27, నవంబర్ 2020, శుక్రవారం

ఒకే దేశం ఒకే ఎన్నిక – భండారు శ్రీనివాసరావు

 ప్రధాన మంత్రి  నరేంద్ర మోడీ గారి ఈ ప్రతిపాదన ఆహ్వానించతగింది. నిజానికి మనదేశానికి స్వాతంత్రం వచ్చిన తొలి ఎన్నికలు ఈ విధంగానే జరిగాయి. లోకసభకూ, ఆయా రాష్ట్రాల శాసన సభలకు కలిపి ఒకేసారి, కాకపొతే వివిధ దశల్లో ఎన్నికలు నిర్వహించేవారు. ఇది కొత్త పద్దతి కాదు, కొత్త సంప్రదాయమూ కాదు.

నెహ్రూ హయాములో ఒకసారి 1959 లో  కేరళ రాష్ట్రంలో అప్పటి కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని తొలగించి మొట్టమొదటిసారి రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టారు. తదాదిగా, అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలహీన పడడం, అక్కడ నిలదొక్కుకున్న స్థానిక నాయకత్వాలను, ప్రాంతీయ, సంకీర్ణ ప్రభుత్వాలను దెబ్బతీయడానికి, లేదా తొలగించడానికి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం రాజ్యాంగంలోని 356 అధికరణాన్ని విచ్చలవిడిగా, విశృంఖలంగా వాడుకునే కొత్త వికృత సాంప్రదాయానికి తెర లేచింది. ఈ విధంగా చేయడం ప్రజాస్వామ్యానికి చేటు చేస్తుందని విపరీతంగా విమర్శలు చేసి. కాంగ్రెస్  పార్టీని ఎన్నికల్లో మట్టి కరిపించి  కేంద్రంలో అధికారంలోకి వచ్చిన జనత పార్టీ కూడా కాంగ్రెస్ పాలనలో ఉన్న అనేక రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధించి ప్రజాస్వామ్య హననంలో తామూ తక్కువ తినలేదని రుజువు చేసింది.

ఈ గత అనుభవం నేర్పే పాఠం ఏమిటంటే, ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’, అదీ ఒకేసారి అనే విధానం సక్రమంగా అమలు కావాలంటే ముందు రాజ్యాంగంలో ఉన్న రాష్ట్రపతి  పాలన విధింపుకు అవకాశం ఇచ్చే  356వ అధికరణాన్ని రద్దు చేయాలి. దానికి ప్రత్యామ్నాయాన్ని గురించి ఆలోచించాలి. ఒకవేళ శాంతి భద్రతల కారణంగానో, లేదా రాజకీయాలకు అతీతమైన సహేతుక కారణంతోనో ఏదైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగించాల్సిన పరిస్థితి ఎదురైతే, ఏం చేయాలి అనేదానిపై దేశవ్యాప్త చర్చ జరగాలి.

రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలనకు అవకాశం వుంది కాని కేంద్రంలో ఇందుకు అవకాశం లేదు. ఏదైనా  కారణంతో ప్రభుత్వం పడిపోతే  మళ్ళీ ఎన్నికలకు పోవడం మినహా వేరు గత్యంతరం లేదు. ఈనాటి  కలగూరగంప రాజకీయాల్లో, సంకీర్ణ ప్రభుత్వాల శకంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడడానికి అవకాశాలు మరీ ఎక్కువ. వీటిని నిరోధించకుండా, వీటికి ఒక పరిష్కారం  కనుగొనకుండా ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ అనే విధానం ఆచరణలో  సఫలం కాదు. ఇందుకు ముందు కావాల్సింది ఎన్నికల సంస్కరణలు. పార్టీ ఫిరాయింపుల చట్టానికి మరిన్ని పటిష్టమైన సవరణలు చెయడం.  ఇవన్నీ జరిగిన తర్వాతనే ముందుకు పోవడం అవసరం.

అలాగే, ఈ విధానం  ఎప్పటి నుంచి అమలుచేయాలి అనేది కూడా దుస్తరమైన నిర్ణయమే. ఎందుకంటే ఉదాహరణకు 2023నుంచి అనుకుంటే,  ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికయిన కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ పదవీ కాలానికి చాలా ముందు గానే అధికారం నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. ఈ లెక్కలు ముందు సరిచేయాలి.

‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ నినాదం ఆకర్షణీయమైనదే. ఇది అమలు చేస్తే  ఎన్నికల వ్యయం తగ్గుతుంది. అభివృద్ధి అవాంతరాలు లేకుండా సాగుతుంది. అనేక దేశాల్లో ఈ పద్దతి జయప్రదంగా అమలు అవుతోంది. కానీ ఒకసారి  దారి తప్పిన ఈ విధానాన్నిమళ్ళీ దారిలోకి తేవాలంటే అనేక అడ్డంకులు ఉన్న వాస్తవాన్ని గమనంలో ఉంచుకోవాలి.

లేనిపక్షంలో గుర్రం ముందు బండి కట్టిన చందం అవుతుంది.   (27-11-2020)   

2 కామెంట్‌లు:

Zilebi చెప్పారు...



ఇది అమలు చేస్తే ఎన్నికల వ్యయం తగ్గుతుంది.

హన్నా! ఎంత డబ్బులు జనాలు పోగొట్టుకుంటారో!



జిలేబి

బాబు చెప్పారు...

జమిలి ఎన్నికలు లేనప్పుడు మొత్తం ఐదేళ్లలో ఎన్నికలకు అవుతున్న ఖర్చు 8000 కోట్లు

అయితే ఏడాదికి అన్ని రాష్ట్రాల , కేంద్ర బడ్జెట్ మొత్తం విలువ : 70,000 కోట్లు
ఆలేక్కన ఐదేళ్లకి అయ్యేది 3,50,000 కోట్లు
అంతటి బడ్జెట్లో ప్రజాస్వామ్యం నిలబడడానికి కేవలం 1 శాతం కంటే తక్కువ భరించలేరా ???

ఈ జమిలి ప్రస్తావన వెనుక ఎదో దురుద్దేశం ఉంది