన్నెండు తర్వాత ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడతారని కబురొచ్చింది. అందరం బిలబిలమంటూ సచివాలయంలోని ముఖ్యమంత్రి ఛాంబర్‌కు చేరుకున్నాం. విలేకరులు, అధికారులతో సమావేశాలు నిర్వహించేందుకు ఆ ఛాంబర్‌ ప్రక్కనే ఒక చిన్న హాలు ఉండేది.



ఆ నాటి ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి అంజయ్య 

ఓ అరగంట తర్వాత అప్పటి ముఖ్యమంత్రి శ్రీ అంజయ్య ఆ హాల్లోకి వచ్చారు. విలేకరులందరినీ పేరుపేరునా పలకరిస్తూ మామూలు కబుర్లలో పడిపోయారు. మధ్యమధ్యలో ఏం మొయిన్‌ ! (మొయినుద్దీన్‌ - ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి) అందరికీ అన్నీ (కాఫీ టిఫిన్లు) అందాయా? అని వాకబు చేస్తున్నారు. అప్పటికి దాదాపు ఒంటిగంట కావస్తుండడంతో చివర్లోకూర్చున్న నాలో అసహనం పెరిగిపోతోంది. మరో పదిమిషాల్లో మధ్యాహ్నం ప్రాంతీయ వార్తలు మొదలవుతాయి. ఈ బులెటిన్‌ తప్పిపోతే మళ్లీ సాయంత్రందాకా దిక్కులేదు. కానీ అంజయ్యగారి కబుర్లు ఒక పట్టాన తేలేలా కనిపించడంలేదు. చివరికి ఏదయితే అదే అయిందని లేచి ఆయన దగ్గరకు వెళ్లాను. వార్తల టైమ్‌ అవుతోందని చెప్పేసి- ఏం చెప్పదల్చుకున్నారో ఒక్క ముక్కలో చెప్పండని కోరాను. దానికాయన పెద్దగా నవ్వేస్తూ `చెప్పడానికేముంది - మంత్రులందరూ (రాజీనామాలు) ఇచ్చేశారు' అని సైగలతో చెప్పేశారు. నేను రయ్‌ మంటూ బయటకు పరుగెత్తి - ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి రేడియోకి ఫోన్‌ చేసి మంత్రుల రాజీనామా వార్తని అందించాను.
ఇదంతా ఎందుకు చెప్పాల్సివస్తోందంటే - విలేకరులు వార్తలను అందించే తొందర్లో ఎలా తప్పుల్ని తొక్కుతారో అన్నది తెలియ చెప్పడానికే.




అంజయ్యగారి మంత్రి వర్గాన్ని `జంబోక్యాబినెట్‌' అని ఎద్దేవా చేసేవారు. అరవైమంది మంత్రులేమిటి - విడ్డూరం కాకపోతే అనేవారు. కార్టూన్ల సంగతి సరేసరి. అయినా, ప్రతిదీ తేలిగ్గా తీసుకునే తత్వం ఆయనది. యాదగిరి (హెలికాప్టర్‌)తో తనను ముడిపెట్టి ఒక దినపత్రికలో ప్రచురించే వ్యంగ్య చిత్రాలను కూడా  నవ్వుతూ  ఆస్వాదించే మనస్తత్వం ఆయనది.


`వెనకటి రోజుల్లో జిల్లాకు ఒకే ఒక్క అయ్యేఎస్‌ ఆఫీసర్‌ (జిల్లాకలెక్టర్‌) ఉండేవాడు. ఇప్పుడో - ఇద్దరు ముగ్గురు అలాంటి అధికార్లు జిల్లాల్లో పనిచేస్తున్నారు. అలాంటప్పుడు జిల్లాకు ఇద్దరు మంత్రులు వుంటే తప్పేంటి `శ్రీనివాసూ' అనేవారు ఆంతరంగిక సంభాషణల్లో.

ఇక వార్తల్ని అందించడంలో తొందరపాటు విషయానికి వస్తే ఆ రోజు నేను హడావిడిలో అరవైమంది మంత్రులు రాజీనామా చేశారని చెప్పాను. రేడియోలో కూడా అలాగే ప్రసారమైంది. నిజానికి ముఖ్యమంత్రితో కలిపి మంత్రివర్గంలో సభ్యులసంఖ్య అరవై. 59 మంది మంత్రులే ఆరోజు రాజీనామా చేశారు. సాయంత్రం వార్తల్లో ఈ తప్పు సవరించుకున్నామనుకోండి. ఇలాంటి పొరపాట్లే మరికొన్ని తరహా వార్తల విషయంలో జరిగితేనే వస్తుంది చిక్కంతా.

శ్రీమతి ఇందిరా గాంధి

శ్రీమతి ఇందిరాగాంధీని హత్యచేసినప్పుడు చాల సేపటివరకూ రేడియో ఆ వార్తని వెల్లడించలేదు. ఆవిడ మరణవార్తని జాతికి తెలియచెయ్యడంలో తాత్సారం జరిగిందని దరిమిలా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రధానిపై కాల్పులు జరిగాయన్న వార్త బయటకు పొక్కింది కానీ అసలేం జరిగిందన్న దానిపై అందరికీ తీరని సందేహాలే. చివరికి రాజీవ్‌ గాంధీ కూడా శ్రీమతి ఇందిరా గాంధీ మరణం గురించి బీ బీ సీ వార్తలు విని ధృవపరుచుకున్నారు.

శ్రీమతి గాంధి పార్ధివ శరీరం 

 ఆమెపై కాల్పులు జరిపిన అంగరక్షకుల్లో ఒక సిక్కు మతస్తుడు ఉన్నాడన్న సంగతిని రేడియో వార్తల్లో ముందు వెల్లడించలేదు. అందువల్ల - అప్పటివరకూ అందరి మనసుల్లో ఆందోళన - అలజడి తప్పిస్తే అంతా ప్రశాంతమే. కానీ కాల్పులు జరిపిన అంగరక్షకుల్లో ఒకడిపేరు `బియాంత్‌ సింగ్‌' అన్న విషయం వెల్లడి కాగానే ఒక్కసారిగా అంతా తారుమారయింది. పరిస్థితులు వర్ణించలేనంత భీభత్సంగా పరిణమించాయి. ఎక్కడో ఢిల్లీలో జరిగిన ఘాతుకానికి దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల్లో ప్రయాణించే సిక్కు ట్రక్కు డ్రైవర్లు ఊచకోతకు గురయ్యారు. అవేశకావేశాల ముందు వివేకం, విచక్షణ తలవంచాయి.

శ్రీమతి గాంధి హత్యానంతరం జరిగిన అల్లర్లలో ఒక దృశ్యం

ఎవరో చెప్పినట్టు ట్యూబునుంచి పేస్టు బయటకు తీయగలమే కానీ మళ్లీ అందులో పెట్టలేం. అలాగే పేల్చిన తూటా కూడా.


నిజమే. వార్తను వెనువెంటనే అందించాలన్న కర్తవ్యదీక్షని మెచ్చుకుని తీరాల్సిందే. కానీ సామాజిక బాధ్యత సంగతేమిటి? పగలసెగలు రగిలించి, వ్యధలు మిగిలించి, విపరీత పరిణామాలకు దారితీసే అవకాశం ఉన్న సమాచారాన్ని తొక్కి పెడితే వచ్చే నష్టం ఏమిటి?
భయంకరమైన పోటీ వాతావరణంలో పయనిస్తున్న ఈనాటి మీడియా మనుగడకు ఎంతో కొంత మేరకు సంచలనాత్మక కథనాలు అవసరమే. కాకపోతే టీ ఆర్‌ పీ రేటింగ్‌లతో పాటు విశాల జనహితాన్ని పట్టించుకోవడం కూడా ఆవశ్యకమే! కాదంటారా!

భండారు శ్రీనివాసరావు


NOTE: All images are copy righted to their respective owners.