'మీకు శత్రువులు ఎవ్వరూ
లేరా స్వామీ?' అని అడిగాడు ఓ ఆసామీ ఓ స్వామివారిని.
'లేకేం! నా నాలుకే నా
శత్రువు' అన్నారా స్వామి.
తరచి చూస్తె అందులో ఎంతో
నిజం వుందని అనిపిస్తుంది.
మొన్న పరిపూర్ణానంద
స్వామి ఉగాది పంచాంగ శ్రవణానికి వెళ్ళాము. ఆయన కంఠం కంచుగంట. చెప్పే విషయం ఏదయినా
ఓ కధలా వినసొంపుగా వుంటుంది.
భార్యాభర్తల సంబంధాలు,
విడాకుల ప్రస్తావన దొర్లింది. స్వాములేమిటి? విడాకుల గొడవేమిటి అనుకునేవాళ్ళకు ఆయన
ప్రసంగమే సమాధానం. ఈఏడాది (మన్మధ) విడాకుల కేసులు బాగా పెరిగిపోతాయని స్వామి ఉవాచ.మరి ఏమిటి మార్గం. ఉందన్నారు ఆయనే. నాలుకను
అదుపులో ఉంచుకోవడం ఒక్కటే శరణ్యం ఆన్నారాయన. సరిగ్గా ఇలాగే కాకపోయినా దాదాపు ఇదే
అర్ధం వచ్చేలా చెప్పారు.
'మొగుడొకటి అంటాడు.
భార్య ఒకటి అంటుంది. ఆ ఒక్కటే విడాకులదాకా
వెడుతోంది. వెనుకటిలా ఈనాటి తరానికి మంచీచెడూ చెప్పీవాళ్ళు ఇళ్ళల్లో వుండడం లేదు.
చెప్పినా వినిపించుకునే పరిస్తితి లేదు. చిన్న విషయాలు పెద్దవి అవుతున్నాయి. మునుపటి రోజుల్లో కూడా ఇలా
జరక్కపోలేదు. కానీ కుటుంబ సంబంధాలు కట్టి పడేసేవి. ఇప్పుడలా కాదు. అప్పటికప్పుడే
వేడి మీద నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందుకే కాస్త నాలుకను అదుపులో పెట్టుకుంటే
ఇలాటి సమస్యలు అన్నీ అదుపులోకి వస్తాయి. లేకపోతే అదుపుతప్పి పోతాయి'
స్వామి వారు చెప్పింది అందరూ విన్నారు. బాగా చెప్పారు
అని కూడా అనుకున్నారు. ఆ హితవచనాలను ఇంటిదాకా ఎంతమంది మోసుకెళ్లారన్నది అనుమానమే.
నేనూ దీనికి మినహాయింపు
కాదని ఓ చర్చలో కూర్చున్నప్పుడు తెలిసిపోయింది.
నా నాలుకే నా శత్రువు.
నిజానికి ఈ శత్రువును జయించాల్సిన
పనిలేదు. స్వామి చెప్పినట్టు అదుపులో వుంచుకుంటే చాలు.
కానీ అయ్యే పనా! (23-03-2015)
NOTE: Courtesy Image Owner
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి