“నీ గురించి నువ్వు ఎప్పుడూ చెప్పుకోకు. మంచి చెప్పుకుంటే ఎవరూ నమ్మరు.
చెడు చెప్పుకుంటే ఇంకా ఎంత వుందో అని రాగాలు తీస్తారు.”
ఎప్పుడో రేడియోలో పనిచేసే రోజుల్లో నా బల్ల మీద నేను రాసిపెట్టుకున్న
సూక్తి. మనం ఎవ్వరం అనేది మనం ఎంత తక్కువ చెప్పుకున్నా ఇతరులకు అది ఎక్కువగానే
అనిపిస్తుంది. అది మానవ సహజం. మన గురించి నలుగురూ ఏమనుకుంటున్నారో అదే నిజమైన ‘మనం’
ఒకప్పుడు ఈనాడు పత్రికకు న్యూస్
బ్యూరో చీఫ్ గా చేసి, ఎన్. జనార్ధన రెడ్డి ముఖ్యమంత్రిగా
వున్నప్పుడు ఆయనకు ప్రధాన పౌర సంబంధాల అధికారిగా పనిచేసిన ఏ. రజా హుస్సేన్ ప్రముఖ
రచయిత, ప్రసిద్ధ కవి,
భావుకుడు కూడా. ఆయన నా గురించి, నా రచనలు గురించి సవివరంగా రాసిన పోస్టు ఒకటి
గ్రూపుల్లో చక్కర్లు కొడుతూ నా దృష్టికి వచ్చింది. ఇందులో అతిశయోక్తులుగా మీకు అనిపించినవి వడపోసి
చదువుకుంటే ఎక్కడో అక్కడ ‘నేను’ నా
సూక్ష్మ రూపంలో కనపడతాను)
కరోనా...కాలమ్.. – ఏ. రాజాహుస్సేన్
*ఆయన 'భండారు '
మాత్రమే
కాదు...సమాచార 'భాండాగారం ' కూడా…!!
ఆయన రాతలకు కొన్ని మచ్చుతునకలు :
*దేవుడా! నాకు డబ్బివ్వు. ఎంతంటే, అవసరంలో ఉన్నవారికి సాయపడేటంత…!!
*దేవుడా! నాకు అధికారం ఇవ్వు. ఎంతంటే, అవసరంలో ఉన్నవారికి ఉపయోగపడేటంత !!.
*దేవుడా! నాకు మంచి ఆరోగ్యం ఇవ్వు. వయసు
మళ్ళినప్పుడు ఎవరిమీదా ఆధారపడకుండా వుండేటంత'!
*నిర్ణయం మంచిది అయినప్పుడు అది పలానా
వ్యక్తి తీసుకున్న నిర్ణయం కాబట్టి మంచిదనే నిర్ణయానికి రావద్దు. పలానా వ్యక్తి
చేసిన నిర్ణయం కాబట్టి మంచిదయినా కాదని తప్పు పట్టవద్దు.
*నిజానికి రూలు అందరికీ ఒకటే. మన దేశంలో
ఇబ్బంది ఏమిటంటే దాన్ని అమలు చేసే అధికారి/సిబ్బంది దయాదాక్షిణ్యాలను బట్టి రూలు
రంగూ రుచీ మారుతుంటుంది.
*ఆరోపణలు చేయడానికి ఆధారాలు అక్కరలేదు.
వాటిని ప్రసారం/ప్రచారం చేసే మాధ్యమాలు వుంటే చాలు
*'మీడియా మేనేజ్ మెంట్, మీడియా కంట్రోల్! ఈ రెండూ మీడియా స్వేచ్ఛను హరించేవే!'
*మూడు స్థంభాలకు జరూరుగా మరమ్మతులు
జరగాలి. నాలుగోది అంటారా?Beyond Repair”
*దేశంలో కావాల్సింది చమురుశుద్ధి
కర్మాగారాలు కాదు, చిత్తశుద్ధి కర్మాగారాలు. ఎందుకంటే
పూర్తి కొరత వున్నది దానికే్!
*ఒక సామాన్యుడి విషయంలో చట్టం ఎలా
అమలవుతుందో అదే చట్టం అసామాన్యుల పట్లకూడా అదేవిధంగా వర్తిస్తే అప్పుడు చట్టం
ముందు అందరూ సమానులు అనే సూక్తికి అర్ధం వుంటుంది.లేని పక్షంలో దేశంలో రెండు
చట్టాలు వున్నట్టే లెక్క.
ఆకాశవాణి ఇంటి పేరుగా మార్చుకున్న
భండారు శ్రీనివాసరావు,
*అతడజాత శత్రువు....అతడు ఆకాశవాణి
విలేకరి.. అతడు హాస్య చతురుడు.. అతడు సహృదయుడు.. అతడు హితుడు…సన్నిహితుడు...
"మనిషి మెత్తన .. మాట మెత్తన... మృదు
స్వభావి...వివాదరహితుడు!!
ఓ మనిషిలో ఇన్ని సుగుణాలుండటం
విశేషమే
సుమా..?
మా
భండారు శ్రీనివాసరావులో ఇవన్నీ
రాశిగా
పోసివున్నాయి.
కానీ... భండారు శ్రీనివాసరావు మాత్రం…….
తాను
సకల గుణ సంపన్నుడినేం కాదు అంటాడు..
"నాకు వుండకూడని అవగుణాలు అన్నీ
ఉన్నాయి. కోపం, ఉక్రోషం,
పెద్దంతరం
చిన్నంతరం లేకుండా మాట తూలడం ఇలా అనేకం. కానీ దేవుడు నాయందు దయతలచి అసూయ ఇవ్వలేదు.
అంచేత నిలువునా తగలబడి పోకుండా ఇలా నిలబడి వున్నాను".!! అంటాడు శీను.
ఆకాశవాణి విలేకరి అంటే .".కట్టె కొట్టె చెప్పె" అన్నట్లుంటారు. కానీ
శ్రీనివాసరావు ఇందుకు మినహాయింపు.
వార్తను క్షుణ్ణంగా అర్థంచేసుకోనిదే ఫోన్ ఎత్తేవాడు కాదు. ఫ్లాష్ న్యూస్
ఆగమేఘాల మీద అందించే వాడు. రేడియోకి ఎంత అవసరమో అంతే..
హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కార్యదర్శిగా,
వైస్
ప్రెసిడెంట్ గా, కార్యవర్గ సభ్యుడిగా, ప్రెస్ క్లబ్ ఎన్నికలకు
రిటర్నింగ్ ఆఫీసర్ గా వివిధ హోదాల్లో పనిచేశాడు ..
సూర్య దినపత్రికలో అయిదారేళ్ళపాటు "సూటిగా..సుతిమెత్తగా"
శీర్షికతో వారానికి రెండురోజులు
వివిధ
విషయాలపై వ్యాసాలు రాశాడు. సాక్షి, ఆంధ్రప్రభ , జ్యోతి, భూమి వంటి పత్రికల వాళ్ళు ఆయనచేత అడిగి మరీ రాయించుకుంటారు.
తెలుగు యూనివర్సిటీవారు తాపీ ధర్మారావు పేరిట పత్రికా రచనకు ఇచ్చే కీర్తి
పురస్కారానికి ఎంపికయ్యాడు.
ఈయనది
పండిత వంశం. పాత్రికేయుడిగా, వార్తల చదువరిగా, రచయితగా ఆయనది యాభై సంవత్సరాల సుదీర్ఘ అనుభవం. ఎందరో ముఖ్యమంత్రులకు ఫోన్
చేసి పలకరించగల చనువు వున్నా ఏనాడూ తన పరిధి దాటలేదు. వారితో కూర్చుని
విందు భోజనాలు చేసినా ఏనాడూ నాకిది చేసిపెట్టమని ఎవరినీ అర్థించలేదు. ఇప్పటికీ
శ్రీనివాసరావు వుండేది అద్దె ఇంట్లో ఉంటున్నాడు అంటే నాకే నమ్మకం కుదరదు. కానీ అది
వాస్తవం. అందుకే రాజకీయ నాయకులకే కాదు,
జర్నలిజం ఫీల్డ్ లో దిగ్గనాధీరులయిన వారికి కూడా ఆయనంటే అంత గౌరవం.
రష్యా రేడియో లో చాలా సంవత్సరాలు తెలుగు వాణిని వినిపించాడు. ఆ నాలుగేళ్ళ
సమయంలో వారికి మాస్కోలో ఎదురైన తియ్యని
అనుభూతులను పంచదార పాకంలో వేసి ద్రాక్షపాకంలో కలిపి పాఠకులకు అందించారు. 2012,లో వచ్చిందీ పుస్తకం.. ‘మార్పు చూసిన కళ్ళు’ పేరుతొ.
ఆయన పదవీవిరమణ
చేసి పుష్కరం దాటిపోయింది.
టివీ
చర్చాకార్యక్రమాల్లో విశ్లేషకుడిగా ఇప్పటికీ ఈ వయసులో కూడా క్రియాశీలకంగా వుండడం
ఆశ్చర్యం. ఉన్నంతలో విషయాన్ని
ఉన్నదున్నట్లు చెప్పే ఒకే ఒక్క విశ్లేషకుడు
అనే పేరు తెచ్చుకున్నాడు. టీవీల వారే
ఆయన్ని అడిగిమరీ చర్చలకు
పిలిపించుకుంటారు. రోజుకు మూడు ఛానళ్ళ చర్చల్లో పాల్గొనేవాడు. విభిన్న రాజకీయ దృక్పధాలు కలిగిన
ఛానళ్ళు ఆయన్ని ఆహ్వానించడం శ్రీనివాసరావు నిష్పాక్షికతకు నిదర్శనం. భార్యా
వియోగంతో ..ఏడాది నుంచీ టీవీ చర్చలకు దూరమయ్యాడు.
అయినా ఛానళ్ళవాళ్ళు ఇంటికి వెళ్లి మరీ ఆయన అభిప్రాయాలు రికార్డు చేసుకుంటారు.
విషయాన్ని విడమరిచి నిష్పక్షపాతంగా తన అభిప్రాయం చెప్పడం, చర్చల్లో హుందాగా
వ్యవహరించడం..ఎదుటి వారిని నొప్పించకుండా..విషయాన్ని విపులంగా వివరించడం శీను
ప్రత్యేకత!!
భండారు శ్రీనివాసరావు నాకంటే వయసులోనే కాదు, ప్రొఫెషన్ గా కూడా సీనియరే. అయినా
ఎందుకనోమొదటి నుంచీ ఆయన్ను " శీను" అనిపిలవడం అలవాటైంది. ఆయన దగ్గర అంత
చొరవ ఎందుకు అంటే,
చెప్పడం కష్టమేమీ కాదు...అది ఆయన మంచి
తనం..సహృదయత..అంతే..!
శ్రీనివాసరావు పేరుకు ఆల్ ఇండియా రేడియో రిపోర్టరే. కానీ..నిజానికి సకలకళావల్లభుడు. రాజకీయం,
సాహిత్యం, శాస్త్రం, కళలు,
సామాజికం,..ఇలా రంగమేదైనా...ప్రవేశం, పరిజ్ఞానం అపారం. అందుకే నేను
శీను ను
"అల్ ఇన్ ఒన్ "అంటాను…
ఆలిండియా రేడియో శ్రీనివాసరావు ఇప్పుడు ఫేస్ బుక్ శ్రీనివాసరావుగా
మారిపోయాడు. ఆయన పోస్టులకోసం చకోర పక్షులుగా ఎదురు చూసేవారు కోకొల్లలుగా వున్నారు.
ఆయన ఏదైనా ప్రజా సమస్య గురించి రాసారు
అంటే ప్రభుత్వాలు దిగివచ్చి దిద్దుబాటు చర్యలు తీసుకున్న సందర్భాలు అనేకం. ఆయన కలం అంత పవర్ ఫుల్. తెలంగాణా మంత్రి కేటీఆర్ ఒకసారి
బీబీసీ ఇంటర్వ్యూ లో శ్రీనివాసరావు పేరు
ప్రస్తావించి మరీ చెప్పారు ఈ సంగతి.
భండారు శ్రీనివాసరావు అప్పుడప్పుడూ ‘ గీత’’ కారుడైపోతుంటాడు. వివిధ విషయాలు, సంఘటనలపై భాష్యం చెబుతుంటాడు.
ఫేస్బుక్ పై శీను భాష్యం చూడండి..!!
