18, ఏప్రిల్ 2016, సోమవారం

పాత చంద్రబాబు కావాలి



(ఏప్రిల్ ఇరవై, బుధవారం  చంద్రబాబునాయుడు జన్మదినం)


ఆంధ్రప్రదేశ్ పదమూడు జిల్లాల్లో ప్రముఖ మీడియా సంస్థ సీఎమ్ఎస్, చంద్రబాబు రెండేళ్ళ  పాలనపై సర్వే చేసి తాజాగా ఆ ఫలితాలను విడుదల చేసింది. ఆ సంస్థకు వున్న విశ్వసనీయతను గమనంలో పెట్టుకుంటే, ఏప్రిల్ ఇరవయ్యో తేదీన అరవయ్యారవఏట అడుగిడుతున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఇది ఘనమైన జన్మదిన కానుక. అంతే కాదు, సర్వేలో పాల్గొన్న ప్రజల్లో మూడింట రెండు వంతుల మంది చంద్రబాబుకు రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయం లేదనడం మరో అద్భుతమైన ప్రశంస. పుట్టినరోజు నాడు అందాల్సిన చక్కని మెచ్చుకోళ్ళు ఆయనకి ఒకింత ముందుగానే దక్కాయి.       
అరవై ఆరేళ్ళు, అందులో ముప్పయి ఎనిమిదేళ్ళు ప్రజాజీవితం. మంత్రిగా రెండు దఫాలుగా రెండున్నర సంవత్సరాలు, మూడు సార్లు  ముఖ్యమంత్రిగా  ఇంచుమించుగా పదకొండేళ్ళు, ఇక ప్రతిపక్ష నాయకుడిగా పదేళ్ళు- వెరసి  1956 నుంచి ఇప్పటివరకు సుదీర్ఘ అనుభవంలో ఆయనతో పోల్చతగ్గ సీనియర్ నాయకుడు మరొకడు లేడు.
నారా చంద్రబాబు నాయుడు అంటే ఇంటాబయటా పదుగురికి పరిచయం అయిన పేరు. ఎప్పుడో చాలా ఏళ్ళక్రితం బ్రహ్మకుమారీల ఆహ్వానం మేరకు రాజస్థాన్ లోని మౌంట్ అబూ వెళ్ళినప్పుడు అక్కడి ఓ  టాక్సీ  డ్రైవర్ నోట చంద్రబాబు పేరు వినపడ్డప్పుడు ఎంతో ఆశ్చర్యం వేసింది. భాష పూర్తిగా తెలవకపోయినా అతడి భావం బాగా అర్ధం అయింది. చంద్రబాబు వంటి వ్యక్తి తమ  రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వస్తే ఎంతో బాగుంటుందని, రాష్ట్రం  బాగుపడుతుందని అతడి మాటల తాత్పర్యం. ఇల్లా వెలిగిపోతుండేది పరాయి రాష్ట్రాల్లో ఆయన ప్రభ. ఇతర రాష్ట్రాల్లో రైళ్ళలో ప్రయాణిస్తున్నప్పుడు తెలుగు వాళ్ళం అని తెలియగానే అక్కడి వాళ్ళు అడిగే మొదటి ప్రశ్న ‘బాబు కైసా హై?’ ఆయన్ని అంతగా తమలో కలుపుకునేవాళ్ళు. ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడికి వేరే చోట్ల ఇటువంటి ప్రజాదరణ దొరకడం అపూర్వం అనే చెప్పాలి.   విదేశాల్లో సంగతి చెప్పక్కర లేదు. ప్రవాసాంధ్రులకు మన దగ్గర ఓటు హక్కు కల్పిస్తే రాష్ట్రానికి ఆయనే శాస్వితంగా ముఖ్యమంత్రి అని చెప్పుకోగా నేను విన్నాను.
నాకాయన 1980 నుంచి పరిచయం. అప్పుడే ఆయన ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగు పెట్టారు. నేను రేడియో విలేకరిగా చేరి అప్పటికి  మూడేళ్ళు. ఇందిరాగాంధి  ప్రభంజనంలో గెలిచివచ్చిన ప్రజాప్రతినిధుల్లో చాలామంది చంద్రబాబు వంటి చిన్న వయస్కులే. ఒకరకంగా చెప్పాలంటే యువరక్తం రాజకీయ రంగప్రవేశం చేసింది. వై.ఎస్. రాజశేఖర రెడ్డి , చంద్రబాబు అత్యంత సన్నిహితంగా మెలిగిన రోజులు ఒక విలేకరిగా నాకు తెలుసు.
కాంగ్రెస్ నుంచి తప్పుకుని తెలుగుదేశం పార్టీలో చేరడం ఆయన రాజకీయ జీవితంలో పెద్ద మలుపు. కాంగ్రెస్ లో కొనసాగి వుంటే ఈ స్థాయికి చేరడానికి ఇంకా ఎన్నేళ్ళు పట్టేదో ఊహాతీతం. ప్రజల మనిషిగా వున్న ఎన్టీఆర్ ని, ఆయనతో వున్న సాన్నిహిత్యంతో   రాజకీయంగా కూడా   ఒక బలవత్తరమైన శక్తిగా మలచడంలో చంద్రబాబు పాత్ర కీలకం. అదే సమయంలో పార్టీ మీద పట్టు పెంచుకోవడానికి కూడా చంద్రబాబు అ అవకాశాన్ని సమర్ధవంతంగా ఉపయోగించుకున్నారనే చెప్పాలి. ఆయనలోని రాజకీయ కుశలత వెలుగులోకి రావడానికి తెలుగు దేశం పార్టీలో ఆయన నిర్వహించిన పాత్రలు తోడ్పడ్డాయి. ఎక్కడో గండిపేట కార్యాలయంలో ఏసీ సౌకర్యం కూడా లేని ఒక చిన్నగదిలో కూర్చుని పార్టీ వ్యవహారాలు పర్యవేక్షించడం నాకు తెలుసు.  ఒక చిన్న డెస్క్ టాప్ కంప్యూటర్ లో పార్టీ సభ్యుల వివరాలను గ్రామాల వారీగా నిక్షిప్తం చేసేవారు. నిజానికి వీటితో నిమిత్తం లేకుండా ప్రత్యక్ష రాజకీయాల్లోనో, లేదా కౌన్సిల్, రాజ్య సభ సభ్యత్వం వంటి వాటితోనో  సంతృప్తి పడదలచుకుంటే ఆయనకు చిటికెలో పని. కానీ ఆయన పార్టీ బలోపేతానికే అహరహం కృషి చేస్తూ పోయారు. ఈ అనుభవం భవిష్యత్తులో పార్టీలో తన స్థానాన్ని పదిలపరచు కోవడానికి బాగా ఉపకరించింది.  ప్రతి కార్యకర్తను పేరుతొ పలకరించి వాళ్ళ మంచీ చెడూ కనుక్కుంటూ వుండే ఆయన వ్యవహార శైలి చంద్రబాబుకు పెక్కుమందిని దగ్గర చేసింది.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు వ్యవహార శైలికి ఒక మచ్చు తునక.
ఆకాశవాణి, దూరదర్సన్ కేంద్రాలనుంచి వారం వారం ప్రతిసోమవారం ప్రత్యక్ష ప్రసారం ద్వారా నిర్వహించే ‘ప్రజలతో ముఖ్యమంత్రి’ కార్యక్రమానికి రేడియో విలేకరిగా  నేనూ ప్రతిసారీ వెడుతుండేవాడిని. ఆ రోజుల్లో ప్రూడెన్షియల్ సహకార  బ్యాంకు ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయింది. అందులో తమ కష్టార్జితాన్ని దాచుకున్న వాళ్ళు బాగా దెబ్బతిన్నారు. ఒక సోమవారం నాడు ముఖ్యమంత్రి ఆ కార్యక్రమంలో ప్రజల సమస్యలకు జవాబు చెబుతున్నప్పుడు ఆ బ్యాంకు బాధితుడు ఒకరు లైన్లోకి వచ్చి తన ఆవేదనను కాస్త ఘాటయిన రీతిలోనే ముఖ్యమంత్రికి ఎరుకబరిచాడు. చంద్రబాబు ఆయన చెప్పినదంతా ఓపిగ్గా విని, మరునాడు వచ్చి తనను కలుసుకోవాల్సిందని సూచించారు. కార్యక్రమం అవగానే సీ.ఎం. కార్యాలయ ఉన్నతాధికారులు, సహకారశాఖ ఉన్నతాధికారులు,  ప్రూడెన్షియల్ బ్యాంకుకు ప్రభుత్వం నియమించిన చైర్మన్ తో సమావేశమై పరిష్కార మార్గాలను గురించి చర్చించారు. మరుసటి రోజు ఉదయం  ఆ బాధితుడు కూడా మరికొందరిని వెంటబెట్టుకుని సీఎం నివాసానికి చేరుకున్నాడు. అక్కడే పలుదఫాలుగా చర్చలు జరిగాయి. సమస్యల  పరిష్కార మార్గాల అన్వేషణలో బాధితుల అభిప్రాయాలు కూడా చెల్లుబాటు అయ్యేందుకు వీలుగా, వారి ప్రతినిధులుగా ఇద్దరిని బ్యాంకు డైరెక్టర్లుగా తీసుకోవాలని అప్పటికక్కడే నిర్ణయం తీసుకున్నారు. సీఎం ని కలవడానికి వచ్చిన వాళ్ళు సంతృప్తిగా వెనుతిరిగారు.
జర్నలిష్టుగా చురుగ్గా పనిచేస్తున్న రోజుల్లో నాకు తెలిసిన చంద్రబాబు వ్యవహార శైలికీ ఇప్పటికీ పోలిక లేదన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. అయితే అప్పటికీ, ఇప్పటికీ రాజకీయాల రంగూ, రుచీ పూర్తిగా మారిపోయిన మాట కూడా వాస్తవమే. రాజకీయ అనివార్యతలు కొంతమంది సమర్ధులచేత కూడా,  కూడని పనులు చేయిస్తుంటాయి. ఒడ్డున కూర్చుని చెప్పేవారి  నీతులు వారికి పొసగక పోవచ్చు. పీత  ఇబ్బందులు పీతవి. అలా అని అసాధారణ వ్యక్తిత్వం వున్న వాళ్ళు కూడా సాధారణ వ్యక్తుల మాదిరిగా ఆలోచనలు చేస్తుంటే, అతి సాధారణ రాజకీయాలు నడుపుతుంటే  ఎలాటి స్వార్ధ ప్రయోజనాలు ఆశించకుండా వారిని  అభిమానించేవారి మనసుకు కష్టంగానే వుంటుంది.
చంద్రబాబుకు నిజమైన అభిమానులు అనేకమంది వున్నారు. ప్రతిఫలం గురించి ఆలోచించకుండా, కేవలం రాష్ట్ర ప్రయోజనాలు లేదా పార్టీ  ప్రయోజనాల కోసం ఆయన్ని అభిమానించే వాళ్ళు కోకొల్లలుగా సాంఘిక మాధ్యమాల్లో తారసిల్లుతుంటారు. వారిలో అనేకులు ఆయన ప్రస్తుత ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తిగా వున్నప్పటికీ, ఆయన నాయకత్వంలోనే  రాష్ట్ర ప్రయోజనాలు పదిలంగా ఉంటాయని నమ్ముతున్నారు. సీఎం ఎస్ సర్వే కూడా ఇదే చెబుతోంది.    
చంద్రబాబు మొదటిసారి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పటికీ, కొత్తగా ఏర్పడ్డ పదమూడు జిల్లాల నవ్యాంధ్ర ప్రదేశ్  కు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఇప్పటికీ  ఎంతో తేడా వుంది.  అప్పటికీ ఇప్పటికీ పరిస్తితులు  గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి. ఆ రోజుల్లో పదవిలో కుదురుకోవడం అనేదే ప్రధాన సమస్య. 
ఇప్పుడలా కాదు. చుట్టూ సమస్యలు, మధ్యలో చంద్రబాబు.
సమస్యలను అవకాశాలుగా మార్చుకోవాలని ఆయన తరచూ చెబుతుంటారు.  సమస్యల నడుమ వున్న చంద్రబాబుకు ఇప్పుడా  అవకాశం ఆయన ఎదుటే వుంది.
సమర్ధత ప్రాతిపదికగా ప్రజలు తనకు కట్టబెట్టిన ప్రజల నమ్మకం వమ్ముకాకుండా చూసుకోవడానికి చంద్రబాబుకి మిగిలిన ఏకైక వనరు కూడా ఆ సమర్ధతే. మిగిలిన వనరులకు దారులు మూసుకు పోతున్నట్టు కానవస్తున్న ఈ తరుణంలో ఆయన తన సమర్ధతను నిరూపించుకోవాల్సిన అగత్యం ఆయనకే ఎక్కువగా వుంది.
నవ్యాంధ్ర ప్రదేశ్ ఆయనపై పెక్కు ఆశలు పెట్టుకుంది. ఇప్పుడు కాకపోతే ఎప్పుడూ కావు అని వాళ్ళు నమ్ముతున్నారు.  రెండేళ్ళ కాలం చాలా స్వల్పం అని వాళ్ళకీ తెలుసు. చంద్రబాబు ప్రస్తుతం ఎదుర్కుంటున్న పరిమితులు కూడా బాగా తెలుసు. కాళ్ళూ చేతులూ కట్టేసి కబాడీ ఆడమంటే ఎల్లా అని  వాళ్ళూ ఆయన పట్ల సానుభూతిగానే వున్నారు. అలా రెండేళ్ళు గడిచిపోయింది. ఇదే పరిస్తితి మరో మూడేళ్ళు ఉంటుందా అంటే అవునని చెప్పడం కష్టం.
ప్రజల ఆకాంక్షలను   నెరవేర్చడం ద్వారా తన సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని సార్ధకం చేసుకునే సువర్ణావకాశం చంద్రబాబుకు దక్కిన అపూర్వ వరం.  ఈ అవకాశం కూడా ఆయన ఒక్కరికే వుంది. దాన్ని నిజం చేయగల సామర్ధ్యం కూడా ఆయన ఒక్కరికే వుందని ప్రజలు  నమ్ముతున్నట్టు సీఎంఎస్ సర్వే కూడా చెబుతోంది.
అందుకే కొత్త చంద్రబాబులో అలనాటి పాత చంద్రబాబును చూడాలని చాలామంది కోరుకుంటున్నారు. 
పుట్టిన రోజులను ఘనంగా జరుపుకునే అలవాటు లేని చంద్రబాబునాయుడికి మనః పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. (18-04-2016)

రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్:  98491 30595 

కామెంట్‌లు లేవు: