28, మార్చి 2015, శనివారం

ముగిసిన శాసన సభల సమావేశాలు

(Published by 'SURYA' telugu daily in it's Edit Page on 29-03-2015, SUNDAY)

చాలా ఏళ్ళ క్రితం -
అటు పార్లమెంట్ సమావేశాలు కానీ, ఇటు శాసనసభ సమావేశాలు కానీ ప్రారంభం అయ్యే తరుణంలో  రేడియో, దూరదర్శన్ లలో (అప్పుడు ప్రైవేటు టీవీ ఛానళ్ళు లేవు) ఒక రోజు ముందు - 'యిస్యూస్ బిఫోర్ ది హవుస్' (చట్టసభలో చర్చకు రానున్న అంశాలు) అనే  శీర్షికతో పేరెన్నికగన్న జర్నలిస్టులతో ఒక ప్రత్యేక  కార్యక్రమాన్ని ప్రసారం చేసేవారు. దరిమిలా జరిగే చట్టసభల సమావేశాల్లోని చర్చల్లో - ఈ నిపుణుల అభిప్రాయాల ప్రభావం స్పష్టంగా కనబడేది. అలాగే సమావేశాలు జరిగినన్నాళ్ళు- ప్రతిరోజూ రాత్రి పదిహేను నిమిషాలపాటు జర్నలిస్టులతో రాయించిన సమీక్షలు రేడియోలో ప్రసారమయ్యేవి. ఆకాశవాణి వార్తావిభాగం సిబ్బందికి అసిధారావ్రతం లాంటి కార్యక్రమం ఇది. జర్నలిస్టులు రాసుకొచ్చిన సమీక్షను ఒకటికి రెండుసార్లు పరిశీలించిన తరవాతగానీ ప్రసారం చేసేవాళ్ళు  కాదు. ఎందుకంటె ఏమాత్రం తభావతు వచ్చినా 'సభాహక్కుల ఉల్లంఘన'  కిందికి వస్తుందన్న భయం అనండి  ఇంకేదన్నా అనండి - అన్ని జాగ్రత్తలు తీసుకునేలా వారిని జాగరూకులను చేసేది. రేడియోలో ప్రసారం అయ్యే ఈ సమీక్షలను శాసన సభ్యులు నివసించే ప్రాంగణాల్లో మైకుల ద్వారా వినిపించేవాళ్ళు. వినే శ్రోతలకు కరవు వుండేది కాదు. స్తానిక సమస్యలను  శాసన సభలో-   తాము లేవనెత్తిన వయినం గురించి తమ నియోజక వర్గాలలోని జనాలకు తెలియడానికి ఈ కార్యక్రమం బాగా ఉపయోగపడుతుందన్న అభిప్రాయం చాలామంది సభ్యులలో ఉండడంవల్లనొ ఏమో గానీ వారు కూడా దీనిపట్ల యెంతో ఆసక్తి చూపడం ఆనాటి  రేడియో విలేకరిగా నా స్వానుభవం.  విమర్శలు, ప్రతి విమర్శలు ఒక  స్తాయికి మించి ప్రసారం చేయకపోవడం వల్ల - ఛలోక్తులకు తగిన స్తానం కల్పించడంవల్లా - ఈ కార్యక్రమ ప్రభావం సభలో ప్రతిఫలించేది. అతిశయోక్తి అనిపించే ఒక నిజం ఏమిటంటే ఎలా మాట్లాడితే ఈ సమీక్షలో చోటు దొరుకుతుందో అలా మాట్లాడడానికి ప్రయత్నించేవారు. 
ఇక ప్రస్తుతానికి వస్తే-


టీవీ చానళ్ళ విస్తృతి, వాటిమధ్య పోటీల నీలినీడలు శాసన సభల పని తీరుపై ముసురుకుంటున్నాయన్న ఆరోపణల నేపధ్యంలో ఈ అంశాన్ని చర్చించాల్సిన అవసరం ఏర్పడింది. శాసన సభ కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారాలు మొదలయినప్పుడు ప్రజాస్వామ్య ప్రియులందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల వాణి జనాలకు వినపడుతుందని  ఆశపడ్డారు. అర్ధవంతమయిన చర్చలను ఆస్వాదించే అవకాశం లభించిందని సంబరపడ్డారు.  కానీ, సంచలనం ఒక్కటే ఈ ప్రసారాలకు కేంద్ర బిందువుగా మారే అవకాశం వుందని ఊహించలేకపోయారు. ఈ ప్రసారాల తీరుతెన్నులను నిశితంగా పరిశీలిస్తూ వస్తున్న ఒక జర్నలిష్టు మిత్రుడొకరు చేసిన వ్యాఖ్య సమంజసమనిపించేదిగా వుంది. సభ సజావుగా జరుగుతోందన్న అభిప్రాయం లేశ మాత్రంగా కలిగినాసరే - ప్రత్యక్ష ప్రసారాన్ని తక్షణం నిలిపివేసి - టీవీ యాంకర్ మరో అంశానికి మారిపోతాడట. టీవీ రేటింగుల  కోణం నుంచి చూస్తే ఇందులో అసహజమయినది ఏమీ వుండదు. ఎందుకంటె సంచలనం లేకుండా చూపిస్తే చూసేవాళ్ళు వుండరన్నది వారి అభిప్రాయం అయివుండవచ్చు. కానీ దీని ప్రభావం సభ జరిగే తీరుపై పడుతోందన్నది కూడా కాదనలేని నిజం. వీక్షకులు కూడా సంచలనాన్నే కోరుకున్న పక్షంలో ఇక ఈ విషవలయం నుంచి బయటపడడం కష్టం. అయితే ఈ విషయం నిర్ధారణ చేయడానికి ఎలాంటి ప్రయత్నం జరగలేదన్నది సయితం అంగీకరించాల్సిన అంశం. 
చట్ట సభల సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా ఆశించిన సానుకూల ఫలితాలు ఒనగూరాయా అన్న విషయంపై  సమగ్ర చర్చ జరగాల్సి వుంది. సానుకూల ఫలితాల సంగతి సరే, ప్రతికూల  ఫలితాలు గురించి కూడా దృష్టి సారించాలి. అయితే ఒక్క విషయాన్ని మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. చట్ట సభల్లో తాము ఎన్నుకున్న సభ్యుల ప్రవర్తన ఏవిధంగా వుందో గమనించుకోవడానికి వోటర్లకు వున్న  'ఒకే ఒక్క'  అవకాశం ఈ  ప్రత్యక్ష ప్రసారాలే  అన్న అంశాన్ని మరువకూడదు.
అందుకే, సమస్యతో సంబంధం వున్న వాళ్ళందరూ ఈ చర్చలో భాగస్వాములు కావాలి. ఎవరి పాత్ర ఎంతవరకో స్వచ్చందంగా నిర్దేశించుకోవాలి. అనారోగ్యకరమయిన సంచలన ప్రసారాలకు స్వచ్చందంగా అడ్డుకట్ట వేసుకోవాలి. సహేతుక విమర్శలు చేయడానికి ప్రతిపక్షాలకు సరైన అవకాశం సభలో లభించేలా పాలక పక్షం బాధ్యత తీసుకోవాలి. లభించిన అవకాశాన్ని ఆరోపణల  పేరుతో సభా సమయం వృధా చేయని తత్వాన్ని ప్రతిపక్షాలు  అలవరచుకోవాలి. అదేసమయంలో -  సంచలనానికి సంయమనం జోడించి నిఖార్సయిన సమాచారం అందించే బాద్యతను మీడియా నెత్తికెత్తుకోవాలి. ప్రజాస్వామ్య పరిరక్షణలో తమవంతు కర్తవ్యాన్ని నలుగురూ కలసి  కలసికట్టుగా నిర్వర్తించినప్పుడే ప్రజాస్వామ్య సౌధ  పునాదులు నాలుగు కాలాలపాటు పటిష్టంగా మనగలుగుతాయి.
ప్రస్తుతం వున్న విధానం ప్రకారం స్పీకర్ కార్యాలయం ద్వారా నియుక్తులయిన ఒక ప్రైవేట్ సంస్థ నుంచి మాత్రమే  అన్ని ఛానళ్ళు  అసెంబ్లీ 'ఫీడ్' తీసుకుంటున్నాయి.  గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా ఇదే పద్దతి అనుసరించాయి.  అంచేత సభలో దృశ్యాలను చిత్రీకరించి యధాతధంగా ప్రసారం చేసే అవకాశం టీవీ ఛానళ్ళకు లేదు. తమకు అందిన దృశ్యాలను ఏమేరకు యెంత సేపు చూపించవచ్చో అన్నదానిపై మాత్రమె ఛానళ్ళ నిర్వాహకులకు స్వేచ్ఛ వుంది. గతంలో యనమల రామకృష్ణుడు స్పీకర్ గా వున్నప్పుడు అసెంబ్లీ  ప్రత్యక్ష ప్రసారాలను  కొద్ది ఛానళ్ళలో అయినా అంతరాయాలు లేకుండా చూపించే వాళ్ళు.  సభలో ఎవరి ప్రవర్తన ఎలా వున్నది అనే విషయంలో  వీక్షకులు నిష్పాక్షిక అవగాహనకు రావడానికి వీలుండేది. ఇప్పుడా వెసులుబాటు తక్కువ.  భారం ఎక్కువయినా, లోకసభ, రాజ్య సభల మాదిరిగా ప్రత్యేక టీవీ ఛానళ్ళు ఏర్పాటు చేసుకుంటే కొంత ఫలితం ఉండవచ్చునేమో! సమావేశాలు లేని రోజుల్లో కూడా ఈ రెండు ఛానళ్లలో మంచి మంచి చర్చా కార్యక్రమాలు ప్రసారం చేస్తారనే మంచి పేరు వాటికి వుంది.       
ఆంద్ర ప్రదేశ్, తెలంగాణా  రాష్ట్రాల బడ్జెట్ సమావేశాలు ముగిసిన తరుణంలో ఈ రెండు ముక్కలు చెప్పాల్సి వస్తోంది.
సభ ఎలా జరగకూడదో, సభను ఎలా సజావుగా నిర్వహించుకోవచ్చో అనే  ఈ రెండు అంశాలు కూడా  ఈ సమావేశాల కాలంలో తేటతెల్లం అయ్యాయి.
సభ జరగకుండా పాలక ప్రతిపక్షాలు రెండూ శక్తివంచన లేకుండా ప్రయత్నించిన విషయం, అదే సమయంలో వాళ్ళు అవసరం అనుకున్నప్పుడు చర్చలను అర్ధవంతంగా నిర్వహించిన విధానమూ ఈ సమావేశాల కాలంలో ప్రజలు గమనించారు.
