19, ఏప్రిల్ 2016, మంగళవారం

చంద్రబాబు నాయుడు @ 66 నాట్ అవుట్

సూటిగా.....సుతిమెత్తగా...... భండారు శ్రీనివాసరావు
(TO BE PUBLISHED IN "SURYA" TELUGU DAILY)
(ఏప్రిల్ 20, చంద్రబాబు జన్మదినం)
“ముఖ్యమంత్రి చంద్రబాబుకు మానవాతీత శక్తులేవో వున్నట్టున్నాయి. ఆయన ఒక కార్యక్రమం తరువాత మరొక కార్యక్రమానికి ఊపిరాడనివేగంతో పరుగులు పెడతారు. ఆయన వేగాన్ని అందుకోలేక మిగతావారు ఆపసోపాలు పడాల్సిందే” - టైమ్స్ ఆఫ్ ఇండియా (22-08-2002)
ఆ పత్రిక ఇది రాసి ఇప్పటికి పద్నాలుగు ఏళ్ళు గడిచాయి. కానీ పైకి పొగడ్త మాదిరిగా కనిపించే ఆ పత్రిక అభిప్రాయం తప్పని ఇప్పటికీ చెప్పలేని పరిస్తితి. అంతకంటే చాలా ఏళ్ళకు పూర్వం నుంచే ఒక విలేకరిగా ఆయన గురించి నాకున్న అభిప్రాయం కూడా అదే!
నాకు చంద్రబాబు నాయుడితో 1978 నుంచీ పరిచయం. ఆయన, మరో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి ఇద్దరూ ఒకేసారి ఎమ్మెల్యేలు అయి, శాసన సభలో అడుగుపెట్టారు. కాకపొతే చిన్న తేడా ఏమిటంటే డాక్టర్ రాజశేఖర రెడ్డి ముందుగా డాక్టర్ చెన్నారెడ్డి మంత్రివర్గంలో చేరారు. సుమారు రెండేళ్ళ తరువాత, రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వ మార్పిడిలో భాగంగా ఏర్పాటయిన అంజయ్య మంత్రివర్గంలో చంద్రబాబుకు సయితం చోటు దొరికింది. తదుపరి భవనం వెంకట్రాం, కోట్ల విజయభాస్కర రెడ్డి మంత్రివర్గాల్లో కూడా చంద్రబాబు క్యాబినెట్ హోదాలో పనిచేసారు.
1982 ఎన్టీఆర్ తెలుగుదేశం పేరుతొ ఏర్పాటు చేసిన ప్రాంతీయ పార్టీ యావత్ ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రనే తిరగరాసింది. అప్పటివరకు యువ కాంగ్రెస్ నాయకుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన చంద్రబాబునాయుడు, ఎన్నికల్లో ఓటమి ఎదురయిన కొంత కాలానికే తెలుగు దేశంలో చేరిపోవడం ఆయన రాజకీయ జీవితాన్నే గొప్ప మలుపు తిప్పింది. కాంగ్రెస్ లో కొనసాగివుంటే మంచి అవకాశాలకోసం ఎదురుచూస్తూ, ఆయన కూడా నలుగురిలో ఒకడిగా మిగిలివుండేవాడేమో.
టీడీపీ లో చేరిన తరువాత చాలా సంవత్సరాల పాటు చంద్రబాబు పార్టీ కార్యకలాపాలకే పరిమితం అయ్యారు. నేపధ్యంలో వుంటూనే ఒక నాయకుడిగా ఎదగడానికి అప్పటి ముఖ్యమంత్రి రామారావుతో ఆయనకు వున్న సాన్నిహిత్యం ఎంతగానో దోహదపడింది. ఈ అవకాశాన్ని ఆయన సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోగలిగారు.
పొతే టీడీపీ అధికారంలోకి వచ్చిన కొద్దికాలానికే నాదెండ్ల భాస్కర రావు కారణంగా రామారావు పదవీచ్యుతులు అయిన దరిమిలా ఉవ్వెత్తున ఎగసిన ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమ కాలంలో చంద్రబాబు వ్యవహార దక్షత తొలిసారి వెలుగులోకి వచ్చింది. ముఖ్యమంత్రి అల్లుడిగా కాకుండా లెక్కించదగిన వ్యక్తిత్వం ఆయనలో దాగున్న సంగతి బహిర్గతమైంది. పార్టీలో ఆయన స్థానం మరింత సుస్తిరమైంది. పార్టీ అధికారంలో వున్నప్పుడు ఆయనదే హవా. లేనప్పుడు ఆయనదే హవా. దాంతో రాజకీయంగా చంద్రబాబు పట్టింది బంగారమైంది.
రెండోసారి రామారావుపై జరిగిన తిరుగుబాటుకు చంద్రబాబే నాయకుడు కావడం మరో వైచిత్రి. రాజకీయాలకున్న రంగూ,రుచీ, వాసన ఎలాంటిదో దానితో లోకానికి వెల్లడయింది.
అప్పటివరకు పార్టీలో, ప్రభుత్వంలో రెండో స్థానంలో వున్న చంద్రబాబు మొదటిసారి మొదటి స్థానం లోకి వచ్చి వ్యవహారాలను సరిదిద్దాల్సిన పరిస్తితి ఏర్పడింది. ముఖ్యమంత్రికి సలహాలు ఇచ్చే పాత్రనుంచి ముఖ్యమంత్రి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం ఆషామాషీ కాదు. పైగా దెబ్బతిన్న బెబ్బులిలా పక్కనే ఎన్టీఆర్.
ఇక్కడే చంద్రబాబులోని అసలయిన రాజకీయ నాయకుడు బయటకు వచ్చాడు. ఎంతమాత్రం అనుకూలంగా లేని పరిస్తితులను క్రమంగా తన చేతిలోకి తీసుకోవడం మొదలు పెట్టారు. ఆకాశమంత ఎత్తున వున్న ఎన్టీఆర్ వ్యక్తిత్వం ముందు తాను వెలతెలా పోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్న తీరు చంద్రబాబు దక్షతకు అద్దం పట్టింది. తనలోని లోపాలను ముందుగా పసికట్టి వాటిని సరిదిద్దుకునే పనికి మొదటి ప్రాధాన్యం ఇచ్చారు. తెలుగునేల నాలుగు చెరగులా చంద్రబాబు పేరు తెలిసి వుండవచ్చుకానీ, గండిపేట పార్టీ ఆఫీసుకే పరిమితం అయిన ఆయన్ని జనం గుర్తుపట్టే పరిస్తితి లేదు. అందుకే ఆకాశవాణి, దూరదర్సన్ ల ద్వారా వారం వారం ప్రజలతో నేరుగా ముచ్చటించే కార్యక్రమానికి స్వీకారం చుట్టారు. వినూత్న పధకాలకు రూపకల్పన చేసేలా అధికారులను ప్రోత్సహించడం ప్రారంభించారు. చేసిన ప్రతి పనికీ పదింతలు ప్రచారం లభించేలా శ్రద్ధ తీసుకున్నారు. యోగా, వ్యక్తిత్వ వికాసం వంటి శిక్షణ తరగతుల్లో స్వయంగా పాల్గొని, ఏ అంశం పైన అయినా అనర్ఘలంగా ప్రసంగించే నిపుణత సాధించడానికి ఎంతో సాధన చేసారు. సమర్దులయిన, అత్యంత నమ్మకస్తులయిన అధికారుల బృందాన్ని ముఖ్యమంత్రి పేషీలో పెట్టుకుని పరిపాలన సాగించారు. రాష్ట్రంలో ఏమూల ఏం జరిగినా పత్రికల ద్వారా తెలుసుకుని అధికారులు వెళ్ళే లోగా అక్కడ ప్రత్యక్షం అయ్యేవారు. ఎక్కడో హైదరాబాదులో వుండే ముఖ్యమంత్రి, తమవాడిగా, తమలోని వాడిగా జనం మధ్య తిరుగాడడం అనేది వారికి అంతవరకూ అనుభవంలో లేని సరికొత్త అనుభూతి.
ప్రజల మనస్సుల్లో ప్రతిష్టితమై వున్న ఎన్టీ రామారావు స్మృతిని పార్టీ కార్యాలయానికి పరిమితం చేసి, పాలకుడిగా అయన ప్రజల్లోకి దూసుకుపోయిన వైనం ఆయనకు అపర చాణక్యుడు అనే కీర్తిని కట్టబెట్టింది.
సందర్భం కనుక ఇక్కడ ఓ మాట చెప్పుకోవాలి.
ఎన్టీఆర్, చంద్రబాబుల వ్యవహార శైలిపై ఓ సీనియర్ జర్నలిష్టు సహచరుడు ఉటంకించిన పోలిక ఇది.
“ఇద్దరూ తెలివైన వారే. ఒకరు ఏడాది మొత్తం కష్టపడి చదివి పాసవుతాడు. రెండో వాడు అలా కాదు, సినిమాలు చూస్తూ, షికార్లు చేస్తూ టీచర్లు చెప్పిన పాఠాలు ముక్కునపెట్టుకుని పరీక్షల్లో రాసి పాసయ్యే రకం.”
జర్నలిష్టు మిత్రుడి కవి హృదయం ఏమిటంటే, ఎన్టీఆర్ ఎన్నికలప్పుడు రంగంలోకి దిగి అహోరాత్రులు కష్టపడి విజయం సాధిస్తారు. చంద్రబాబు ఏడాది పొడుగునా శ్రమించి పరీక్షలు రాసి ఒడ్డున పడతారు.
ఎందుకంటే ఎన్టీఆర్ కి తన బలమేమిటో తెలుసు. చంద్రబాబుకు తన బలహీనత ఏమిటో తెలుసు.
1978 నుంచి యేదో కొద్ది కాలం మినహాయిస్తే చంద్రబాబు అధికారంలోనో, అధికార కేంద్రానికి అతిచేరువగానో లేదా ప్రతిపక్ష నేత హోదాలోనో ఇన్నేళ్ళుగా ఏదో ఒక అధికార పీఠంలో కొనసాగుతూ వస్తున్నారు. ఇంతటి సుదీర్ఘ అనుభవం కలిగిన సమకాలీన రాజకీయ నాయకుడు రాష్ట్రంలో మరొకరెవ్వరూ లేరు కూడా. ఇదొక అరుదయిన రికార్డు. అలా అని రాజకీయ జీవితంలో అసలు గడ్డు రోజులు ఎదుర్కోలేదని కాదు. రామారావు గారి హయాములోనే తెలుగు దేశం పార్టీ ఒక సారి ఓటమి చవి చూసి ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. చంద్రబాబు నేతృత్వంలో కూడా 2004 లో మరోసారి ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. రాజకీయ పార్టీలకి గెలుపు ఓటములు అతి సహజం. అయితే ఒక ప్రాంతీయ పార్టీ వరసగా రెండు మార్లు అధికారానికి దూరం అయితే తిరిగి కోలుకోవడం కష్టం. అలాంటి అరుదయిన విజయాన్ని కూడా చంద్రబాబు 2014 లో తన ఖాతాలో వేసుకోగలిగారు. ఒకరకంగా చెప్పాలంటే, చేజారినట్టు నమ్మకం కలిగిన తరువాత చేజిక్కిన అపూర్వ విజయం అది. అనేక ప్రతికూల పరిస్తితులు చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సమయంలో, రాష్ట్ర విభజన తదనంతర పరిణామాల నేపధ్యంలో కేవలం ఆయన సమర్ధత మీది నమ్మకంతోనే ప్రజలు, ఒక దశలో ఆశలు ఒదులుకున్న ఈ విజయాన్ని, అధికారాన్ని తిరిగి చంద్రబాబుకు అప్పగించారన్నది తిరుగులేని వాస్తవం. ప్రజల్లోని ఈ నమ్మకానికి తూట్లు పడ్డాయని చెప్పే పరిస్తితులు ఇప్పటికయితే లేవు కానీ ముందు ముందు తలెత్తకుండా చూసుకోవడం చాలా అవసరం.
చంద్రబాబు వ్యవహార శైలికి ఒక మచ్చు తునక.
ఆకాశవాణి, దూరదర్సన్ కేంద్రాలనుంచి వారం వారం ప్రతిసోమవారం ప్రత్యక్ష ప్రసారం ద్వారా నిర్వహించే ‘ప్రజలతో ముఖ్యమంత్రి’ కార్యక్రమానికి రేడియో విలేకరిగా నేనూ ప్రతిసారీ వెడుతుండేవాడిని. ఆ రోజుల్లో ప్రూడెన్షియల్ సహకార బ్యాంకు ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయింది. అందులో తమ కష్టార్జితాన్ని దాచుకున్న వాళ్ళు బాగా దెబ్బతిన్నారు. ఒక సోమవారం నాడు ముఖ్యమంత్రి ఆ కార్యక్రమంలో ప్రజల సమస్యలకు జవాబు చెబుతున్నప్పుడు ఆ బ్యాంకు బాధితుడు ఒకరు లైన్లోకి వచ్చి తన ఆవేదనను కాస్త ఘాటయిన రీతిలోనే ముఖ్యమంత్రికి ఎరుకబరిచాడు. చంద్రబాబు ఆయన చెప్పినదంతా ఓపిగ్గా విని, మరునాడు వచ్చి తనను కలుసుకోవాల్సిందని సూచించారు. కార్యక్రమం అవగానే సీ.ఎం. కార్యాలయ ఉన్నతాధికారులు, సహకారశాఖ ఉన్నతాధికారులు, ప్రూడెన్షియల్ బ్యాంకుకు ప్రభుత్వం నియమించిన చైర్మన్ తో సమావేశమై పరిష్కార మార్గాలను గురించి చర్చించారు. మరుసటి రోజు ఉదయం ఆ బాధితుడు కూడా మరికొందరిని వెంటబెట్టుకుని సీఎం నివాసానికి చేరుకున్నాడు. అక్కడే పలుదఫాలుగా చర్చలు జరిగాయి. సమస్యల పరిష్కార మార్గాల అన్వేషణలో బాధితుల అభిప్రాయాలు కూడా చెల్లుబాటు అయ్యేందుకు వీలుగా, వారి ప్రతినిధులుగా ఇద్దరిని బ్యాంకు డైరెక్టర్లుగా తీసుకోవాలని అప్పటికక్కడే నిర్ణయం తీసుకున్నారు. సీఎం ని కలవడానికి వచ్చిన వాళ్ళు సంతృప్తిగా వెనుతిరిగారు.
జర్నలిష్టుగా చురుగ్గా పనిచేస్తున్న రోజుల్లో నాకు తెలిసిన చంద్రబాబు వ్యవహార శైలికీ ఇప్పటికీ పోలిక లేదన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. అయితే అప్పటికీ, ఇప్పటికీ రాజకీయాల రంగూ, రుచీ పూర్తిగా మారిపోయిన మాట కూడా వాస్తవమే. రాజకీయ అనివార్యతలు కొంతమంది సమర్ధులచేత కూడా, కూడని పనులు చేయిస్తుంటాయి. ఒడ్డున కూర్చుని చెప్పేవారి నీతులు వారికి పొసగక పోవచ్చు. పీత ఇబ్బందులు పీతవి. అలా అని అసాధారణ వ్యక్తిత్వం వున్న వాళ్ళు కూడా సాధారణ వ్యక్తుల మాదిరిగా ఆలోచనలు చేస్తుంటే. ఎలాటి స్వార్ధ ప్రయోజనాలు ఆశించకుండా వారిని అభిమానించేవారి మనసుకు కష్టంగానే వుంటుంది.
చంద్రబాబుకు నిజమైన అభిమానులు అనేకమంది వున్నారు. ప్రతిఫలం గురించి ఆలోచించకుండా, కేవలం రాష్ట్ర ప్రయోజనాలు లేదా పార్టీ ప్రయోజనాల కోసం ఆయన్ని అభిమానించే వాళ్ళు కోకొల్లలుగా సాంఘిక మాధ్యమాల్లో తారసిల్లుతుంటారు. అందులో ఒకడు సత్యసాయి.
కృష్ణా జిల్లాకు చెందిన సత్య సాయికి మొదటి నుంచి స్వగ్రామం అంటే మక్కువ ఎక్కువ. ఇక చంద్రబాబు అంటే అతడికున్న అభిమానాన్ని ఎంచడానికి కొలమానం లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే రూపకల్పన చేసిన స్మార్ట్ విలేజ్ పధకం విదేశీ వాలంటీర్లలో సత్యసాయి ఒకడు. వత్సవాయి మండలం ఎమ్మార్వో ప్రతి గురువారం ఉదయమే ఆ గ్రామానికి వెళ్లి సాయంత్రం దాకా వుండి సంక్షేమ కార్యక్రమాల అమలును పర్యవేక్షిస్తుంటారు. ఎమ్మార్వో వద్ద ప్రభుత్వం ఇచ్చిన ల్యాప్ టాప్ వుంది. దాని సాయంతో ఇంగ్లండులో వుంటున్న సత్యసాయి ఎమ్మార్వోతో నెట్ కనెక్షన్ పెట్టుకుని అన్ని సంగతులు ఆరా తీస్తుంటాడు. ఆ అధికారి కూడా అతడు ఏది అడిగినా కాదనకుండా అన్ని సంగతులు చెబుతుంటాడు. దానికి కారణం వుంది. వూళ్ళో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా అతడు ఎంతో కొంత ఆర్ధిక సాయం చేస్తుంటాడు. వూళ్ళో అతను చదువుకున్న స్కూల్లో మగపిల్లలకు, ఆడపిల్లలకు ప్రభుత్వం పూనుకుని వేర్వేరుగా మరుగుదొడ్లు కట్టించింది. లావెట్రీలు అయితే కట్టించారు కానీ వాటిని రోజువారీగా పరిశుభ్రం చేసేవాళ్ళు లేరు. పేరుకు ఒక మనిషిని పెట్టారు. కానీ అతడు మండలం మొత్తంలోని అన్ని గ్రామాలను చూసుకోవాలి. పైగా అతడికి ఇచ్చే భత్యం కూడా అతి స్వల్పం. దీనికి తోడు అయిదారు మాసాలకోసారి చెల్లింపులు. అంచేత అతడిని గట్టిగా నిలదీసి అడగలేని పరిస్తితి. అలాగే గ్రామంలో ఇతర సంక్షేమ పధకాలు. నిధుల విడుదలలో జాప్యం కారణంగా ఏపనీ సకాలంలో పూర్తవడం లేదని సత్యసాయికి అర్ధం అయింది. ముఖ్యమంత్రి మీద వున్న అభిమానంతో అతడే స్వయంగా పూనుకొని ఓ పరిష్కారాన్ని అధికారులకు వీడియో కాన్ఫరెన్సులో వివరించాడు. డబ్బుకోసం పనులు ఆపవద్దనీ, అవసరమైన మొత్తం ఎంతో తెలియచేస్తే తాను సర్దుబాటు చేస్తాననీ, నిధులు విడుదల అయినప్పుడు తనకు తిరిగి ఇచ్చే విషయం ఆలోచించుకోవచ్చనీ వారికి చెప్పాడు. నిజంగా ఇది ఎంతో మంచి ఆలోచన. నిధులు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాకుండా ఇతర ఎన్నారై శ్రీమంతులు కూడా ఈ విధమైన డబ్బు సర్దుబాటు కార్యక్రమానికి పూనుకుంటే ఏ మంచి పధకం కూడా నిధుల కొరత పేరుతొ అరకొరగా మిగిలిపోదు.
ముఖ్యమంత్రి, అధికార సిబ్బంది చిత్తశుద్దితో పనిచేస్తున్నా కూడా ఆచరణలో ఎదురయ్యే ఇబ్బందులను ఎలా అధిగ మించవచ్చన్నది సత్యసాయి అనుభవం తెలియచేస్తోంది.
ఇదంతా ఎందుకంటే తెలియకుండా చంద్రబాబు పోగేసుకున్న అభిమాన సంపద గురించి చెప్పడానికి.
ఆయనకి చుట్టూ వున్న వందిమాగధుల్లో అవసరార్ధం ఉన్నవాళ్ళే ఎక్కువని చెప్పుకోవడం కద్దు. అవసరం తీరగానే, లేదా ఆయనతో అవసరం పడదనో నిశ్చయించుకున్న మరుక్షణమే వాళ్ళు అక్కడ నుంచి బిచాణా ఎత్తేస్తారు. పార్టీలో నమ్ముకున్నవారిని ఎందర్నో కాదని, రాజ్యసభ వంటి పదవులు ఆయన ఎందరికో కట్టబెట్టారు. వారిలో చాలామంది ఈనాడు చంద్రబాబు వెంటలేరన్నది బహిరంగ రహస్యం.
రాజకీయాలు గురించీ, అవి ఎలా వుండాలి అనే అంశం గురించీ ఒకప్పుడు చంద్రబాబు స్వయంగా చెప్పిన మాటలు గుర్తుచేసుకోవడం అప్రస్తుతం కాదనుకుంటాను.
2003 అక్టోబర్ ఒకటో తేదీన చంద్రబాబు జీవితంలో ఒక దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. ఆయన అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. బ్రహ్మోత్సవాల సమయంలో వెంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుమల వెడుతున్నారు. ఘాట్ రోడ్డులో అలిపిరి దాటగానే నక్సలైట్లు పెట్టిన మందు పాతర పేలి ఆయన ప్రయాణిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ కారు ( ఏ.పి. 9 పి. 3026) ఇరవై అడుగుల దూరానికి ఎగిసిపడి, ఓరాళ్ళ గుట్టకు కొట్టుకుని పల్టీ కొట్టింది. కారు తుక్కు తుక్కయి పోయింది. ముఖ్యమంత్రితో పాటు అదే కారులో వున్న మంత్రి బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి, ఎమ్మెల్యే చదలవాడ కృష్ణ మూర్తి, మరో ఎమ్మెల్యే రెడ్డివారి రాజశేఖరరెడ్డి ప్రభ్రుతులు ఏం జరుగుతున్నదో తెలియని షాక్ కి గురయ్యారు. గాయపడి రక్తసిక్తమైన దుస్తులతో వున్న వారినందరినీ భద్రతా సిబ్బంది అతికష్టం మీద బయటకు తీసి స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. కారు దెబ్బతిన్న తీరు టీవీల్లో చూసిన వారెవ్వరూ కారులోని వారు బతికి బట్టకడతారని ఊహించి వుండరు. బుల్లెట్ ప్రూఫ్ వాహనం కాబట్టి ప్రాణాపాయం తప్పింది. ఒకరకంగా వారికి పునర్జన్మ.
హైదరాబాదు చేరిన తరువాత పరామర్శల పరంపర. రాష్ట్రపతి అబ్దుల్ కలాం స్వయంగా వచ్చి ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లి చంద్రబాబుని పరామర్శించారు. ఇక ఇంటాబయటా మీడియా ఇంటర్వ్యూలకు కొదవలేదు. ఆరోజుల్లో తనని కలవడానికి వచ్చిన ఆత్మీయులతో చంద్రబాబు తన మనస్సులోని మాటలను పంచుకున్నారు. అది తెలియచేయడానికే ఇంతటి సుదీర్ఘ వివరణ.
ఆ నాటి బాబు మనసులోని భావాలను ప్రముఖ జర్నలిష్టు ఐ.వెంకటరావు, చంద్రబాబుపై తాను రాసిన ‘ఒక్కడు’ అనే గ్రంధంలో ఇలా పేర్కొన్నారు.
“ఇంతకాలంగా నేను రాజకీయ నాయకుడిగా వున్నాను. ఇంకెంత కాలం ముఖ్యమంత్రిగా వున్నా, ఏదో ఒక నాటికి మాజీ ముఖ్యమంత్రిని కాకతప్పదు. ఈ రోజు నాకు మరో అవకాశం వచ్చింది. ఇది నాకు రెండవ జన్మ వంటిది. అందుకే దానిని మంచికి ఉపయోగించాలని అనుకుంటున్నాను. మంచి వాళ్ళనే దగ్గరకు తీసుకోవాలని అనుకుంటున్నాను. ఇన్నేళ్ళుగా రాజకీయ నాయకుడి(పొలిటీషియన్)గా వ్యవహరించాను. ఇక ముందు రాజనీతిజ్ఞుడి(స్టేట్స్ మన్ )గా మారాలనుకుంటున్నాను”
అలిపిరి సంఘటన తరువాత కొన్ని నెలలకే చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి పదవికి దూరం అయి దాదాపు పది సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగారు. రాష్ట్ర విభజన తదనంతరం ఆయన విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు.
అప్పటికీ ఇప్పటికీ పరిస్తితులు ఎంతో మారిపోయాయి. ఆ రోజుల్లో పదవిలో కుదురుకోవడం తప్ప వేరే సమస్యలు లేవు.
ఇప్పుడలా కాదు. చుట్టూ సమస్యలు, మధ్యలో చంద్రబాబు.
సమస్యలను అవకాశాలుగా మార్చుకోవాలని ఆయన తరచూ చెబుతుంటారు. సమస్యల నడుమ వున్న చంద్రబాబుకు ఇప్పుడా అవకాశం ఆయన ఎదుటే వుంది.
సమర్ధత ప్రాతిపదికగా ప్రజలు తనకు కట్టబెట్టిన ప్రజల నమ్మకం వమ్ముకాకుండా చూసుకోవడానికి చంద్రబాబుకి మిగిలిన ఏకైక వనరు కూడా ఆ సమర్ధతే. మిగిలిన వనరులకు దారులు మూసుకు పోతున్నట్టు కానవస్తున్న ఈ తరుణంలో ఆయన తన సమర్ధతను నిరూపించుకోవాల్సిన అగత్యం ఆయనకే ఎక్కువగా వుంది.
ప్రస్తుతం విభజిత ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్రంలో రాజకీయ పరిస్తితులను, పరిణామాలను పరిశీలించే వారికి నిరాశ కలుగుతోంది. నిజానికి కొత్త రాష్ట్రానికి ఇప్పుడు రాజకీయ నాయకుల అవసరం లేదు. రాజనీతిజ్ఞుల కొరత బాగా వుంది. కొరతగా వుండడం కాదు అసలిప్పుడు అలాంటివాళ్ళు ఎవళ్ళూ లేరు అంటే వాస్తవానికి దగ్గరగా ఉంటుందేమో!
66 ఏళ్ళ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ, ఆనాటి ఆయన మాటను ఈవిధంగా ఓసారి గుర్తుచేస్తున్నాను.
ఉపశృతి: పునరుక్తి దోషం అయినా సందర్భం కాబట్టి మరో మారు గుర్తు చెయ్యక తప్పదు.
మా ఇంట్లో పనిచేస్తున్న వాచ్ మన్ కుటుంబం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చింది. వాళ్ళ ఓట్లు మాత్రం స్వగ్రామంలోనే వున్నాయి.
టీవీ తెరపై చంద్రబాబును చూడగానే మా పనిమనిషి కళావతి మోహంలో చెప్పలేని ఆనందం.
‘బాబుగారు దేవుడండీ. ఇవ్వాళే మా సర్పంచు గారు ఫోను చేసి చెప్పారు. మాకు పక్కా ఇళ్ళు శాంక్షన్ చేసారట’ అని మా ఆవిడతో చెబుతోంది.
పార్టీ మారి పదవి పుచ్చుకోబోతున్న రాజకీయ నాయకుడి మోహంలో కూడా ఇంతటి సంతోషం కానరాలేదు.
నిజానికి నిజమైన రాజకీయ పార్టీలకి నిజమైన బలం కళావతి వంటి సామాన్య ఓటర్లే. అటువంటి వారి అభిమానం ఉన్నంతకాలం జంప్ జిలానీలతో పనియేల?
సూటిగా అనుకున్నా....సుతిమెత్తగా అనుకున్నా.. చివరగా చెప్పే మాట ఇదొక్కటే! (19-04-2016)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595 

కింది చిత్రం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు స్కూటర్ ప్రమాదంలో కాలు విరగ్గొట్టుకుని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాను. లోకసభ మధ్యంతర ఎన్నికల ప్రచారంలో మునిగితేలుతూ కూడా వీలు చేసుకుని ఆసుపత్రికి వచ్చి నన్ను పరామర్శించినప్పటి అపురూప జ్ఞాపక చిత్రం.


10 కామెంట్‌లు:

Jai Gottimukkala చెప్పారు...

మీడియాలో ప్రచారం చేయించుకోవడంలో చంద్రబాబు దిట్ట. స్వతంత్రులమని చెప్పుకునే వారితో కూడా భజన చేయించుకోవడంలో ఆయనకు ఆయనే సాటి అని మరో సారి రుజువు అయింది!

అజ్ఞాత చెప్పారు...

గొట్టిముక్కలా,
ఎవరి సంగతో నీకెందుకుగానీ, నీ బుద్ది మాత్రం జగమెరిగిందే. వాగింది చాలు తీ పొయ్యి దొరగారి మనవడి బూట్లు పాలీష్ సంతతేదో చూడాలంట పిలుస్తురు ఉరుకు సోల్లాపి.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

ఎవరేమనుకున్నా సరే! -
అవకాశాలు రాని సమర్దులకన్నా, అవకాశాలు వచ్చిన అసమర్ధులకు మంచి పేరు వచ్చే రోజులివి. ఈ రెండో రకానికి చెందిన నేను ఆ రకంగా మా సీనియర్ల కంటే అదృష్టవంతుడిని. రిటైర్ అయిన తరువాత కూడా యేవో మనసులోని మాటలు వ్యాసాల రూపంలో రాసుకోగల బంగారు అవకాశం సాంఘిక మాధ్యమాల రూపంలో నాకు లభించింది.
వెనుకటి రోజుల్లో పత్రికలకు వ్యాసాలూ అవీ రాయడం గగనంగా వుండేది. ముందు రాయాలి. రాసింది మళ్ళీ సాఫు చేసుకుని తిరగ రాయాలి. రాసింది ‘తిరుగు టపాకు తగినన్ని స్టాంపులు జతచేసి’ మరీ పోస్టులో పంపాలి. అది చేరిందో లేదో తెలవదు. చేరినా చేరిందనే కబురు తెలవదు. ఆశ ఒదులుకున్న తరువాత ఎక్కడి నుంచో ఓ మిత్రుడు పోస్ట్ కార్డు రాసి పడేస్తాడు, ‘పలానా పత్రికలో మీ వ్యాసం చదివానని’. ఆ రచన పడ్డ పత్రిక వెతికి పట్టుకోవడానికి నానా ఇబ్బందులు పడాల్సివచ్చేది.
ఇప్పుడలా కాదు. అంతా ఇన్ స్థంట్ కాఫీ మాదిరి. ఇలా రాసి అలా పోస్ట్ చేయడం తరువాయి బాగుందనో, బాగాలేదనో కామెంట్లు కూడా తయారు. కొందరయితే శ్రద్ధగా చదివి తప్పొప్పులను ఎత్తి చూపెడతారు. సరిదిద్దుకునే సదవకాశం కూడా వుంటుంది. అందుకే నేను పత్రికలకోసం రాసినప్పుడు, వారికి ఇష్టం వున్నా లేకపోయినా ఒక రోజు ముందే వాటిని ఫేస్ బుక్, బ్లాగు వంటి మాధ్యమాల్లో పోస్ట్ చేస్తాను. యెంత జాగ్రత్తగా రాసినా కొన్ని స్ఖాలిత్యాలు దొర్లడం కద్దు. వాటిని ఎంచక్కా దిద్దుకోవచ్చు. అదీ నా స్వార్ధం.
కాకపోతే ఇందులో కూడా కొన్ని ఇబ్బందులు లేకపోలేదు. పత్రికల్లో రాసినప్పుడు ఎవరికయినా నచ్చకపోయినా ఆ విషయం మనకు తెలిసేనాటికి చాలా రోజులు పడుతుంది. ఇక్కడ అలా కాదు, వెంటనే, మొట్టి కాయలు ఎలాంటి మొహమాటం లేకుండా వేసేస్తారు.
ఇన్నేళ్ళ వయస్సులో అవన్నీ పట్టించుకుంటే కష్టం. అందుకే ఎవరి ఇష్టం కోసమో కాకుండా నా ఇష్ట ప్రకారమే రాసుకుంటూ పోతుంటాను.
పాత జోకు ఒకటి వుంది కదా!
దుకాణం బయట రాసి వుంటుంది.
“మీరు అరువు అడుగుతారు. నేను ఇస్తాను. మీరు తిరిగి డబ్బు కట్టరు. చివరికి నేను బాధ పడతాను.
“మీరు అడుగుతారు. నేను ఇవ్వను. ఇవ్వలేదని మీరు బాధపడతారు.
“నేను బాధ పడడం కంటే మీరు బాధ పడడమే మేలు కదా!”
అల్లాగే ఇక్కడ కూడా. మీకు నచ్చాలని నాకు నచ్చనివి నేను రాయను.

మీరు ఏమనుకున్నా సరే!

అజ్ఞాత చెప్పారు...

మీరు నొప్పించకుండా "కూడదు" అని చెప్పడం బావుంది. మొదట్లో మొహమాటలున్న, ఒక స్తాయికి చేరిన తర్వాత వాటి అవసరం లేదనుకొంటా. ఇప్పుడింకా మీ తృప్తి కోసమే కాని, డబ్బులకో మరో దానికో వ్రాసే అవసరం లేదని నాకనిపిస్తోంది. ముఖ్యంగా మర్యాద పూర్వకంగా విషయాన్ని చెప్పాలని అనుకొన్నపుడు.

Surya Mahavrata చెప్పారు...

"స్వతంత్రులమని చెప్పుకొనేవారు" ఎవరినీ మెచ్చుకోకూడదని లేదుకదండీ.

అజ్ఞాత చెప్పారు...

ఎవరినీ మెచ్చుకోకూడదని కాదండీ. కాకపోతే ఎవరైనా ఎంటీఆర్‍నిగానీ, చంద్రబాబునిగానీ ఏ కారణానికైనా మెచ్చుకుంటే జై గొట్టిముక్కలగారికి ఒళ్ళంతా చాలా కంపరంగా ఉంటుంది. మీ దగ్గర నీటికొరత లేకపోతే రాత్రి మరోసారి స్నానం చేయండి సార్ తగ్గుతుంది.

Jai Gottimukkala చెప్పారు...

@Surya:

ఎవరయినా ఎవరినయినా మెచ్చుకోవొచ్చు భజన కూడా చేయవచ్చు. అయితే "స్వతంత్రులతో" భజన చేయించుకోవడం అందరికీ సాధ్యం కాదు. వర్తమాన రాజకీయాలలో ఈ కళను చంద్రబాబు సాధన చేసినంతగా ఇంకెవరూ చేయలేదు.

నేను చంద్రబాబును విమర్శించాననే అపోహలో వారి అభిమానులు ఉన్నట్టుంది. నేను ఆయనను మెచ్చుకున్నానండీ బాబూ!

అజ్ఞాత చెప్పారు...

ఏందీ గొట్టిముక్కలా ఈ సన్నాసి తెలివితేటలన్నీ దొర ఫార్మ్ హౌస్ కాడ నేర్చినయ్యే !!! పొయ్యి దొరతాన ఏడ్వ్ నకరాలన్నీ పైసలేమన్నా రాల్తాయి ఏరుకుందువు.
గౌ గానీ దొర భజనలో మాత్రం నీకన్నా మస్తు expereince సంపాదించినావ్ లే.

అజ్ఞాత చెప్పారు...

అజ్ఞాత అజ్ఞాత, 20 ఏప్రిల్, 2016 1:25 [PM]

అనోనిమస్సూ ఈ ఏడుపు ఎక్కడ నేర్చినవ్ ! బాబుగారికి డాక్టరేట్ ఇస్తామని మూసేసిన కాలేజీల్లో గాని నేర్సుకున్నవా లేక బాబుగారి సింగపూరు హోటలులో బిల్ల బంట్రోతు దగ్గర నేర్సినవా? అయినా మొన్న 420 పుట్టిన రోజు మస్తుగా తాగినట్టున్నావ్ కిక్కు దిగినట్టులేదు నీకింకా !!

అజ్ఞాత చెప్పారు...

అజ్ఞాత, 7 మే, 2016 7:40 [PM]

కాదురా దొంగనా గుట్లే నీ దొర కట్టించిన హుస్సేన్ సాగర్ చూట్టూ ఉన్న స్కై టవర్ లో కూకోని, బుల్లి దొర సెక్రటేరియట్ కొచ్చి చెప్పిన పాఠాలు ఇని రాసినా. ఒరేయ్ కుక్కా నీకింకా దొర బాత్రూంలో తాగిన ద్రావణం మత్తు దిగినట్లులే కూసింత మొకం కడుక్కురా సన్నాసి.