29, జులై 2010, గురువారం

అమెరికా అనుభవాలు – 9

అమెరికా అనుభవాలు – 9
ఎయిర్ ఫోర్స్ వన్



ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలయిన మైక్రోసాఫ్ట్ , బోయింగ్ ప్రధాన కార్యాలయాలు సియాటిల్ లోనే వున్నాయి. ఇన్ఫోసిస్ తరపున బోయింగ్ విమానాల తయారీ కర్మాగారంలో పనిచేస్తున్న మా అబ్బాయి సందీప్ ఏర్పాటుచేసిన ప్రత్యెక పాసులతో ఒకరోజు బోయింగ్ కర్మాగారానికి వెళ్ళాము. అనేక వందల ఎకరాల విస్తీర్ణంలో వున్న ఈ ఫ్యాక్టరీని ప్రవేశ రుసుముతో సందర్శించే వీలు కల్పించారు. ఎంతో భద్రత అవసరమయిన ఈ కర్మాగారాన్ని సందర్శించేందుకు ఉత్సాహపడే పర్యాటకులను ప్రవేశ రుసుముతో అనుమతించడం ద్వారా టూరిజం ను వారు ఎలా ప్రోత్సహిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ని కూడా ఇదేవిధంగా సందర్శించే వీలు వుందని విన్నాను.
మిగిలిన సందర్శకులతో కలిపి మమ్మల్ని కూడా ప్రత్యెక బస్సుల్లో లోపలకు తీసుకు వెళ్లారు. అన్నీ చూపించి విషయాలను విశద పరిచేందుకు వెంట గైడ్లు కూడా వున్నారు.


అసలు బోయింగ్ విమానమే ఎంతో పెద్దగా వుంటుంది. అలాటిది వాటిని తయారు చేసే ఫాక్టరీ యెంత పెద్దగా వుంటుందో ఊహించుకోవచ్చు. విడి భాగాలను తయారు చేసి వాటినన్నిటినీ ఒకచోట చేర్చి విమానాన్ని నిర్మించే వివిధ దశలను మేము కళ్ళారా చూసాము. అంతేకాకుండా బోయింగ్ విమాన నిర్మాణం ఎలా జరుగుతుందో కళ్ళకు కట్టినట్టు చూపే డాక్యుమెంటరీని కూడా ప్రదర్శించారు. ఈ కర్మాగారం ఆవరణలోనే పెద్ద పెద్ద రన్ వే లతో కూడిన విమానాశ్రయాన్ని కూడా నిర్మించారు.



రైట్ సోదరులు కనుక్కున్న తొలి విమానం నుంచి ఇంతవరకు తయారయిన అధునాతన యుద్ధ విమానాలు, ప్రయాణీకుల విమానాలు,సరకుల రవాణా విమానాలు, హెలికాప్టర్లు వుంచిన ఒక ప్రదర్సనశాల కూడా వుంది. అమెరికా అధ్యక్షుడి అధికారిక విమానం ‘ఎయిర్ ఫోర్స్ వన్’ పాత మోడల్ కూడా అక్కడ వుంది. సందర్శకులు అందులోకి ఎక్కి కాక్ పిట్ తొ సహా ప్రెసిడెంట్ కోసం విమానంలో ఏర్పాటు చేసిన పడక గది, సమావేశ మందిరం, పత్రికా విలేఖరులతో మాట్లాడే హాలు అన్నీ చూడవచ్చు. టెలిఫోన్, టేలెక్స్, కంప్యూటర్, ఇంటర్నెట్, టీవీ మొదలయిన అత్యాధునిక సమాచార పరికరాలన్నీ అందులో వున్నాయి.


 అమెరికా ప్రెసిడెంట్ విమానంలోకి ఎక్కి అన్నీ చూడడం అన్నది నిజంగా ఒక మరపురాని అనుభూతి. ఇవన్నీ ఎందుకు ప్రస్తావిస్తూ వున్నానంటే – ఈ దేశంలో పర్యాటక రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతను తెలియచెప్పడానికే. నిజానికి బోయింగ్ విమానాల కర్మాగారం రక్షణ అవసరాల దృష్ట్యా నిషేధిత ప్రదేశమయినా టికెట్లు పెట్టి మరీ ప్రజలకు చూసే అవకాశం కల్పిస్తున్నారు. ఏటా ఎన్నో వేలమంది దీన్ని సందర్శిస్తూ వుంటారు

NOTE: All images in this blog are copy righted to their respective owners


.




అమెరికా అనుభవాలు – 8

అమెరికా అనుభవాలు – 8


ముసురు నగరం




సియాటిల్ వాషింగ్టన్ రాష్ట్రంలో వుంది. అమెరికా రాజధాని వాషింగ్టన్ డిసి కీ దీనికీ సంబధం లేదు. అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ పేరు ఈ రాష్ట్రానికి పెట్టారు. రాముడి రాజ్యం లో నేలకు మూడు వానలు కురిస్తే ఇకాడ నెలకు ముప్పయి రోజులూ వాన పడుతూనే వుంటుంది. అందుకే దీనికి గ్రీన్ స్టేట్ అని మరో ముద్దుపేరు కూడా వుంది. ఎక్కడ చూసినా ఏపుగా పెరిగిన చెట్లు దర్శనమిస్తాయి. పచ్చదనానికి, పరిశుభ్రానికీ సియాటిల్ మారు పేరు. సిటీ మేయర్ గ్రెగ్ నికిల్స్ మాటల్లో చెప్పాలంటే సియాటిల్ అమెరికా మొత్తంలో అందమయిన నగరం


.ప్రక్రుతి ప్రసాదించిన విశాలమయిన సరస్సులూ, ఎత్తయిన కొండలూ, నదులూ, నదీ మార్గాలూ, కనువిందు చేసే పచ్చని పచ్చిక బయళ్ళూ, శీతల వాతావరణం, సమీపంలో సాగర తీరం – ఇవన్నీ ఈ నగరానికి ఒక ప్రత్యేకతను, విశిష్టతనూ సంపాదించి పెట్టాయి.


 ముప్పొద్దులా ముసురు ముసుగు కప్పుకునివుండే ఈ నగరం రోడ్లపై ట్రాఫిక్ గీతలు ఎప్పుడు చూసినా అప్పుడే గీసినట్టు ఎలా మెరుస్తూవుంటాయో అర్ధం కాదు. మేమున్న అయిదు నెలల్లో కూడా ఏ ఒక్క నాడు ఈ ట్రాఫిక్ గీతల్ని కొత్తగా పెయింట్ చేస్తున్న సందర్భం కానరాలేదు.

