‘ఈ చరాచర ప్రపంచంలో అత్యంత ఘోరంగా, అతి హేయంగా మీరు చీదరించుకునే ప్రాణి ఎవరు’ అని మా ఆవిడను అడిగితే సాలెపురుగు అంటుంది. మా మనుమరాలిని ఇదే ప్రశ్న అడిగితే ‘బల్లి’ అని జవాబిస్తుంది. కొన్నేళ్ళక్రితం వరకూ- ఇలాటి ప్రశ్నకు నా సమాధానం సోమమ్మగారు అనబడే సోమిదేవమ్మగారు.
బెజవాడ గవర్నర్ పేటలో లంకంతకొంపనీ ఇద్దరు ఆడపిల్లలనీ, ఆవిడకు వొదిలేసి – సోమమ్మగారి మొగుడు ఆమె చిన్నతనంలోనే కాలం చేసారు. పిల్లలను పెంచి, పెద్దచేసి, పెళ్ళిళ్ళు చేసి పెద్దరికంగా వుండాల్సిన ఆ పెద్దావిడ - ‘మడీతడీ’ అంటూ - ‘అంటూ సొంటూ’ అంటూ- అయినదానికీ, కానిదానికీ అందర్నీ ఆడిపోసుకునేది. కడవంత నోరు చేసుకుని చిన్నా పెద్దా తేడాలేకుండా శాపనార్ధాలు పెట్టేది. ఆమెను చూస్తుంటే చిన్నవాళ్లమయిన మా అందరికీ ఓ బ్రహ్మరాక్షసిలా కనిపించేది. ఇల్లు ఆవిడది కావడం మూలానా, అంత తక్కువ కిరాయికి మరో ఇల్లు దొరికే అవకాశం లేకపోవడం మూలానా - అక్కడ అద్దెకు వున్నవాళ్ళు ఎవ్వరూ – ఆమెకు ఎదురు నిలిచి మాట్లాడేవాళ్ళు కాదు. దానితో, ఇక ఆమె నోటి దురుసుకు ఎదురు లేకుండాపోయింది. మనిషేమో ఆజానుబాహువు. ‘మడీ దడీ’ పేరుతొ అరకొరగా మడిబట్ట చుట్టుకుని, 'అసింటా అసింటా' అంటూ అందరినీ కసురుకుంటూ అందరిళ్ళలో తిరిగేది. ఆమెని చూస్తే చిన్నతనం నుంచీ నాకు అదోకరకం అసహ్యం. పెరిగి పెద్దయిన తరవాత కూడా అది మరింత పెరిగిపోయిందే కానీ ఆ ఏహ్యభావం నన్ను వొదిలిపెట్టలేదు. నాతో పాటే పెరిగి పెద్దయిన ఆమె మనుమలు ఏదో ఉద్యోగాల్లో కుదురుకున్నారు. చిన్నవాడికి ఒక్కడికే ఇంకా పెళ్లి కావాల్సివుంది. అనుకోకుండా అతడికి బంగారం లాటి పెళ్లి సంబంధం వచ్చింది. ఒంట్లో ఇంట్లో బాగావున్న ఓ ఖామందు గారు పిల్లనిస్తామని ఏకంగా వాళ్ళ ఇంటికే వచ్చారు. బాపూ గారి సినిమా పాట మాదిరిగా ‘కట్నమెంత లావో - పిల్ల అంత లావు’. డబ్బా మజాకా! ఎగిరి గంతేసి వొప్పుకున్నారు. పెళ్ళున పెళ్లయిపోయింది. కానీ మూడు ముళ్ళు పడ్డ మూన్నెళ్లకే ఆ అమ్మాయి ఆసుపత్రిలో పురుడు పోసుకుని పండంటి పిల్లాడికి తల్లయింది. అప్పుడుకానీ అంత గొప్ప సంబంధం తమని వెతుక్కుంటూ ఎందుకు వచ్చిందన్న విషయం వాళ్లకు అర్ధం కాలేదు. సోమమ్మగారి సంగతి తెలిసిన వాళ్ళెవ్వరూ ఆ సంగతి తెలిసి ఏమాత్రం జాలిపడలేదు. పైగా అలాటి మనిషికి అలాగే కావాలని బాహాటంగానే నోళ్ళు నొక్కుకున్నారు. ఆ అమ్మాయి తలిదండ్రులు సరేసరి -కన్నె వయసులో కాలుజారిన కన్న కూతురికి పుట్టబోయే బిడ్డ - తమ బిడ్డ బంగారు భవిష్యత్తుకు అడ్డం కాకూడదని, హడావిడిగా పెళ్లి చేసి, ఆసుపత్రిలో పురుడు పోసి – ఆ పసికందుని అక్కడే వొదిలేసి కూతుర్ని తీసుకుని వెళ్లి పోయి చేతులు కడిగేసుకున్నారు. అప్పుడేమి జరిగిందన్నదే – ఈ కధ కాని కధకు క్లైమాక్స్.
సోమమ్మగారిది నిప్పులుకడిగే మడీ ఆచారం అని చెప్పుకున్నాము కదా. మనవడి భార్యకు పుట్టిన బిడ్డకు తండ్రెవరో తెలియదు. ఇంటావంటా లేని ఘోరం జరిగిపోయింది. ఆచారాలకు నెలవయిన ఇంట్లో అనాచారం పురుడు పోసుకుంది. కన్న తల్లేమో నిర్ధాక్షిణ్యంగా రోజుల పిల్లవాడిని వాడిమానానికే వొదిలేసి వెళ్లి పోయింది. ఈ పరిస్తితుల్లో ఆమె మానసిక పరిస్తితి ఎలావుంటుందో తేలిగ్గా వూహించుకోవచ్చు. కానీ, అందరి వూహల్ని పటాపంచలు చేస్తూ సోమమ్మగారు సరాసరి ఆసుపత్రికి వెళ్ళింది. అంతా కళ్ళింత చేసుకుని చూస్తూ వుండగానే – ఎవరికీ అక్కరలేని ఆ అనాధ శిశువుని అబ్బారంగా వొడిలోకి తీసుకుంది. ‘అందరూ కాదనుకుని వెళ్ళినా - నీకు నేనున్నానంటూ’ ఇంటికి తీసుకు వచ్చింది. కన్నతల్లి కాదన్నా, ఆ తల్లిని కన్నవాళ్ళు కాదనుకున్నా, కట్టుకున్నవాడు బెల్లం కొట్టిన రాయిలా మిన్నకున్నా – అమ్మమ్మ గారు – ఆవిడిక నా దృష్టిలో సోమమ్మగారు కాదెంత మాత్రం కాదు – ‘అమ్మమ్మ గారే’ - ఆ చిన్ని వయస్సులోని ఆ చిన్నారికి అమ్మయింది.
అమ్మయి లాలించింది. అమ్మమ్మయి ఆడించింది. నాన్నయి నడిపించింది. నాన్నమ్మయి నీతి కధలు చెప్పి నిద్రపుచ్చింది. తల్లీతండ్రీ లేని ఆ అనాధ శిశువుకు సర్వస్వం అయింది. సర్వం తానే అయింది. ఇప్పుడు చెప్పండి !
ఆమెను ఛీత్కరించాలా! దైవసమానురాలని భావించి నమస్కరించాలా!
మనుషుల్ని కళ్ళతో చూసి కాకుండా మనసుతో చూసి అంచనా వేసుకోగలిగేలా ఎవరిని వారు సంస్కరించు కోవాలా!
నేను ఆమె పట్ల చేసిన పొరబాటు ఇంకెవ్వరూ చేయరనీ, చేయకూడదనీ మనసారా కోరుకుంటూ – మనసు పొరల్లో కదలాడుతున్న 'ఈ జ్ఞాపకాన్ని’ ఇన్నేళ్ళ తరవాత బయటకు తీస్తున్నాను. ఇందువల్ల ఎవరి మనసు అయినా బాధ పడితే క్షంతవ్యుణ్ణి. - మరణించిన తరవాత కూడా, నా మనస్సులో జీవించే వున్న ఆ ‘అమ్మమ్మగారి’ ఔన్నత్యాన్ని నలుగురికీ తెలపడమే ఒక్కటే ఇందులోని ఉద్దేశ్యం.
అందుకే అన్నారు - ప్రార్ధించే పెదవులకన్నా - సేవ చేసే చేతులు మిన్న
(30-08-2010)
4 కామెంట్‌లు:
చక్కటి విషయం వ్రాసారు.
great.
ఆవిడ లో ఏ లోపం లేదేమో .
తన పిల్లలు చిన్న వాళ్ళ గా ఉన్నప్పుడు అందరి ముందు లోకువ అయిపోకుండా , వేరే వాళ్ళు పెత్తనం చెలాయించకుండా ఉండటానికి అలా ప్రవర్తించి ఉండచ్చు . కాని అదే సమయం లో ఆవిడ తన మంచితనం ని ఒక మూలకి నెట్టి ఉంచింది .
ఆ తరువాత అది పైకి తీసింది అంతే .
ఇంకొక వెర్షన్ ఏంటంటే , మధ్యలో ఎక్కడో ఆవిడకి జ్ఞానోదయం అయి ఉండవచ్చు .
చాలా బాగుందండీ, ఈ కథ కాని కథ.
ఇది చదివిన తరువాత, ఒక్క విషయం అర్ధం అయ్యిందేమిటంటే, మనుష్యులను అంత త్వరగా అంచనా వేయకూడదు, certificates అంతకన్నా ఇవ్వకూడదు. నేనొక ఆంగ్ల పుస్తకంలో చదివాను, "Even the God does judge a person until his last breath, who are we to judge?" అని.
మీరు వ్రాసిన వృత్తాంతము అలాగే ఉంది.
చివరిగా ఒక విషయం, మీరు చిన్నతనంలో అనుకున్న తప్పు అభిప్రాయాన్ని గుర్తించి, దానిని సవరించి, ఇలా నలుగురి ఎదుటా చెప్పుకోవడంలో ఏమీ భేషజం చూపకపోవడం మీ ఉన్నత సంస్కారానికి గుర్తు.
సంతోషం అండీ..
మోహన్
మనుషుల్ని అంచనా వేయడం తేలికయిన సంగతి కాదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి