31, మార్చి 2015, మంగళవారం

భగవద్గీత - బొగ్గులబస్తా


తాతయ్య పొద్దున్నే లేచి భగవద్గీత చదువుతుండేవాడు. అది భగవద్గీత అని చాలా రోజులకుగానీ మనవడికి తెలియలేదు. అయితే ఎన్నిసార్లు విన్నా ఒక్క ముక్క అర్ధం అయ్యేది కాదు. ఆ సంగతి తెలిసి తాతయ్య చెప్పాడు. 'ఇదిగో ఈ ఖాళీ బొగ్గుల బస్తా తీసుకు వెళ్లి  మన ఇంటి దగ్గర వాగులో నుంచి ఓ  బస్తాడు నీళ్ళు పట్రా'
మనమడు వెళ్ళాడు. బస్తాను నీళ్ళల్లో ముంచి తీసాడు. ఒక్క చుక్క కూడా మిగలకుండా  మొత్తం నీళ్ళు  కారిపోయాయి. మనుమడు మళ్ళీ ముంచి తీసాడు. మళ్ళీ తీసాడు. ఎన్ని సార్లు ముంచి తీసినా చారెడు నీళ్ళు కూడా బస్తాలో మిగిలేవి కావు. ఇలా కాదనుకుని ఈసారి బస్తాను  నీటిలో ముంచి క్షణం ఆలస్యం చేయకుండా పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి చేరేసరికల్లా మళ్ళీ బస్తా ఖాళీ. 'తాతయ్యకు కావాల్సింది నీళ్ళే  అయినప్పుడు బస్తా ఎందుకు బకెట్టు తీసుకువెడితే సరి' అని అది చేత్తో పట్టుకున్నాడు. తాతయ్య ససేమిరా వల్లకదన్నాడు. బస్తాతోటే నీళ్ళు తెమ్మన్నాడు. మనుమడి మళ్ళీ వాగు దగ్గరికి  వెళ్ళాడు. బస్తాను నీటిలో ముంచి తీసి మెరుపు వేగంతో ఉరుక్కుంటూ ఇంటికి వచ్చాడు. ఆయసమే మిగిలింది కాని బస్తాలో చేరెడు నీళ్ళు కూడా లేవు. అన్నీ దోవలోనే కారి పోయాయి. 'ఏమిటి తాతయ్యా ఇదంతా' అని అడిగాడు. తాతయ్య మందహాసం చేసాడు.
'ఒకసారి ఆ బస్తా వంక  చూడు మనవడా' అన్నాడు. మనుమడు చూసాడు. నల్లటి బొగ్గుల బస్తా కాస్తా  ఇప్పుడు మసంతా కొట్టుకు పోయి శుభ్రంగా వుంది.

తాతయ్య చెప్పాడు. 'చూసావా. నాలుగు సార్లు నీళ్ళల్లో ముంచితేనే బస్తాకు పట్టుకున్న  బొగ్గుమసి కొట్టుకు పోయింది. నీళ్ళల్లోముంచి తీస్తుంటే మసి పోతుందని కూడా తెలవకుండా నువ్వు ఇదంతా చేసావు. భగవద్గీత  కూడా అంతే! అర్ధం అయిందా లేదా అనికాదు. చదువుతూ పోతుంటే అది మన మనసుల్లోని కల్మషాన్ని తొలగిస్తుంది. తేరుకున్న నీటిలా మన  మనసును తేటపరుస్తుంది.  అదే భగవద్గీత మహత్యం!' 


29, మార్చి 2015, ఆదివారం

అర్నాబ్ గోస్వామి మార్కు జర్నలిజం



మాట్లాడడానికి స్టూడియోకి పిలిచి మాట్లాడనివ్వకుండా అడ్డుతగలడం -  ఇదో కొత్తరకం జర్నలిజం. ఏమైనా అందామంటే ఇండియాలో నెంబర్ వన్ ప్రోగ్రాం అని వీరతాళ్ళు వేసేవాళ్ళు ఎక్కువమంది. ఇక ఆయన చర్చకు తీసుకున్న  'ఆప్'  సంగతి. మేధావులు ఎక్కువ అయితే పార్టీ పలచన పడుతుందని కొత్త సామెత.


28, మార్చి 2015, శనివారం

ముగిసిన శాసన సభల సమావేశాలు

(Published by 'SURYA' telugu daily in it's Edit Page on 29-03-2015, SUNDAY)

చాలా ఏళ్ళ క్రితం -
అటు పార్లమెంట్ సమావేశాలు కానీ, ఇటు శాసనసభ సమావేశాలు కానీ ప్రారంభం అయ్యే తరుణంలో  రేడియో, దూరదర్శన్ లలో (అప్పుడు ప్రైవేటు టీవీ ఛానళ్ళు లేవు) ఒక రోజు ముందు - 'యిస్యూస్ బిఫోర్ ది హవుస్' (చట్టసభలో చర్చకు రానున్న అంశాలు) అనే  శీర్షికతో పేరెన్నికగన్న జర్నలిస్టులతో ఒక ప్రత్యేక  కార్యక్రమాన్ని ప్రసారం చేసేవారు. దరిమిలా జరిగే చట్టసభల సమావేశాల్లోని చర్చల్లో - ఈ నిపుణుల అభిప్రాయాల ప్రభావం స్పష్టంగా కనబడేది. అలాగే సమావేశాలు జరిగినన్నాళ్ళు- ప్రతిరోజూ రాత్రి పదిహేను నిమిషాలపాటు జర్నలిస్టులతో రాయించిన సమీక్షలు రేడియోలో ప్రసారమయ్యేవి. ఆకాశవాణి వార్తావిభాగం సిబ్బందికి అసిధారావ్రతం లాంటి కార్యక్రమం ఇది. జర్నలిస్టులు రాసుకొచ్చిన సమీక్షను ఒకటికి రెండుసార్లు పరిశీలించిన తరవాతగానీ ప్రసారం చేసేవాళ్ళు  కాదు. ఎందుకంటె ఏమాత్రం తభావతు వచ్చినా 'సభాహక్కుల ఉల్లంఘన'  కిందికి వస్తుందన్న భయం అనండి  ఇంకేదన్నా అనండి - అన్ని జాగ్రత్తలు తీసుకునేలా వారిని జాగరూకులను చేసేది. రేడియోలో ప్రసారం అయ్యే ఈ సమీక్షలను శాసన సభ్యులు నివసించే ప్రాంగణాల్లో మైకుల ద్వారా వినిపించేవాళ్ళు. వినే శ్రోతలకు కరవు వుండేది కాదు. స్తానిక సమస్యలను  శాసన సభలో-   తాము లేవనెత్తిన వయినం గురించి తమ నియోజక వర్గాలలోని జనాలకు తెలియడానికి ఈ కార్యక్రమం బాగా ఉపయోగపడుతుందన్న అభిప్రాయం చాలామంది సభ్యులలో ఉండడంవల్లనొ ఏమో గానీ వారు కూడా దీనిపట్ల యెంతో ఆసక్తి చూపడం ఆనాటి  రేడియో విలేకరిగా నా స్వానుభవం.  విమర్శలు, ప్రతి విమర్శలు ఒక  స్తాయికి మించి ప్రసారం చేయకపోవడం వల్ల - ఛలోక్తులకు తగిన స్తానం కల్పించడంవల్లా - ఈ కార్యక్రమ ప్రభావం సభలో ప్రతిఫలించేది. అతిశయోక్తి అనిపించే ఒక నిజం ఏమిటంటే ఎలా మాట్లాడితే ఈ సమీక్షలో చోటు దొరుకుతుందో అలా మాట్లాడడానికి ప్రయత్నించేవారు. 
ఇక ప్రస్తుతానికి వస్తే-


టీవీ చానళ్ళ విస్తృతి, వాటిమధ్య పోటీల నీలినీడలు శాసన సభల పని తీరుపై ముసురుకుంటున్నాయన్న ఆరోపణల నేపధ్యంలో ఈ అంశాన్ని చర్చించాల్సిన అవసరం ఏర్పడింది. శాసన సభ కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారాలు మొదలయినప్పుడు ప్రజాస్వామ్య ప్రియులందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల వాణి జనాలకు వినపడుతుందని  ఆశపడ్డారు. అర్ధవంతమయిన చర్చలను ఆస్వాదించే అవకాశం లభించిందని సంబరపడ్డారు.  కానీ, సంచలనం ఒక్కటే ఈ ప్రసారాలకు కేంద్ర బిందువుగా మారే అవకాశం వుందని ఊహించలేకపోయారు. ఈ ప్రసారాల తీరుతెన్నులను నిశితంగా పరిశీలిస్తూ వస్తున్న ఒక జర్నలిష్టు మిత్రుడొకరు చేసిన వ్యాఖ్య సమంజసమనిపించేదిగా వుంది. సభ సజావుగా జరుగుతోందన్న అభిప్రాయం లేశ మాత్రంగా కలిగినాసరే - ప్రత్యక్ష ప్రసారాన్ని తక్షణం నిలిపివేసి - టీవీ యాంకర్ మరో అంశానికి మారిపోతాడట. టీవీ రేటింగుల  కోణం నుంచి చూస్తే ఇందులో అసహజమయినది ఏమీ వుండదు. ఎందుకంటె సంచలనం లేకుండా చూపిస్తే చూసేవాళ్ళు వుండరన్నది వారి అభిప్రాయం అయివుండవచ్చు. కానీ దీని ప్రభావం సభ జరిగే తీరుపై పడుతోందన్నది కూడా కాదనలేని నిజం. వీక్షకులు కూడా సంచలనాన్నే కోరుకున్న పక్షంలో ఇక ఈ విషవలయం నుంచి బయటపడడం కష్టం. అయితే ఈ విషయం నిర్ధారణ చేయడానికి ఎలాంటి ప్రయత్నం జరగలేదన్నది సయితం అంగీకరించాల్సిన అంశం. 
చట్ట సభల సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా ఆశించిన సానుకూల ఫలితాలు ఒనగూరాయా అన్న విషయంపై  సమగ్ర చర్చ జరగాల్సి వుంది. సానుకూల ఫలితాల సంగతి సరే, ప్రతికూల  ఫలితాలు గురించి కూడా దృష్టి సారించాలి. అయితే ఒక్క విషయాన్ని మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. చట్ట సభల్లో తాము ఎన్నుకున్న సభ్యుల ప్రవర్తన ఏవిధంగా వుందో గమనించుకోవడానికి వోటర్లకు వున్న  'ఒకే ఒక్క'  అవకాశం ఈ  ప్రత్యక్ష ప్రసారాలే  అన్న అంశాన్ని మరువకూడదు.
అందుకే, సమస్యతో సంబంధం వున్న వాళ్ళందరూ ఈ చర్చలో భాగస్వాములు కావాలి. ఎవరి పాత్ర ఎంతవరకో స్వచ్చందంగా నిర్దేశించుకోవాలి. అనారోగ్యకరమయిన సంచలన ప్రసారాలకు స్వచ్చందంగా అడ్డుకట్ట వేసుకోవాలి. సహేతుక విమర్శలు చేయడానికి ప్రతిపక్షాలకు సరైన అవకాశం సభలో లభించేలా పాలక పక్షం బాధ్యత తీసుకోవాలి. లభించిన అవకాశాన్ని ఆరోపణల  పేరుతో సభా సమయం వృధా చేయని తత్వాన్ని ప్రతిపక్షాలు  అలవరచుకోవాలి. అదేసమయంలో -  సంచలనానికి సంయమనం జోడించి నిఖార్సయిన సమాచారం అందించే బాద్యతను మీడియా నెత్తికెత్తుకోవాలి. ప్రజాస్వామ్య పరిరక్షణలో తమవంతు కర్తవ్యాన్ని నలుగురూ కలసి  కలసికట్టుగా నిర్వర్తించినప్పుడే ప్రజాస్వామ్య సౌధ  పునాదులు నాలుగు కాలాలపాటు పటిష్టంగా మనగలుగుతాయి.
ప్రస్తుతం వున్న విధానం ప్రకారం స్పీకర్ కార్యాలయం ద్వారా నియుక్తులయిన ఒక ప్రైవేట్ సంస్థ నుంచి మాత్రమే  అన్ని ఛానళ్ళు  అసెంబ్లీ 'ఫీడ్' తీసుకుంటున్నాయి.  గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా ఇదే పద్దతి అనుసరించాయి.  అంచేత సభలో దృశ్యాలను చిత్రీకరించి యధాతధంగా ప్రసారం చేసే అవకాశం టీవీ ఛానళ్ళకు లేదు. తమకు అందిన దృశ్యాలను ఏమేరకు యెంత సేపు చూపించవచ్చో అన్నదానిపై మాత్రమె ఛానళ్ళ నిర్వాహకులకు స్వేచ్ఛ వుంది. గతంలో యనమల రామకృష్ణుడు స్పీకర్ గా వున్నప్పుడు అసెంబ్లీ  ప్రత్యక్ష ప్రసారాలను  కొద్ది ఛానళ్ళలో అయినా అంతరాయాలు లేకుండా చూపించే వాళ్ళు.  సభలో ఎవరి ప్రవర్తన ఎలా వున్నది అనే విషయంలో  వీక్షకులు నిష్పాక్షిక అవగాహనకు రావడానికి వీలుండేది. ఇప్పుడా వెసులుబాటు తక్కువ.  భారం ఎక్కువయినా, లోకసభ, రాజ్య సభల మాదిరిగా ప్రత్యేక టీవీ ఛానళ్ళు ఏర్పాటు చేసుకుంటే కొంత ఫలితం ఉండవచ్చునేమో! సమావేశాలు లేని రోజుల్లో కూడా ఈ రెండు ఛానళ్లలో మంచి మంచి చర్చా కార్యక్రమాలు ప్రసారం చేస్తారనే మంచి పేరు వాటికి వుంది.       
ఆంద్ర ప్రదేశ్, తెలంగాణా  రాష్ట్రాల బడ్జెట్ సమావేశాలు ముగిసిన తరుణంలో ఈ రెండు ముక్కలు చెప్పాల్సి వస్తోంది.
సభ ఎలా జరగకూడదో, సభను ఎలా సజావుగా నిర్వహించుకోవచ్చో అనే  ఈ రెండు అంశాలు కూడా  ఈ సమావేశాల కాలంలో తేటతెల్లం అయ్యాయి.
సభ జరగకుండా పాలక ప్రతిపక్షాలు రెండూ శక్తివంచన లేకుండా ప్రయత్నించిన విషయం, అదే సమయంలో వాళ్ళు అవసరం అనుకున్నప్పుడు చర్చలను అర్ధవంతంగా నిర్వహించిన విధానమూ ఈ సమావేశాల కాలంలో ప్రజలు గమనించారు.
తెలంగాణా శాసనసభలో స్వయంగా ముఖ్యమంత్రి తన మంత్రుల చేత క్షమాపణ చెప్పించిన వైనమూ, ఆంద్ర ప్రదేశ్ శాసనసభలో స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదన ప్రతిపక్షం ఉపసంహరించుకున్న అంశమూ, పాలకపక్షం అందుకు సహకరించిన తీరు దీనికి  అద్దం పడతాయి. వాస్తవాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే  ప్రస్తుతం వున్న వ్యవస్థలో స్పీకర్ నిష్పాక్షికతను ప్రశ్నించడం అంత సబబు కాదని అనిపిస్తుంది. ఏ పార్టీ అధికారంలో వున్నా స్పీకర్ పదవిని నిర్వహించేవారు అనేక పరిమితుల నడుమ పనిచేయాల్సిన పరిస్తితి వుంది. యెంత నిష్పాక్షికంగా వ్యవహరించినా ప్రతిపక్షాల విమర్శలు తప్పించుకోవడం కష్టం. తమ గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని ప్రతిపక్షం ఆరోపించడం ఇది మొదటి సారేమీ కాదు. వెనుక తెలుగు దేశం పార్టీ అధికారంలో వున్నప్పుడూ, లేనప్పుడూ కూడా సభలో ఇదేవిధమైన పరిస్తితి వుండేది. స్థానాలను బట్టి వాదనలు మారుతుంటాయి.  స్పీకర్ పై అవిశ్వాసం వంటి  విషయాల్లో పట్టుదలలకు పోకుండా నిగ్రహం పాటించడం శుభపరిణామం.
చట్టసభల్లో జరిగే చర్చల్లో తమదే పైచేయిగా వుండాలని ఏ రాజకీయ పార్టీ అయినా కోరుకుంటే తప్పుపట్టాల్సింది ఏమీ లేదు. కాకపొతే ఈ క్రమంలో, వ్యక్తిగత అంశాలు తెరమీదకు వచ్చి,  ఆవేశకావేశాలు పెచ్చరిల్లి అసలు అంశాలు తెర వెనక్కి మళ్ళుతూ వుండడం విషాదకరం. సభ సజావుగా సాగితే ప్రతిపక్షానికి మంచిది, సభ వాయిదాలు పడుతుంటే పాలక పక్షానికి మంచిదని శాసనసభ వ్యవహారాల్లో నిష్ణాతులయిన వాళ్ళు సూత్రీకరిస్తుంటారు. అయితే, నిర్ణీత పద్దతి ప్రకారం సభ జరగడం, ప్రజాసమస్యలపై సరయిన చర్చ జరగడం, వాటిపట్ల ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించడం అంటూ జరిగితే అది ప్రజాస్వామ్యానికి మంచిది. దుర్భాషలు, దూషణ పర్వాలు, ఆత్మస్తుతులు, పరనిందలు, ఖండనముండనలు, వాదోపవాదాలు, సస్పెన్షన్లు, బహిష్కరణలు, వాకౌట్లు, వాయిదాలు ఇలాటివన్నీ శాసనసభల గౌరవాన్ని ఇనుమడింపచేయవు. వ్యక్తిగతమైన ఆరోపణల ప్రభావం  కొన్ని సందర్భాలలో సభ ముగిసిన తరువాత కూడా సభ్యుల మనస్సులో కొనసాగి శాశ్విత వైరంగా మారే ప్రమాదం కూడా వుంటుంది. సభ్యులు  అందరూ ఒక కుటుంబ సభ్యులే అనే భావం బలపడేలా చర్యలు అవసరం. గతంలో కొందరు స్పీకర్లు సమావేశాలు జరిగే  కాలంలో వారికోసం  ఆటలపోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారు. సభలో తలెత్తే వైమనస్య భావనల తీవ్రతను ఉపశమింపచేయడానికి ఇవి కొంతవరకు దోహదపడతాయి.          
బహిరంగ సభల్లో వక్తల ప్రసంగాలు ముగిసినప్పుడు శ్రోతలు  'అమ్మయ్య అయిపొయింది' అనుకోవడానికి, 'అయ్యో అప్పుడే అయిపోయిందా' అని అనుకోవడానికి ఎంతో తేడా వుంటుంది. అలాగే, శాసన సభలు ముగిసినప్పుడు కూడా జనం 'అయ్యో! అప్పుడే అయిపోయాయా' అని అనుకునేలా చేయగలిగితే చట్టసభల నిర్వహణకు సార్ధకత చేకూరుతుంది.
(28-03-2015)   

27, మార్చి 2015, శుక్రవారం

మగాడి నిర్ణయం


తెలివిగలవాడు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సివచ్చినప్పుడు ఇంట్లో అందర్నీ సంప్రదిస్తాడు. ఆ నిర్ణయం వల్ల తలెత్తగల సమస్యలను క్షుణ్ణంగా వారికి వివరిస్తాడు. వారు చెప్పేది జాగ్రత్తగా వింటాడు. వాటిని గురించి నింపాదిగా  ఆలోచిస్తాడు. అనవసరమైన కంగారు పడడు. ఇతరులను పెట్టడు. అన్నీ సాకల్యంగా బేరీజు వేసుకుంటాదు. చివరికి భార్య చెప్పిందే వింటాడు. 


దట్ సింపిల్ !
NOTE: Courtesy Image Owner

24, మార్చి 2015, మంగళవారం

ప్రజారోగ్యం - ప్రభుత్వాల కర్తవ్యం

(Published by 'SURYA' telugu daily in it's edit page on 26-03-2015, Thursday) 
  
"డబ్బు కట్టలేని రోగి చావాల్సిందేనా?"
ఈ ప్రశ్న వేసింది ఆషామాషీ వ్యక్తీ కాదు, ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఆఖరి గవర్నర్,  తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు తొలి  ఉమ్మడి గవర్నర్ అయిన శ్రీ నరసింహన్.
హైదరాబాదులో ఆరోగ్యసేవలకు సంబంధించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు పత్రికల్లో వచ్చింది. గవర్నర్ అంత కటువుగా అన్నారో లేదో తెలియదు కాని, మీడియాలో వచ్చిన దాన్నిబట్టి ఆయన  ఎంతో ఆవేదనతోనే ఈ మాటలు చెప్పారని భావించాల్సి వుంది. కార్పొరేట్ ఆసుపత్రులు రోగుల నుంచి ఫీజులు వసూలు చేసే  విషయంలో అనుసరిస్తున్న కొన్ని అమానవీయ విధానాలు గురించి గవర్నర్ తన ప్రసంగంలో  ప్రస్తావించినప్పటికీ, యావత్ ఆరోగ్య వైద్య సేవలు గురించి విశ్లేషించుకోవాల్సిన అగత్యాన్ని ఈసందర్భం కలిగిస్తోంది.
ప్రభుత్వం ఏటా కోట్ల రూపాయలు వైద్య ఆరోగ్య రంగంపై ఖర్చు చేస్తోంది.ఇందులో సింహ భాగం నిర్వహణ వ్యయం కిందికే పోతోంది. గ్రామీణ ప్రాంతాలలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు కొంత మేరకు ప్రజల ఆరోగ్య సేవల అవసరాలను తీరుస్తున్నప్పటికీ- డాక్టర్ల కొరత అన్నది ఎప్పటికీ తీరని సమస్యగానే మిగిలిపోతున్నది. మన రాష్ట్రంలో ఎనభయి వేల గ్రామాలుంటే, కేవలం పదిహేను వందల చోట్ల మాత్రమే వైద్యులు అందుబాటులో ఉన్నారు. వైద్య కళాశాలలో పట్టా పుచ్చుకున్న ఏ ఒక్కరు కూడా పల్లెలకు వెళ్లి వైద్యం చేయడానికి సిద్దంగా లేరంటే అతిశయోక్తి కాదు. ఇక మందుల విషయం చెప్పనక్కరలేదు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు దూరంగా వున్న పల్లెల్లో నివసించే వారికి ఈ అరకొర సదుపాయం కూడా అందుబాటులో లేదు. నాటు వైద్యుల దయా దాక్షిణ్యాల పయినా, వారిచ్చే నాటు మందుల పయినా ఆధారపడాల్సిన దీన స్తితి వారిది. బయట ప్రపంచంతో సంబంధాలు లేకుండా అరణ్య ప్రాంతాలలో - అంత సులువుగా చేరుకోలేని కోయ గూడాలు, లంబాడి తండాల్లో వుండే పేద వారికి రోగం రొస్టూ వస్తే ఇక ఇంతే సంగతులు. అలాటివారు సాధారణంగా షుగరు, రక్త పోటు, ఉబ్బసం, కీళ్ళ వ్యాధులతో బాధపడుతుంటారు. అసలు ఇలాటి జబ్బులు తమకు వున్నట్టు కూడా వీరికి తెలియదు. ఎందుకంటె ఎలాటి వైద్య పరీక్షలు ఎప్పుడూ చేయించుకుని ఎరుగరు కనుక. రోగం ముదిరి ఏ పక్షవాతానికో దారి తీసేదాకా 'బీపీ' వున్నట్టు కూడా తెలియదు.
ఆరోగ్య మంత్రిత్వ శాఖను వైద్య, ఆరోగ్య శాఖ అంటుంటారు. అంటే ఆరోగ్యానికీ, వైద్యానికి సంబంధం ఉన్నప్పటికీ ఆరోగ్యం కాపాడుకోగలిగితే, వైద్య  అవసరం రాదన్న అర్ధం ఇందులో నిగూఢ౦గా వుంది. అందుకే మన పూర్వీకులు ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చేవారు. వ్యాధులకు చికిత్స బదులు, రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకునే వారు. తాగే నీరు, తినే ఆహారం, నివసించే వాతావరణం ఇవన్నీ మనుషుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంటాయి. ఈ ప్రాధమిక అంశాలకు ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇస్తే రోగాల సంఖ్యా, రోగుల సంఖ్యా తగ్గిపోయి వైద్య రంగంపై ప్రభుత్వం పెట్టే ఖర్చు గణనీయంగా తగ్గగలదని ఆ రంగంలో విశేష కృషి చేసిన నిపుణులు అంటున్నారు. ఈ సదుద్దేశ్యంతోనే కొద్దికాలం క్రితం హెచ్ ఎం ఆర్ ఐ అనే స్వచ్చంద సంస్థ కొంత కృషి చేసింది.
సుదూర గ్రామీణ ప్రాంతాలలో నివసించేవారికి కనీస వైద్య సదుపాయాలూ ఈనాటి వరకు లేవనీ, నాటు వైద్యం మీదనే వాళ్ళు బతుకులు వెళ్ళదీస్తున్నారని, బీపీ, షుగర్ వంటి వ్యాధులు ముదిరి ప్రాణం మీదకు వచ్చేవరకు అలాటి వ్యాధుల బారిన పడ్డ విషయం కూడా తెలియని నిర్భాగ్య స్తితిలో వారు రోజులు గడుపుతున్నారని ఆనాటి ప్రభుత్వ పెద్దలకు పధకం రూపకర్తలు  వివరించారు. అలాటి ప్రజానీకానికి  నెలకొక్కమారు వైద్య పరీక్షలు జరిపి,  రోగ నిర్ధారణ జరిపి  తగిన మందులిస్తే,  పక్షవాతం వంటి జబ్బుల బారిన పడకుండా కాపాడవచ్చని  చెప్పారు. ప్రస్తుతం వున్న వైద్య ఆరోగ్య శాఖ వార్షిక  బడ్జట్ తో పోలిస్తే ఇందుకయ్యే ఖర్చు అతి స్వల్పమని వివరించారు. అయితే ప్రభుత్వానికి ఒక అనుమానం వచ్చింది. గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళే ఈ సంచార వైద్య వాహనంలో డాక్టర్ వుంటాడా? అని.  డాక్టర్ల కొరత, గ్రామీణ ప్రాంతాలలో పనిచేయడానికి వారిలో పేరుకుపోతున్న వైముఖ్యం కారణంగానే ఈ పధకాన్ని రూపొందించాల్సి వచ్చిందని స్వచ్చంద సంస్థ ప్రతినిధుల సమాధానం. మొత్తం మీద రాష్ట్రంలో హెచ్ ఎం ఆర్ ఐ సంస్థ కార్యకలాపాలు ప్రభుత్వ ప్రవేట్ భాగస్వామ్యం ప్రాతిపదికన మొదలయ్యాయి.
అందుబాటులో వున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు మూడు కిలోమీటర్ల ఆవల వుండే ప్రతి పల్లెకు- నెల నెలా క్రమం తప్పకుండా వెళ్లి - వూరివారికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించే వాహనానికి రూపకల్పన చేశారు. 108 అంబులెన్సు పధకం,  ప్రమాదం అంచున ఉన్నవారి ప్రాణాలను కాపాడేందుకు ఉద్దేశించినది. హెచ్ ఎం ఆర్ ఐ రూపొందించిన ఈ  104 సంచార వైద్య వాహనం - పేద పల్లె ప్రజల ప్రాణాలు ప్రమాదం అంచుకు చేరకుండా చూస్తుంది. ఇంతా చేసి ఈ పధకం కింద లబ్ది పొందేవారి సంఖ్యను లెక్కలోకి తీసుకుంటే- ఒక్కొక్కరిపై పెట్టె ఖర్చు ఏడాదికి కేవలం ఎనభయి రూపాయలు మాత్రమే. అంటే - వైద్య ఆరోగ్య రంగం బడ్జెట్ లో పది శాతం కన్నా తక్కువన్నమాట.
104 వాహనం ప్రతి నెలా ఒక నిర్దేశిత దినం నాడు క్రమం తప్పకుండా ఒక గ్రామాన్ని సందర్శిస్తుంది. ఇందులో ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్, ముగ్గురు ఏ ఎన్ ఎం లు(నర్సులు), ఒక ఫార్మసిస్టు, ఒక లాబ్ టెక్నీషియన్, ఒక డ్రయివర్తో సహా మొత్తం ఏడుగురు సిబ్బంది వుంటారు. బయో మెట్రిక్ పద్దతి ద్వారా రోగుల వివరాలను కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తారు. గర్భిణీ స్త్రీలను, బాలింతలను పరీక్షించి మందులు ఇస్తారు. గర్భిణి కడుపులో పిండం పెరుగుదలను నెలనెలా గమనిస్తూ తగిన జాగ్రత్తలు సూచిస్తారు.అవసరమని భావిస్తే,108 అంబులెన్సుకి ఫోన్ చేసి రప్పించి ఆసుపత్రిలో చేర్పిస్తారు. రక్త పోటు, షుగర్ ఉన్నవారికి నెలవారీగా చేయాల్సిన రక్త పరీక్షలు , ఇతర పరీక్షలు నిర్వహించి అవసరమైన మార్పులతో మందులు ఉచితంగా అక్కడికక్కడే పంపిణీ చేస్తారు.

'దర్వాజాలో దవాఖానా' వంటి ఈ పధకం తదనంతర కాలంలో సంభవించిన రాజకీయ పరిణామాల నేపధ్యంలో అందే ప్రభుత్వసయం అరకొరగా మారడంతో అర్ధాంతరంగా అటకెక్కింది. ఉమ్మడి రాష్ట్రంలో సంభవించిన రాజకీయ పరిణామాల క్రీనీడలు సంస్థ కార్యకలాపాలపై ముసురుకుని తొలి దశ లోనే సంస్థ కృషి అర్ధాంతరంగా ముగిసింది.
ఆదర్శంగా నిలవాల్సిన ఓ అద్భుత పధకం కొందరి నిర్వాకాలకు నీరుకారిపోయింది. మరి కొందరి స్వార్ధాలకు బలయిపోయింది. ఇంకొందరి  ఆహాలను చల్లార్చడానికి మాడి మసయిపోయింది. రాజకీయ చదరంగంలో చిక్కుకుపోయి ఆ  ఎత్తులు పైఎత్తుల్లో చితికి   చిత్తయిపోయింది.
ఇంత జరిగినా ఏమీ జరగనట్టే వుండడానికి కారణం వుంది. ఈ పధకం వల్ల లబ్ది పొందుతున్న వారు నిరుపేదలు. వారికి నోరూవాయీ లేదు.
కష్టం వచ్చినా చెప్పుకోలేరు. ఆ కష్టం తొలగినా చెప్పుకోలేరు. ఎందుకంటె చెప్పుకోవడానికి వారికెవరూ లేరు.
వారి గురించి రాసేవారు లేరు. కారణం  వారిలో చాలా మంది నిరక్షరాస్యులు. చదవడం రాని వారి గురించిన వార్తలు ఎవరికీ పట్టవు. 
వారి గురించి బుల్లి తెరలపై చూపించేవారు లేరు. ఎందుకంటె అలాటి ఆధునిక సౌకర్యాలకు దూరంగా ఎక్కడో బతుకులీడుస్తున్న బడుగులు వాళ్ళు.
అలాటి వాళ్లకు బాగా ఉపయోగపడే ఒక మంచి ఆరోగ్య పధకం పురుట్లోనే సంధి కొట్టిన రీతిగా అదృశ్యం అయింది.
ఇది ఉమ్మడి రాష్ట్రం చివరాఖరు దశలో జరిగిన కధ. ఇప్పుడు అటూ ఇటూ రెండు కొత్త రాష్ట్రాలు. తమదయిన రీతిలో మంచి పనులు చేసి రాష్ట్రానికి ఎంతో కొంత మంచి చేయాలనే దిశానిర్దేశంతో సాగిపోతున్న ఇద్దరు ముఖ్యమంత్రులు. చేయాలన్న తపన వుంది. చేసి చూపిస్తాం అనే సంస్థలు వున్నాయి. తపనకు, సహకారం తోడయితే సత్ఫలితాల విషయంలో సందేహించే పని వుండదు. టెక్నాలజీని సరిగా ఉపయోగించుకుంటే మానవ ప్రయత్నాలకు మరింత పరిపుష్టి చేకూరుతుంది.  గ్రామీణ ప్రాంతాల ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడే ఇటువంటి పధకాలపై  రెండు తెలుగు ప్రభుత్వాలు దృష్టి పెడితే బాగుంటుంది.

(24-03-2015)

23, మార్చి 2015, సోమవారం

నాలుకే నా శత్రువు


'మీకు శత్రువులు ఎవ్వరూ లేరా స్వామీ?' అని అడిగాడు ఓ ఆసామీ ఓ స్వామివారిని.
'లేకేం! నా నాలుకే నా శత్రువు' అన్నారా స్వామి.   
తరచి చూస్తె అందులో ఎంతో నిజం వుందని అనిపిస్తుంది.


మొన్న పరిపూర్ణానంద స్వామి ఉగాది పంచాంగ శ్రవణానికి వెళ్ళాము. ఆయన కంఠం కంచుగంట. చెప్పే విషయం ఏదయినా ఓ కధలా వినసొంపుగా వుంటుంది.
భార్యాభర్తల సంబంధాలు, విడాకుల ప్రస్తావన దొర్లింది. స్వాములేమిటి? విడాకుల గొడవేమిటి అనుకునేవాళ్ళకు ఆయన ప్రసంగమే సమాధానం. ఈఏడాది (మన్మధ) విడాకుల కేసులు బాగా పెరిగిపోతాయని స్వామి  ఉవాచ.మరి ఏమిటి మార్గం. ఉందన్నారు ఆయనే. నాలుకను అదుపులో ఉంచుకోవడం ఒక్కటే శరణ్యం ఆన్నారాయన. సరిగ్గా ఇలాగే కాకపోయినా దాదాపు ఇదే అర్ధం వచ్చేలా చెప్పారు.
'మొగుడొకటి అంటాడు. భార్య  ఒకటి అంటుంది. ఆ ఒక్కటే విడాకులదాకా వెడుతోంది. వెనుకటిలా ఈనాటి తరానికి మంచీచెడూ చెప్పీవాళ్ళు ఇళ్ళల్లో వుండడం లేదు. చెప్పినా వినిపించుకునే పరిస్తితి లేదు. చిన్న విషయాలు పెద్దవి  అవుతున్నాయి. మునుపటి రోజుల్లో కూడా ఇలా జరక్కపోలేదు. కానీ కుటుంబ సంబంధాలు కట్టి పడేసేవి. ఇప్పుడలా కాదు. అప్పటికప్పుడే వేడి మీద నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందుకే కాస్త నాలుకను అదుపులో పెట్టుకుంటే ఇలాటి సమస్యలు అన్నీ అదుపులోకి వస్తాయి. లేకపోతే అదుపుతప్పి పోతాయి'
స్వామి  వారు చెప్పింది అందరూ విన్నారు. బాగా చెప్పారు అని కూడా అనుకున్నారు. ఆ హితవచనాలను  ఇంటిదాకా ఎంతమంది మోసుకెళ్లారన్నది అనుమానమే.
నేనూ దీనికి మినహాయింపు కాదని ఓ చర్చలో కూర్చున్నప్పుడు  తెలిసిపోయింది.
నా నాలుకే నా శత్రువు. నిజానికి  ఈ శత్రువును జయించాల్సిన పనిలేదు. స్వామి చెప్పినట్టు అదుపులో వుంచుకుంటే చాలు.
కానీ అయ్యే పనా!   (23-03-2015)   
NOTE: Courtesy Image Owner 

20, మార్చి 2015, శుక్రవారం

శాసన సభ - కొన్ని గుర్తుంచుకోవాల్సిన జ్ఞాపకాలు


(Published by 'SURYA' telugu daily in it's edit page on 21-03-2015, SATURDAY)
LINK: http://www.suryaa.com/pdf/display.asp?edition=0&page=4

1958 - 59 ఆర్ధిక సంవత్సరం బడ్జెట్ పై ఆంద్ర ప్రదేశ్ అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. అంటే దాదాపు యాభై అయిదేళ్ళ కిందటి ముచ్చట.
ఒక సభ్యుడు లేచి అన్నారు. ' పన్నులన్నీ తెలంగాణపై రుద్దుతున్నారు' అని.
ఆర్ధిక మంత్రి వెంటనే  స్పందించారు, 'గౌరవ సభ్యులు వాడిన 'రుద్దుతున్నారు' అనే పదం బయట పర్వాలేదు. కానీ సభలో 'కర్ణ కఠోరం'గా  వుంటుంది'
సభ్యుడు లేచి 'అలా అన్నందుకు' విచారం వెలిబుచ్చారు.
ఆ ఆర్ధిక మంత్రి పేరు బెజవాడ గోపాల రెడ్డి.
ఆ పదం వాడి, తరువాత విచారం వ్యక్తం చేసిన  సభ్యుడు ఎవ్వరో కాదు,  తదనంతర కాలంలో యావత్ భారత దేశానికి అయిదేళ్ళ పాటు ప్రధాన మంత్రిగా పనిచేసిన పీ.వీ. నరసింహారావు.
అవీ ఆ రోజులు.
అలనాటి, అంటే ఓ నలభయ్, యాభయ్ ఏళ్ళక్రితం జరిగిన  శాసన సభ సమావేశాల్లో,  తీవ్రమైన చర్చల నడుమ వాతావరణాన్ని చల్లబరచడానికి కొన్ని  చలోక్తులు కూడా వినబడేవి.
తెలుగు పత్రికల్లో  ఈ ఛలోక్తులను  'బాక్స్' కట్టి మరీ ప్రచురించేవారు. చదువుకోవడానికి తమాషాగానే కాకుండా ఆహ్లాదకరంగా  కూడా ఉండేవవి.
1958 లో కళా వెంకటరావు గారు రెవెన్యూ మంత్రి.  రాములు అనే సభ్యుడు (ఇంటి పేరు గుర్తు రావడం లేదు) మంత్రిని  తమాషా పట్టించాలని 'మంత్రిగారు మాట్లాడుతున్నది కొండ నాలుకతోనా లేక కొన నాలుకతోనా' అని జోకబోయారు. అంటే మంత్రిగారు చెప్పేవన్నీ పై పై మాటలు, ఒక్కటీ కరెక్టు కాదు అనేది ఆ సభ్యుడి ఉద్దేశ్యం.
కళా వెంకటరావు గారు సామాన్యుడు కాదుకదా! వెంటనే తిప్పికొట్టారు.
'మనిషి అనేవాడు ఎవరయినా నాలుకతోనే మాట్లాడుతాడు. కొండ నాలుకతో ఎవ్వరూ మాట్లాడరు. మరి రాములు గారు కొండ నాలుకతో మాట్లాడుతారేమో నాకు తెలియదు'
ఆ దెబ్బతో రాములుగారు కిమ్మిన్నాస్తి. గమ్మున కూర్చుండిపోయారు.
పూర్వం ఆంద్ర ప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన నీలం సంజీవ రెడ్డి గారు ఒకసారి సభలో ప్రసంగిస్తూ భారతం లోని ఒక ఘట్టాన్ని ఉదాహరించి అందర్నీ ఆశ్చర్య పరిచారు. 1959 ఆగస్టు ఒకటో తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు ఆయన సమాధానం చెబుతున్నారు. ఆరోజుల్లోనే  కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేరళలో ఏర్పడ్డ మొట్టమొదటి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన  విధించింది. దీనికి నిరసనగా ఆంద్ర ప్రదేశ్ శాసనసభలోని కమ్యూనిస్టులు సభ నుంచి వాకౌట్ చేసారు. అది సంజీవరెడ్డి గారికి నచ్చలేదు. అదే విషయం తన ప్రసంగంలో ప్రస్తావించారు. 'కేరళలో కమ్యూనిస్టులకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. ఆ పార్టీ ప్రజల  మన్నన పొందగలిగితే  తిరిగి అధికారంలోకి రావచ్చు. కర్నూలులో వుండగా ప్రకాశం గారి ప్రభుత్వం పోయింది. ఆ తరువాత కాంగ్రెస్ కి నాలుగు సీట్లు కూడా రావనుకున్నాము. కానీ, మళ్ళీ అధికారంలోకి వచ్చాము. ఒకసారి ఒక పార్టీ , మరొక సారి మరో పార్టీ అధికారంలోకి రావచ్చు. ఇది వేదకాలం  నుంచీ ఎరిగిన  ధర్మం. యుద్ధంలో కూడా ఏదో ఒక పక్షమే గెలుస్తుంది. తిక్కన  భారతం  ఉత్తర గోగ్రహణంలో భీష్ముడు దుర్యోధనుడితో చెబుతాడు. '........పెనంగిన బలంబులు రెండును గెలవ నేర్తునే' అని. ఈ నీతి ఈనాడు కూడా వర్తిస్తుంది' అని చెప్పారు సంజీవరెడ్డి గారు.
1976 లో జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో దాదాపు నలభయ్ యాభయ్ మంది సభ్యులు మాట్లాడారు. వాళ్ళు మాట్లాడినంత సేపు ముఖ్యమంత్రి సభలో తన స్థానం నుంచి కదల లేదు. మౌనంగా సీట్లో కూర్చుని సభ్యులు ప్రస్తావించిన వివిధ అంశాలపై నోట్స్ రాసుకుంటూ పోయారు. తరువాత తన సమయం రాగానే లేచి సుమారు గంటన్నరపాటు అన్ని అంశాలను స్పృశిస్తూ సమాధానం చెప్పారు. సభలోని యావన్మందీ వెంగళరావు ప్రసంగాన్ని మెచ్చుకున్నారు.
తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు ఏ పద్యం అయినా రాగయుక్తంగా కాకపోయినా ఎలాటి స్ఖాలిత్యాలు దొర్లకుండా పండిత ప్రకాండులు  మెచ్చే  విధంగా పాడగలరనేది జగమెరిగిన సత్యం. భారత భాగవతాల్లోని అనేక పద్యాలు కేసీఆర్ కి కంఠోపాఠం. దాశరధి, నారాయణ రెడ్డి వంటి కవుల గేయాలు ఆయన ప్రసంగంలో ఆశువుగా దొర్లుతుంటాయి. ఒకసారి రవీంద్ర భారతి లో జరిగిన ఒక కార్యక్రమంలో సినారె పక్కన ఉండగానే కేసీఆర్, నారాయణరెడ్డి గారు రాసిన తొలి సినిమా పాటను యధాతధంగా వినిపించి శ్రోతలను అలరించారు.  గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదరం సంజీవయ్య గారు బహిరంగ సభల్లో కూడా పద్యం ఎత్తుకునేవారు. ఆయన ఏ.ఐ.సీ.సీ. అధ్యక్షులుగా వున్నప్పుడు ఢిల్లీలో  సంజీవయ్య గారు వుండే బంగళా సాహిత్య గోష్టులకు వేదికగా ఉండేదని 'కలం కూలీ' జీ. కృష్ణగారు తన అనుభవాల్లో రాసారు. సరే!  ముఖ్యమంత్రిగా ఉంటూ హెలికాప్టర్ దుర్ఘటనలో మరణించిన   డాక్టర్ రాజశేఖర రెడ్డికి సయితం పద్యాలు వచ్చన్న సంగతి చాలా మందికి తెలియదు. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా వున్నప్పుడు ఏకంగా ఒక పద్యం మొత్తం సభలో చదివి వినిపించారు. 2001- 2002 ఆర్ధిక సంవత్సరం బడ్జెట్ పై జరిగిన చర్చను ప్రారంభిస్తూ చంద్రబాబు పరిపాలనలో వున్న రాష్ట్రాన్ని ఆ భగవంతుడే కాపాడాలని, భారతంలో  తిక్కన విరచిత పద్యం - 'సారపు ధర్మమున విమల సత్యము ....' అని మొదలెట్టి ఒక పద్యం చదివి వినిపించారు.
"ద్రౌపదీ వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు దక్షత కలిగిన భీష్మ, ద్రోణుల వంటి వారు కూడా మౌనంగా వుండిపోయారు. అలా ఉపేక్షిస్తే అది వారికే చేటవుతుంది. కానీ ఏదో ఒకరోజున భగవంతుడే కల్పించుకుని సత్యాన్ని, ధర్మాన్ని నిలబెడతాడు. ఈ రాష్ట్రాన్ని కూడా ఆ దేవుడే కాపాడాలి"  అని ప్రసంగం  ముగించారు రాజశేఖర రెడ్డి.              
మరోసారి 2003 ఫిబ్రవరిలో గవర్నర్ ప్రసంగంపై జరిగిన చర్చలో పాల్గొంటూ, దేవరకొండ బాలగంగాధర తిలక్ రాసిన గేయభాగాన్ని వై.యస్.ఆర్. చదివి వినిపించారు.
'ఒక్క నిరుపేద ఉన్నంతవరకు, ఒక్క మలినాశ్రువు బిందువు ఒరిగినంతవరకు, ఒక్క శుష్క స్థన్య సన్నిధిని క్షుదార్తి ఏడ్చు పసిబాలిక ఉన్నంతవరకు, నాకు శాంతి కలుగదింక నేస్తం ..... ఈ ఆర్తి ఏ  సౌధాంతరాలకు  పయనించగలదు, ఏ రాజకీయవేత్త గుండెలను స్పృశించగలదు'  అంటూ 'పేదవాడి ఆర్తిని వినే ప్రయత్నం చేయండి ముఖ్యమంత్రిగారు, చేయండి ముఖ్యమంత్రిగారు' అని తనదైన శైలిలో ప్రసంగం ముగించారు.    
చంద్రబాబు నాయుడు గారిది అదో తరహా. శాసన సభలో ఆయన చేసే ప్రసంగాలలో పద్యాలు, గేయాలు వుండవు. కానీ ఆర్ధిక అభ్యున్నతి గురించి, సంస్కరణలు గురించి కొందరు ప్రముఖులు ఆయా సందర్భాలలో చేసిన  కొటేషన్లు బాగా చోటుచేసుకుంటాయి. ముఖ్యమంత్రిగా వున్నప్పుడు తాను  చేపట్టిన వివిధ అభివృద్ధి పధకాలు గురించి ప్రతిపక్ష నాయకుడిగా చేసే ఉపన్యాసాలలో వివరించే ప్రయత్నం చేస్తారు. అలాగే, ముఖ్యమంత్రిగా సభలో మాట్లాడేటప్పుడు కూడా ఈ పధకాల వివరాలు ఎక్కువగా ఉండే విధంగా జాగ్రత్త పడతారు.   
1999  నవంబరు 16 వ తేదీన గవర్నర్ ప్రసంగంపై చర్చకు చంద్రబాబు ఇచ్చిన సమాధానంలో కొన్ని భాగాలు ఇలా సాగాయి.
"నేను రాష్ట్రం అభివృద్ధిని కోరుకుంటున్నాను. నా పట్ల ప్రజలకున్న  అభిమానాన్నే  నమ్ముకున్నాను. అందువల్లే ఎన్నికల్లో మీ అంచనాలు తారుమారయ్యాయి. ప్రజల ఆశీర్వాదం నాకుంటుంది అని మొదటినుంచీ చెబుతున్నాను. అదే ఈనాడు నిజమైంది. కుల్  దీప్ నాయర్  మాట్లాడుతూ, 'నేను ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిని అభినందించడం లేదు, ఆంద్ర ప్రదేశ్ ఓటర్లని అభినందిస్తున్నాను. ఒక విజ్ డమ్ ని వాళ్ళు వ్యక్తం చేసారు. చాలా మెచ్యూరిటీ ప్రదర్శించారు. కర్నాటక, మహారాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కూడా ఆంద్ర ప్రదేశ్ మాకు ఆదర్శం అంటున్నారు. ఇండియన్  ప్రైమ్ మినిస్టర్ ఇంకా గట్టిగా చెప్పారు. 'దేనికయినా ఆంద్ర ప్రదేశ్ కొలమానం' అని. 'అభివృద్ధి విషయంలో అన్ని రాష్ట్రాలు ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అనుసరించాలి' అని. ఇంటర్నేషనల్ మీడియా కూడా అదే  చెబుతోంది. దేశంలో బెస్ట్ విజన్ వున్న వ్యక్తి  ఎవరంటే ఆంద్రప్రదేశ్ సీ.ఎం. అని విద్యార్ధులు కూడా చెప్పే పరిస్తితి వుంది.
'ఈ నడుమ ఒక ఎకానమిస్టు చెప్పాడు. ఆంద్ర ప్రదేశ్ లో నాయుడు కోరుకుంటున్న విప్లవం ఊహల్లో ఊహించుకునేది కాదు, చేసి చూపించగలిగేది,  అని. ఇప్పుడు దేశానికి కావాల్సిన సరయిన నాయకుడు చంద్రబాబే అని కూడా ఆయనే చెప్పారు.
'ఆంద్ర ప్రదేశ్ ని స్వర్ణాంధ్ర ప్రదేశ్ చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాము. స్మార్ట్ స్టేట్ అంటే అర్ధం దక్షతతో కూడిన నైపుణ్యం ఆ స్టేట్ కి దిశానిర్దేశం చేస్తుంది. పరిజ్ఞానం దానికి ఇంధనం మాదిరిగా ఉపయోగపడుతుంది. ఇక విజ్ డమ్ దాన్ని ముందుకు  నడిపిస్తుంది. అదీ మా ధ్యేయం.
'మహాత్మా గాంధీ అన్నారు. ఒకరికి ఆదర్శం బోధించాలి అంటే ఆ ఆదర్శాన్ని మనమూ పాటించాలి అని. అప్పుడే ఒకళ్ళకు చెప్పినా వాళ్ళు వినే పరిస్తితి వుంటుంది.  మా ప్రభుత్వం ఆ దరిద్రాన్ని రూపుమాపడానికి కంకణం కట్టుకుంది'
'ప్రతిపక్ష నాయకులు (వై.యస్.ఆర్.) చాలా స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వం మంచి పనులు చేస్తే తప్పకుండా సహకరిస్తామని. వారిని మనః స్పూర్తిగా  అభినందిస్తున్నాను. వాళ్ళు సభలో వన్ తర్డ్ వున్నారు. అందుకే అందర్నీ కలుపుకుని ముందుకు పోవాలని అనుకుంటున్నాను.'
ఇలాటి జ్ఞాపకాలు ఎన్నో. అసెంబ్లీ గ్రంధాలయానికి వెళ్లి కూర్చుని చదివే ఓపిక ఉండాలే కానీ ఇలాటివన్నీ కోకొల్లలు.
(bhandarusr@gmail.com)
(21-03- 2015)