సీటు బెల్టులు

పొరుగునవున్న కాలిఫోర్నియా రాష్ట్రం తో పోలిస్తే – వాషింగ్టన్ స్టేట్ లో ముఖ్యంగా సియాటిల్ లో ట్రాఫిక్ ఆంక్షలు ఖచ్చితంగా అమలు చేస్తున్నారనిపిస్తున్నది. డ్రయివర్ తో సహా (సాధారణంగా కారు యజమానే అయివుంటాడు) కారులో ముందు వెనక సీట్లో కూర్చున్నవాళ్ళందరూ విధిగా సీట్ బెల్ట్ ధరించితీరాలి.


 లేకపోతె వంద డాలర్ల జరిమానా తప్పదు. చిన్న పిల్లలకు సయితం మినహాయింపు లేదు. పైగా వారికి ప్రత్యేకమయిన కారు సీట్లు వుండాలి. ఇవి షాపుల్లో దొరుకుతాయి. వాటిని కారులో వున్న సీట్లకు అదనంగా అమర్చుకుని పిల్లల సీటు బెల్టులు తగిలించి కూర్చోపెట్టుకోవాలి. ఎటువంటి పరిస్తితుల్లోనూ పిల్లలను ముందు సీట్లో కానీ, పెద్దల ఒడిలో కానీ కూర్చోబెట్టుకోకూడదు. నెలల పిల్లలయినా సరే వెనుకనే వారి కారు సీట్లు అమర్చుకోవాలి.

నగరాన్ని తలపించే ఎయిర్ పోర్ట్




సియాటిల్ అంతర్జాతీయ విమానాశ్రయం అమెరికా లోని అతిపెద్ద ఎయిర్ పోర్టులలో ఒకటి. కార్ల పార్కింగ్ కోసం పలు అంతస్తుల భవనాలు అనేకం నిర్మించారు. ఒక్కో అంతస్తులో కనీస అయిదు వందల కార్ల వరకు వసతిగా పార్క్ చేసుకునే వీలుంది. దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాలకు వెళ్లే ప్రయాణీకులు త్వర త్వరగా తమ విమానాలను చేరుకోవడానికి వీలుగా అత్యంత వేగం తో నడిచే ఎలక్ట్రిక్ రైళ్ళు భూగార్భంలోనూ, వెలుపలా తిరుగుతుంటాయి. ఎస్కలే టర్లతో, రెష్టారెంట్లతో, ఆధునిక దుకాణ సముదాయాలతో, మెరిసే విద్యుత్ దీపాలతో ఈ విమానాశ్రయం ఒక ఆదునిక నగరాన్ని తలపిస్తుంది.


NOTE: All images in this blog are copy righted to their respective owners

అమెరికా అనుభవాలు – 7

అమెరికా అనుభవాలు – 7

రోప్ వే



స్పోకేన్ లో వున్నప్పుడు అక్కడికి దగ్గరలో వున్న సిల్వర్ మౌంటైన్ రిసార్ట్ కి వెళ్ళాము. కింద బేస్ క్యాంపు నుంచి గండోలా (రోప్ వే) లో ఆరువేల అడుగుల ఎత్తున వున్న రిసార్ట్ కి చేరుకున్నాము. ఈ రోప్ వే నిడివి 3.1 మైళ్ళు. ప్రపంచంలో అతి ఎక్కువ దూరం ప్రయాణించే గండోలాల్లో ఇదొకటి. గంటకు పదహారువందలమంది టూరిష్టులను, స్కీయింగ్ క్రీడాకారులను పైకి తీసుకువెళ్ళగల 112 క్యాబిన్లు నిరంతరం పైకీ కిందకు తిరుగుతూవుంటాయి.


 ఒక్కొక్క క్యాబిన్ లో ఎనిమిదిమంది వసతిగా కూర్చోవడానికి వీలుంది. నిమిషానికి వెయ్యి అడుగుల వేగంతో మంచు కప్పుకు పోయిన లోయల మీదుగా పైపైకి తీగె బాటపై ప్రయాణించడం మరపురాని అనుభూతి . పైకి వెళ్ళిన తరవాత చూస్తే అంతా మంచు. తెల్లని మంచు.



 ఎవరో గంధర్వుడు యోజనాల నిడివి కలిగిన తన బాహువులతో లక్షలకొద్దీ టన్నుల తెల్ల దూది చల్లినట్టు ఎటు చూసినా కను చూపు మేర వరకు తెలతెల్లటి మంచు. అంత ఎత్తునుంచి కొండ సానువుల మీదుగా మంచు మీద స్కీయింగ్ చేస్తూ వేగంగా జారిపోతున్నవారిని చూస్తుంటే ‘భళిరా!’ అనిపించింది. ఉదయం పైకి వెళ్ళినవాళ్ళు సాయంత్రం దాకా ఈ స్కీయింగ్ క్రీడలో గడపవచ్చు. స్కీయింగ్ చేస్తూ మంచు లోయల్లో దారి తప్పిన వారిని కనిపెట్టి క్షేమంగా వెనక్కు చేర్చడానికి మంచుపై పరుగులు తీయగల చిన్న చిన్న మోటారు వాహనాలలో సెక్యూరిటీ సిబ్బంది నిరంతరం గస్తీ తిరుగుతుంటారు.

అమెరికా లో బస్సు ప్రయాణం

స్పోకేన్ లో మూడు నిద్దర్లు చేసి తిరిగి బస్సులో సియాటిల్ కు బయలుదేరాము. అమెరికాలో బస్సులో ప్రయాణం చేయాలనే కోరిక స్పోకేన్ పుణ్యమా అని తీరింది.
అన్ని రంగాలలో మాదిరిగానే అమెరికాలో బస్సు సర్వీసులు ప్రైవేటు రంగంలోనే వున్నాయి. రహదారులు, వాహనాలు రెండూ బాగుండడం వల్ల బస్సు ప్రయాణం ఎలాటి కుదుపులు లేకుండా ఆహ్లాదంగా సాగింది. కండక్టర్ పద్దతి లేదు. డ్రైవర్ ఒక్కడే సమస్తం చూసుకుంటాడు. బస్సు కంట్రోల్స్ అన్నీ అతడి చేతిలోవుంటాయి. దారిలో విశేషాలన్నీ మైక్రోఫోన్ ద్వారా ప్రయాణీకులకు వివరిస్తుంటాడు. బస్సు ఎన్ని వందల అడుగుల ఎత్తున కొండ శిఖరాలు దాటుతున్నదీ తెలియచేస్తుంటాడు.


ఇంకో గంటలో సియాటిల్ చేరుకుంటామనగా వున్నట్టుండి మంచు కురవడం మొదలయింది. చూస్తూ ఉండగానే దాని ఉధృతి పెరిగిపోయింది. బస్సు స్నో కార్నీ అనేచోట ఆగినప్పుడు చూస్తే హోటళ్ళు, ఇళ్లు, వాటి పైకప్పులు మంచుతో కప్పుకు పోయివున్నాయి. ఒక క్షణం మాస్కోలో వున్నామా అనిపించింది.
బస్సు బయలుదేరింది కానీ వేగం మందగించింది. మా బస్సే కాదు మిగిలిన అన్ని వాహనాలు కూడా. ఎప్పుడూ గంటకు వంద కిలోమీటర్లకు తగ్గకుండా రోడ్లపై పరిగెత్తే వాహనాలన్నీ అతి జాగ్రత్తగా నెమ్మదిగా నడవడం మొదలుపెట్టాయి. మంచు కారణంగా రోడ్లపై ట్రాఫిక్ గీతలు కనబడకుండా పోవడం కూడా ఇందుకు కారణం. ఎవరు ఏ లైనులో వెడుతున్నారో తెలియని పరిస్తితి.

అమెరికాలో పరిస్తితి  

 మార్గ మధ్యంలో అనేకచోట్ల లైట్లతో అమర్చిన హెచ్చరిక సూచనలు కానవస్తున్నాయి. వాటిని పాటిస్తూనే మా బస్సు డ్రైవర్ రేడియో ఆన్ చేసాడు. వాతావరణం గురించీ, రోడ్ల పరిస్తితి గురించీ, ఏ ప్రాంతంలో యెంత వేగంగా వెళ్ళాలో, ఎక్కడెక్కడ ట్రాఫిక్ జాములు వున్నాయో వాటి వివరాలన్నీ రేడియోలో తెలియచేస్తున్నారు. ఇంత అభివృద్ధి చెందినా కూడా ఈ దేశంలో రేడియోకు లభిస్తున్న ప్రాధాన్యత తెలుసుకుని రేడియో మనిషిగా గర్వంగా ఫీలయ్యాను. మాస్కో గుర్తు వచ్చిందని అన్నాను కదా. అక్కడ ఇలాటివన్నీ సర్వ సాధారణం.

మాస్కోలో దృశ్యం

 మాస్కోలో ఏడాదికి పది నెలల పాటు మంచు కురుస్తూనే వుంటుంది. అయినా వాహనాల రాకపోకలకు కానీ, జన జీవనానికి కానీ ఎలాటి అంతరాయం కలగకుండా చూస్తారు. రోడ్లపై మంచుని ఎప్పటికప్పుడు తొలగిస్తుంటారు. ఇక రాత్రి వేళల్లో కొన్ని గంటలపాటు రోడ్లని శుభ్రం చేసే కార్యక్రమం నిర్విరామంగా సాగుతుంది. ప్రత్యెక వాహనాలతో ఉప్పు ఇసక కలిపి రోడ్లపై చల్లుతారు. ఉప్పు వల్ల మంచు కరిగి నీరుగా మారుతుంది. వెనుకవచ్చే మరో వాహనం చీపురుతో ఊడ్చినట్టు చేస్తుంది. మరో వాహనం నీళ్ళు చిమ్ముతూ రోడ్లని కడుగుతుంది. మాస్కోలో మేమున్న అయిదేళ్ళు కూడా మంచు కారణంగా రోడ్లపై వాహనాలు నిలిచిపోవదం కానీ, ట్రాఫిక్ కు అంతరాయం కలగడం కానీ చూడలేదు. అక్కడి,అప్పటి ప్రభుత్వ యంత్రాంగం శక్తియుక్తులన్నీ ప్రకృతిపై పోరాటానికే ఖర్చు చేసారా అనిపించింది. అక్కడితో పోలిస్తే ఇక్కడ అమెరికాలో పరిస్థితులు వేరుగా కానవచ్చాయి. రోడ్లపై గీతలు కనబడకపోతే ఇక్కడి వాళ్ళు కార్లు నడపలేరేమో!

NOTE: All images in this blog are copy righted to their respective owners

అమెరికా అనుభవాలు – 6

అమెరికా అనుభవాలు – 6

విస్తట్లో అన్నీ వున్నా .........

సుఖంగా బతకాలనుకునే మనిషికి ఏమేమి అవసరమో అవన్నీ ఇక్కడ అందుబాటులోకి తెచ్చుకున్నారు.



పరిశుభ్రమయిన గాలి - పరిశుద్ధమయిన నీరు – ఎల్లెడలా పచ్చదనం – అద్దాల్లా మెరిసిపోయే రోడ్లు - పొగలేని వాహనాలు – పొందికయిన ఇళ్లు – సమృద్ధిగా సాగునీరు, తాగు నీరు – పుష్కలంగా కరెంట్ సరఫరా- మంచి చదువులు చదువుకోవడానికీ, చదివిన చదువును సద్వినియోగం చేసుకోవడానికీ సరయిన అవకాశాలు – అన్ని హంగులూ సదుపాయాలు వున్న విద్యాసంస్తలు – పరిమితులులేని వ్యక్తి స్వేచ్చ – ఆడా మగా తేడాలు తెలియని జీవన విధానం – ప్రపంచ వాణిజ్యంలో తిరుగులేని డాలర్ వెలుగులు – ఇవన్నీ అమెరికన్ల జీవన స్తాయిని ఎంతగానో పెంచుకుంటూ వెళ్ళాయి. సువిశాల నైసర్గిక స్వరూపం – తక్కువ జనాభా – పుష్కలమయిన సహజ వనరులు – ఇవి కూడా సుసంపన్న అమెరికా ఆవిర్భావానికి దోహదం చేసివుండవచ్చు. అయితే కష్టపడి పని చేసే పౌరుల మనస్తత్వం – సాధారణ జన జీవితంలో నీతీ నిజాయితీ – ఇవి కూడా అమెరికా సౌభాగ్యానికి కారణాలుగా చెప్పుకోవచ్చు.
  సుఖంగా బతకడం ఒక్కటే కాదు – ఇంకెంతో – మరెంతో సుఖంగా బతకాలంటే ఏమి చెయ్యాలో వాళ్లకు బాగా తెలుసు. అందుకే వర్తమాన మానవ జీవితాలను ఎంతగానో ప్రభావితం చేసిన – ఇంకా చేస్తున్నఅనేకానేక ఉపకరణాలను వాళ్ళు కనుక్కోగలిగారు.


(దొంగతనానికి వెళ్ళే వాళ్ళు కూడా నెట్ ద్వారా సమాచారం తెలుసుకోగలుగుతున్నారన్నది పై ఫోటో లో వున్న చమత్కారం)

 దైనందిక జీవితంలో సుఖమయ జీవనానికి కావాల్సిన వస్తు సామాగ్రిని అమెరికన్లు తయారు చేసిన వార్తలను గతంలో వర్ధమాన దేశాల వార్తా పత్రికలు పుంఖాను పుంఖాలుగా ప్రచురించిన విషయం చాలా మందికి గుర్తుండే వుంటుంది.


 తమ దేశ రక్షణ వ్యవస్థ కోసం ఎంతో పరిశోధనలు చేసి రూపకల్పన చేసుకున్న ఇంటర్నెట్ ని సయితం పౌరులందరికీ అందుబాటులోకి తెచ్చి వారి జీవన శైలినే సమూలంగా మార్చివేసిన ఘనత అమెరికాదే.

అయితే - ఏమిటట .....

అయితే ఏమిటి?


ఇప్పుడు అనేకమంది అమెరికన్ల మనసులో నలుగుతున్న ప్రశ్న ఇది.
అవును అన్నీ వున్నాయి. కానీ వున్నదేదో లేకుండా పోయింది. వుండాల్సింది ఏమిటో కానరాకుండా పోయింది. అది లేకుండా ఇవన్నీ వుండి ఏమిటి లాభం?


సహజమయిన మానవ సంబంధాలు మచ్చుకు కూడా మిగలకుండా పోతున్నాయి. ఈ బంధాలు,అనుబంధాలు ఒక వయస్సు వచ్చే వరకే పరిమితమవుతున్నాయి. కన్నవారిని తలచుకోవడానికీ, ఏడాదిలో కనీసం ఒక్కమారయినా వారిని కలుసుకోవడానికీ – ‘ధన్యవాదాల దినం’ ( THANKS GIVING DAY ) పాటించాల్సిన పరిస్తితులు ఏర్పడ్డాయి. కన్నవారు – తాము కన్నవారితో కలిసివుంటే ఒక ‘వార్త ’ గా చెప్పుకునే రోజులు వచ్చాయి.



స్పోక్స్ మన్  రివ్యూ





సియాటిల్ కి దాదాపు మూడువందల మైళ్ల దూరంలో వున్న స్పోకెన్ నగరం నుంచి స్పోక్స్ మన్ రివ్యూ అనే ఈ పత్రిక 125 సంవత్సరాలకు పైగా ప్రచురితమవుతూ వస్తోంది. లోగడ హైదరాబాదు ఆలిండియా రేడియోలో నా సహోద్యోగిగా పనిచేసిన పవని విజయ లక్ష్మి – ఆమె భర్త బాలాజీ ఉద్యోగరీత్యా ఆ నగరంలో మూడేళ్లుగా వుంటున్నారు. నేను అమెరికా వచ్చిన సంగతి తెలుసుకుని వాళ్ళ వూరు రావాల్సిందని పదే పదే ఫోన్లు చేస్తూ వుండడంతో ఒకరోజు నేను మా ఆవిడను తీసుకుని స్పోకేన్ కు వెళ్ళాను.



 అక్కడ వాళ్ళు కొనుక్కున్న ఇల్లు చూడ ముచ్చటగావుంది. అంతకు ముందే బాలాజీ తలిదండ్రులు హైదరాబాద్ నుంచి వచ్చి కొడుకూ కోడలి దగ్గర ఆరు నెలలు వుండి తిరిగి ఇండియాకు వెళ్లారు. వేరు కాపురం పెట్టుకున్న కొడుకు దగ్గర తలిదండ్రులు అన్ని నెలలు గడపడం అక్కడి అమెరికన్లకు ఎంతో వింతగా అనిపించింది. ఆ నోటా ఈ నోటా పడి ఈ సంగతి స్పోక్స్ మన్ రివ్యూ
 పత్రిక విలేఖరి రెబెక్కా నప్పీ చెవిన పడింది.ఇంకేముంది ఆమె అమాంతం విజయలక్ష్మి అడ్రసు కనుక్కుని ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ చేసి మొత్తం ఫామిలీ ఫొటోలతో సహా మొదటి పుటలో ప్రచురించింది. రెబెక్క ఆ పత్రికకు ఇంటరాక్టివ్ ఎడిటర్ గా కూడా పనిచేస్తున్నారు. నేను ఆలిండియా రేడియో విలేకరినని తెలుసుకున్న మీదట ఆమె  స్పోక్స్ మన్  రివ్యూ పత్రిక కార్యాలయానికి ఆహ్వానించారు.


 డౌన్ టౌన్ రివర్ సైడ్ ఎవేన్యూ లో అనేక అంతస్తులలో వున్న ఈ పత్రిక భవనం అతి పురాతనమయినది. చారిత్రిక అవశేషాలు దెబ్బతినకుండా భవనం లోపల ఇంటీరియర్ ను మాత్రం ఫైవ్ స్టార్ హోటల్ మాదిరిగా అధునాతనంగా తీర్చిదిద్దారు. సుమారు నూరేళ్ళ నాటి లిఫ్ట్ దగ్గర నిలబడి ఫోటోలు దిగాము. రెబెక్క మమ్మల్ని ఆప్యాయంగా ఆహ్వానించి వివిధ విభాగాలకు తీసుకువెళ్ళి అక్కడ పనిచేస్తున్న జర్నలిష్టులను పరిచయం చేసారు.


 అంతే కాకుండా ఎడిటోరియల్ స్టాఫ్ మీటింగ్ లో కూర్చోబెట్టి ‘జర్నలిస్ట్ ఫ్రెండ్ ఫ్రం ఇండియా’ అని పరిచయం చేసిన తీరు మరిచిపోలేనిది. పత్రిక చీఫ్ ఎడిటర్ ఎలాటి భేషజం ప్రదర్శించకుండా చక్కని హాస్యోక్తులతో కూడిన ప్రొఫెషనల్ సీరియస్ నెస్ తో సమావేశాన్ని రక్తి కట్టించారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా వివిధ ప్రాంతాల విలేకరులతో మాట్లాడి ఏ వార్తకు ఆ రోజు ఎలాటి ప్రాధాన్యం ఇవ్వాలో అందరితో చర్చించి నిర్ణయించడంతో ఆ సమావేశం ముగిసింది. తరవాత చివరి అంతస్తులో వున్న కాంటీన్ కు వెళ్లి కాఫీలు కలుపుకు తాగాము. అక్కడ మేడ మీద పెద్ద పెద్ద గుడ్లగూబ పక్షుల బొమ్మలు కనిపించాయి. మన వైపు వీధి వాకిళ్ళ వద్ద కనిపించే సింహాల బొమ్మల మాదిరిగా వున్నాయి. క్షుద్ర శక్తులు ప్రవేశించకుండా ఈ బొమ్మలు కాపాడుతాయని తమ పూర్వీకులు నమ్మేవారని రెబెక్క చెప్పారు.

NOTE: All images in this blog are copy righted to their respective owners

28, జులై 2010, బుధవారం

అమెరికా అనుభవాలు – 5

అమెరికా అనుభవాలు – 5

వినియోగదారుడే సుప్రీం

అమెరికాలో ఏదీ ఉచితం కాదు. ప్రతి వస్తువుకు ధర - ప్రతి సర్వీసుకు రుసుము చెల్లించి తీరాల్సిందే. ఇక్కడ అన్నీ ప్రైవేటు పరం. పోటీ తత్వం ఎక్కువ. వినియోగదారుడిని ఆకర్షించడానికి అన్ని రకాల మార్గాలను అన్వేషిస్తుంటారు. టక్కు టమార, గజకర్ణ గోకర్ణ విద్యలను ప్రదర్శిస్తుంటారు. ఈ ప్రయివేటు పోటీ మన వయిపులాగే కొన్ని సార్లు అనారోగ్యకరంగా అనిపించినా నాణ్యతకు సంబంధించి మాత్రం ఎలాటి రాజీ వుండదు. ఇక్కడ వినియోగదారుడే సుప్రీం. ఏ వస్తువయినా, యెంత ఖరీదు పెట్టి కొన్నా నచ్చకపోతే మూడు నెలల తరవాత కూడా ఎలాటి కారణం చూపెట్ట కుండా వాపసు చేసి మొత్తం డబ్బు వెనక్కు తీసుకునే సౌలభ్యం వుంది. ఇందుకోసం అన్ని షాపుల్లోనూ కస్టమర్ సర్వీసు సెంటర్లు వుంటాయి. ఎలాటి ప్రశ్నలు వేయకుండా క్షణాల్లో వస్తువుని తిరిగి తీసుకుని – అణాపైసలతో ( డాలర్లు సెంట్ల తో సహా అన్న మాట ) డబ్బు తిరిగి చెల్లిస్తారు.


 వ్యాపారం అంతా ‘నమ్మకం’ అన్న ఒక్క ముక్క మీద జరిగిపోతూవుంటుంది. పైకి ఇలా కనిపించినా లోలోపల ఓ మతలబు వుంది. ఈ దేశంలో లావాదేవీలన్నీ ప్లాస్టిక్ కరెన్సీ అంటే క్రెడిట్ కార్డుల ద్వారా సాగిపోతుంటాయి. ప్రతి ఒక్కరికీ సోషల్ సెక్యూరిటీ నంబర్ వుంటుంది. వాళ్ళ జీవితం యావత్తూ ఈ నంబర్ పై ఆధారపడివుంటుంది. ఇన్సూరెన్స్, బ్యాంకు ఖాతాలు- వాటితో లావాదేవీలు, డ్రయివింగ్ లైసన్స్, రెంట్, కరెంట్ తో సహా అన్ని రకాల చెల్లింపులు ఈ నంబర్ ఆధారంగానే జరిగిపోతుంటాయి. ఎక్కడ ఏ తభావతు వచ్చినా అంతా గల్లంతే. అందుకే లావాదేవీలన్నీ నిరాటంకంగా, ఎలాటి ఇబ్బందీ లేకుండా ‘నమ్మకంగా’ జరిగిపోతుంటాయి.
వినియోగదారుడు తనకున్న హక్కులను వాడుకోవడానికి ఇక్కడ వున్న వీలు చాళ్ళు ఆ హక్కులకు ఒక అర్ధాన్ని పరమార్ధాన్ని కలిగిస్తున్నాయి. క్రయవిక్రయాలు,సేవల విషయంలో కలిగే అసౌకర్యాలకు చెల్లించాల్సిన పరిహారాలు పెద్ద మొత్తంలో వుండడంతో వారి ఆధిక్యత మరీ పెరిగిపోయింది. వేడి కాఫీ ఒలికి వొళ్ళు కాలిందని ఒక వినియోగదారుడు వేసిన కేసులో మెక్డోనాల్డ్ వంటి సంస్త లక్షల డాలర్లలో పరిహారం చెల్లించిన సందర్భాలు వున్నాయి.


 అప్పటి నుంచీ ఆ కంపెనీ విక్రయించే కాఫీ గ్లాసులపై ‘వేడి కాఫీ – జాగ్రత్త’ అని హెచ్చరికలు ముద్రించడం ఆనవాయితీగా మారింది. అలాగే ఒక రెష్టారెంటులో తడి నేలపై కాలు జారిపడ్డ వ్యక్తి కి పెద్ద మొత్తంలో నష్ట పరిహారం చెల్లించాల్సి రావడంతో – అన్ని హోటళ్ళలో ‘నేల తడిగా వుంది – చూసి నడవండి’ అనే బోర్డులు పెట్టడం మొదలయింది.


 అందుకే వినియోగదారుడి విషయంలో వొళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించాల్సిన పరిస్తితి ఇక్కడ ఏర్పడింది.

హద్దులు కలిగిన స్వేచ్చ

ఈ దేశంలో స్వేచ్చకు అర్ధం యితరుల స్వేచ్చను పరిహరించడం కాదు. అమెరికన్లు యితరుల వ్యవహారాలలో ఏ మాత్రం జోక్యం చేసుకోరు. అలాగని బావిలో కప్పల్లా వుండిపోరు. తెలియని వాళ్ళను సైతం చిరునవ్వుతో పలకరిస్తారు. మదహాసమే వారి విజయ రహస్యం అనిపిస్తుంది.

రెండు బెలూన్లు – ఒక థాంక్స్



ఓ రోజు మా మనుమరాలిని స్త్రోలర్ లో కూర్చోపెట్టుకుని నేనూ మా ఆవిడా రెండు మైళ్ల దూరంలో వున్న ఫాక్తోరియా  మాల్ కి వెళ్ళాము. (ఇప్పుడు దాని పేరు మార్చారని విన్నాము) త్రోవలో ఒక చోట ‘గరాజ్ సేల్’ అని ఒక చిన్న బోర్డు పెట్టారు.


 అది స్పుటంగా కనిపించడానికి కాబోలు- దానికి గాలిలో ఎగిరే రెండు బెలూన్లు వేలాడతీసారు. వాటిని చూసి మా మనుమరాలు ‘బెలూన్-బెలూన్’ అని అరిచింది. దాని ముచ్చట చూసి కొనిపెడదామన్నా అవి ఎక్కడ దొరుకు తాయో మాకు తెలవదు. తిరిగి వస్తుంటే ఆ బెలూన్లు మళ్ళీ కనిపించాయి. వాటిని చూపిస్తూ మా మనుమరాలు మళ్ళీ ‘బెలూన్-బెలూన్’ అని కేకలు పెట్టింది

. ఈ లోగా ఓ కారు వచ్చి అక్కడ ఆగడం, ఎవరో దిగి ఆ గరాజ్ సేల్ బోర్డుతో పాటు ఆ బెలూన్లని తీసుకుపోవడం జరిగింది. మరో రెండు బ్లాకులు దాటి మేము మా ఇంటికి చేరే సమయంలో మా పక్కగా వున్న సందులోకి ఓ కారు వచ్చి ఆగింది. అందులోనుంచి దిగిన ఓ అమెరికన్ రెండు బెలూన్లు తీసి మా అమ్మాయికి ఇచ్చాడు. అతనేదో ఇంగ్లీష్ లో చెప్పాడు కానీ మాకు ఒక పట్టాన అర్ధం కాలేదు. తరవాత తీరిగ్గా ఆలోచిస్తే తెలిసిందేమిటంటే – మా మనుమరాలు బెలూన్ చూపించి అడగడం అతను గమనించినట్టున్నాడు. అయితే ఈలోగా సిగ్నల్ పడడంతో ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ మమ్మల్ని వెతుక్కుంటూ వెనక్కు బెలూన్లు ఇచ్చాడు. ఇలాటి సహృదయతనూ, సంస్కారాన్నీ మెచ్చుకోకుండా వుండగలమా? ఇటువంటి సందర్భాలలో మనోభావాలకు అద్దం పట్టే ఇంగ్లీష్ పదం ఒకటుంది. అదే - ‘థాంక్యూ’


NOTE: All images in this blog are copy righted to their respective owners

అమెరికా అనుభవాలు – 4

అమెరికా అనుభవాలు – 4

గీతల నడుమ జీవితం



నేను ముందు అనుకున్నట్టు సియాటిల్ చిన్న నగరమేమీ కాదు. బహుశా హైదరాబాదుకి రెండు మూడు రెట్లు వుంటుందేమో. అనేక కొండల మీద నిర్మితమయిన నగరమిది. పచ్చదనం పరచుకున్నట్టు ఎటు చూసినా పచ్చని చెట్లు. సియాటిల్ వున్న వాషింగ్టన్ స్టేట్ ని గ్రీన్ స్టేట్ అని ఎందుకు అంటారో ఈ నగరాన్ని చూస్తె అర్ధమవుతుంది. పచ్చదనానికి తోడు విశాలమయిన రహదారులు. ఈ రోడ్లని గమనిస్తే అమెరికన్లని గురించి ఒకరు చెప్పిన విషయం గుర్తుకు వస్తుంది. సుఖప్రదమయిన జీవితం గడపడం వారి లక్ష్యం. అది సజావుగా నడవడానికి అవసరమయిన కొన్ని నియమనిబంధనలు ఏర్పరచుకుని వాటిని ఖచ్చితంగా పాటిస్తున్నారు. ఈ నిబంధనల అమలు మీద సర్కారు ఆజమాయిషీ కంటే స్వచ్చందంగా పౌరులు వాటికి కట్టుబడి వ్యవహరించడం వల్లే అవి విజయవంతంగా అమలు జరుగుతున్నాయని చెప్పవచ్చు. అమెరికాలో మీకు నచ్చిన విషయం ఏమిటంటే ‘రహదారులు’ అని నిస్సంశయంగా నేను జవాబిస్తాను. మనలో చాలామందిమి టీవీలో వీడియో గేమ్స్ చూసి వుంటాము. రోడ్లపై గీతల నడుమ ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించుకుంటూ కారు నడపాల్సివుంటుంది. గీతలకు ఆవలగా ఏమాత్రం పక్కకు జరిగినా ప్రమాదం జరుగుతుంది. అలాగే అమెరికాలో రోడ్లు కూడా. నిర్దిష్టమైన వేగంతో గీతల నడుమ కారు నడుపుకుంటూ వెడితే చాలు, ఎలాటి ఇబ్బంది వుండదు. వాహనాలు వెళ్ళడానికి, రావడానికి వేర్వేరు రహదారులు వుంటాయి. ఒక్కో మార్గంలో మూడు,నాలుగు వరసల్లో వాహనాలు వెడుతుంటాయి. హారన్ మోగించే ప్రసక్తే లేదు. ఓవర్ టేక్ చేయాలంటే ఖాళీగా వున్న మరో వరుసలోకి వెళ్లి వేగంగా దాటి మళ్ళీ మన వరుసలోకి రావాలి. ఇక ఫ్రీవేల ( FREE WAYS) విషయం తీసుకుంటే వాటి నిర్మాణ శైలి పరమాద్భుతంగా వుంటుంది.


 దేశంలోని వివిధ నగరాలను కలుపుతూ నిర్మించిన ఈ ఫ్రీ వేస్ – అనేకనగరాల మధ్యనుంచి వెడుతుంటాయి. వీటిల్లో కార్లు,తదితర పెద్ద వాహనాలు మినహా మిగిలినవి నిషిద్దం. అలాగే కాలి నడకన వెళ్ళేవారు కూడా వీటిపైకి రాకూడదు. ఈ ఫ్రీ వే ఎడమ వయిపు వరసని ‘కార్ పూల్’ అంటారు. ఒకరికి మించి ప్రయాణీకులు వున్న వాహనాలు మాత్రమె ఇందులో వెళ్ళడానికి వీలుంటుంది. ఈ లైన్ లో వెళ్ళే వాహనాలు తక్కువగా వుంటాయి. కనుక వేగంగా వెళ్ళడానికి వీలుంటుంది. రోడ్లమీద వాహనాల రద్దీ తగించడానికి ఈ ‘కార్ పూల్’ పధ్ధతి ప్రవేశ పెట్టారని చెప్పుకుంటారు.


 ఇక్కడ ప్రతి వారికీ కారు వుంటుంది. కనుక ఇద్దరు కలసి వెడితే రెండో కారు బయటకు తీయనక్కరలేదు, కాబట్టి రద్దీ తగ్గుతుందని అంటారు. కార్ పూల్ వరుసలో కాకుండా వేరే వరుసల్లో వాహనాల రద్దీ ఎక్కువగా వుండి చాలా సార్లు ట్రాఫిక్ జామ్ ఏర్పడుతూ వుంటుంది. నిజానికి ఆ వరుసల్లో వెళ్ళే కార్లలో ఒకే వ్యక్తి ప్రయాణిస్తుంటాడు. అయినా సరే కార్ పూల్ వరుసలోకి రావడానికి ప్రయత్నించడు. చేసాడా జరిమానాలు భారీగా వుంటాయి. జరిమానా భయం కన్నా – నిబంధన పాటించాలన్న నిబద్ధతే వారినలా చేయిస్తోందనడం సబబుగా వుంటుంది. అలాగే నాలుగు రోడ్ల కూడళ్ళలో ఏర్పాటు చేసిన ‘స్పెన్సర్’ వ్యవస్థ కూడా ఎంతో బాగుంది. ఇక్కడ ట్రాఫిక్ దీపాలు యిరవై నాలుగ్గంటలు పనిచేస్తాయి. వాహనాల రద్దీ తక్కువగా వుండే అర్ధరాత్రి సమయాలలో ఈ స్పెన్సర్ లు ఉపయోగపడతాయి. ఎదుటివయిపునుంచి వాహనాలు రాకపోయినా ఎర్రదీపం కారణంగా కారు నిలపాల్సిన అవసరం లేకుండా రోడ్ల కింద అమర్చిన ఈ స్పెన్సర్ లు – కారు ముందు టైర్లు తాకగానే – గ్రీన్ సిగ్నల్ పడేలా చూస్తాయి.

నడిచే వాడిదే రోడ్డు

ఇక్కడి వారికి ఏమున్నా లేకపోయినా కారు మాత్రం వుండి తీరాలి. కారు లేక పోతే కాలూ చేయీ ఆడదు. రోడ్లమీద నడిచేవారు అంతంత మాత్రంగానే కానవస్తారు. కానీ వాళ్ళదే ఇక్కడ హవా. ఎంతో వేగంగా వెళ్ళే వాహనమయినా సరే నడిచి వెళ్ళే వారు కనబడగానే ఆగిపోతుంది. వాళ్ళు రోడ్డు దాటి వెళ్లేవరకూ అన్ని వాహనాలు తటాలున నిలబడి పోతాయి.


 నడిచివెళ్లేవారిని డీ కొడితే అదో పెద్ద నేరం. ఆ కేసునుంచి బయటపడాలంటే చాలా పెద్ద మొత్తంలో నష్ట పరిహారం చెల్లించుకోవాల్సి వుంటుంది. రద్దీగా వుండే రోడ్లని క్రాస్ చేయడానికి కూడళ్ళ వద్ద నాలుగు వయిపులా ‘సిగ్నల్ పుష్ బటన్లు’ వుంటాయి.


 వాటిని ప్రెస్ చేస్తే రోడ్డు దాటడానికి వీలుగా రెడ్ లైట్ మారిపోయి తెల్లదీపం వెలుగుతుంది. ఇలాటి ఏర్పాటు అన్ని నగరాల్లోనూ వుంది.

క్లిష్ట సమస్యకు సింపుల్ పరిష్కారం  

ఎప్పుడు జనసందోహంతో వుండే మార్కెట్ ప్రదేశాలలో నడిచి వెళ్ళే వాళ్ళు -  రోడ్లు దాటడానికి విద్యుత్ దీపాలతో అవసరంలేని ఒక పద్దతి ఇక్కడ  అనుసరిస్తున్నారు. అది మనదగ్గర కూడా ప్రవేశపెడితే బాగుంటుందేమో.





 అదేమిటంటే రోడ్డుకు ఇరువైపులా ఒక బాస్కెట్ లో కొన్ని జండాలు ఉంచుతారు. రోడ్డుదాటాలనుకునేవారు ఒక జండా చేతిలోకి తీసుకుని వెళ్ళాలి. ఆ జండా చేతిలో వుంటే చాలు - రోడ్డుపై పై వెళ్ళే వాహనాలన్నీ టక్కున ఆగిపోతాయి.


 రోడ్డుదాటగానే రెండో వైపువున్న బాస్కెట్ లో జండా ఉంచేసి వెళ్లిపోవచ్చు.చిన్న పిల్లలు, వృద్ధులు, పిల్లల తల్లులకు యిది చాలా ఉపయుక్తంగా వుంది.  యెంతో క్లిష్టంగా అనిపించే సమస్యకు వాళ్ళు కనుగొన్న 'సులువయిన' పరిష్కారం ఇది. ట్రాఫిక్ సమస్యలపై అధ్యయనం పేరుతో విదేశీ పర్యటనలు చేసే  పోలీసు అధికారుల కళ్ళలో యిది పడకపోవడం విచిత్రమే మరి.
           
ట్రాఫిక్ కు సంబంధించి కొట్టవచ్చిన్నట్టు కనబడే మరో విషయం ఏమిటంటే ఎక్కడా రోడ్లమీద ట్రాఫిక్ పోలీసులు జాడ కనబడదు. వాళ్ళు హమేషా వాహనాల్లో తిరుగుతూ అతి వేగంగా వెళ్లే వాహనాలను అదుపు చేస్తుంటారు. జాతీయ రహదారులపై ఈ పోలీసులు హెలికాప్టర్లలో గస్తీ తిరుగుతుంటారు. వాహనదారులు భయపడేది వీరికే. అతి వేగంగా వెళ్లే వాహనాలను పట్టుకోవడానికి అప్పుడప్పుడు వీరు రోడ్ల పక్క చెట్ల మాటున మాటు వేస్తారు. వీరి వాహనంలో వైర్లెస్ టెలిఫోను, కంప్యూటర్, ఇంటర్నెట్ తో పాటు ‘గన్’అని పిలిచే ఒక పరికరం వుంటుంది. ఈ పరికరాన్ని రోడ్లపై వేగంగా వెడుతున్న వాహనాల వయిపు గురిపెట్టి వుంచుతారు. నియమిత వేగాన్ని మించి ప్రయాణిస్తున్న వాహనాన్ని ఈ పరికరం గుర్తించి కారు నంబరుతో సహా నమోదు చేస్తుంది.


 మన వైపు చలాన్ చెయ్యడం చూసివుంటారుకదా. ఇక్కడ టికెట్ ఇవ్వడం అంటారు. కారు నంబర్ ను బట్టి కంప్యూటర్ ద్వారా వాహనదారుడికి చెందిన వివరాలన్నీ వారికి ఇట్టే తెలిసిపోతాయి. టికెట్ నేరుగా ఇంటికే వస్తుంది. కోర్టులో జరిమానా చెల్లించుకోవాలి. ఇలాటి టికెట్ల సంఖ్య పెరిగిందంటే డ్రైవింగ్ లైసెన్స్ ఆటోమాటిక్ గా రద్దయిపోతుంది. లైసెన్స్ పోయి కారు నడపలేకపోతే జీవచ్చవం కింద లెక్క. అంతే కాదు- ఎక్కువసార్లు పోలీసులకు దొరికిపోయిన రికార్డ్ వుంటే కారు ఇన్సూరెన్స్ ప్రీమియం పెరిగిపోతుంది. మరోసారి కారు కొనుక్కోవడానికి అప్పు పుట్టదు కాక పుట్టదు.అలాగే బ్యాంకుల్లో అప్పులు కూడా.

కారు భీమా వుంటే ఆ ధీమాయే వేరు కదా! 

