27, జూన్ 2013, గురువారం

మ్యూజియంలో కృతజ్ఞత - భండారు శ్రీనివాసరావు



( జూన్ 28-  మాజీ ప్రధాన మంత్రి శ్రీ పీవీ నరసింహారావు గారి జయంతి)


గూగుల్ ఇమేజ్ సెర్చ్ సర్ఫ్ చేసుంటే ఒక కార్టూన్ కనిపించింది.
 అందులో -




కంప్లెయంట్స్ (ఫిర్యాదులు), గ్రాటిట్యూడ్ (కృతజ్ఞత) అనే రెండు కౌంటర్లు వుంటాయి.
పిర్యాదుల కౌంటర్ వద్ద పెద్ద క్యూ వుంటుంది.
కృతజ్ఞతలు తెలపాల్సిన కౌంటర్ దగ్గర మాత్రం ఒక్క మనిషీ కనబడడు.

వర్తమాన ప్రపంచానికి ముఖ్యంగా భారత దేశానికి అద్దం పట్టే కార్టూన్ అని నాకు అనిపించింది.
ఎనభయ్యవ దశకంలో నేను మాస్కోలో వున్నప్పుడు వేల సార్లు విన్న పదం – ‘స్పసీబా’ – అంటే ఇంగ్లీష్ లో థాంక్స్’ – మన తెలుగులో ధన్యవాదాలు’. బహుశా ఈ పదం ఇంత పెద్దగా వుండడం వల్లనో ఏమో ఇది పలకడానికి జనం కొంత సంకోచిస్తున్నారనుకోవాలి.


రష్యన్లు - ఆ మాటకు వస్తే ప్రపంచం లోని అనేక దేశాలవాళ్ళు కృతజ్ఞతను బాహాటంగా వెల్లడిస్తుంటారు. అది వారి జీవన విధానంలో ఒక భాగమై పోయింది. పైకి వ్యక్త పరిస్తేనే కృతజ్ఞతా భావం వున్నట్టని చెప్పడం నా వుద్దేశ్యం కాదు. తెలుగు సినిమాల్లో అన్నాచెల్లెళ్ళు ఒకరినొకరు పెనవేసుకుని అన్నయ్యా ! చెల్లెమ్మా!అంటూ చెప్పుకునే డైలాగులు వింటే కంపరం కలుగుతుంది కానీ, వారి నడుమ వున్న ఆత్మీయతా భావం అవగతం కాదు. అయితే చేసిన మంచిని మరచిపోవడం మనుషులకు వుండాల్సిన లక్షణమని అనుకోలేము.
కృతజ్ఞతఅన్న పదానికి ఈనాటి రాజకీయాల్లో స్తానం వున్నట్టులేదు. రాజకీయనాయకులకు వడ్డించేవాడుప్రధానం కాని వడ్డించినవాడు కాదు.


పీవీ నరసింహారావుగారి విషయమే తీసుకుందాం. ప్రధానిగా వున్నంతకాలం ఆహా! ఓహో!!అన్నారు. ఆర్ధిక సమస్యలతో పీకలలోతు మునిగిపోయివున్న దేశాన్ని నూతన సంస్కరణలతో ఒడ్డున పడేసిన మేధావిగా కీర్తించారు. బొటాబొటి మెజారిటీ తో వున్న పాలక పక్షాన్ని అయిదేళ్ళ పాటు పూర్తి కాలంఅధికార పీఠం పై వుంచిన అపర చాణ క్యుడని వేనోళ్ళ పొగిడారు. అధికారం దూరం కావడంతోనే ఆ నోళ్ల తోనే – ‘అధికారాంతమునందు చూడవలె అని పద్యాలు పాడడం ప్రారంభించారు. ఆయన తరవాత కాంగ్రెస్ అధ్యక్షుడు అయిన వ్యక్తికి ఆయన్ని మించిన గొప్ప లక్షణాలేమీ లేవు. కానీ పదవేసర్వస్వమయిన వారికి ఆయన భజనేసర్వస్వమయిపోయింది. పీవీని విమర్శించిన పత్తిత్తులకుఆయన చేసిన మేళ్ళుకానరాలేదు. అయిదేళ్ళు తెలుగువాడిలోని వాడినీ వేడినీలోకానికి చాటిచెప్పిన వృద్ధ రాజకీయవేత్త న్యాయస్తానాలలో నిస్సహాయంగా బోనులోనిలబడ్డప్పుడు ఆయన పార్టీ వాళ్ళెవ్వరూ ఆయనను పట్టించుకోక పోగా ఏమీ తెలియనట్టు కళ్ళుమూసుకున్నారు. ప్రధానిగా పీవీ ని సమర్ధించడం ఈ వ్యాసకర్త వుద్దేశ్యం కాదు. రాజకీయాల్లో కృతజ్ఞతఅనే పదానికి తావు లేకుండాపోయిందన్న విషయాన్ని విశదం చేయడానికే ఈ ఉదాహరణ. పీవీ మరణించడానికి కొన్ని నెలలముందు హైదరాబాదు వచ్చారు. మాజీ ప్రధాని హోదాలో రాజ్ భవన్ గెస్టు హౌస్ లో బస చేసారు. గతంలో ప్రధానిగా ఆయన అక్కడ దిగినప్పుడు హడావిడి ఒక విలేఖరిగా నాకు తెలుసు. ఆకాశవాణి ప్రతినిధిగా కలుసుకోవాలన్నా ఎంతో కష్టంగా వుండేది. అధికారులు, అనధికారులు, మందీ మార్భాలాలు, ఆయన కళ్ళల్లో పడితే చాలనుకునే రాజకీయనాయకులు ఆ వైభోగం వర్ణించ తరమా? అన్నట్టు వుండేది.

మాజీ ప్రధానిగా పీవీ రాజ భవన్ లో బస చేసినప్పుడు  నేనూ , ఆకాశవాణిలో నా సీనియర్ కొలీగ్, న్యూస్  ఎడిటర్ ఆర్వీవీ కృష్ణారావు గారు గవర్నర్ రికార్డింగ్ నిమిత్తం  వెళ్లి -  పని పూర్తిచేసుకున్నతరవాత - రాజ్ భవన్  గెస్ట్ హౌస్ మీదుగా వెడుతూ అటువైపు తొంగి చూసాము. సెక్యూరిటీ మినహా రాజకీయుల హడావిడి కనిపించక పోవడంతో మేము లోపలకు వెళ్ళాము. అక్కడవున్న భద్రతాదికారిని  'పీవీ గారిని చూడడం వీలుపడుతుందాఅని అడిగాము. అతడు తాపీగా  'లోపలకు వెళ్ళండి' అన్నట్టు సైగ చేసాడు. ఆశ్చర్యపోతూ లోపలకు అడుగు పెట్టాము.
పెట్టిన తరవాత మా ఆశ్చర్యం రెట్టింపు అయింది. పీవీ ఒక్కరే టీవీలో ఫుట్ బాల్  మాచ్  చూస్తూ కనిపించారు. డిస్టర్బ్ చేసామేమో అన్న ఫీలింగుతోనే - మమ్మల్ని పరిచయం చేసుకున్నాము.లుంగీ మీద ఒక ముతక బనీను మాత్రమే వేసుకునివున్న పీవీగారు  నా వైపు చూస్తూ- 'మీ అన్నయ్య పర్వతాలరావు ఎలావున్నాడయా!' అని అడిగేసరికి నాకు మతి పోయినంత పనయింది. ఎప్పుడో  పీవీగారు ముఖ్యమంత్రి గా వున్నప్పుడు - మా అన్నయ్య పర్వతాలరావు గారు సమాచారశాఖ అధికారిగా ఆయనకు పీఆర్వో గా కొద్దికాలం పనిచేసారు. అసలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నదే అతి కొద్దికాలం. అప్పటి విషయాలను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు.  అదీ  పీవీగారి గొప్పతనం. ఆ తరవాత కూడా  ఆయన ఏదో మాట్లాడుతున్నారు కానీ మాకు కలయో వైష్ణవ మాయయోఅన్నట్టుగావుంది. మేము కలసి కూర్చుంది కొన్నేళ్ళ క్రితం వరకు దేశాన్ని వొంటి చేత్తో పాలించిన వ్యక్తితో అన్న స్పృహ వుండడం వల్ల కొంత ఇబ్బంది పడుతూ కూర్చున్నాము. కాసేపటి తరవాత కొణిజేటి రోశయ్య గారు వచ్చారు. ఆయన్ని చూడగానే  పీవీ గారి మొహంలో ఒక రిలీఫ్ కనిపించింది.
ఇలాటి నేపధ్యాలున్న మన రాష్ట్ర రాజకీయ రంగంలో -

అధికారం చేజారితేనే పట్టించుకోని రాజకీయ నాయకులు - ప్రాణాలు విడిచిన తమ నాయకులను పట్టించుకుంటారనుకోవడం భ్రమ. రామారావయినా, రాజశేఖరరెడ్డి అయినా అంతే.

కొన్నాళ్ళ తరవాత పిల్లలకు కృతజ్ఞతగురించి తెలియచేప్పాలంటే మ్యూజియం కు తీసుకు వెళ్ళాలేమో!

26, జూన్ 2013, బుధవారం

బెజవాడ సొగసు చూడ తరమా!



(బెజవాడ మీద రాసిన బ్లాగు చదివి ఎంతోమంది స్పందించారు. అందరికీ ధన్యవాదాలు. పోతే, ప్రత్యేకించి దాసు కృష్ణ మూర్తి గారు బెజవాడతో తన అనుబంధాన్ని, జ్ఞాపకాలను వివరంగా పేర్కొంటూ ఇంగ్లీష్ లో సుదీర్ఘంగా రాశారు. దాన్ని తెలుగులో అనువదించి అందరితో పంచుకోవాలని అనిపించింది.నాకు రాసిన లేఖలో  కృష్ణమూర్తి గారు తనని తాను పరిచయం చేసుకుంటూ - I live in the United States. I am a migratory bird with three migrations, first to Hyderabad, second to Delhi and the third to America. I stayed in Bezwada for 27 years, Hyderabad 29 years, Delhi 20 years and the U.S. 11 years.- అని రాశారు. దీనిబట్టి ఇక వారి వయస్సును, అనుభవాన్ని అర్ధం చేసుకోవచ్చు. వారి ఫోటో ఒకటి సంపాదించగలిగితే ఈ వ్యాసానికి మరింత పరిపూర్ణత్వం సిద్ధించేది. కాని తొలి పరిచయంలోనే ఫోటో పంపమని అడిగే చనువు తీసుకోలేకపోయాను – భండారు శ్రీనివాసరావు )
   
“బెజవాడ నగర సందర్శనను సినిమా హాళ్ళు, హోటళ్ళతో మొదలు పెడదాము.
అప్పట్లో బెజవాడలో రెండంటే రెండే సినిమా హాళ్ళు వుండేవి. ఒకటి మారుతీ సినిమా, రెండోది నాగేశ్వరరావు హాలు.(బహుశా నాగేశ్వరరావు హాలంటే  కృష్ణ మూర్తి గారి ఉద్దేశ్యం దుర్గాకళా మందిరం కావచ్చేమో!) ఇది ముప్పయ్యవ దశకంలో మాట. ఈ సినిమా హాళ్ళకు ఆ రోజుల్లోనే సొంత జెనరేటర్లు వుండేవి.

“సాయం సమయాల్లో ఈ సినిమా హాళ్లనుంచి ఎడ్లబండ్లు సినిమా ప్రచారానికి  బయలుదేరేవి. వాటిల్లో కొందరు కూర్చుని వాయిద్యాలు వాయిస్తూ వుండేవారు. నలుగురు చుట్టూ  చేరగానే సినిమాల తాలూకు కరపత్రాలు పంచుతూ వుండేవారు. ఆ బళ్ళు కనబడగానే వెంట పరిగెత్తుకెళ్ళి ఆ కరపత్రాలు వీలయినన్ని పోగేసుకోవడం మాకు సరదాగా వుండేది. ఎన్ని ఎక్కువ పాంప్లేట్లు పోగేస్తే అంత గొప్ప.

1937 లో పరిస్తితి కొంత మారింది. నాగేశ్వరరావు గారు ఎడ్లబండి స్తానంలో మోటారు వ్యాను ప్రవేశపెట్టారు. దాన్ని రంగురంగుల సినిమా పోస్టర్లతో అందంగా ఆకర్షణీయంగా అలంకరించేవారు. లౌడ్ స్పీకర్ల ద్వారా సినిమా పాటలు వినిపించేవారు. టంగుటూరి సూర్యకుమారి పాడిన రికార్డులను ప్రత్యేకంగా వేసేవారు. ఇలా సాగే సినిమా ప్రచారం కొన్నాళ్ళ తరువాత కొత్త పుంతలు తొక్కింది. సాలూరు రాజేశ్వరరావు, శ్రీరంజని, రామతిలకం నటించిన ‘కృష్ణ లీల’ సినిమా విడుదల అయినప్పుడు ఆ సినిమా నిర్మాత -  కరపత్రాలను విమానం నుంచి వెదజల్లే ఏర్పాటు చేశారు. నిజంగా ఆ రోజుల్లో అదొక సంచలనం.    
“సినిమా నిర్మాతల నడుమ పోటీలు పెరగడం నాకు బాగా గుర్తు. ఒకాయన ద్రౌపది వస్త్రాపహరణం నిర్మిస్తే మరొకరు పోటీగా ద్రౌపదీ మాన సంరక్షణ పేరుతొ మరో సినిమా తీసి విడుదల చేశారు. ఒకరు మాయాబజారు (పాతది) తీస్తే ఆయన ప్రత్యర్ధి శశిరేఖా పరిణయం పేరుతొ అదే కధను తెరకెక్కించారు. అలాగే సినిమాలు ఆడే ధియేటర్ల నడుమ కూడా పోటీ తత్వం వుండేది.

“అప్పటిదాకా పౌరాణిక చిత్రాలదే హవా. రెండో ప్రపంచ యుద్ధానికి కొద్ది ముందు సాంఘిక చిత్రనిర్మాణానికి నిర్మాతలు చొరవ చూపడం మొదలయింది. ముందు భానుమతి, పుష్పవల్లి తో ‘వరవిక్రయం’ వచ్చింది. తరువాత వైవీ రావు, రామబ్రహ్మం, హెచ్ ఎం రెడ్డి, బీఎన్ రెడ్డి వంటి హేమాహేమీలు  రంగ ప్రవేశం చేసి సాంఘిక చిత్ర నిర్మాణాన్ని ముమ్మరం చేశారు. రైతు బిడ్డ, మాలపల్లి,ఇల్లాలు, గృహలక్ష్మి.వందేమాతరం, దేవత వంటి పలు చిత్రాలు ఈ పరంపరలో రూపుదిద్దుకున్నవే. చలనచిత్రాలను పంపిణీ చేసే డిస్ట్రిబ్యూటర్లు  అందరికీ బెజవాడలోని గాంధీనగర్ రాజధాని. సినిమాలు మద్రాసులోనో, కొల్హాపూర్, కలకత్తాలలోనో  తయారయినా వాటిని విడుదల చేయడానికి అవసరమయిన అన్ని హంగులూ, ఏర్పాట్లు చేయాల్సింది మాత్రం  బెజవాడలోనే.

“ఆ రోజుల్లో ఇలా ఇబ్బడిముబ్బడిగా సినిమాలు తీసేవాళ్ళు కాదు. చిత్రానికి చిత్రానికీ నడుమ కనీసం పదిహేనురోజులో,నెల రోజులో వ్యవధానం వుండేట్టు చూసుకునేవారు. సినిమా విడుదలలు లేని ఖాళీ రోజుల్లో ఆ ధియేటర్లలో డ్రామాలు ఆడేవాళ్ళు.
        
“నలభయ్యవ దశకంలో మరో ధోరణి కనబడింది. తెలుగు సినిమాలు దొరక్కపోతే అరవ చిత్రం వేసేవాళ్ళు. హాలు మధ్యలో అనువాదకుడు నిలబడి కొన్ని డైలాగులను తెలుగులో అనువదించి చెబుతుండేవాడు. ఇంటర్వెల్ సమయంలో సినిమా సాంగ్స్ పేరుతొ ఆ సినిమా పాటల పుస్తకాలను అమ్మేవాళ్ళు. వాటికి మంచి గిరాకీ వుండేది.

“బుకింగ్ కౌంటర్ల దగ్గర ఒక వరుసలో నిలబడి టిక్కెట్లు తీసుకునే సంప్రదాయం వుండేది కాదు. కౌంటర్ తెరవగానే అంతా ఒక్కసారిగా మీదపడేవారు. సినిమా టిక్కెట్టు కొనడం అంటే దాదాపు ఒక యుద్ధం చేసినట్టు వుండేది. టిక్కెట్టు తీసుకుని బయటపడేసరికి చొక్కాలు చినిగి పోయేవి. వొళ్ళంతా చెమటలు  పట్టి బట్టలు తడిసిపోయేవి.

“సినిమాహాళ్లలో పారిశుధ్యం పూజ్యం అనే చెప్పాలి. ఆ రోజుల్లో నేల క్లాసు అని ఒక  తరగతి వుండేది. ఆ క్లాసులో  పైన నేల మీద  కూర్చున్న వారిలో ఎవరి పిల్లవాడయినా మూత్రం చేస్తే అది కింద దాకా పారుతుండేది. కింది వైపు కూర్చున్న వారి లాగూలు తడిసేవి. మరుగు దొడ్ల సౌకర్యం వుండేది కాదు. “ఇంటర్వెల్  కాగానే ప్రేక్షకులు ఒక్కమారుగా గుంపులు గుంపులుగా బయటకు వచ్చి సినిమా హాలు గోడల్ని ప్రక్షాళన చేసేవాళ్ళు.

1939 లో అనుకుంటా బెజవాడలో కొత్తగా రామా టాకీసు వచ్చింది. తరువాత వరుసగా గవర్నర్ పేటలో  లక్ష్మీ టాకీసు, వన్ టౌన్ లో  సరస్వతీ మహలు వచ్చాయనుకుంటాను.
     
“ఇక రెస్టారెంట్ల విషయానికి వస్తే-

“వూళ్ళో దాదాపు అన్నీ శాఖాహార భోజన హోటళ్ళే! బ్రాహ్మణ హోటళ్ళు.  చాలావరకు ఉడిపి అయ్యర్లవే. బాగా ప్రాచుర్యం పొందిన వెల్కం హోటల్, మోడరన్ కేఫ్ లాటి హోటళ్ళు కూడా ఉడిపి వారివే. ఒక్క అణా (రూపాయిలో పదహారో వంతు) పెడితే రెండు ఇడ్లీలు, వేడి వేడి సాంబారు, కారప్పొడి, కొబ్బరి చట్నీ, అల్లప్పచ్చడి – అన్నీ లేదు అనకుండా వడ్డించే వాళ్లు.      

”గవర్నర్ పేటలోని బీసెంటు రోడ్డు దగ్గర మొదలు పెడితే గాంధీనగరం వరకు అన్నీ హోటళ్ళే!  మాంసాహారం లభించే హోటళ్ళను మిలిటరీ భోజన హోటళ్ళు అనేవారు. వాటిని  ఎక్కువగా కేరళ వాళ్లు నడిపే వాళ్లు. అలాగే, బయట నుంచి  బెజవాడకు వచ్చిన వాళ్ల చేతుల్లో కొన్ని వృత్తులు వుండేవి. పాల వ్యాపారం చాలావరకు విజయనగరం నుంచి వచ్చిన వారు చూసుకునేవారు. ఒరిస్సా నుంచి వచ్చిన వారు - పాయిఖానాలు  శుభ్రం చేసే పని చూసేవారు. దర్జీ పని, జట్కాలు (గుర్రబ్బండ్లు) ముస్లింల  ఇలాకాలో వుండేవి. రాకపోకలకు రిక్షాలే గతి. సైకిల్  రిక్షాలు రాకపూర్వం వాటిని మనుషులు లాగేవారు. సిటీ బస్సులు వుండేవి కావు. కాకపొతే, బెజవాడ, ఏలూరు, బందరు, గుడివాడల మధ్య బస్సులు తిరిగేవి. ఆ బస్సులకు పై కప్పుమాత్రమే వుండేది. పక్కన ఏమాత్రం ఆచ్చాదన లేకపోవడంతో వర్షం వస్తే అంతే సంగతులు. ప్రయాణీకులు పూర్తిగా తడిసిపోయేవాళ్ళు. కృష్ణా నది మీద రోడ్డు వంతెన లేని కారణంగా బెజవాడ నుంఛి  గుంటూరుకూ, ,తెనాలికీ  బస్సు సర్వీసు వుండేది కాదు. 
అధికారుల పెత్తనం జోరుగా వుండేది. పోలీసు అధికారి కానీ రెవెన్యూ అధికారి కానీ బస్సు ఎక్కాల్సి వస్తే బస్సును ఏకంగా ఆయన ఇంటి దాకా తీసుకువెళ్ళేవాళ్ళు.

“మా ఇల్లు గవర్నర్ పేటలో వుండేది. ఇంటి నుంచి కొత్తపేటలోని హిందూ హై స్కూలు వరకూ నడిచే వెళ్ళే వాళ్ళం. తరువాత మేము చేరిన ఎస్ ఆర్ ఆర్ అండ్ సీ వీ ఆర్ కాలేజీ మాచవరం లో వుండేది. అప్పుడు కూడా మాది నటరాజా సర్వీసే. స్కూల్లో టీచర్లు, కాలేజీలో లెక్చరర్లు అంతా కాలినడకనే వచ్చేవాళ్ళు. దుర్గాగ్రహారంలో వుండే విశ్వనాధ సత్యనారాయణ గారు, చతుర్వేదుల నరసింహం గారు కాలేజీకి నడిచే వచ్చేవాళ్ళు. మాకు వాళ్లు లెక్చరర్లు. దోవలో ఇంగ్లీష్ సాహిత్యం  గురించి చర్చించుకునే వారు. కొత్తగా విడుదలయ్యే ఇంగ్లీష్ సినిమా మొదటి ఆట చూడడం కోసం ప్లాన్లు వేసుకునేవాళ్ళు. కాలేజీ ప్రిన్సిపాల్ పుట్టపర్తి శ్రీనివాసాచారి గారు మాత్రం జట్కా బండిలో వచ్చేవారు. కొందరు లెక్చరర్లు సైకిళ్ళపై చేరుకునే వారు. (వీలు దొరికితే మరి కొన్ని సంగతులు మరోసారి) 

25, జూన్ 2013, మంగళవారం

చావుతో ఆటలంటే ఇదే మరి


సుబ్బారావుకు అందర్నీ ఆటలు పట్టించడం ఓ సరదా.
అతనో రోజు కంప్యూటర్ ముందు కూర్చుని ఫేస్ బుక్ లో ఎవర్నో ఆట పట్టిస్తుంటే కాలింగ్ బెల్ మోగింది. వెళ్లి తలుపు తీస్తే ఎదురుగా యమపాశంతో ఇద్దరు యమభటులు  కనిపించారు. ముందు గతుక్కుమన్నా తేరుకుని వాళ్ళని లోపలకు రమ్మన్నాడు. ఏవిటి విషయం అని అడిగాడు. వారిలో ఒకడు ఆ రోజు చావు మూడిన వాళ్ళ జాబితా ఒకటి తీసాడు. సుబ్బారావు పేరు అందరికంటే మొదట్లో వుంది. పద పద అని తొందర చేసారు.
సుబ్బారావు తరహా తెలుసుకదా.
‘రాకరాక వచ్చారు. మళ్ళీ మళ్ళీ వచ్చే ఉద్యోగాలు కావాయె మీవి.  ఒక్క నిమిషం  అలా  కూర్చోండి. ఒక కప్పు కాఫీ ఇస్తాను’ అంటూ  వొంటింట్లోకి వెళ్ళాడు.  చెరో కప్పులో కాఫీ కలిపి తెచ్చి అందులో తెలివిగా నిద్ర మాత్రలు వేసాడు.
కాఫీ తాగి యమభటులిద్దరూ గుర్రు పెట్టి నిద్రపోయారు.      
ఈలోగా సుబ్బారావు  చావు రాసిపెట్టివున్న వాళ్ళ జాబితా తీసి అందులో మొదట్లో వున్న తన పేరు కొట్టేసి దాన్ని చిట్టా చివర్లో రాసేసి యేవీ తెలియని నంగనాచిలా  కూర్చున్నాడు.
మొత్తానికి యమ భటులు నిద్ర లేచారు. వారికి సుబ్బారావు ఇచ్చిన కాఫీ ఎంతో నచ్చింది.
‘చూడు సుబ్బారావూ – చూడబోతే నువ్వు చాలా మంచాడిలా వున్నావు. అందుకని నీకో మేలు చేస్తాం. ఈరోజు మా డ్యూటీని జాబితా చివరి నుంచి మొదలు పెడతాం . ఏవంటావ్?’
ఏవంటాడు. అప్పటికే కుక్కిన పేనాయె.

అక్షరాలా లక్షాయాభై వేలు


భండారు శ్రీనివాసరావు వార్తావ్యాఖ్య(http://bhandarusrinivasarao.blogspot.in/) అనే పేరుతొ నేను ప్రారంభించిన నా ఈ బ్లాగు హిట్ల సంఖ్య నేటితో (25-06-2013) అక్షరాలా లక్షా యాభై వేలు దాటింది. ఇంచుమించు తొమ్మిది వందల వ్యాసాలూ, ఇతర రచనలు పోస్ట్ చేసాను. ఈ అక్షరయజ్ఞంలో పాలుపంచుకుని సహకరిస్తున్న వారందరికీ ఈ సందర్భంగా నా మనః పూర్వక కృతజ్ఞతాభివందనాలు



 భండారు శ్రీనివాసరావు




24, జూన్ 2013, సోమవారం

సాయంత్రం ఖాళీయేనా!


ఎర్రబడ్డ మొహంతో బాస్ గదిలోనుంచి బయటకు వచ్చింది.
“బుద్ధిలేని మనిషి, ఆడవాళ్ళతో ఇలాగానేనా మాట్లాడేది”
“లోపల ఏం జరిగిందేవిటి?”
“ఈ సాయంత్రం ఖాళీగా వుంటావా? వేరే ఏదన్నా పని ఉందా?’ అని అడిగాడు”
“నువ్వేమన్నావు”
“ఖాళీ గానే వుంటాను అని చెప్పాను”
“అతనేమన్నాడు?”
“ఏవన్నాడు? ఇవిగో ఈ కాగితాలన్నీ చేతికి ఇచ్చి టైప్ చేయమన్నాడు”

పడికట్టు పదాలు


కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నేతృత్వంలో
యువనేత రాహుల్ గాంధీ నాయకత్వంలో
ప్రధానమంత్రి మన్మోహన్  సింగ్ పర్యవేక్షణలో
రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్  దిగ్విజయ సింగ్  ఆధ్వర్యంలో
ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పూనికతో
ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ ప్రోత్సాహంతో
జిల్లామంత్రి, స్థానిక శాసన సభ్యులు , గ్రామ సర్పంచ్   ఇతర పార్టీ పెద్దల ఆశీర్వాదాలతో
మన వూర్లో
ఏడాది క్రితం పనులు  మొదలెట్టిన  
సీసీ  రోడ్డుకు వచ్చే ఏడాది ప్రారంభోత్సవం జరపాలని నిర్ణయించాం.
తేదీ,  సమయం  వీలువెంట తెలియచేస్తాం.
ఇట్లు
భవదీయుడు
వార్డు సభ్యుడు
వరదయ్య  వ్రాలు 

23, జూన్ 2013, ఆదివారం

వయసు నవ్వింది


రామారావును నేను చిన్నప్పటినుంచీ ఎరుగుదును.
చిన్నతనంలో బొద్దుగా ముద్దుగా వుండేవాడు. వున్న వూళ్ళో స్కూలు లేక పట్నంలో  బావ గారింటికి చేరాల్సివచ్చింది. వేసవి సెలవులివ్వగానే సొంతూరు మీద గాలిమళ్ళేది. అంతే.  బస్సెక్కి తుర్రున  వాళ్ల వూరు బయలుదేరేవాడు. ఆ రోజుల్లో బస్సు టిక్కెట్టు- అందులో అరటిక్కెట్టాయె -  నాలుగణాలు పోను అక్కయ్య ఇచ్చిన రూపాయిలో ఇంకా ముప్పావలా జేబులో మిగిలేది. మరో అణా పెట్టి కట్టె మిఠాయి, ఇంకో అణా పెట్టి జీళ్ళు  కొనుక్కుని కాలవగట్టెక్కేవాడు. ఇక అక్కడినుంచి ఒకటే పాటలు, పద్యాలు.  టైం తెలిసేది కాదు. మాయాబజారులో వివాహభోజనంబు  పాట పదమూడోసారి ఎత్తుకునేలోపల ఊరొచ్చేది. మూడు మైళ్ళు మూడంగల్లో దాటి  వచ్చిన ఫీలింగు. ఆహా అనుకునేవాడు. తన గొప్పే అనుకునేవాడు. చూసి నవ్వుకునేవాడిని.
పల్లెటూళ్ళో రాజభోగం. వేడి వేడి అన్నం. వెన్న కాచిన నెయ్యి. అరచేతి మందాన మీగడ. ముద్దపప్పు. వూటలూరే కొత్తావకాయ. ఓహో ఏమి రుచి. రాళ్ళు తిని హరాయించుకునే ఆరోగ్యం తనదని మురిసి ముక్కచెక్కలయ్యేవాడు. రామారావుని చూసి జాలితో నవ్వుకునేవాడిని.  
రామారావు పెరిగాడు. ఎదిగాడు. సన్న గీత  గీసినట్టు మీసకట్టు. నిగనిగలాడే జుట్టు. ఎగదువ్విన క్రాఫు. ఎవరో అచ్చు  నాగేశ్వర్రావులా వుంటావన్నారు. నిజమే కాబోలనుకున్నాడు.  నవ్వుకోవడం నా వంతయింది.
రామారావుకు పెళ్లయింది. పిల్లలు పుట్టారు. అయినా చిన్న కుర్రాడిలానే వున్నాడు.  తోటివారిలా బొజ్జ రాలేదు. బరువు పెరగలేదు. జుట్టు నెరవలేదు. బట్ట తల రాలేదు.  కంటి చూపు తగ్గలేదు. ముప్పయ్యేళ్ళ క్రితం ఎలావున్నాయో ముప్పయి రెండు పళ్ళు అలాగే గట్టిగా పటిష్టంగా వున్నాయి. నాది పెగ్గుల లెక్క కాదు జగ్గుల లెక్క అంటూ మూడు సీసాలు ఆరు సోడాల మాదిరిగా సాయంకాలక్షేపాలు చేసేవాడు. చూశారా నా స్పెషాలిటీ అన్నట్టు రొమ్ము విరుచుకు తిరిగే వాడు. రామారావుని  చూస్తుంటే నాకిక నవ్వు రావడం లేదు. జాలి కలుగుతోంది.
రామారావుకు మెల్లమెల్లగా వయసు మీద పడుతోంది. కొంచెం కొంచెంగా వెంట్రుకలు చెప్పాపెట్టకుండా రాలిపోతున్నాయి. వెనుకనుంచి చూసేవారికి జుట్టు మధ్యలో గచ్చకాయ మందంలో ఖాళీ కనబడుతోంది. నెలల తేడాలోనే బెల్ట్ సైజ్ పెరిగింది. ముందు పొట్ట కనబడి తరువాత రామారావు కనబడుతున్నాడు. దళసరి కళ్ళజోడు మొహం మీద చేరింది. మరీ ముదుసలిలా కాకపోయినా ముడుతలు కనబడుతున్నాయి. కానీ, ఎవరో అతికించినట్టు ఎప్పటిలాగానే  పెదాలపై చెరగని  చిరునవ్వు. అయితే అందులో జీవమేదీ ?
రామారావుకు క్రమంగా సృష్టి రహస్యం అర్ధం అవుతోంది. శాశ్వితం అనుకుంటున్నవేవీ నిజానికి శాశ్వితం కాదు. ఈ నిజం తెలుసుకున్న రామారావుని చూసినప్పుడు నాకు నవ్వు రాలేదు. జాలీ వెయ్యలేదు. గర్వంగా అనిపించింది.
ఎందుకంటె నా పేరు ‘వయస్సు’ కనుక. 

22, జూన్ 2013, శనివారం

బాలయ్య బాబు అను మా నాయన బాలయ్య



తెలుగు సాహిత్యంలో నాకు నచ్చిన ప్రక్రియల్లో ఆత్మకధలు లేదా జీవితచరిత్రలు ప్రధానమయినవి. వీటిని చదువుతుంటే మనకు చెందని కాలానికి చెందిన అనేక విషయాలను అవగాహన చేసుకోగలుగుతాము. మనం ఈనాడు చూస్తున్న ప్రదేశాలు, ఆచారవ్యవహారాలు వాటికి పూర్వ రూపం ఎలావుండేదో తెలుసుకోవడానికి వీటిని చదవడం ఒక్కటే సరయిన మార్గం. ఏనుగుల వీరాస్వామి గారు రాసిన నా కాశీ యాత్రపుస్తకం చదువుతుంటే ఆనాటి హైదరాబాదు నగరం ఎలావుండేదన్నది కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. అప్పటి ధరవరలు, వేషధారణలు, ఆహారవ్యవహారాలు అర్ధం చేసుకోవడానికి ఈరకమయిన పుస్తకపఠనం ఉపయోగపడుతుంది. అయితే ఇవి రాసిన వారు యెంత ఘటనాఘటన సమర్దులయినా కించిత్తు స్వోత్కర్ష దొర్లడం కద్దు. కొన్నింట ఏకంగా పర దూషణఏరులై పారుతుంది. ఇక ఆ పెద్దమనిషి యెంతటి మేఘనగధీరుడయినా ఆ రచనని ఆస్వాదించడం పంటికింద రాయి చందమే. ముఖ్యంగా రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసినవాళ్లు రాసిన తమ జీవిత చరిత్రల్లో ఈ రకమయిన ఆత్మ స్తుతి-పరనిందతొణికిసలాడుతుంటాయి. వీటివల్ల అసలు వాస్తవాలు మరుగున పడిపోతుంటాయి. గాంధీ గారు రాసుకున్న మై ఎక్స్ పెరిమెంట్ విత్ ట్రూత్అనేది దీనికి పూర్తి మినహాయింపు. తనలోని బలహీనతలను ఒప్పుకోవడానికి ఆయన ఎంతమాత్రం సంశయించకపోవడం ఆ పుస్తకంలోని గొప్పతనం. అలాగే సందర్భాన్నిబట్టి, లేదా వాస్తవాలనుబట్టి తనలోని గొప్పతనాన్ని కానీ, ఇతరులలో తనకు నచ్చని విషయాలను కానీ చెప్పాల్సివచ్చినప్పుడు ఆ విషయాలను సుతిమెత్తగా చెప్పడం మళ్ళీ ముళ్లపూడి వెంకటరమణ గారికే సాధ్యమయింది.

నాందీప్రస్తావన ఇంత విస్తారం కావడానికి నన్ను ప్రేరేపించిన అంశం ఒకటుంది. దామోదర ప్రసాద్ పటకమూరు / బొద్దులూరి శ్రీనివాసరావు అనే వారి నుంచి నాకు ఈ మధ్య ఒక ఈ మెయిల్ అందింది. అది వారిద్వారా వచ్చిందో, లేక ఎవరయినా పంపితే దాన్ని నాకు పంపారో తెలియదు. ఏమయినా వారికి కృతజ్ఞుడిని. మూడు తరాలకు చెందిన ఒక పేద దళిత కుటుంబం సాగించిన జీవన యానంలోని ఒడిదుడుకులను, కష్ట నష్టాలను తేటతెల్లం చేస్తూ డాక్టర్ వై.వి.సత్యనారాయణ రాసిన మై ఫాదర్ బాలయ్యఅనే జీవిత చరిత్రను హార్పర్ కాలిన్స్ ఇండియావారు ప్రచురించారు. తెలంగాణా ప్రాంతంలో తండ్రిని బాబు అని పిలుస్తారు కాబట్టి దాన్ని తెలుగులోకి అనువదించేటప్పుడు బాలయ్య బాబు అని పేరు పెట్టాను. ప్రముఖ పత్రికా రచయిత మల్లేపల్లి లక్ష్మయ్య, హెచ్.ఎం.టీ.వీ. కి చెందిన ఆంగ్ల దినపత్రిక హాన్స్ ఇండియాలో ఈ పుస్తకాన్ని పరిచయం చేశారు.



డాక్టర్ సత్యనారాయణ ఈ పుస్తకం రాయడంలో ఎలాటి భేషజాలకు లోనుకాలేదన్న వాస్తవం మనకు ఇట్టే బోధపడుతుంది. తాను, తన కుటుంబం సాంఘికంగా, ఆర్ధికంగా అనుభవించిన మానసిక క్లేశాలను ఆయన చాలా చక్కగా మనసుకు హత్తుకునేలా అక్షరబద్ధం చేసారని మల్లేపల్లి లక్ష్మయ్య పేర్కొన్నారు. తన కుటుంబం అనుభవించిన కడగండ్లను కళ్ళకు కట్టినట్టు చూపడంలో ఆయన ఎంతమాత్రం పర నిందా సూత్రాన్ని ఉపయోగించుకోలేదు.
రెండు శతాబ్దాలకు విస్తరించిన ఈ మూడు తరాల కధ కరీంనగర్ జిల్లా వంగపల్లి గ్రామం నుంచి డాక్టర్ సత్యనారాయణ ముత్తాత నరసయ్యతో మొదలవుతుంది. ఈనాటికీ అవశేషాలు మిగిలిన దళితుల తాడన పీడనలు, అవమానాలు, ఆక్రోశాలు చదువుతుంటే మనిషి జీవితం ఇంత పర పీడనమా అన్న ఆలోచన కలుగుతుంది. దీనిలో సానుకూల అంశం ఏమిటంటే మనిషి తలచుకుంటే ఈ కష్టాలొక లెక్కకాదన్న వాస్తవం. దేన్నీ లెక్కపెట్టని గుండె ధైర్యం, పైకి రావాలనే చెక్కుచెదరని తపన వుండాలే కాని మనిషి సాధించలేనిది ఏమీ లేదన్న నిజం డాక్టర్ సత్యనారాయణ రాసిన ఈ పుస్తకం చదివినవారికి బోధపడడం తధ్యం.
ఈ మధ్య విడుదలయిన ఒక తెలుగు సినిమాలో అలనాటి తెలంగాణలో బీదాబిక్కీ ఎదుర్కున్న అవమానాలను చూసిన ఈ నాటి తరం పిల్లలు మనుషులు సాటి మనుషులపట్ల ఇంత క్రూరంగా ప్రవర్తిస్తారా అన్న సంశయాన్ని వెలిబుచ్చడం నాకు తెలుసు. అవన్నీ నిజంగా నిజం అని తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాలి.
మనసుల్ని కదిలించే ఓ సంఘటనను డాక్టర్ సత్యనారాయణ ఉదహరించారు.
మాదిగ కుటుంబంలో జన్మించిన నరసయ్య ఓ లేగదూడ చర్మంతో చెప్పుల జతను తయారు చేసి నిజాం నవాబుకు బహుకరిస్తాడు. ఆ కాలిజోళ్ల పనితనం గమనించి ముగ్ధుడైన నిజాం నవాబు అతడికి యాభై ఎకరాలు దానంగా ఇస్తాడు. దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించని చందంగా వూళ్ళోని దొర, నరసయ్యకు నవాబు ఇచ్చిన యాభయ్ ఎకరాల్లో నలభై ఎనిమిది ఎకరాలను బలవంతంగా స్వాధీనం చేసుకుంటాడు.
ఆ నరసయ్యకు ఒక కొడుకు. అతడి పేరూ నరసయ్యే. ఆ జూనియర్ నరసయ్యకు పదునాలుగో ఏట అబ్బమ్మ అనే యువతితో పెళ్లి చేస్తారు. అస్పృశ్యులయిన వాళ్ళిళ్లలొ జరిగే శుభకార్యాల్లో ప్రతి చిన్న విషయాన్ని రచయిత తనదయిన శైలిలో హృద్యంగా వర్ణించారు. వారికి పుట్టిన బిడ్డే రామసామి అలియాస్ బాలయ్య.
కలరా వ్యాధి సోకి భార్య మరణించిన తరువాత ఆమె శవాన్ని భుజానికి ఎత్తుకుని జూనియర్ నరసయ్య, కొడుకు బాలయ్యను వెంట తీసుకుని, వూరుబయట ఓ వాగు చెంత గొయ్యి తవ్వి భార్య శవాన్ని పూడ్చిపెట్టి, వున్న వూరు విడిచిపెట్టి బాలయ్య మేనమామల పంచన చేరతాడు. వారి సాయంతో నిజాం రైల్వేలో చిన్న కొలువు సంపాదిస్తాడు. బంధువుల బలవంతం మీద మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు. అయినా తల్లి లేని రామసామి అలియాస్ బాలయ్యను ప్రాణప్రదంగా చూసుకుంటాడు. అలా పెరిగిన బాలయ్యకు ధ్యేయం ఒక్కటే. చదువు. అది తనకు ఎలాగో అబ్బలేదు. తనకు దక్కని చదువు తన సంతానానికయినా దక్కేలా చేయాలి. జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురయినా అతడా లక్ష్యానికి దూరం జరగలేదు. పిల్లలు కూడా అతడి కలను నిజం చేస్తూ పెద్దవారవుతారు. స్కూళ్ళు, కాలేజీలు దాటి విశ్వవిద్యాలయాలలో చేరి ప్రొఫెసర్ల స్తాయికి చేరుకుంటారు. వారిలో ఒకడే ఈ గ్రంధకర్త డాక్టర్ సత్యనారాయణ. కృషి వుంటే మనుషులు రుషులవుతారు, మహా పురుషులవుతారుఅన్న కవి వాక్యం నిజం చేసిన మట్టిలో మాణిక్యం’.
అవకాశాలు వుండాలే కాని మనిషి పెరుగుదలకు ఆకాశమే హద్దు అని నిరూపించిన సత్యనారాయణ గారికి, ఆయన తండ్రి బాలయ్య బాబుకు నమోవాకాలు. (28-01-2012)

21, జూన్ 2013, శుక్రవారం

కృష్ణ గారు – కాటికాపరి



‘కలం కూలీ’, కీర్తిశేషులు  జి.కృష్ణ గారు గొప్ప వాక్చాతుర్యం కలవారు. అంతేకాదు మంచి సంభాషణాచతురులు కూడా. హైదరాబాదు రాం నగర్ లో ఆయన అద్దెకు వున్న ఇంటికి వెళ్లి ఆయన చెప్పే కబుర్లు వినే వారిలో కేవలం పత్రికల వాళ్ళే కాకుండా  విభిన్న వ్యావృత్తులకు చెందినా వాళ్ళు కూడా వుండేవారు. అలా వెళ్ళిన ఓ పెద్దమనిషిని కృష్ణ గారు ఓ కోరిక కోరారు. ఒక మనిషిని చూడాలని వుందని, చూడడమే కాదు అతడితో మాట్లాడాలని వుందని మనసులో మాట బయట పెట్టారు.  ఒకపక్క ఇంతమంది కృష్ణ గారిని చూడడానికి వస్తుంటే కృష్ణ  గారు చూడాలని అనుకుంటున్నదెవరా అని ఆశ్చర్యపోతుండగా కృష్ణగారు అతడి వివరాలు చెప్పేశారు. అది విని ఆ పెద్దమనిషి ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టాడు. అతడెవరంటే – బన్సీలాల్ పేట శ్మశానంలో పనిచేసే కాటికాపరి.
కృష్ణ గారి కోరిక తీర్చడం మహద్భాగ్యం అనుకునే ఆ పెద్దమనిషి ఒకటి రెండు రోజుల్లోనే అతడిని వెంటబెట్టుకుని తీసుకువచ్చాడు. ఆ కాటికాపరిని చూడగానే కృష్ణ గారి కళ్ళు వెలిగి పోయాయి. అతడిని ఆప్యాయంగా తన పడక పక్కనే కూర్చోబెట్టుకుని, ‘లచ్చమ్మా!(కృష్ణ గారు భార్యను పిలిచే తీరు) మనవాడు వచ్చాడు, మంచి కాఫీ పట్రా’ అని కేకేసి అతడితో  సంభాషణ ప్రారంభించారు.
‘ఇదిగో చూడవయ్యా! (అతడి పేరు గుర్తుకు రావడం లేదు) నువ్వు రోజుకు ఎన్ని శవాలు దహనం చేస్తుంటావు ఏమిటి?’
‘రోజుకు ఇన్ని అనీ లెక్కేమిటుంటాది చెప్పండి. ఎన్నొచ్చినా కాదనకుండా కాలుస్తూ పోవడమే’ అన్నాడా కాటి కాపరి.
‘సరే! నన్ను చూసావు కదా. బక్క పలచగా వున్నాను. కాస్త నొప్పితగలకుండా కాల్చడం కుదురుతుందా?’
‘అన్ని నొప్పులు వొదిలేకే కదా మా దగ్గరకు వచ్చేది. ఆ బాధేమీ వుండదు లెండి.’ అన్నాడతను తాపీగా.
‘అది సరే ఇంత సన్నగా వున్నాకదా కాటిమీద లేచి కూర్చొను కదా’
‘అలా లేస్తే మరో మొద్దు మీద వేస్తా ఫికరు పడకండి’ అన్నాడతను మరింత తాపీగా.
అలా ఆ ఇద్దరు మాట్లాడుకుంటూ వుంటే వినే వాళ్ళు నోళ్ళు వెళ్ళబెట్టారు.
(సూతుడు శౌనకాది మునులకు చెప్పగా విని, ఆ విన్నవాళ్ళల్లో ఒకరు చెప్పిన ‘కృష్ణ కధ’)
(21-06-2013) 


(కృష్ణ గారు జీవించివున్న  రోజుల్లో ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళిన నాటి జర్నలిస్టు, నేటి రాజ్యసభ సభ్యులు శ్రీ రాపోలు ఆనంద భాస్కర్) 

-ప్రముఖ జర్నలిస్ట్ శ్రీ లోకేశ్వరరావు  రచించిన  ఆంగ్ల గ్రంధంలో కృష్ణ గారి గురించి-    
                     
JEEVITHAM ATANI KOKA TAMAASHAA: Lokeshwar, Gandhi Publications, "Shobha" H.No. 12-2-709/5/1/C, Navodaya Colony, Mehidipatnam, Hyderabad-500028. Rs. 40. (Review in Hindu)
THIS VOLUME is a collection of 18 essays most of which support the cause of Telangana.
The author provides insights into the evolution of the mulki (local) movement since the days of Kutub Shahi Kings. His convincing arguments are sometimes overshadowed by emotional overtones. Creation of smaller states at this juncture has to be tackled at the national level as similar demands are on the anvil elsewhere.
The introductory article provides glimpses of the eventful career of the veteran journalist G. Krishna, who went to jail under the Quit India movement.

After release, as a reporter he had a unique experience of having supper with a former prison mate (to fulfil the last wish) who was to be hung for murder next morning. No wonder, "one could see both a child's laughter and Ramana Maharshi's brilliance in his face." A dedicated professional, Krishna is a role model to younger journalists.

19, జూన్ 2013, బుధవారం

సిసలైన నవ్వుకు అసలైన సంతకం జంధ్యాల


(ఈరోజు 19-06-2013 జంధ్యాల వర్ధంతి)

నిండు నూరేళ్ళ జీవితం అనుకుంటే జంధ్యాల బతికింది యాభయ్ యేళ్ళే. కానయితేనేమి నూరేళ్ళకు సరిపడా  నవ్వులు నలుగురికీ పంచి పెట్టిపోయాడు.

ఆరోజు నాకు బాగా జ్ఞాపకం వుంది. నేను రేడియోలో వుంటే రాంపా ఫోను చేసి జంధ్యాల పోయాడని చెప్పాడు. నేను వెంటనే వార్త రాసి ఇచ్చేసి రాజభవన్ రోడ్డులోని వాళ్ల ఇంటికి వెళ్లాను. అప్పుడే వార్త తెలిసి ఒక్కొక్కరుగా వస్తున్నారు. ఓ కుర్చీలో జంధ్యాల నాన్నగారు నారాయణ మూర్తి  గారు కూర్చుని వున్నారు. కానీ ఆయనకు ఏదీ తెలియని పరిస్తితి. జ్ఞాపక శక్తి పూర్తిగా పోయింది. ఏమి జరిగిందన్నది ఒక్కగానొక్క కొడుకు పోయాడన్నది  అర్ధం చేసుకునే స్తితి కాదు. ఏమిటో ఈ జీవితం అనిపించింది.
జంధ్యాల చనిపోయిన రెండేళ్లకు వేటూరి సుందరరామమూర్తి ఇలా గుర్తుచేసుకున్నారు.



( జంధ్యాల - 1951-2001)


“హాస్యం,సంగీతం కలిసి ఒకే జన్మ ఎత్తిన హాసం, నిన్నటి దరహాసం జంధ్యాల ఇతిహాసంలో చేరిపోయి రెండేళ్ళు గడిచాయి.ఎన్నేళ్ళు  గడిచినా ఆయన మధుర స్మృతికి మరణం లేదు.ఎంత కాదనుకున్నా కన్నీళ్ళు  కళ్ళతోనే మింగటం కన్నా శరణం లేదు.
“తెలుగు సినిమా అపహాస్యం పాలెక్కువై పరిహాస్యం పాలై పోతున్న ఈనాడు జంధ్యాల తన వంశవృక్షంతో సహా దర్శనమిచ్చి ఆదుకుంటాడు. పానుగంటి, కందుకూరి, గురజాడ, చిలకమర్తి, భమిడిపాటి, మొక్కపాటి, మునిమాణిక్యం మొదలయిన శాఖోపశాఖలతో విరాజిల్లే ఆ హాస్య కల్పవృక్షానికి మూల స్థానం లో కూర్చుని "ఫిబరే హ్యూమరసం" అని రస పిపాసులకు తన కలం నించి వెలువడిన హాస్య రస కలశాలను అందించిన తెలుగుజాతి చిరునవ్వు జంధ్యాల.”
ఆ వేటూరిగారు కూడా ఇప్పుడు లేరు.  జంధ్యాలను వెతుక్కుంటూ వెళ్ళిపోయారు.
కాని, ఆయన అన్నట్టు జంధ్యాల మార్కు  నవ్వుకు మాత్రం   మరణం లేదు. (19-06-2013)