వార్తవ్యాఖ్య లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
వార్తవ్యాఖ్య లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18, అక్టోబర్ 2010, సోమవారం

చర్చించి వగచిన ఏమి ఫలము? - భండారు శ్రీనివాసరావు

చర్చించి వగచిన ఏమి ఫలము? - భండారు శ్రీనివాసరావు

ఈ మధ్య మా పక్క వాటా లోకి తెలుగు వచ్చీ రాని పొరుగు రాష్ట్ర కుటుంబం ఒకటి అద్దెకు దిగింది. వచ్చిన దగ్గరనుంచి వాళ్ళను ఒక సందేహం పీడిస్తున్నట్టుగా ఇటీవలే అర్ధం అయింది. మా ఇంట్లో వుండేది నేనూ మా ఆవిడా ఇద్దరమే. పిల్లలిద్దరూ వేరే వూళ్లలో కాపురాలు వుంటున్నారు. అటువంటప్పుడు ‘ఉదయం నుంచి రాత్రిదాకా అరుపులు, కేకలు వినవస్తాయేమిట’ని పొరుగింటావిడ, మా ఇంటావిడని అంటే మా ఆవిడని ఆరా తీసింది. అదంతా టీవీ చానళ్ళలో వస్తుండే చర్చలలోని రచ్చని తెలుసుకుని ఆశ్చర్య పోవడం పొరుగావిడ వంతయింది.

ఆకాశవాణి, దూరదర్శన్ లలో ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ అనే ఒక ఉద్యోగి వుంటారు. మామూలుగా డ్యూటీ ఆఫీసర్ అని పిలిచే ఆ ఉద్యోగి డ్యూటీ ఏమిటంటే – రేడియోలో ప్రసారం అయ్యే లేదా దూరదర్శన్ లో టెలికాస్ట్ అయ్యే ప్రోగ్రాములను ఆమూలాగ్రం శ్రద్ధగా విని, చూసి - తప్పొప్పులను పట్టుకుని, మంచి చెడులను గమనించి ఏరోజుకారోజు పై అధికారులకు రిపోర్ట్ చేయడం. రేడియో వినడానికి ప్రత్యేకంగా ఉద్యోగి అవసరమేమిటని కొందరు అడిగేవారు కూడా. బహుశా అలాటి ఏర్పాటు – ఈనాటి ప్రైవేట్ చానళ్ళలో లేకపోబట్టే ఇలాటి ‘చర్చలు’ రచ్చరచ్చగా తయారవుతున్నాయేమో!

ఇటీవల ఒక ఛానల్లో చర్చలో పాల్గొంటున్న ఇద్దరి మధ్య ఆవేశకావేశాలు పెచ్చరిల్లాయి. మాటల తూటాలు పేలాయి. అసభ్య పదజాలాలు జాలువారాయి. ఏతావాతా ఆ మహత్తర దృశ్యాలను పన్నుకట్టకుండా చూసి వినోదించగల అవకాశం వీక్షకులకు లభించింది. పోతే, ఈ కధ టీవీ సీరియల్ మాదిరిగా సాగిసాగి పోలీస్ స్టేషన్ వరకు చేరడం వేరే కధ. కాకపోతే, విషయం అర్ధం కాని మా పొరుగింటావిడ లాంటి వాళ్ళు – పక్కింట్లో యేవో గొడవలు జరుగుతున్నాయని అపోహపడే దుస్తితి దాపురించడం దీనికి పరాకాష్ట.

ఈ మధ్య ఓ శుభకార్యం లో తారసపడిన ఓ పెద్దమనిషి అడిగాడు ‘ఎందుకండీ ఇలా చానళ్ళ వాళ్ళు ‘ఉప్పూ నిప్పూ లాటి మనుషులను చర్చలకు పిలుస్తారు?’ అని. సుతీ మతీ కుదరని ఇలాటివాళ్ళ వల్ల చర్చ పక్కదారి పడుతుందన్నది ఆ పెద్దమనిషి ఉద్దేశ్యం.

పైకి చెప్పలేకపోయినా, ఈ చర్చల్లో పాల్గొనే అనేకమంది జర్నలిష్టుల అభిప్రాయం కూడా ఇదే.

అసలే చిటపటలు. వీటికి ఆజ్యం పోయడానికి తయారుగా ఫోన్ ఇన్ లో మరికొందరు సిద్ధంగా వుంటారు. వీరందరినీ సర్డుబాటు చేయడానికీ, సముదాయించడానికీ యాంఖర్ సతమతమవుతుంటాడు. వాద ప్రతివాదాలు ముదిరి, ఖండన ముండనలుగా మారి, దుమ్మెత్తి పోసుకోవడాల్లోకి దిగి, వీధి కొళాయిల వద్ద తంతుని డ్రాయింగ్ రూముల్లో చూసే భాగ్యం వీక్షకులకు దొరుకుతోందని మరి కొందరి ఉవాచ.

‘ఇది ఇంతేనా? అంటే - ఇప్పటికింతే!’ అనుకోవాలి.

మెరుగయిన సమాజ నిర్మాణాలు స్క్రోలింగ్ లకే పరిమితమై పోయి, రేటింగులే ప్రధానమనుకున్నప్పుడు - ఇది ఇంతే!

ఎన్ని చానల్స్ వచ్చినా, వాటి నిర్వాహకులు యెంత లబ్ధ ప్రతిష్టులయినా – ఇది ఇంతే!

ఈ పోటా పోటీ ‘పోటీ యుగం’లో పోటీ తప్పనిసరి. పాట్లూ తప్పనిసరి. బోధి వృక్షాలు కూడా జ్ఞానోదయం కలిగించలేని విషమ పరిస్తితి. తప్పని సరి అనుకున్నప్పుడు ఆనందించమన్న సామెత మాదిరిగా చూసి తరించడమే వీక్షకులకు మిగిలింది.

‘చర్చించి వగచిన ఏమి ఫలము?’

2, సెప్టెంబర్ 2010, గురువారం

విన్నంతలో కన్నంతలో - అమెరికా - 7 - భండారు శ్రీనివాసరావు

 కలల లోకంలో కాసేపు -

“పాడు ఉద్యోగం ఎన్నాళ్ళు చేస్తాం” అని ఈసురోమనే వాళ్ళు కూడా పదవీ విరమణ ఘడియ దగ్గరపడేటప్పుడు – ‘పొడిగింపు’ కోసం నానా తంటాలు పడడం కద్దు. ఏడుపదుల వయస్సు వచ్చేవరకూ ‘ఏమి జీవితమూ దుర్భరమూ ‘ అని తత్వాలు పాడుకున్నవాళ్ళు – తరవాత్తరవాత – తత్వం మార్చుకుని - “కొద్దిగా మనుషుల్ని ఆనవాలు పట్టే చూపు దేవుడు ఇస్తే బాగుండు” అనుకుంటూ బతుకు మీద మళ్ళీ తీపి పెంచుకునేవాళ్ళు సయితం కనబడుతుంటారు. ఇప్పుడు ఆరుపదులు దాటిన తరవాత అమెరికావచ్చి- బెల్ వ్యూ లో  మా మనుమరాళ్ళు చదువుకునే ప్రభుత్వ పాఠశాల చూసిన తరవాత నాకూ అలాటి అభిలాషే ఒకటి కలిగింది.

బెల్ వ్యూ వుడ్ రిడ్జ్ ప్రాధమిక పాఠశాల

 ‘మరుసటి జన్మలో అమెరికాలో పుట్టి ఇక్కడే చదువుకుంటే యెంత బాగుంటుందో కదా!’ అన్నదే ఆ కోరిక. అలాటి స్కూల్లో చదువుకుంటున్న మా మనుమరాళ్ళని చూసి కాస్తంత అసూయ పడ్డానేమో అని కూడా అనుమానం.

మన దేశంలో కూడా ఈ మాదిరి స్కూళ్ళు లేకపోలేదు. కానీ అవి పెట్టి పుట్టిన వాళ్ళకే పరిమితం. కూలీ నాలీ చేసుకుంటూ కలో గంజో తాగి పిల్లలను మంచి స్కూళ్ళల్లో చదివించే పేదలు కూడా మన దగ్గరవున్నారు. కానీ – ఇంగ్లీష్ మీడియం కాన్వెంటు స్కూళ్ళ పేరుతొ’ పల్లెటూళ్ళల్లో సయితం కాలు  పెడుతున్న అలాటి స్కూళ్ళన్నీ డబ్బు చేసుకునేందుకు, డబ్బు దోచుకునేందుకు తప్ప అసలు సిసలు చదువుకు పనికొచ్చేవి కావు.

ఇక్కడి విద్యాలయాల్లో చదువుకన్నా వ్యక్తిత్వవికాసానికి (personality Development) ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్టు అనిపించింది. గట్టిగా చదివించి- ట్యూషన్లు పెట్టించి – “ఎమ్సెట్” ఒక్కటీ గట్టెక్కితే చాలనుకునే ధోరణి ఇక్కడి పేరెంట్లలో కానరాదు. ఆ అవసరం కూడా వారికి లేదనుకోండి. మరో విశేషం ఏమిటంటే సర్కారు బళ్ళల్లో (ఇక్కడ పబ్లిక్ స్కూళ్ళు అంటారు.ఇవి పూర్తిగా ప్రభుత్వ ఆజమాయిషీలో నడుస్తాయి) హైస్కూలు స్థాయి వరకూ సెంట్ ఖర్చులేకుండా చదువుకునే వీలుంది.

సమాజంలో ఉన్నత స్తాయి వర్గాలవాళ్ళు కూడా తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్ళలో కాకుండా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చేర్పించడానికి ప్రాధాన్యం ఇస్తారు. ఎందుకంటే - వసతుల విషయంలో, నిపుణత కలిగిన అధ్యాపకుల విషయంలో కొండొకచో సర్కారు బడులే ప్రైవేటు స్కూళ్ళను తలదన్నేలా వుంటాయి.

ఫెడరల్ గవర్నమెంట్ (కేంద్ర ప్రభుత్వం), స్తానిక (రాష్ట్ర) ప్రభుత్వాలు - విద్యారంగానికి ఇస్తున్న ప్రాధాన్యత కారణంగానే ఈ అసాధ్యం సుసాధ్యం అయిందని అనుకోవచ్చు. ప్రతి స్టేట్ లోను విద్యారంగం నిర్వహణ కోసం ‘స్కూలు డిస్ట్రిక్టుల’ను ఏర్పాటు చేసారు. తమ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను ఈ వ్యవస్థ పర్యవేక్షిస్తుంది. విద్యాప్రమాణాలను బట్టి ఆయా స్కూళ్లకు ఫెడరల్ గవర్నమెంట్ ప్రత్యెక నిధులను ‘ఇన్నోవేషన్ ఫండ్’ నుంచి గ్రాంట్ రూపంలో ఇస్తుంది.ఈ ఏడాది వంద మిలియన్ డాలర్ల బడ్జెట్ కేటాయించింది. ఉదాహరణకు – బెల్ వ్యూ స్కూలు డిస్ట్రిక్టు కింద వున్న సమ్మాయిష్ హైస్కూలుకు ఈ నిధి నుంచి నలభై లక్షల డాలర్ల గ్రాంటు లభించింది. దేశ వ్యాప్తంగా పోటీ ప్రాతిపదికపై నిర్వహించిన ఈ ఎంపిక ప్రక్రియకు పదిహేడు వందల ధరఖాస్తులు రాగా వాటిలో ఉత్తమంగా ఎన్నిక చేసిన 49 స్కూళ్ళలో ఇది ఒకటి. ఇలాటి పోటీల వల్ల సర్కారు బడుల్లో నాణ్యతా ప్రమాణాలు నానాటికీ పెరిగిపోతూ వస్తున్నాయి. న్యూస్ వీక్ పత్రిక విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం – అమెరికా లోని వంద ఉత్తమ పాఠశాలల్లో అయిదు హైస్కూళ్ళు బెల్ వ్యూ స్కూలు డిస్ట్రిక్టు లోనే వున్నాయి.

వుడ్ రిడ్జ్ మరో  దృశ్యం

ప్రైవేటు స్కూళ్ళలో మాదిరి గానే వసతులు, చక్కటి భవనాలు, క్రీడా మైదానాలు కలిగివుండడం వల్ల ప్రభుత్వ స్కూళ్లను చిన్న చూపు చూసే పద్దతి ఇక్కడ కానరావడం లేదు. బెల్ వ్యూ లోని వుడ్ రిడ్జ్ ఎలిమెంటరీ స్కూలు ఇందుకు ఉదాహరణ. సహజ కాంతి వుండేలా తీర్చిదిద్దిన స్కూలు భవనం, వాల్ టు వాల్ కార్పెట్లు, పొందికయిన తరగతి గదులు, లైబ్రరీ, లంచ్ రూము, ఇండోర్ జిమ్, క్రీడామైదానం, కారు పార్కింగ్ ఏది చూసినా అద్భుతం అనే మాదిరిగా వున్నాయి. టాయిలెట్లు (రెస్ట్ రూములు) అయిదు నక్షత్రాల హోటళ్ళకు దీటుగా వున్నాయి.

పలకా బలపాలు లేవు - టచ్ స్క్రీన్లు, కంప్యూటర్లే

 బ్లాకు బోర్డులు, చాక్ పీసులకు బదులు ‘టచ్ స్క్రీన్ కంప్యూటర్లతో‘ పాఠాలు బోధించే విధానం ప్రాధమిక తరగతి నుంచే ప్రారంభం కావడం మరో విశేషం. పనిచేసే టీచర్లకు కూడా జీతభత్యాలు దండిగా వుండడం వల్ల ‘బతకలేక బడి పంతులు’ అనే నానుడుకి దూరంగావుంటూ, తమ విద్యార్ధులతో ప్రేమపూర్వకంగా మసలుకుంటూ - ‘గురు సాక్షాత్ పరబ్రహ్మ’ అనిపించుకుంటున్నారు. ముఖ్యంగా ఈ స్కూలులో పిల్లలకు నడవడిక నేర్పే పద్ధతులు దగ్గరనుంచి గమనించిన తరవాత వారి అదృష్టాన్ని గురించి మరో సారి అసూయపడాల్సి వచ్చింది. తోటి విద్యార్ధులతో మాట్లాడడం నుంచి సభ్య సమాజంలో మెలగడం వరకు – చిన్ననాటినుంచే ఇస్తున్న తర్పీదు చూడముచ్చటగా వుంది. తమకున్న పరిమితుల్లోనే సమాజానికి ఎలా సేవ చేయవచ్చన్నది ఆచరణలో బోధిస్తారు.

చదువంటే ఆటా పాటా

 స్కూలు మొదలయ్యేటప్పుడు, తిరిగి వొదిలేటప్పుడు టీచర్లు, కొందరు ఎంపిక చేసిన విద్యార్ధులు స్కూలు ప్రవేశ ద్వారం దగ్గర నిలబడి వాహనాల రాకపోకలను క్రమబద్ధం చేస్తారు. అలాగే పేరెంట్స్ తోడు లేకుండా స్కూలు బస్సుల్లో ఒంటరిగా వచ్చే పిల్లలను జాగ్రత్తగా దింపుకుని వారి వారి తరగతి గదులకు చేరుస్తారు. బస్సునుంచి దిగుతున్నప్పుడే పిల్లల పేర్లను రిజిస్టర్ లో రాసుకుంటారు. ఈ బస్సులకూ, మధ్యాహ్న భోజనానికీ ఎలాటి చార్జీ వుండదు.

ట్రాఫిక్ కంట్రోల్

 విద్యా సంవత్సరం ముగిసి విద్యార్ధులు పై తరగతికి మారుతున్నప్పుడు పాత సహాధ్యాయుల ఫోటోలు, వారి వివరాలతో కూడిన ఒక చిన్న ఆల్బం ఇస్తారు. వారిలో కొందరు సొంత కారణాలపై వేరే స్కూలుకు మారినప్పటికీ, వారి జ్ఞాపకాలు భద్రంగా వుంచుకునేందుకు ఈ ఆల్బంలు పనికివస్తాయి. తరగతి గదిలో ఏటిపొడుగునా విద్యార్ధులు సృజనాత్మకతను రంగరించి చేసిన పనులను, అంటే గీసిన బొమ్మలు, వేసిన చిత్రాలు, తీసిన ఫోటోలు, రాసిన కధలు, వ్యాసాలు అన్నింటినీ జాగ్రత్తగా భద్ర పరచి ఒక చక్కని ఫోల్డర్ రూపంలో ఏడాది చివరిలో అప్పగిస్తారు. తలిదండ్రులతో తరచుగా సమావేశాలు జరిపి వారి పిల్లల పురోగతిని గురించి వివరిస్తారు.

పెద్దయ్యాక ఇక ఆడుకునేదేముంటుంది?

హైదరాబాదులో వేలకొద్దీ ఫీజుల రూపంలో దండుకునే అనేక విద్యా సంస్తలు కొన్నింటిలో ఇదేమాదిరి విధానాలు,వసతులు వుండవచ్చు. కానీ ఇంతవరకు ముచ్చటించుకున్నది ఏదో కార్పొరేటు స్కూలు గురించి కాదు. అమెరికాలో ఒక సర్కారు బడిని గురించి మాత్రమె. ఈ వాస్తవం గమనంలో వుంచుకుంటే – ఈ స్కూలుని చూసి ఎందుకు ముక్కున వేలేసుకోవాల్సి వచ్చిందో అర్ధం అవుతుంది.

ఇండోర్ స్టేడియం

కలాం గారు  కోరుకున్నట్టు – మనందరం ఒక కల కనాలి. కనడమే  కాదు దాన్ని  నిజం చేసుకోవాలి.

సహజ కాంతితో పాఠశాల  


ఇలాటి స్కూళ్ళు గ్రామ గ్రామానికీ రావాలన్నదే ఆ కల. పైసా ఖర్చు లేకుండా,పేదా గొప్పా తారతమ్యం లేకుండా -  పిల్లలందరికీ ‘ఇలాటి చిన్నతనం’ వారి  సొంతం కావాలి.

భావి భారతం ‘భద్ర భారతం’ కావాలంటే, భావి తరం ‘మేధావి భారతం’ కావాలంటే – చదువు నేర్చుకోవడం అన్న ఒక్క ‘హక్కు’ ఇచ్చి వూరుకుంటే సరిపోదు- ఇంత ఆనందంగా, హాయిగా, ఆడుతూ, పాడుతూ చదువుకోగల ‘సర్కారు స్కూళ్ళు’ - చదువుకుందామనుకునే ప్రతి ఒక్కరికీ హక్కు భుక్తం కావాలి.

అయితే-

వీటన్నిటినీ ఆచరణలోకి తీసుకురావాలంటే కొన్నింటికి తప్పనిసరిగా డబ్బు కావాలి. అది ఎప్పుడూ కొరతే. మరికొన్నింటికి కేవలం చిత్త శుద్ధి వుంటే చాలు .కానీ, ఇప్పుడు బాగా కొరతగా వున్నది దీనికే. టీవీ చర్చల్లో తప్ప ఎక్కడా వినబడని ఈ "చిత్తశుద్ధి" అంత తేలిగ్గా దొరుకుతుందా?

NOTE: All images in the blog are copyrighted to the respective owners.

30, ఆగస్టు 2010, సోమవారం

వ్యాపకాల జ్ఞాపకాలు - భండారు శ్రీనివాసరావు

వ్యాపకాల జ్ఞాపకాలు - భండారు శ్రీనివాసరావు


రాసేవాళ్ళు చాలామంది వుంటారు. వాళ్ళల్లో మంచిగా రాసేవాళ్ళు కొద్దిమందయినా వుంటారు. కానీ వేసేవాళ్ళు వుండరు. ఇంతెందుకు- చాలా సంవత్సరాలక్రితం పురాణం గారు ఆంద్ర జ్యోతి వారపత్రిక సంపాదకులుగా వున్నప్పుడు అంతగా పేరు తెలియని రచయిత ఒకరు తన నవలను ప్రచురణార్ధం పంపారు. ఏళ్ళు పూళ్ళు గడుస్తున్నా తన రచనకు అతీగతీ లేకపోవడంతో - ‘తన నవలను తనకు భద్రంగా ఒప్పచెప్పాలనీ, లేనిపక్షంలో న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి వుంటుందనీ’ అతగాడు లీగల్ నోటీసు ఇచ్చాడు. దాంతో, పురాణం గారు - అప్పుడు అక్కడ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్న నేనూ కలసి, అలమరాలన్నీ గాలించి, పాత కట్టలన్నీ దులిపి ఎట్టకేలకు ఆ నవలను పట్టుకున్నాము. ఆ విషయం రచయితకు తెలియచేద్దామనుకుంటూనే - పురాణం గారు యధాలాపంగా ఆ నవలలోని కొన్ని పేజీలు తిరగేసారు. ఆయన కళ్ళల్లో ఇసుమంత ఆశ్చర్యంతో కూడిన కాంతి కనిపించింది. వెంటనే ఆర్టిస్టుని పిలిపించి అప్పటికప్పుడే ప్రోమో రాయించడం, ఆ నవలను ధారావాహికంగా ప్రచురించేందుకు ముహూర్తం (తేదీ) నిర్ణయించడం, ఆ విషయాన్ని పత్రికాముఖంగా ప్రకటన రూపంలో ప్రచురించడం అన్నీ చక చకా జరిగిపోయాయి. దానితో తెలుగు సాహితీ లోకానికి మరో కొత్త రచయిత పరిచయమయ్యాడు. తెలుగు నవలా సాహిత్యాన్ని మరో మలుపు తిప్పిన ఒక గొప్ప రచయిత పాఠకులకు దొరికాడు. ఆయన ఎవ్వరో కాదు, కీర్తిశేషులు- వడ్డెర చండీదాస్ (అసలు పేరు చెరుకూరి బ్రహ్మేశ్వర రావు గారు) ఆ నవల – తెలుగు నవలల్లో ఇప్పటికీ స్వయం జ్వలిత జ్వాలగా భాసిల్లుతున్న –“హిమజ్వాల”-

కీర్తిశేషులు వడ్డెర చండీదాస్

స్వయంగా రచయిత అయిన పురాణం సుబ్రమణ్య శర్మ గారు వారపత్రిక సంపాదకుడిగా మరెందరో రచయితలను వెలుగులోకి తెచ్చారు. తన సంపాదకత్వంలోని ఆంద్ర జ్యోతి వారపత్రికకు ఒక ప్రత్యేకతనూ, ప్రాముఖ్యాన్ని సమకూర్చిపెట్టారు. ఒక పక్క రచయితగా, మరో పక్క సంపాదకుడుగా రెండు భాధ్యతలను సమర్ధంగా నిర్వహించి పాఠకజనసామాన్యంచేతా, పత్రికాయాజమాన్యం చేతా సెహభాష్ అనిపించుకున్నారు.

కీర్తిశేషులు శ్రీ పురాణం


సంపాదకుడనే వాడు స్వయంగా సుప్రసిద్ధ రచయిత కావడం అనేది పత్రికకు ఎంతగానో మేలుచేస్తుందనడానికి పురాణం సుబ్రమణ్యశర్మగారే ఉదాహరణ. అయితే, కాస్తో కూస్తో అక్షరజ్ఞానం, అంతో ఇంతో భాషా పరిజ్ఞానం సంపాదకుడికి వుంటే చాలు, ఆ పత్రిక బతికి బట్టకట్టడమే కాదు అమ్మకాల్లో దిట్ట అనిపించుకోగలదని ప్రస్తుతం తెలుగు పత్రికారంగాన్ని ఏలుతున్న దినవారపత్రికలని చూస్తె తెలిసిపోతుంది. మంచి రచనలు చేసేవాడు, కొత్త రచయితలు చేసే మంచి రచనలని అంత తేలిగ్గా ఎంపిక చేసుకోలేడన్నది ఇక్కడి తాత్పర్యం. ఈగోలు, ఇతరత్రా కారణాలు పనిచేసి- తాము చేసే పనికి న్యాయం చేయలేరన్నది ఇందులోని ప్రతి పదార్ధం. (29-08-2010)

NOTE: All images in the blog are copy righted to respective owners

14, ఆగస్టు 2010, శనివారం

కన్నుపొయ్యే కాటుకెందుకు? - భండారు శ్రీనివాసరావు

కన్నుపొయ్యే కాటుకెందుకు? - భండారు శ్రీనివాసరావు


ఆరోజు మంత్రి వర్గం సమావేశమౌతోంది. మధ్యాహ్నం పన్నెండు తర్వాత ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడతారని కబురొచ్చింది. అందరం బిలబిలమంటూ సచివాలయంలోని ముఖ్యమంత్రి ఛాంబర్‌కు చేరుకున్నాం. విలేకరులు, అధికారులతో సమావేశాలు నిర్వహించేందుకు ఆ ఛాంబర్‌ ప్రక్కనే ఒక చిన్న హాలు ఉండేది.



ఆ నాటి ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి అంజయ్య 

ఓ అరగంట తర్వాత అప్పటి ముఖ్యమంత్రి శ్రీ అంజయ్య ఆ హాల్లోకి వచ్చారు. విలేకరులందరినీ పేరుపేరునా పలకరిస్తూ మామూలు కబుర్లలో పడిపోయారు. మధ్యమధ్యలో ఏం మొయిన్‌ ! (మొయినుద్దీన్‌ - ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి) అందరికీ అన్నీ (కాఫీ టిఫిన్లు) అందాయా? అని వాకబు చేస్తున్నారు. అప్పటికి దాదాపు ఒంటిగంట కావస్తుండడంతో చివర్లోకూర్చున్న నాలో అసహనం పెరిగిపోతోంది. మరో పదిమిషాల్లో మధ్యాహ్నం ప్రాంతీయ వార్తలు మొదలవుతాయి. ఈ బులెటిన్‌ తప్పిపోతే మళ్లీ సాయంత్రందాకా దిక్కులేదు. కానీ అంజయ్యగారి కబుర్లు ఒక పట్టాన తేలేలా కనిపించడంలేదు. చివరికి ఏదయితే అదే అయిందని లేచి ఆయన దగ్గరకు వెళ్లాను. వార్తల టైమ్‌ అవుతోందని చెప్పేసి- ఏం చెప్పదల్చుకున్నారో ఒక్క ముక్కలో చెప్పండని కోరాను. దానికాయన పెద్దగా నవ్వేస్తూ `చెప్పడానికేముంది - మంత్రులందరూ (రాజీనామాలు) ఇచ్చేశారు' అని సైగలతో చెప్పేశారు. నేను రయ్‌ మంటూ బయటకు పరుగెత్తి - ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి రేడియోకి ఫోన్‌ చేసి మంత్రుల రాజీనామా వార్తని అందించాను.
ఇదంతా ఎందుకు చెప్పాల్సివస్తోందంటే - విలేకరులు వార్తలను అందించే తొందర్లో ఎలా తప్పుల్ని తొక్కుతారో అన్నది తెలియ చెప్పడానికే.




అంజయ్యగారి మంత్రి వర్గాన్ని `జంబోక్యాబినెట్‌' అని ఎద్దేవా చేసేవారు. అరవైమంది మంత్రులేమిటి - విడ్డూరం కాకపోతే అనేవారు. కార్టూన్ల సంగతి సరేసరి. అయినా, ప్రతిదీ తేలిగ్గా తీసుకునే తత్వం ఆయనది. యాదగిరి (హెలికాప్టర్‌)తో తనను ముడిపెట్టి ఒక దినపత్రికలో ప్రచురించే వ్యంగ్య చిత్రాలను కూడా  నవ్వుతూ  ఆస్వాదించే మనస్తత్వం ఆయనది.


`వెనకటి రోజుల్లో జిల్లాకు ఒకే ఒక్క అయ్యేఎస్‌ ఆఫీసర్‌ (జిల్లాకలెక్టర్‌) ఉండేవాడు. ఇప్పుడో - ఇద్దరు ముగ్గురు అలాంటి అధికార్లు జిల్లాల్లో పనిచేస్తున్నారు. అలాంటప్పుడు జిల్లాకు ఇద్దరు మంత్రులు వుంటే తప్పేంటి `శ్రీనివాసూ' అనేవారు ఆంతరంగిక సంభాషణల్లో.

ఇక వార్తల్ని అందించడంలో తొందరపాటు విషయానికి వస్తే ఆ రోజు నేను హడావిడిలో అరవైమంది మంత్రులు రాజీనామా చేశారని చెప్పాను. రేడియోలో కూడా అలాగే ప్రసారమైంది. నిజానికి ముఖ్యమంత్రితో కలిపి మంత్రివర్గంలో సభ్యులసంఖ్య అరవై. 59 మంది మంత్రులే ఆరోజు రాజీనామా చేశారు. సాయంత్రం వార్తల్లో ఈ తప్పు సవరించుకున్నామనుకోండి. ఇలాంటి పొరపాట్లే మరికొన్ని తరహా వార్తల విషయంలో జరిగితేనే వస్తుంది చిక్కంతా.

శ్రీమతి ఇందిరా గాంధి

శ్రీమతి ఇందిరాగాంధీని హత్యచేసినప్పుడు చాల సేపటివరకూ రేడియో ఆ వార్తని వెల్లడించలేదు. ఆవిడ మరణవార్తని జాతికి తెలియచెయ్యడంలో తాత్సారం జరిగిందని దరిమిలా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రధానిపై కాల్పులు జరిగాయన్న వార్త బయటకు పొక్కింది కానీ అసలేం జరిగిందన్న దానిపై అందరికీ తీరని సందేహాలే. చివరికి రాజీవ్‌ గాంధీ కూడా శ్రీమతి ఇందిరా గాంధీ మరణం గురించి బీ బీ సీ వార్తలు విని ధృవపరుచుకున్నారు.

శ్రీమతి గాంధి పార్ధివ శరీరం 

 ఆమెపై కాల్పులు జరిపిన అంగరక్షకుల్లో ఒక సిక్కు మతస్తుడు ఉన్నాడన్న సంగతిని రేడియో వార్తల్లో ముందు వెల్లడించలేదు. అందువల్ల - అప్పటివరకూ అందరి మనసుల్లో ఆందోళన - అలజడి తప్పిస్తే అంతా ప్రశాంతమే. కానీ కాల్పులు జరిపిన అంగరక్షకుల్లో ఒకడిపేరు `బియాంత్‌ సింగ్‌' అన్న విషయం వెల్లడి కాగానే ఒక్కసారిగా అంతా తారుమారయింది. పరిస్థితులు వర్ణించలేనంత భీభత్సంగా పరిణమించాయి. ఎక్కడో ఢిల్లీలో జరిగిన ఘాతుకానికి దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల్లో ప్రయాణించే సిక్కు ట్రక్కు డ్రైవర్లు ఊచకోతకు గురయ్యారు. అవేశకావేశాల ముందు వివేకం, విచక్షణ తలవంచాయి.

శ్రీమతి గాంధి హత్యానంతరం జరిగిన అల్లర్లలో ఒక దృశ్యం

ఎవరో చెప్పినట్టు ట్యూబునుంచి పేస్టు బయటకు తీయగలమే కానీ మళ్లీ అందులో పెట్టలేం. అలాగే పేల్చిన తూటా కూడా.


నిజమే. వార్తను వెనువెంటనే అందించాలన్న కర్తవ్యదీక్షని మెచ్చుకుని తీరాల్సిందే. కానీ సామాజిక బాధ్యత సంగతేమిటి? పగలసెగలు రగిలించి, వ్యధలు మిగిలించి, విపరీత పరిణామాలకు దారితీసే అవకాశం ఉన్న సమాచారాన్ని తొక్కి పెడితే వచ్చే నష్టం ఏమిటి?
భయంకరమైన పోటీ వాతావరణంలో పయనిస్తున్న ఈనాటి మీడియా మనుగడకు ఎంతో కొంత మేరకు సంచలనాత్మక కథనాలు అవసరమే. కాకపోతే టీ ఆర్‌ పీ రేటింగ్‌లతో పాటు విశాల జనహితాన్ని పట్టించుకోవడం కూడా ఆవశ్యకమే! కాదంటారా!

భండారు శ్రీనివాసరావు


NOTE: All images are copy righted to their respective owners.