13, జనవరి 2019, ఆదివారం

‘సంకల్పం’ నెరవేరేనా! – భండారు శ్రీనివాసరావు


(PUBLISHED IN ‘SURYA’ TELUGU DAILY ON 13-01-2019)

వైఎస్ఆర్సీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన రెడ్డి   కడప జిల్లా ఇడుపులపాయలో ప్రారంభించిన సుదీర్ఘ ‘ప్రజా సంకల్పయాత్ర’ ఈనెల తొమ్మిదో తేదీన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగిసింది. ఇంతవరకు తెలుగు రాష్ట్రాలలోనే కాదు, యావత్ దేశంలో సాగిన రాజకీయ పాదయాత్రల్లో ఇదొక రికార్డు. గతంలో ‘ప్రజాప్రస్థానం’ పేరుతొ దివంగత రాజశేఖర రెడ్డి, ‘వస్తున్నా మీకోసం’ పేరుతొ టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాద యాత్రలు చేసారు. ఈ యాత్రల అనంతరం జరిగిన ఎన్నికల్లో విజయలక్ష్మి ఆయా పార్టీలని  వరించడంతో వారిరువురు ముఖ్యమంత్రులు కాగలిగారు. ఆ విధంగా పాదాయాత్రాఫలం వారికి సిద్ధించింది. దానితో ఎన్నికల్లో విజయానికి తోడ్పడే అనేక ప్రధాన అంశాలలో పాదయాత్రలు కూడా చేరిపోయాయి. అంతేకాదు, పాదయాత్ర చేసిన వారు ముఖ్యమంత్రి  అవుతారనే ఓ గుడ్డి నమ్మకం కూడా రాజకీయ వర్గాల్లో బలంగా నాటుకుంది. మరి కొద్ది మాసాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు వై. ఎస్. జగన్మోహన రెడ్డి చేసిన ఈ పాదయాత్రకు ఇంతటి ప్రాచుర్యం లభించడానికి ఇదొక కారణం.         
సాధారణంగా రాజకీయ నాయకులు పాదయాత్రలు ప్రారంభించాలి అంటే అందుకు కొన్ని కారణాలు వుండి తీరాలి. ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం అంటూ వాళ్లు పైకి యెంత బింకంగా చెప్పినా దాని వెనుక రాజకీయకోణం ఖచ్చితంగా దాగే వుంటుంది. అయితే, చేసేది రాజకీయమే అయినప్పుడు ఇక ఆ యాత్రల కోణాలను దుర్భిణి పెట్టి శోధించాల్సిన అవసరం ఏముంటుంది అనే ప్రశ్న వారివద్ద సిద్ధంగానే వుంటుంది.
2015 జులై నెలలో  కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అనంతపురం జిల్లాలో పాద యాత్ర చేసి తిరిగి చక్కాపోయారు. నడిచింది పది కిలోమీటర్లు మాత్రమే కానీ రాజకీయంగా చతికిల పడివున్న  తన పార్టీకి ఓ మేరకు జవసత్వాలను అందించిపోయారు. రాష్ట్ర విభజన అనంతరం నిజానికి కాంగ్రెస్ పార్టీకి  సీమాంధ్ర ప్రాంతంలో నూకలు చెల్లిపోయాయనే అంతా అనుకున్నారు. విభజన నిర్ణయంలో అన్ని పార్టీలకి ఎంతో కొంత పాత్ర వున్నప్పటికీ  సీమాంధ్ర ఓటర్లు మాత్రం ఒక్క కాంగ్రెస్ పార్టీనే లక్ష్యంగా పెట్టుకుని దాన్ని  ఘోరాతిఘోరంగా ఓడించారు. దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ అని పేరున్న కాంగ్రెస్ పార్టీకి స్వతంత్రం వచ్చిన దాదిగా ఇంతటి స్థాయిలో ఘోర పరాజయం ఎన్నడూ దాపురించలేదు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఇక ఆ పార్టీకి సీమాంధ్రలో పుట్టగతులు వుండవని ఆ పార్టీవారే బలంగా నమ్మే స్తితి ఏర్పడింది. మరి రాష్ట్ర విభజన జరిగి ఏడాది తిరగగానే ఆ విభజన పాపం మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ  అదే ప్రాంతంలో ఒకరోజు పాదయాత్ర చేసి వెళ్ళగలిగారంటే,  కాంగ్రెస్ పార్టీ పరిస్తితి ఏమైనా మెరుగు పడిందా అంటే అదీ లేదు. అంటే ఏమిటి? అలా తిరగగలిగిన పరిస్తితి అప్పటి ప్రత్యర్ధి అయిన కాంగ్రెస్ అధినేతకు కల్పించింది అక్కడి పాలక పక్షమే. అందుకే  పర్యటనలో భాగంగా రాహుల్ అప్పట్లో తమపై చేసిన విమర్శలకు  తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్వయంగా కల్పించుకుని వాటిని తిప్పి కొట్టాల్సిన పరిస్తితి ఏర్పడింది. సరే! ఇప్పుడా పరిస్తితి ఆ రెండు పార్టీలకి లేదు. ఆప్పుడు ప్రత్యర్దులయిన వారు మారిన రాజకీయ సమీకరణాల పుణ్యమా అని ఇప్పుడు చెట్టాపట్టాలేసుకొని తిరిగేంత సన్నిహితులయినారు. ఆ విషయం అలా ఉంచితే....
2012 లో అప్పట్లో ప్రతిపక్ష నాయకుడు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన  చంద్రబాబు నాయుడు కూడా సుదీర్ఘ పాదయాత్ర చేసి తనకున్న అనేక రాజకీయ రికార్డులకు మరోటి జోడించారు. ఇటీవలి సంగతే కనుక చాలామందికి ఇది గుర్తు వుండి వుండవచ్చు. కానీ ఆయన అంతకు ముందు నలభై సంవత్సరాలకు పూర్వం జరిపిన పాదయాత్ర గురించి తెలిసిన వారు తక్కువ. నిజానికి అప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అనే పేరున్న రాజకీయ నాయకుడు ఒకడున్నాడని తెలిసిన వారే తక్కువ.

అప్పట్లో స్థానికులకు సయితం అంతగా  పరిచయం లేని చంద్రబాబు నాయుడు కాణిపాకం నుంచి నడక ప్రారంభించారు. గడప గడప తొక్కారు. ఇళ్ళలోని పెద్దలకు చేతులు జోడించి నమస్కరించారు. యువకుల భుజం మీద చేతులేసి పలుకరించారు. ప్రతి వూరిలో ఆగి ఆ ఊరి సమస్యలను అడిగి అడిగి  తెలుసుకున్నారు.
రచ్చబండ్లమీద,  ఇళ్ళ అరుగుల మీద  సేద తీరారు. స్తానిక రాజకీయాల కారణంగా చాలా ఊళ్ళల్లో గ్రామపొలిమేరల వద్దే అడ్డంకులు ఎదురయినా  మడమ తిప్పలేదు. ఓ జత దుస్తులుకాలికి చెప్పులుతోడుగా కొందరు యువకులు. అంతే! ఇంతకు  మించి ఎలాటి హంగూ ఆర్భాటాలు లేకుండా  కాణిపాకం నుంచి మొదలుపెట్టి చంద్రగిరి నియోజకవర్గం అంతా కాలినడకన కలియ దిరిగారు. రాజకీయాల్లో తలపండిన ఉద్ధండులను ఢీకొని   ఎన్నికల్లో గెలిచారు. గెలిచి తొలిసారి శాసన సభలో అడుగుపెట్టారు.
ప్పటికింకా  నిండా  మూడుపదులు నిండని ఆ యువకుడే మళ్ళీ  2014లో  జరిగిన సార్వత్రిక ఎన్నికలకు పూర్వం  ఆరుపదులు పైబడిన  వయస్సులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పార్టీ పునర్వైభవం కోసం తిరిగి కాలినడకనే విజయానికి మార్గంగా  ఎంచుకున్నారు.. వస్తున్నా మీకోసం’ అంటూ సుదీర్ఘ పాదయాత్రకు పూనుకున్నారు. కాకపొతేఅప్పటికీ ఇప్పటికీ ఎన్నో తేడాలు కొట్టవచ్చినట్టు కానవస్తాయి. అప్పుడు జత దుస్తులుచెప్పులతోవేళ్ళమీద లెక్కపెట్టగలిగిన సంఖ్యలో  కార్యకర్తలను వెంటేసుకుని,  మందీమార్బలం, హంగూ ఆర్భాటం  లేకుండా తిరిగిన చంద్రబాబు, ప్రతిపక్ష నాయకుడి హోదాలో జరిపిన  పాదయాత్రలో అంతా కొత్తదనమే.   విదేశాలనుంచి దిగుమతి చేసుకున్న డ్యూమాక్స్ స్పోర్ట్స్ షూ ధరించికుడిఎడమల డాల్  కత్తులు మెరవగ అన్నట్టు పార్టీ  నాయకులుకార్యకర్తలు వెంట నడుస్తుండగా ,  ప్రత్యేకంగా రూపొందించి రికార్డు చేసిన పాదయాత్రా గీతాలు హోరెత్తిస్తుండగా పాదయాత్రకు నడుం కట్టారు. ఇప్పటి  పరిస్థితుల్లో ఇవన్నీ తప్పనిసరి ఆర్భాటాలు. నిజమే!
అంతకుముందు వై ఎస్ రాజశేఖర రెడ్డి జరిపిన పాదయాత్ర, దానితో సాధించిన విజయం  రాజకీయ నాయకులను  పాదయాత్రలకు పురికొల్పేలా చేసాయి. అంతకు ముందు రెండు మార్లు ప్రయత్నించి అందుకోలేని ఎన్నికల విజయాన్ని ఆ యాత్ర దరిమిలా ఆయన తన ఖాతాలో వేసుకోవడంతో పాదయాత్రలకు కొంత సెంటిమెంటు రంగు కూడా అంటుకుంది.
ఇక జగన్ మోహన రెడ్డి సాగించిన పాద యాత్ర ఏవిధంగా చూసినా ఒక రికార్డే. సుమారు రెండుకోట్ల మంది ప్రజలను ఆయన ముఖాముఖి కలుసుకోగలిగారు అంటే ఒక రాజకీయ నాయకుడిగా ఆయన సాధించినది చిన్న విషయం ఏమీకాదు. నడిచిన దూరం, వెంట నడిచిన జనం, మాట్లాడిన సమావేశాలు, ప్రసంగించిన బహిరంగ సభలు, హాజరయిన ప్రజలు ఇలా చెప్పుకుంటూ పొతే అన్నీ రికార్డులే. ఈ యాత్ర సందర్భంగా వై.ఎస్. జగన్ కురిపించిన వాగ్దానాలు, హామీల సంఖ్య కూడా ఒక రికార్డే అని చెప్పుకోవాలి.
ఇక్కడ మరో విషయం ప్రస్తావించడం అప్రస్తుతం కాదనుకుంటాను. ప్రజాసంకల్పయాత్ర ప్రారంభానికి ముందు, జగన్ మోహన రెడ్డి పిలిపించుకుని మాట్లాడిన కొద్దిమంది జర్నలిస్టుల్లో నేను కూడా వున్నాను. జనాలకు ఇచ్చే  హామీలను ప్రణాళికాబద్ధంగా అమలు చేసే విషయంలో ఫాలో అప్ మెషినరీ వంటి వ్యవస్థను పార్టీ పరంగా ముందుగానే ఏర్పాటు చేసుకోవడం మంచిదని సూచించాను. 
2003 లో రాజశేఖరరెడ్డి జరిపిన ప్రజా ప్రస్తానం’ పాదయాత్ర  రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో మొదలై 1500 కిలోమీటర్లు సాగి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగిసింది.  చంద్రబాబు  ‘వస్తున్నా ..మీకోసం’ పాదయాత్ర అనంతపురం జిల్లా హిందూపూర్  నుంచి మొదలైపదమూడు జిల్లాలమీదుగా 2340  కిలోమీటర్లు సాగి విశాఖ పట్నంలో ముగిసింది. పాదయాత్రకు గుర్తుగా అనంత పురం జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు ఒకరు చంద్రబాబుకు వెండి పాదరక్షల జతను బహుకరించారు. 
వై.ఎస్. జగన్ మోహన రెడ్డి తన ప్రజాసంకల్ప యాత్రను  2017నవంబరు ఆరో తేదీన  వై.ఎస్.ఆర్. కడప జిల్లాలోని స్వగ్రామం ఇడుపులపాయలో మొదలుపెట్టి, 13 జిల్లాలగుండా   341 రోజులపాటు 3648  కిలోమీటర్లు నడిచి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో ముగించారు.
ఈ పాదయాత్రల  వల్ల రాజకీయ పార్టీలకు  వొనగూడే తక్షణ రాజకీయ లాభాలు ఏమీ వుండకపోవచ్చనే అభిప్రాయం కూడా వుంది. అయితేరాజకీయాల్లో నాలుగు కాలాలు మనగలగాలంటే  ప్రజలతో మమేకం కావడం ఒక్కటే సరయిన దారి. తమ నడుమ  వుండేవారికే జనం ఈ నడుమ పట్టం కడుతున్నారు. ఏసీ  గదుల్లో వుంటూ అప్పుడప్పుడూ చుట్టపు చూపుగా పలకరించి వెళ్ళేవారిని ఎడం పెడుతున్నారు.
ప్రజల ఇబ్బందులనుకడగండ్లను కళ్ళారా చూడగలిగే అవకాశం ఈ పాదయాత్రల  వల్ల రాజకీయ నాయకులకు లభిస్తుంది. భవిష్యత్తులో అధికారం దక్కినప్పుడు వాటిల్లో కొన్నింటిని అయినా పరిష్కరించ గలిగితే ప్రజలకు కూడా వారి  యాత్రా ఫలసిద్ధి  ప్రాప్తిస్తుంది.
ఇది జరిగింది కూడా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రజాప్రస్థానంలో తనకు ఎదురయిన అనుభవాల ఫలితంగా రూపొందించిన  ‘ఆరోగ్య శ్రీ, 108, బడుగువర్గాల విద్యార్ధులకు ఫీజు తిరిగి ఇచ్చే పధకం’ వంటివి రాష్ట్ర ప్రజానీకానికి దక్కాయి. చంద్రబాబు’ వస్తున్నా.. మీకోసం..’ యాత్ర వల్ల రైతులకు రుణ మాఫీ జరిగింది.
ఏదయితేనేం, ఏ పేరుతొ అయితేనేం నాయకులు ఏసీ గదులు ఒదిలి కొద్ది కాలం అయినా ప్రజలతో మమేకం అయ్యే వీలు ఈ యాత్రల వల్ల ఏర్పడింది. రోగి కోరిందీ, వైద్యుడు ఇచ్చిందీ ఒకటే అని జనాలు సంతోషించాలి.
ముందే చెప్పినట్టు ఈ రాజకీయ పాదయాత్రలు భవిష్యత్తులో కూడా ఇబ్బడిముబ్బడిగా సాగే అవకాశం వుంది.  
జగన్ మోహన రెడ్డి పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఆకాశాన్ని దాటిపోయాయని, రాష్ట్రానికి వచ్చే ఆదాయంతో వాటిని అమలుచేయడం మానవ మాత్రుడికి కూడా  సాధ్యం కాదని తెలుగు దేశం పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. వీటిని తిప్పి కొడుతూ తన ‘వస్తున్నా మీకోసం..’ పాదయాత్ర సమయంలో’ చంద్రబాబు చేస్తూ పోయిన వాగ్దానాలు గురించి ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బాబు రాజకీయ ప్రత్యర్ధులు ఉదహరిస్తున్నారు. ‘వాకింగ్ ఫ్రెండ్’ (చంద్రబాబు) ఇస్తూపోతున్న హామీలను అమలు చేయాలంటే, రాష్ట్ర బడ్జెట్ అటుంచి  మొత్తం కేంద్ర బడ్జెట్ కూడా సరిపోదని కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించిన  విషయాన్ని వాళ్ళు గుర్తు చేస్తున్నారు.
రాజకీయ విమర్శలను కొంత అర్ధం చేసుకోవచ్చు. కొందరు వ్యక్తిగతంగానే కాకుండా చాలా చౌకబారుగా కూడా  వ్యాఖ్యలు చేస్తున్న తీరు బాధాకరం. చంద్రబాబు పాదయాత్ర సమయంలో ఆయన ధరించిన బూట్లు గురించి, దారిపొడుగునా దుమ్ము రేగకుండా నీళ్ళు చల్లించే ఏర్పాట్ల గురించీ ఎద్దేవా చేస్తూ ఆయన ప్రత్యర్ధులు చేసిన వ్యాఖ్యలు బహుశా వారికి గుర్తుండి ఉండకపోవచ్చు.
రాజకీయ యాత్రలు, రాజకీయ ప్రసంగాలు, రాజకీయపరమైన  హామీలు పార్టీలన్నింటికీ తప్పనిసరి రాజకీయ విన్యాసాలుగా మారిపోతున్న ఈ రోజుల్లో, రాజకీయ నాయకులు ఒకింత సంయమనంగా మాట్లాడడం వారికే మంచిది. ఏమో ఎవరికెరుక? ఇలాంటి కువిమర్శలను తామే ఎదుర్కోవాల్సిన దుస్తితి భవిష్యత్తులో తమకే ఎదురు కావచ్చు.
దీనికి ఓ మంచి మార్గాన్ని కవి బ్రహ్మ తిక్కన మనకేనాడో బోధించాడు.
ధర్మాలలోకెల్లా ఉత్తమోత్తమమైన ధర్మంగా మహాభారతంలో విదుర నీతి పేరుతో ఆ మహాకవి చెప్పినదాన్ని పాటిస్తే చాలు. అదేంటంటారా! తిక్కన ఓ చక్కని పద్యంలో చెప్పాడీ మాట. ‘‘ఒరులేయవి యొనరించిన, నరవర అప్రియంబు తన మనంబునకగు, తానొరులకు నవి సేయకునికి పరాయణము పరమ ధర్మపథముల కెల్లన్’’.
ఇతరులు ఏం చేస్తే మనకు ఇష్టం ఉండదో, దాన్ని మనం ఇతరులపట్ల  చేయకుండా ఉండటమే ఉత్తమోత్తమ ధర్మం అన్నది ఈ పద్య తాత్పర్యం.
ఇతరులకు నీతులు చెప్పే రాజకీయ నాయకులకు ఈ నీతి పాఠాలు తలకెక్కుతాయా!
అనుమానమే!

7 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ఒక వ్యాసంలో జగన్ కు మరొక వ్యాసంలో బాబుకు అనుకూలంగా లౌక్యంగా వ్రాయడం. కర్ర విరగదు పాము చావదు అన్నట్టుగా సుద్దులు చెప్పడం ఎతావాతా ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రతికూలత లేకుండా చూసుకోవడం. ఏమి లౌక్యం సార్ మీది.

నీహారిక చెప్పారు...

@ అజ్ఞాత,
సాక్షి, నమస్తే తెలంగాణా పత్రికలు చూసి ఎవరో ఒకరివైపు మాట్లాడాలని మీరు కోరుకుంటున్నారేమో అసలు జర్నలిష్టు అంటే ఇలాగే వ్రాయాలి. ఉన్నది ఉన్నట్లు చెప్పడం నిర్ణయాధికారాన్ని పాఠకులకి వదిలివేయడం మంచి విలేఖరులు చేయవలసిన పని. ఎవరో ఒకరివైపు నిలబడితే అది జర్నలిజం అవదు ఫాక్షనిజం అవుతుంది.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@అజ్ఞాత : మీ వ్యాఖ్యలో నాకు మీ మిడిమిడి జ్ఞానం, మీలో నిండి నిబిడీకృతం అయివున్న అజ్ఞానం ఇంతకు మించి నాకేమీ కనబడడం లేదు. బాబు అధికారంలో ఉన్నప్పుడే దగ్గరగా మసల కలిగిన అవకాశం పుష్కలంగా ఉన్నప్పుడే ఏమీ చేసుకోలేదు. మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తున్నందుకు (మీరు మళ్ళీ మళ్ళీ చదవాల్సి వస్తున్నందుకు కాదు సుమా) ఇంతవరకు నాకు సొంత ఇల్లంటూ లేదు. ఎవరి ప్రాపకమో సంపాదించి (మీకు అనుభవమేమో నాకు తెలియదు) ఏదైనా సంపాదించినా దాన్ని అనుభవించే వయసు లేదు. దాటిపోయాను. ఇంకెందుకు నాకు తాపత్రయం. నా తాపత్రయం గురించి మీకెందుకు తాపత్రయం. నాకు ఇలా పరుషంగా రాయడం రాదు. నేర్పుతున్నది మీలాంటి వాళ్ళే.

అజ్ఞాత చెప్పారు...

>>నాకు ఇలా పరుషంగా రాయడం రాదు. నేర్పుతున్నది మీలాంటి వాళ్ళే.>>>
ఎందుకు సార్ ఆలీసెం ఉతకండి సార్

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@అజ్ఞాత: ఉతికి ఆరేయాలా! మీది తోలు మందం వ్యవహారంలా వుందే! ఉతికి ఝాడించి ఆరేయడం కూడా అయిపొయింది. ఓసారి గిచ్చి చూసుకోండి. అజ్ఞాత ముసుగు కదా! కాస్త తొలగించి చూసుకోండి. అప్పటికీ నేను రాసింది అర్ధం కాకపోతే మంచి డాక్టరుకు చూపించుకోండి.

Jai Gottimukkala చెప్పారు...

"రాజకీయాల్లో తలపండిన ఉద్ధండులను ఢీకొని ఎన్నికల్లో గెలిచారు. గెలిచి తొలిసారి శాసన సభలో అడుగుపెట్టారు"

అంత సీను లేదండీ. ఇందిరా గాంధీ ప్రభంజనంలో గెలిచిన ఎంతో మందిలో ఆయన కూడా ఒకరు. పైగా గెలిచింది ఉద్దడఁడుల మీదా కావు, పెద్ద మెజారిటీ కూడా రాలేదు.

Constituency : 148 . CHANDRAGIRI
1 . CHANDRABABU NAIDU NARA M INC(I) 35092 44.23%
2 . KONGARA PATTABHI RAMA CHOWDARY M JNP 32598 41.09%

అదే ఎన్నికలో రాజకీయరంగప్రవేశం చేసిన వైఎస్ ఇందుకు పూర్తి భిన్నం. ఆయన పోటీ చేసిన రెడ్డి కాంగ్రెస్ దాదాపు తుడుచుకుపెట్టుకుపోయినా తాను మాత్రం అఖండ విజయం సాధించారు.

Constituency : 160 . PULIVENDLA
1 . Y.S. RAJASEKHAR REDDY M INC 47874 59.51%
2 . D.NARAYANA REDDY M JNP 27378 34.03%

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@jai Gottimukkala : పాదయాత్ర అంశంగా తీసుకుని రాసిన దానిలో దొర్లిన ప్రశంస. అంతే! వేరే ఉద్దేశ్యం లేదు