“ఇది జుకెర్ బర్గ్ సృష్టించిన వింత ప్రపంచం. ఇక్కడ వయస్సుతో నిమిత్తం లేదు.
అనుభవంతో నిమిత్తం లేదు. అందరూ సమానమనే గొప్ప ప్రపంచం. ఒకరకంగా మనం ఎవరం ఎప్పుడూ
చూడని కొత్త ప్రపంచం. ఈ ప్రపంచంలో ఎంత జాగ్రత్తగా మసలుకోవాలో
ప్రత్యేకంగా
చెప్పాల్సిన పనిలేదు”
ఆఖరికి తను పనిచేసిన మీడియా
రంగాన్ని కూడా ఆయన వదలకుండా తన రాతలతో
దుమ్ము దులిపారు.
మచ్చుకు చూడండి ఆయన మాటలు ఎంత
ఘాటుగా ఉంటాయో.
“సరే! జగను, బాబు,
కేసీఆర్, మోడీ, రాహుల్ అంటే మీ లెక్కలేవో మీకున్నాయి.
నిష్పక్షపాతంగా రాయాలి అంటే మీ ఇబ్బందులేవో మీకున్నాయి. అలాగే, ఆర్ధిక సంబంధాలు, రాజకీయ అనుబంధాలు వగైరా వగైరా!
“మరి ఎవరి కొమ్మూ కాయల్సిన అవసరం లేని సందర్భం వచ్చినప్పుడు కూడా మీడియా
స్వతంత్రంగా, స్వేచ్ఛగా, నిర్మొహమాటంగా, భయమూ,
బెదురూ
లేకుండా వార్తను వార్తగా రాయడానికి ఏమి అడ్డం వస్తోంది. అమెరికా ఎన్నికల్లో
ట్రంపునో, బైడన్ నో మోయాల్సిన అవసరం ఏమొచ్చింది?
“ట్రంపు మేనమామ కొడుకూ కాదు,
బైడన్
మేనత్త కొడుకూ కాదు. వాళ్ళు మీకు ఇచ్చే ఆర్ధిక వత్తాసూ ఏమీ లేనప్పుడు మీ కలాలకు
బానిస సంకెళ్ళు దేనికి? ఎందుకోసం?”
"మీడియాను కట్టడి చేయడంవల్ల
అధికారంలోవున్నవాళ్ళు శాశ్వతంగా అధికారంలో కొనసాగుతారా? అంటే గ్యారెంటీ లేదు" -
*ప్రభుత్వ తాయిలాలతో మీడియాను తమ
కనుసన్నల్లో వుంచుకునే పార్టీలు శాశ్వతంగా అధికారంలో వుండగలవా? అంటే ఆ గ్యారెంటీ అస్సలు లేదు" -
*అధికార పార్టీని ఓడించడానికి వ్యతిరేకత
ఒక్కటే సరిపోదు. ఆ వ్యతిరేకత నుంచి అసహనం పుట్టాలి. ఆ అసహనం నుంచి అసహ్యం
పుట్టాలి. ఆ పార్టీని ఓడించి తీరాలి అనే కసి పుట్టాలి. ఎన్నికల చరిత్రలో ఘోర
పరాజయాలకు, ఘన విజయాలకు ఇదే మూల సూత్రం. వ్యక్తుల
పాత్ర కేవలం కాకతాళీయం.
*"అదేమిటండీ. ప్రెస్ ని ఎదురుగా
పెట్టుకుని అంతేసి అబద్ధాలు అలవోకగా చెప్పేశారు?"
"చూడూ.
రాజకీయాల్లో నేనెక్కడ వున్నాను? నువ్వెక్కుతున్న నిచ్చెన పైమెట్టు మీద.
నువ్వేమో ఇంకా మొదటి మెట్టు దాటలేదు. ఒక నీతిపాఠం చెబుతా, గుర్తెట్టుకో. అబద్ధం చెప్పు. కానీ గోడ కట్టినట్లు ధాష్టీకంగా చెప్పు. జనం
అప్పుడే నమ్ముతారు. అది అబద్దమో కాదో నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎదుటి పార్టీ మీద
వుంటుంది. ఇంకో సంగతి. ప్రెస్ కి కూడా ఇలాంటి సంగతులే కావాలి. పెద్దగా కష్టపడకుండా
పెద్దగా ఖర్చు పెట్టకుండా పబ్లిసిటీ రావాలంటే ఇదే ఉత్తమ మార్గం. సరే పోయి వాళ్ళకి
ఏమేం కావాలో దగ్గరుండి చూసుకో. పో."
"విరిగి పెరిగితి, పెరిగి విరిగితి - కష్టసుఖముల సారమెరిగితి’ అన్న గురజాడ వాక్కు కొందరి
విషయంలో అక్షర సత్యం.!
కొందరు సుఖపడడానికి పుడతారు. తాము సుఖపడుతూ ఇతరులను కూడా సుఖపెడతారు.
ఇంకొందరు తాము సుఖపడుతూ ఇతరులను కష్టపెడతారు. మరికొందరు కష్టపడడానికి పుడతారు.
వారిలో కొందరు కష్టపడుతూ తోటివారిని సుఖపెడతారు.పైన చెప్పిన కవి వాక్కు ఇలాటివారిని
గురించే. బహుశా ఈ చివరి తరగతి వారు ఆడవారయివుంటారు.
*అస్తు..అస్తు..జబరదస్తు….!
“పూర్వం వీధి నాటకాల్లో కేతిగాడు అనేవాడు రంగ ప్రవేశం చేసి తన వెకిలి
చేష్టలతో గ్రామీణ ప్రజల్ని నవ్వించేవాడు. ఈటీవీలో ఓ ప్రోగ్రాం వస్తుంటుంది. దాన్ని
చూస్తుంటే అది జ్ఞాపకం వచ్చింది. ఈ ప్రోగ్రాం,
పేరేమిటో
తెలియదు కాని, ఇందులో ఒకరా ఇద్దరా అనేకమంది
కేతిగాళ్ళు. వీళ్ళ చేష్టలు, ఆకారాలు వెకిలిగా, వికృతంగా వున్నాయి. దీనికి తోడు ఆ కార్యక్రమానికి జడ్జీలుగా వచ్చిన
ప్రసిద్ధ నటీనటులు పగలబడి నవ్వుతుండడం చూసి మరింత రోతగా అనిపించింది. దీన్ని నేను
ఇంతవరకు చూడలేదు, కానీ వింటూ వస్తున్నాను.
రామోజీ రావు గారు తమ ఛానల్లో వచ్చే ప్రతిదీ చూసి ఓకే చేస్తారని చెబుతుండగా
విన్నాను. నేను విన్నది నిజం కాదేమో అనిపిస్తోంది " .. !!
మీడియా మొఘల్ కు ఎవరైనా ఇలా ఓపెన్ గా సలహా ఇవ్వగలరా!
శీను...మీరిలానే ఎప్పుడూ... మీలానే వుండండి.!!
ఏ.రజాహుస్సేన్.!
3 కామెంట్లు:
శ్రీనివాసరావు వుండేది అద్దె ఇంట్లో ఉంటున్నాడు అంటే నాకే నమ్మకం కుదరదు.
నేను నమ్మేస్తున్నా :)
తెలివైన వారు అని అర్థమవుతోంది దీని వల్ల :(
జిలేబి
భండారు వారు,
వ్యాసం చక్కగా ఉంది.
అన్నట్లు కేతిగాడు బంగారక్కలు వచ్చేదో తోలుబొమ్మలాటలలో. వీరి వెకిలిగోల హాస్యాన్ని పానుగంటి వారు సాక్షి వ్యాసాల్లో ఏకిపారేసారు.
శ్రీనివాసరావు గారి వృత్తి జీవితం గురించి నాకు ప్రత్యక్షంగా అవగాహన లేదు. కానీ బ్లాగరుగా, టీవీ చర్చల్లో పాల్గొనే ప్రముఖుడుగా కనిపిస్తున్నారు (తరువాత తరువాత నేను టీవీ చర్చలు చూడటం మానేశాననుకోండి 🙂). ఆ అనుభవంతోటి చెబుతున్నాను పైన రజా హుస్సేన్ గారు చెప్పిన దాంట్లో ఏ మాత్రం అతిశయోక్తి లేదని.
కామెంట్‌ను పోస్ట్ చేయండి