 పౌరులందరికీ సోషల్ సెక్యూరిటీ నంబర్ ఇచ్చి వారి సమస్త వివరాలను కంప్యూటర్లలో నిక్షిప్తం చేయడం ద్వారా అన్ని రకాల అక్రమాలకూ కళ్ళెం వేయగలిగారు. చెల్లని చెక్కులు ఇవ్వడం, అద్దెలు ఎగ్గొట్టి ఇల్లు మారిపోవడం, బ్యాంకులనుంచి తీసుకున్న రుణాలు అనుకున్న వ్యవధిలో చెల్లించకపోవడం, ప్రమాదకరంగా కార్లను నడపడం ఇలా ఏది చేసినా కంప్యూటర్ల ద్వారా తెలిసిపోయి చట్టం చేతికి సులువుగా చిక్కిపోతారు. ఈ విధంగా క్రమబద్ధమయిన, చట్టబద్ధమయిన జీవనానికి ప్రజలు అలవాటు పడేలా చేయడానికి కంప్యూటర్ పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్న తీరు హర్షణీయం.

NOTE: All images in this blog are copy righted to their respective owners

అమెరికా అనుభవాలు - 3

అమెరికా అనుభవాలు - 3

తొలిపరిచయం

లాస్ ఏంజెల్స్ నుంచి సియాటిల్ వెళ్ళడానికి మరో విమానం ఎక్కాలి. దానికి రెండు గంటలకు పైగా వ్యవధి వుంది. లాస్ ఏంజెల్స్ చేరగానే ఆ విషయం సియాటిల్ లో  వున్న తనకు తెలియచేయడానికి వీలుగా సందీప్ ముందుగానే ఒక ఫోన్ నంబర్ ఇచ్చాడు. డబ్బులతో అవసరం లేని నంబర్ అది. దాని ద్వారా కబురు అందించడానికి నేను చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.


 నా పాట్లు గమనించిన ఒక అమెరికన్  మహిళ – తానే చొరవ తీసుకుని తన సెల్ ఫోన్ ద్వారా సియాటిల్ లోని సందీప్ కి మేము క్షేమంగా చేరిన సమాచారాన్ని చేరవేసింది. అమెరికన్లతో నా తొలి పరిచయం ఇలా సుహృద్భావంగా జరగడం ఏంతో సంతోషం అనిపించింది.
సియాటిల్ విమానం ఎక్కేముందు కూడా మా బాగేజీని క్షుణ్ణంగా పరీక్షించారు. ఊరగాయ పచ్చళ్ళను గురించి ఒకటికి రెండు సార్లు ప్రశ్నించారు. చివరికి మా సామానునంతా మా కళ్ళ ముందే సూట్ కేసుల్లో జాగ్రత్తగా సర్ది మాకప్పగించారు.

సియాటిల్

ఎట్టకేలకు సియాటిల్ వెళ్ళే విమానం ఎక్కాము. సుమారు రెండుగంటల ప్రయాణం.


సియాటిల్ గురించి నాకు తెలిసింది తక్కువ. మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయం సియాటిల్ లో వుందని తెలుసు. ఆంద్ర జ్యోతిలో లోగడ పనిచేసిన నా మిత్రుడు రామానాయుడు ఆ పత్రిక తరపున ఓసారి సియాటిల్ వెళ్లి వచ్చాడు. ఎప్పుడూ వానలు పడుతుంటాయని  చెప్పాడు. మేము సియాటిల్ వెళ్లేసరికి వాతావరణం బాగానే వుంది. సందీప్ తన స్నేహితుడు అనూప్ తో కలసి రెండు కార్లు తీసుకుని ఎయిర్ పోర్ట్ కి వచ్చాడు. భద్రతా ఏర్పాట్లు యెంత పటిష్టంగా వున్నా విజిటర్లని లగేజి కలెక్ట్ చేసుకునే ప్రదేశం వరకు అనుమతిస్తూనే వున్నారు. మా మనుమరాలు సఖి కూడా వెంట వచ్చింది.

 అందరం కలసి కారు పార్కింగ్ కు వెళ్ళాం. అదో పలు అంతస్తుల భవనం. ఒక్కో అంతస్తులో రెండు,మూడు వందల కార్ల వరకు పార్క్ చేసుకునే వీలుంది. మేము లిఫ్ట్ లో ఏడో  అంతస్తుకు వెళ్లి కార్లలో లగేజి వేసుకుని గంట ప్రయాణం తరవాత బెల్ వ్యూ లోని సందీప్ అపార్ట్ మెంట్ కి చేరాము.
ఇంటికి చేరిన తరవాత – సూట్ కేసులు తెరిచి చూసుకుంటే – సామానులపైన – ట్రాన్స్పోర్టేషన్ సెక్యూరిటీ ఎడ్మినిస్ట్రేషన్ వారి నోటీసు కనిపించింది.
అందులో ఇలా వుంది

బ్యాగేజీ తనిఖీ నోటీసు

“మీకూ – మీ తోటి ప్రయాణీకులకూ భద్రత కల్పించే చర్యలలో భాగంగా మీ బ్యాగేజీని మేము క్షుణ్ణంగా తనిఖీ చేసాము. ఇందుకోసం ఎంపిక చేసిన బ్యాగేజీల్లో మీది కూడా వుంది.

“నిషేధిత సామాగ్రి ఏమయినా వుందేమో తెలుసుకోవడం కోసం మీ బ్యాగేజీని మీ అనుమతి లేకుండానే తెరిచి చూసాము. తాళాలు వేసివున్నందువల్ల – గత్యంతరం లేని పరిస్తితిలో – వాటిని పగలగొట్టవలసి వచ్చింది. క్షంతవ్యులం. అయితే నిబంధనల మేరకే ఈ పని చేసాము. అందువల్ల- ఈ ప్రక్రియలో బ్యాగేజీకి ఏమయినా నష్టం జరిగినా – దానికి మా పూచీ లేదు.

“మీరు మరోసారి విమాన ప్రయాణం చేసినప్పుడు ఇలాటి అనుభవం పునరావృతం కాకుండా వుండాలంటే – బ్యాగేజీని ఎలా ప్యాక్ చేసుకోవాలో మీకు ముందే తెలిసివుంటే మంచిది.

"www.tsa.gov “ వెబ్ సైట్ లో ఈ వివరాలు లభిస్తాయి. 866 289 9673 టోల్ ఫ్రీ నంబర్ కు కూడా ఫోన్ చేసి కానీ లేదా TSA -contact center@dhs.gov ఈమెయిల్ చేసి కానీ తెలుసుకోవచ్చు.”

'వహ్వా అమెరికా' అని అనుకోకుండా ఉండగలమా!

NOTE: All images in this blog are copy righted to their respective owners