24, మార్చి 2015, మంగళవారం

ప్రజారోగ్యం - ప్రభుత్వాల కర్తవ్యం

(Published by 'SURYA' telugu daily in it's edit page on 26-03-2015, Thursday) 
  
"డబ్బు కట్టలేని రోగి చావాల్సిందేనా?"
ఈ ప్రశ్న వేసింది ఆషామాషీ వ్యక్తీ కాదు, ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఆఖరి గవర్నర్,  తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు తొలి  ఉమ్మడి గవర్నర్ అయిన శ్రీ నరసింహన్.
హైదరాబాదులో ఆరోగ్యసేవలకు సంబంధించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు పత్రికల్లో వచ్చింది. గవర్నర్ అంత కటువుగా అన్నారో లేదో తెలియదు కాని, మీడియాలో వచ్చిన దాన్నిబట్టి ఆయన  ఎంతో ఆవేదనతోనే ఈ మాటలు చెప్పారని భావించాల్సి వుంది. కార్పొరేట్ ఆసుపత్రులు రోగుల నుంచి ఫీజులు వసూలు చేసే  విషయంలో అనుసరిస్తున్న కొన్ని అమానవీయ విధానాలు గురించి గవర్నర్ తన ప్రసంగంలో  ప్రస్తావించినప్పటికీ, యావత్ ఆరోగ్య వైద్య సేవలు గురించి విశ్లేషించుకోవాల్సిన అగత్యాన్ని ఈసందర్భం కలిగిస్తోంది.
ప్రభుత్వం ఏటా కోట్ల రూపాయలు వైద్య ఆరోగ్య రంగంపై ఖర్చు చేస్తోంది.ఇందులో సింహ భాగం నిర్వహణ వ్యయం కిందికే పోతోంది. గ్రామీణ ప్రాంతాలలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు కొంత మేరకు ప్రజల ఆరోగ్య సేవల అవసరాలను తీరుస్తున్నప్పటికీ- డాక్టర్ల కొరత అన్నది ఎప్పటికీ తీరని సమస్యగానే మిగిలిపోతున్నది. మన రాష్ట్రంలో ఎనభయి వేల గ్రామాలుంటే, కేవలం పదిహేను వందల చోట్ల మాత్రమే వైద్యులు అందుబాటులో ఉన్నారు. వైద్య కళాశాలలో పట్టా పుచ్చుకున్న ఏ ఒక్కరు కూడా పల్లెలకు వెళ్లి వైద్యం చేయడానికి సిద్దంగా లేరంటే అతిశయోక్తి కాదు. ఇక మందుల విషయం చెప్పనక్కరలేదు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు దూరంగా వున్న పల్లెల్లో నివసించే వారికి ఈ అరకొర సదుపాయం కూడా అందుబాటులో లేదు. నాటు వైద్యుల దయా దాక్షిణ్యాల పయినా, వారిచ్చే నాటు మందుల పయినా ఆధారపడాల్సిన దీన స్తితి వారిది. బయట ప్రపంచంతో సంబంధాలు లేకుండా అరణ్య ప్రాంతాలలో - అంత సులువుగా చేరుకోలేని కోయ గూడాలు, లంబాడి తండాల్లో వుండే పేద వారికి రోగం రొస్టూ వస్తే ఇక ఇంతే సంగతులు. అలాటివారు సాధారణంగా షుగరు, రక్త పోటు, ఉబ్బసం, కీళ్ళ వ్యాధులతో బాధపడుతుంటారు. అసలు ఇలాటి జబ్బులు తమకు వున్నట్టు కూడా వీరికి తెలియదు. ఎందుకంటె ఎలాటి వైద్య పరీక్షలు ఎప్పుడూ చేయించుకుని ఎరుగరు కనుక. రోగం ముదిరి ఏ పక్షవాతానికో దారి తీసేదాకా 'బీపీ' వున్నట్టు కూడా తెలియదు.
ఆరోగ్య మంత్రిత్వ శాఖను వైద్య, ఆరోగ్య శాఖ అంటుంటారు. అంటే ఆరోగ్యానికీ, వైద్యానికి సంబంధం ఉన్నప్పటికీ ఆరోగ్యం కాపాడుకోగలిగితే, వైద్య  అవసరం రాదన్న అర్ధం ఇందులో నిగూఢ౦గా వుంది. అందుకే మన పూర్వీకులు ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చేవారు. వ్యాధులకు చికిత్స బదులు, రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకునే వారు. తాగే నీరు, తినే ఆహారం, నివసించే వాతావరణం ఇవన్నీ మనుషుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంటాయి. ఈ ప్రాధమిక అంశాలకు ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇస్తే రోగాల సంఖ్యా, రోగుల సంఖ్యా తగ్గిపోయి వైద్య రంగంపై ప్రభుత్వం పెట్టే ఖర్చు గణనీయంగా తగ్గగలదని ఆ రంగంలో విశేష కృషి చేసిన నిపుణులు అంటున్నారు. ఈ సదుద్దేశ్యంతోనే కొద్దికాలం క్రితం హెచ్ ఎం ఆర్ ఐ అనే స్వచ్చంద సంస్థ కొంత కృషి చేసింది.
సుదూర గ్రామీణ ప్రాంతాలలో నివసించేవారికి కనీస వైద్య సదుపాయాలూ ఈనాటి వరకు లేవనీ, నాటు వైద్యం మీదనే వాళ్ళు బతుకులు వెళ్ళదీస్తున్నారని, బీపీ, షుగర్ వంటి వ్యాధులు ముదిరి ప్రాణం మీదకు వచ్చేవరకు అలాటి వ్యాధుల బారిన పడ్డ విషయం కూడా తెలియని నిర్భాగ్య స్తితిలో వారు రోజులు గడుపుతున్నారని ఆనాటి ప్రభుత్వ పెద్దలకు పధకం రూపకర్తలు  వివరించారు. అలాటి ప్రజానీకానికి  నెలకొక్కమారు వైద్య పరీక్షలు జరిపి,  రోగ నిర్ధారణ జరిపి  తగిన మందులిస్తే,  పక్షవాతం వంటి జబ్బుల బారిన పడకుండా కాపాడవచ్చని  చెప్పారు. ప్రస్తుతం వున్న వైద్య ఆరోగ్య శాఖ వార్షిక  బడ్జట్ తో పోలిస్తే ఇందుకయ్యే ఖర్చు అతి స్వల్పమని వివరించారు. అయితే ప్రభుత్వానికి ఒక అనుమానం వచ్చింది. గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళే ఈ సంచార వైద్య వాహనంలో డాక్టర్ వుంటాడా? అని.  డాక్టర్ల కొరత, గ్రామీణ ప్రాంతాలలో పనిచేయడానికి వారిలో పేరుకుపోతున్న వైముఖ్యం కారణంగానే ఈ పధకాన్ని రూపొందించాల్సి వచ్చిందని స్వచ్చంద సంస్థ ప్రతినిధుల సమాధానం. మొత్తం మీద రాష్ట్రంలో హెచ్ ఎం ఆర్ ఐ సంస్థ కార్యకలాపాలు ప్రభుత్వ ప్రవేట్ భాగస్వామ్యం ప్రాతిపదికన మొదలయ్యాయి.
అందుబాటులో వున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు మూడు కిలోమీటర్ల ఆవల వుండే ప్రతి పల్లెకు- నెల నెలా క్రమం తప్పకుండా వెళ్లి - వూరివారికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించే వాహనానికి రూపకల్పన చేశారు. 108 అంబులెన్సు పధకం,  ప్రమాదం అంచున ఉన్నవారి ప్రాణాలను కాపాడేందుకు ఉద్దేశించినది. హెచ్ ఎం ఆర్ ఐ రూపొందించిన ఈ  104 సంచార వైద్య వాహనం - పేద పల్లె ప్రజల ప్రాణాలు ప్రమాదం అంచుకు చేరకుండా చూస్తుంది. ఇంతా చేసి ఈ పధకం కింద లబ్ది పొందేవారి సంఖ్యను లెక్కలోకి తీసుకుంటే- ఒక్కొక్కరిపై పెట్టె ఖర్చు ఏడాదికి కేవలం ఎనభయి రూపాయలు మాత్రమే. అంటే - వైద్య ఆరోగ్య రంగం బడ్జెట్ లో పది శాతం కన్నా తక్కువన్నమాట.
104 వాహనం ప్రతి నెలా ఒక నిర్దేశిత దినం నాడు క్రమం తప్పకుండా ఒక గ్రామాన్ని సందర్శిస్తుంది. ఇందులో ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్, ముగ్గురు ఏ ఎన్ ఎం లు(నర్సులు), ఒక ఫార్మసిస్టు, ఒక లాబ్ టెక్నీషియన్, ఒక డ్రయివర్తో సహా మొత్తం ఏడుగురు సిబ్బంది వుంటారు. బయో మెట్రిక్ పద్దతి ద్వారా రోగుల వివరాలను కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తారు. గర్భిణీ స్త్రీలను, బాలింతలను పరీక్షించి మందులు ఇస్తారు. గర్భిణి కడుపులో పిండం పెరుగుదలను నెలనెలా గమనిస్తూ తగిన జాగ్రత్తలు సూచిస్తారు.అవసరమని భావిస్తే,108 అంబులెన్సుకి ఫోన్ చేసి రప్పించి ఆసుపత్రిలో చేర్పిస్తారు. రక్త పోటు, షుగర్ ఉన్నవారికి నెలవారీగా చేయాల్సిన రక్త పరీక్షలు , ఇతర పరీక్షలు నిర్వహించి అవసరమైన మార్పులతో మందులు ఉచితంగా అక్కడికక్కడే పంపిణీ చేస్తారు.

'దర్వాజాలో దవాఖానా' వంటి ఈ పధకం తదనంతర కాలంలో సంభవించిన రాజకీయ పరిణామాల నేపధ్యంలో అందే ప్రభుత్వసయం అరకొరగా మారడంతో అర్ధాంతరంగా అటకెక్కింది. ఉమ్మడి రాష్ట్రంలో సంభవించిన రాజకీయ పరిణామాల క్రీనీడలు సంస్థ కార్యకలాపాలపై ముసురుకుని తొలి దశ లోనే సంస్థ కృషి అర్ధాంతరంగా ముగిసింది.
ఆదర్శంగా నిలవాల్సిన ఓ అద్భుత పధకం కొందరి నిర్వాకాలకు నీరుకారిపోయింది. మరి కొందరి స్వార్ధాలకు బలయిపోయింది. ఇంకొందరి  ఆహాలను చల్లార్చడానికి మాడి మసయిపోయింది. రాజకీయ చదరంగంలో చిక్కుకుపోయి ఆ  ఎత్తులు పైఎత్తుల్లో చితికి   చిత్తయిపోయింది.
ఇంత జరిగినా ఏమీ జరగనట్టే వుండడానికి కారణం వుంది. ఈ పధకం వల్ల లబ్ది పొందుతున్న వారు నిరుపేదలు. వారికి నోరూవాయీ లేదు.
కష్టం వచ్చినా చెప్పుకోలేరు. ఆ కష్టం తొలగినా చెప్పుకోలేరు. ఎందుకంటె చెప్పుకోవడానికి వారికెవరూ లేరు.
వారి గురించి రాసేవారు లేరు. కారణం  వారిలో చాలా మంది నిరక్షరాస్యులు. చదవడం రాని వారి గురించిన వార్తలు ఎవరికీ పట్టవు. 
వారి గురించి బుల్లి తెరలపై చూపించేవారు లేరు. ఎందుకంటె అలాటి ఆధునిక సౌకర్యాలకు దూరంగా ఎక్కడో బతుకులీడుస్తున్న బడుగులు వాళ్ళు.
అలాటి వాళ్లకు బాగా ఉపయోగపడే ఒక మంచి ఆరోగ్య పధకం పురుట్లోనే సంధి కొట్టిన రీతిగా అదృశ్యం అయింది.
ఇది ఉమ్మడి రాష్ట్రం చివరాఖరు దశలో జరిగిన కధ. ఇప్పుడు అటూ ఇటూ రెండు కొత్త రాష్ట్రాలు. తమదయిన రీతిలో మంచి పనులు చేసి రాష్ట్రానికి ఎంతో కొంత మంచి చేయాలనే దిశానిర్దేశంతో సాగిపోతున్న ఇద్దరు ముఖ్యమంత్రులు. చేయాలన్న తపన వుంది. చేసి చూపిస్తాం అనే సంస్థలు వున్నాయి. తపనకు, సహకారం తోడయితే సత్ఫలితాల విషయంలో సందేహించే పని వుండదు. టెక్నాలజీని సరిగా ఉపయోగించుకుంటే మానవ ప్రయత్నాలకు మరింత పరిపుష్టి చేకూరుతుంది.  గ్రామీణ ప్రాంతాల ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడే ఇటువంటి పధకాలపై  రెండు తెలుగు ప్రభుత్వాలు దృష్టి పెడితే బాగుంటుంది.

(24-03-2015)

కామెంట్‌లు లేవు: