Modi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Modi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

2, నవంబర్ 2018, శుక్రవారం

మార్చుకునేదే అభిప్రాయం – భండారు శ్రీనివాసరావు


మార్చుకునేవాటిని అభిప్రాయాలు అంటారా గుండెల్లో దాచుకున్న అభిమానాలు అంటారా!
“నాకు బాబు అంటే పడదు, కానీ మోడీ రాష్ట్రానికి చేసిన అన్యాయం అస్సలు బాగాలేదు, కాబట్టి నేను బాబు అభిమానిగా మారాను”
“నాకు జగన్ అంటే సరిపడదు, కానీ బాబు నాటకాలు చూసి విసుగెత్తి జగన్ సరయినవాడని ఇప్పుడు అనుకుంటున్నాను”
“నాకు పవన్ మీద మంచి అభిప్రాయం లేదు, అతనో మంచి సినిమా నటుడు అంతే. రాజకీయాలకు పనికిరాడు అనేది ఇప్పటివరకు నా ఉద్దేశ్యం. కానీ మారుతున్న పరిస్తితులను గమనించిన తర్వాత నా అభిప్రాయాన్ని మార్చుకుంటున్నాను”
జనమే ఇలా మారిపోతుంటే వాళ్ళని స్కాచి వడబోసిన రాజకీయులు సామాన్యులు కాదు కదా! వాళ్ళూ అవసరాలకు అనుగుణంగా అభిప్రాయాలూ, సిద్ధాంతాలు సూత్రాలు అన్నీ మార్చుకుంటూనే వుంటారు.
ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా!   

30, డిసెంబర్ 2016, శుక్రవారం

2017 లో ప్రతిపక్షాలను కాదు ప్రజలను చూడండి ప్రభువులూ!


(PUBLISHED IN "SURYA" TELUGU DAILY ON 01-01-16,SUNDAY)

అనాదిగా అలుపులేకుండా తిరుగుతున్న కాలచక్రం, తిరిగి తిరిగి, తిరిగొచ్చిన చోటికే తిరిగిరావడం  మామూలే.
అనేక అనుభవాలను, అనుభూతులను మన మదిలో, ఒడిలో  ఒదిలిపెట్టి  గత  ఏడాది సెలవు తీసుకుంది. సరికొత్త ఆశలతో కొత్త ఏడాది గడప దాటి అడుగు పెట్టింది.
చివరాఖర్లో కొంత హడావిడి చేసి 2016  తప్పుకుంటోంది. ఆ ప్రకంపనలను వారసత్వంగా అందిపుచ్చుకుని  2017 ప్రవేశిస్తోంది.

కొంచెం అటూ ఇటూగా కేంద్రంలోను, రెండు కొత్త తెలుగు రాష్ట్రాలలో నూతన ప్రభుత్వాలు కొలువుతీరి  రెండున్నర సంవత్సరాలు దాటుతోంది. ‘ఎన్నికలకు ముందు చెప్పినవేవీ చేయకుండా చేతులు ముడుచుకు కూర్చున్నారని’ ప్రతిపక్షాల వాదన. ‘కాదు, ఈ కొద్ది కాలంలో మేము చేసినన్ని మంచి పనులు గతంలో చాలాకాలం పాలించిన పార్టీలు ఏవీ చేయలేదని’ ఈ కొత్త పాలకుల సమర్ధన.  2016 లోనే కాదు, గత రెండున్నరేళ్లలో ఏం జరిగిందో సింహావలోకనం చేసుకుందాం.
ముందు ఢిల్లీ నుంచి మొదలుపెడదాం. చరిత్రలో కనీ వినీ ఎరుగని విజయాన్ని సాధించి నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అయ్యారు. మొదటి రెండేళ్లలో రాజకీయంగా కొన్ని ఆటుపోట్లు ఎదురయినా వ్యక్తిగతమైన ప్రజాదరణ ఇసుమంత కూడా కోల్పోలేదు. అన్నింటికీ మించి అధికారంలోకి రాగానే సహజంగా అంటుకునే అవినీతి మరకలు ఆయన్ని అంటుకోలేదు. బ్రహ్మాండమయిన పనులేవీ చేసి చూపించిన దాఖాలాలు పెద్దగా లేకపోయినా ప్రజలకు ఆయన పట్ల నమ్మకం తగ్గిపోలేదు.  పెద్ద నోట్ల రద్దు వంటి కీలక నిర్ణయం తగిన ముందు జాగ్రత్తలు తీసుకోకుండా తీసుకున్నప్పటికీ, అందువల్ల ముందుగా  చీకాకులు పడుతున్నది తామే అయినప్పటికీ సామాన్య ప్రజలు పంటి బిగువన ఆ కష్టాన్ని భరిస్తూ వచ్చిన విషయం అంత చిన్నవిషయమేమీ  కాదు. కారణం ఏదైనా, కారకులు ఎవరయినా, పెద్ద నోట్ల రద్దుకు సంబంధించి  మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గత ఏడాది చివరి రెండు మాసాల్లో యావత్ జాతిని ప్రభావితం చేసింది. దేశానికి పట్టిన నల్ల ధనం రోగాన్ని మటుమాయం చేయడానికి మోడీ తలపెట్టిన కాయకల్ప చికిత్స తొలి ప్రభావం సామాన్య జనజీవనంపైనే పడింది. ఈ ఆకస్మిక నిర్ణయం తమ జీవితాల్లో తీసుకొచ్చిన అనూహ్య పరిణామాలను వారు అతి సహజంగా తీసుకుంటున్నారనే చెప్పాలి. వెనిజులా దేశంలో ఇటువంటి నిర్ణయం పట్ల అక్కడి ప్రజలు ఎంత కోపోద్రిక్తులయింది గమనిస్తే, భారతీయులు ప్రదర్శిస్తున్న సహనం మోడీ అదృష్టమనే అనుకోవాలి.  అయితే దాన్ని ప్రజలు తమకిస్తున్న సహకారంగా ప్రభుత్వం భావిస్తున్నట్టుంది. అందులో కొంత నిజం లేక పోలేదు,  కానీ అది పూర్తిగా నిజం కాదన్న ఎరుక సర్కారు వారికి వున్నట్టు అనిపించడం లేదు.        
 ఈ అంశంపై ప్రతిపక్షాలు చేస్తున్న యాగీ పట్ల పాలక పక్షానికి కొంత అసహనం వుండవచ్చు. అలాగని వస్తున్న ప్రతి విమర్శను రాజకీయ కోణం నుంచి చూస్తూ తప్పుపట్టే ప్రయత్నం చేయడం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికయిన ప్రభుత్వానికి మంచిది కాదు. ప్రతిపక్షాలు సరే! ప్రజలు ఏమనుకుంటున్నారో చారుల ద్వారా సమాచారం తెప్పించుకుని వారి ఇబ్బందులను కొంతవరకయినా తగ్గించి  ఒకింత ఉపశమనం కలిగించండం మోడీ ప్రభుత్వ ప్రధమ కర్తవ్యం. నూతన సంవత్సరం సందర్భంగా ప్రధాని మోడీ చెప్పుకోవాల్సిన సంకల్పం ఇదే!
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.
దాదాపు పదేళ్ళ విరామం తరువాత చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. చేజారిన అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు. ఏ రాజకీయ నాయకుడికి అయినా ఇంతకుమించిన సంతోషం మరోటి వుండదు. అయితే ఈ ఆనందం ఈ సంతోషం   తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అనుభవిస్తున్నారా అంటే ఆ దాఖలా కానరావడం  లేదు. ఎందుకంటే ఈసారి అధికారం లభించింది కానీ దానితోపాటే అనేకానేక సమస్యలు కూడా వెన్నంటి వచ్చాయి.  ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఆయన్ని  చుట్టుముడుతూనే వస్తోంది. ఒకదాని చిక్కుముడి విప్పేలోగా మరోటి సిద్ధం. కొన్ని వచ్చి పడ్డవి అయితే మరి కొన్ని తెచ్చి పెట్టుకున్నవి.
సమస్యను అవకాశంగా మలచుకోవడం తనకలవాటని చెప్పుకునే చంద్రబాబు, ఎదురయిన ప్రతి సమస్యను పార్టీకి, రాష్ట్రానికి పనికి వచ్చే అవకాశంగా మార్చుకునే పనిలో అహరహం కష్టపడుతుంటారు. కనీసం కష్టపడుతున్నట్టు కానవస్తారు. 'పని చేయడంతో సరిపోదు పనిచేసినట్టు కనబడాలి కూడా' అనే ఈ కాలపు రాజకీయానికి నిజానికి ఆయనే ఆద్యులు.
ఎన్ని చేస్తున్నా, ఎన్నో చేస్తున్నామని చెప్పుకుంటున్నా ఇంకా కొన్ని కొత్త సమస్యలు పుట్టుకొస్తూనే వున్నాయి. రాజ్యం వుంది రాజధాని లేదు. ఖజానా వుంది. నిధులు లేవు. కేంద్రంలో మిత్ర ప్రభుత్వం వుంది. అయినా ఆశించిన విధంగా అక్కరకు రావడం లేదు. ఇటువంటి వ్యతిరేక పరిస్తితులను కూడా ఆయన అనుకూలంగా మార్చుకునే పనికే ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. అందులో కూడా రాజకీయంగా బలపడే ప్రయత్నం స్పష్టంగా కానవస్తుంది. ప్రతిపక్షాన్ని బలహీన పరిచే వ్యూహం దాగుంటుంది.
చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికీ రాని అపూర్వ అవకాశం చంద్రబాబు నాయుడుకి కొత్త రాజధాని నిర్మాణం  విషయంలో లభించింది. కొంత వివాదాస్పదం అవుతున్నప్పటికీ ఈ విషయంలో కూడా చంద్రబాబు తన పంధాను ఏమాత్రం మార్చుకోకుండా ముందుకు సాగుతున్నారు. కొత్త రాష్ట్రానికి రాజధాని అవసరం కనుక ఆయన ప్రయత్నాలకు ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత కానరాని మాట నిజమే. కాకపోతే కొత్త రాష్ట్రానికి వుండే ఇబ్బందులను ప్రజలు అర్ధం చేసుకుని సహకరిస్తున్నారు కానీ  ఇష్టపూర్తిగా కాదన్న వాస్తవాన్ని తెలుగు దేశం అధినేత గుర్తుపెట్టుకోవాలి.
ఇక చంద్రబాబుకు మరో సువర్ణావకాశం పోలవరం రూపంలో వచ్చింది.  
దేశంలోని నదులన్నింటినీ అనుసంధానం చేయాలన్న ఆలోచనలోనుంచే ఈ ప్రాజెక్ట్ పురుడు పోసుకుంది. 1941 జులైలో అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ఈ ప్రతిపాదన వచ్చింది.  ప్రెసిడెన్సీ నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీర్ ఎల్. వెంకట కృష్ణ అయ్యర్ మొదటి ప్రాజెక్ట్ నివేదిక తయారుచేసారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా మూడు లక్షల యాభై వేల ఎకరాలకు సేద్యపు నీటి సౌకర్యంతో పాటు నలభయ్ మెగావాట్ల విద్యుత్ ను కూడా ఉత్పత్తి చేయవచ్చని ఆయన ఆ రోజుల్లోనే తలపోశారు. మొత్తం ప్రాజెక్ట్ వ్యయాన్ని ఆరున్నర కోట్ల రూపాయలుగా అంచనా వేసారు. ప్రాజెక్ట్ అతీగతీ లేదు కాని అంచనావ్యయం మాత్రం స్వతంత్రం వచ్చేనాటికి ఆరున్నర కోట్ల నుంచి రెండువందల కోట్లు దాటిపోయింది.  ప్రాజెక్ట్ రిజర్వాయర్ జలాలు వెనుకవున్న భద్రాచలం సీతారామస్వామి గుడిని తాకే అవకాశం వున్నందువల్ల 'రామపాద సాగర్' అని పేరు పెట్టారు. తదనంతరం కె.ఎల్.రావు గారు, పోలవరం కుడి గట్టు కాల్వని, కృష్ణానదిపై ఆక్విడక్ట్ నిర్మించి గుంటూరు జిల్లావరకు పొడిగించేట్టు ప్రతిపాదించారు. ఇలా ప్రతిపాదనలన్నీ కాగితాలపై వుండగానే, ప్రాజెక్ట్ అంచనా వ్యయం వేల కోట్లకు పెరిగిపోయింది. 1980 లో అప్పటి ముఖ్యమంత్రి టి.అంజయ్య పోలవరం ప్రాజెక్టుకు మొదటి పునాది రాయి వేసారు. శంఖుస్థాపన పలకం బీటలు వారిపోయింది కాని ప్రాజెక్టు పనులు ఒక అంగుళం కూడా ముందుకు సాగలేదు. ఇలా పురోగతి లేకుండా దస్త్రాలలోనే పడివున్న పోలవరం ప్రాజక్టుకు,  వై. ఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాగానే తీసుకున్న చొరవతో కదలిక మొదలయింది. ఆయన ఈ ప్రాజెక్టుకు పదమూడువందల కోట్లు మంజూరు చేసి మూలపడ్డ ప్రాజెక్టును మళ్ళీ పట్టాలు ఎక్కించారు. కుడిగట్టు కాల్వ నిర్మాణానికి టెండర్లు పిలిచారు. అలాగే ఎడమగట్టు కాల్వకోసం మరో పదమూడువందల కోట్ల రూపాయలు మంజూరు చేశారు.
పోలవరం ప్రాజెక్ట్ కూడా  చంద్రబాబుకు రాజకీయంగా చాలా కీలకం. విభజన తరువాత తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో వున్న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్ట్ తలకు మించిన భారమే.  అయినా ప్రతి సోమవారం ఆ ప్రాజెక్టు పురోగతి గురించిన సమీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు. సమీక్షలతో ప్రాజెక్టు పూర్తి కాదు కదా! అది ఆయనకు బాగా తెలుసు. అందుకే ఢిల్లీ మీద ఒత్తిడి పెంచారు.
ఏడాది చివర్లో చంద్రబాబు ప్రభుత్వానికి చిన్న తీపి కబురు అందింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన కేంద్ర నిధుల్లో కొంత భాగం చెక్కు రూపంలో చేతికి వచ్చింది. అంతే! క్షణం ఆలస్యం చేయకుండా పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే కాంక్రీటు పనులకు స్వయంగా ఆయనే శంకుస్థాపన చేశారు. చెక్కు చేతికి అందిన నాలుగు రోజుల్లోనే మెరుపు వేగంతో ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన  తీరు గమనించిన వారికి సకాలంలోనే దాన్ని పూర్తి చేయగలరన్న నమ్మకం కలిగి వుంటుంది. అయితే కేంద్రం ఎంతో అబ్బురంగా అందించిన డబ్బు, ప్రాజెక్టు అంచనా వ్యయం  ఈ రెంటినీ పోల్చి చూసుకుంటే రెండేళ్లలో పని పూర్తి కావడం సాధ్యమా అనే సందేహం కలుగుతుంది.              
ఈ ప్రాజెక్ట్ అనుకున్న విధంగా పూర్తి చేయగలిగితే ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాలకు వరంగా మారుతుంది. పూర్తి చేయకుండా ఒదిలేస్తే రాజకీయంగా తెలుగు దేశం పార్టీకి శాపంగా మారుతుంది. అంచేతనే 2018 కల్లా పోలవరం పూర్తి చేసితీరుతామనే ప్రకటనలు ఆ పార్టీ  నాయకులు తరచూ చేస్తూ వస్తున్నారు. ప్రాజెక్ట్ అనుకున్న విధంగా, అనుకున్న వ్యవధిలో పూర్తి అవుతుందా అంటే జవాబులేని ప్రశ్నే.  ఒక సమాధానం మాత్రం ఇబ్బంది లేకుండా చెప్పవచ్చు. ప్రాజక్ట్ అంచనా వ్యయం మాత్రం అంచనాలకు మించి పెరిగిపోవడం ఖాయం.
ఎన్ని సంక్షేమ పధకాలు మొదలు పెట్టినా చంద్ర బాబు ఎన్నికల వైతరణి దాటాలంటే అటు రాజధాని నిర్మాణం కొంతయినా చేసి చూపించాలి. ఇటు పోలవరం ప్రాజక్టును కొంతయినా కట్టి చూపించాలి. ఇది ఎరిగిన రాజకీయ నాయకుడు కావడం వల్లనే ఈ రెండిటి పట్లా ఆయన చాలా శ్రద్ధ చూపిస్తున్నారు.
ఇక చంద్రబాబు నాయుడు చెప్పుకోవాల్సిన నూతన సంవత్సర సంకల్పం.
ప్రతి విషయానికీ ప్రతిపక్షాన్ని ఆడిపోసుకోకుండా, అభివృద్ధికి అడ్డుపడుతున్నారని నెపం మోపకుండా  తన దీక్షాదక్షతలపై  ప్రజలు పెట్టుకున్న నమ్మకం వమ్ము కాకుండా చూసుకోవాలి.
పొతే తెలంగాణా.   
తెలంగాణాలో కేసీఆర్ ప్రభుత్వం నల్లేరు మీది బండి నడకలా సాగిపోతోంది. కేసీఆర్ మాట అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో సుగ్రీవాజ్ఞగా చెల్లుబడి అవుతోంది. ఎదురులేదన్న నమ్మకంతో వేస్తున్న కొన్ని అడుగులు ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నాయన్న సంగతిని ఆ పార్టీ అధినేత గమనించడం లేదేమో అనిపిస్తోంది. అనేక మంచి పనులు చేస్తున్నప్పుడు అనవసరమైన విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని అనుకుంటున్నారేమో తెలియదు.
సమస్యలు అన్నింటికీ తెలంగాణా ఏర్పాటు ఒక్కటే సర్వరోగనివారిణి అనీతెలంగాణా రాగానే ఏళ్ళతరబడి పేరుకునివున్ననీళ్ళూ, నిధులూ, నియామకాల వంటి ఈ ప్రాంతపు  సమస్యలన్నీ  మంత్రం వేసినట్టు  మాయం అయిపోతాయని ప్రత్యేక రాష్ట్రం కోరుకున్నవారు అనుకున్నారు. అయితేవారనుకున్నట్టూ ఏమీ జరగలేదు. రాత్రికి రాత్రే  సమస్యలు అన్నీ పరిష్కారం అయిపోలేదు.
అయినా కేసీఆర్ పైన ప్రజల అభిమానం చెక్కు చెదరలేదు. రాష్ట్రం ఏర్పాటయిన తరువాత జరిగిన అన్ని ప్రధాన ఎన్నికల్లో టీఆర్ఎస్  నే గెలిపిస్తూ వచ్చారు. కేసీఆర్ తమ కళ్ళ ముందు ఆవిష్కరిస్తున్న బంగారు తెలంగాణా స్వప్నం పట్ల వాళ్ళ నమ్మకం చెక్కుచెదరలేదు. మొన్నీ మధ్య ఆయన ప్రారంభించిన రెండు పడక గదుల ఇల్లు అనే పధకంతో ఆయన పట్ల నమ్మకం మరింత పెరిగి వుంటుంది కూడా.    
అయితే తెలంగాణాపై తెలంగాణా  ప్రజలు  పెంచుకున్న కోటి ఆశల మాటేమిటి? అవన్నీ నీటిమూటలేనా? నెరవేరే మాటలేనా? తెలంగాణా రాకముందు, వచ్చిన తరువాత తెలంగాణా సాధకుడిగా పేరు మూటగట్టుకున్న కేసీఆర్ చెప్పిన మాటలు ఏమిటి? చేస్తున్న ఆలోచనలు ఏమిటి? అసలు ఇంతకాలంగా చేసింది ఏమిటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేసేఆర్ నేతృత్వం వహిస్తున్న పార్టీలోను, ప్రభుత్వంలోను ప్రజాస్వామ్య విలువలు పడిపోతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రభుత్వ ప్రచార కోశంలో వీటన్నిటికీ జవాబులు సిద్ధంగా వుండొచ్చు. ప్రచారమే ప్రధానం అనుకుంటే, వాస్తవానికి చరిత్రలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రికీ దొరకనంతగా విస్తృత, సానుకూల  ప్రచారం కేసీఆర్ కు లభిస్తోంది. పత్రికలవారితో పన్నెత్తి మాట్లాడడమే అపురూపం. అయినా మీడియాలో ఆయనకు వస్తున్న ప్రచారం అపూర్వం.   
అయితే ఇంతటితో సరా! సరే అని  ఇవ్వాళ ప్రజలు సరిపుచ్చుకోవచ్చు.  రేపూ ఇలాగే వుంటుందనే గ్యారంటీ వుందా?
ఈ కొత్త సంవత్సరం శుభ సందర్భంలో కేసీఆర్ ఒక సంకల్పం చెప్పుకోవాలి. ప్రజలు అప్పగించిన పుణ్య కాలంలో మిగిలిన రెండేళ్ళు, ( చివరి ఆరునెలలు ఎన్నికల హడావిడే సరిపోతుంది) రాజకీయ భేషజాలకు స్వస్తి చెప్పి తనను నమ్ముకున్న ప్రజలను ఓ కంట కనిపెట్టి చూడాలి. ఏ విషయంలో ఎవరయినా ఏదైనా   ప్రశ్నిస్తే అందులోని నిజాయితీని కనిపెట్టగలగాలి. రాజహంస పాలనూ, నీళ్ళనూ వేరు చేసినట్టు, రాజకీయ ఆరోపణలను, నిజాయితీగా చేసే విమర్శలను వేర్వేరుగా చూడగలగాలి.
ఇది కేసీఆర్ చెప్పుకోవాల్సిన సంకల్పం.
ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణా ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ ముగ్గురినీ కేవలం అనుభవం, సమర్ధత  కారణంగానే ప్రజలు వారు కోరుకున్న గద్దెలు ఎక్కించారు. అనుభవంలో కాని, రాజకీయ చాణక్యంలో కాని ఈ మువ్వురు  ఒకరికొకరు ఏమాత్రం  తీసిపోరు. వీరికి వున్న ఈ సానుకూల లక్షణాలన్నీ జనరంజకమైన పాలనకు దోహదం చేసి తీరాలి. మరి అయిదేళ్ళ విలువైన కాలంలో ఇంత కాలం గడచిపోయింది కానీ జనాలు కోరుకున్నది ఏమన్నా జరిగిందా?
వీరిలో పోలిక కలిగిన లక్షణం కూడా  ఒకటుంది.
ఏదైనా  మంచిపని  చేసినప్పుడు ఆ విషయాన్ని వారంతట వారే బయటకు చెప్పుకుంటున్నట్టే, చేయలేని విషయాన్ని ఎవరయినా ప్రస్తావిస్తే చాలు అగ్గిమీద గుగ్గిలం అయిపోతారు. ‘అభివృద్ధికి అడ్డు తగులుతున్నారనే’ అభాండం వేస్తున్నారు. లేదా తమ వైఫల్యాలకు మునుపటి  పరిపాలకుల నిర్వాకం కారణం అని  కొట్టి పారేస్తున్నారు. గతంలో  జరిగిన పొరబాట్లను లేదా తప్పులను  చక్కదిద్దే దక్షత వుందన్న కారణంతోనే ప్రజలుతమకు  పట్టం కట్టారన్న సంగతి మరిచి పోతున్నారు.
“మీ సమర్ధతకు మెచ్చి ప్రజలు  ఇచ్చిన నజరానా మీ పదవులు. అందుకు బదులుగా వారికి ఏదైనా చేయండి. సమయం తగ్గిపోతోంది. ప్రతిపక్షాలను పక్కన పెట్టి ప్రజలను అక్కున చేర్చుకోండి.”
నూతన సంవత్సరం సందర్భంగా జనశ్రేయోభిలాషులు వారిని కోరుకునేది ఇదొక్కటే.
ఇలాటి వారందర్నీ రాజకీయ ప్రతికక్షులుల గాటన కట్టి తేలిగ్గా  కొట్టిపారేయడం తగదు. ఎన్నికలకు  ముందు చెప్పిన మాటలను గుర్తుకు తెచ్చుకుంటూ, చేసిన పనులను మననం చేసుకుంటూ, అడగాలని అనుకుని అడగలేని బడుగులు కూడా తమను ఎన్నుకున్న జనాల్లో  ఉంటారని ఏలికలు గుర్తు పెట్టుకోవాలి. వీరికి జవాబు చెప్పనక్కరలేదు. గుర్తుపెట్టుకుంటే చాలు. గుర్తుపెట్టుకున్నట్టు కనిపిస్తే మాత్రం  కుదరదు. ఎందుకంటే అయిదేళ్ళు కాగానే అన్నీ గుర్తు పెట్టుకునే గొప్ప ప్రజాస్వామిక లక్షణం ప్రజల్లో  నిండుగా  వుంది.
చరిత్ర రుజువు చేసిన సత్యం ఇది.
సర్వజన హితాన్ని గమనంలో వుంచుకుని రాస్తున్న ఆప్తవాక్యం ఇది.  
(31-12-2016)

రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com, మొబైల్:  98491 30595 

23, ఏప్రిల్ 2016, శనివారం

రాజకీయ చమత్కారం


సూటిగా.....సుతిమెత్తగా....... 

ఒక్కసారి ఓ నలభయ్ ఏళ్ళు వెనక్కి వెళ్లి వద్దాం.
1975 జూన్ 12.
దేశ రాజధాని న్యూఢిల్లీలోని ప్రధాని ఇందిరాగాంధీ నివాసంలో ఒక అధికారి చాలా అసహనంగా అటూ ఇటూ తచ్చాడుతున్నాడు. తడవతడవకూ ఓసారి టెలిప్రింటర్ గదిలోకి వెడుతూ ఏదైనా ఫ్లాష్ న్యూస్ వస్తుందేమో అని చూస్తున్నాడు. షరా మామూలు వార్తలు మినహా  ఆయన ఎదురు చూస్తున్న వార్తలు ఏమీ ఆ గదిలోని పీటీఐ, యుఎన్ఐ ప్రింటర్ల మీద కనబడడం లేదు.
మరి కాసేపట్లోనే, అంటే ఉదయం పది గంటల రెండు నిమిషాలకు యుఎన్ఐ ప్రింటర్  “ఫ్లాష్ ఫ్లాష్”  అంటూ గంటలు మోగిస్తూ ఒక వార్త ఇచ్చింది. దాన్ని చూడగానే ఆ అధికారి నివ్వెర పోయాడు. ‘మిసెస్  గాంధీ అన్ సీటెడ్’ అంటూ అలహాబాదు హైకోర్టు ఇచ్చిన తీర్పును అతి క్లుప్తంగా ఆ వార్తా సంస్థ అందులో పేర్కొన్నది. హడావిడిగా  ఆ వార్త వున్న కాగితాన్ని ప్రింటర్ నుంచి చించి, దాదాపు పరిగెత్తుకుంటూ  ప్రధాని కూర్చుని వున్న గదిలోకి  వెళ్ళాడు. వెళ్లి ఆ కాగితాన్ని అక్కడే వున్న రాజీవ్ గాంధి  చేతిలో ఉంచాడు. దాన్ని పరికించి చూసిన రాజీవ్ తల్లితో చెప్పాడు. “వాళ్ళు  నిన్ను ప్రధాని పదవి నుంచి తొలగించారు” అని. ఆ మాటలు విన్న ఇందిరాగాంధీ  కొద్దిసేపు మిన్నకుండి పోయారు. ఆమె మోహంలో ఎలాంటి ఆందోళన కానరాలేదు.
ఈలోగా  టెలిప్రింటర్ మరింత బాధాకరమైన వార్తను మోసుకొచ్చింది. ఇందిరాగాంధీ  పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయడమే కాదు, ఎన్నిక ద్వారా సమకూరే ఎటువంటి పదవికయినా  ఆమె ఆరేళ్ళపాటు అనర్హురాలని అలహాబాదు హైకోర్టు  మరో తీర్పు చెప్పింది. అప్పటివరకు ఉగ్గబట్టుకుని వున్నప్పటికీ,  ఈ వార్త తెలియగానే  ఆవిడ మౌనంగా నెమ్మదిగా అడుగులు వేస్తూ అక్కడినుంచి వెళ్ళిపోయారు.
దీనికి ముందు చాలా చాలా సంగతులు చరిత్రలో చేరాయి.
శ్రీమతి గాంధి చేతిలో సుమారు లక్ష ఓట్ల తేడాతో ఓడిపోయిన రాజ్  నారాయణ్, శ్రీమతి గాంధి ఎన్నిక అక్రమ పద్ధతుల్లో జరిగిందని  ఆరోపిస్తూ,  ఆ ఎన్నికను రద్దుచేయాలని కోరుతూ  కోర్టును ఆశ్రయించారు. శ్రీమతి ఇందిరాగాంధి తన ఎన్నికల  ప్రచారంకోసం యశ్ పాల్ కపూర్ అనే ప్రభుత్వ ఉద్యోగి సేవలు వాడుకుందనీ, అలాగే ప్రచార వేదికలు, మైకులు మొదలయినవి ఏర్పాటు చేసే విషయంలో  ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ అధికారుల సాయం తీసుకున్నారనీ రాజ్ నారాయణ్ వాదన.  ఈ రెండూ ఎన్నికల నిబంధనావళికి విరుద్ధమని పేర్కొంటూ న్యాయమూర్తి జగ్ మోహన్ శ్రీమతి గాంధీకి ప్రతికూలంగా తీర్పు ప్రకటించారు.


‘ట్రాఫిక్ ఉల్లంఘన వంటి చిన్న తప్పిదానికి ప్రధాన మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని ఆదేశించినట్టుగా  ఈ తీర్పు వుందని ‘ఎమర్జెన్సీ’ పై రాసిన ‘జడ్జ్ మెంట్’ అనే గ్రంధంలో సుప్రసిద్ధ  పాత్రికేయులు కులదీప్ నాయర్  వ్యాఖ్యానించారు. జగ్ మోహన్ తీర్పు తనకు వ్యతిరేకంగా రాకుండా చూడడానికి ప్రధాని ఇందిర, ఆ న్యాయమూర్తిపై ఎన్నిరకాలుగా ఒత్తిళ్ళు తీసుకువచ్చిందీ,  న్యాయమూర్తి  వాటన్నిటినీ  ఎలా తట్టుకున్నదీ మొదలయిన సంగతులను చాలా ఆసక్తిదాయకంగా నాయర్ ఆ పుస్తకంలో  వివరించారు. శ్రీమతి గాంధీ  విధానాలతో పూర్తిగా వ్యతిరేకించే కులదీప్ నాయర్ వంటి  జర్నలిష్టు  కూడా, ఇందిరా గాంధి విషయంలో  న్యాయమూర్తి చిన్న తప్పుకు పెద్ద శిక్ష వేశారని అభిప్రాయపడడం ఇందులోని ప్రత్యేకత. 
హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేయాలని ఇందిర తీసుకున్న నిర్ణయాన్ని ఆనాడు ప్రతిపక్షాలన్నీ  తీవ్రంగా వ్యతిరేకించాయి. నైతిక విలువలకు కట్టుబడి ఆమె ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలని పట్టుబట్టాయి. ఈ సంఘర్షణ ఏ స్థాయికి చేరిందంటే ప్రతిపక్షాలను కట్టడి చేయడానికి ఇందిరాగాంధి జూన్  ఇరవై అయిదో తేదీ బాగా పొద్దుపోయిన తర్వాత  (ఇప్పటిలా ప్రసార సాధనాలు అప్పట్లో లేని కారణంగా  మారునాడు కానీ ప్రజలకు ఈ విషయం తెలియలేదు)  దేశంలో మొట్టమొదటిసారి ఆంతరంగిక ఆత్యయిక పరిస్తితి విధించారు.  దేశ వ్యాప్తంగా వందలాదిమంది ప్రతిపక్ష నాయకులను కారాగారాల్లోకి నెట్టారు. పత్రికలపై  ఆంక్షలు విధించారు. స్వతంత్ర భారత దేశం తొలిసారి స్వేచ్చను కోల్పోయిన  అనుభూతిని ఆ పరిణామాలు కలిగించాయి.
శ్రీమతి గాంధి  ఒక పక్క తనను ఎదిరించిన వారిని  రాజకీయంగా ఇబ్బందులకు గురిచేస్తూ, మరో పక్క అలహాబాదు న్యాయస్థానం తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేస్తూ న్యాయ పోరాటం కూడా సాగించారు.  దరిమిలా, అయిదు నెలలు తిరగకుండానే   సుప్రీం కోర్టులో శ్రీమతి  గాంధీకి ఉపశమనం లభించింది. కింది కోర్టు తీర్పును సుప్రీం కొట్టివేసింది. తద్వారా శ్రీమతి గాంధీ ప్రధానిగా  యధాప్రకారం కొనసాగడానికి  న్యాయపరమైన చిక్కులు తొలగిపోయాయి. అయినా ప్రతిపక్షాల ఆందోళన తగ్గలేదు.  విపక్షాలన్నీ ఒక్కటయ్యాయి. అనేక పార్టీలు జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలో ఒక్కటై, జెండాలను, ఎజెండాలను పక్కనబెట్టి, ‘జనతా   పార్టీ ‘ అనే ఒకే పేరుతొ, ఒకే ఎన్నికల గుర్తుతో తదుపరి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి ప్రజాస్వామ్య స్పూర్తికి విఘాతం కలిగించేవారిని ప్రజలు ఎప్పటికీ క్షమించరనే సత్యాన్ని  రుజువు చేయగలిగాయి. అదేసమయంలో,  బ్రహ్మాండమైన ప్రజల మద్దతు వుండికూడా,  తమలో తాము కలహించుకుని, భారత రాజకీయాల్లో ఒక చక్కటి  ప్రయోగం విఫలం కావడానికి ఆ రాజకీయ నాయకులే  స్వయంగా కారణం అయ్యారు. ప్రజాస్వామ్యం పట్ల ప్రజలకు వున్న ప్రగాఢమైన కాంక్ష కారణంగా ఇందిరాగాంధీ పరాజయం పాలయింది. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా కేవలం అధికార వ్యామోహంతో, పరస్పర కుమ్ములాటలతో  తామున్న చెట్టు కొమ్మను తామే నరుక్కునే చందంగా వ్యవహరించే రాజకీయ కూటములను  కూడా ప్రజలు ఏవగించుకుంటారని జనతా ప్రభుత్వ పతనం  నిరూపించింది.
ఈ  సుదీర్ఘమైన  ‘పాతకాల స్మరణ’కు కారణం లేకపోలేదు.
అప్పటికీ ఇప్పటికీ నడుమ నలభయ్ ఏళ్ళు గడిచిపోయాయి. అప్పటి కధే  కొద్ది తేడాతో నేడు పునరావృత మైంది.  పాత్రలు కూడా  కొంచెం  అటూ ఇటుగా  తిరగబడ్డాయి.
ఆనాడు కాంగ్రెస్  పార్టీ నాయకురాలయిన ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా  హైకోర్టు తీర్పు ఇస్తే ప్రతిపక్షాలన్నీ ఏకమై ఆమె రాజీనామాకోసం పట్టుబట్టాయి. సుప్రీం కోర్టుకు అప్పీలు చేసుకోవడాన్ని తప్పుపట్టాయి.
ఈనాడు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కాదని కేంద్రంలో వున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి, అప్రజాస్వామికంగా ఆ రాష్ట్రంలో  రాష్ట్రపతి పాలన విధిస్తే  అక్కడి హైకోర్టు దాన్ని తప్పుబట్టి  రద్దు చేసింది. పైగా ఈ సందర్భంగా దేశం మొత్తానికి అనువర్తించే కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ప్రజలు ఎండా వానా అని చూడకుండా పోలింగు కేంద్రాలకు వెళ్లి తమకు నచ్చిన ప్రభుత్వాలను ఎన్నుకుంటుంటే,  ఆ బలహీనుడు పెంచుకున్న నమ్మకాన్ని ఇలా హరిస్తారా అని ప్రశ్నించింది. ఇటువంటి చర్యలు సామాన్యులకు వ్యవస్థ పట్ల వుండే విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి.’ అని హెచ్చరించింది కూడా.
ఉత్తరాఖండ్  ముఖ్యమంత్రిగా పదవి కోల్పోయిన కాంగ్రెస్ నాయకుడు హరీష్ రావత్   హైకోర్టు  తీర్పు వెలువడగానే తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే కొద్ది గంటల్లోనే పరిస్తితి మారిపోయింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ,  కేంద్రంలో మోడీ నాయకత్వంలోని ఎన్డీయే  ప్రభుత్వం సుప్రీం తలుపు  తట్టింది. కొంచెం ఊరట కలిగించే తీర్పు కాలయాపన లేకుండా అత్యున్నత న్యాయస్థానం నుంచి రావడంతో మోడీ సర్కారుకు  ఒకింత ఉపశమనం లభించినట్లయింది. తాజా ముఖ్యమంత్రి రావత్ అత్యల్ప స్వల్ప సమయంలోనే మళ్ళీ మాజీగా మారారు.  
అయితే ఇక్కడ ప్రస్తావించుకోవాల్సింది, చర్చించు కావాల్సింది వేరే విషయం. అది రాజకీయ పార్టీల అవకాశవాదం.
నాలుగు దశాబ్దాల నాడు, ఆనాడు జనసంఘం రూపంలో వున్న బీజేపీకి   ఏదైతే తప్పనిపించిందో, అదే ఆ పార్టీకి ఈనాడు ఒప్పనిపిస్తోంది. అప్పుడు ప్రతిపక్షాలు యెంత ఒత్తిడి చేసినా రాజీనామా చేసేది లేదని భీష్మించిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు బీజేపీ చేస్తున్నది పూర్తి అనైతికంగా అనిపిస్తోంది.
రాజకీయంలో వున్న చమత్కారంగా దీన్ని అర్ధం చేసుకోవాలా?        

ఉపశ్రుతి:
భయాలు రకరకాలు. పిల్లి అంటే ఎలుకకు భయం. మనిషికి ప్రాణ భయం. రాజకీయ నాయకులు మానవాతీతులు కదా! అధికారంలో వున్న వారికి  ఒక్కటే భయం. ఎన్నికల్లో ఓడిపోతామేమో,  పదవి పోతుందేమో అన్న భయం.
ఆ భయమే వారిచేత అనేక కాని పనులు చేయిస్తుంటుంది. (23-04-2016)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com  మొబైల్: 98491 30595


NOTE: COURTESY KULDIP NAYAR & IMAGE OWNER