(Published in Andhra Prabha on 31-07-2022, SUNDAY today)
ఇచ్చుటలో ఎంతో హాయి వుందని బాపూ రమణలు తమ సినిమాల ద్వారా ఎన్నోసార్లు చెప్పారు.
ఆ ఇవ్వడానికి కూడా ఓ తరీఖా వుందంటున్నారు, ఇవ్వడం తెలిసినవాళ్ళు.
అపాత్రదానం చేయకూడదు అనేది అలాంటివాళ్ళు చెప్పే గోల్డెన్ రూల్. ఏది ఇవ్వాలన్నా కొన్ని ప్రశ్నలకు ముందు జవాబు వెతుక్కున్న తర్వాతే దానాలు, ధర్మాలు వగైరా వగైరా చేయాలనేది వాళ్ళమాట.
ఆ ప్రశ్నలు ఏమిటంటే:
ఎంత ఇవ్వాలి ? ఎప్పుడు ఇవ్వాలి? ఏమి ఇవ్వాలి? ఎలా ఇవ్వాలి?
మరో చివరాఖరి ప్రశ్న మరోటి వుంది. అయితే, ముందు ఈ నాలుగు ప్రశ్నలకు జవాబులు తెలుసుకున్న తర్వాత ఆ చిట్ట చివరి ప్రశ్న విషయం చివర్లో చెప్పుకుందాం.
మొదటి ప్రశ్న ఎప్పుడు ఇవ్వాలి?
పాండవాగ్రజుడయిన యుధిష్ఠిరుడు ఓ రోజు జూదమాడుతూ ఆనందిస్తున్న వేళ, ఓ భిక్షకుడు వచ్చి ధర్మం చేయమని కోరతాడు. ధర్మరాజు తన ధ్యాసలో వుండి, ‘చేయి ఖాళీ లేదు మర్నాడు రమ్మంటాడు. ఆ పక్కనే కూర్చుని గదకు మెరుగులు దిద్దుకుంటున్న సోదరుడు భీమసేనుడు, అన్న ధర్మజుడు నుడివిన మాటవిని ఎంతో సంతోషించాడట. ఎందుకటా!
ఎందుకంటే, వాక్శుద్ధి కలిగిన ధర్మరాజు తన తొందరలో వుండి ఆ భిక్షకుడిని మరునాడు రమ్మని చెప్పాడంటే మరుసటి రోజువరకు అగ్రజుడు బతికే వుంటాడని ఆ కండల వీరుడు సంబరపడ్డాడట.
అయితే, ఈ క్షణంవరకు ప్రాణాలతో వున్న మనిషి మరునిమిషం దాకా జీవించివుంటాడో లేదో తెలియని అశాశ్వతమైన బతుకులు మానవులవి. అలాటిది తక్షణం చేయదలచుకున్న దానాన్ని మరో క్షణం వరకు వాయిదా వేయడం మంచిది కాదన్న పెద్దనీతి ఈ చిన్ని కధలో వుంది.
ఒకరికి ఇవ్వడం, అది దానం అనండి, మరోటి అనండి అది ఏమయినా సరే వాయిదా వేస్తే క్షణభంగుర జీవితంలో అది నెరవేరే వీలుండక పోవచ్చు కూడా. అందుకే ఒకరికి ఏదయినా ఇవ్వాలన్న ఆలోచన కలగగానే దాన్ని తక్షణమే ఆచరణలో పెట్టడం మంచిది.
ఇక ఎంత ఇవ్వాలి అనేది రెండో ప్రశ్న.
చరిత్రలో ఒక సంఘటన చెప్పుకుందాం.
రాణా ప్రతాప్ మహా యోధుడు. కానీ మొఘల్ చక్రవర్తులతో చేసిన ఒక యుద్ధంలో దారుణ పరాజయం పాలవుతాడు. ఒక్క ప్రాణాలు తప్ప సర్వస్వం కోల్పోతాడు. సైన్యం తుడిచి పెట్టుకు పోతుంది. రాజ్యం చేజారి పోతుంది. ఈ పరిస్థితుల్లో అడవుల్లో ఒంటరిగా సంచరిస్తూ విచారిస్తుంటాడు. ఈ దశలో రాణా ప్రతాప్ కు స్నేహితుడు, ఒకప్పటి మంత్రి అయిన భామాషా ఆదుకుంటాడు. తన సర్వ సంపదలను ఆయన అధీనంలో వుంచుతాడు. మళ్ళీ సైన్యాన్ని సమకూర్చుకుని తిరిగి యుద్ధానికి సిద్ధం కాగల ధనసాయం చేస్తాడు. ఈ విషయంలో ఇంతా అంతా అని చూడకుండా భామషా చేసిన సాయంతో రాణా ప్రతాప్ తెప్పరిల్లుకుంటాడు. తిరిగి పోరాటం చేసి పోగొట్టుకున్న రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటాడు.
ఇవ్వాలని అనుకున్నప్పుడు ఇవ్వగలిగినంత పూర్తిగా ఇవ్వాలి. అప్పుడే ఇచ్చిన దానివల్ల ప్రయోజనం వుంటుంది.
ఇవ్వాలి సరే! ఏమి ఇవ్వాలి అనేది మరో ప్రశ్న.
ఇవ్వడం అంటే అర్ధం డబ్బు ఒక్కటే కాదు. ఇతరులని సంతోషపెట్టగలిగేది ఏమి ఇచ్చినా మంచిదే. పువ్వుతో సంతోషపెట్ట వచ్చు, చిరునవ్వుతో కూడా ఇతరులను ఆనందపెట్టవచ్చు. వారి ముక్కూ మొహం మీకు తెలియకపోవచ్చు. కానీ అలాంటి వ్యక్తి వైపు ఆప్యాయంగా చూస్తూ చిరునవ్వు నవ్వండి. అతడు మిమ్మల్ని కొన్ని రోజులపాటు గుర్తుపెట్టుకుంటాడు.
పువ్వు ఇస్తారా! చిరునవ్వు ఇస్తారా! అది మీ ఇష్టం. కాకపోతే ఇచ్చేది మనసారా ఇవ్వండి. మనస్పూర్తిగా ఇవ్వండి. బదులు కోరకుండా ఇవ్వండి. ఇది చాలా చాలా ముఖ్యం.
‘నదుల్లో నీళ్ళు పుష్కలంగా వుంటాయి. కానీ నది దాహం వేసినప్పుడు తనలో పారే నీళ్ళను ఎప్పుడూ తాగదు. అలాగే చెట్టుకు యెంత ఆకలేసినా తనకు కాసిన పళ్ళను తినదు. అంటే ఏమిటి. ఏదయినా ఇతరులకి ఇవ్వడం అన్నదే ప్రకృతి ధర్మం.
ఇక ఎలా ఇవ్వాలి అనేది ఇంకో ప్రశ్న.
దీనికి జవాబు చాలా సింపుల్. మీరు ఇచ్చేదానితో అతడు సిగ్గుపడకూడదు. అలాగే ఇస్తున్నాను కదా అని మీరు గర్వపడకూడదు.
సరే! దానమో, ధర్మమూ, చేయంగల సాయమూ చేసేస్తారు. అప్పుడు మీ ఆలోచనలు ఎలా వుండాలి? అచ్చు మన పురాణ కధల్లోని ఏకలవ్యుడి తీరుగా వుండాలి.
గురువు ద్రోణుడి కోరిక మేరకు అతడు ఏమాత్రం సంకోచించకుండా తన కుడి చేతి బొటన వేలిని కోసి గురుదక్షిణగా సమర్పిస్తాడు. ఈ పనిచేసినందుకు అతడు ఎప్పుడూ విచారించలేదు. అయితే ప్రక్షిప్తమూ ఏమో తెలియదు కానీ చాలామందికి తెలియని విషయం ఒకటి చెబుతారు. అలా ముందూ వెనకా ఆలోచించకుండా బొటన వేలు కోసి ఇవ్వకుండా బాగుండేదని అతడు విచారించిన సన్నివేశం ఒకటి వుందని అంటారు.
జీవితం చరమ దశలో ఏకలవ్యుడు ఒకే ఒకసారి తానుచేసిన పనికి విచారిస్తాడుట అది ఎప్పుడు?
ఎందుకోసం?
అశ్వద్ధామ హతః అని ధర్మజుడితో చెప్పించి, ఆ మాట నిజమే అని నమ్మిన ద్రోణాచార్యుడు విల్లంబులు పారేసి కొడుకు మరణించాడు అని దుఃఖిస్తున్న సమయంలో పాండవులు ఆయనని వధించిన తీరు ఏకలవ్యుడికి సుతారమూ నచ్చదు. అప్పుడు ఇలా అనుకుంటాడుట.
‘ఆరోజు గురుదక్షిణగా నా కుడి చేతి బొటన వేలు త్యాగం చేసి పొరబాటు చేశాను. అలా చేయని పక్షంలో, పాండవులు ఎవరు కూడా తన గురుదేవుడిని చంపే సాహసానికి పూనుకుని వుండేవారు కాదు, నా గురువుని నేను కాపాడుకోగలిగేవాడిని’
పొతే ఇంతవరకు చెప్పంది, అతి ముఖ్యమైనది అయిన చివరి ప్రశ్న.
మన వారసులకు ఏమి ఇచ్చి మనం ఈ లోకం నుంచి సెలవు తీసుకోవాలి అనేది ఆ ప్రశ్న.
ప్రపంచం మొత్తంలో అతి పెద్ద సంపన్నుడు, అతి గొప్ప దాన కర్ణ్డుడు అయిన వారెన్ బఫెట్ ఈ ప్రశ్నకు ఇలా జవాబు చెప్పాడు.
“మీ సంతానం ఏమి చేద్దామని అనుకున్నా సరే, అందుకు సరిపోయేంత సొమ్ము, సంపద వారికి మారుమాట్లాడకుండా ఇచ్చేయండి. అయితే, ఏమి చేయకుండా ఉంటాము అని వారంటే మాత్రం వారికి ఏమీ ఇవ్వకండి”
నిజానికి ఇవ్వడం అనేది ఓ కళ.
సంత్ కబీర్ చెప్పిన మాటలు ఈ వ్యాసానికి సరయిన ముగింపు అనుకుంటున్నాను.
‘మనం ప్రయాణిస్తున్న పడవలో నీళ్ళు నిండినప్పుడు ఏమి చేస్తాము? రెండు చేతులతో ఆ నీళ్ళు తోడి బయట పోస్తాము. అలాగే మన ఇల్లు సమస్త భోగభాగ్యాలతో, సిరి సంపదలతో నిండిపోయినప్పుడు కూడా అదే పని చేయాలి”
(31-07-2022)