తెలంగాణా శాసనసభలో స్వయంగా ముఖ్యమంత్రి తన మంత్రుల చేత క్షమాపణ చెప్పించిన వైనమూ, ఆంద్ర ప్రదేశ్ శాసనసభలో స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదన ప్రతిపక్షం ఉపసంహరించుకున్న అంశమూ, పాలకపక్షం అందుకు సహకరించిన తీరు దీనికి  అద్దం పడతాయి. వాస్తవాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే  ప్రస్తుతం వున్న వ్యవస్థలో స్పీకర్ నిష్పాక్షికతను ప్రశ్నించడం అంత సబబు కాదని అనిపిస్తుంది. ఏ పార్టీ అధికారంలో వున్నా స్పీకర్ పదవిని నిర్వహించేవారు అనేక పరిమితుల నడుమ పనిచేయాల్సిన పరిస్తితి వుంది. యెంత నిష్పాక్షికంగా వ్యవహరించినా ప్రతిపక్షాల విమర్శలు తప్పించుకోవడం కష్టం. తమ గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని ప్రతిపక్షం ఆరోపించడం ఇది మొదటి సారేమీ కాదు. వెనుక తెలుగు దేశం పార్టీ అధికారంలో వున్నప్పుడూ, లేనప్పుడూ కూడా సభలో ఇదేవిధమైన పరిస్తితి వుండేది. స్థానాలను బట్టి వాదనలు మారుతుంటాయి.  స్పీకర్ పై అవిశ్వాసం వంటి  విషయాల్లో పట్టుదలలకు పోకుండా నిగ్రహం పాటించడం శుభపరిణామం.
చట్టసభల్లో జరిగే చర్చల్లో తమదే పైచేయిగా వుండాలని ఏ రాజకీయ పార్టీ అయినా కోరుకుంటే తప్పుపట్టాల్సింది ఏమీ లేదు. కాకపొతే ఈ క్రమంలో, వ్యక్తిగత అంశాలు తెరమీదకు వచ్చి,  ఆవేశకావేశాలు పెచ్చరిల్లి అసలు అంశాలు తెర వెనక్కి మళ్ళుతూ వుండడం విషాదకరం. సభ సజావుగా సాగితే ప్రతిపక్షానికి మంచిది, సభ వాయిదాలు పడుతుంటే పాలక పక్షానికి మంచిదని శాసనసభ వ్యవహారాల్లో నిష్ణాతులయిన వాళ్ళు సూత్రీకరిస్తుంటారు. అయితే, నిర్ణీత పద్దతి ప్రకారం సభ జరగడం, ప్రజాసమస్యలపై సరయిన చర్చ జరగడం, వాటిపట్ల ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించడం అంటూ జరిగితే అది ప్రజాస్వామ్యానికి మంచిది. దుర్భాషలు, దూషణ పర్వాలు, ఆత్మస్తుతులు, పరనిందలు, ఖండనముండనలు, వాదోపవాదాలు, సస్పెన్షన్లు, బహిష్కరణలు, వాకౌట్లు, వాయిదాలు ఇలాటివన్నీ శాసనసభల గౌరవాన్ని ఇనుమడింపచేయవు. వ్యక్తిగతమైన ఆరోపణల ప్రభావం  కొన్ని సందర్భాలలో సభ ముగిసిన తరువాత కూడా సభ్యుల మనస్సులో కొనసాగి శాశ్విత వైరంగా మారే ప్రమాదం కూడా వుంటుంది. సభ్యులు  అందరూ ఒక కుటుంబ సభ్యులే అనే భావం బలపడేలా చర్యలు అవసరం. గతంలో కొందరు స్పీకర్లు సమావేశాలు జరిగే  కాలంలో వారికోసం  ఆటలపోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారు. సభలో తలెత్తే వైమనస్య భావనల తీవ్రతను ఉపశమింపచేయడానికి ఇవి కొంతవరకు దోహదపడతాయి.          
బహిరంగ సభల్లో వక్తల ప్రసంగాలు ముగిసినప్పుడు శ్రోతలు  'అమ్మయ్య అయిపొయింది' అనుకోవడానికి, 'అయ్యో అప్పుడే అయిపోయిందా' అని అనుకోవడానికి ఎంతో తేడా వుంటుంది. అలాగే, శాసన సభలు ముగిసినప్పుడు కూడా జనం 'అయ్యో! అప్పుడే అయిపోయాయా' అని అనుకునేలా చేయగలిగితే చట్టసభల నిర్వహణకు సార్ధకత చేకూరుతుంది.
(28-03-2015)   

కామెంట్‌లు లేవు: