15, జనవరి 2019, మంగళవారం

నందమూరి తారకరామారావు గారు, ఓ జ్ఞాపకం


ఈ వృత్తాంతం ఎందుకు గుర్తుకు వచ్చిందో చివర్లో చెబుతాను. బహుశా చెప్పాల్సిన పని కూడా వుండదు అనుకుంటాను.
ఉమ్మడి రాష్ట్రంలో ప్రజాస్వామ్య ఉద్యమం సాగుతున్నరోజులు. ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావును అధికారం నుంచి అక్రమంగా తొలగించారని, ఆయన్ని వెంటనే తిరిగి ముఖ్యమంత్రిని చేయాలని కోరుతూ ఆ ఉద్యమం మొదలయింది.
ఎన్టీఆర్ ని సమర్ధిస్తున్న టీడీపీ సభ్యులతోపాటు మిత్ర పక్షాలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా హైదరాబాదు, ముషీరాబాద్ లోని రామకృష్ణా స్టుడియోలో బస చేస్తున్నారు. అందులోకి పోవాలన్నా, బయటకి రావాలన్నా బోలెడన్ని ఆంక్షలు ఉండేవి. అయితే విలేకరులు మాత్రం తమ గుర్తింపు కార్డులు చూపించి వెళ్ళే వెసులుబాటు వుండేది. ఇక రేడియో విలేకరిగా నేను దాదాపు ప్రతిరోజూ వెళ్లి వస్తుండేవాడిని.
ఒకరోజు నాతోపాటు మిత్రుడు జ్వాలా నరసింహారావు, మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారు కూడా వచ్చారు.
లోపలకు వెళ్ళాము. స్టూడియో అంతా సందడిగా వుంది. ఎమ్మెల్యేలు పేపర్లు చదువుతూ, పచార్లు చేస్తూ అటూ ఇటూ తిరుగుతున్నారు. చంద్రబాబునాయుడు కూడా హడావిడిగా తిరుగుతూ పైనుంచి అన్నీ కనుక్కుంటూ వున్నారు. ఆయన్ని పలకరించి, ఖమ్మం సీపీఎం  ఎమ్మెల్యే మంచికంటి రాంకిషన్ రావు గారి వద్దకు వెళ్ళాము. మాకు బంధువు కూడా.  ఆయన కాస్త దిగులుగా కనిపించారు. భార్యకు ఒంట్లో నలతగా వున్నట్టు ఇంటి నుంచి కబురు వచ్చినట్టు వుంది.
ఆయన మాతో చెప్పారు.
“రామారావు గారితో విషయం చెప్పి ఓ రెండు రోజులు ఖమ్మం వెళ్లి వద్దామని వారి దగ్గరకు వెళ్లాను. మా ఆవిడ సుస్తీ సంగతి చెప్పాను. ఆయన ఇలా అన్నారు. ‘రాం కిషన్ రావు గారు,  మీరు పెద్దవారు. మీకు చెప్పదగిన వాడిని కాను. కానీ నా విషయం తీసుకోండి. మా ఆవిడ (శ్రీమతి బసవ తారకం) మద్రాసు కేన్సర్ ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య వుంది. అయినా నేను వెళ్ళలేని పరిస్తితి. పెద్ద మనసుతో కాస్త  అర్ధం చేసుకోండి’ అని ఆ పెద్దమనిషి అంటుంటే ఇక నేనేమి మాట్లాడను?”
నిన్న మా ఆవిడా నేనూ NTR కధానాయకుడు సినిమా చూశాము.

3 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ఇంతకీ బుల్ బుల్ బాలయ్య బయోగ్యాస్ ఎలాఉందో చెప్పారు కారు.

అజ్ఞాత చెప్పారు...

పై అజ్ఞాత, ఏడుపుముక్కల లాగా మాట్లాడకు

Jai Gottimukkala చెప్పారు...

నాకు తెలిసిన మేరకు 1984 ఆగస్టు సంక్షోభం సమయాన ఎన్టీఆర్ వర్గీయులు గోల్కొండ చౌరస్తా రామకృష్ణ స్థూడియోలో బస చేసింది కొద్ది రోజులు మాత్రమే. ఆ తరువాత వీరిని వెంకయ్య నాయుడి సౌజన్యంతో కర్ణాటక మంత్రి రఘుపతి ఏర్పాటు చేసిన బెంగుళూరు నంది హిల్స్ రిసార్టుకు తరలించారు, అక్కడే ఎక్కువ రోజులు తల దాచుకున్నారు.

ఈ ఘటన గురించి కింది విశేషాలు చెప్పుకోవాలి:

1. దేశంలో రిసార్ట్ రాజకీయాలకు నాంది పలికింది దీనితోనే.
2. టీడీపీ-బీజేపీ మైత్రి (అందునా ముఖ్యంగా ఇద్దరు నాయుళ్ళ సఖ్యత) ఆ రోజుతో తెర ముందుకు వచ్చింది, కొన్ని ఒడిదొడుకులు ఉన్నా ఇప్పటికీ ఆ స్నేహబంధం గట్టిగానే ఉంది.
3. ఆనాడు రఘుపతితో మొదలయిన కర్ణాటక కనెక్షన్ నేటి డీకే శివకుమార్ వరకు కొనసాగుతూనే ఉంది.