28, జులై 2010, బుధవారం

అమెరికా అనుభవాలు – 4

అమెరికా అనుభవాలు – 4

గీతల నడుమ జీవితం



నేను ముందు అనుకున్నట్టు సియాటిల్ చిన్న నగరమేమీ కాదు. బహుశా హైదరాబాదుకి రెండు మూడు రెట్లు వుంటుందేమో. అనేక కొండల మీద నిర్మితమయిన నగరమిది. పచ్చదనం పరచుకున్నట్టు ఎటు చూసినా పచ్చని చెట్లు. సియాటిల్ వున్న వాషింగ్టన్ స్టేట్ ని గ్రీన్ స్టేట్ అని ఎందుకు అంటారో ఈ నగరాన్ని చూస్తె అర్ధమవుతుంది. పచ్చదనానికి తోడు విశాలమయిన రహదారులు. ఈ రోడ్లని గమనిస్తే అమెరికన్లని గురించి ఒకరు చెప్పిన విషయం గుర్తుకు వస్తుంది. సుఖప్రదమయిన జీవితం గడపడం వారి లక్ష్యం. అది సజావుగా నడవడానికి అవసరమయిన కొన్ని నియమనిబంధనలు ఏర్పరచుకుని వాటిని ఖచ్చితంగా పాటిస్తున్నారు. ఈ నిబంధనల అమలు మీద సర్కారు ఆజమాయిషీ కంటే స్వచ్చందంగా పౌరులు వాటికి కట్టుబడి వ్యవహరించడం వల్లే అవి విజయవంతంగా అమలు జరుగుతున్నాయని చెప్పవచ్చు. అమెరికాలో మీకు నచ్చిన విషయం ఏమిటంటే ‘రహదారులు’ అని నిస్సంశయంగా నేను జవాబిస్తాను. మనలో చాలామందిమి టీవీలో వీడియో గేమ్స్ చూసి వుంటాము. రోడ్లపై గీతల నడుమ ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించుకుంటూ కారు నడపాల్సివుంటుంది. గీతలకు ఆవలగా ఏమాత్రం పక్కకు జరిగినా ప్రమాదం జరుగుతుంది. అలాగే అమెరికాలో రోడ్లు కూడా. నిర్దిష్టమైన వేగంతో గీతల నడుమ కారు నడుపుకుంటూ వెడితే చాలు, ఎలాటి ఇబ్బంది వుండదు. వాహనాలు వెళ్ళడానికి, రావడానికి వేర్వేరు రహదారులు వుంటాయి. ఒక్కో మార్గంలో మూడు,నాలుగు వరసల్లో వాహనాలు వెడుతుంటాయి. హారన్ మోగించే ప్రసక్తే లేదు. ఓవర్ టేక్ చేయాలంటే ఖాళీగా వున్న మరో వరుసలోకి వెళ్లి వేగంగా దాటి మళ్ళీ మన వరుసలోకి రావాలి. ఇక ఫ్రీవేల ( FREE WAYS) విషయం తీసుకుంటే వాటి నిర్మాణ శైలి పరమాద్భుతంగా వుంటుంది.


 దేశంలోని వివిధ నగరాలను కలుపుతూ నిర్మించిన ఈ ఫ్రీ వేస్ – అనేకనగరాల మధ్యనుంచి వెడుతుంటాయి. వీటిల్లో కార్లు,తదితర పెద్ద వాహనాలు మినహా మిగిలినవి నిషిద్దం. అలాగే కాలి నడకన వెళ్ళేవారు కూడా వీటిపైకి రాకూడదు. ఈ ఫ్రీ వే ఎడమ వయిపు వరసని ‘కార్ పూల్’ అంటారు. ఒకరికి మించి ప్రయాణీకులు వున్న వాహనాలు మాత్రమె ఇందులో వెళ్ళడానికి వీలుంటుంది. ఈ లైన్ లో వెళ్ళే వాహనాలు తక్కువగా వుంటాయి. కనుక వేగంగా వెళ్ళడానికి వీలుంటుంది. రోడ్లమీద వాహనాల రద్దీ తగించడానికి ఈ ‘కార్ పూల్’ పధ్ధతి ప్రవేశ పెట్టారని చెప్పుకుంటారు.


 ఇక్కడ ప్రతి వారికీ కారు వుంటుంది. కనుక ఇద్దరు కలసి వెడితే రెండో కారు బయటకు తీయనక్కరలేదు, కాబట్టి రద్దీ తగ్గుతుందని అంటారు. కార్ పూల్ వరుసలో కాకుండా వేరే వరుసల్లో వాహనాల రద్దీ ఎక్కువగా వుండి చాలా సార్లు ట్రాఫిక్ జామ్ ఏర్పడుతూ వుంటుంది. నిజానికి ఆ వరుసల్లో వెళ్ళే కార్లలో ఒకే వ్యక్తి ప్రయాణిస్తుంటాడు. అయినా సరే కార్ పూల్ వరుసలోకి రావడానికి ప్రయత్నించడు. చేసాడా జరిమానాలు భారీగా వుంటాయి. జరిమానా భయం కన్నా – నిబంధన పాటించాలన్న నిబద్ధతే వారినలా చేయిస్తోందనడం సబబుగా వుంటుంది. అలాగే నాలుగు రోడ్ల కూడళ్ళలో ఏర్పాటు చేసిన ‘స్పెన్సర్’ వ్యవస్థ కూడా ఎంతో బాగుంది. ఇక్కడ ట్రాఫిక్ దీపాలు యిరవై నాలుగ్గంటలు పనిచేస్తాయి. వాహనాల రద్దీ తక్కువగా వుండే అర్ధరాత్రి సమయాలలో ఈ స్పెన్సర్ లు ఉపయోగపడతాయి. ఎదుటివయిపునుంచి వాహనాలు రాకపోయినా ఎర్రదీపం కారణంగా కారు నిలపాల్సిన అవసరం లేకుండా రోడ్ల కింద అమర్చిన ఈ స్పెన్సర్ లు – కారు ముందు టైర్లు తాకగానే – గ్రీన్ సిగ్నల్ పడేలా చూస్తాయి.

నడిచే వాడిదే రోడ్డు

ఇక్కడి వారికి ఏమున్నా లేకపోయినా కారు మాత్రం వుండి తీరాలి. కారు లేక పోతే కాలూ చేయీ ఆడదు. రోడ్లమీద నడిచేవారు అంతంత మాత్రంగానే కానవస్తారు. కానీ వాళ్ళదే ఇక్కడ హవా. ఎంతో వేగంగా వెళ్ళే వాహనమయినా సరే నడిచి వెళ్ళే వారు కనబడగానే ఆగిపోతుంది. వాళ్ళు రోడ్డు దాటి వెళ్లేవరకూ అన్ని వాహనాలు తటాలున నిలబడి పోతాయి.


 నడిచివెళ్లేవారిని డీ కొడితే అదో పెద్ద నేరం. ఆ కేసునుంచి బయటపడాలంటే చాలా పెద్ద మొత్తంలో నష్ట పరిహారం చెల్లించుకోవాల్సి వుంటుంది. రద్దీగా వుండే రోడ్లని క్రాస్ చేయడానికి కూడళ్ళ వద్ద నాలుగు వయిపులా ‘సిగ్నల్ పుష్ బటన్లు’ వుంటాయి.


 వాటిని ప్రెస్ చేస్తే రోడ్డు దాటడానికి వీలుగా రెడ్ లైట్ మారిపోయి తెల్లదీపం వెలుగుతుంది. ఇలాటి ఏర్పాటు అన్ని నగరాల్లోనూ వుంది.

క్లిష్ట సమస్యకు సింపుల్ పరిష్కారం  

ఎప్పుడు జనసందోహంతో వుండే మార్కెట్ ప్రదేశాలలో నడిచి వెళ్ళే వాళ్ళు -  రోడ్లు దాటడానికి విద్యుత్ దీపాలతో అవసరంలేని ఒక పద్దతి ఇక్కడ  అనుసరిస్తున్నారు. అది మనదగ్గర కూడా ప్రవేశపెడితే బాగుంటుందేమో.





 అదేమిటంటే రోడ్డుకు ఇరువైపులా ఒక బాస్కెట్ లో కొన్ని జండాలు ఉంచుతారు. రోడ్డుదాటాలనుకునేవారు ఒక జండా చేతిలోకి తీసుకుని వెళ్ళాలి. ఆ జండా చేతిలో వుంటే చాలు - రోడ్డుపై పై వెళ్ళే వాహనాలన్నీ టక్కున ఆగిపోతాయి.


 రోడ్డుదాటగానే రెండో వైపువున్న బాస్కెట్ లో జండా ఉంచేసి వెళ్లిపోవచ్చు.చిన్న పిల్లలు, వృద్ధులు, పిల్లల తల్లులకు యిది చాలా ఉపయుక్తంగా వుంది.  యెంతో క్లిష్టంగా అనిపించే సమస్యకు వాళ్ళు కనుగొన్న 'సులువయిన' పరిష్కారం ఇది. ట్రాఫిక్ సమస్యలపై అధ్యయనం పేరుతో విదేశీ పర్యటనలు చేసే  పోలీసు అధికారుల కళ్ళలో యిది పడకపోవడం విచిత్రమే మరి.
           
ట్రాఫిక్ కు సంబంధించి కొట్టవచ్చిన్నట్టు కనబడే మరో విషయం ఏమిటంటే ఎక్కడా రోడ్లమీద ట్రాఫిక్ పోలీసులు జాడ కనబడదు. వాళ్ళు హమేషా వాహనాల్లో తిరుగుతూ అతి వేగంగా వెళ్లే వాహనాలను అదుపు చేస్తుంటారు. జాతీయ రహదారులపై ఈ పోలీసులు హెలికాప్టర్లలో గస్తీ తిరుగుతుంటారు. వాహనదారులు భయపడేది వీరికే. అతి వేగంగా వెళ్లే వాహనాలను పట్టుకోవడానికి అప్పుడప్పుడు వీరు రోడ్ల పక్క చెట్ల మాటున మాటు వేస్తారు. వీరి వాహనంలో వైర్లెస్ టెలిఫోను, కంప్యూటర్, ఇంటర్నెట్ తో పాటు ‘గన్’అని పిలిచే ఒక పరికరం వుంటుంది. ఈ పరికరాన్ని రోడ్లపై వేగంగా వెడుతున్న వాహనాల వయిపు గురిపెట్టి వుంచుతారు. నియమిత వేగాన్ని మించి ప్రయాణిస్తున్న వాహనాన్ని ఈ పరికరం గుర్తించి కారు నంబరుతో సహా నమోదు చేస్తుంది.


 మన వైపు చలాన్ చెయ్యడం చూసివుంటారుకదా. ఇక్కడ టికెట్ ఇవ్వడం అంటారు. కారు నంబర్ ను బట్టి కంప్యూటర్ ద్వారా వాహనదారుడికి చెందిన వివరాలన్నీ వారికి ఇట్టే తెలిసిపోతాయి. టికెట్ నేరుగా ఇంటికే వస్తుంది. కోర్టులో జరిమానా చెల్లించుకోవాలి. ఇలాటి టికెట్ల సంఖ్య పెరిగిందంటే డ్రైవింగ్ లైసెన్స్ ఆటోమాటిక్ గా రద్దయిపోతుంది. లైసెన్స్ పోయి కారు నడపలేకపోతే జీవచ్చవం కింద లెక్క. అంతే కాదు- ఎక్కువసార్లు పోలీసులకు దొరికిపోయిన రికార్డ్ వుంటే కారు ఇన్సూరెన్స్ ప్రీమియం పెరిగిపోతుంది. మరోసారి కారు కొనుక్కోవడానికి అప్పు పుట్టదు కాక పుట్టదు.అలాగే బ్యాంకుల్లో అప్పులు కూడా.

కారు భీమా వుంటే ఆ ధీమాయే వేరు కదా! 

 పౌరులందరికీ సోషల్ సెక్యూరిటీ నంబర్ ఇచ్చి వారి సమస్త వివరాలను కంప్యూటర్లలో నిక్షిప్తం చేయడం ద్వారా అన్ని రకాల అక్రమాలకూ కళ్ళెం వేయగలిగారు. చెల్లని చెక్కులు ఇవ్వడం, అద్దెలు ఎగ్గొట్టి ఇల్లు మారిపోవడం, బ్యాంకులనుంచి తీసుకున్న రుణాలు అనుకున్న వ్యవధిలో చెల్లించకపోవడం, ప్రమాదకరంగా కార్లను నడపడం ఇలా ఏది చేసినా కంప్యూటర్ల ద్వారా తెలిసిపోయి చట్టం చేతికి సులువుగా చిక్కిపోతారు. ఈ విధంగా క్రమబద్ధమయిన, చట్టబద్ధమయిన జీవనానికి ప్రజలు అలవాటు పడేలా చేయడానికి కంప్యూటర్ పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్న తీరు హర్షణీయం.

NOTE: All images in this blog are copy righted to their respective owners

అమెరికా అనుభవాలు - 3

అమెరికా అనుభవాలు - 3

తొలిపరిచయం

లాస్ ఏంజెల్స్ నుంచి సియాటిల్ వెళ్ళడానికి మరో విమానం ఎక్కాలి. దానికి రెండు గంటలకు పైగా వ్యవధి వుంది. లాస్ ఏంజెల్స్ చేరగానే ఆ విషయం సియాటిల్ లో  వున్న తనకు తెలియచేయడానికి వీలుగా సందీప్ ముందుగానే ఒక ఫోన్ నంబర్ ఇచ్చాడు. డబ్బులతో అవసరం లేని నంబర్ అది. దాని ద్వారా కబురు అందించడానికి నేను చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.


 నా పాట్లు గమనించిన ఒక అమెరికన్  మహిళ – తానే చొరవ తీసుకుని తన సెల్ ఫోన్ ద్వారా సియాటిల్ లోని సందీప్ కి మేము క్షేమంగా చేరిన సమాచారాన్ని చేరవేసింది. అమెరికన్లతో నా తొలి పరిచయం ఇలా సుహృద్భావంగా జరగడం ఏంతో సంతోషం అనిపించింది.
సియాటిల్ విమానం ఎక్కేముందు కూడా మా బాగేజీని క్షుణ్ణంగా పరీక్షించారు. ఊరగాయ పచ్చళ్ళను గురించి ఒకటికి రెండు సార్లు ప్రశ్నించారు. చివరికి మా సామానునంతా మా కళ్ళ ముందే సూట్ కేసుల్లో జాగ్రత్తగా సర్ది మాకప్పగించారు.

సియాటిల్

ఎట్టకేలకు సియాటిల్ వెళ్ళే విమానం ఎక్కాము. సుమారు రెండుగంటల ప్రయాణం.


సియాటిల్ గురించి నాకు తెలిసింది తక్కువ. మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయం సియాటిల్ లో వుందని తెలుసు. ఆంద్ర జ్యోతిలో లోగడ పనిచేసిన నా మిత్రుడు రామానాయుడు ఆ పత్రిక తరపున ఓసారి సియాటిల్ వెళ్లి వచ్చాడు. ఎప్పుడూ వానలు పడుతుంటాయని  చెప్పాడు. మేము సియాటిల్ వెళ్లేసరికి వాతావరణం బాగానే వుంది. సందీప్ తన స్నేహితుడు అనూప్ తో కలసి రెండు కార్లు తీసుకుని ఎయిర్ పోర్ట్ కి వచ్చాడు. భద్రతా ఏర్పాట్లు యెంత పటిష్టంగా వున్నా విజిటర్లని లగేజి కలెక్ట్ చేసుకునే ప్రదేశం వరకు అనుమతిస్తూనే వున్నారు. మా మనుమరాలు సఖి కూడా వెంట వచ్చింది.

 అందరం కలసి కారు పార్కింగ్ కు వెళ్ళాం. అదో పలు అంతస్తుల భవనం. ఒక్కో అంతస్తులో రెండు,మూడు వందల కార్ల వరకు పార్క్ చేసుకునే వీలుంది. మేము లిఫ్ట్ లో ఏడో  అంతస్తుకు వెళ్లి కార్లలో లగేజి వేసుకుని గంట ప్రయాణం తరవాత బెల్ వ్యూ లోని సందీప్ అపార్ట్ మెంట్ కి చేరాము.
ఇంటికి చేరిన తరవాత – సూట్ కేసులు తెరిచి చూసుకుంటే – సామానులపైన – ట్రాన్స్పోర్టేషన్ సెక్యూరిటీ ఎడ్మినిస్ట్రేషన్ వారి నోటీసు కనిపించింది.
అందులో ఇలా వుంది

బ్యాగేజీ తనిఖీ నోటీసు

“మీకూ – మీ తోటి ప్రయాణీకులకూ భద్రత కల్పించే చర్యలలో భాగంగా మీ బ్యాగేజీని మేము క్షుణ్ణంగా తనిఖీ చేసాము. ఇందుకోసం ఎంపిక చేసిన బ్యాగేజీల్లో మీది కూడా వుంది.

“నిషేధిత సామాగ్రి ఏమయినా వుందేమో తెలుసుకోవడం కోసం మీ బ్యాగేజీని మీ అనుమతి లేకుండానే తెరిచి చూసాము. తాళాలు వేసివున్నందువల్ల – గత్యంతరం లేని పరిస్తితిలో – వాటిని పగలగొట్టవలసి వచ్చింది. క్షంతవ్యులం. అయితే నిబంధనల మేరకే ఈ పని చేసాము. అందువల్ల- ఈ ప్రక్రియలో బ్యాగేజీకి ఏమయినా నష్టం జరిగినా – దానికి మా పూచీ లేదు.

“మీరు మరోసారి విమాన ప్రయాణం చేసినప్పుడు ఇలాటి అనుభవం పునరావృతం కాకుండా వుండాలంటే – బ్యాగేజీని ఎలా ప్యాక్ చేసుకోవాలో మీకు ముందే తెలిసివుంటే మంచిది.

"www.tsa.gov “ వెబ్ సైట్ లో ఈ వివరాలు లభిస్తాయి. 866 289 9673 టోల్ ఫ్రీ నంబర్ కు కూడా ఫోన్ చేసి కానీ లేదా TSA -contact center@dhs.gov ఈమెయిల్ చేసి కానీ తెలుసుకోవచ్చు.”

'వహ్వా అమెరికా' అని అనుకోకుండా ఉండగలమా!

NOTE: All images in this blog are copy righted to their respective owners



అమెరికా అనుభవాలు - 2

అమెరికా అనుభవాలు - 2

9-11

‘క్రీస్తు పూర్వం – క్రీస్తు తరవాత ‘ మాదిరిగానే ఇప్పుడు అమెరికా, ‘9-11 కు పూర్వం – 9-11 కు తరవాత’- అన్నట్టుగా తయారయింది. ఈ దేశంలో తేదీలు రాసేటప్పుడు ముందు నెల, తరవాత తేదీ, ఆ తరవాత సంవత్సరం పేర్కొంటారు.



9-11 అంటే సెప్టెంబర్ 11 వ తేదీ అన్నమాట. సెప్టెంబర్ 11 వ తేదీని ఇప్పుడు అమెరికాలో ‘దేశభక్తుల దినంగా’ పాటిస్తూ వున్నారు. న్యూయార్క్ నగరానికి – ఇంకా చెప్పాలంటే – మొత్తం అమెరికాకే మాన్యుమెంట్స్ అనదగ్గ – ప్రపంచ వాణిజ్య సంస్థ – WORLD TRADE CENTER – జంట భవనాలను ఉగ్రవాదులు విమానాలతో పడగొట్టి నేలమట్టం చేసిన రోజది. యావత్ ప్రపంచానికి పెద్దన్న మాదిరిగా వ్యవహరిస్తూ, తమ అధికారానికీ, ఆధిపత్యానికీ ఎదురులేదనీ, తాము నిర్మించుకున్న భద్రతా వ్యవస్తకు తిరుగులేదనీ – ఏళ్ళ తరబడి పెంచి పోషించుకున్న అమెరికన్ల ఆత్మవిశ్వాసానికి తూట్లు పడ్డ దుర్దినం అది. ఆ రోజు నుంచి అమెరికాలో పరిస్థితులు చాలా మారిపోయాయి. ఎప్పుడు ఏమి జరుగుతుందో అన్న అభద్రతాభావం అధికారవర్గాలలోనే కాక, సామాన్య జనంలో కూడా పెరిగిపోయింది. వ్యక్తిగత స్వాతంత్ర్యానికి పెద్ద పీట వేసే ఈ దేశంలో – తొలిసారిగా అమెరికన్లు కట్టుదిట్టమయిన భద్రతాచర్యలకు తలవంచుతున్నారు.
ఎందుకిలా జరిగింది?

అమెరికా గడ్డమీద లాస్ ఏంజెల్స్ విమానాశ్రయంలో మొదటిసారి కాలు మోపినప్పుడు ఇలాటి దృశ్యాలే దర్శనమిచ్చాయి. భారత దేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఇవి సర్వ సాధారణం. మాల్ కు వెళ్ళినా, సినిమా హాల్ కు వెళ్ళినా, పెద్దలు, ముఖ్యులు హాజరయ్యే పెళ్ళికి వెళ్ళినా – సెక్యూరిటీ ద్వారాలు దాటి వెళ్ళాల్సిన పరిస్తితి. 9-11 కు పూర్వం – వేరే దేశాల్లో ఈ మాదిరి భద్రతా చర్యలు చూసి అమెరికన్లు ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకున్నారేమో తెలియదు.


లాస్ ఏంజెల్స్ విమానాశ్రయం అతి పెద్దది. ప్రతి నిమిషం ఏదో ఒక విమానం ఏదో ఒక దేశం నుంచి వచ్చి ఇక్కడ వాలుతుంటుంది. వందలాదిమంది ప్రయాణీకులు తమ పాస్ పోర్ట్ లపై వీసా స్టాంప్ వేయించుకునేందుకు పెద్ద పెద్ద క్యూలలో నిలబడి ఆత్రంగా ఎదురుచూస్తుంటారు. అనేక గంటలపాటు ప్రయాణం చేసివచ్చి ఇమిగ్రేషన్ అధికారుల ‘అనుమానపు’చూపులను ఎదుర్కుంటూ – ఆలస్యం అయ్యే కొద్దీ కనెక్టింగ్ ఫ్లయిట్ తప్పిపోతుందేమో అని భయపడుతూ, వీసా ప్రాసెసింగ్ పనులు పూర్తి కాగానే ‘అమ్మయ్య’ అని వూపిరి పీల్చుకుంటారు

. బ్యాగేజి చెకింగ్ మరో ప్రయాస. స్టేయిన్లేస్ స్టీల్ టంగ్ క్లీనర్లు కూడా భద్రతా అధికారుల డేగ కన్నులనుంచి తప్పించుకోలేవు. క్యూలో వున్నప్పుడు ఒక ప్రయాణీకుడికీ మరో ప్రయాణీకుడికీ నడుమ తగినంత ఎడం వుండేలా నిలబడాలి.

 బూట్లు సాక్స్ తో సహా అన్ని వస్తువులు తీసి అధికారుల కళ్ళ ఎదుటే ప్లాస్టిక్ ట్రేలలో వుంచాలి. ఆడ ప్రయాణీకుల పరిస్తితి మరీ ఘోరం.

 వాళ్ళని ప్రత్యెక ఎంక్లోజర్లలో వుంచి ఆపాదమస్తకం పరీక్షిస్తారు. పాదాల గుర్తులు వున్న ప్రదేశంలో మాత్రమే కాళ్ళు వుంచి నిలబడాలి. సహజంగానే స్వేచ్చాప్రియులయిన అమెరికన్లు – మరింత సహజంగానే – మానసికంగా వ్యాకులపడుతు న్నారు. అంతర్లీనంగా వున్నా ఈ వేదన వారి మొహాల్లో కానవస్తూనే వుంది. ఎందుకిలా జరిగిందన్న ప్రశ్న వారిని వేధిస్తూనే వుంది.

రోలాండ్ నేధవేవాకో ట్రిబ్యూన్ హెరాల్డ్ లో సీనియర్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. ఎయిర్ పోర్ట్ లలో ఎక్స్ రే యంత్రాల వాడకం ప్రయాణీకుల ప్రయివసీని హరించడమే కాగలదని ఒక వ్యాసంలో ఆందోళన వ్యక్తం చేసారు. ఆ వ్యాసం లోని కొన్ని భాగాలకు స్వేచ్చానువాదం :
____________________________________________________________________________________________________

“ ఎక్స్ రే కళ్ళు సూపర్ మాన్ కు మాత్రమే వుంటాయని ఇన్నాళ్ళు భావిస్తూ వచ్చాను. సెప్టెంబర్ 11,2001 తరవాత ఆవిర్భవించిన “ ట్రాన్స్పో ర్టేషన్ సెక్యూరిటీ ఏజెన్సీ” అధికారులకు ఇలాటి ఎక్స్ రే కళ్ళు ఇప్పుడు చాలా అవసరంగా కనిపిస్తున్నాయి. విమానం ఎక్కే ప్రతి ఆడా మగా పాసెంజర్ దుస్తుల్ని చీల్చుకుని వారిని నఖశిఖ పర్యంతం నగ్నంగా సోదా చేసేందుకు ‘బ్యాక్ స్కాటర్’ ఎక్స్ రే యంత్రాలను వాడాలనుకుంటున్నారు. దుస్తుల్లోపల ఏమయినా ప్రమాదకరమయిన ఆయుధాలు కలిగివున్నారా లేదా అన్నది తెలుసుకోవడం కోసం ఒక్కొక్కటి రెండు లక్షల డాలర్లు ఖరీదు చేసే ఈ యంత్రాలను కొనుగోలు చేసే పనిలో వున్నారు. ప్రసుతం ఈ రకమయిన విధులను ‘స్వయంగా’ నిర్వహిస్తున్న స్క్రీనింగ్ సిబ్బంది, ప్రయాణీకుల శరీరంలోని ప్రైవేటు పార్టులను అభ్యంతరకరమయిన రీతిలో తాకుతున్నారనే విమర్శలు కోకల్లలుగా వస్తున్నాయి. ఈ యంత్రాల వాడకం ద్వారా ఈ అభ్యంతరకర భౌతిక మర్మాంగ శోధన చాలా వరకు తగ్గిపోగలదని సెక్యూరిటీ ఏజెన్సీ అధికారులు భావిస్తున్నారు. అయితే, సెక్యూరిటీ పేరుతొ నిర్వహించే ఈ సోదాలు పౌరుల ప్రయివసీని పూర్తిగా హరిస్తున్నాయి.


 మామూలు జలుబుకు ఇంతవరకు సరయిన మందు కనుక్కోలేని శాస్త్రవేత్తలు – మనుషుల్ని దుస్తులగుండా నగ్నంగా చూడగల ఇలాటి బ్యాక్ స్కాటర్ ఎక్స్ రే యంత్రాలను మాత్రం మహా ఉత్సాహంగా కనుక్కుంటారు. ఉగ్రవాదులవల్ల పొంచి వున్న ముప్పును ఎవరూ కాదనలేరు. కానీ ఇలాటి సెక్యూరిటీ చర్యలు ఉగ్రవాదానికి పరిష్కారం కాదు. ప్రభుత్వం గట్టిగా పూనుకుని ఉగ్రవాదాన్ని నిర్మూలించాలి. ఉగ్రవాదులను సమూలంగా ఏరిపారేయాలి. అప్పుడిక భద్రతా గురించిన బెంగ వుండదు. పరిస్తితుల్ని అడ్డం పెట్టుకుని పౌరుల ప్రయివసీని హరించాలని చూసే ప్రభుత్వ భద్రతా వ్యవస్తల ఉబలాటానికి కూడా కళ్ళెం పడుతుంది. అంతే కానీ, ఎయిర్ పోర్ట్ ల్లో ఇలాటి యంత్రాలను ఏర్పాటు చేయాలనే ఆలోచనను మొండిగా ఆచరణలో పెడితే మాత్రం చాలామంది జనం విమానాలు ఎక్కడమే మానుకుంటారు “
____________________________________________________________________________________________

అయితే ఏమాటకామాటే చెప్పుకోవాలి. ఇక్కడి అధికారగణంలో ఎలాటి డాబూ దర్పం కనిపించవు. కటినంగా వున్నట్టు కానవస్తారే కానీ మాటల్లో మర్యాద ఉట్టిపడుతూ వుంటుంది. విధి నిర్వహణని ఎంతో నియమబద్ధంగా పాటిస్తారు. అందువల్ల భద్రతా ఏర్పాట్లలో భాగంగా నిర్వహిస్తున్న ఈ వ్యక్తిగత సోదాల కారణంగా మనస్సు చివుక్కుమంటుందేమో కానీ అహం (EGO) దెబ్బతినదు.

(అమెరికాలో తొలిపరిచయం గురించి మలి భాగంలో)

NOTE: All images in this blog are copy righted to their respective owners

అమెరికా అనుభవాలు- 1

అమెరికా అనుభవాలు- 1 -





నేను హైస్కూల్ లో చదువుకునే రోజుల్లో ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వర రావు గారు అమెరికా సందర్శించి – ‘నేను చూసిన అమెరికా’ అని ఒక పుస్తకం రాశారు. అది చదివి ఆ పుస్తకానికి అలా ఎందుకు పేరు పెట్టారా అని అనుకునేవాడిని. ఇన్నేళ్ళ తరవాత ఇప్పుడు అమెరికాలో అయిదు మాసాలు వుండి వచ్చిన తరవాత అర్ధమయింది. అదొక సువిశాల దేశం. టూరిస్ట్ గా వచ్చిన వాళ్ళే కాదు ఎన్నో ఏళ్లుగా అక్కడ వుంటూ వచ్చిన వాళ్ళు కూడా అమెరికాని పూర్తిగా చూడడం కుదరని పని. అందుకే చూసిన మేరకే అవగాహన చేసుకుని అక్షరబద్ధం చేసేందుకే ఈ ప్రయత్నం.

వీసాలు అంత కఠినం

అమెరికా వెళ్లడం అన్నది మన దేశంలో చాలా మందికి తీరని కల. ఎందుకంటె వీసా నిబంధనలు అంత కఠినతరం. డబ్బున్నవాళ్ళు కూడా మరో మరో విదేశానికి వెళ్లి వచ్చినంత సులభంగా అమెరికా వెళ్ళలేరు. అలాగే ఆనాటి సోవియట్ యోనియన్ కూడా. అయితే, ఓ పుష్కర కాలం క్రితం ఆకాశవాణి పుణ్యమా అని మాస్కోవెళ్లి నాలుగు సంవత్సరాలపాటు రేడియో మాస్కోలో పనిచేసివచ్చాను. ఆ రోజుల్లో ప్రపంచ దేశాల్లో అమెరికాకు పోటీగా నిలబడిన మరో ఏకైక అధికార ధ్రువం సోవియట్ యూనియన్. అనేక దశాబ్దాల తరబడి అప్రతిహతంగా సాగిన మొట్టమొదటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం అంతిమ ఘడియలు చూడగలిగే అరుదయిన అవకాశం లభించిన నేను –‘మార్పు చూసిన కళ్ళు ‘ – అనే పేరుతొ ఆనాటి అనుభవాలను గ్రంధస్తం చేయాలనుకున్నాను. కానీ అది తీరని కోరికగానే మిగిలిపోయింది. ( తదనంతర కాలంలో వచ్చిన ‘బ్లాగుల’ పుణ్యమా అని పుస్తకరూపంలో తీసుకురాలేకపోయిన దానిని - దాదాపు పదిహేడు భాగాలు - నా బ్లాగులో (http://www.bhandarusrinivasarao.blogspot.com) పొందుపరచగలిగాను.పోతే, ఇప్పుడు- సియాటిల్ లో వుంటున్న మా పెద్దకుమారుడు సందీప్, అమెరికా చూసే అవకాశాన్ని కల్పించి – సోవియట్ యూనియన్ – అమెరికాలు రెండింటినీ చూడగలిగిన కొద్దిమంది హైదరాబాద్ జర్నలిష్టులలో నన్ను కూడా చేర్చాడు. నాకు తెలిసి ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ ఐ వెంకటరావు గారు, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ సెక్రెటరీ జనరల్ శ్రీనివాసరెడ్డి గారు ఈ రెండు దేశాలను చూసినవారిలో వున్నారు. ఈ అవకాశం ఇక ఎవరికీ దొరికే వీలు కూడా లేదు. ఎందుకంటే అంత పెద్ద కమ్యూనిస్ట్ దేశం - అంగ వంగ కలింగ దేశాల మాదిరిగా విచ్చిన్నమై చరిత్ర పుటల్లో మిగిలిపోయింది. కాగా, మిత్రుడు మాగంటి కోటీశ్వర రావుగారి పూనికతో ఎలాటి టెన్షన్ పడకుండా లభించిన పది సంవత్సరాల వీసాలతో నేనూ మా ఆవిడ నిర్మల – హైదరాబాదులో 2003 సెప్టెంబర్ ఆరో తేదీ శనివారం మలేసియన్ ఎయిర్ లైన్స్ లో బయలుదేరి కౌలాలంపూర్ మీదుగా సుమారు ముప్పయి గంటలు ప్రయాణం చేసి తిరిగి అదే రోజు – అంటే శనివారం నాడే అమెరికా లోని అతి పెద్ద విమానాశ్రయాల్లో ఒకటయిన లాస్ ఏంజెల్స్ చేరుకున్నాము. భూమండలానికి ఆవలవైపువున్న దేశానికి చేరడంవల్ల కాలగమనంలో వచ్చిన మార్పు ఇది.


(ఆరంభానికి ప్రారంభం)

NOTE: All images in this blog are copy righted to their respective owners

27, జులై 2010, మంగళవారం

నేడే చూడండి - భండారు శ్రీనివాసరావు

నేడే చూడండి - భండారు శ్రీనివాసరావు



తప్పనిసరయి ఇక తప్పదురా అనుకున్నప్పుడు అనుభవించి ఆనందించమని ఇంగ్లీష్ లో ఓ సామెత వుంది.
మంచికో చెడుకో టీవీ అనేది ఇప్పుడు ‘నెసిసరీ ఈవిల్’ గా తయారయిందన్నది మాత్రం నిజం. తిట్టుకుంటూ అయినా చూడక తప్పని అవసరంగా మారిందన్నది మరో నిజం. కాదనలేని ఈ నిజాల దృష్ట్యా - తిట్టుకోవడం కూడా మానేసి టీవీని చూస్తూపోతూవుంటే నష్టపోయేదేమీ వుండదు కరెంటు ఖర్చు తప్ప – అన్నాడో టీవీ విప్లవకవి.

వెనుకటి రోజుల్లో, ఆవు పేడ ఎక్కడ దొరుకుతుంది అంటే ‘దూరదర్శన్ లో ‘ అనేవారు నవ్వుతాలుగా. కానీ ఇప్పడు యిరవై నాలుగ్గంటల న్యూస్ చానళ్ళు వచ్చేశాక మొదలయిన ఊకదంపుడు చర్చలు చూస్తునప్పుడు – ఆ పేడా పిడ కలే నయమనే వారు ఎక్కువయ్యారు. వార్తల అధారంగా వ్యాఖ్యలు, వ్యాఖ్యల ఆధారంగా వార్తలు, మళ్ళీ వీటి ఆధారంగా చర్చలు, వాటిపై తిరిగి ‘ఫోన్ ఇన్ లు’, మధ్యమధ్యలో విలేకరుల విరుపులు, యాంకర్ ల విన్యాసాలు, ‘లక్ష వొత్తుల నోములు’ లక్ష సార్లు నోచుకోవాల్సిన న్యూస్ ప్రేజెంటర్ల మూకుమ్మడి తెలుగు భాషా హత్యాప్రయత్నాలు, బుల్లి తెర నిండుగా ‘ఇప్పుడే అందిన ఎప్పటివో వార్తలు’, తాబేలు, కుందేలు మాదిరిగా డేకుతూ, పాకుతూ వెళ్ళే స్క్రోలింగులు, పంటికింది రాళ్ళలా ‘యాడ్ లు ‘ - ఒకటా రెండా యేమని చెప్పుదు ఆ టీవీల లీలలు. యేమని వర్ణింతునూ ఆ ఛానళ్ళ సొగసులు – అన్నాడో వికట కవి.

టీవీల్లో చూపించే చర్చలని చూస్తూ వాటిపై చర్చోపచర్చలు చేసేవాళ్ళని చూస్తూవుంటాము. బుల్లి తెరలపై కానవచ్చే విశ్లేషణ కర్తలే- భుజాలపై శంఖు చక్రాలు పొడిపించుకుని, ‘భుజకీర్తులు’ తగిలించుకున్న భజన బృందగాన బృందావన విహారులుగా చెలరేగిపోతున్నప్పుడు – మేము మాత్రం తీసిపోయామా అన్నట్టు చూసేవాళ్ళు కూడా సినీహీరోల వీరాభిమానుల మాదిరిగా చీలిపోయి ఆయా రాజకీయ పార్టీల అధికార ప్రతినిధులను కూడా మించిపోయి శ్రుతి మించి ‘రాగాలు’ అందుకుంటున్న తీరుతెన్నులు గమనించేవారికి ‘బ్రోచే వారెవరురా ‘ అన్న కీర్తన జ్ఞాపకం వచ్చి- ప్రకటితమో అప్రకటితమో ‘కరెంటు కోత’ ఒక్కటే తమను కాపాడగలగలదని ‘గజేంద్ర మోక్షం’ పద్యాలను తిరగేసి అరగదీస్తుంటారంటూ - ’ఇవా ఈనాడు జనానికి కావలసినవి? ఇదా ఈ రోజు జనం కోరుకుంటున్నది?’అని ఆవేశపడిపోయాడో వికటాట్ట కవి.

కానీ, ఇక్కడే కరెక్టుగా పైన చెప్పిన సామెత అక్కరకు వస్తుంది. అన్ని వేలుపోసి టీవీలు కొనుక్కున్నదెందుకు? వున్న చీకాకులను మరచిపోయి హాయిగా కాలక్షేపం చేసేందుకు. అంతేకానీ, ఇలా అడ్డమయిన చర్చల్లో తలదూర్చి లేని తలనొప్పులు తెచ్చుకునేందుకు కాదుకదా. అందుకని తెలివయిన వాళ్ళు చేయాల్సింది ఏమిటంటే –టీవీ రోట్లో పెట్టిన తలను రోట్లోనే వుంచేసి ‘రోకటి పోటు’ని ’ ఆహ్వానించి ఆస్వాదించడం – అంటూ సెలవిస్తున్నాడో ఉచిత సలహా కవి.
అందుకాయన ఇస్తున్న ఉదాహరణలను సోదాహరణంగా గమనించండి.
‘ముఖ్యమంత్రి రోశయ్య గారు ఈ సాయంత్రం డిల్లీ వెడతారా?
‘సోనియా గాంధీ ఆయనకు అప్పాయింట్మెంట్ ఇస్తారా ?
‘లేకపోతె అహ్మద్ పటేల్ లేదా అందుబాటులో వున్న మరో నాయకుడినో కల్సి సరిపెట్టుకుంటారా?
‘ఈ పరిణామాలను జగన్ వర్గం ఎలా గమనిస్తోంది?
‘జగన్ వర్గం వేయబోయే ఎత్తులపై కాంగ్రెస్ సీనియర్లు ఏమనుకుంటున్నారు?
‘రోశయ్య తదుపరి చర్యలు ఎలావుండబోతున్నాయి?
‘ఆయన వర్గం ఎలా భావిస్తోంది?
‘ఇంతకీ రోశయ్య గారికి ఒక వర్గమంటూ వుందా?
‘జగన్ వ్యతిరేక వర్గమే ఆయన వర్గమా?
‘ఇలా ఇన్ని రకాల ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న రాష్ట్ర కాంగ్రెస్ లో రానున్న రోజుల్లో రాగల పరిణామాలెలా వుండబోతున్నాయి?
‘ఎంతో ఆసక్తిని రగిలిస్తున్న ఈ అంశాలపై మేము అంటే మా ఛానల్ మాత్రమే నిర్వహిస్తున్న చర్చను మా ఛానల్ లోనే - ఈ రోజే, ఇప్పుడే చూడండి.’

వంటా వార్పూ కార్యక్రమంలో ‘ఇలా చేసి మాడండి’ తరహాలో వెలువడే ఈ రకం ప్రకటనలు వింటుంటే నవ్వు రావడం లేదా? ఇంతటి హాస్యాన్ని ఇరవై నాలుగ్గంటలపాటు ఇంటింటికీ పంచుతున్న తెలుగు టీవీ చానళ్ళ నిర్విరామ, నిస్వార్ధ, నిర్వికార సేవా నిరతిని కొనియాడడానికి మీకు మాటలు రావడం లేదా? అయినచో – మీకు నిష్కృతి యెట్లు? మీబోటి బోంట్లకు అదే సరయిన మార్గం. తలను రోటిలోనే వుంచండి. రోకటి పోటుకు వెరవకండి. (26-07-2010)

NOTE: All images in this blog are copy righted to their respective owners.

21, జులై 2010, బుధవారం

మనసు రాతలు - భండారు శ్రీనివాసరావు

మనసు రాతలు  - భండారు శ్రీనివాసరావు


(ఓ వయసులో ఈ రాతలు రాయని మనసూ వుండదు-మనిషీ వుండడు - నేనూ మినహాయింపు కాదు. కాకపొతే - ముప్పయి , నలభై ఏళ్ళ   తరవాత చదువుతూ వుంటే - రాసింది నేనేనా అనిపిస్తోంది.  కాలమహిమ కాబోలు  - రచయిత )


రాత్రి ఓ నక్షత్రం
రాలి ఒళ్ళో పడింది-
తెల్లారి చూస్తే అది నువ్వే




కొందరికి చందమామని చూస్తే
తమ ప్రియురాలు గుర్తుకువస్తుంది
కానీ నిన్ను చూసినప్పుడే
నాకు చందమామ గుర్తుకువస్తుంది





నిన్ను ముట్టుకుంటే
మబ్బుల్ని తాకినట్టువుంటుంది
నిన్ను ముద్దుపెట్టుకుంటే
నక్షత్రాన్ని ముద్దాడినట్టువుంటుంది

నువ్వే నాదానివయితే
ఇక సమస్త ప్రపంచం నాదే

నువ్వు కనబడలేదన్న బెంగ నాకెందుకు?
అస్తమానం నిన్ను అంటిపెట్టుకునే వున్నానుగా





రాత్రి కలలో నువ్వు
రాత్రంతా నాతో నువ్వు
ఇద్దరి మధ్యా నలుగుతూ పాపం రాత్రి
చివరికి నీ కనురెప్పల మధ్య
నిద్రపోతూ నేను




నీ మనసు మెత్తనిదే
హృదయమే ఒక పాషాణం
కానీ నా ప్రేమ వెడితో అది కరక్క పోతుందా
నేను చూడకపోతానా


గొంతు కొరబోయింది
నిన్న చాటుగా నువ్విచ్చిన
ముద్దు ఘాటు కాదు కదా


ఇంత ముద్దొస్తున్నావ్
ఓ ముద్దిస్తే నీ సొమ్మేం పోయింది?


నీ అందంలో వున్న రహస్యం ఏమిటో
ఎందరి కళ్ళు పడ్డా
దిష్టే తగలదు


నువ్వెదురుగావుంటే
యుగాలు క్షణాలు
నువ్వు కనుమరుగయితే చాలు
క్షణాలు


నిన్ను నేను మరవాలంటే
నన్ను నేను మరవాలి
నన్ను నేను మరవాలంటే
నిన్ను నేను మరవాలి




షాజహానుకు బుద్దిలేదు
ప్రియురాలికి గుండెలో గుడి కట్టాలి కాని
చలువరాళ్ళతో తాజమహలు కడతాడా?


నిను చూడకుంటే చస్తాను
నువు కనబడితే పడి చస్తాను


కన్ను తెరిస్తే నువ్వు
కనులు మూస్తే నువ్వు
కలల్లో నువ్వు
కనురెప్పల్లో నువ్వు
పీల్చే గాలిలో
విడిచే శ్వాసలో
రాసే రాతలో
నువ్వే-నీ నవ్వే


ఊహల్లో నేను
ఊహించుకుంటూ నువ్వు
వర్తమానాన్ని నష్తపోతున్నాము.


Bhandaru Srinivas Rao (I.I.S.)

Cell: 98491 30595 Res: 040 2373 1056.

NOTE: All images in this blog are copy righted to their respective owners.


 





--------------------------------------------------------------------------------

విందామయా నరుడ విందామయా - భండారు శ్రీనివాస రావు

విందామయా నరుడ విందామయా - భండారు శ్రీనివాస రావు

చిన్నప్పుడు చదివిన ముళ్ళపూడి వారి జోక్ గుర్తొస్తోంది.

"పెళ్ళయిన కొత్తల్లో పెళ్ళాం మాట మొగుడు వింటాడట.

తరవాత్తరవాత - మొగుడి మాట పెళ్ళాం వింటుందట.

పొతే, ఆ తరవాత మాత్రం - ఆ ఇద్దరి మాటలు ఇరుగూ పొరుగూ వింటారట."


ఈ వినడం అన్నది చెవికి సంబంధించిన విషయం. ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తే పోలా - అనే చెవలాయిలు- వినదగునెవ్వరు చెప్పిన అని- ఎవరేది చెప్పినా చెవులు రెండూ వొగ్గించి, రిక్కించి మరీ వింటారు.
కొందరు భార్యలు - " నా (మా) మొగుడు నా (మా) మాట వింటాడు " అన్న తృప్తిలో అన్ని అసంతృప్తులు మరచిపోతుంటారు. మగవాళ్ళు ఒక అడుగు ముందుకు వేసి, మాట వినే పెళ్ళాం దొరికిందని బయట చెప్పుకుంటూ, మురిసి ముక్కచెక్కలవుతూ మగధీరులమని మీసం మెలేస్తుంటారు.

వినికిడి సమస్య అంటూ లేకపోతె, ఈ వినకపోవడం అన్న ప్రసక్తే వుండదు. ఆ సమస్య వుంటే ఈ వినే సమస్యకు తావుండదు. ఎంచక్కా, ఎవరేం చెబుతున్నా వింటున్న ఫోజు పెట్టి- చెప్పేవాళ్ళ నోటి దురద వొదిలించవచ్చు.
విని, తలాడించే అలవాటు మగవాళ్ళలో ముఖ్యంగా పెళ్ళయిన వాళ్లలో ఎక్కువన్న థియరీ ఒకటుంది. ఈ బాపతు మగాళ్ళు ఆ బాపతు అపప్రధ వొదిలించుకోవడానికి ఆదర్శ పురుషుల అవతారం ఎత్తుతుంటారు. " భార్య మాట వింటే తప్పేమిటి? ఆవిడా మనలాంటి మనిషే కదా." అంటూ తమకి తాము సర్ది చెప్పుకుంటారు.
కాగా మరో రకం మగాళ్ళు- తమ మగాడితనాన్ని - వేరే రకంగా ప్రదర్శిస్తుంటారు.
" నన్నడిగితే అసలు మగాళ్ళ మాటల్ని ఆడవాళ్ళు వినకపోవడమే కాదు, ఎదిరించమని కూడా చెబుతాను. నా విషయమే తీసుకోండి. మామూలుగా మొగుళ్ళు రాగానే భార్యలు లేచినిలబడడం ఆనవాయితీ కదా. మా ఇంట్లో అలా కాదు. నేను బయట నుంచి రాగానే మా ఆవిడ లేచి నిలబడబోతుంది. పరవాలేదు కూర్చో అంటాను. నా మాట వినొద్దన్నది మా ఇంట్లో నా రూలు కాబట్టి లేచి నిలబడుతుంది. చూసారా! అదీ నేను నా భార్య కిస్తున్న స్వేఛ్చ." అంటుంటారు ఈ కోవలోకి వచ్చే మొగుళ్ళు.
బొత్తిగా మాట వినని జనం -జనాభాలో ఎక్కువ. వీళ్ళని 'సీతయ్యలు' అంటారని కూడా ఈ మధ్యనే తెలిసింది - ఓ సినిమా పుణ్యమా అని.
పొతే,వినడం వినకపోవడం అన్న రూట్లో ముందుకుపోయే పని కాసేపు పక్కనపెడదాం.
హైదరాబాద్ ఆలిండియా రేడియో స్టేషన్ డైరెక్టర్ గా పనిచేసిన శ్రీ పీ ఎస్ గోపాల కృష్ణ -'విన్నవింత' అనే శీర్షికతో రేడియో లో ఒక కార్యక్రమం కొన్నాళ్ళు నడిపారు. విన్న వింతలను శ్రోతలతో పంచుకోవడం రచయిత ఉద్దేశ్యం. అయితే వినేవారికి పెద్దపీట వేసే పెద్ద మనసు వున్నవాడు కనుక, విన్నవించుకోవడం అనే అర్థంతో దానికి "విన్నవింత" అని పేరు పెట్టారు.

మా బోటి రేడియోలో పనిచేసిన వాళ్లకి వినే వాళ్ళే 'దేవుళ్ళు' కాబట్టి , పొద్దునపూట వచ్చే ఆ ప్రోగ్రాం వాళ్ళకో 'నివేదన' గా భావించే వాళ్ళం. ఆయన చెప్పే వన్నీ మంచి విషయాలే కాబట్టి , ఆ రోజుల్లో శ్రోతలు కూడా మంచి సంగతులు వినే బాపతు కాబట్టి- ఆయన కూడా రకరకాల పనికొచ్చే కబుర్లతో దాన్ని తీర్చిదిద్దేవారు.(ఇన్ని కా'బట్టీలు' అవసరమా అంటే- ఒకటికి రెండుసార్లు నొక్కి చెప్పకపోతే రేడియో వాళ్లకి తెలుగు రాదు అని అపోహపడే ప్రమాదం సయితం లేకపోనూ లేదు) . శ్రోతలు కూడా 'రేడియోలో

చెప్పడమేమిటి? మనం వినడమేమిటి?' అని భేషజాలకు పోకుండా బుద్దిగా వినేవారు. ఆ విధంగా చెప్పేవారికి వినేవారు, వినేవారికి చెప్పేవారు లేరనే కరువు లేకుండా పోయింది. ఆ మాటకు వస్తే ఆ రోజుల్లో రేడియోలో ఇలాంటి చక్కటి కార్యక్రమాలు ఎన్నో వినేవాళ్ళం అని గుర్తు చేసుకునే ఆనాటి శ్రోతలు ఈ రోజుల్లో కూడా తారసపడడం కద్దు.

మళ్ళీ అసలు సంగతికొస్తే-
'వినంగానే సరిపోదు- విన్నది ఆచరించాలనీ - అప్పుడే విన్నదానికి సార్ధకత' అనే వాళ్ళున్నారు.
'ఒరేయ్ కన్నా! మోటార్ సైకిల్ పై అంత స్పీడ్ గా వెళ్లకురా!' అని తండ్రి అంటే- పిల్లాడు విన్నట్టుగా తలాడిస్తే - నిజానికి అది వినడం కిందికి లెక్క రాదు.

విని పాటించినప్పుడే - 'రాముడు మంచి బాలుడు, తలిదండ్రుల మాట జవదాటడు' అని కన్నవాళ్ళు - వినే వాళ్లకు చెప్పుకునే వీలుంటుంది.

వినడంలో ఇంత విషయం వుంది కాబట్టే- నోములు, వ్రతాలు చేసేటప్పుడు వ్రత కధలు విన్నవాళ్ళకు కూడా 'వ్రత ఫలం' లో భాగం కల్పించారని - సూతుడు శౌనకాది మునులకు చెప్పగా-అది విన్నవాళ్ళలో ఒకడు తెలియచేయడమైనదని సర్వజనులకు ఇందుమూలముగా తెలియపరచడమైనది.

NOTE: All images in this blog are copy righted to their respective owners.