12, జూన్ 2013, బుధవారం

విలేఖరి లోకంలో విహారం


ఈ తరం జర్నలిష్టులకు అంతగా తెలియని పత్రికారచయిత జీ.కృష్ణ గారు. అక్షరాలా కీర్తిశేషులు. కీర్తి మినహా ఏమీ సొంతానికి మిగిల్చుకోకుండా దాటిపోయిన ‘కలం కూలీ’. ఇక శ్రీ సామల సదాశివ. గొప్ప రచయిత. ఈయనా కృష్ణ గారి బాపతే. అందుకే ఇద్దరికీ అంత స్నేహం. కృష్ణ గారు రాసిన జ్ఞాపకాల సమాహారం – ‘విలేఖరి లోకం’ గ్రంధానికి ‘అతనికి దిగులెక్కడిది?’ అనే ముందు మాట రాశారు. అందులో..... (బ్రాకెట్లో నేను రాసినవి – సులభంగా అర్ధం కావడానికి)


హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కార్యక్రమంలో నాటి ఆర్ధిక మంత్రి రోశయ్య గారితో జీ.కృష్ణ గారు. చిత్రంలో నాటి ప్రెస్ క్లబ్ కార్యదర్శి ఎం ఎస్ శంకర్ తో పాటు  సీనియర్ జర్నలిస్ట్ పార్ధసారధి, ప్రెస్ క్లబ్ వైస్ ప్రెసిడెంటుగా నేను (పచ్చ చొక్కా)


“ఇంతకుముందు అతని (కృష్ణ గారి)కోసం ఎవరేది చేస్తానన్నా ఒప్పుకున్నాడా? వల్లమాలిన స్వాభిమానమాయే! మాజీ ముఖ్యమంత్రి అంజయ్య గారు (అధికారంలో వున్నప్పుడు) ఇల్లో ఫ్లాటో ఇస్తానంటే, ‘యెందుకు’ అని ఎదురు ప్రశ్న వేసినాడట. పోనీయండి. ఇప్పటి ముఖ్యమంత్రి గారు (చంద్రబాబు నాయుడు గారు) అతనికి (వైద్యపరంగా) చాలా సహాయం చేసాడని, చేస్తున్నాడని విన్నాను. ముఖ్యమంత్రి గారి దృష్టికి అతని పరిస్తితి తెచ్చిన పుణ్య పురుషుడు ధన్యుడు. ‘ఎవరి రాజ్యంలో కళా సాహిత్యవేత్తలు నిర్ధనులై కష్టపడతారో ఆ దోషం రాజుది’ అన్నాడు భర్తృహరి. ముఖ్యమంత్రి గారు ఈ ఒక్క సత్కార్యంతో ఆ దోషం తమ కంటపడకుండా తొలగించుకున్నారు. ‘ముఖ్యమంత్రిగారు నా గదిలో ప్రవేశిస్తూ ‘ఏమండీ ఈ మాత్రం డబ్బు కోసం బెంగ  పెట్టుకుంటే యెలా? నేనున్నానుగా’ అని నాలో జీవితాశ కలిగించినారు’ అని కృష్ణ నాతో అన్నాడు. ‘మరి, మీ ఇంటికి సిరి వచ్చిన జాడ కనిపించదే’ అంటే ఎమిల్ జోలా కధ చెప్పినాడు”
సదాశివ ఇంకా ఇలా రాశారు.
“కృష్ణ కావ్యకంఠ గణపతిముని శిష్యుడు.
‘రంజ్ సే ఖోగర్ హువా ఇన్సాన్ తొ మిట్ జాతా హై రంజ్ - ముష్కిలే ఇత్నీ పడీ ముజ్ పర్ కే ఆసా హోగయీ – బాధలకు అలవాటు పడ్డ మనిషికి ఏదీ బాధ అనిపించదు. ఎన్ని కష్టాలు అనుభవించినానంటే ఇప్పుడు నాకేదీ కష్టమనిపించడం లేదు’ అన్నాడు మీర్జా గాలిబు. గాలిబుకు జీ. కృష్ణకు కొన్ని పోలికలున్నాయి. కృష్ణ కష్టాలకు అలవాటు పడ్డాడు. కాని బాధ పడ్డట్టు కనిపించలేదు. ‘మనసా ధారయన్ దుఃఖం’ అన్నారు రామున్ని గురించి. కృష్ణ ధీరుడే కాని దీనుడు కాదు.

“జీ కృష్ణకు హిపోక్రసీ నచ్చదు. దాపరికం లేని విలేఖరి. స్పష్టంగా తెలియని దోషాలు తమకు తెలిసినట్టు ఆరోపిస్తూ ఎవరినీ ఎండగట్టకూడదు. విలేఖరిగా కృష్ణ కొన్ని విలువలు పాటించాడు.తాను రాసే వాక్యాలకు జవాబుదారీ వహించే రాస్తాడు. బాధ్యతారహితంగా రాసే వాళ్లకి  ఈ ‘విలేఖరి లోకం’ రవంత వెలుగు చూపిస్తే సంతోషం.”  (విలేఖరి లోకం’లో విహారం మరోసారి)

కామెంట్‌లు లేవు: