31, మే 2017, బుధవారం
నిమిషం ఓపికలేని జీవితాలు
మండుటెండలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర
కారు ఓ బస్ స్టాప్ పక్కన ఆగింది. మూడు
నాలుగు నిమిషాలన్నా వేచి ఉండక తప్పదు. కారు ఏసీ అయినా ఎండ పీడ తగ్గించుకోవడానికి సీట్లోనే
పక్కకి జరిగి కూర్చుంటుంటే ఆ దృశ్యం కళ్ళబడింది. ద్విచక్ర వాహనం మీద మొగుడూ పెళ్ళాం,
ఇద్దరు చిన్న పిల్లలు, ఎడ పిల్ల మరీ చంటిది. తల్లి బండి దిగి పిల్లల్ని కాసేపయినా
నీడను నిలుపుదామని బస్ స్టాప్ షెల్టర్ కిందకు వెళ్ళింది. ఎండ దెబ్బకు తట్టుకోలేక చంటిది
గుక్కపట్టి ఏడుస్తోంది. ఆ పిల్ల నెత్తికి ఓ గుడ్డచుట్టి తెచ్చుకున్న సీసాలో నీళ్ళు
ఆ పసిదాని మాడు మీద చల్లుతోంది. పెద్ద పిల్ల దప్పిక ఆపుకోలేక అమ్మ చేతిలో సీసా
లాక్కుని ఆబగా తాగుతోంది.
ఈ లోగా పచ్చ లైటు వెలిగింది. తండ్రి
సైగ చేయడంతో తల్లి గాభరాగా పిల్లలతో వచ్చి ఆ బండి ఎక్కలేక అవస్థ పడుతోంది. వెనక
నుంచి అదేపనిగా హారన్లు. దాంతో అవిడ గాభరా మరింత పెరిగింది.
మరి యెంత అవసరం వుండి ఇంత ఎండ పూటన
ప్రయాణం పెట్టుకున్నారో తెలవదు. ఆ బాధ కంటే, వెనుకవాళ్ళ అసహనం మరింత బాధ
పెట్టింది. నిమిషం తాళలేని ఓపికలేని జీవితాలాయె!
లేబుళ్లు:
నిమిషం ఓపికలేని జీవితాలు
26, మే 2017, శుక్రవారం
మోడీ మూడేళ్ళ పాలన
(PUBLISHED IN ANDHRAPRABHA TELUGU DAILY ON 27-05-17, SATURDAY)
“మోడీ లాంటి మొగాడు దేశానికి అవసరం”
ఈ మాట చెప్పింది మోడీ అభిమానీ కాదు, బీజేపీ కార్యకర్తా కాదు.
మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా
వున్నరోజుల్లో, ప్రత్యేకించి గోద్రా మారణ హోమం
నేపధ్యంలో ఆయనను పూర్తిగా ఖండిస్తూ పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు రాసిన
వ్యక్తి. పేరు సుహేల్ సేథ్.
గుజరాత్ లో గోద్రా మారణహోమం అనంతరం
నరేంద్ర మోడీ అభినవ హిట్లర్ అంటూ పలు విమర్శలు చేసిన చరిత్ర ఈయనకు వుంది. ఆ సంఘటన
మోడీ జీవితంలో మాయని మచ్చ అన్నారు. అంతే కాదు, ఆ కారణంగా భారత రాజకీయ వ్యవస్థ
భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
అయితే, నరేంద్రమోడీ ప్రధాన మంత్రి
కాగానే సుహేల్ సేథ్ మహాశయులు తన బాణీ తానే మార్చుకుని ‘ఈ దేశం అవసరం మోడీకి లేదు, మోడీ వంటి మొనగాడి అవసరం దేశానికే
వుందంటూ గొప్ప కితాబు ఇచ్చారు.
“ఆయనలో కొన్ని లోపాలు వున్నాయి, కాదనను. కానీ మోడీ వంటి మరో నేత
ఈరోజు దేశంలో మరొకరు లేరు. ఇది వాస్తవం. అయన ఇప్పుడు పూర్తిగా మారిన మనిషి.
ఇది మరో వాస్తవం’ అంటారు
సుహేల్ సేథ్.
ఈయన మాటల్ని విశ్వసించాల్సిన అవసరం
వుందనుకోను. ఆయనే స్వయంగా చెప్పుకున్నట్టు ఆయన ఒక ప్రచారకర్త. తనను తాను
పెంచుకునే వ్యూహంలో భాగంగా మోడీ, సోషల్ మీడియాలో సేథ్ వంటి వ్యక్తులను
ఉపయోగించుకుంటూ వుంటారని మోడీ రాజకీయ ప్రత్యర్ధులు ఆరోపిస్తూ వుంటారు.
కేవలం ప్రచార ఆర్భాటంతో మోడీ తనకులేని ప్రతిభను అలా చాటుకుంటూ వుంటారని వారి
ఉద్దేశ్యం.
కానీ ఇది పూర్తిగా నిజం కాదు. గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆ
రాష్ట్రం రూపురేఖల్ని ఆయన ఎలా మార్చగలిగిందీ ఒకసారి గుర్తు చేసుకుంటే ఆయనలో
దాగున్న సమర్ధ రామదాసు మనకు కనబడతాడు.
సరే! సేథ్ ఒక ప్రచార కర్త. ఆయన సంగతి
అలా ఉంచుదాం.
గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు మోడీ
పనితీరు గురించి ఒక మిత్రుడు పంపిన సమాచారం ఇది.
“మోడీ గుజరాత్ సీతయ్య. కాకపొతే కొంత తేడా వుంది. మన
తెలుగు సీతయ్య ఎవడి మాటా వినడు. ఈ గుజరాత్ సీతయ్య అందరి మాటా వింటాడు కానీ చివరకు
తాను అనుకున్నదే చేస్తాడు. ”
మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు
ఆయన్ని గురించి వినవచ్చే కధలన్నీ ఇలాగే వుండేవి. మోడీ లాంటి నాయకులు అయిదుగురు
వుంటే చాలు, యావత్ ప్రపంచంలో భారత దేశం అగ్రగామి
కావడానికి ఎంతో కాలం పట్టదు’ అంటూ గుజరాత్ ని సందర్శించిన వాళ్ళు చెప్పేవాళ్ళు.
ఇదిగో, సరిగ్గా ఇలాంటి ప్రచారమే గత
సార్వత్రిక ఎన్నికల్లో మోడీని దేశ ప్రజల దృష్టిలో మొనగాడిని చేసింది. మోడీ అనే
రెండక్షరాలు ఆసేతు హిమాచలం మారుమోగి పోయాయి. మూడేళ్ళ నాడు జరిగిన సార్వత్రిక
ఎన్నికల్లో అద్భుతమైన విజయం ఆయన ఒళ్లో పడింది. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యారు.
చూస్తుండగానే మూడేళ్ళు గడిచిపోయాయి.
ఇంకా మిగిలింది రెండేళ్ళు. చివరి ఏడాది ఎటూ ఎన్నికల సంవత్సరమే. మిగిలింది ఒక్క
ఏడాదే. రెండో ఏడు కేవలం లెక్కకే. ఏమి చేయాలన్నా, చేసింది చూపించి జనాలను
ఒప్పించాలన్నా , మెప్పించాలన్నా ప్రధాన మంత్రి
నరేంద్ర మోడీకి ఈ ఒక్క ఏడాదే మిగిలివున్న వ్యవధి. సరయిన సమయం కూడా.
అందరికీ గుర్తుండే వుండాలి. ఏడాది పాలన
పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ ప్రజలకు మోడీ ఒక బహిరంగ లేఖ రాసారు.
“సేవా పరమో ధర్మః” అనే సూక్తితో మోడీ ఆ లేఖను మొదలు
పెట్టారు. ప్రజలకు సేవ చేయడంలో వున్న తృప్తినీ, ఆనందాన్ని తను ఏడాది కాలంగా
అనుక్షణం ఆస్వాదిస్తూ వచ్చానని ఆయన అందులో పేర్కొన్నారు.
“అంతులేని అవినీతి
రాజ్యమేలుతున్నప్పుడు, నిర్ణయాలు తీసుకోలేని అసమర్ధ పాలనతో జాతి
నవనాడులు కుంగిపోయి వున్న నేపధ్యంలో మీరు నాపట్ల ఎంతో నమ్మకంతో నాకు పగ్గాలు
అప్పగించారు. మీ ఆశలను నిజం చేయడానికే గత ఏడాదిగా నేను అహరహమూ కష్టపడుతూ వచ్చాను’ అన్నారాయన ఆ లేఖలో ఆనాడు.
పేదల అభ్యున్నతికోసం ‘అంత్యోదయ’, పరిశుభ్రత, పారిశుధ్యం కోసం స్వచ్చ భారత్
మొదలయిన ప్రభుత్వ పధకాల జాబితాను ఏకరువు పెట్టారు.
ఈ మాటలు చెప్పిన తరువాత మరో ఏడాది కాలగర్భంలో కలిసింది.చూస్తుండగానే
మూడేళ్ళు గతంలో కలిసి పోయాయి. ప్రజల
ఆకాంక్షలను నెరవేర్చడానికి మోడీ అహరహమూ పడుతున్న కష్టం ఏమన్నా ఫలితాలు ఇచ్చిందా
అంటే చప్పున జవాబు చెప్పడం కష్టం.
లోకం చుట్టిన వీరుడు అని పేరు
తెచ్చుకుంటున్న మోడీ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. ప్రధానమంత్రి హోదా వున్నప్పుడు, విదేశీ ప్రభుత్వాల ఆహ్వానాలు, దేశ విదేశాల్లో పర్యటనలు, ఎర్ర తివాచీ స్వాగతాలు, మీడియాలో ప్రచారాలు ఇవన్నీ
సహజాతిసహజం. వాటివల్ల సొంతగడ్డకు యెంత మేలు జరిగిందన్నదే ప్రధానం.
మూడేళ్ళుగా ఎలాంటి మచ్చా లేకుండా స్వచ్చమైన
పాలన అందించామని ఎన్డీయే నాయకులు చెబుతున్న దాంట్లో వాస్తవం వుంది. అయితే యూపీఏ
మొదటి విడత మన్మోహన్ సింగ్ పాలన కూడా ఇలాగే స్వచ్చంగా సాగిందన్న నిజాన్ని కూడా
గుర్తు పెట్టుకోవాలి. పతనం మొదలు కాకూడదు. మొదలయితే ఆ వేగం వడీ యెంత ఉధృతంగా
ఉంటాయనేది యూపీయే రెండో విడత పాలన మనకు విడమరచి చెబుతోంది.
గత ప్రభుత్వాల వైఫల్యాల పాత జాబితాలను పదేపదే వల్లె వేస్తూ
పొతే, ప్రజలు కొంతకాలంపాటే అరాయించుకుంటారు. కాలం
గడుస్తున్న కొద్దీ, తరువాత కూడా పాత పల్లవే అందుకుంటూ వుంటే, ప్రజలు విసిగిపోయి, మరొకర్ని పల్లకీ ఎక్కించే ఆలోచన మొదలు
పెడతారు.
రాజకీయాల్లో వున్నవాళ్ళు రాజకీయం చేయక
తప్పదు. కానీ ప్రజలు, పరిపాలన కూడా పాలకులకు అంతే ప్రధానం. ఈ
సత్యం ఎరుకలో వుంచుకుంటే పాలకులకూ మంచిది, ప్రజలకూ మంచిది.
25, మే 2017, గురువారం
ఇక్కడిలా! అక్కడలా!!
మిట్ట మధ్యాన్నం, ఎర్రటి ఎండలో కారు
ఆగిపోయింది. ఆగిపోలేదు, డ్రైవర్ ఆపాడు. ముందు రెండు కార్లు ఆగివున్నాయి. ఒక కార్లో
నుంచి దిగిన యువకుడు, రెండో కార్లో డ్రైవర్ సీట్లో కూర్చున్న వ్యక్తిని బయటకు లాగే
ప్రయత్నం చేస్తున్నాడు. అసలే ఆ జంక్షన్లో ట్రాఫిక్ ఎక్కువ. నాలుగు వైపుల నుంచి
ఎవరి దారి వారిదే అన్నట్టు వెడుతుంటారు.
ముందు వెడుతున్న కారు వెనుక భాగానికి దెబ్బ తగిలింది. వాడు
ఊరుకుంటాడా! వెనక కారు వాడితో పేచీ పెట్టుకుంటాడు. అదే అక్కడి సీను. రెండూ ఏసీ
కార్లే. కానీ వాళ్ళ ఖర్మ. ఎర్రటి ఎండలో తగాదా పడుతున్నారు. అది ఎప్పటికి తేలేనో!
ఇది చూసిన తరువాత అనేక ఏళ్ళ క్రితం
అమెరికాలో జరిగిన ఒక సంఘటన జ్ఞాపకం వచ్చింది. మా పిల్లలతో కలిసి ఎటో టూరు వెళ్లి
తిరిగి వస్తున్నాము. దారిలో మెక్డొనాల్డ్ వద్ద కారు పార్కు చేసి వెళ్ళాము. తిరిగి
వచ్చేసరికి, మరో కారువాడు రివర్స్ తీసుకుంటూ మావాడి కారుని కొట్టాడు. దెబ్బ బాగానే
తగిలింది. చిత్రం! దెబ్బ కొట్టిన పెద్దమనిషి కారు దిగి సెల్ ఫోన్ లో దెబ్బతిన్న
భాగాన్ని, కారు నెంబరు ప్లేటు ఫోటో తీసుకున్నాడు. అలాగే మా వాడూ. ఇద్దరూ వారి వారి
భీమా కంపెనీలకి ఫోటోలు, మెసేజ్ ద్వారా
విషయం ఎరుక పరిచారు. అంతే! వాళ్ళ దారిన వాళ్ళు, మా దారిన మేము.
వారం తిరక్కముందే కారు దెబ్బ
తిన్నందుకు పరిహారం చెక్కు రూపంలో మా వాడి బ్యాంకుకు పంపినట్టు భీమా కంపెనీ నుంచి వర్తమానం వచ్చింది.
లేబుళ్లు:
ఇది ఇండియా.. అది అమెరికా.
20, మే 2017, శనివారం
ఈవీఎం లు, విలేకరిగా ఓ జ్ఞాపకం
1983 అసెంబ్లీ ఎన్నికలకు ఒక ప్రత్యేకత
వుంది. అదేమిటంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్
మిషన్లను మొదటిసారి ప్రయోగాత్మకంగా షాద్ నగర్ నియోజకవర్గంలో ఉపయోగించారు.
ఇంకోటేమిటంటే తొలిసారి ఎన్టీఆర్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఆ ఎన్నికల్లో పోటీ
చేసింది.
షాద్
నగర్ లో ఈవీఎం కౌంటింగ్ కావడం వల్ల గంటల్లోనే ఫలితం వెలువడింది. కాంగ్రెస్
అభ్యర్ధి డాక్టర్ పి. శంకరరావు సమీప ప్రత్యర్ధి, టీడీపీ అభ్యర్ధి పుట్టపాగ
రాధాకృష్ణపై విజయం సాధించారు. రిటర్నింగ్ ఆఫీసరు అధికారికంగా ప్రకటించిన ఆ సమాచారాన్ని మొదట హైదరాబాదులోని ప్రాంతీయ వార్తా విభాగానికి, తరువాత ఢిల్లీ
ఆలిండియా రేడియో కేంద్రానికీ అందించాను. మధ్యాన్నం ప్రాంతీయ వార్తలతో పాటు
గంటగంటకూ వెలువడే ఎన్నికల ప్రత్యేక బులెటిన్లలో కూడా ఆ వార్తను ప్రసారం చేసారు.
అలాగే సాయంత్రం ఢిల్లీ నుంచి ప్రసారం అయ్యే ఇంగ్లీష్, తెలుగు వార్తల్లో కూడా
శంకరరావు గెలిచిన వార్త ప్రసారం అయింది. మిగిలిన చోట్ల సాధారణ పద్దతిలో బ్యాలెట్
పత్రాలను లెక్కించడం వల్ల తెలుగు దేశం అభ్యర్ధుల ఆధిక్యతలకు సంబంధించిన సమాచారం
మినహా ఫలితాలకు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటనలు రాలేదు. ఆ రోజుల్లో రేడియోలో
ఆధిక్యతలు ప్రకటించే సాంప్రదాయం లేదు. అనధికారికంగా టీడీపీ విజయపధంలో
దూసుకుపోతున్నట్టు సమాచారం వస్తున్నా ఆ వివరాలను ప్రసారం చేయలేని పరిస్తితి.
ఇప్పటిలా వేరే వార్తా మాధ్యమాలు లేకపోవడం వల్ల అందరూ రేడియో వార్తల మీదనే
ఆధారపడాల్సిన రోజులవి. షాద్ నగర్ లో ఈవీఎం లు వాడి కాంగ్రెస్ ఏదో గందరగోళం
చేసిందని వదంతులు బయలుదేరాయి. దరిమిలా కొన్ని గంటల తర్వాత మాన్యుయెల్ గా కౌంటింగ్
జరిగిన ప్రాంతాల నుంచి ఫలితాలు రావడం మొదలయింది. టీడీపీ విజయ పరంపర గురించి అ
తర్వాత రేడియోలో వార్తలు ప్రసారం అయ్యాయి. టీడీపీ అధికారంలోకి రావడానికి అవసరమైన
మెజారిటీ రాగానే టేప్ రికార్డర్ పుచ్చుకుని ఎన్టీ రామారావు గారి స్పందన కోసం
ఆబిడ్స్ లోని ఆయన గృహానికి ఆదరాబాదరాగా వెడితే అక్కడి సిబ్బంది చెప్పిన మాట ఇది.
“సారు మేడ మీదకు వెళ్ళిపోయారు,
చాలాసేపయింది నిద్రపోయి”
లేబుళ్లు:
ఈవీఎం లు,
ఎన్టీ రామారావు,
విలేకరిగా ఓ జ్ఞాపకం
16, మే 2017, మంగళవారం
శిక్షలు మరో రకంగా వుండాలి
ఎంత కష్టం ఎంత కష్టం
ఆరు నెలల కిందట మేము ఈ
ప్రాంతంలో అద్దెకు వచ్చినప్పుడు మా అపార్ట్ మెంటుకు ఐ మూలగా ఓ ఖాళీ
స్థలం వుండేది. కొద్ది రోజుల్లోనే అక్కడ ఇంటి నిర్మాణం మొదలు పెట్టారు. హైదరాబాదు
లాంటి నగరంలో ఇది కొత్త విషయం ఏమీ కాదు. కానీ కొత్తగా ప్రస్తావించుకోవడానికి కొత్త
నేపధ్యం ఒకటి కలిసి వచ్చింది. కరెంటు లేకపోవడం వల్ల ఎండ గాలో వడ గాలో ఏదో ఓ గాలి
వస్తే చాలనుకుని పడక గది కిటికీ తెరిచాను. ఆర్నెల్ల కిందట ఆకారం కూడా లేని ఆ
నిర్మాణం చిత్రంగా రెండంతస్తులు లేచింది. మూడో దానిమీద పిల్లర్లు
వేస్తున్నారు. ఓ యాభయ్ అరవై మంది కూలీలు ఆడా మగా సుశిక్షితులయిన వారి మాదిరిగా
నిర్విరామంగా ఆ ఎర్రటి ఎండలో పనిచేస్తున్నారు. కొందరు కంకర ఎత్తి పోస్తుంటే
మరికొందరు ఇసుక, సిమెంటు కొలిచి గుండ్రంగా తిరుగుతున్న ఓ మిక్సింగ్ యంత్రంలో
పోస్తున్నారు. అలా తయారయిన కాంక్రీటును ఓ చిన్న లిఫ్ట్ లాంటి యంత్రం మూడో
అంతస్తుకు చేరుస్తోంది. అక్కడ దాన్ని దించుకున్న కూలీలు బొచ్చెల్లో తీసుకు
వెళ్ళి పిల్లర్లను నింపుతున్న కూలీలకు అందిస్తున్నారు. అంతా ఒక క్రమ పధ్ధతి
ప్రకారం జరిగిపోతోంది. బోలెడు కష్టపడిపోతున్న ఫీలింగు కూడా వారిలో వున్నట్టు దూరం
నుంచి గమనిస్తున్న నా దృష్టికి ఆనలేదు. సరిగ్గా వొంటి గంట కాగానే గంట
కొట్టినట్టు పనులు ఆగిపోయాయి. ఎవరికి వారు అక్కడ డ్రమ్ముల్లో వున్న నీళ్ళతో
మొహం కాళ్ళూ చేతులూ కడుక్కుని ఇళ్లనుంచి తెచ్చుకున్న భోజనాలు చేశారు. చూడగలిగిన
కళ్ళు వుండాలే కాని చుట్టూ వున్న ప్రపంచంలో చూడగలిగినవి ఎన్నో వున్నాయి. అయినా
ఇంకా ప్రపంచం చుట్టిరావాలన్న యావ చావడం లేదు, ఎందుకో అర్ధం కాదు.
కరెంటు వచ్చింది. ప్యాను
తిరిగింది. వొళ్ళు చల్లబడింది. కానీ ఎర్రటి ఎండలో కూలీల చుట్టూ తిరిగొచ్చిన మనసు
మాత్రం ఇంకా వేడిగానే వుంది. ఆవిర్లు కక్కుతూ నే వుంది.
అసలు విషయం ఇప్పుడు
విప్పుతాను. మొదట్లో నేపధ్యం ఒకటుంది అని చెప్పాను గుర్తుంది కదా! అదే ఇది.
నగరంలో అక్రమ నిర్మాణాల
పేరుతొ పెద్ద పెద్ద భవనాలను కూల్చివేస్తున్న వార్తలు వింటున్నాము. నిబంధనలకు
విరుద్ధంగా ఎటువంటి నిర్మాణాలను
అనుమతించకూడదని నమ్మే వారిలో నేనూ వున్నాను.
అక్రమ కట్టడాలను తొలగిస్తున్న ఫోటోలను పత్రికల్లో చూసినప్పుడు, ఇదిగో
ఇప్పుడు చెప్పానే మా ఇంటి దగ్గర నిర్మాణంలో వున్న ఇంటికంటే అవి చాలా పెద్దవిగా
అనిపించాయి. ఆరునెలల నుంచి కడుతున్నా ఇది ఇంకా పూర్తి కాలేదు. అలాటిది ఆ
కూల్చేసిన ఇళ్లు కట్టడానికి కనీసం ఏడాది పట్టి వుంటుంది. అన్నాళ్ళు అధికారులు, అనుమతులు
లేకుండా జరుగుతున్న ఆ నిర్మాణాలను గమనించలేదా! లేదా కళ్ళుండి కూడా నేను
గమనించనట్టు వాళ్ళూ చూడలేదా! ఒక్క ఇల్లు కట్టడానికే ఇంతమంది ఇంతటి ఎండాకాలంలో తమ
రక్త మాంసాలను ఫణంగా పెట్టి ఎంతో శ్రమ పడుతున్నారు. ఇసుక
సిమెంట్ కంకరతో పాటు వారి స్వేదం కూడా ఆ నిర్మాణం అణువణువులో వుంది. ఎంతో
కష్టపడి కట్టిన ఇళ్లను ఏమాత్రం కష్టపడకుండా యంత్రాల సాయంతో కూల్చివేయడం ఏం న్యాయం? ఎలాటి
న్యాయం అనిపించుకుంటుంది. అంత డబ్బు అది ఎవరిదయినా కావచ్చు పూర్తిగా నీళ్లు
వొదులుకున్నట్టే కదా! ఇన్నాళ్ళు
అనుమతి లేని నిర్మాణాలను కాసులకు కక్కుర్తిపడి అనుమతిస్తూ వచ్చిన అధికారులను, సిబ్బందిని
వారు ఎవరయినా సరే, వారి వెనుక ఎవరు వున్నా సరే, కనీసం
ఓ యాభయ్ మందిని
నిర్దాక్షిణ్యంగా ఉద్యోగాలనుంచి ఉన్నపెట్టున శాశ్వితంగా తొలగిస్తే
మళ్ళీ ఇలాటి నిర్మాణాలు జరుగుతాయా!
దయచేసి, మిగిలిన అన్ని
విషయాలు పక్కనబెట్టి ఆలోచించండి.
లేబుళ్లు:
Demolition of illegal constructions
12, మే 2017, శుక్రవారం
ఈ స్థాయి నాది కాదు.........
సైకిల్ పైనా, సిటీ బస్సుల్లోను తిరిగే
ఏకాంబరానికి చిన్న ఉద్యోగం వచ్చింది. యేవో చిన్నపనులు చేసిపెట్టి ఓ స్కూటరు
కొనుక్కున్నాడు. అందులో సుఖం తెలిసివచ్చింది. ఆ హాయిని నిలుపుకోవడానికి కొంత అదనపు
ఆదాయం కావాల్సి వచ్చింది. అందుకోసం అవకాశాలు వెతుక్కున్నాడు. ఆ అవకాశాల పేరే ఆమ్మామ్యా!
అదే లంచం!
ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది. కారు
కొనుక్కున్నాడు. ఆ సుఖమయ జీవితాన్ని మరింత పదిలం చేసుకునేందుకు ‘అవకాశాలు’ పెంచుకున్నాడు.
జీతం పెరిగింది, జీవితమూ పెరిగింది. ‘అవకాశాలూ’
పెరిగాయి. దాంతో పట్టుబడే అవకాశాలు పెరిగాయి. పట్టుబడిపోతాననే భయమూ పెరిగింది.
పట్టుబడకుండా ఏం చేయాలనే ఆలోచనలూ పెరిగాయి.
ఉద్యోగం ఒదిలేసాడు. కంట్రాక్టర్ అవతారం
ఎత్తాడు. లంచాలు తీసుకున్న చేతులతోనే లంచాలు మేపాడు. కోట్లకు పడగలెత్తాడు. అయినా
పడగనీడన బతికే బతుకులో సుఖం
లేదనిపించింది. రక్షణ కవచం కావాలనుకున్నాడు. సంపాదించిన సొమ్మునే పెట్టుబడిగా
పెట్టి రాజకీయాల్లో ప్రవేశించాడు. అధికార పదవులు చేజిక్కించుకున్నాడు. ఇప్పుడు ‘అవకాశాలు’
మరింత పెరిగాయి. జీవితంలో స్థాయి కూడా ఎంతో పెరిగింది. పట్టుపడతాననే భయం
తగ్గిపోయింది. ఎందుకంటే పట్టుకునేవారే ఇప్పుడు తన గుప్పిట్లో వున్నారు.
అయినా సరే! ఏదో ఆందోళన! ఏదో భయం. ఇలా
ఎన్నాళ్ళు ? పైకి చెప్పుకోలేడు.
ఒకప్పటి స్థాయిని గుర్తు తెచ్చుకోలేడు. ఇప్పుడున్న స్థాయిని
వదులుకోలేడు.
లేబుళ్లు:
ఈ స్థాయి నాది కాదు.........,
లంచాలు
11, మే 2017, గురువారం
ఏది నిజం?
Long long ago, so long ago, nobody can say how long ago… ఆకాశవాణి ఒక్కటే రాజ్యమేలుతున్న రోజుల్లో...దాదాపు ప్రధాన పత్రికలు
అన్నిట్లో రేడియో కార్యక్రమాలపై సమీక్షలు ప్రచురించేవారు. వీటిల్లో ఎక్కువ భాగం ఆ
కార్యక్రమాల తీరుతెన్నులను ఎండగడుతూనే వుండేవి. తర్వాత ప్రైవేటు టీవీలు వచ్చిన
తరువాత సీ.ఎం.ఎస్. భాస్కర రావు గారు తమ సంస్థ ద్వారా కొంత ప్రయత్నం చేసారు. ఈ
యజ్ఞంలో జ్వాలా, ఆర్వీవీ కృష్ణారావు, నేనూ మా రాతల ద్వారా కొన్ని సమిధలు వేసాము.
ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తరువాత ఏది రియల్? ఏది వైరల్? అంటూ కొన్ని టీవీ
ఛానళ్ళు సోషల్ మీడియాలో వచ్చే వార్తలను ఖండఖండాలుగా ఖండించే పని పెట్టుకున్నట్టుగా
కానవస్తోంది. అయితే ఈ కార్యక్రమాలు సమీక్షల రూపంలో కాకుండా ‘ఆ వార్తలు, నిజం కావు,
నమ్మకండి’ అనే ధోరణిలో వుంటున్నట్టు వాటిని చూసిన కొందరు మిత్రులు చెబుతున్నారు.
మంచి పనే!
కానీ మీడియాలో వచ్చే వాటిల్లో ఏది
నిజం? ఏది అబద్దం? అనేది తెలియచెబితే కాని తెలుసుకోలేనంత సంక్లిష్టం కాదేమో!
9, మే 2017, మంగళవారం
ఆయన రేడియో ప్రయోక్తా! రచయితా!
రెండూను అంటున్నారు ఎమెస్కో వారు. అనడమే కాదు, డి. వెంకట్రామయ్య
రాసిన రెండు పుస్తకాలను ఒకేసారి ప్రచురించారు. ఇది ఎప్పుడో జరగాల్సిన పని అనేది
రొటీన్ కామెంటు. ఇప్పటికయినా చేసారు, ఆయన అభిమానులకి అదే సంతోషం.
'ఆయన
వార్తలు చదువుతుంటే వార్తలు చదువుతున్నట్టు అనిపించేది కాదు. చక్కగా చెబుతున్నట్టు
వుండేది. నిజంగా రేడియో వార్తలు చదవడం అంటే ఏమిటో వెంకట్రామయ్య వార్తలు
వింటే తెలుస్తుంది' అనేవారు ప్రసిద్ధ జర్నలిస్ట్ జీ.కృష్ణ గారు. ఆయన అన్నారంటే అది
ఆస్కార్ అవార్డ్ తో సమానం. ఎందుకంటే కృష్ణ గారు అల్లాటప్పాగా రాయరు, మాట్లాడరు.
వెంకట్రామయ్యకి ఇలాటి
నమ్మకాలు లేవుకాని, శాపవశాన గంధర్వుడు మానవ జన్మ ఎత్తినట్టు, ఆయన
రేడియోలో చేరి ఉద్యోగం చెయ్యడం ఆకాశవాణికి ఉపయోగం అయ్యింది కానీ,
ఆ ఉద్యోగం చేయడం వల్ల ఆయన నష్టపోయారు. ఇంకా చెప్పాలంటే వెంకట్రామయ్య
అనే సృజనాత్మక వ్యక్తి రేడియో న్యూస్ రీడర్ గా సుదీర్ఘకాలం
పనిచేయడంవల్ల ఆంధ్రదేశం చక్కని రచయితను కోల్పోయింది. ఇది నా నమ్మకం.
ఒక రచన చేసినా, ఒక
వార్త తర్జూమా చేసినా, లేక రేడియోలో
చదివినా, ఏం చేసినా సరే మనసుపెట్టి చేసేవారు. అందుకే ఆ రచనలో,
ఆ వార్తలో, దానిని చదవడంలో జీవం తొణికిసలాడేది.
ఆయనతో పాటు దశాబ్దాలపాటు పనిచేసిన రేడియో ఉద్యోగిగా ఈ విషయం బల్ల గుద్ది
చెప్పగలను.
రాయని రచయిత, లేదా
రాసి మానేసిన రచయిత అని పేరుపడ్డ వెంకట్రామయ్య చేత మళ్ళీ రాయించాలన్నది నా
చిరకాల వాంఛ. దాన్ని మన్నించి కొన్ని రాశారు కానీ ఇంకా ఇంకా రాయాలనే కోరిక
మాత్రం తీరలేదు. అలాఅని, నా ఆశా చావలేదు. చూద్దాం! ఆయన రాయకపోతారా! నేను చదవక పోతానా?
కానీ, కార్మికుల కార్యక్రమం 'రాంబాబు'
అంత తేలిగ్గా వినే రకం కాదు. అదేకదా! బాధ.
మొత్తానికి ఈ గోడు
ఎమెస్కో వారి చెవిన పడినట్టుంది. అందుకే ఆయనవి రెండు పుస్తకాలు ఏకకాలలో అందంగా అచ్చొత్తించి
అభిమానుల కోరిక తీర్చారు. నిన్ననే నాకూ, జ్వాలాకు ఆయన ఈ పుస్తకాలు అందచేశారు. ఈ ఏడాదిలో నాకందిన గొప్ప
కానుక.
(ప్రచురణ: ఎమెస్కో PRICE: Rs.175 each)
తోకటపా: రేడియో అనుభవాల గురించి రాసిన మూడువందల పేజీల్లో, పది పేజీలతో కూడిన ఒక అధ్యాయాన్నే నాకోసం, నా పేరుమీద కేటాయించిన వెంకట్రామయ్య గారికి స్నేహపూర్వక కృతజ్ఞతలు – భండారు శ్రీనివాసరావు
తోకటపా: రేడియో అనుభవాల గురించి రాసిన మూడువందల పేజీల్లో, పది పేజీలతో కూడిన ఒక అధ్యాయాన్నే నాకోసం, నా పేరుమీద కేటాయించిన వెంకట్రామయ్య గారికి స్నేహపూర్వక కృతజ్ఞతలు – భండారు శ్రీనివాసరావు
లేబుళ్లు:
డి. వెంకట్రామయ్య ఎమెస్కో
అభిమాన ధనం అంటే ఇదీ బాబుగారూ!
“సింగరాయకొండ కొండ నుంచి నరసింహారావుని
మాట్లాడుతున్నాను”
“చెప్పండి”
“ఫిబ్రవరిలో చంద్రబాబు జన్మదినం
సందర్భంగా ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ దినపత్రికల్లో మీరు రాసిన వ్యాసాలు చదివాను.
వాళ్ళు మీ ఫోను నెంబర్లు ఇవ్వడం వల్ల అప్పుడే ఒకసారి మీతో మాట్లాడాను”
“............”
“నాకు ఆ వ్యాసాలు బాగా నచ్చాయి. నేను టీడీపీ
అభిమానిని. అందువల్లనే అవి నచ్చాయని అనుకోవద్దు. మీరు చంద్రబాబులో అప్పటికీ
ఇప్పటికీ వచ్చిన మార్పులు గురించి సుతిమెత్తగా చెప్పారు. అది నాకు నచ్చింది.
అందుకే నేను మీకు ఒక చిన్న కానుక పంపాలని అనుకుంటున్నాను”
ఆశ్చర్యం వేసింది. వ్యాసాలు
ప్రచురించిన పత్రికల వాళ్ళే పారితోషికం ఊసెత్తలేదు. అందుకోసం నేనవి రాయలేదు. కానీ
ఈ పెద్దమనిషి కానుక పంపుతాను అంటున్నాడు. అందుకే ఆశ్చర్యం.
“ఇన్ని రోజులు గడిచాక ఎందుకిలా
అనుకుంటారేమో. మా తోటలో మామిడి కాయలు కాపుకు వచ్చాయి. అవి రాగానే మీకు పంపాలని
అప్పుడే అనుకున్నాను. ఏమీ అనుకోకపోతే మీ అడ్రసు చెబుతారా? పార్సెల్లో వేస్తాను”
“మీ అభిమానానికి ధన్యవాదాలు. మా ఇంట్లో
మామిడి పండ్లు తినేవాళ్ళు లేరు. మా ఆవిడకు సుగరు. ఇక నేను తినగా పంచి పెట్టేటన్ని పళ్ళు
మీలాంటి మిత్రులు పంపారు. కాబట్టి ఓ పనిచేయండి. శ్రమ తీసుకుని అంత దూరం నుంచి పార్సె
ళ్ళు పంపకండి. వాటిని అవసరం అయిన వాళ్లకి ఇచ్చి నన్ను ధన్యుడ్ని చేయండి”
“..........”
“మరో మాట! నిజానికి ఆయనకి (చంద్రబాబు)
ఇంతకంటే (మీ వంటివారి అభిమానం) మించిన పుట్టిన రోజు కానుక వుండదు”
8, మే 2017, సోమవారం
స్లో పాయిజనింగ్
“ఆటో కంటే చౌక తెలుసా? ఒక్కోసారి ఫ్రీ
రైడ్. దిగిన తరవాత ఏమీ ఇవ్వక్కర లేదన్నాడు డ్రైవర్. ఇంటి దగ్గరకే వచ్చి
ఎక్కించుకుంటారు, దింపమన్న చోట దింపేస్తారు, యెంత హాయిగా వుందో ఇప్పుడు. ఈ
ఊబెర్లు, ఓలాలు అన్ని ఊళ్ళల్లో పెడితే యెంత బాగుంటుందో!” ఇలా సాగుతున్నాయి నగర
మధ్యతరగతి పౌరుల ఆలోచనలు. నేనూ వీరిలో ఒకడినే.
కానీ, వ్యాపారి అనేవాడు ఏ లాభం లేకుండా
వరదన పడిపోడని సామెత. మాల్స్ సంస్కృతి ప్రబలిన తర్వాత చిన్న చిన్న దుకాణాలకు ఊపిరి
అందడం లేదు. అమెరికా లాంటి దేశాల్లో చిల్లర వ్యాపారాలు ఎప్పుడో హరీ అన్నాయి. అలాగే
ఇవీ. ముందు చౌక ధరలతో ఆకర్షించి అలవాటు పడేలా చేస్తారు. మరో దారి లేకుండా చేసిన తరువాత వారేం
చెబితే అదే మాట చెల్లుబడి అవుతుంది. అప్పుడు రేట్లు పెంచినా అడిగేవాడు వుండడు. ప్రత్యామ్నాయం
లేకుండా పొతే అడగడానికి నోరు పెగలదు.
ఈరోజు బయటకు వెళ్ళడానికి ఊబెర్ బుక్
చేద్దామని అనుకున్నాను. “ఈరోజు రేట్లు పెరిగాయి, సహకరించండి” అని ఓ చిన్ని
హెచ్చరిక.
ఊబెర్, ఓలాలు వచ్చిన కొత్తల్లో రేట్లతో
పోలిస్తే ఇప్పుడు దాదాపు రెట్టింపు అయ్యాయి. అయితే ఒక్కసారిగా పెద్దగా పెంచరు. కార్పొరేట్
కల్చర్ కదా! వారి పద్దతులు వారివి.
ఎవరో చెప్పగా విన్నాను. ‘స్లో
పాయిజనింగ్’ అంటే ఇష్టమని.
లేబుళ్లు:
ఊబెర్,
ఓలా,
స్లో పాయిజనింగ్
ప్రెస్ మాన్ వేణుగోపాల్
వేణుగోపాల్. తెలుగు తెలియని
వేణుగోపాల్. హైదారాబాదు ఎప్పుడు వచ్చినా కలిసేవాడు. ఎం.ఎస్. శంకర్ కి ఆత్మీయ
మిత్రుడు. ప్రెస్ మాన్ ప్రకటన సంస్థలో, తరువాత బిర్లా సంస్థలో చాలాకాలం పనిచేసాడు.
నేనూ, జ్వాలా, శంకర్ మూడేళ్ళ క్రితం చెన్నై వెళ్లి నప్పుడు కూడా మాతో గడిపాడు.
నిగర్వి. స్నేహశీలి.
ఈ నెల ఇరవై నాలుగో తేదీన శంకర్ తిరుపతి
ప్రయాణం పెట్టుకున్నాడు. స్వామి దర్శనం ముగించుకుని తిరుగు ప్రయాణంలో చెన్నై
మీదుగా వేణుగోపాల్ ని చూసి రావాలని శంకర్
ఆలోచన. ఈ సంగతి చెబుదామని ఈ ఉదయం వేణుగోపాల్
కి ఫోను చేశాడు. అయన భార్య ఫోను ఎత్తింది. పరిచయం వుంది కాబట్టి శంకర్
గబగబా తాను పలానా రోజు చెన్నై
వస్తున్నానని, వేరే పనులు ఏవీ పెట్టుకోవద్దని. అంతా చెప్పేసిన తరువాత అవతల నుంచి
వినబడింది సన్నగా ఆవిడ ఏడుపు. ఏడుస్తూనే చెప్పింది, వేణుగోపాల్ ఇక లేరని, ఈ
తెల్లవారుజామునే చనిపోయాడని.
శంకర్ ఒక్క మాటుగా షాక్ తిన్నాడు,
తేరుకున్న తరువాత నాతొ పంచుకున్నాడు.
నిన్న వుండి ఈరోజు వుండడం జీవితం
అయితే, క్షణం క్రితం వుండి మరుక్షణం లేకపోవడమే మరణం.
లేబుళ్లు:
ప్రెస్ మాన్ వేణుగోపాల్,
Pressman Venogopal
మహానుభావుడితో మూడు నిమిషాలు
సన్మాన కార్యక్రమం మొదలు కావడానికి
కొద్ది వ్యవధానం ఉండడంతో విశ్వనాథ్ గారితో కాసేపు ముచ్చటించే సావధానం దొరికింది.
నా రష్యా అనుభవం చెప్పాను. మాస్కోలో
శంకరాభరణం సినిమా చూసిన వివరాలు చెప్పాను. చూసిన వెంటనే సంతోషం పట్టలేక మద్రాసు
ఫోను చేసి జంధ్యాలను అభినందించిన సంగతి వివరించాను.
ఆయన తన సుదీర్ఘ జీవితంలో ఇటువంటి
కబుర్లు ఎన్నో వినివుంటారు. నేను చెప్పింది కూడా నిర్వికారంగా విన్నారు. మలయాళంలో ఆ సినిమా డబ్ చేసిన సంగతి
గుర్తుచేసుకున్నారు.
ఈ ఫోటో తీసిన కుర్రాడు వయసులో చాల
చిన్నవాడు. వచ్చి విశ్వనాధ్ గారి కాళ్ళకు నమస్కరించి దీవించమని కోరాడు. తాను
ఎడిటింగ్ ఫీల్డ్ లో వున్నానని, డైరెక్టర్
గా పైకి రావాలని అనుకుంటున్నానని
చెబుతూ, ఆయన ఆశీర్వాదం కోరుతూ మళ్ళీ పాదాభివందనం చేయబోయాడు. తల మీద చేయి వేస్తేనే
దీవించినట్టుకాదని, మనస్సులోనే దీవించానని
కళాతపస్వి బదులిచ్చారు. ఇది చూస్తుంటే నాకు స్వాతి ముత్యం సినిమాలో ఏదో చిన్న
ఉద్యోగం కోరుతూ కమల్ హసన్ చేసిన పాత్ర,, ఆ సన్నివేశం గుర్తుకువచ్చాయి.
లేబుళ్లు:
కే.విశ్వనాథ్,
మహానుభావుడితో మూడు నిమిషాలు
7, మే 2017, ఆదివారం
సినిమాహాలు కాదది, దేవాలయం
‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు స్ట్రోక్
తగిలింది నాకు, సన్ స్ట్రోక్ లాగా.’ అన్నారు డైరెక్టర్ కే. విశ్వనాథ్, నేను సభ్యుడిగా
ఉన్న వయోధిక పాత్రికేయ సంఘం వారు ఆయనకీ రోజు (07-05-2017) ఫిలిం ఛాంబర్ లో చేసిన సన్మాన సభలో
మాట్లాడుతూ. నిజానికి ఈ కార్యక్రమంలో అత్యంత క్లుప్తంగా ప్రసంగించింది కూడా విశ్వనాద్
మాత్రమే. వరస సన్మాన పరంపరలతో, టీవీ ఇంటర్యూలతో తీరికలేని ఇటీవలి రోజుల్ని గుర్తు
చేసుకుంటూ ఆయన చెప్పిన మాటలివి. నిజంగానే ఆయనలో ఆ అలసట కానవచ్చింది.
శంకరాభరణం గురించి కూడా చెప్పారు.
“ఎవరో ఒకతను తాను ఆ సినిమా డజను సార్లు
చూశానని అన్నాడు. అన్ని సార్లు చూడడానికి అందులో ఏముందని అడిగాను. ఏమోసారూ, ఆ
సినిమాహాల్లో కూర్చుంటే దేవుడి గుడిలో వున్నట్టు అనిపిస్తుంది’ అన్నాడా కుర్రాడు.
జన్మ ధన్యం అవడం అంటే ఇదే కాబోలు”
చాలామంది చాలా మాట్లాడారు. మాజీ
ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ శ్రీ రోశయ్య, సినిమాహాలుకు వెళ్లి సినిమా చూడక
దశాబ్దాలు గడిచాయని, విశ్వనాద్ సినిమా మాత్రం తప్పకుండా చూసేవాడినని చెప్పారు.
(శ్రీ విశ్వనాద్ తో)
లేబుళ్లు:
దేవాలయం,
శంకరాభరణం,
సినిమాహాలు కాదు
5, మే 2017, శుక్రవారం
జాతి తీర్పును సమర్ధించిన సుప్రీం
(PUBLISHED IN EDIT PAGE OF ANDHRA PRABHA DAILY ON 06-05-2017)
ఒక యువతిపై జరిగిన సామూహిక అత్యాచారం,
హత్య కేసులో న్యాయస్థానంలో విచారణ మొదలు
కాకుండానే, ముద్దాయిలకి ఉరిశిక్ష వేయాలంటూ జాతి యావత్తు ముక్తకంఠంతో తీర్మానించడం స్వతంత్ర భారతంలో నిజంగా
ఒక అరుదయిన విషయమే. ఆ ఘోరకలికి పాల్పడినవారికి మరణదండన ఒక్కటే సరయిన శిక్ష అని
ప్రజానీకమే తీర్పు ఇవ్వడం, ‘అత్యంత అరుదయిన కేసు’ అనే పేరుని కట్టబెట్టింది. ముద్దాయిల
కిరాతక చర్య పట్ల ప్రజలు ఎంతగా చలించి పోయారనడానికి ఇదొక దృష్టాంతం. ఈ సంఘటన జరిగి
అయిదేళ్ళయింది. 2012 డిసెంబరు 16 వ తేదీ రాత్రి భారత రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ పాశవిక కాండ మానవత్వానికే మాయని మచ్చగా మిగిలింది. ఈ కేసుపై వివిధ కోర్టుల్లో సుదీర్ఘ
విచారణ సాగిన అనంతరం ఢిల్లీ హైకోర్టు
ముద్దాయిలకు విధించిన ఉరిశిక్షను సుప్రీం కోర్టు నిన్న ఖరారు చేయడంతో, గతంలో జాతి ఇచ్చిన తీర్పును సుప్రీం సమర్ధించినట్టయింది.
మనుషులు నరరూప రాక్షసులుగా ఎలా మారతారో, ఆ మారిన స్ధితిలో వాళ్ళు ఎంతటి ఘోరాలకు
పాల్పడుతారో సకల దేశవాసులకు తెలిసివచ్చింది కూడా ఈ కేసు వివరాలు వెలువడిన తరువాతే.
ఈ సంఘటనలో మానాన్నీ, ప్రాణాన్నీ పోగొట్టుకున్న ఆ యువతికి ఏమి న్యాయం జరిగిందో తెలియదు కానీ దేశంలోని ఆడపడుచులందరికీ ఊరట కలిగించే ఒక శాసనంమాత్రం
ఊపిరి పోసుకుంది. నాకు తెలిసి దేశానికి
స్వాతంత్రం వచ్చిన తరువాత, ప్రజల ఒత్తిడి ఫలితంగా ఒక చట్టం రూపొందిన సందర్భం కూడా ఇదే. ఆ చట్టమే ‘నిర్భయ’.
ఆరుగురు కామాంధుల చేతికి చిక్కిన ఒక యువతి ఎటువంటి దుర్భర, దుస్సహ, శారీరక, మానసిక వేదనలకు గురైందన్న విషయం
లోకానికి తెలిసివచ్చిన పదమూడు రోజుల తరువాత ఆ అనామికను మెరుగయిన చికిత్స కోసం
సింగపూరు తరలించారు. అక్కడే చికిత్స
పొందుతూ ఆమె మరణించింది. ఈ సంఘటన పట్ల సభ్య
సమాజం స్పందించిన తీరు జాతీయ, అంతర్జాతీయ మీడియా దృష్టిని
ఆకర్షించింది. ఐక్యరాజ్యసమితిని సైతం కదిలించింది. ఫలితంగా నాటి కేంద్ర ప్రభుత్వం
సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జే. ఎస్. వర్మ నేతృత్వంలో త్రిసభ్య
విచారణ సంఘాన్ని ఏర్పాటు చేసింది. తన పరిశీలనకు వచ్చిన ఎనభయ్ వేలకు పైగా సలహాలు, సూచనలను పరిశీలించి నెలరోజులలోపునే ఈ సంఘం తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. మహిళల పట్ల లైంగిక పరమైన నేరాలు పెరిగిపోవడానికి మూల కారణం ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు వ్యవస్థల వైఫల్యంగా సంఘ
సభ్యులు అభిప్రాయపడ్డారు. కమిటీ నివేదికలో సుమారు తొంభయ్ శాతం సిఫారసులను గుదిగుచ్చి రూపొందించిన ఆర్దినెన్సుకు
రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడం, తదుపరి అది శాసనంగా చట్టసభల ఆమోదం పొందడం చకచకా జరిగిపోయాయి. అయితే ఆర్డినెన్స్ బిల్లు రూపం ధరించి, 2013 మార్చి 19 తేదీన లోకసభ ఆమోదం పొందేనాటికే అందులో పొందుపరచిన అనేక అంశాలు పలు మార్పులకు గురయ్యాయి. నిర్భయ
చట్టంతో ఇటువంటి హేయమైన సంఘటనలు పునరావృతం కావని ఆశించడం వృధా అని ఈ అయిదేళ్ళ కాలంలో చోటుచేసుకుంటున్న
అదే విధమైన పలు సంఘటనలు నిరూపించాయి. ఒక్క ఢిల్లీ కేసులో మినహా మరే సందర్భంలో కూడా
కఠిన శిక్షలు పడిన దాఖలా
లేదు. ఢిల్లీ కేసు కూడా విచారణలు త్వరగా పూర్తయి, దోషులకు వెంటనే శిక్షలు పడతాయనే
ఆశలపై నీళ్ళు చల్లింది. అలా అని ఈ నిర్భయ చట్టం వల్ల ఎలాటి ఉపయోగం లేదని కాదు.
లైంగిక అత్యాచారాలకు పాల్పడే దుర్మార్గులు చట్టాలను లెక్కపెట్టే స్థితిలో
వుండకపోవచ్చు కానీ, అత్యాచార బాధితులకు మాత్రం ఈ చట్టం కొంత
ఊరట కలిగిస్తోంది. తమ మీద లైంగిక దాడులకు పాల్పడిన వారికి శిక్ష పడుతుందన్న భరోసా
ఆ అబలలకు ఒకింత ఉపశమనాన్ని ఇస్తోంది. అన్నింటికీ మించి
ప్రజల ఆకాంక్షల మేరకు ఒక శాసనం రూపొందడం అనేది ప్రజాస్వామ్యం సాధించిన ఒక విజయం. అంతే కాకుండా, లైంగిక అత్యాచార బాధితులు సమాజం దృష్టిలో మరిన్ని అవహేళనలకు గురికాకుండా
అటువంటి వారిని అసలు పేర్లతో కాకుండా ‘నిర్భయ’ గా పిలవాలనే ఒక సంప్రదాయం అమల్లోకి
వచ్చింది.
ఢిల్లీ ‘నిర్భయ’ కేసులో ఆరుగురు ముద్దాయిల్లో నలుగురికి
(ఒక ముద్దాయి విచారణ జరుగుతూ వున్న సమయంలోనే జైల్లో ఉరివేసుకుని చనిపోయాడు) ప్రత్యేక న్యాయస్థానం మరణశిక్ష విధించింది. ఆరో ముద్దాయి ‘మైనర్’ (అల్ప వయస్కుడు) అన్న కారణంతో అతడ్ని
మూడేళ్ళు జువనైల్ హోంలో ఉంచారు. ఈ శిక్షాకాలం పూర్తయి అతడు విడుదల అయ్యాడు కూడా. మైనర్
అనే ఒకే ఒక కారణంతో నేరశిక్షాస్మృతి ప్రకారం అతడికి మిగిలిన నేరస్తులతో పాటు శిక్ష
వేయకుండా మూడేళ్ళ శిక్షతో సరిపుచ్చాల్సి వచ్చింది. అయితే ఇటువంటి నేర మనస్త్వత్వం
కలిగిన వారిని, చట్టంలో వున్న లొసుగులను అడ్డం పెట్టుకుని విడుదల చేస్తే మరింత
ప్రమాదకర పరిణామాలు సంభవించే అవకాశం
వుందని కొందరు సందేహాలు వ్యక్తం చేశారు
కూడా. విచారణా కాలంలో జైల్లో ఒక విదేశీ వార్తా సంస్థకు ముద్దాయిల్లో ఒకరు ఇచ్చిన
ఇంటర్వ్యూ ని బట్టి ఆ
సందేహాలు నిజమయ్యే ప్రమాదం ఉందనిపిస్తోంది. ‘ఆ యువతి బలాత్కారానికి సహకరించి వుంటే
ఇంతటి విషమ పరిస్తితి ఆమెకు ఎదురయ్యేది కాదని’ అతడు చెప్పిన తీరు కరడు గట్టిన నేర
ప్రవృత్తికి నిలువెత్తు సాక్ష్యం.
మూడేళ్ళ అనంతరం ‘అల్పవయస్కుడి’ విడుదలను అడ్డుకుంటూ సుబ్రమణ్య స్వామి
కోర్టుకు ఎక్కారు, కానీ న్యాయస్థానం ఆ అభ్యర్ధనను
తిరస్కరించింది.
పిన్న వయస్కుడు అనే కారణంతో శిక్ష తప్పించుకుని దర్జాగా సమాజంలోకి
తిరిగి అడుగుపెట్టిన అతగాడు చేసిన నేరం చిన్నదేమీ కాదు. ఆనాటి సామూహిక మానభంగ పర్వంలో అతడూ ఒక
భాగస్వామి. పైపెచ్చు, నిస్సహాయ స్తితిలో వున్న ఆ అభాగ్యురాలిని ఒక ఇనుప రాడుతో అతి
క్రూరంగా, అత్యంత రాక్షసంగా హింసించిన పాపం అతడి
ఖాతాలో వుంది. అయినా, ‘అల్పవయస్కుడు’ అనే కారణంతో చేసిన నేరానికి శిక్ష
పడకుండా బయటపడగలిగాడు.
కోర్టు నిర్ణయం నిర్భయ తలితండ్రులను నిరాశ పరచింది. ‘నేరం జయించిందని, తామే పరాజితులమని’ ఆమె తల్లి ఆశాదేవి ఆవేదన వెలిబుచ్చారు.
ఆమె బాధ సమంజసం అనిపిస్తోంది.
( హతురాలి పేరు జ్యోతిసింగ్ అని ఆమె తల్లి ఆశాదేవే స్వయంగా వెల్లడించేవరకు ఎవరికీ
ఆమె అసలు పేరు తెలవదు, మీడియాలో కూడా నిర్భయ అనే పేరే ప్రాచుర్యం పొందింది) మూడేళ్ళ
జువెనైల్ హోం శిక్ష పూర్తిచేసుకున్న ఆ బాల
హంతకుడికి కొత్త జీవితం ప్రసాదించే పేరుతొ, టైలరింగ్ షాపు పెట్టుకోవడానికి ఆర్ధిక
సాయం అందించారు. ఆ షాపుకు అవసరం
అయ్యే
స్థలాన్ని
కూడా అధికారులే సమకూర్చారు. అతడి పాత పేరును మార్చి కొత్త పేరు తగిలించారు. అతడు పాత
జీవితం మరిచిపోయి కొత్త జీవితంలో స్థిర పడడానికి ఈ ఏర్పాటు. ఇదంతా వినడానికి
బాగానే వుంది. పేర్లు మార్చినట్టు నేరస్తులను పూర్తిగా సంస్కరించగలిగితే అంతకంటే
కోరుకునేది ఏమీ వుండదు. మనిషి వేష భాషలను మార్చినంత సులభంగా అతడి మనస్త్వత్వాన్ని
మార్చడం అంత తేలికా అన్నదే ప్రశ్న. జైలు ఇంటర్వ్యూలో ఒక ముద్దాయి చెప్పిన
అభిప్రాయమే దీనికి సరయిన సమాధానం. ధర్మం ప్రకారం ఆ ‘అల్ప వయస్కుడు’ కూడా మిగిలిన వారితో పాటు శిక్షార్హుడే.
కానీ చట్టం చెప్పే న్యాయం వేరుగా వుంటుంది.
కోర్టుల్లో న్యాయం చట్టాన్ని
బట్టి వుంటుంది. చట్టం మారితే దానికి తగ్గట్టుగా న్యాయం, దానికి తగ్గట్టుగా శిక్షలు మారిపోతూ వుంటాయి. ధర్మం అనేది
మారుతున్న కాలంతో ప్రమేయం లేకుండా స్థిరంగా మార్పు లేకుండా వుంటుంది.
అల్ప వయస్కులు నేర పూరిత మనస్త్వత్వం కలిగివుండరన్న అభిప్రాయం
ఒకప్పుడు సరికావచ్చు. కానీ వారి మనస్సులను కలుషితం చేసే అనేక అవకాశాలు చిన్న వయస్సునుంచే ప్రస్తుతం అందుబాటులో ఉంటున్నాయి. గుప్పెట
మూసివుంచాల్సిన అనేక సెక్స్ పరమైన సంగతులు, వారి గుప్పెట్లో ఉంటున్న సెల్ ఫోన్ల
పుణ్యమా అని చిన్నతనం నుంచే వారికి కరతలామలకం. ఈ వెసులుబాట్లతో వారు పెడమార్గం
పడుతున్నారన్న వాస్తవాలను మరిచిపోరాదు. అల్పవయస్కులు అయినంత మాత్రాన వారు ఇటువంటి
హీనమైన లైంగిక కార్యకలాపాలకు పనికిరారు అని నిర్ధారణకు రావడానికి వీల్లేదు అనడానికి ఈ కేసులో శిక్ష తప్పించుకుంటున్న ఈ బాల
నేరస్తుడే సాక్షి.
తక్కువ వయస్సు కారణంగా శిక్షలు తప్పించుకునే పరిస్తితి ముందు ముందు
కూడా కొనసాగితే అందువల్ల మరికొన్ని విషమ పరిణామాలు కూడా చోటుచేసుకునే ప్రమాదం
పొంచి వుంటుంది. పిల్లల్ని చేరదీసి, చిన్నతనం నుంచే ఉగ్రవాద శిక్షణ ఇచ్చే
విదేశీ
సంస్థలు, తప్పుడు
సర్టిఫికేట్లతో వయస్సు తక్కువగా చూపించి, వారిచేత
ఉగ్రవాద చర్యలు జరిపించే అవకాశాన్ని కూడా కొట్టివేయలేము. అటువంటి వారు ఒకవేళ పట్టు
పడినా, ఈ చట్టాన్ని ఆసరాగా తీసుకుని, అనతి కాలంలోనే బయటపడి తమ కార్యకలాపాలను
తిరిగి కొనసాగించే వీలుంటుంది.
లేబుళ్లు:
జాతి తీర్పును సమర్ధించిన సుప్రీం,
NIRBHAYA.నిర్భయ
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)