22, ఏప్రిల్ 2016, శుక్రవారం

చంద్రహారం


మా  వూరికి  నాలుగు మైళ్ళ  దూరంలో వున్న వూళ్ళో ఒక  టూరింగు టాకీసు వుండేది. దాంట్లోకి చంద్రహారం సినిమా వచ్చినట్టు  ఆ ఉదయం మా వూళ్ళో దండోరా వేసారు. దండోరా అంటే ఒక ఎడ్లబండికి  రెండువైపులా సినిమా పోస్టర్లు తగిలించేవాళ్ళు. అందులో ఓ ముసలాయన కూర్చుని మైకులో సినిమా గురించి చెబుతుండేవాడు. బండిలోనుంచి కరపత్రాలు విసిరేస్తే అవి పట్టుకోవడానికి కుర్రవాళ్ళం నానా తంటాలు పడేవాళ్ళం. ఎన్టీఆర్  నటించిన అ సినిమా ఎల్లాగయినా చూడాలని మా అమ్మ వెంట పడ్డాం. నాన్న చనిపోవడంతో ఆమెకు మేమంటే ప్రాణం. కానీ ఆమెకు డబ్బు వ్యవహారాలు ఏమీ తెలవ్వు. అన్నీ  మా బామ్మే చూసుకునేది. కాళ్ళు ఒత్తిందో, నడుం నెప్పికి అమృతాంజనం రాసిందో ఏం చేసిందో కాని మడి బీరువాలో దాచిపెట్టిన చిల్లర డబ్బుల్లోనుంచి మూడు పావలాలు అడిగి తీసుకుని రెండు  మా మూడో అన్నయ్య చేతిలో పెట్టింది. ఇంకో పావలా నాకిచ్చి సినిమా మధ్యలో ఏదైనా కొనుక్కోమని చెప్పింది. మాతో పాటు మరో నలుగురు  సావాసగాళ్ళు రావడానికి తయారయ్యారు.  పొలాల గట్ల మీద నడుచుకుంటూ వెడుతుంటే అక్కడక్కడ ఎండ్రకాయల బొరియలు కనబడేవి. మేము ఊరు పొలిమేరలకు చేరగానే సినిమాహాలువాడు  వేసే పాట మైకులో  వినిపించింది. మొదటి ఆటకు సినిమా టిక్కెట్లు అమ్మడం మొదలు పెట్టడానికి ముందు ఊరంతా వినిపించేటట్టు పాటలు వేసేవాళ్ళు.సరే!  నేల క్లాసు పావలా టిక్కెట్టు కొనుక్కుని హాల్లోకి వెళ్ళాము. జనం బాగానే వున్నారు. మధ్యలో చోటుచూసుకుని కూర్చున్నాము. పైన డేరాకున్న చిల్లుల్లో నుంచి ఆకాశం కనబడుతోంది. కొనుక్కున్న కట్టె మిఠాయి తింటూ వుండగానే సినిమా మొదలయింది. ఫిలిమ్స్ డివిజన్ వారి చిత్రంలో నెహ్రూ గారు కనబడగానే హాలు మొత్తం కేరింతలు. రామారావు సినిమా అని ఎగబడి వెళ్ళాము కానీ,  అసలు సినిమా మాకెవ్వరికీ అంత నచ్చలేదు.
తిరిగివచ్చేటప్పుడు చూడాలి, వెన్నెల వెలుతుర్లో కనిపించే ఎండ్ర కాయ బొరియలు ఎంతో భయపెట్టాయి. వచ్చేటప్పుడు ఒక తాడు తెచ్చుకున్నాము, ఆరుగురం ఆ తాడు పట్టుకుని వరసగా నడవడానికి. ఎవ్వరూ తప్పిపోకుండా ఆ ఏర్పాటు. చిన్నవాడినని నన్ను మధ్యలో నడవమన్నారు. సినిమా ఏమో కాని ఇంటికి చేరేవరకు లోపల  బితుకు బితుకుమంటూనే వుంది.
ఈరోజు ఏదో ఛానల్లో చంద్రహారం చిత్రం వస్తుంటే ఈ పాత సంగతులు గుర్తుకు వచ్చాయి.

(22-04-2016) 

NOTE: COURTESY IMAGE OWNER        

1 కామెంట్‌:

శ్యామలీయం చెప్పారు...

చంద్రహారం సినిమా ఈరోజున కాబోలు ఈటీవీవారి సినిమా ఛానెల్‌లో వచ్చింది. ఈ సినిమా ప్రీవ్యూ చూసి ప్రముఖ దర్శకులొకాయన పెదవి విరచారట. సగంపైగా సినిమాలో హీరో సుబ్బరంగా నిద్దరోతుంటే ఎలా ఆడుతుందయ్యా అని విసుక్కున్నారట.