26, జూన్ 2013, బుధవారం

బెజవాడ సొగసు చూడ తరమా!



(బెజవాడ మీద రాసిన బ్లాగు చదివి ఎంతోమంది స్పందించారు. అందరికీ ధన్యవాదాలు. పోతే, ప్రత్యేకించి దాసు కృష్ణ మూర్తి గారు బెజవాడతో తన అనుబంధాన్ని, జ్ఞాపకాలను వివరంగా పేర్కొంటూ ఇంగ్లీష్ లో సుదీర్ఘంగా రాశారు. దాన్ని తెలుగులో అనువదించి అందరితో పంచుకోవాలని అనిపించింది.నాకు రాసిన లేఖలో  కృష్ణమూర్తి గారు తనని తాను పరిచయం చేసుకుంటూ - I live in the United States. I am a migratory bird with three migrations, first to Hyderabad, second to Delhi and the third to America. I stayed in Bezwada for 27 years, Hyderabad 29 years, Delhi 20 years and the U.S. 11 years.- అని రాశారు. దీనిబట్టి ఇక వారి వయస్సును, అనుభవాన్ని అర్ధం చేసుకోవచ్చు. వారి ఫోటో ఒకటి సంపాదించగలిగితే ఈ వ్యాసానికి మరింత పరిపూర్ణత్వం సిద్ధించేది. కాని తొలి పరిచయంలోనే ఫోటో పంపమని అడిగే చనువు తీసుకోలేకపోయాను – భండారు శ్రీనివాసరావు )
   
“బెజవాడ నగర సందర్శనను సినిమా హాళ్ళు, హోటళ్ళతో మొదలు పెడదాము.
అప్పట్లో బెజవాడలో రెండంటే రెండే సినిమా హాళ్ళు వుండేవి. ఒకటి మారుతీ సినిమా, రెండోది నాగేశ్వరరావు హాలు.(బహుశా నాగేశ్వరరావు హాలంటే  కృష్ణ మూర్తి గారి ఉద్దేశ్యం దుర్గాకళా మందిరం కావచ్చేమో!) ఇది ముప్పయ్యవ దశకంలో మాట. ఈ సినిమా హాళ్ళకు ఆ రోజుల్లోనే సొంత జెనరేటర్లు వుండేవి.

“సాయం సమయాల్లో ఈ సినిమా హాళ్లనుంచి ఎడ్లబండ్లు సినిమా ప్రచారానికి  బయలుదేరేవి. వాటిల్లో కొందరు కూర్చుని వాయిద్యాలు వాయిస్తూ వుండేవారు. నలుగురు చుట్టూ  చేరగానే సినిమాల తాలూకు కరపత్రాలు పంచుతూ వుండేవారు. ఆ బళ్ళు కనబడగానే వెంట పరిగెత్తుకెళ్ళి ఆ కరపత్రాలు వీలయినన్ని పోగేసుకోవడం మాకు సరదాగా వుండేది. ఎన్ని ఎక్కువ పాంప్లేట్లు పోగేస్తే అంత గొప్ప.

1937 లో పరిస్తితి కొంత మారింది. నాగేశ్వరరావు గారు ఎడ్లబండి స్తానంలో మోటారు వ్యాను ప్రవేశపెట్టారు. దాన్ని రంగురంగుల సినిమా పోస్టర్లతో అందంగా ఆకర్షణీయంగా అలంకరించేవారు. లౌడ్ స్పీకర్ల ద్వారా సినిమా పాటలు వినిపించేవారు. టంగుటూరి సూర్యకుమారి పాడిన రికార్డులను ప్రత్యేకంగా వేసేవారు. ఇలా సాగే సినిమా ప్రచారం కొన్నాళ్ళ తరువాత కొత్త పుంతలు తొక్కింది. సాలూరు రాజేశ్వరరావు, శ్రీరంజని, రామతిలకం నటించిన ‘కృష్ణ లీల’ సినిమా విడుదల అయినప్పుడు ఆ సినిమా నిర్మాత -  కరపత్రాలను విమానం నుంచి వెదజల్లే ఏర్పాటు చేశారు. నిజంగా ఆ రోజుల్లో అదొక సంచలనం.    
“సినిమా నిర్మాతల నడుమ పోటీలు పెరగడం నాకు బాగా గుర్తు. ఒకాయన ద్రౌపది వస్త్రాపహరణం నిర్మిస్తే మరొకరు పోటీగా ద్రౌపదీ మాన సంరక్షణ పేరుతొ మరో సినిమా తీసి విడుదల చేశారు. ఒకరు మాయాబజారు (పాతది) తీస్తే ఆయన ప్రత్యర్ధి శశిరేఖా పరిణయం పేరుతొ అదే కధను తెరకెక్కించారు. అలాగే సినిమాలు ఆడే ధియేటర్ల నడుమ కూడా పోటీ తత్వం వుండేది.

“అప్పటిదాకా పౌరాణిక చిత్రాలదే హవా. రెండో ప్రపంచ యుద్ధానికి కొద్ది ముందు సాంఘిక చిత్రనిర్మాణానికి నిర్మాతలు చొరవ చూపడం మొదలయింది. ముందు భానుమతి, పుష్పవల్లి తో ‘వరవిక్రయం’ వచ్చింది. తరువాత వైవీ రావు, రామబ్రహ్మం, హెచ్ ఎం రెడ్డి, బీఎన్ రెడ్డి వంటి హేమాహేమీలు  రంగ ప్రవేశం చేసి సాంఘిక చిత్ర నిర్మాణాన్ని ముమ్మరం చేశారు. రైతు బిడ్డ, మాలపల్లి,ఇల్లాలు, గృహలక్ష్మి.వందేమాతరం, దేవత వంటి పలు చిత్రాలు ఈ పరంపరలో రూపుదిద్దుకున్నవే. చలనచిత్రాలను పంపిణీ చేసే డిస్ట్రిబ్యూటర్లు  అందరికీ బెజవాడలోని గాంధీనగర్ రాజధాని. సినిమాలు మద్రాసులోనో, కొల్హాపూర్, కలకత్తాలలోనో  తయారయినా వాటిని విడుదల చేయడానికి అవసరమయిన అన్ని హంగులూ, ఏర్పాట్లు చేయాల్సింది మాత్రం  బెజవాడలోనే.

“ఆ రోజుల్లో ఇలా ఇబ్బడిముబ్బడిగా సినిమాలు తీసేవాళ్ళు కాదు. చిత్రానికి చిత్రానికీ నడుమ కనీసం పదిహేనురోజులో,నెల రోజులో వ్యవధానం వుండేట్టు చూసుకునేవారు. సినిమా విడుదలలు లేని ఖాళీ రోజుల్లో ఆ ధియేటర్లలో డ్రామాలు ఆడేవాళ్ళు.
        
“నలభయ్యవ దశకంలో మరో ధోరణి కనబడింది. తెలుగు సినిమాలు దొరక్కపోతే అరవ చిత్రం వేసేవాళ్ళు. హాలు మధ్యలో అనువాదకుడు నిలబడి కొన్ని డైలాగులను తెలుగులో అనువదించి చెబుతుండేవాడు. ఇంటర్వెల్ సమయంలో సినిమా సాంగ్స్ పేరుతొ ఆ సినిమా పాటల పుస్తకాలను అమ్మేవాళ్ళు. వాటికి మంచి గిరాకీ వుండేది.

“బుకింగ్ కౌంటర్ల దగ్గర ఒక వరుసలో నిలబడి టిక్కెట్లు తీసుకునే సంప్రదాయం వుండేది కాదు. కౌంటర్ తెరవగానే అంతా ఒక్కసారిగా మీదపడేవారు. సినిమా టిక్కెట్టు కొనడం అంటే దాదాపు ఒక యుద్ధం చేసినట్టు వుండేది. టిక్కెట్టు తీసుకుని బయటపడేసరికి చొక్కాలు చినిగి పోయేవి. వొళ్ళంతా చెమటలు  పట్టి బట్టలు తడిసిపోయేవి.

“సినిమాహాళ్లలో పారిశుధ్యం పూజ్యం అనే చెప్పాలి. ఆ రోజుల్లో నేల క్లాసు అని ఒక  తరగతి వుండేది. ఆ క్లాసులో  పైన నేల మీద  కూర్చున్న వారిలో ఎవరి పిల్లవాడయినా మూత్రం చేస్తే అది కింద దాకా పారుతుండేది. కింది వైపు కూర్చున్న వారి లాగూలు తడిసేవి. మరుగు దొడ్ల సౌకర్యం వుండేది కాదు. “ఇంటర్వెల్  కాగానే ప్రేక్షకులు ఒక్కమారుగా గుంపులు గుంపులుగా బయటకు వచ్చి సినిమా హాలు గోడల్ని ప్రక్షాళన చేసేవాళ్ళు.

1939 లో అనుకుంటా బెజవాడలో కొత్తగా రామా టాకీసు వచ్చింది. తరువాత వరుసగా గవర్నర్ పేటలో  లక్ష్మీ టాకీసు, వన్ టౌన్ లో  సరస్వతీ మహలు వచ్చాయనుకుంటాను.
     
“ఇక రెస్టారెంట్ల విషయానికి వస్తే-

“వూళ్ళో దాదాపు అన్నీ శాఖాహార భోజన హోటళ్ళే! బ్రాహ్మణ హోటళ్ళు.  చాలావరకు ఉడిపి అయ్యర్లవే. బాగా ప్రాచుర్యం పొందిన వెల్కం హోటల్, మోడరన్ కేఫ్ లాటి హోటళ్ళు కూడా ఉడిపి వారివే. ఒక్క అణా (రూపాయిలో పదహారో వంతు) పెడితే రెండు ఇడ్లీలు, వేడి వేడి సాంబారు, కారప్పొడి, కొబ్బరి చట్నీ, అల్లప్పచ్చడి – అన్నీ లేదు అనకుండా వడ్డించే వాళ్లు.      

”గవర్నర్ పేటలోని బీసెంటు రోడ్డు దగ్గర మొదలు పెడితే గాంధీనగరం వరకు అన్నీ హోటళ్ళే!  మాంసాహారం లభించే హోటళ్ళను మిలిటరీ భోజన హోటళ్ళు అనేవారు. వాటిని  ఎక్కువగా కేరళ వాళ్లు నడిపే వాళ్లు. అలాగే, బయట నుంచి  బెజవాడకు వచ్చిన వాళ్ల చేతుల్లో కొన్ని వృత్తులు వుండేవి. పాల వ్యాపారం చాలావరకు విజయనగరం నుంచి వచ్చిన వారు చూసుకునేవారు. ఒరిస్సా నుంచి వచ్చిన వారు - పాయిఖానాలు  శుభ్రం చేసే పని చూసేవారు. దర్జీ పని, జట్కాలు (గుర్రబ్బండ్లు) ముస్లింల  ఇలాకాలో వుండేవి. రాకపోకలకు రిక్షాలే గతి. సైకిల్  రిక్షాలు రాకపూర్వం వాటిని మనుషులు లాగేవారు. సిటీ బస్సులు వుండేవి కావు. కాకపొతే, బెజవాడ, ఏలూరు, బందరు, గుడివాడల మధ్య బస్సులు తిరిగేవి. ఆ బస్సులకు పై కప్పుమాత్రమే వుండేది. పక్కన ఏమాత్రం ఆచ్చాదన లేకపోవడంతో వర్షం వస్తే అంతే సంగతులు. ప్రయాణీకులు పూర్తిగా తడిసిపోయేవాళ్ళు. కృష్ణా నది మీద రోడ్డు వంతెన లేని కారణంగా బెజవాడ నుంఛి  గుంటూరుకూ, ,తెనాలికీ  బస్సు సర్వీసు వుండేది కాదు. 
అధికారుల పెత్తనం జోరుగా వుండేది. పోలీసు అధికారి కానీ రెవెన్యూ అధికారి కానీ బస్సు ఎక్కాల్సి వస్తే బస్సును ఏకంగా ఆయన ఇంటి దాకా తీసుకువెళ్ళేవాళ్ళు.

“మా ఇల్లు గవర్నర్ పేటలో వుండేది. ఇంటి నుంచి కొత్తపేటలోని హిందూ హై స్కూలు వరకూ నడిచే వెళ్ళే వాళ్ళం. తరువాత మేము చేరిన ఎస్ ఆర్ ఆర్ అండ్ సీ వీ ఆర్ కాలేజీ మాచవరం లో వుండేది. అప్పుడు కూడా మాది నటరాజా సర్వీసే. స్కూల్లో టీచర్లు, కాలేజీలో లెక్చరర్లు అంతా కాలినడకనే వచ్చేవాళ్ళు. దుర్గాగ్రహారంలో వుండే విశ్వనాధ సత్యనారాయణ గారు, చతుర్వేదుల నరసింహం గారు కాలేజీకి నడిచే వచ్చేవాళ్ళు. మాకు వాళ్లు లెక్చరర్లు. దోవలో ఇంగ్లీష్ సాహిత్యం  గురించి చర్చించుకునే వారు. కొత్తగా విడుదలయ్యే ఇంగ్లీష్ సినిమా మొదటి ఆట చూడడం కోసం ప్లాన్లు వేసుకునేవాళ్ళు. కాలేజీ ప్రిన్సిపాల్ పుట్టపర్తి శ్రీనివాసాచారి గారు మాత్రం జట్కా బండిలో వచ్చేవారు. కొందరు లెక్చరర్లు సైకిళ్ళపై చేరుకునే వారు. (వీలు దొరికితే మరి కొన్ని సంగతులు మరోసారి) 

5 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

really nice.....

Unknown చెప్పారు...

అలనాటి బెజవాడ సొగసు చూడ తరమా!నిజమే!చూడతరం కాదు!ఇప్పటి విజయవాడ నిండుగా అగ్గిపుల్లలున్న అగ్గిపెట్టె!

రహ్మానుద్దీన్ షేక్ చెప్పారు...

:)

మనోహర్ చెనికల చెప్పారు...

మరి శివాజీకేఫో

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@మనోహర్ చెవికల - నేను రాసింది బెజవాడ గురించి. శివాజీ కేఫ్ అవతరించింది బెజవాడ విజయవాడగా మారిన తరువాత అనుకుంటాను.-భండారు శ్రీనివాసరావు