గతంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆకాశవాణి, దూరదర్శన్ లు ఏకచత్రాధిపత్యంగా ఏలుబడి సాగిస్తున్న కాలంలో, ప్రముఖ దినపత్రికల్లో వారానికోసారి వాటి కార్యక్రమాల మంచి చెడులను విశ్లేషిస్తూ చక్కటి వ్యాసాలు వచ్చేవి. కార్యక్రమాల మెరుగుదలకు తోడ్పడే మంచి సూచనలు అప్పుడప్పుడు వాటిల్లో తొంగిచూస్తుండేవి. కాకపోతే, వాటి నిర్వహణ యావత్తూ ప్రభుత్వం కనుసన్నల్లో జరిగేది కనుక ఆ సూచనలను ఏమాత్రం ఖాతరు చేసాయన్నది చరిత్రకే ఎరుక. ఈలోగా ప్రభుత్వ మీడియా సంస్థలకు తమ పనిపాటల్లో ఓమేరకు స్వేచ్చ (ఫంక్షనల్ ఫ్రీడం) కల్పించే క్రమంలో వాటిని ‘ప్రసార భారతి’ గొడుగు కిందకు తేవడం జరిగింది. కానీ ఆ సరికే దేశంలో ప్రైవేటు రంగంలో టీవీ ఛానళ్ళ శకం మొదలవడంతో, వాటికి వున్న వెసులుబాట్లు ప్రసారభారతికి కొరవడడంతో, ఏ లక్ష్యం కోసం రేడియో, దూరదర్సన్ లకు స్వేచ్చ కల్పించారో ఆ ఉద్దేశ్యం పూర్తిగా నెరవేరకుండా పోయింది. కొత్త ఛానళ్ళ ధగధగల ముందు పాత ఛానల్ వెలవెల బోయిన మాట వాస్తవం. ఈ పోటాపోటీ కాటాకుస్తీ పోటీల్లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన దూరదర్సన్ ప్రసారాలు, ప్రస్తుతం వున్నాయంటే వున్నాయన్న చందంగా కొనసాగుతున్న భావన ప్రజల్లో ప్రబలుతోంది. కొత్తొక వింత మాదిరిగా సరికొత్త ఛానళ్ళు తామర తంపరగా పుట్టుకొచ్చి కొంగొత్త కార్యక్రమాలకు పురుడు పోస్తూ వీక్షకులను ఆకర్షించే పనిలో పడ్డాయి. ఈ క్రమంలోనే కొన్ని అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకుంటూ వుండడమే, ప్రైవేటు టీవీల రాకను మనసారా కోరుకున్న వారిని కూడా మధన పడేట్టు చేస్తోంది.
స్పర్ధ వల్ల విద్య
పెరుగుతుందని చెప్పేవారు. అలాగే పోటీవల్ల నాణ్యత మెరుగు పడుతుందని కూడా అంటారు.
సాంకేతికంగా నాణ్యత పెరుగుతున్న మాట వాస్తవమే. కానీ కార్యక్రమాలలో ఆ విషయం
ప్రస్పుటమవుతున్నదా అంటే చప్పున అవునని చెప్పలేని స్తితి. దీనికి ఆయా టీవీల
యాజమాన్యాలను కూడా తప్పుపట్టలేని పరిస్తితి. వాణిజ్యపరంగా చూస్తే, టీవీల నిర్వహణ
కూడా అలవికాని భారంగా పరిణమిస్తున్న రోజులివి. తియ్యనీటికి చేపలు ఎగబడే చందంగా ఈ
రంగంలో ఏదో వుందన్న ఆశతో జర్నలిజంతో సంబంధం లేని పెట్టుబడుదారులు ఇందులో చేరడంతో
విలువలకంటే పెట్టుబడుల పరిరక్షణ ప్రధానంగా మారిపోయింది. దీనికి తోడు రాజకీయాల రంగూ, రుచీ, వాసనా కాఫీ డికాక్షన్ మాదిరిగా దిగిపోయి పరిస్థితులను
మరింత దిగజార్చాయి. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఒకే టీవీ, ఇప్పుడు ప్రతి పార్టీకి ఒకటో రెండో టీవీలు. (సొంతం కాకున్నా, సొంతంకంటే ఎక్కువగా మద్దతు ఇచ్చేవి)
పెనం మీద నుంచి
పొయ్యిలో పడ్డట్టు వీటికి తోడు సోషల్ మీడియాలో ముసుగులు కప్పుకున్న తాలిబాన్ల వంటి
కలం వీరులు, గళం ధీరులు.
ఏదైనా మార్పు
మంచిదే. మార్పును ఆహ్వానించాల్సిందే. ఈ క్రమంలో కొన్ని అగచాట్లు తప్పవు. మంచి
చెడుల నడుమ ఘర్షణ తప్పదు. మురుగు నీరు సర్దుకుని, తేటనీరు బయట
పడడానికి కొంత సమయం అవసరం. ఐతే, ఈ వ్యవధానం మరీ
పెరుగుతూ పొతే, ఆశించిన ఫలితాలు అందడం కూడా ఆలస్యం అవుతుంది. మంచి మరుగునే
వుండిపోయి, చెడు చెంతనే వుంటుంది.
ఆశాజీవులు కూడా ఈ విషయం గమనంలో పెట్టుకోవాలి.
కాకపోతే, ఈమధ్య వివిధ టీవీ ఛానళ్లలో వస్తున్న కార్యక్రమాలపై అనేక సోషల్ నెట్
వర్కుల్లో కానవస్తున్న వ్యాఖ్యానాలు గమనిస్తుంటే, పూర్వం దూరదర్శన్ కూడా ఇంతటి తీవ్ర స్థాయిలో విమర్శలు
ఎదుర్కోలేదేమో అని అనిపిస్తోంది. దూరదర్శన్ కార్యక్రమాలు గురించి జంధ్యాల మార్కు సినిమాల్లో
చక్కటి హాస్య స్పోరక సన్నివేశాలు అనేకం వచ్చాయి. కానీ, ప్రస్తుతం
విస్తృతంగా వ్యాపించివున్న ప్రైవేటు న్యూస్ ఛానళ్ళకు మాత్రం విమర్శకులు ఆమాత్రం మినహాయింపు (అంటే హాస్య ధోరణిలో ఎండగట్టడం) కూడా ఇవ్వడం లేదు, పైగా కడిగి గాలించేస్తున్నారు. వాటికి రాజకీయ రంగులను పులుముతున్నారు. ఈ
ఛానల్ ఇలాగే చెబుతుందిలే అన్న ధోరణిలో మాట్లాడుతున్నారు. సుదీర్ఘ కాలం మీడియాలో
పనిచేసిన మా బోంట్లకు ఇది మింగుడు పడడం లేదు. అయినా ఇది కాదనలేని నిజం.
నేను ఖమ్మం
కాలేజీలో చదివేటప్పుడు మాకు ఇంగ్లీష్ గ్రామర్ లెక్చరర్ ఒకరు వుండేవారు. ఆయన రాగానే
గోలగోలగా వున్న క్లాసును అదుపుచేయడానికి డష్టర్ తో బల్ల మీద చప్పుడు చేస్తూ, ‘లెస్ నాయిస్
చిల్డ్రన్, లెస్ నాయిస్ ప్లీజ్ ’ అని పదేపదే అనేవారు. ‘పిల్లలు ఎలాగూ గోల చెయ్యకమానరు, కాబట్టి ఆ
చేసేదేదో కాస్త తక్కువ చేయండ’న్నది దానికి టీకా తాత్పర్యం.
ఇప్పుడున్న పోటా
పోటీ కాటా కుస్తీ ప్రపంచంలో పూర్తిగా ‘మడి’ కట్టుకుని ఛానళ్ళు నిర్వహించడం సాధ్యం కాని మాట
నిజమే. కాకపోతే ‘రేటింగులను’ ఓపక్క కనిపెడుతూనే, జనం నాడినిపట్టుకునే కార్యక్రమాలకు
రూపకల్పన చేయడానికి కూడా ఉపాయాలు ఉండకపోవు.
వాటిని గురించి
ఆలోచిస్తే బాగుంటుందేమో కాస్త ఆలోచించండి!
2 కామెంట్లు:
ఈ రోజుల్లో, నాయకులు ఏ విమర్శలు చేశారు అనే దాని కన్నా , ఈనాడు ఒకటి రాస్తే, సాక్షి దానికి కౌంటర్ ఏం రాసింది అని , ఆంధ్రజ్యోతి జగన్ ని విమర్శిస్తే, సాక్షి ఏమంటుంది , వీటి మీద ఇంటరెస్ట్ ఎక్కువైంది . అందులో నిజానిజాలు గురించి చింతే లేదు ఎందుకంటే ఎవరికీ కావలసినట్టు వాళ్ళు వార్తలు రాసుకుంటారు అని జనం ఎప్పుడో నమ్మడం మొదలెట్టారు .
గమనించారో లేదో ఈ మధ్య దూరదర్శన్ చానెల్స్ క్వాలిటీ పెరుగుతోంది. ఉదాహరణకు డీడీ నేషనల్ న్యూస్ .
కామెంట్‌ను పోస్ట్ చేయండి