24, జనవరి 2019, గురువారం

కేసీఆర్ గారి యాగం – భండారు శ్రీనివాసరావు

కేసీఆర్ గారు ఏం మాట్లాడినా విలక్షణంగా వుంటుంది. ఏం చేసినా సలక్షణంగా వుంటుంది.
ఈరోజు జ్వాలా పూనికతో మా దంపతులకు కూడా కేసీఆర్ తన ఫార్మ్ హౌస్ ఆవరణలో నిర్వహిస్తున్న గొప్ప యాగాన్ని చూసే మంచి అవకాశం లభించింది. యాగాలు, యజ్ఞాలు గురించి నాకు పరిజ్ఞానం తక్కువ. కానీ అక్కడ జరుగుతున్న విధానం చూసిన తర్వాత కేసీఆర్ క్రతువు నిర్వహణ పట్ల ఎంతటి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారో అర్ధం అయింది. యాగశాలలు చూస్తుంటే మరో లోకంలో వున్నట్టు అనిపించింది. అన్నింటికంటే ఈ యాగనిర్వహణలో ఆయన చూపుతున్న అంకిత భావం. గతంలో నేను గొప్పవాళ్ళు చాలామంది చాలా గొప్పగా నిర్వహించిన గొప్ప క్రతువులు చూసాను. అన్నిటిని ఒక గాటకట్టి అనలేను కానీ, కొన్నింటిలో యాగకర్తలు ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల కంటే ప్రాపంచిక విషయాలకు ప్రాధాన్యత ఇచ్చినట్టు తోచింది.
యాగనియమాలకు తగినట్టుగా ఈరోజు కేసీఆర్ దంపతులు అరుణవర్ణ శోభితమైన వస్త్ర ధారణతో, శ్రద్ధాసక్తులతో యాగశాలలో అనేక గంటల పాటు క్రతువును నిర్వహించిన తీరు చూసి ఆశ్చర్యం వేసింది. మంచి సౌకర్యవంతంగా ఏర్పాటు చేసిన ఆసనాలలో కాసేపయినా కుదురుగా కూర్చోలేని నా బలహీనతతో పోల్చుకుని చూసుకున్నప్పుడు ఆయన నిలకడగా నిబద్ధతతో కూర్చున్న తీరు చూసి సిగ్గు వేసింది.
ముందేచెప్పినట్టు క్రతువును గురించి విశ్లేషించి రాసే స్థోమత నాకు లేదు. కానీ ఏ యాగమైనా, యజ్ఞమైనా సామాజిక ప్రయోజనాలకోసం, నలుగురి శ్రేయస్సు కోసం చేస్తారని నేను చదువుకున్న పుస్తకాలలో వుంది. కాబట్టి ఆ విషయం జోలికి పొదలచుకోలేదు.
పొతే, ఒక ముఖ్యమంత్రి, ఒక ఆరుబయలు ప్రదేశంలో అనేక గంటల పాటు గడపాల్సిన సందర్భంలో సాధారణంగా కనిపించే సెక్యూరిటీ ఏర్పాట్లు చాలా కనీస స్థాయిలో వుండడం చూసి నేను ఆశ్చర్య పోయాను. ఎటువంటి మెటల్ డిటెక్టర్లు లేకుండా రిత్విక్కులు, సంబంధిత ఆచార్యులు స్వేచ్చగా అక్కడ మసలుతున్నారు. అనవసరమైన ఆర్భాటాలు, గొంతెత్తి గర్జించడాలు లేకుండానే పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది హాజరయిన అతిధులతో మర్యాదగా వ్యవహరించిన తీరు అక్కడి ఆధ్యాత్మిక వాతావరణానికి మరింత శోభను సమకూర్చింది. సెక్యూరిటీ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారి కూడా యాగ నియమాలకు తగిన వస్త్రధారణతో కానవచ్చారు. నేను లేచి వస్తుంటే నా జేబులోనుంచి కళ్ళజోడు జారిపడింది. వెనక నుంచి ఎవరో తీసి ఇచ్చారు. ఎరుపు రంగు ధోవతి, ఉత్తరీయంతో వున్న ఆ పెద్దమనిషికి ధన్యవాదాలు తెలిపాను. తీరా పరికించి చూస్తే ఆయన సీఎం పేషీలో చాలా ఉన్నత స్థానంలో పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి.



కామెంట్‌లు లేవు: