సూటిగా.....సుతిమెత్తగా.......
ఒక్కసారి ఓ నలభయ్ ఏళ్ళు వెనక్కి వెళ్లి
వద్దాం.
1975 జూన్ 12.
దేశ రాజధాని న్యూఢిల్లీలోని ప్రధాని
ఇందిరాగాంధీ నివాసంలో ఒక అధికారి చాలా అసహనంగా అటూ ఇటూ తచ్చాడుతున్నాడు. తడవతడవకూ
ఓసారి టెలిప్రింటర్ గదిలోకి వెడుతూ ఏదైనా ఫ్లాష్ న్యూస్ వస్తుందేమో అని
చూస్తున్నాడు. షరా మామూలు వార్తలు మినహా
ఆయన ఎదురు చూస్తున్న వార్తలు ఏమీ ఆ గదిలోని పీటీఐ, యుఎన్ఐ ప్రింటర్ల మీద కనబడడం లేదు.
మరి కాసేపట్లోనే, అంటే ఉదయం పది గంటల రెండు నిమిషాలకు యుఎన్ఐ ప్రింటర్ “ఫ్లాష్ ఫ్లాష్” అంటూ గంటలు మోగిస్తూ ఒక వార్త ఇచ్చింది. దాన్ని
చూడగానే ఆ అధికారి నివ్వెర పోయాడు. ‘మిసెస్
గాంధీ అన్ సీటెడ్’ అంటూ అలహాబాదు హైకోర్టు ఇచ్చిన తీర్పును అతి క్లుప్తంగా
ఆ వార్తా సంస్థ అందులో పేర్కొన్నది. హడావిడిగా
ఆ వార్త వున్న కాగితాన్ని ప్రింటర్ నుంచి చించి, దాదాపు పరిగెత్తుకుంటూ
ప్రధాని కూర్చుని వున్న గదిలోకి
వెళ్ళాడు. వెళ్లి ఆ కాగితాన్ని అక్కడే వున్న రాజీవ్ గాంధి చేతిలో ఉంచాడు. దాన్ని పరికించి చూసిన రాజీవ్
తల్లితో చెప్పాడు. “వాళ్ళు నిన్ను ప్రధాని
పదవి నుంచి తొలగించారు” అని. ఆ మాటలు విన్న ఇందిరాగాంధీ కొద్దిసేపు మిన్నకుండి పోయారు. ఆమె మోహంలో
ఎలాంటి ఆందోళన కానరాలేదు.
ఈలోగా
టెలిప్రింటర్ మరింత బాధాకరమైన వార్తను మోసుకొచ్చింది. ఇందిరాగాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయడమే కాదు, ఎన్నిక ద్వారా సమకూరే ఎటువంటి పదవికయినా ఆమె ఆరేళ్ళపాటు అనర్హురాలని అలహాబాదు
హైకోర్టు మరో తీర్పు చెప్పింది.
అప్పటివరకు ఉగ్గబట్టుకుని వున్నప్పటికీ,
ఈ వార్త తెలియగానే ఆవిడ మౌనంగా
నెమ్మదిగా అడుగులు వేస్తూ అక్కడినుంచి వెళ్ళిపోయారు.
దీనికి ముందు చాలా చాలా సంగతులు
చరిత్రలో చేరాయి.
శ్రీమతి గాంధి చేతిలో సుమారు లక్ష ఓట్ల
తేడాతో ఓడిపోయిన రాజ్ నారాయణ్, శ్రీమతి
గాంధి ఎన్నిక అక్రమ పద్ధతుల్లో జరిగిందని ఆరోపిస్తూ, ఆ ఎన్నికను రద్దుచేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. శ్రీమతి ఇందిరాగాంధి తన
ఎన్నికల ప్రచారంకోసం యశ్ పాల్ కపూర్ అనే
ప్రభుత్వ ఉద్యోగి సేవలు వాడుకుందనీ,
అలాగే ప్రచార వేదికలు, మైకులు మొదలయినవి ఏర్పాటు చేసే విషయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ అధికారుల సాయం
తీసుకున్నారనీ రాజ్ నారాయణ్ వాదన. ఈ రెండూ ఎన్నికల నిబంధనావళికి విరుద్ధమని పేర్కొంటూ న్యాయమూర్తి జగ్
మోహన్ శ్రీమతి గాంధీకి ప్రతికూలంగా తీర్పు ప్రకటించారు.
‘ట్రాఫిక్ ఉల్లంఘన వంటి
చిన్న తప్పిదానికి ప్రధాన మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని ఆదేశించినట్టుగా ఈ తీర్పు వుందని ‘ఎమర్జెన్సీ’ పై రాసిన ‘జడ్జ్
మెంట్’ అనే గ్రంధంలో సుప్రసిద్ధ పాత్రికేయులు కులదీప్ నాయర్ వ్యాఖ్యానించారు. జగ్ మోహన్ తీర్పు తనకు
వ్యతిరేకంగా రాకుండా చూడడానికి ప్రధాని ఇందిర, ఆ న్యాయమూర్తిపై ఎన్నిరకాలుగా ఒత్తిళ్ళు
తీసుకువచ్చిందీ, న్యాయమూర్తి వాటన్నిటినీ ఎలా తట్టుకున్నదీ మొదలయిన సంగతులను చాలా
ఆసక్తిదాయకంగా నాయర్ ఆ పుస్తకంలో వివరించారు. శ్రీమతి గాంధీ విధానాలతో పూర్తిగా వ్యతిరేకించే కులదీప్ నాయర్
వంటి జర్నలిష్టు కూడా, ఇందిరా గాంధి విషయంలో న్యాయమూర్తి చిన్న తప్పుకు పెద్ద శిక్ష వేశారని
అభిప్రాయపడడం ఇందులోని ప్రత్యేకత.
హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో
సవాలు చేయాలని ఇందిర తీసుకున్న నిర్ణయాన్ని ఆనాడు ప్రతిపక్షాలన్నీ తీవ్రంగా వ్యతిరేకించాయి. నైతిక విలువలకు
కట్టుబడి ఆమె ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలని పట్టుబట్టాయి. ఈ సంఘర్షణ ఏ స్థాయికి
చేరిందంటే ప్రతిపక్షాలను కట్టడి చేయడానికి ఇందిరాగాంధి జూన్ ఇరవై అయిదో తేదీ బాగా పొద్దుపోయిన తర్వాత (ఇప్పటిలా ప్రసార సాధనాలు
అప్పట్లో లేని కారణంగా మారునాడు కానీ
ప్రజలకు ఈ విషయం తెలియలేదు) దేశంలో
మొట్టమొదటిసారి ఆంతరంగిక ఆత్యయిక పరిస్తితి విధించారు. దేశ వ్యాప్తంగా వందలాదిమంది ప్రతిపక్ష నాయకులను
కారాగారాల్లోకి నెట్టారు. పత్రికలపై
ఆంక్షలు విధించారు. స్వతంత్ర భారత దేశం తొలిసారి స్వేచ్చను కోల్పోయిన అనుభూతిని ఆ పరిణామాలు కలిగించాయి.
శ్రీమతి గాంధి ఒక పక్క తనను ఎదిరించిన వారిని రాజకీయంగా ఇబ్బందులకు గురిచేస్తూ, మరో పక్క అలహాబాదు
న్యాయస్థానం తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేస్తూ న్యాయ పోరాటం కూడా
సాగించారు. దరిమిలా, అయిదు నెలలు తిరగకుండానే
సుప్రీం కోర్టులో శ్రీమతి గాంధీకి
ఉపశమనం లభించింది. కింది కోర్టు తీర్పును సుప్రీం కొట్టివేసింది. తద్వారా శ్రీమతి
గాంధీ ప్రధానిగా యధాప్రకారం
కొనసాగడానికి న్యాయపరమైన చిక్కులు
తొలగిపోయాయి. అయినా ప్రతిపక్షాల ఆందోళన తగ్గలేదు.
విపక్షాలన్నీ ఒక్కటయ్యాయి. అనేక పార్టీలు జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలో
ఒక్కటై, జెండాలను, ఎజెండాలను పక్కనబెట్టి, ‘జనతా
పార్టీ ‘ అనే ఒకే పేరుతొ,
ఒకే ఎన్నికల గుర్తుతో తదుపరి సార్వత్రిక
ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి ప్రజాస్వామ్య స్పూర్తికి
విఘాతం కలిగించేవారిని ప్రజలు ఎప్పటికీ క్షమించరనే సత్యాన్ని రుజువు చేయగలిగాయి. అదేసమయంలో, బ్రహ్మాండమైన ప్రజల మద్దతు వుండికూడా, తమలో తాము కలహించుకుని,
భారత రాజకీయాల్లో ఒక చక్కటి ప్రయోగం విఫలం
కావడానికి ఆ రాజకీయ నాయకులే స్వయంగా కారణం
అయ్యారు. ప్రజాస్వామ్యం పట్ల ప్రజలకు వున్న ప్రగాఢమైన కాంక్ష కారణంగా ఇందిరాగాంధీ
పరాజయం పాలయింది. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా కేవలం అధికార వ్యామోహంతో, పరస్పర కుమ్ములాటలతో తామున్న
చెట్టు కొమ్మను తామే నరుక్కునే చందంగా వ్యవహరించే రాజకీయ కూటములను కూడా ప్రజలు ఏవగించుకుంటారని జనతా ప్రభుత్వ
పతనం నిరూపించింది.
ఈ
సుదీర్ఘమైన ‘పాతకాల స్మరణ’కు కారణం
లేకపోలేదు.
అప్పటికీ ఇప్పటికీ నడుమ నలభయ్ ఏళ్ళు
గడిచిపోయాయి. అప్పటి కధే కొద్ది తేడాతో నేడు
పునరావృత మైంది. పాత్రలు కూడా కొంచెం అటూ ఇటుగా తిరగబడ్డాయి.
ఆనాడు కాంగ్రెస్ పార్టీ నాయకురాలయిన ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా హైకోర్టు తీర్పు ఇస్తే ప్రతిపక్షాలన్నీ ఏకమై ఆమె
రాజీనామాకోసం పట్టుబట్టాయి. సుప్రీం కోర్టుకు అప్పీలు చేసుకోవడాన్ని తప్పుపట్టాయి.
ఈనాడు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రజలు
ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కాదని కేంద్రంలో వున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే
కూటమి, అప్రజాస్వామికంగా ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి
పాలన విధిస్తే అక్కడి హైకోర్టు దాన్ని
తప్పుబట్టి రద్దు చేసింది. పైగా ఈ
సందర్భంగా దేశం మొత్తానికి అనువర్తించే కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ప్రజలు
ఎండా వానా అని చూడకుండా పోలింగు కేంద్రాలకు వెళ్లి తమకు నచ్చిన ప్రభుత్వాలను
ఎన్నుకుంటుంటే, ఆ బలహీనుడు పెంచుకున్న
నమ్మకాన్ని ఇలా హరిస్తారా అని ప్రశ్నించింది. ఇటువంటి చర్యలు సామాన్యులకు వ్యవస్థ
పట్ల వుండే విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి.’ అని హెచ్చరించింది కూడా.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పదవి కోల్పోయిన కాంగ్రెస్ నాయకుడు
హరీష్ రావత్ హైకోర్టు తీర్పు వెలువడగానే తిరిగి ముఖ్యమంత్రిగా
బాధ్యతలు స్వీకరించారు. అయితే కొద్ది గంటల్లోనే పరిస్తితి మారిపోయింది. హైకోర్టు
తీర్పును సవాలు చేస్తూ, కేంద్రంలో మోడీ
నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం సుప్రీం
తలుపు తట్టింది. కొంచెం ఊరట కలిగించే
తీర్పు కాలయాపన లేకుండా అత్యున్నత న్యాయస్థానం నుంచి రావడంతో మోడీ సర్కారుకు ఒకింత ఉపశమనం లభించినట్లయింది. తాజా ముఖ్యమంత్రి
రావత్ అత్యల్ప స్వల్ప సమయంలోనే మళ్ళీ మాజీగా మారారు.
అయితే ఇక్కడ ప్రస్తావించుకోవాల్సింది,
చర్చించు కావాల్సింది వేరే విషయం. అది రాజకీయ పార్టీల అవకాశవాదం.
నాలుగు దశాబ్దాల నాడు, ఆనాడు జనసంఘం
రూపంలో వున్న బీజేపీకి ఏదైతే తప్పనిపించిందో, అదే ఆ పార్టీకి ఈనాడు
ఒప్పనిపిస్తోంది. అప్పుడు ప్రతిపక్షాలు యెంత ఒత్తిడి చేసినా రాజీనామా చేసేది లేదని
భీష్మించిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు బీజేపీ చేస్తున్నది పూర్తి అనైతికంగా
అనిపిస్తోంది.
రాజకీయంలో వున్న చమత్కారంగా దీన్ని
అర్ధం చేసుకోవాలా?
ఉపశ్రుతి:
భయాలు రకరకాలు. పిల్లి అంటే ఎలుకకు భయం.
మనిషికి ప్రాణ భయం. రాజకీయ నాయకులు మానవాతీతులు కదా! అధికారంలో వున్న వారికి ఒక్కటే భయం. ఎన్నికల్లో ఓడిపోతామేమో, పదవి పోతుందేమో అన్న భయం.
ఆ భయమే వారిచేత అనేక కాని పనులు
చేయిస్తుంటుంది.
(23-04-2016)
NOTE:
COURTESY KULDIP NAYAR & IMAGE OWNER